యుగయుగాల చీనా కవిత-2

గీతసముచ్చయంలో బృహత్ స్తోత్రాలు (దా-యా), లఘుగీతాలు (జియావో-యా) అనే రెండు విభాగాల మధ్యా తేడా ఏమిటనేదానిమీద వ్యాఖ్యాతల్లో ఏకీభావంలేదు. ఒక్కొక్కరూ ఒక్కొక్క కారణం చెప్పారు. కొందరు చెప్పినదాన్నిబట్టి బృహత్ స్తోత్రాలు ఝౌ చక్రవర్తుల దండయాత్రలకి సంబంధించినవనీ, లఘుగీతాలు చిన్న చిన్న రాజ్యాలకు చెందినవనీ. కానీ నాకేమనిపిస్తుందంటే, లఘుగీతాలనాటికి ప్రభువుకోసమో, రాజ్యం కోసమో జీవించడంలోని నిష్టురత్వం, దుర్భరత్వం అనుభవంలోకి రావడం మొదలయ్యిందనీ, అందుకని వాటిని సంకలనకర్తలు ద్వితీయ శ్రేణి గీతాలుగా భావించారనీ. ఇక్కడ పొందుపరిచిన మొదటి గీతం బృహత్ స్తోత్రం. తరువాతి నాలుగు గీతాలూ లఘుగీతాలనుండి తీసుకున్నవి. మొదటి గీతంతో తక్కిన నాలుగు గీతాల్నీ పోల్చి చదివితే ఆ తేడా సూటిగానే తెలుస్తుంది.
 
మరొకమాట కూడా చెప్పాలి. భగవంతుడు తమకు పాలనాధికారం శాశ్వతంగా ఇవ్వలేదని ఝౌ చక్రవర్తులకి తెలుసు. రఘువంశ రాజుల్లాగా ఝౌ చక్రవర్తులకు కూడా ధర్మాన్ని రక్షించడంకోసమే పాలనాధికారం లభించింది. ఒకసారి తాము ఆ ధర్మాన్ని కాపాడలేకపోయిన తర్వాత తమ చేతుల్లో ఆ రాజదండం నిలబడదని వాళ్ళకు తెలుసు. పడమటి ఝౌ కాలం నుంచి తూర్పు ఝౌ కాలానికి వచ్చేటప్పటికే వాళ్ళ సుధర్మాపీఠం బీటలు వారడం మొదలయ్యింది. వారి వెయ్యేళ్ళ పాలనలో చివరికి వచ్చేటప్పటికి, వాళ్ళు కేవలం క్రతువులకోసం మాత్రమే చక్రవర్తులుగా కొనసాగారుగానీ, నిజమైన పాలన సామతరాజుల చేతుల్లోకి వెళ్ళిపోయింది.
 
నలుగురికీ హితం చేకూర్చే ధర్మం కోసం కాకుండా ఒక ప్రభువు కోసం పోరాడవలసి రావడంలోని నరకమే లఘుగీతాల్లో మనకు కనిపిస్తున్నది.
 
1
 

మా ప్రభువుకు జయమగుగాక!

 
మా ప్రభువుకు జయమగుగాక!
ఆయన తన గుణగణాలు వెల్లడించు గాక!
 
ఝౌ ప్రజానీకాన్ని, మానవుల్ని
చక్కగా పరిపాలించు గాక!
 
ఆయనకు స్వర్గంనుండి ఆశీస్సులు లభించుగాక
అవి ఆయన్ను రక్షించుగాక
 
అతడి పాలనను నిలబెట్టు గాక!
అధికంగా ఆశీస్సులు గౌరవం లభించుగాక!
 
పుత్ర పౌత్రాభి వృద్ది కలుగు గాక
వైభవో పేతంగా, గంభీరంగా
పాలన సాగించు గాక!
 
ఏమరుపాటు లేకుండా ఉల్లంఘించకుండా
పురాతన ధర్మ సూత్రాలు పాటించు గాక!
 
ఆయన యశస్సు స్థిరం, దండన కఠినం
రాగద్వేషాలకు అతీతుడు.
 
తన తోటి వారలకు ప్రేమ పాత్రుడు
అపార శుభాశీసులకు అర్హుడు
 
నాలుగుదిక్కులకూ నాథుడు.
ఆయన చేతిలోని రాజ సూత్రం
స్నేహితులకు వరదాయిని,
సకలరాజవంశీకులకు అభయ ప్రదాయని.
 
క్షణం కూడా తన కర్తవ్యాన్ని విస్మరించడు
భగవత్ కృపా పాత్రుడు, విశ్వసనీయుడు.
 
(బృహత్ స్తోత్రం, 249)
 
2
 

వాడిపోని మొక్క ఏది?

 
వాడిపోని మొక్క ఏది?
మేము కవాతు చెయ్యని రోజు ఏది?
 
సరిహద్దుల్ని కాపాడటంకోసం
సైనికుడు కాకతప్పని వాడు ఎవడు?
 
తలవాల్చని మొక్క ఏది?
భార్యనుంచి ఎడబాటుపొందని వాడు ఎవడు?
 
అయ్యో మేము సైనికులం
మమ్మల్నెవరూ మనుషులుగా చూడరేం?
 
మేమేమన్నా పెద్దపులులమా దున్నపోతులమా
ఈ అడవుల్లోనే బతకవలసివస్తోందెందుకు?
 
అయ్యో, మేము సైనికులం
మాకు రాత్రి లేదు, పగల్లేదు.
 
నిలువెత్తు పెరిగిన గడ్డిదుబ్బుల్లో
నక్క ఉరుకుతున్నది, పరుగెడుతున్నది.
 
అడుగులో అడుగువేసుకుంటూ
మేమిట్లా మా బండ్లు ఈడుస్తున్నాం.
 
(లఘుగీతాలు, 234)
 
3
 

కరకురాళ్ళు ఈ గండశిలలు

 
కరకురాళ్ళు ఈ గండశిలలు
ఈ ఎత్తైన కొండలకి
అంతులేదు, నదులకి ఆపులేదు.
ఎంత ప్రయాస, అలసట!
 
కాని తూర్పు దిక్కున పోరాడే సైనికులకు
ఊపిరి పీల్చుకునే వ్యవధి లేదు.
 
కరకురాళ్ళు ఈ గండశిలలు
నిటారైన ఈ కొండలకి
అంతులేదు, నదులకి ఆపులేదు.
అవి ఆగుతాయన్న నమ్మకం లేదు.
 
కాని తూర్పు దిక్కున పోరాడే సైనికులకి
ఆగడానికి వ్యవధి లేదు.
 
దారిలో పందులు, గుర్రాల మందలు
కెరటాలకు ఎదురీదుతున్నవి.
 
వానతెరలో ఇరుక్కున్న చంద్రుడు,
వరద ముంచెత్తబోతున్నది.
 
కాని తూర్పుదిక్కున పోరాడే సైనికులకి
క్షణం కూడా తీరిక లేదు.
 
(లఘుగీతాలు, 232)
 
4
 

పెద్ద పెద్ద రథాల వెనక పరుగుతియ్యకు

 
పెద్ద పెద్ద రథాల వెనక పరుగుతియ్యకు
నీ ఒళ్ళంతా దుమ్మవుతుంది.
 
ప్రపంచ దుఃఖాల గురించి బాధపడకు,
నీకు పిచ్చెక్కుతుంది.
 
పెద్ద పెద్ద రథాల వెనక పరుగుతియ్యకు
నీ కళ్ళల్లో దుమ్ముపడుతుంది.
 
ప్రపంచ దుఃఖాల గురించి బాధపడకు
నీకు మతిపోతుంది.
 
పెద్ద పెద్ద రథాల వెనక పరుగుతియ్యకు
నీ గొంతులో అడ్డు పడుతుంది.
 
ప్రపంచ దుఃఖాల గురించి బాధపడకు
నీ గుండె బరువెక్కుతుంది.
 
( లఘుగీతాలు, 206)
 
5
 

చైత్రానికల్లా వేసవి మొదలవుతుంది

 
చైత్రానికల్లా వేసవి మొదలవుతుంది,
జ్యేష్టం నడిగ్రీష్మం.
 
మనమిట్లా అవస్థ పడుతుంటే
పితృదేవతలకి దయలేదా?
 
హేమంత దినాలు వణికించే చలి
తరువులూ, లతలూ వాడిపోతాయి.
 
క్లిష్టంగా, కష్టంగా గడుస్తున్నరోజులు
నేనింటికి చేరుకోగలిగేదెప్పుడు?
 
శిశిర ఋతువంతా తుపాన్లు, బీభత్సం
హోరెత్తించే సుడిగాలి, వడగాడ్పు.
 
తక్కినవాళ్ళంతా సుఖంగా ఉన్నారు,
మనకొక్కరికే ఎందుకింత నరకం?
 
కొండమీద అందమైన చెట్లు
రావి, జువ్వి, వేప, ఉసిరి.
 
క్రూర పదాతిదళాలు వాటిని నరికేసాయి,
ఎవరికి తెలుసు వాళ్ళ నేరం?
 
ప్రవహిస్తున్న ఆ ఊటనీటిని చూడు
కొన్నిచోట్ల నిర్మలం, కొన్నిచోట్ల కలుషితం.
 
ప్రతి రోజూ పొంచిఉన్న ఉత్పాతం,
మన తల్లిదండ్రుల్ని పోషించుకోడమెట్లాగు?
 
దక్షిణదేశాన్ని కలిపికుట్టిన నదులు
జియాంగ్, హాన్ ప్రవహిస్తున్నవి మునుముందుకు.
 
ఈ వెట్టిచాకిరిలో అలసిపోయాం
మన గోడు ఎవరూ వినరెందుకు?
 
నేనే ఒక గద్దనో, గండభేరుండాన్నో అయిఉంటే
ఈపాటికి స్వర్గానికి ఎగిరిపోదును.
 
నేనొక మీనాన్నో, మహామత్య్సాన్నో అయిఉంటే
ఈ పాటికి పాతాళానికి పల్టీ కొట్టిఉందును.
 
కొండలమీద ఎటుచూడు, బలురక్కసి
కొందకింద విరబూసిన పులికంప.
 
ఏ ఒక్కరికేనా తన కష్టం తెలుస్తుందన్న ఆశతో
ఒక పెద్దమనిషి అల్లుకున్నాడీ కూనిరాగాన్ని.
 
(లఘుగీతాలు, 204)
 
9-2-2022

Leave a Reply

%d bloggers like this: