యుగయుగాల చీనా కవిత-5

ప్రతి సమాజానికీ, ప్రతి దేశానికీ, ఆ మాటకొస్తే ప్రతి తరానికీ కూడా ఒక అత్యున్నత జీవితాదర్శం ఉంటుంది. ఆ తరానికి చెందిన మానవులు ఏమైనా కోరుకుంటూ ఉండవచ్చుగాక, కానీ, ఆ ఒకే ఒక్క, అత్యున్నత జీవితాదర్శం ముందు తక్కినవన్నీ వాళ్ళకి తృణప్రాయంగా అనిపిస్తాయి. అటువంటి ఆదర్శాలే తర్వాత తరాలకి నమూనాగా రూపొందుతాయి. ఒక తరం తన తరువాతి తరానికి ఎటువంటి సంపదలు, సాహిత్యం, కళలు, సైన్సు, టెక్నాలజీ ఏదైనా ఇచ్చి ఉండవచ్చుగాక, కాని ఆ అత్యున్నత జీవితాదర్శమేదో దాన్ని ఇవ్వకపోతే ఆ తరం తన తరువాతి తరాలకి నిజమైన జీవితాన్ని ఇవ్వనట్టే.
 
అట్లానే ప్రతి తరం కూడా తన ముందు తరాలు తనకి అటువంటి జీవితాదర్శాలు ఏవైనా వదిలిపెట్టి వెళ్ళిందా అని అన్వేషిస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు దేవతల గురించిన కథల రూపంలో, కొన్ని సార్లు ప్రవక్తల జీవితాల రూపంలో, కొన్నిసార్లు దేశభక్తుల రూపంలో ఆ అత్యున్నత ఆదర్శాలకు చెందిన ఉదాహరణల్ని పోల్చుకోడానికి ప్రయత్నిస్తుంది.
 
ప్రాచీన చీనామానవులు కూడా అటువంటి అత్యున్నత జీవితాదర్శం ఏమిటనే ప్రశ్న పదేపదే వేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రశ్నలోంచే వారి సాహిత్యాదర్శాలు కూడా రూపొందుతూ వచ్చాయి. ప్రాచీన చీనా సంస్కృతిని రూపొందించిన కన్ ఫ్యూసియస్, లావోజి తమ తమ దృక్పథాల్లో ఎంతగా విభేదించినా వారిద్దరికీ ఆమోదయోగ్యమైన మాట ఒకటి ఉంది. అది ‘డె’. అంటే శీలం, నడత. ఇంగ్లిషులో దాన్ని మనం virtue అంటాం. ఆ మాటకొస్తే ప్రాచీన గ్రీకులకి కూడా అదే ఆదర్శం. దాన్ని వాళ్ళు arete అన్నారు. ఆ మాటకి అర్థం కూడా శీలం అనే. అటువంటి గుణం కలిగిఉండటానికి సాహసం కావాలి కాబట్టి దాని మరొక అర్థం సాహసం. అటువంటి సాహసం కలిగి ఉండటం కన్నా శ్రేష్టత మరేదీ ఉండదు కాబట్టి ఆ పదానికి శ్రేష్టత అని కూడా అర్థం చెప్పారు. అటువంటి శీలాన్ని మనం మనుషులకు విద్య ద్వారా అలవరచగలమా లేదా అన్నదానిమీద ఒక సోఫిస్టుకీ, సోక్రటీసుకీ మధ్య జరిగిన సంభాషణని ప్లేటో తన ‘ప్రొటాగొరస్’ లో ఎంతో ఆసక్తికరంగా నమోదు చేసాడు.
 
ప్రాచీన చీనాలో వివేకవంతులైన ప్రతి ఒక్క మానవుడూ, మానవీ ఆ ‘డె’ గురించే ఆలోచించారు. అన్వేషించారు. ఏమైనా కానీ, ఎటువంటి మూల్యమైనా చెల్లించవలసి రానీ, మనిషి తన ‘డె’ ని వదిలిపెట్టకూడదు. అంటే తాను సత్యమని నమ్మినదానికి కట్టుబడి ఉండాలి. ‘డె’ అంటే అటువంటి నిబద్ధత కూడా. యుగయుగాలుగా చీనాకవులు తమ ఆదర్శాల్ని అన్వేషించుకుంటూ ఉండటంలో కొన్నిసార్లు కన్ ఫ్యూసియస్ వైపూ, కొన్ని సార్లు డావో వైపూ, కొన్నిసార్లు బుద్ధుడివైపూ, కొన్నిసార్లు మావో వైపూ చూసి ఉండవచ్చు. కాని ఒకసారి ఆ ఆదర్శమంటూ ఏదో ఒకటి తమకై తాము ఎంచుకున్నాక, దాని పట్ల గాఢాతిగాఢమైన, తీవ్రాతితీవ్రమైన నిబద్ధతని పాటించడం కోసమే పరితపించారు.
 
చీనా కవిత్వం గురించి మరింత వివరంగా ముందు ముందు తెలుసుకోబోయే ముందు ఈ అంశం చెప్పడం అవసరమనిపించింది. తాము నమ్మినదాని కోసం జీవితాల్ని తృణప్రాయంగా వదిలిపెట్టిన ఇద్దరు అన్నదమ్ముల కథ ఒకటి చీనా జాతి స్మృతిలో ఎంతో భద్రంగానూ, ఎంతో పవిత్రంగానూ నిలిచి ఉంది. రెండవ శతాబ్దపు హాన్ రాజవంశకాలపు చరిత్రకారుడు సీమా కియాన్ ఆ కథనిలా చెప్పాడు:
 
ఒకప్పుడు చీనాని షాంగ్ వంశం పరిపాలిస్తున్న కాలంలో గు-ఝు అనే చిన్న ప్రాంతానికి యా- వెయి అనే ఒక పాలకుడు ఉండేవాడు. అతడికి ముగ్గురు కుమారులు. పెద్దవాడు బో-యి. రెండవవాడు యా- పింగ్. మూడవ వాడు షూ- కి. సాధారణంగా తండ్రి తదనంతరం పెద్దకొడుకుకి అధికారం సంక్రమిస్తుంది. కాని ఆ తండ్రి తన తదనంతరం తన చిన్నకొడుకుకి అధికారం అప్పగించాలని కోరుకున్నాడు. కాని అతడు మరణించిన తరువాత అతడి చిన్న కొడుకు షూ-కి తన అన్న బో-యి ని రాజ్యాధికారం తీసుకొమ్మని చెప్పి, తాను అక్కడ ఉంటే తన అన్న ఆ అధికారాన్ని స్వీకరించడని అడవులకి వెళ్ళిపోయాడు. కాని పెద్ద కొడుకు బో-యి తాను రాజ్యాధికారం స్వీకరించడం తన తండ్రి అభిమతం కాదు కాబట్టి తాను కూడా ఆ అధికారాన్ని స్వీకరించకుండా తను కూడా అడవులకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అధికారాన్ని రెండవ కొడుకు స్వీకరించవలసి వచ్చింది.
 
అది షాంగ్ వంశంలో చివరి రాజైన డి- జిన్ పరిపాలిస్తున్న రోజులు. అతడు రఘువంశంలో అగ్నిపర్ణుడిలాగా స్త్రీలోలుడు, మద్యపానలోలుడు. క్రూరుడు. మరొక వైపు రానున్న రోజుల్లో చీనాని పాలించబోతున్న ఝౌ చక్రవర్తులు షాంగ్ రాజ్యానికి పడమటి దిక్కున చిన్న రాజ్యం పాలించుకుంటూ ఉండేవారు. వారి రాజు వెన్ శీలానికీ, నడవడికకీ పేరుపొందాడు. అంతేకాక, అతడు ప్రతిభావంతులైన వాళ్ళు ఎక్కడ ఉన్నా తమ రాజ్యానికి రమ్మని ఆహ్వానించేవాడు. అందుకని బో-యి, షూ-కి ఇద్దరూ కూడా తమ బతుకుతెరువు కోసం ఝౌ పాలకుడిదగ్గరకు వెళ్ళారు. కాని దురదృష్టవశాత్తూ అప్పటికే ఆ పాలకుడు మరణించి అతడి కొడుకు వూ రాజ్యానికి వచ్చాడు. అతడు షాంగ్ చక్రవర్తులకు వశవర్తి అయినప్పటికీ ఆ రాజవంశ పాలన క్రూరంగా మారింది కాబట్టి వారిమీద యుద్ధానికి బయల్దేరాడు. బో-యి, షూ-కి ఝౌ రాజ్యంలో అడుగుపెట్టేవేళకి ఆ పొలిమేరల్లో ఆ పాలకుడు తన సైన్యంతో ఎదురయ్యాడు.
 
ఆ అన్నదమ్ములు ఆ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోయారు. వారు పరుగుపరుగున అతడి దగ్గరికి వెళ్ళి ఆ గుర్రం కళ్ళేన్ని పట్టుకుని ఆపి ‘ఇది ధర్మమా? మీ తండ్రి మరణించి ఉండగానే అతడికి పితృకార్యాలు నెరవేర్చకుండా యుద్ధానికి ఎలా బయల్దేరావు? షాంగ్ చక్రవర్తి నీ పాలకుడు, కాబట్టి నీకు తండ్రిలాంటివాడు. అతడి మీద యుద్ధం ఎలా ప్రకటిస్తావు? దయచేసి నీ సైన్యాన్ని వెనక్కి తిప్పు’ అని వేడుకున్నారు. ఆ అన్నదమ్ముల దుస్సాహసానికి రాజుగారి సైనికులకి కోపం వచ్చింది. వారు ఆ అన్నదమ్ముల్ని వధించబోయేవారేగాని, రాజుగారి ఆంతరంగికుడొకడు అడ్డుపడ్డాడు. ఆ పిల్లలు చెప్పేదానిలో కొంత నిజం లేకపోలేదు అన్నాడు. సైన్యం వాళ్ళని వదిలేసి ముందుకు సాగిపోయింది. ఆ ఝౌ పాలకుడు షాంగ్ వంశాన్ని నిర్మూలించి ఝౌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
కాని ఆ అన్నదమ్ములు ఆ రాజుని క్షమించలేకపోయారు. తాము జీవించినంతకాలం ఝౌ చక్రవర్తుల రాజ్యంలో పచ్చిగింజ కూడా ముట్టకూడదనుకున్నారు. ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి అడవులకి పోయి ఆకులూ అలములూ తినడం మొదలుపెట్టారు. కాని ఒకరోజు అక్కడ మళ్ళా వాళ్ళకి ఒక స్త్రీ కనబడింది. ఆమె ఈ ఆకులూ, అలములూ కూడా ఝౌ చక్రవర్తులవే అంది. దాంతో ఆ అన్నదమ్ములు ఆ ఆకులూ, రాలిన పళ్ళూ కూడా తినడం మానేసారు. అట్లానే ఆ అడవిలో నిరాహారంగా కృశించి మరణించారు.
 
శీలవంతులూ, సత్యాగ్రహులూ అయిన ఈ అన్నదమ్ముల కథ చీనా జాతిస్మృతిని ప్రతి యుగంలోనూ కలవరపెడుతూనే ఉన్నది. ఆ అన్నదమ్ములకి అన్యాయం జరిగిందని మీరనుకోవడం లేదా అని ఒకరు కన్ ఫ్యూసియస్ ని ప్రశ్నించారట. ‘ఎందుకు అనుకోవాలి? మానవత్వపు సర్వశ్రేష్ట ఆదర్శాన్ని వాళ్ళు అన్వేషించారు. అందుకోసం బతికారు, మరణించారు. అందులో దుఃఖించవలసినదేమున్నది?’ అని అన్నాడట ఆయన.
 
ఈ కథ నేపథ్యంగా, మనమిప్పుడు యుగయుగాల చీనా కవిత్వంలోకి అడుగుపెడదాం. ముందుగా, ఈ అన్నదమ్ములు చెప్పిన పద్యం. ఆ అన్నదమ్ములు షౌ-యాంగ్ పర్వత శిఖరం మీదనిలబడి ఈ కవిత రాసారని సీమా-కియాన్ రాసాడు:
 
~
 

ఇప్పుడెవరి కేసి చూసేది?

 
పడమటి కొండ ఎక్కాం
కందమూలాలేరుకున్నాం.
 
అతడు పశుబలంతో పశుబలమ్మీద తిరగబడ్డాడు
తాను చేస్తున్నది తప్పని తెలుసుకోలేకపోయాడు.
 
షెన్ నాంగ్, యూ, జియా
ఆ రాజర్షులూ, ఆ రాజ్యాలూ ఇప్పుడెక్కడ?
 
ఇప్పుడెవరికేసి చూసేది?
పద, ఈ లోకంతో మన పని ముగిసింది.
 
15-2-2022

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading