
డావో డె జింగ్ కావటానికి దార్శనిక గ్రంథమే అయినప్పటికీ దాన్ని కవిత్వంగా కూడా పరిగణించవలసి ఉంటుంది. అందుకనే ఇటీవలికాలంలో చీనా కవిత్వాన్ని సంకలనం చేసి ఇంగ్లిషులోకి అనువదిస్తున్న డేవిడ్ హింటన్, టోనీ బార్న్ స్టన్ వంటి అనువాదకులు తమ సంకలనాల్లో డావో డె జింగ్ నుండి కూడా అనువాదాలు పొందుపరుస్తున్నారు.
కాని అంతకన్నా కూడా ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఏ భాషలోనైనా కవిత్వానికి మూడు ప్రయోజనాలు ఉన్నాయనుకుంటే అవి ఒకటి సామాజిక బాధ్యతనీ, నైతికతనీ ప్రకటించడం, మరొకటి వ్యక్తిగత భావోద్వేగాలకు అక్షరరూపం ఇవ్వడం కాగా మూడవది, శాస్త్రాలు అందించలేని ఒక వివేకాన్ని తరం నుంచి తరానికి అందించడం. చీనా కవిత్వం రూపుదిద్దుకుంటున్న తొలిరోజుల్లోనే ఈ మూడు లక్ష్యాల్నీ మూడు కవిత్వసంపుటాలు స్పష్టంగా నిర్దేశించిపెట్టాయి.
కవిత్వానికి ఉండవలసిన సామాజిక బాధ్యతనీ, నైతిక ఆదర్శాలనీ, సమష్టి జీవన సంగీతాన్నీ గీత సముచ్చయం (షీ-చింగ్) నిర్దేశించగా, వ్యక్తిగత భావోద్వేగాల్నీ, వాటిని విప్పిచెప్పుకోవడంలోని విషాదమాధుర్యాన్ని దక్షిన చైనాకి చెందిన చూ శబ్దావళి (చూ-చి) సోదాహరణంగా వివరించింది. ఇక చరిత్ర, శాస్త్రాలు, మతధర్మాలూ ఏవీ అందించలేని ఒక అత్యున్నత వివేకాన్ని, మనిషి జీవన పరమార్థాన్ని డావో డె జింగ్ అక్షరబద్ధం చేసింది. కాబట్టి చీనా కవిత్వంతో పరిచయం కోరుకునే ఏ సాహిత్యవిద్యార్థి అయినా ఈ మూడు సంపుటాల గురించీ తెలుసుకోవలసి ఉంటుంది, అధ్యయనం చేయవలసి ఉంటుంది.
గీత సముచ్చయం కన్ ఫ్యూసియస్ సంకలనం చేయకపోయినప్పటికీ ఆ గీతాల్నీ వాటి సారాంశాన్నీ చీనా సామాజిక-రాజకీయ జీవితానికి ప్రాతిపదికగా మార్చాడని చెప్పుకున్నాం. ఆ విధంగా ఆ పుస్తకం కన్ ఫ్యూసియస్ భావజాలానికి ప్రతినిధిగా నిలబడింది. పడమటి ఝౌ చక్రవర్తులు తూర్పు ప్రాంతాల్ని జయించి తూర్పు ఝౌ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాక సుమారు ఏడువందల ఏళ్ళ పాటు రాజకీయంగా ఒక అస్థిరత నెలకొంది. అందులో మొదటి నాలుగు వందల ఏళ్ళు ( క్రీ.పూ 722-481) వసంత-హేమంతాల కాలమనీ (The Spring and Autumn period), తర్వాత మరొక మూడు వందల ఏళ్ళు (క్రీ.పూ 480-222) సమరశీల రాజ్యాల కాలమనీ ( The Warring States Period) అనీ అంటారు. కన్ ఫ్యూసియస్ వసంత-హేమంతాల కాలంలో (క్రీ.పూ. 551-479) జీవించాడు. తన చుట్టూ ఉన్న రాజ్యవ్యవస్థ బీటలు వారుతున్నదని గ్రహించి తన సలహా వినే రాజుల్ని వెతుక్కుంటూ రాజ్యం నుంచి రాజ్యానికి తిరిగాడు. ఆయనదారిలోనే దాదాపు మరొక నాలుగు వందల ఏళ్ళ పాటు వందలాది మంది తాత్త్వికులు తమ శిష్యుల్ని వెంటబెట్టుకుని ప్రాచీన చీనా అంతా కలయదిరిగారు. అందుకని రాజకీయంగా ఆ కాలం అత్యంత అస్థిరమైనప్పటికీ, తాత్త్వికంగా అది సుసంపన్నమైన కాలం. అందుకని ఆ కాలాన్ని నూరు దర్శనాల కాలం ( Age of Hundred Schools of Thought) అంటారు. ఆ కాలంలో రూపొందిన గ్రంథం డావో డె జింగ్.
లావో జి అనే ఆయన డావో డె జింగ్ రాసాడని చెప్తారు. కాని లావోజి అంటే ఒక ఋషి అని మాత్రమే అర్థం. ఆయన దక్షిణ చైనాలో పుట్టాడనీ, ఝౌ చక్రవర్తుల ఆస్థానంలో రాజపత్రాల భాండాగారాన్ని నిర్వహించేవాడనీ, ఒకసారి క్రతువుల గురించి తెలుసుకోవడం కోసం కన్ ఫ్యూసియస్ ఆయన దగ్గరకు వెళ్ళాడనీ ఒక కథ ఉంది. కన్ ఫ్యూసియస్ కన్నా వయసులో పెద్దవాడైన లావోజి కన్ ఫ్యూసియస్ ను తన డంబం, పొగరు, దురుసుతనం వదులుకొమ్మని హెచ్చరించాడని కూడా ఆ కథ చెప్తుంది. ఆయన్ను కలిసి బయటకు వచ్చిన తరువాత కన్ ఫ్యూసియస్ తన శిషులతో ‘ఆకాశంలో రెక్కలతో ఎగిరే మహాసర్పం గురించి నేనింతకుముందు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూసాను’ అని అన్నాడని కూడా ఆ ఐతిహ్యం చెప్తున్నది. కాని, లావోజి అనే ఒక వ్యక్తి ఎవరూ చారిత్రికంగా లేరనీ, కన్ ఫ్యూసియస్ కన్నా పూర్వపు కాలం నుంచీ ప్రజల్లో ప్రచారంలో ఉన్న కొన్ని వివేకసూత్రాల్ని ‘డావో డె జింగ్’ పేరిట సంకలనం చేసారనీ నేడు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
చాలా బలంగానూ, బిగ్గరగానూ ఒక సామాజిక నైతికత గురించి కన్ ఫ్యూసియస్ మాట్లాడుతున్న తరువాత మరొక వివేకంతో పనేమిటి? అటువంటి వివేకమంటూ ఒకటుంటే దాని అవసరమేమిటి? ఈ ప్రశ్నకి జవాబివ్వాలంటే మొత్తం మానవజాతి చరిత్రనంతటినీ మనం పర్యావలోకించవలసి ఉంటుంది. మానవ చరిత్రలో చరిత్ర యుగం మొదలై అయిదువేల ఏళ్ళు మాత్రమే.
అంతకుముందు పాతరాతి యుగంలోనూ, కొత్తరాతి యుగంలోనూ మనిషి కొన్ని లక్షల సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతడు ప్రకృతిని ఆరాధించాడు. ప్రకృతి అంటే వట్టి భూమి మాత్రమే కాదు, ఆకాశమూ, అంతరిక్షమూ, పాతాళమూ అన్నీ కలిసిన ఒక సమగ్రస్వరూపం. ఆ ప్రకృతిని ఆ కాలపు మనిషి ఒక తల్లిగా కొలిచాడు. కాని చరిత్ర యుగం మొదలుకాగానే, ఆ ప్రాచీన పృథ్వి భూమ్యాకాశాలుగా విడిపోయింది. రాతియుగం నుండి కాంస్యయుగంలో అడుగుపెట్టగానే మనిషి భూమిని ద్వితీయశ్రేణికి నెట్టి ద్యులోకదేవతలకు ప్రాధాన్యతనివ్వడం మొదలుపెట్టాడు. సుమేరులో, ఈజిప్టులో, గ్రీసులో, సప్తసింధులోయలో ప్రతి ఒక్కచోటా ఇదే జరిగింది, చివరికి చీనాలో కూడా.
కానీ ఇలా ఆకాశదేవతల్ని ముందుకు తీసుకురావడం మీద ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తిరుగుబాట్లు తలెత్తాయి. ఈ కొత్త దేవతల్ని నిరాకరిస్తూ, ప్రాచీన పృథ్వీ దేవతనే, ఆ మాతృదేవతనే ఆరాధించడంలో ఎక్కువ మానవత్వం, సమత్వం, సున్నితత్వం ఉంటాయని ఆ ఆరాధకులు భావించారు. అటువంటి ఒక ప్రాకృతిక స్థితికి మరలిపోవాలన్న ఆకాంక్షలోంచి డావో డె జింగ్ రూపుదిద్దుకున్నది. సృష్టికి కారణమైన ఆ శక్తిని, సూత్రాన్ని ఆ గ్రంథం ‘డావో’ అన్నది. డావో అంటే దారి, మార్గం, నడక, ఒక సూత్రం, సత్యం. దాన్ని ఏ పేరుతోనూ వివరించలేం కాబట్టి డావో అంటున్నాం. అది సృష్టిలో సహజంగా సంభవించే ఒక ప్రసూతి. ఆ ప్రసూతికి ఏ ప్రత్యేక ఉద్దేశ్యమూ లేదు. ఆ సృష్టి తిరిగి మళ్ళా లయమైనప్పుడు తిరిగి పునఃసృష్టిగా మారుతుంది.
నిత్యనిరంతరాయంగా సంభవించే ఒక ప్రక్రియ అది. ఆ ప్రక్రియలో మనం ఎటువంటి జోక్యం చేసుకున్నా, ఏ విధంగా సరిదిద్దాలని చూసినా అది వినాశకారిగానే మారుతుంది తప్ప మనిషికీ, సృష్టికీ కూడా ఏ విధంగానూ సహకరించదు.
మనం చూస్తున్న ప్రపంచంలో పదివేలవిషయాలు ఉన్నాయి. కానీ ఆ పది వేల రూపాలకి కారణమైన దానికి రూపం లేదు. దాన్ని లావోజి ‘లేకపోవడం’అన్నాడు, ‘శూన్యం’ అన్నాడు. అది నాసదీయ సూక్తం లో చెప్పినట్లుగా అనస్తిత్వం. అది అన్ని రకాల ద్వంద్వాలకి అతీతం కాబట్టి దాన్ని తెలుసుకోవడం ద్వారా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని నిచ్చెన మెట్ల వ్యవస్థను తప్పించుకోగలుగుతాం.
ఒకసారి ఆ డావో ఎరుకపడ్డాక, దాన్న్ని గౌరవించడం ‘డె’. డె అనే మాటకి బలం, జీవం, ప్రాణం, ఆచరణ, నడత లాంటి అర్థాలు చెప్పవచ్చు. నిజానికి డె అనే భావన కన్ ఫ్యూసియస్ తత్త్వశాస్త్రంలో కూడా ఉంది. ఆయన దాన్ని ఆకాశం లేదా స్వర్గం మనుషులకు విధించిన శాసనం పట్ల చూపించవలసిన బాధ్యతగా గుర్తించాడు. ఆకాశం మనుషుల పట్ల విధించిన బాధ్యత ఏమిటి?
అత్యంత ప్రాచీన, పౌరాణిక కాలంలో చీనాని పరిపాలించిన జియా రాజవంశం ప్రకృతి ఆరాధకులు. వారిని పక్కకునెట్టిన షాంగ్ రాజవంశం తమ అర్చాపీఠం మీద ఆకాశాన్ని ప్రతిష్టించారు. కాని ఆకాశం పేరిట, స్వర్గం పేరిట వారు తొందరలోనే నిరంకుశులుగా, క్రూరులుగా మారిపోయేరు. అందువల్ల వారి స్థానంలో ఝౌ రాజ్యపాలన తప్పలేదు. అయితే ఝౌ చక్రవర్తులకి ఒక నైతిక సమస్య ఏర్పడింది. ఒకవేళ షాంగ్ చక్రవర్తులు దైవాంశ సంభూతులే అయితే, ప్రజల్ని పరిపాలించడం వారికి దేవుడిచ్చిన హక్కు అయితే, తాము ఆ పరిపాలనని తమ చేతుల్లోకి ఎట్లా తీసుకోగలరు? అందుకు సమాధానంగా వారు చెప్పుకున్నదేమంటే, దేవుడు ఏ రాజవంశానికైనా పాలనాధికారాన్ని శాశ్వతంగా ఇవ్వడనీ, ఏ రాజైనా ధర్మాన్ని పాటించినంతవరకే అతడికి పాలనాధికారం ఉంటుందనీ, ధర్మం తప్పిన మరుక్షణమే పాలనాధికారం పోతుందనీ వారు నమ్మారు. దాన్ని తియాన్ ( ఆకాశం) మింగ్ (శాసనం) అన్నారు.
కాని డావో డె జింగ్ చేసిన పని ఏమిటంటే, మనుషులు పాటించవలసిన బాధ్యతను తియాన్మింగ్ నుంచి తప్పించడం. ఇంకా చెప్పాలంటే, ఆకాశాన్ని పక్కకు నెట్టి మళ్ళా భూమిని అర్చాపీఠం మీద ప్రతిష్టించడం. తియాన్మింగ్ స్థానంలో డావో ని తీసుకురావడం. అంటే మానవప్రయత్నాల కృత్రిమత్వం స్థానంలో ప్రాకృతిక సహజత్వానికి పట్టం కట్టడం. ఆకాశదేవతల్ని ఆరాధించే కన్ ఫ్యూసియస్ వంటివారి దృష్టిలో కాలం సరళరేఖీయం, చారిత్రికం, కాలెండరీయం. కానీ డావో ని నమ్మేవారి కాలం ఋతుపరిభ్రమణశీలం, వర్తులం. కన్ ఫ్యూసియస్ దృష్టిలో మనిషికీ, ఆకాశానికీ ఉన్న సంబంధం సామాజికం, నైతికం. డావో దృష్టిలో మనిషికీ ప్రకృతికీ ఉన్న సంబంధం తల్లికీ, బిడ్డకీ ఉన్న సంబంధంలాంటిది. అది ప్రాకృతికం, దానికి ఎటువంటి ప్రయోజనాల్నీ, పరమార్థాల్నీ అంటకట్టలేం.
ఇటువంటి భావాలతో రాసిన 81 ఖండికల సంపుటం డావో డె జింగ్. అయిదువేల అక్షరాలకు మించని ఆ చిన్న రచన చీనా సంస్కృతిమీద చూపించిన ప్రభావం అపారం. తర్వాత రోజుల్లో చీనా కవిత్వాన్ని, కళల్ని, చిత్రలేఖనాన్ని ప్రతి ఒక్కదాన్నీ డావోయిజం గాఢంగా ప్రభావితం చేసింది. ఇక ఆధునిక కాలానికి వస్తే, ప్రపంచ వ్యాప్తంగా డావో డె జింగ్ పట్ల ఆసక్తి నానాటికీ పెరుగుతూనే ఉన్నది. ఆ పుస్తకం చదివినవారికి ప్రాచీన గ్రీకు తాత్త్వికులు హెరాక్లిటస్, లుక్రీషియస్ మొదలుకుని ఆధునికయుగంలో థో రో, గాంధీ దాకా ఎందరో గుర్తుకు రాకుండా ఉండరు. ఎంతో భావగర్భితంగానూ, కవితాత్మకంగానూ ఉండే ఆ చిన్న చిన్న ఖండికలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో పదేపదే అనువాదమవుతూనే ఉన్నాయి.
డావో డె జింగ్ ఒక దర్శనం, ఒక కావ్యం మాత్రమే కాదు, ఒక రాజకీయ రచన కూడా. ఎందుకంటే ఝౌ చక్రవర్తుల పాలన బలహీనపడ్డాక ఒక ప్రశ్న ముందుకొచ్చింది. ఒక రాజు రాజు కావాలంటే అర్హత ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబుని అన్వేషిస్తూనే నూరు దర్శనాలు ప్రభవించాయి. కన్ ఫ్యూసియస్, అతడి అనుయాయులు చెప్పేదేమంటే, ఒక రాజు తియాన్మింగ్ ని పాటించినంతవరకే అతడికి రాజుగా కొనసాగే అర్హత ఉంటుంది. కాని ఆ రాజవంశంలో వారసులు లేకపోతే? అప్పుడు పాలనాధికారానికి యోగ్యులైన కుటుంబసభ్యుల్ని వెతకవలసి ఉంటుంది. విద్య ద్వారా, నైతిక శిక్షణ ద్వారా అటువంటి అర్హుల్ని మనం తయారు చేసుకోవలసి ఉంటుంది అని కన్ ఫ్యూసియస్ భావించాడు. అటువంటి శిక్షిత, సంస్కారవంతుల్ని ఆయన ‘జున్జి ‘ అని పిలిచాడు. మరొకవైపు మోహిస్టులనే లీగలిస్టులు దీన్ని అంగీకరించలేదు. వారి దృష్టిలో పాలనాధికారం రక్తసంబంధీకులకే చెందవలసిన పనిలేదు. ఆ అర్హత ఎవరికి ఉంటే వారు పాలకులు కావచ్చు అని వారు వాదించారు.
కాని డావో డె జింగ్ ఈ రెండు వాదనలనీ నిరాకరించింది. డావో ప్రతిపాదించిన రాజు ప్రధానంగా వివేకవంతుడు. అతడసలు పరిపాలించడు. ప్రజల్ని పాలితులుగా కాక అతిథులుగా భావిస్తాడు. ఎందుకంటే అన్నిరకాల ప్రగతిశీల ప్రయత్నాలు అంతిమంగా యుద్ధానికే దారితీస్తాయని అతడికి తెలుసు. అటువంటి ఎరుక కలిగిన ఆ రాజుని లావో జి ‘షెన్ గ్రెన్’ అన్నాడు. అతడు జనకుడిలాగా రాజర్షి. మార్కస్ అరీలియస్ లాగా Philosopher-king.
కాని అటువంటి ఒక పాలన ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. నిజానికి అటువంటి ఒక పాలన సాధ్యం కాదన్న నిస్పృహతోనే లావో జే ఝౌ సామ్రాజ్యాని వదిలిపెట్టి వెళ్ళిపోయాడట. అతడు రాజ్యం పొలిమేరలు దాటగానే అక్కడ కనుమకు కాపలా కాస్తున్నవాడు లావో జే తెలుసుకున్న సత్యాన్ని తనకు రాసిమ్మని అడిగాడట. అలా వచ్చిందే ఈ గ్రంథం. కాబట్టి ఆ ఆలోచనలు ఆచరణ సాధ్యం అయినా, కాకపోయినా నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో anti-authoritarian movements కి డావో డె జింగ్ స్ఫూర్తిగా నిలుస్తున్నదన్న మాట కూడా కాదనలేం.
81 కవితల డావో డె జింగ్ లో మొదటి 37 కవితలు ‘డావో’ గురించీ, 38 నుండి 81 దాకా ‘డె’ గురించీ వివరిస్తాయి. ఆ రెండు భాగాలనుంచీ మూడు కవితలు:
1
బహుమానాలూ, సన్మానాలూ పక్కన పెట్టి చూడు
ప్రజలు కలహించుకోడం మానేస్తారు.
అమూల్యమైనవాటిని దాచడం మానెయ్యి
దొంగతనాలు ఉండవు.
ఊరికే మోహపెట్టకు, మభ్యపెట్టకు
మనుషులు అయోమయానికి గురికారు.
ఒక ఋషి పాలించే పద్ధతి ఇది.
అతడి ఖాళీ కడుపుల్ని నింపుతాడు
తలపుల్ని ఖాళీ చేస్తాడు.
ఎముకలకి బలమిస్తాడు
కోరికల్ని సన్నబరుస్తాడు.
కొరతనుంచీ, జిజ్ఞాసనుంచీ ప్రజల్ని తప్పిస్తాడు
అప్పుడు నిజంగా తెలిసినవాళ్ళెవరో
వాళ్ళు నటించడం మానుకుంటారు.
నువ్వు చేస్తున్నదేదో చెయ్యడం మానేసినప్పుడు
ప్రతి ఒక్కటీ చక్కగా పనిచేస్తుంది.
( డావో డె జింగ్, 3)
2
ముప్పై ఆకులు ఒక్క ఇరుసుచుట్టూ:
అక్కడేదీ లేదు కాబట్టే బండి నడుస్తుంది.
మట్టితో తయారు చేసిన కూజా
అందులో ఏదీ లేదు కాబట్టే నీళ్ళు నిలుస్తాయి.
తలుపులూ, కిటికీలు ఉన్న ఇల్లు:
ఆ ఖాలీజాగాలోనే మనం జీవించేది.
ఏదైనా ఉండటం వల్ల వస్తువులకి విలువ చేకూరుతుంది,
కాని అక్కడ ఏది లేదో అదే వాటిని పనికొచ్చేలా చేస్తుంది.
(డావో డె జింగ్, 11)
3
పెద్ద రాజ్యాన్ని పరిపాలించడం
చిన్న చేపను వండటం లాంటిది.
ఆకాశం కింద ఉన్న ప్రతి ఒక్కదాన్నీ
ఆదిమ సూత్రం ప్రకారం పాలించడం నేర్చుకో.
అప్పుడు దేవతలు భూతాలుగా మారరు.
దేవతలు భూతాలుగా మారనప్పుడు
భూతాలు ప్రజలకు హానిచెయ్యవు.
భూతాలు ప్రజలకు హాని చెయ్యనప్పుడు
ఋషులు కూడా హానిచెయ్యరు.
ఇక మనుషులూ, దేవతలూ
ఒకరికొకరు హాని తలపెట్టనప్పుడు
ప్రతి ఒక్కరికీ నడత సాధ్యపడుతుంది.
(డావో డె జింగ్, 60)
13-2-2022