మేఘా రావు

Reading Time: 2 minutes
నిన్న నాకో మిత్రురాలు ఏదో చెప్తో మేఘా రావు అనే ఆమె చదివిన కవితలోంచి ఒక పంక్తి పంపించింది. ‘ఈమె పేరు నువ్వు వినలేదా? ఇప్పుడు యూట్యూబు లో సెన్సేషన్ ఈమె’ అని చెప్పింది.
 
ఆ కవితా వాక్యం, అంతకన్నా ముఖ్యంగా ఆ కంఠ స్వరం నన్ను ఆకట్టుకున్నాయి. వెంటనే యూట్యూబు తెరిచాను. మేఘారావు కవితలు, వట్టి కవితలు కావు, ఆమె performances. మొదటి కవిత వినగానే నాకు చలికాలం తర్వాత మొదటిసారిగా నునువెచ్చగా తాకే మాఘమాసపు గాలి వంటిని తాకినట్టనిపించింది.
 
కొత్త తరం, కొత్త కవిత్వం. కాని అవే సన్నివేశాలు, అవే పరితాపాలు, శకుంతల నుంచి మేఘారావుదాకా.
ఆమె కవిత ఒకటి మీ కోసం తెలుగులో.
 
~
 

ముద్దు పెట్టుకున్నంత మాత్రాన ప్రేమించినట్టు కాదు

 
నిన్ను ముద్దు పెట్టుకోవడం అంటే పీకల్లోతు మత్తులో
నా హృదయాన్ని నీ ముందు పరిచేయడం
నువ్వంటే నాకిష్టం నాకిష్టం నాకిష్టం.
కారు అద్దాలు తెరిచి పెట్టుకొని సముద్రం ఒడ్డమ్మటే ప్రయాణించడం
అంతా బంగారు పసుపు, బంగారు పసుపు, బంగారు పసుపు.
నీ జుత్తులో ఈల వేస్తూ గాలి, గాలంతా దీపాలు
కానీ నీకు మరెక్కడా కాదు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది‌.
 
కార్లో ఇంటికి తిరిగి వస్తున్నంతసేపు నేను ఏడుస్తూనే ఉన్నాను
ఎందుకంటే ఇది ఎక్కడికి దారి తీస్తుందో నని భయపడుతూనే ఉన్నాను
నువ్వేమో ‘ఊరుకో’, ‘ఊరుకో’, ‘ఊరుకో’ అంటున్నావు
ముద్దు పెట్టుకున్నంత మాత్రాన ప్రేమించినట్టు కాదు అంటున్నావు.
పైగా మరొక్కసారి కావాలంటున్నావు
నేను నిన్ను ఒకింత తడబడుతూ బెరుగ్గా చూస్తాను
ఎప్పుడు?
 
తొందర తొందరగా మా మా ఇంటికి చేరుకుంటాను
నీ గురించి అడుగుతుంది మా అమ్మ, నువ్వేమీ కావంటాను.
నీ బుగ్గల గులాబిరంగు నన్నెట్లా తలకిందులు చేసిందో ఆమెకు చెప్పలేను
నీ కళ్ళల్లో వాగ్దానాలు నా రక్తాన్ని ఉరకలెత్తించాయని చెప్పలేను
ఓహ్! మన భుజస్కంధాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని మరీ
కవిత్వం రాయాలనిపిస్తుంది నాకు.
మనమిట్లానే ఎప్పటికీ జ్వలిస్తూ ఉండాలని ఉంటుంది నాకు
నీ ముఖం లోకి నా ముఖం పెట్టి కలిసి మేల్కొనే సెలవు దినాలు
అవి మనం కలిసి ఆడుకున్న ఆటల్లానూ పాటల్లానూ ఉంటాయి
ఒలింపిక్ వలయాల్లాగా ఒక దానికొకటి చుట్టుకుపోయే మన మోచేతులు
దారాలు లాగా ముడిపడ్డ వేళ్ళు
మీ అమ్మ ఇంట్లో తయారుచేసిన చాక్లెట్ లాగా
మీ నాన్న జేబులోంచి నువ్వు దొంగిలించే రహస్యం లాగా
నా భుజాలకి అంటుకుపోయే నీ పెదాలు.
 
మనం మళ్ళీ రెండోసారి కలుసుకున్నప్పుడు
నేను నిన్ను మరింత దగ్గరగా ముద్దు పెట్టుకున్నాను
తోడేళ్లలాగా ఊళపెట్టే నా దంతాలతో ముద్దు పెట్టుకున్నాను
నా చేతులతో, పక్కటెముకలతో ముద్దుపెట్టుకున్నాను
కసితీరా నా తలని బాదుకున్నట్టుగా
నా ఎముకలతో ముద్దుపెట్టుకున్నాను
ప్రేమలో మునిగి పోతున్నట్టుగా ముద్దుపెట్టుకున్నాను.
 
కానీ నాకు తెలుసు
సరిగ్గా మగవాళ్ళు పారిపోయేది ఇక్కడే
నాకు తెలుసు కేవలం నిర్జీవులు మాత్రమే
చేరుకునే చోటు అది, అది కూడా ప్రార్థించడం కోసం.
నేను కొద్దిగా అతిగా ఉన్నానన్నావు
నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేసానన్నావు
నువ్వు కోరుకునే సమాప్తి ఇదే అన్నట్టుగా
నిన్ను గట్టిగా కరిచి పట్టుకున్నానప్పుడు.
నా చేతులు విద్యుత్ ప్రసారాన్ని ఆపేస్తాయి
నీకేమో చీకటంటే పడదు.
నువ్వు అట్లా ప్రయాణిస్తూనే ఉండాలంటావు.
నేను ఎక్కడో ఒక చోట ఆగాలంటాను.
ఆగు ఆగంటాను
నువ్వు నాకేసి చూస్తావు, సందేహంగా,
ఒకింత బెరుగ్గా.
 
ఇప్పుడేదో తేడాగా కనిపిస్తున్నది
ముద్దు పెట్టుకోవడం అంటే నేను నిన్నో ప్రశ్న అడగడం
నువ్వు ఎప్పటికీ జవాబు చెప్పని ప్రశ్న అది
నీలో ఆ ఉద్విగ్నత అంతా ఎక్కడికి పోయింది?
ముద్దు పెట్టుకోవడం అంటే ఏదో ఒక బండి ఆపి ఎక్కెయ్యడం
ఆ దారిలో ముందెక్కడో ఒక ప్రమాదం పొంచి ఉంది
బస్సు ఎక్కి తిరిగి ఒక్కర్తినీ ఇంటికి వస్తున్నప్పుడు
నాకు నేను మరోమారు చెప్పుకుంటాను
కేవలం ముద్దు పెట్టుకున్నంత మాత్రాన ప్రేమించినట్టు కాదని
మా అమ్మ నీ గురించి అడుగుతుంది నువ్వంటూ లేవని చెప్తాను
రోజులు గడుస్తుంటాయి
ఇప్పుడు నువ్వు ఎవరి ముఖం చూస్తూ మేల్కొంటున్నావు
మనిద్దరం బానే ఉన్నామని మీ అమ్మ మా అమ్మతో చెప్తుండటం విన్నాను
అదేమిటో నీకింక ఆటలంటే ఇష్టం పోయిందని కూడా విన్నాను
చాక్లెట్ అంటేనూ, కవిత్వమంటేనూ, చివరికి… నేనంటే కూడా.
 
నీకు ఒక సంగతి చెప్పాలి
నువ్వు నాకు మరీ కావాలనిపించినప్పుడు
సముద్ర తీరానికి పరిగెడతాను
అక్కడంతా బంగారు పసుపు, బంగారు పసుపు, బంగారం, పసుపు
అబ్బా ఎంత అందంగా ఉంటుందని.
కానీ నా కిటికీ అద్దాలు ఇంకెంత మాత్రం తెరిచి పెట్టను.
బహుశా ఇప్పుడు ముద్దు పెట్టుకోవడానికి
నీకు ఒక అమ్మాయి దొరికే ఉంటుందనుకుంటాను
నువ్వు ఎట్లా కోరుకుంటావో అట్లా ముద్దు పెట్టుకునే అమ్మాయి
ఒకింత సంకోచంగా, ఒకింత బెరుగ్గా,
ప్రేమ తో సంబంధం లేకుండా
నిన్ను ముద్దు పెట్టుకోవడానికి
నీకో అమ్మాయి దొరికే ఉంటుంది.
 
2-2-2022
 
 

Leave a Reply

%d bloggers like this: