యుగయుగాల చీనా కవిత-3

ఒకప్పుడు ఒకాయన కన్ ఫ్యూసియస్ కొడుకు పో-యూ ని అడిగాడట: మీ తండ్రి మాలాంటి శిష్యులకి చెప్పకుండా నీకు మాత్రమే చెప్పిన పాఠాలేవైనా ఉన్నాయా అని. అందుకు పో-యూ చెప్పాడట: ‘ఒకరోజు మా నాన్న గీతసముచ్చయం చదివావా అనడిగాడు. లేదన్నాను. అయ్యో, గీత సముచ్చయం చదవకపోతే పదాలెట్లా ప్రయోగించాలో నీకెట్లా తెలుస్తుంది అన్నాడాయన’ అని .
 
కన్ ఫ్యూసియస్ తన కొడుక్కే కాదు, తన శిష్యులకి కూడా షీ-జింగ్ గురించి పదేపదే చెప్పాడు. ‘ మీరు గీతసముచ్చయం ఎందుకు చదవకూడదు? అందులో గీతాలు మీ హృదయాన్ని స్పందింపచేస్తాయి. మీ ఆలోచనలకు మేతపెడతాయి, స్నేహం చెయ్యడమెట్లానో నేర్పుతాయి, ధిక్కరించడమెట్లానో నేర్పుతాయి, మీ తల్లిదండ్రులకీ, చక్రవర్తికీ అనుగుణంగా జీవించడమెట్లానో చెప్తాయి, ఎన్నో రకాల పక్షుల గురించీ, పశువుల గురించీ, మొక్కల గురించీ, చెట్ల గురించీ కూడా తెలియచేస్తాయి ‘ అని చెప్పేవాడాయన. తన కుమారుడు ఆ గీతాలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాక మళ్ళా ఒకసారి అతనితో అన్నాడు కదా, ‘ఆ పుస్తకంలో మొదటి రెండు సర్గలు చదవనివాడు గోడకి ముఖం పెట్టినిల్చున్నవాడితో సమానం’ అని. గీతసముచ్చయాన్ని కన్ ఫ్యూసియస్ సంకలనం చేసాడనే మాటని ఈనాటి పరిశోధకులు అంగీకరించకపోయినా, ఆ సంకలనాన్ని చీనా సంస్కృతికి ప్రాతిపదికగా మార్చింది మాత్రం ఆయనే అన్నదానిలో మరొక అభిప్రాయం లేదు.
 
గీతసముచ్చయంలోని మూడువందల గీతాలూ ఆయనకి హృదయస్థం. వాటిని ఆయన తన తంత్రీవాద్యమ్మీద పాడుకుంటూ ఉండేవాడని చెప్తారు. ‘గీతసముచ్చయంలోని మూడువందల గీతాల్నీ ఒక్కమాటలో చెప్పవచ్చు. అవెప్పటికీ దారితప్పవు ‘ అని కూడా అన్నాడాయన. ఈ ఒక్క మాటతో గీతసముచ్చయం దాదాపుగా ఒక నైతికశాస్త్రంగా మారిపోయింది. అనంతరకాలంలో కన్ ఫ్యూసియన్ పండితులు అందులోని ఒక ప్రతి ఒక్కగీతానికీ ఒక నైతిక వ్యాఖ్యానాన్ని సమకూర్చే ప్రయత్నంలో, ఆ గీతాల్లోని ప్రేమగీతాల సారళ్యాన్ని మరుగుపర్చడానికి కూడా వెనకాడలేదు. కాని ఈ రోజు ఆ గీతాల్లోని మంత్రవిభాగం, స్తోత్రవిభాగం కన్నా కూడా, అందులోని పాటలే మనకెక్కువ సన్నిహితంగానూ, మన హృదయాల్ని రంజింపచేసేవిగానూ వినిపిస్తున్నాయి.
 
గీతసముచ్చయంలోని మొదటి 160 గీతాలూ పాటలు. వాటిని ఝౌ సామ్రాజ్యపరిథిలోని వివిధ ప్రాంతాల ప్రజలు పాడుకునే పాటలనుంచి సేకరించారు. కవిత్వ శిల్పాన్ని బట్టి వాటిని మూడు రకాలుగా వర్గీకరించారు. మొదటి తరహా పాటలు ‘ఫూ’ అంటే వర్ణనాత్మకాలు. రెండవతరహా పాటలు ‘బి’ అంటే వాటిలో , అన్నిరకాల ఉపమానాలు, రూపకాలు మొదలైన పోలికలన్నీ ప్రధానంగా ఉంటాయి. మూడవ తరహా గీతాలు ‘జింగ్’ ప్రధానాలు. జింగ్ ని మన ఆలంకారిక పరిభాషలో ‘ధ్వని’ కి సమానంగా చెప్పవచ్చు. గీతసముచ్చయంలోని ప్రతి ఒక్క పాట ఈ వర్గీకరణలో ఏ విభాగం కిందకు వస్తుందో వ్యాఖ్యాతలు వివరంగా రాసిపెట్టారు. కొన్ని పాటల్లో రెండూ కూడా ఉండవచ్చు. అప్పుడు వాటిని ‘బి-జింగ్’ గీతాలుగా పేర్కొన్నారు.
 
కవిత్వ ప్రయోజనం విషయానికి వచ్చేటప్పటికి ‘షీ యెన్ చీ’ అనేది ప్రసిద్ధ సూత్రం. ఇది మూడు పదాల వాక్యం. ‘షీ’ అంటే గీతం. ‘వెన్’ అంటే వాక్కు. ‘చి’ అంటే సంకల్పం, అనుభూతి, ఉద్దేశ్యం. అంటే ఒక గీతం పరమార్థం హృదయానుభూతికి వాక్కునివ్వడం. ప్రాచీన గ్రీకులు నాటకకళ ప్రయోజనం మనోక్షాళనం అనిచెప్పినట్టే ప్రాచీన చీనా భావుకులు కవిత్వ ప్రయోజనం మనసుని మాటల్లో పెట్టడం అని చెప్పుకున్నారు. కాని ‘చి’ అనే మాటకి వివిధ అర్థచ్ఛాయలు ఉన్నందువల్ల కొందరి దృష్టిలో కవిత్వమంటే మనసులోని నైతికసంకల్పాలకు అక్షరరూపమివ్వడం. మరికొందరి దృష్టిలో మనసులో చెలరేగే ఉద్వేగాలకు మాటలివ్వడం. ఏ దృష్టిలో చూసినా కవిత్వమంటే మనసులో మాట పైకి చెప్పడం. ఆ విధంగా గీతసముచ్చయం ప్రాచీన చీనా ప్రజల హృదయాలకి అద్దం పడుతున్నదనడంలో అతిశయోక్తి లేదు.
 
గీతసముచ్చయంలోని మొదటి విభాగమైన వివిధ ప్రాంతాల పాటలనుంచి కొన్ని కవితలు:
 
1
 

మరీ పెద్దపొలం సాగుచేయకు

 
మరీ పెద్దపొలం సాగుచేయకు
తీరా కలుపు తియ్యడం కష్టం.
 
దూరపు మనిషిని ప్రేమించకు
గుండెకోతభరించడం కష్టం.
 
మరీ పెద్ద పొలం సాగుచెయ్యకు
అంత కలుపు తియ్యడం కష్టం.
 
దూరపు మనిషిని ప్రేమించకు
గుండెబాధ మెలిపెట్టేస్తుంది.
 
ఆ పిలకజడల పిల్లగాడు
ఎంత ముద్దులొలుకుతూ ఉన్నాడు.
 
మళ్ళా చూద్దునుకదా, ఇంతలోనే
బారెడు మనిషై కనబడ్డాడు!
 
(వివిధ ప్రాంతాల పాటలు, 102)
 
2
 

నలుగురూ నడిచే దారిలో

 
నలుగురూ నడిచే దారిలో
నీ వస్త్రం పట్టుకునిన్నాపితే
నన్ను విసుక్కోకు,
పాత అలవాట్లు ఒక పట్టాన వదిలిపోవు.
 
నలుగురూ నడిచే దారిలో
నీ చెయ్యి పట్టుకు నిన్నాపితే
కోపం తెచ్చుకోకు,
పాత స్నేహాలు ఒకపట్టాన చెరిగిపోవు.
 
(వివిధ ప్రాంతాల పాటలు, 81)
 
3
 

పత్తిచేలో పత్తి ఏరుతున్నాను

 
పత్తిచేలో పత్తి ఏరుతున్నాను
ఒక్క రోజు అతణ్ణి చూడకపోతే
మూడు నెలలు గడిచిపోయినట్టుంది!
 
బంతిచేలో పూలు కోస్తున్నాను
ఒక్క రోజు అతణ్ణి చూడకపోతే
మూడు శరత్తులు గడిచినట్టుంది!
 
గోగుచేలో ఆకు తెంపుతున్నాను
ఒక్కరోజు అతణ్ణి చూడకపోతే
మూడేళ్ళు గడిచిపోయినట్టుంది!
 
( వివిధ ప్రాంతాల పాటలు, 72)
 
4
 

కానుగచెక్కతో చేసిన పడవ

 
కానుగచెక్కతో చేసిన పడవ
కెరటాలమీద తేలిపోతున్నది.
 
కలవరపడుతున్నది నా హృదయం
నిదురరాకున్నది,
సంతోషించడానికి
నా చుట్టూ ఎన్ని ఉన్నా
ఎవరికీ చెప్పుకోలేని బాధ
గుండెని మెలిపెడుతున్నది.
 
నా గుండె అద్దం కాదు
ఎదటివాళ్ళ మనసులో ఏముందో విప్పిచూపటానికి.
అన్నదమ్ములు లేకపోలేదునాకు
నన్నెవరూ ఎత్తుకుపోకుండా చూడటానికి
తీరా వాళ్ళకి చెప్పుకుందామంటే
నాకు దక్కేది కోపం, శోకం.
 
నా గుండె రాయి కాదు
ఎటుపడితే అటు దొర్లించడానికి.
నా హృదయం చాప కాదు
ఎలాపడితే అలా చుట్టిపెట్టడానికి.
 
నేనూ చెయ్యకపోలేదు
లెక్కకు మించిన నోములు, వ్రతాలు.
నన్ను వేధిస్తూనే ఉన్నారు కొందరు నీచులు
నా గుండె దహించుకుపోతున్నది
 
నేను పడ్డమాటలు
దిగమింగిన అవమానాలూ తక్కువకాదు.
పొద్దుగుంకినప్పుడల్లా దిగులు తలపులు,
పొద్దు పొడవగానే దుఃఖం పొంగుకొస్తుంది.
 
సూర్యచంద్రులారా
మీరెందుకు వన్నె తగ్గారు?
మాసిపోయిన చీరలాగా
నా దుఃఖపు మురికి నన్నంటుకుంది.
 
పొద్దుగుంకినప్పుడల్లా దిగులు తలపులు
పొద్దుపొడవగానే రెక్కలొచ్చి ఎగిరిపోవాలనిపిస్తున్నది.
 
(వివిధ ప్రాంతాల పాటలు, 26)
 
5
 

అడవిలో ఒక లేడికూన మరణించి ఉన్నది

 
అడవిలో ఒక లేడికూన మరణించి ఉన్నది
దానిమీద పండుటాకులు పరచి ఉన్నవి.
 
వసంతంకోసం ఒక కన్య ఎదురుచూస్తున్నది
అందగాడొకడు ఆమెని వశపర్చుకున్నాడు.
 
అడవినిండా తరులతాగుల్మాలు,
ఆ చెట్లమధ్య ఒక లేడికూన.
 
దానిమీద కుప్పపోసిన ఎండుగడ్డి.
మరకతమణిలాంటి సుందరి.
 
ఓయ్, మరీ అంత తొందర వద్దు,
మరీ అంత దురుసుగా
 
ఓయ్, నా తాబొందుముడిని లాగకు.
జాగ్రత్త, కుక్కలు మొరిగేను.’
 
( వివిధ ప్రాంతాల పాటలు, 23)
 
6
 

క్వాంగ్ క్వాంగ్ అని అరుస్తున్నాయి

 
క్వాంగ్ క్వాంగ్ అని అరుస్తున్నాయి
అడవిబాతులు నది మధ్య లంకల్లో.
 
అందాల బరిణె ఆ సుందరి
మా ప్రభువుకు సరిజోడు.
 
అక్కడ కొంతా ఇక్కడ కొంతా పూలతీగలు
అటూ ఇటూ ఎటుతిరిగినా చేతులకందుతాయి.
 
అందాల బరిణె ఆ సుందరికోసం
అతడు అహర్నిశలు వెతుకాడేడు.
 
వెతుకులాడేడు, అయినా కనకున్నాడు
రాత్రింబగళ్ళు పరితపించాడు.
 
తెగని ఊహలు, దిగులుపుట్టించే తలపులు
పక్కమీద నిదురరాక అటూ ఇటూ పొర్లాడేడు.
 
అక్కడ కొంతా ఇక్కడ కొంతా పూలతీగలు
అటూ ఇటూ ఎటుతిరిగినా చేతులకందుతాయి.
 
అందాల బరిణె ఆ సుందరిని
ఏడుమెట్ల కిన్నెరల్తో పలకరిద్దాం.
 
అక్కడ కొంతా ఇక్కడ కొంతా పూలతీగలు
వెతుకులాడాలి కావాలంటే అటూ ఇటూ.
 
అందాల బరిణె ఈ సుందరిని
సన్నాయిమేళంతో స్వాగతిద్దాం.
 
(వివిధ ప్రాంతాల పాటలు, 1)

Leave a Reply

%d bloggers like this: