యుగయుగాల చీనా కవిత-1

Reading Time: 5 minutes
సంస్కృత సాహిత్యానికీ, భారతీయ సంస్కృతికీ ఋగ్వేదం ఎలానో, జపనీయ సాహిత్యానికి మన్యోషూ ఎలానో, తమిళ సాహిత్యానికి సంగం కవిత్వం ఎలానో, చీనా సాహిత్యానికీ, సంస్కృతికీ ‘షీ జింగ్’ అలాంటిది. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి చెందిన షీ జింగ్ ని గీత సముచ్చయం అనవచ్చు. కన్ ఫ్యూషియస్ సంకలనం చేసాడని చెప్పే ఈ రచన కన్ఫ్యూసియస్ కన్నా ముందే సంకలనమయింది.
 
ప్రాచీన చీనా సాహిత్యం మౌఖిక రూపం నుంచి లిఖిత రూపానికి పరివర్తన చెందే కాలంలో, పౌరాణిక కాలం నుంచి చారిత్రిక యుగాల్లోకి ప్రవేశిస్తున్న కాలంలో రూపుదిద్దుకున్న గీతాలు అవి. అందులో ప్రాచీన చైనా సంపూర్ణంగా కనిపిస్తుంది. క్రీ.పూ. 11 వ శతాబ్దం నుండి 6 వ శతాబ్దందాకా దాదాపు అయిదువందల ఏళ్ళ పాటు ఆ గీతాలు ప్రభవించాయి. అవి ఒక సంకలనంగా రూపొందిన తరువాత కూడా మరొక నాలుగు శతాబ్దాల పాటు మార్పుకులోనవుతూనే ఉన్నాయి. అంటే దాదాపు వెయ్యేళ్ళ కాలంలో ఎందరో కవులు, సంగీతకారులు, గాయకుల చేతుల్లో రూపుదిద్దుకున్న గీతాలవి.
 
చీనా వరదాయిని, దుఃఖదాయిని అని పేరుపడ్డ పచ్చ సముద్ర తీరంలో చైనా నాగరికత ప్రభవించింది. అయిదువేల ఏళ్ళ కిందట పౌరాణిక యుగంలో దేవతలే చక్రవర్తులుగా మొదలుపెట్టిన చైనా పరిపాలన ఆ తరువాత జియా, షాంగ్ లేదా యిన్ అనే మరొక రెండు రాజవంశాల పాలన గడిచిన తరువాత ఝౌ రాజవంశం చేతుల్లోకి వచ్చింది. క్రీ.పూ పన్నెండవ శతాబ్దంలో మొదలైన ఝౌ రాజవంశం దాదాపు వెయ్యేళ్ళ పాటు చైనాను పరిపాలించింది. చైనా అంటే మనకు తెలిసిన పరిపాలన, సాహిత్యం, కళలు ఒకటేమిటి, సమస్త చైనా సంస్కృతిని ఝౌ పాలకులే రూపొందించారంటే అతిశయోక్తి కాదు.
 
క్రీ.పూ పన్నెండవ శతాబ్ది నుండి ఎనిమిదవ శతాబ్దిదాక ఝౌ పడమటి ఝౌ సామ్రాజ్యంగా విలసిల్లింది. ఆ తర్వాత వారు తూర్పు వైపు కూడా విస్తరించి మరొక ఆరువందల ఏళ్ళు పరిపాలించారు. ఆ కాలాన్ని తూర్పు ఝౌ పాలనా కాలంగా చెప్పుకుంటారు. కాని ఆ కాలమంతా ఝౌ సామ్రాజ్యం అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి నెమ్మదిగా బలహీనపడటం మొదలుపెట్టింది. అందులో మొదటి నాలుగు వందల ఏళ్ళ కాలాన్ని వసంత-హేమంతాల యుగంగానూ, ఆ తర్వాత మరొక రెండువందల ఏళ్ళ కాలాన్ని సమరశీల రాజ్యాల కాలంగానూ పిలుస్తారు. ఆ కాలానికి వచ్చేటప్పటికి ఝౌ సామ్రాజ్యం ఏడు చిన్న రాజ్యాలుగా విడిపోయి అవి ఒకదానితో ఒకటి కలహించుకుంటూ చివరికి వాటిల్లోని చిన్ అనే రాజ్యం క్రీ.పూ 221 నాటికి తక్కిన రాజ్యాలన్నిటినీ జయించి చిన్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడంతో ఝౌ పాలన ముగిసిపోయింది.
 
ఝౌ పాలన మొదలుకావటానికి పూర్వం షాంగ్ కాలం నాటి పౌరాణిక-చారిత్రిక జ్ఞాపకాలతో మొదలై, ఝౌ పాలనాకాలం నాటి సామాజిక- రాజకీయ అనుభవాల్ని ప్రతిబింబిస్తూ గీతసముచ్చయం రూపొందింది. అందులో 305 గీతాలున్నాయి. వాటిలో పాటలు, స్తోత్రాలు, మంత్రాలూ కూడా ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాచీనమైన విభాగం మంత్ర విభాగం. 305 గీతాల్లోనూ 266 నుంచి 305 దాకా గీతాలు పడమటి ఝౌ పాలనా కాలంలో అంటే క్రీ.పూ 11 వ శతాబ్దినుండి 7 వ శతాబ్ది మధ్యకాలంలో ప్రభవించాయి. వాటిల్లో మొదట ఝౌ సూక్తాలు (266-96), తర్వాత షాంగ్ సూక్తాలు (301-305), ఆ తర్వాత లూ సూక్తాలు (297-300) రూపుదిద్దుకున్నాయి.
 
మరొకవైపు ఝౌ చక్రవర్తులు తమ పాలన గురించి ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారో తెలుసుకోవడం కోసం గాయకుల్నీ, సంగీతకారుల్నీ తమ రాజ్యమంతటా పంపించేవారు. అలా వెళ్ళినవారు పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ప్రజలు పాడుకునే పాటల్ని సేకరించి తిరిగి వచ్చి రాజుకి వినిపించేవారు. షీ-జింగ్ లోని మొదటి 160 గీతాలూ అటువంటి పాటలే. వాటిని గు-ఫెంగ్ అంటారు. ఫెంగ్ అంటే గాలి, పవనాలు. గు అంటే ప్రాంతాలు. వివిధ ప్రాంతాల్లో వీస్తున్న పవనాల సమాహారం అని దానికి అర్థం చెప్పుకోవచ్చు. మొత్తం పదిహేను ప్రాంతాలకి చెందిన ఆ పాటలు ప్రజలు పాడుకునే పాటలు. బహుశా ప్రపంచంలో ప్రజాసాహిత్యానికి చెందిన ఇంత ప్రాచీన సంకలనం ఇదేనేమో.
 
అటువంటి ప్రజాగీతాలు రాజాస్థానాలకు చేరినప్పుడు, నగరాల్లో ఉన్న గాయకులు, ప్రాచీన మంత్రాలనీ, ఈ గ్రామీణ గీతాల్నీ కలుపుకుంటూ స్తోత్రాలు రాసారు. గీతసముచ్చయంలో 161 నుండి 265 దాకా ఉన్న ఆ స్తోత్రాల్లో 161 నుండి 234 దాకా లఘుగీతాలు, వాటిని ‘జియావోయా’ అనీ, 235 నుండి 265 దాకా ఉన్న బృహత్ స్తోత్రాల్ని ‘దాయా’ అని పిలుస్తారు.
 
సంస్కృతం, గ్రీకు, లాటిన్, పారశీకాల్లోలాగా ప్రాచీన చీనాకి ఒక ఇతిహాసమంటూ లేదు. కాని, గీత సముచ్చయాన్ని దానికదే ఒక ఇతిహాసమనవచ్చు అంటాడు స్టీఫెన్ ఓవెన్. ఒక సమాజం రూపొందే కాలం నాటి సమస్త అనుభవాల్నీ ప్రతిబింబిస్తూ, ఆ జాతికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించడమే ఇతిహాసం తాలూకు ప్రయోజనం అనుకుంటే గీత సముచ్చయం ఆ పనిని ఎంతో సమర్థవంతంగా నిర్వహించింది. కన్ ఫ్యూసియస్ కాలం నాటికే అది దాదాపుగా ఒక నైతిక అధికారాన్ని సంపాదించుకోగా, క్రీ.పూ రెండవ శతాబ్దంలో హాన్ పాలనా కాలం నాటికి అది ఒక పౌరస్మృతిగా, జీవనగీతగా మారిపోయింది.
 
మహాభారతాన్ని అనుసృజించడానికి పూనుకుంటూ నన్నయ భారతం గురించి చెప్పినమాటలే మనం గీతసముచ్చయం గురించి కూడా చెప్పుకోవచ్చు. అది ధర్మశాస్త్రజ్ఞులకి ధార్మిక గ్రంథం. సామాజిక శాస్త్రజ్ఞులకి సామాజికచరిత్ర, కవిత్వప్రేమికులకి అత్యుత్తమ కవిత్వం. అందులో ఒక జాతి తాలూకు సమస్త అనుభవాలున్నాయి. వాటిలో ఎవరి అభిరుచికి తగ్గట్టుగా వారు ఆ గీతాల్ని ఎత్తి చూపిస్తారు. ఆధునిక యుగంలో పాశ్చాత్య ప్రపంచానికి ఈ గీతాలు పరిచయం అయ్యాక వారు అందులోని ప్రేమ గీతాల్ని చూసి ఎక్కువ మురిసిపోయారు. నేను అటువంటి అనువాదాలు చదివి మొదట్లో గీతసముచ్చయం గాథాసప్తశతిలాగా ఒక గ్రామీణ ప్రేమకావ్యం అనుకున్నాను. కాని నిర్బంధ శ్రమ, పీడన, దోపిడీ, తమ స్వజనాన్ని వదిలి రాజ్యాన్ని రక్షించడంకోసం జీవితమంతా సైనికసేవలో గడపవలసివచ్చే దుర్భరానుభవాలు కూడా ఆ గీతాల్లో ఉన్నాయి. కమ్యూనిస్టు చైనాలో ఆ గీతాలనుంచి ఎంపికచేసిన అనువాదాల సంకలనమొకటి కొన్నేళ్ల కిందట సంపాదించాను. Selections from The Book of Songs, పండా బుక్స్, 1983. ఆ సంకలనంలో అనువాదకులు దాదాపుగా సామాజిక అసమ్మతి గీతాల్నే ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించలేదు.
 
గీత సముచ్చయానికి ఇంగ్లిషులో చాలా అనువాదాలు వచ్చాయి. వాటన్నటిలోనూ ప్రసిద్ధి చెందిన అనువాదం ఆర్థర్ వేలీ వెలువరించిన Book of Songs (1937). కానీ తన అనువాదంలో వేలీ మూలగ్రంథంలోని గీతాల అమరిక బదులు వివిధ అంశాల వారీగా కవితల్ని వర్గీకరించాడు. అలాగే కొన్ని కవితల్ని అనువాదం చేయకుండా వదిలిపెట్టేసాడు. ఆ లోటు పూరిస్తూ, అతడు వదిలిపెట్టిన కవితల్ని కూడా అనువదించి మూలగ్రంథంలోని అమరిక ప్రకారమే జోసెఫ్ ఆర్ ఎలెన్ అనే ఆయన Book of Songs పేరిట 1996 లో వెలువరించాడు. దానికి ప్రసిద్ధ చీనా సాహిత్యవేత్త, అనువాదకుడు స్టీఫెన్ ఓవెన్ అద్భుతమైన పరిచయమొకటి పొందుపరిచాడు. దాంతో పాటు మూడువేల ఏళ్ళ చీనా సాహిత్య చరిత్రలో గీత సముచ్చయం పఠనం ఏ విధంగా పరిణమిస్తో వచ్చిందో ఒక సమగ్ర చారిత్రిక విశ్లేషణ కూడా జోసెఫ్ ఎలెన్ ఆ పుస్తకంలో జోడించాడు.
 
ఝౌ పాలనా కాలం ముగిసిపోయాక హాన్ రాజవంశ పాలన మొదలై, నేటి కమ్యూనిస్టు పాలనదాకా దాదాపు రెండున్నర వేల ఏళ్ళ చైనా కవిత్వాన్నీ, సాహిత్యాన్నీ అర్థం చేసుకోవడానికి గీతసముచ్చయమే ప్రాతిపదిక. ఆ గీతాలూ, అందులోని భావాలూ, అవస్థలూ, ఆ గీతాల పేరిట నిర్దేశించిన నియమాలూ, వాటి ఉల్లంఘనలూ-చీనా కవిత్వమూలధాతువులు.
 
ప్రాచీన చీనాజనుల దృష్టిలో కవిత్వమంటే ఏమిటి? అది కళ కాదు, కవులు అనే ఒక ప్రత్యేకమైన తరగతి సృష్టించే పదవిన్యాసమూ కాదు. గీత సముచ్చయం ప్రకారం కవిత్వమంటే మనసులో కలుగుతున్న భావాలకు మనమిచ్చే అక్షర రూపం (జింగ్). అది ఎంత నేరుగా, సూటిగా ఉంటే అంతగా ఎదటివాళ్ళ హృదయానికి హత్తుకుంటుంది. ఆ సూటిదనం, ఆ సారళ్యం ఒక అతీతకాలానికి చెందిన ఒక స్వాప్నిక స్వర్ణయుగలక్షణం. ఆధునిక కాలంలో, అంటే మన కాలంలో, మనం జీవితానుభవాల్ని ఎంత సంక్లిష్టంగా చెప్పగలిగితే అంత లోతుగా జీవించినట్టుగా భావిస్తాం. కాని ఒకప్పటి మానవుడు జీవితానికి మనకన్నా మరింత చేరువగా ఉన్నాడనీ, అతడు తన హృదయంలో చెలరేగుతున్న భావాలకు అక్షరరూపం ఇవ్వడానికి ఎటువంటి సంకోచాలకూ లోను కాలేదనీ గీతసముచ్చయం సాక్ష్యమిస్తుంది. వరాల్నీ, శాపాల్నీ, రెండింటినీ, సమానంగా హృదయానికి పొదువుకున్న సమష్టి జీవన సంగీతం అది.
 
గీతసముచ్చయం గీతాల ఛందస్సు గురించి ఒక మాట చెప్పాలి. ఆ గీతాల్లో ప్రతి పంక్తిలోనూ నాలుగు పదాలుంటాయి. పదం అంటే చైనీయ చిత్రాక్షరమన్నమాట. ప్రతి రెండు పదాల మధ్యా ఒక విరామం ఉంటుంది. రెండేసి పంక్తులతో ఒక పద్యపాదం పూర్తవుతుంది. ప్రతి పాదానికీ అంత్యప్రాస ఉంటుంది. ఆ రెండు పాదాలూ దాదాపుగా ఒక్కలానే ఉంటాయి. అంటే మొదటి పాదంలో నామవాచకం, క్రియాపదం, విశేషణం ఏ అమరికలో ఉంటే రెండవ పంక్తిలో కూడా అదే అమరికలో ఉంటాయి. అటువంటి అనురూపత షి ఛందస్సు ముఖ్యలక్షణం. సంస్కృత ఇతిహాసాల్లోని అనుష్టుప్పులా షి ఛందస్సు దాదాపు వెయ్యేళ్ళ పాటు నిరాఘాటంగా కొనసాగింది, తర్వాత రోజుల్లో హాన్ వంశ పాలనా కాలంలో అయిదు పదాల పద్యపాదం తలెత్తేదాకా.
 
గీతసముచ్చయం నుంచి కొన్ని కవితల్ని అనువదించడానికి ఏవి ఎంపికచేసుకోవాలి, ఏవి వదిలిపెట్టాలనేది పెద్ద సమస్య. ప్రతి ఒక్కటీ విలువైన కవితనే. అయినప్పటికీ, ఆ గీతాల్లోని నాలుగు విభాగాలనుంచీ కొన్ని కవితల్ని ఎంపిక చేసి మీ కోసం తెలుగులో అందిస్తున్నాను. ముందుగా ఆ సంకలనంలోని అత్యంత ప్రాచీన మైన నాలుగు సూక్తాలు:
 
~
 
1
 

పుష్కలం ఈ ఏడాది

 
పుష్కలం ఈ ఏడాది, సుసంపన్నం.
విరగపండాయి ధాణ్యాలు, తృణధాన్యాలు
కోటి కోటి కంకులు, శతసహస్ర ధాన్యపురాశులు
కొలిచిపొయ్యడానికి నిలువెత్తు గాదెలు.
పానీయాలతో, పరమాన్నాలతో
పితృదేవతలకు, మాతృదేవతలకు
హవిస్సులు సమర్పిస్తాం.
అన్ని యజ్ఞాలూ నిర్విఘ్నంగా కొనసాగేక
అపారమైన శుభాకాంక్షలతో
ఆకాశం మమ్మల్ని ఆశీర్వదిస్తుంది.
 
( ఝౌ సూక్తం, 279)
 
2
 

ప్రభావంతుడు నా తండ్రి

 
ప్రభావంతుడు నా తండ్రి, ఇప్పుడు దేవత,
అతడి దారిలో నడవాలని కోరుకుంటున్నాను.
 
నేను జీవిస్తున్న జీవితం నాకు తృప్తినివ్వడం లేదు
నాకప్పగించిన పని నేనింకా పూర్తి చేయలేదు.
 
నా కర్తవ్యంలో నాకు సాయపడండి
మీ ఆశయాలు నెరవేర్చడంలో
ఏమరుపాటు చూపించాను, సోమరితనం చూపించాను
కాని నేను మీ బిడ్డని.
 
నా ఇంటిని చుట్టబెట్టే ఈతిబాధలముందు నిలవలేకపోతున్నాను.
మీరేమో భగవద్ప్రాంగణ విహారులు
ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు
అక్కడికి పోగలరు, రాగలరు.
 
తల్లిదండ్రులారా, అనుగ్రహించండి,
నన్ను రక్షించండి, తోవ చూపించండి.
 
(ఝౌ సూక్తం, 287)
 
3
 

మహిమాన్వితులు ఝౌ ప్రజలు

 
మహిమాన్వితులు, బలోపేతులు ఝౌ ప్రజలు
మహాపర్వతశ్రేణులు అధిరోహించారు.
 
కొండలూ, కోనలూ తరించారు
గర్జిస్తున్న నదీప్రవాహాలనడుమ సంచరించారు.
 
ఆకాశం కింద ఉన్న ఈ అవని అంతా
సిద్ధంగా ఉన్నది ఝౌ ప్రజానీకంకోసమే.
 
( ఝౌ సూక్తం, 296)
 
4
 

ఎంత సంతోషం, ఎంత ఉత్సాహం

 
ఎంత సంతోషం! ఎంత ఉత్సాహం!
మేము మా తంబురాలు, భజంత్రీలు సిద్ధం చేసుకున్నాం.
 
మహిమాన్వితులైన మా పితృదేవతల కోసం
మా మంగళవాద్యాలు మరింత గట్టిగా, బిగ్గరగా మోగించాం.
 
తాంగ్ వంశ వారసుడు మాకోసం అవతరించాడు,
అతడు మాకోసం ఎన్నో విజయాలు పోగుచేసాడు.
 
ఎక్కడ చూడు తంబురాల, మృదంగాల తుములధ్వని
ఈలపెడుతున్న వేణువులు.
 
మా తప్పెట్లలో, తాళాలతో
ఎక్కడ చూడు మంగళకర సంగీతం.
 
జేగీయమానుడైన తాంగ్ వారసుడు,
శోభాసమన్వితం ఆతడి సంగీతం.
 
మంగళమయ ఘంటారావం, శంఖధ్వానం
వైభవోపేతమైన ప్రజానాట్యం.
 
ఇవాళ మా ప్రాంగణానికి అతిథులు విచ్చేసారు
వారిలోనూ పట్టలేనంత ఉత్సాహం, సంతోషం.
 
ఏనాడో మా పూర్వమానవులు ఏ అతీతయుగాల్లానో
ఈ జీవితాన్ని మొదలుపెట్టారు.
 
ఎంతో వినయంతో, శ్రద్ధతో, అహర్నిశం
తమ పనులు తాము నెరవేర్చారు.
 
నేడు నిలబడ్డారు తాంగ్ వంశ వారసులు వారిముందు
హవిస్సులతో, నవాగ్రాయణ నైవేద్యాలతో.
 
మా ప్రార్థనలు ఫలించుగాక
ఆశీర్వచనాలు అపారంగా వర్షించుగాక!
 
(షాంగ్ సూక్తం, 301)

Leave a Reply

%d bloggers like this: