యుగయుగాల చీనా కవిత-6

సంస్కృత సాహిత్యానికి వాల్మీకిలాగా, చీనా కవిత్వానికి కూడా ఒక ఆదికవి ఉన్నాడు. అతడి పేరు చ్యు-యువాన్. షీ-జింగ్ లో ఉన్న గీతాలకి ఎవరు కర్తలో తెలియదు. ఆ కవితల్లో రెండు మూడు చోట్ల నామవాచకాలు కనిపించినప్పటికీ అవి సాధారణ నామవాచకాలే తప్ప నిర్దిష్ట వ్యక్తినామాలు కావు. కాబట్టి చీనా కవుల్లో చారిత్రికంగా మనకి తెలిసిన మొదటి చ్యు-యువాన్ మాత్రమే. వాల్మీకికీ అతడికీ మరొక పోలిక కూడా ఉంది. వాల్మీకి లానే అతడి శోకం కూడా శ్లోకంగా మారింది.
 
ఝౌ సామ్రాజ్యం తూర్పు ప్రాంతాల్ని ఆక్రమించుకుని తూర్పు ఝౌ సామ్రాజ్యంగా ఏర్పడ్డాక క్రీ.పూ 722 నుంచి 481 దాకా వసంత-హేమంతాల కాలం అనీ, 481 నుంచి 221 దాకా సమరశీల రాజ్యాల కాలం అనీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సమరశీల రాజ్యాల కాలంలో ఝౌ చక్రవర్తులు నామమాత్రపు పాలకులుగా మిల్గిపోయి, ఏడు సామంతరాజ్యాలు బలపడి అవి ఏకఛత్రాధిపత్యం కోసం తమలో తాము ఎప్పుడూ కలహించుకుంటూ ఉండేవి. చివరికి వాటిలో చిన్ అనే రాజ్యం క్రీ.పూ. 221 లో తక్కిన రాజ్యాల్ని ఓడించి చీనాను ఒక్కటి చేసింది. ఆ అంతఃకలహాల కాలంలో, దక్షిణ చైనాలో చూ రాజ్యాన్ని హువాయి అనే రాజు పాలిస్తున్న కాలంలో చ్యు యువాన్ అతడికి మంత్రిగా ఉండేవాడు. మొదట్లో రాజు అతడిపట్ల గొప్ప నమ్మకాన్నీ, ఆదరాన్ని, గౌరవాన్నీ చూపించేడు. కాని చ్యు-యువాన్ అంటే కిట్టని అసూయాపరుల చెప్పుడు మాటలు విని రాజు అతణ్ణి తన రాజ్యం నుంచి బహిష్కరించాడు. తాను నీతిమంతుడు అయినప్పటికీ, ఎంతో విధేయంగా రాజుని, రాజ్యాన్నీ ప్రేమించినప్పటికీ, తన ప్రజల మేలు కోరినప్పటికీ, తనకి దేశ బహిష్కార శిక్ష పడటాన్ని చ్యు-యువాన్ జీర్ణించుకోలేకపోయాడు. అతడి హృదయం తీవ్రంగా గాయపడింది. చివరికి అతడు ఒక ప్రవాసిగా కుమిలి కుమిలి ఒక నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు తన దుఃఖాన్ని ఒక గీతంగా రాసిపెట్టి వెళ్ళిపోయాడు.
 
విషాదభరితమైన ఆ గీతం పేరు లీ-సావో. సావో అంటే దుఃఖం. లీ అంటే ఎదురేగడం. అంటే విషాదానికి ఎదురేగడం అన్నమాట. 347 పంక్తుల ఆ గీతం చీనా కవిత్వంలో ఒక దీర్ఘకావ్యం. ఆ గీతాన్ని అతడు షీ-జింగ్ సంప్రదాయంలో కాకుండా దక్షిణ చైనాలోని షామాన్ గీతాల సంప్రదాయంలో రాసాడు. అది కాక మరికొన్ని గీతాలు కూడా తదనంతర హాన్ చక్రవర్తుల కాలంలో సంకలనం చేసారు. వాటిలో చ్యు-యువాన్ రాసినవేవో లేదా అతడి పేరు మీద తదనంతర కవులు రాసినవేవో తేల్చడం కష్టం. కాని ఆ గీతాలన్నిటినీ కలిపి ‘చూ-చి’ అంటే చూ శబ్దావళి అని వ్యవహరిస్తున్నారు.
 
ఏకకాలంలో వ్యక్తి దుఃఖాన్నీ, సమాజ దుఃఖాన్నీ కూడా చిత్రించగలగడం చీనా కవిత్వ ప్రధాన లక్షణం అనుకుంటే, ఆ జీవధర్మానికి చీనా కవిత్వం ఇద్దరు తల్లులకి ఋణపడి ఉంటుంది. మొదటిది క్రీ.పూ పన్నెండు నుండి ఆరవశతాబ్దిదాకా, ఉత్తర చైనాలో పచ్చసముద్రపు లోయలో వికసించిన గీతసముచ్చయం (షీ-జింగ్) కాగా, మరొకటి, దక్షిణ చైనాలో యాంగ్జే లోయలో క్రీ.పూ. నాలుగవ శతాబ్దంలో వికసించిన చూ-శబ్దావళి (చూ-చి) . షీ-జింగ్ సమష్టి జీవన సంగీతం. నైతిక జీవన గీత. మనిషికీ, తోటి మనిషికీ, మనిషికీ,కుటుంబానికీ, మనిషికీ రాజ్యానికీ, రాజ్యానికీ, భగవంతుడికీ మధ్య ఉండవలసిన సంబంధాల గురించిన చిత్రణ, ప్రకటన, ప్రకంపన. అందులో స్త్రీ దుఃఖం లేకపోలేదుగాని, అది విలాపంగా పరిణమించలేదు. పురుష దుఃఖం లేకపోలేదుగాని అది ధిక్కారంగా పరిణమించలేదు. మానవజీవితానికీ, సమష్టి జీవితానికీ సంబంధించిన సమస్త అనుభూతులు అక్కడున్నాయిగాని, అవి ఏవీ మన చెవిని కిర్రుమనిపించవు.
 
కాని కవిత్వం మన ఆశయాల్ని మాత్రమే కాదు, మన జాగ్రత్ ప్రపంచపు సామాజిక రాజకీయ ఆకాంక్షల్ని మాత్రమే కాదు, మన రహస్యలోకాల్ని కూడా వెలికి తియ్యాలి. మంత్రనగరి సరిహద్దులు ముట్టితీరాలి. మన స్వాప్నికలోకాల వెలుగునీడల్ని ప్రతిబింబించాలి. గొప్ప కవిత్వంలో సంగీతం మాత్రమే కాదు, సంక్షోభం కూడా పలకాలి. అది ఉద్గీథ మాత్రమే కాదు, ఉచ్చాటన కూడా కావాలి. ఉల్లేఖన మాత్రమే కాదు, ఉద్ఘాటన కూడా కావాలి. అదిగో, సరిగ్గా చీనా కవిత్వానికి ఆ పార్శ్వాన్ని అందించింది దక్షిణ చైనాలో వికసించిన చూ శబ్దావళి.
 
‘చూ’ ‘ దక్షిణ చైనాలో ఒక రాజ్యం. దక్షిణం అంటే ఝౌ సామ్రాజ్యానికి దక్షిణం తప్ప, అది నిజానికి మధ్యచైనాలో ఉందని చెప్పాలి. యాంగ్జే నదీ పరీవాహక ప్రాంతంలో నెలకొన్న చూ భౌగోళికంగా అత్యంత సుందర ప్రాంతం. అడవులు, నదులు, సరసులు, పూలు, పళ్ళు- ప్రాచీన చూ నిజంగానే ఒక మంత్రలోకం. ఝౌ రాజ్యానికి చెందినవాళ్ళు చూ ప్రాంత ప్రజల్ని ఆటవికులుగానూ, అనాగరికులుగానూ భావించేవారు. అక్కడ ప్రాచీన మంత్రాలూ, భూతోచ్చాటనలూ, డప్పుల్తో, తాళాలతో, తప్పెట్లతో నదీదేవతల ఆవాహనలూ నడుస్తుండేవి. ఆదిమ సమాజాల్లో పూజారి-వైద్యుడు-కవి ఒకడే అని మనకి తెలుసు. అటువంటి ఆదిమ మాంత్రికులు అక్కడుండేవారు. వారు తమ ప్రార్థనలతో, పూజలతో, మంత్రోచ్చాటనలతో తమ సమాజానికి స్వస్థతనివ్వడానికి ప్రయత్నిస్తుండేవారు. చీనా భాషలో ‘వూ’ అని పిలిచే ఆ ఆదిమ మంత్రవేత్తల్ని పాశ్చాత్య ప్రపంచం షామాన్ అంటుంది. అటువంటి ఆరాధనా శైలిని షామానిజం అంటుంది. ప్రాచీన చూ అటువంటి షామానిజానికి పుట్టినిల్లుగా ఉండేది.
 
షామాన్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చరిత్రపూర్వ సమాజాల్లో మనకి కనిపిస్తారు. వారు దేవతలతో నేరుగా సంభాషిస్తారు. తమ అస్వస్థత తీర్చమని తమని ఆశ్రయించినవారికోసం పాతాళలోకానికి ఒక మార్మిక ప్రయాణం చేపడతారు. వాళ్ళది ఒక అలౌకిక భూతవైద్యం. భాష వాళ్ళకి ఒక మంత్రమయవాణి. వాళ్ళ ప్రపంచంలో జాగృత్-స్వప్నావస్థల మధ్య హద్దులు చెరిగిపోయి ఉంటాయి. దేవతల్నీ, పితృదేవతల్నీ తలుచుకున్నప్పుడు, వారితో సంభాషించేటప్పుడు వారిలో ఒక అపూర్వ, అలౌకిక పారవశ్యం కనిపిస్తుంది. సంభ్రమం లాంటి సంతోషం వెల్లివిరుస్తుంది. వాళ్ళు దేవతల్ని ఆవాహన చేసినప్పుడు ఆ దేవతలు ఏ లోకంలో ఉన్నా వచ్చి వాళ్ళమీద వాలతారు. వాళ్ళకి పూనకం వస్తుంది. అప్పుడు వాళ్ళు బిగ్గరగా ఆడతారు. పాడతారు. అదిగో, అటువంటి పాటల్లోంచే చూ శబ్దావళి ప్రభవించింది.
 
‘లీ సావో” కాక చూ శబ్దావళిలోని షామాన్ గీతాలు చ్యు యువాన్ కాలం నాటివా లేకపోతే వాటిని తదనంతర హాన్ కాలంలో మరెవరైనా కవులు రాసారా అన్నది తేల్చడం కష్టం. కానీ ఆ గీతాల్లో ‘జియు-గే’ పేరిట ఉన్న పదకొండు గీతాలూ మాత్రం అత్యంత ప్రాచీనమైనవనే భావిస్తున్నారు. అందులో కనీసం మూడు గీతాలు చ్యు-యువాన్ రాసి ఉంటాడని కూడా భావిస్తున్నారు. తక్కినవి కూడా షామాన్ల గీతాలా లేక వారి ధోరణిలో రాజాస్థాన కవులూ, గాయకులూ రాసి ఉంటారా అన్నది కూడా ఇతమిత్థంగా తేల్చి చెప్పడం కష్టం. కానీ ప్రాచీన షామానీయ ఆచారాలూ, వారి ఆవాహనా పద్ధతులూ ఏ విధంగా ఉండేవన్నదానికి ఆ గీతాలు ఒక నమూనా.
 
ఆ గీతాల్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏ షామానీయ గీతంలోనైనా మూడు భాగాలుంటాయని. మొదటిది, ఒక షామాన్ పురుషుడైతే స్త్రీ దేవతనీ, స్త్రీ అయితే పురుష దేవతనీ తనమీదకు ఆవాహన చేసుకోవడం. అది సంగీతంతో, నాట్యంతో, సంరంభంతో జరుగుతుంది. రెండవ దశలో ఆ దేవత ఆ షామాన్ మీద వాలుతుంది. అలా వాలినప్పుడు ఆ షామాన్ ఒక అద్వితీయ, అలౌకిక పారవశ్యానికి లోనవుతాడు. కాని అది కొన్ని క్షణాలు మాత్రమే. ఇంతలో ఆ దేవత అతడిమీంచి లేదా ఆమె మీంచి తరలిపోతుంది. ఆ సంగతి గ్రహింపుకొచ్చిన షామాన్ ఆ దేవతావియోగాన్ని భరించలేక తీవ్రమైన నిప్సృహలోకీ, దుఃఖంలోకీ జారుకోవడం మూడవదశ. కొన్నిసార్లు ఒకే గీతంలో ఈ మూడు దశలూ ఒక సంవాద రూపంగా కూడా ఉండవచ్చు, ఋగ్వేదంలోని ఊర్వశీ-పురూరవ సంవాదంలాగా. కాని ఆ గీతాలాపన జరుగుతున్నంతసేపూ అద్భుతమైన సంగీతం, తప్పెట్లు, తాళాలూ, బాజాలు, బాకాలు వినిపిస్తాయి. చుట్టూ ఉన్న మనుషుల్ని ఆత్మవిస్మృతిలోకి నెట్టే ఆ సంగీతాన్ని ఒక సారి కన్ ఫ్యూసియస్ విన్నాడట. అది ఆయన్ని ఎంత మంత్రముగ్ధుణ్ణి చేసిందంటే, ఆ తర్వాత కొన్నాళ్ళపాటు అయనకి ఆకలి కూడా వెయ్యలేదట.
 
సరిగ్గా ఈ నమూనా మీదనే చ్యు-యువాన్ తన దీర్ఘకావ్యాన్ని నిర్మించాడు. తన రాజును ఒక దేవతగా, సుందరిగా భావిస్తూ, మొదట్లో తాను ఆమె అనుగ్రహానికి పాత్రుడు కావడం, ఆ తర్వాత ఆ అనుగ్రహం తప్పిపోవడం, తిరిగి తనకి అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వగల దేవతలు మరెక్కడైనా ఉన్నారా అని లోకాలన్నీ గాలించడం, చివరికి అటువంటి అనుగ్రహం సాధ్యం కాదన్న నిస్పృహలోకి జారుకోవడం ఆ గీతానికి ఇతివృత్తం. లీ-సావో కావడానికి విషాద గీతమే అయినప్పటికీ అది మధుర విషాద గీతం కావడంతో అత్యంత సమ్మోహనకరమైన గీతంగా మారిపోయింది. ఇప్పటి భాషలో చెప్పాలంటే దాన్ని ఒక రొమాంటిక్ కవితగా చెప్పవచ్చు. నామటుకు నాకు ఆ గీతం చదవగానే విక్రమోర్వశీయంలోని చతుర్థాంకం, కృష్ణశాస్త్రి ఊర్వశి పద్యాలు గుర్తొచ్చాయి. మామూలుగా చూ శబ్దావళిలోని భాష చీనా పాఠకులకే అర్థం కావడం కష్టమని చెప్తారు. కాని ఆ కవితని ఇంగ్లిషులో చదివిన పాఠకుడు కూడా ఒక అలౌకిక, పరిమళ భరిత సౌందర్యాన్ని అనుభూతి చెందకుండా ఉండడు.
 
ఆ గీతం రాసిన కవి తన నీతినిజాయితీల వల్లా, నిబద్ధత వల్లా ప్రాణత్యాగం చేసాడన్న ఐతిహ్యం వల్లా, ఆ గీతంలోని అత్యంత సుందర, సురభిళ పదచిత్రాలవల్లా, ఆ గీతం వెనక ఉన్న షామానీయ నేపథ్యం వల్లా ఆ కావ్యం రెండున్నరవేల ఏళ్ళుగా చీనా సంస్కృతిలో అంతర్భాగమైపోయింది. తదనంతరకాలాల్లో శీలవంతులైన ప్రభుత్వోద్యోగులకు అది ఒక ఆదర్శాన్ని ఎత్తిచూపే ఉదాహరణగా నిలబడుతూ వచ్చింది. చివరికి ఇరవయ్యవ శతాబ్దంలో కూడా, చీనా-జపాన్ యుద్ధ కాలంలో గుమింగ్ డాంగ్ కవులకు చ్యు-యువాన్ ఒక జాతీయకవిగా, ఆదర్శకవిగా కనిపించాడు. కమ్యూనిస్టు చైనా ఏర్పడ్డాక కన్ ఫ్యూసియస్ కూడా పక్కకు తప్పుకోవలసి వచ్చిందిగాని, చ్యు యువాన్ కీర్తికి తరుగులేదు. నేడు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అతణ్ణి ప్రజాకవిగా ప్రపంచానికి చాటిచెప్పుకుంటున్నది.
 
మొదట నేను లీ సావో నుంచి కొన్ని పంక్తులేనా అనువదించాలనుకున్నానుగాని, ఆ గీతాన్ని పూర్తిగా అనువదిస్తే తప్ప ఆ మాధుర్యాన్ని అందించడం కష్టం. అందుకని చ్యు-యువాన్ కవితలు వేరే రెండింటిని మీకు అందిస్తున్నాను. ఇవి షామానీయ కవితలకు నమూనాలు కావు. మొదటి కవిత కాలాతీతమైనది. రెండవ కవితలో చివర ప్రస్తావించిన బో-యి నిన్న మనం చెప్పుకున్న కథలో బో-యినే.
 
~
 
1
 

మరణించిన వారికోసం ఒక గీతం

 
కవచాలు బిగించి పట్టుకుని, ఖడ్గమృగం చర్మం వళ్ళంతా చుట్టుకుని
రథ చక్రాలు రథచక్రాలతో తగులుకొంటూ ఉండగా బాహాబాహీ పోరాడేం.
 
నింగిని కప్పేసిన యుద్ధధ్వజాలు, ముసురుకున్న మేఘాల్లాగా శత్రువులు,
ముంచెత్తుతున్న శరవర్షం మధ్యనే సైనికులు ముందుకు చొచ్చుకుపోయారు.
 
వాళ్ళు మా శ్రేణుల్ని కూల్చేసారు, మా దళాల్ని కాలరాచుకుంటూపోయారు.
ఎడమ వైపు కుప్పకూలిన అశ్వాలు, కుడిపక్క గాయపడ్డ గుర్రాలకు గుర్రాలు.
 
చక్రాలు చక్రాలకు పెనవైచుకున్నాయి, నాలుగు చక్రాలూ నలిగిపోయాయి
పూరించండి బాకాలు, మోగించండి బాజాలు, కవాతుగీతం వినిపించండి.
 
కాలం మనకి ఎదురు తిరుగుతున్నది, దేవతలు ఆగ్రహిస్తున్నారు
కదనరంగం మీద ఎటు చూడు మనవాళ్ళు కుప్పకూలిపోయారు.
 
తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు, ఇక మనవైపు కన్నెత్తి చూడరు
పడి ఉన్నారు చెల్లాచెదరుగా పరుచుకున్న మైదానం మీద దూరంగా.
 
వేలాడుతున్న కత్తులు, ఆ ధనుస్సుల్ని ఇంకా బిగించి పట్టుకున్న పిడికిళ్ళు
అపాదమస్తకం తుత్తునియలైనా చెక్కుచెదరలేదు వారి హృదయాలు.
 
ధైర్యశాలురు, మహనీయులు, మాననీయులు, నిజంగా ధీరోదాత్తులు
చివరినెత్తుటిబొట్టుదాకా అజేయులు, పరాజయభారానికి అతీతులు.
 
మరణించి ఉండవచ్చు వారి దేహాలు, అయినా మరణం లేదు వారికి.
అరుగో పాతాళలోకంలో ప్రకాశిస్తున్న మహితాత్ములు, వీరాత్ములు.
 
2
 

నారింజచెట్టుకోసం ఒక కవిత

 
నిన్ను పెంచడంలో దేవుడి ఆనందమేమో
తెలియదుగాని, నారింజా!
 
పాదుకున్నావు నువ్విక్కడ.
దక్షిణదేశ తరువువి, కాని స్థిరపడ్డావిక్కడ.
 
లోతుగా బలంగా తన్నుకున్న వేళ్ళు
బలమైనవి నీ లక్ష్యం, సంకల్పం.
 
ఆకుపచ్చని గుబుర్లు, తెల్లపూల గుత్తులు
మాకందించే సంతోషం అపారం.
 
చిక్కగా అల్లుకున్న ముళ్ళకొమ్మలు
వాటిమధ్య గుండ్రంగా ఫలాలు.
 
అల్లుకున్న ఆకుపచ్చ, బంగారుకాంతులు
తళుకులీనుతున్న మిలమిల.
 
జీవితానికొక అర్థాన్నిస్తున్నట్టు
శ్వేత నైర్మల్యం మీద రంగుల వెలుగు.
 
అనేక విధాల సంతోషాలతో
అసమానం నీ శోభావైభవం.
 
నీ యవ్వన సంకల్పాలముందు
మేము ఒకింత నిట్టూర్చుతాం.
 
తక్కినవారికన్నా నువ్వు ప్రత్యేకం
నీది నిశ్చల నిస్సంగత్వం.
 
నిన్ను చూసి పరవశించనిదెవ్వరు?
లోతుల్లోకీ వేళ్ళుదన్నుకున్నావు,
 
నిన్ను కదల్చడం దుస్సాధ్యం.
స్వార్థాపేక్షలేని వైశాల్యానివి.
 
దృఢంగా నిలబడ్డావు, తలవంచవు.
మునిగిపోకుండా నదిదాటగలిగావు.
 
భద్రం నీ హృదయం, పదిలం సుమా
పొరపాటుని దరిచేరనివ్వకు.
 
భూమ్యాకాశాల వలె
పక్షపాతరహితంగా జీవించు.
 
మలిసంజలోకి అడుగుపెడతాను. నేను కూడా
కాని, ఎన్నటికీ నీ స్నేహం వీడను.
 
నిర్మలంగా నిలబడతావు
నీదారిన నువ్వు సుదృఢంగా.
 
వయసుకు చిన్నకావచ్చు,
కాని నలుగురికీ నడత నేర్పగలవు.
 
శీలవంతుడైన బో-యి లాగా
మాకందరికీ దారి చూపగలవు.
 
16-2-2022

Leave a Reply

%d bloggers like this: