యుగయుగాల చీనా కవిత-10

Reading Time: 3 minutes

ఋగ్వేద ఆదర్శాలూ, దేవతలూ నిస్సహాయంగా నిలబడ్డ చోట మహాభారతం ప్రభవించింది. పరస్పర విరుద్ధాలుగా వినిపిస్తున్న వివిధ తత్త్వశాస్త్రాల మధ్య మానవుడు అనుసరించవలసిన తోవ ఏది అని యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తాడు. ఆ తోవ గురించే కృష్ణార్జునసంవాదంతో సహా ఎన్నో సంవాదాలు. ఆ చర్చలతోటే మహాభారతం రూపొందింది.
 
మూడవ శతాబ్ది చీనాది కూడా అదే పరిస్థితి. చీనా చరిత్రలోనూ, సాహిత్యంలోనూ కూడా మూడవ శతాబ్దం పెద్ద మలుపు. అంతదాకా రాజులకీ, కవులకీ కూడా ఆధారంగా నిలబడ్డ కన్ ఫ్యూసియన్ ఆదర్శాలు పెద్దకుదుపుకి లోనయ్యాయి. ఉదాహరణకి విధేయత అనే అంశమే తీసుకుందాం. కన్ ఫ్యూసియస్ చెప్పిన దాని ప్రకారం మనిషి ప్రాథమికంగా కుటుంబం పట్లా, రాజు పట్లా విధేయుడిగా ఉండాలి. కాని రాజు అవినీతిపరుడై అతడి మీద అతడి సేనాధిపతి తిరుగుబాటుకు పూనుకున్నాడనుకుందాం. నువ్వు ఆ సేనాధిపతి దగ్గర పనిచేస్తున్నావనుకో, నువ్వు ఎవరి పట్ల విధేయుడిగా ఉండాలి? లేదా రాజు నీతిపరుడు, కాని మంత్రులు అవినీతిపరులు, వాళ్ళు పాలనని పాడు చేస్తున్నారు. నువ్వు ఆ రాజు పట్ల విధేయతతో రాజుకి ఒక హితవు చెప్పావు. రాజు నీ హితవచనం వినడంలేదు. నువ్వు నీ విధేయతని ఇంకా కొనసాగించాలా? లేదా అలా తనకి హితవు చెప్పినవాళ్ళ పట్ల రాజు కోపించి వాళ్ళకి మరణదండన విధించాడు. అదంతా నీ కళ్ళముందే జరిగింది. అయినా కూడా నువ్వు రాజు పట్ల విధేయత చూపించాలా?
 
ఒక కవి తాను జీవిస్తున్న సమాజం పట్ల బాధ్యత వహించాలా అని అడిగితే ఈనాటి రాజకీయ కవులు అవును అని చెప్తారు. చీనాలో ప్రాచీన కవులు కూడా అవుననే చెప్పారు. కాని సమస్య ఎప్పుడొస్తుందంటే, ఆ సమాజానికీ, రాజుకీ మధ్య ఒక పగులు సంభవించినప్పుడు. అప్పుడు కవి ఎవరి పక్షం వహించాలి? రాజు పక్షమా? ప్రజలపక్షమా? మూడవ శతాబ్ది నుండి నేటికాలపు మిస్టీ కవుల దాకా చీనా కవుల ప్రధాన సమస్య ఇదే. నువ్వు ప్రజల పక్షం వహించు అని చెప్పడం సులభం.
 
కాని ప్రజల్ని కూడగట్టుకోడానికి ఈనాటి ప్రజాస్వామిక పరిస్థితుల్లో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ రోజుల్లో రాజుమీద తిరగబడటం తప్ప మరో మార్గం లేదు. అలా తిరగబడే ప్రతి సైనికాధికారీ, వీరుడూ కూడా నీతిపరుడే అనడానికి కూడా లేదు. అధికార దాహంలోనూ, ప్రజాపీడనలోనూ ఒక రాజుకీ మరొక రాజుకీ మధ్య వ్యత్యాసం చాలా స్పల్పంగా ఉండే కాలం అది.
 
మూడవ శతాబ్ది ప్రారంభంలో కొందరు కవులు ఈ నలుగులాట అంతా పడి చివరికి రాజ్యానికీ, సమాజానికీ దూరంగా తమదంటూ ఒక స్వాప్నికలోకాన్ని నిర్మించుకున్నారు. వాళ్ళు ఏడుగురు కవులు. వాళ్ళని ‘వెదుళ్ళ తోపులో ఏడుగురు పెద్దమనుషులు ‘ (ఝూలిన్ కిజియాన్ ) అని పిలిచేవారు. వారు ఒక విధంగా డావోయిస్టు సాధువులు కూడా. చీనా రాజధాని లొయాంగ్ కి దగ్గర ఒక వెదుళ్ళతోపులో వాళ్ళు కలుసుకుంటూ ఉండేవారు. వారిలో ఒకడైన జి-కాంగ్ అనే కవికి ఒక కమ్మరి కొలిమి ఉండేది. అక్కడ వాళ్ళు కలుసుకుంటూ కవిత్వ చర్చలు చేసుకుంటూ ఉండేవారు. వారి ముందు ఝౌ చక్రవర్తుల కాలం నాటి గీత సముచ్చయం, కన్ ఫ్యూసియస్ సుభాషితాలు, లావోత్సే డావొ డె జింగ్, దక్షిన ఛైనాలో ప్రభవించిన చూ శబ్దావళి, లావోత్సే గ్రంథానికి జువాంగ్ జే రాసిన వ్యాఖ్యానాలూ, హాన్ చక్రవర్తుల కాలంలో సేకరించిన గ్రామీణ గీతాలూ, రాజ్యదాహంతోనూ, కవిత్వదాహంతోనూ కూడా అల్లల్లాడిపోయిన వెయి రాజకుటుంబం రాసిన గీతాలూ ఉన్నాయి.
 
ముఖ్యంగా చావో-జి రాసిన కవిత్వం. వాళ్ళ హృదయాల మీద ఆ పూర్వకవులూ, ఆ గడచిపోయిన మహాయుగాల సమున్నత జీవితాదర్శాలూ ఒత్తిడి చేస్తూ ఉండేవి. తమ కళ్ళ ఎదట వెయి రాజకుటుంబాన్ని మట్టుబెట్టి పాలన చేజిక్కించుకున్న జిన్ రాజవంశం కనిపిస్తూ ఉండేది. వాళ్ళు ఒకవైపు ఆ హింసనీ, ఆ తిరుగుబాటునీ సమర్థించలేకపోయారు. అలాగని మరొకవైపు సమాజాన్ని పూర్తిగా వదిలిపెట్టానూ వదిలిపెట్టలేకపోయారు. అప్పణ్ణుంచి ఇప్పటిదాకా కూడా చీనా కవిత్వం ఆ నలుగులాట నుంచి బయటపడలేకపోయింది.
 
ఆ అంతః సంఘర్షణకి అద్భుతమైన రూపం ఇచ్చిన కవి రువాన్-జి (210-63). అతడి తండ్రి వెయి చక్రవర్తుల కొలువులో పనిచేసాడు. స్వయంగ కవి. రువాన్-జి కూడా వెయి చక్రవర్తుల కొలువులోనే ఉన్నప్పటికీ, వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన సిమ-యాన్ కి సన్నిహితంగా ఉండేవాడు. సిమా-యాన్ జిన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతడికి తోడుగా ఉన్నందువల్ల రువాన్-జి బతికిపోయాడు. కాని అతడు ఎటువంటి ప్రభుత్వోద్యోగం చేయలేదు. అతడి అంతరంగంలో అతడు వెయి చక్రవర్తుల్ని ప్రేమిస్తున్నాడా, జిన్ చక్రవర్తుల్ని ప్రేమిస్తున్నాడా అన్నది ఎవరికీ ఇప్పటిదాకా కూడా తెలియలేదు. ఆనాటి తన ఆలోచనల్ని అతడు ‘నా అంతరంగ వేదనలు’ పేరిట ఎనభై రెండు పద్యాలుగా రాసాడు.
 
ఆ కావ్యం చీనా కవిత్వవికాసంలో ఒక మలుపు రాయి. అందులో ఆయన తన పూర్వకవుల్ని, గడచిపోయిన మహాయుగాల్ని, తన కాలంలో చారిత్రికంగా తాను ఏ దారి ఎంచుకోవాలో తెలియని అగమ్యాన్ని ఎంతో హృదయంగమంగా చిత్రించాడు. శైలి పరంగా అతడిది చావొ-జి దారి. హాన్ కాలపు పద్యాల్లాగా అయిదు మాత్రల కవితా పంక్తి. కాని ఆ కవిత్వంలో అతడేదో అన్యాపదేశంగా చెప్తున్నాడనుకుంటే మాత్రం, ఏం చెప్తున్నాడో ఇప్పటికీ అర్థం కాలేదు. మరొక వెయ్యేళ్ళు గడిచినా కూడా మనకి అర్థం కాదని చేతులెత్తేసాడు ఒక విమర్శకుడు. డాంటే డివైన్ కామెడీ లాగా అది కూడా సమకాలిక రాజకీయ విమర్శ. వ్యంగ్యోక్తి. కాని దానిలో అటువంటి అర్థాలేవీ వెతికే పనిపెట్టుకోకుండా, దాన్ని ఒక అంతరంగ వేదనగానే చదువుకున్నట్లయితే, ఆ కవిత్వం ఇప్పటికీ ఎంతో కొత్తగా, ఎంతో సన్నిహితంగా వినిపించకమానదు.
 
ఆ కావ్యం నుండి మూడు కవితలు తెలుగులో:
 
1
 
రాత్రంతా నిద్రపోలేకపోయాను.
లేచి కిన్నెర చేతుల్లోకి తీసుకున్నాను.
 
పలచని తెరల్లోంచి ప్రకాశమాన చంద్రుడు
నన్ను రాపాడుతున్న మలయపవనం.
 
ఎక్కడో ఒక ఒంటరి హంసకలకూజితం
ఉత్తరం వైపు అడవుల్లో పక్షుల క్రేంకారాలు.
 
లేచి అటు ఇటూ తిరిగాను, ఏమి చూద్దామని?
వ్యాకులత నా హృదయాన్ని గాయపరుస్తూనే ఉంది. (1)
 
2
 
నా తొలియవ్వనకాలంలో నాకు ఏదో సాధించాలని ఉండేది
కన్ ఫ్యూసియస్ గ్రంథాలు సమస్తం సాకల్యంగా చదివాను.
 
ముతక దుస్తులు ధరించాను, సంపదలు పక్కన పెట్టాను.
కన్ ఫ్యూసియస్ శిష్యుల్లాగా బతకాలని కోరుకున్నాను.
 
కిటికీ తెరిచి చూసాను, చుట్టూ పరుచుకున్న అడవి.
మేడపైకెక్కి ఒకప్పటి నా సన్నిహితుల కోసం వెతుక్కున్నాను.
 
వారి సమాధులతో కొండలన్నీ కప్పడిపోయాయి.
పదివేల ఏళ్ళ తరాలమనుషులక్కడ నిద్రిస్తున్నారు.
 
మరొక వెయ్యేళ్ళు, లేదా శతసహస్ర వర్షాల తర్వాత
ఆ కీర్తిమంతుల యశస్సు ఎక్కడుంటుంది?
 
అప్పుడర్థమయింది ఆ డావోయిస్టు ఏమి చెప్తున్నాడో.
నా చిన్నప్పటి ఆశయాలు గుర్తొచ్చి బిగ్గరగా నవ్వుకున్నాను. (19)
 
3
 
తెల్లవారుతుంది, ఇంతలోనే చీకటి పడుతుంది
సాయంకాలమవుతుంది, ఇంతలోనే పొద్దు పొడుస్తుంది.
 
నా మేని చాయ ముందటిలాగా ఉండదు, మారుతుంది
నా ఉత్సాహోద్వేగాలు శిథిలమై కరిగిపోతాయి.
 
నా హృదయంలో ఉడుకులెత్తుతున్న నీళ్ళూ, నిప్పూ.
నా చుట్టూ సంభవిస్తున్న వెయ్యిన్నొక్క సంగతులు
 
వాటితో సర్దుకుపోవటమెలానో ఇప్పటికీ తెలియట్లేదు.
నా భయమేమిటంటే చూస్తూ ఉండగానే
 
క్షణంలో నా ఆత్మ గాలికి కొట్టుకుపోతుంది.
జీవితం చివరికి నేను మంచుమీద నడవక తప్పదు
 
కాని ఎవరికి తెలుసు? గుండెలో
బడబాగ్ని రగులుతున్నదని? (63)
 
4-3-2022

Leave a Reply

%d bloggers like this: