తేరే బినా జిందగీ..

కొన్ని పుస్తకాలు బహుశా కొన్ని సమయాలకోసం ఎదురుచూస్తుంటాయి అనుకుంటాను. నిన్నంతా 102 డిగ్రీల టెంపరేచర్, తెల్లవారేటప్పటికి జ్వరం తగ్గిందిగాని నీరసం లేవనివ్వలేదు. ఆఫీసుకి ఎట్లాగేనా వెళ్ళాలనుకున్నవాణ్ణి ఇక సెలవు మెసేజి పంపించాక, అప్పుడు, The Classical Music పేజిలో షకీల్ బదాయుని పాట కనిపించగానే, చప్పున గుర్తొచ్చాడు పరేష్ దోశీ. ఎన్నాళ్ళయింది అతడు తన పుస్తకం ‘ తేరే బినా జిందగీ..’ (2019) నాకు పంపించి! ఆ పుస్తకం అట్లానే ఎదురుచూస్తూ ఉంది అవతల గదిలో అల్మారులో. ఒక్క ఉదుటున లేచి వెళ్ళి చూసాను, ఆ అలమారులో ఎక్కడ ఏ అరలో ఉందో, నా కళ్ళకే కాదు, వేళ్ళకి కూడా గుర్తే.
 
తీరా పుస్తకం చేతుల్లోకి తీసుకున్నాక, చదవడానికి గంటసేపు కూడా పట్టలేదు. కాని ఆ గంట ఇన్నాళ్ళకు సమకూరింది!
 
మనుషుల్లో కొందరికి సంస్కారం ఆభరణం. పూర్తిపాలరాతిలో చెక్కిన తీర్థంకర శిల్పం లాంటి Paresh Doshi నిలువెల్లా సంస్కారి. ఎంత మృదువైన మనిషి! ఎంత మృదువుగా మాట్లాడతాడు! ఎంత మృదువుగా స్పందిస్తాడో, ఇదిగో, ఈ పుస్తకం చదివితే మరింత బాగా అర్థమయింది.
తెలుగు సాహిత్యకారులమీద నాకున్న ఫిర్యాదు ఏమిటంటే, పదహారేళ్ళనుంచి పాతికేళ్ళ మధ్య వయసులో ఉన్న యువతీయువకులకి జీవితం మీద ప్రేమనీ, ఇష్టాన్నీ, తాము ఇష్టపడ్డవారికోసం ఏదన్నా చెయ్యాలన్న ఉత్సాహాన్నీ కలిగించే రచనలు చెయ్యరని. అట్లాంటి నవలలుగాని, కథలు కాని, కావ్యాలు గాని నా దృష్టికి వచ్చినవి చాలా తక్కువ. కాని ఇదిగో, ఇప్పుడేం చెప్తానంటే, అట్లాంటి యువతీయువకులు మీకు తారసపడితే ఈ పాటల పుస్తకాన్ని వాళ్ళకి కానుక చెయ్యండి అని. అంతేనా? మీరేదన్నా పెళ్ళికి అతిథిగా వెళ్తే ఆ నూతనవధూవరులకి ఈ పుస్తకాన్ని కానుక చెయ్యండి అని.
 
అలాగని ఇవన్నీ ప్రేమగీతాలనుకునేరు! ఇందులో వివాహానికి అవతల సంబంధాలూ, అట్లాంటి సంబంధాలు కలిగించగల వ్యథలూ, వాటిల్లోంచి పుట్టినపాటలే చాలా వరకూ. అయినా కూడా ఈ పాటలు వినాలనీ, ఈ పాటల్ని వినడంతో ఆగిపోకుండా, ఆ మాటల అర్థాలేమిటో తెలుసుకోవాలనే చెప్తున్నాను. ఎందుకంటే, అన్నిటికన్నా ముందు అసలు హృదయం స్పందించడమంటే ఏమిటో ఈ పాటలు చదివితే తెలుస్తుంది. ఏకకాలంలో ఒక్కసారే ‘ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై/ ఆజ్ ఫిర్ జీనే కీ ఇరాదా హై ‘ అని అనుకోవడమేమిటో అర్థమవుతుంది.
 
‘కవిసంగమం’ వారి కోసం వారం వారం ఒక సినిమా పాటని పరిచయం చేస్తూ పరేశ్ దోశీ రాసిన వ్యాసాల్లోంచి ఎంపిక చేసిన పాతిక పాటల పరిచయాలివి. ‘హిందీ సినిమా పాటలలో స్త్రీపురుష సంబంధాలు’ అనే ఇతివృత్తం తీసుకుని దానికి తగ్గట్టుగా ఏరిన వ్యాసాల సంపుటం. ఇందులో 1954 నుంచి 2015 దాకా అరవై ఏళ్ళ హిందీ చలనచిత్ర చరిత్రలోంచి ఎంపిక చేసిన పాటలున్నాయి. ఒక గాలిబ్ గజల్ కూడా ఉంది. ఈ పాటలు కనీసం రెండు మూడు తరాల భారతీయుల ఆశల్నీ, ఆకాంక్షల్నీ, ప్రేమల్నీ, పరితాపాల్నీ ప్రతిబింబిస్తున్నాయి. కాని ఆ పాటలు ఏ హృదయంలో ప్రతిఫలిస్తున్నాయో, ఆ హృదయం నాకు మరింత ప్రేమాస్పదంగా గోచరించడంలో ఆశ్చర్యమేముంది? ఎందుకంటే, ఒక చోట, అతడే ఇలా అంటున్నాడు:
 
‘వొక పాట అంటే ఇదీ కథ అని వొక విషయాన్ని చెప్పేయడం కాదు కదా. ఆ సందర్భంలో మనసులో లేచే వర్ణసముదాయాన్నంతా యెత్తి సాంద్రంగా వొక ఇంద్రధనుస్సులా అల్లి మనముందు నిలబెట్టడం కాదూ? (పే.82)
 
అవును. ఇంద్రధనుస్సుకన్న మించిన spectrum ఇందులో ఉంది. కొన్ని పాటల్ని తలపోస్తూ అతడు రాసిన వాక్యాలు నన్ను నివ్వెరపరిచేవిగా ఉన్నాయి.
 
‘ఈ సామాజిక కట్టుబాట్లు తెలవని ఆ బాల్యంలో రాజు, రోజీల ప్రేమను అర్థం చేసుకున్నా, అభ్యంతరాలన్నీ ఈ సామాజిక యెరుక కలిగిన పెద్దవయసులోనే కదా అనిపిస్తుంది. పెద్దయాక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడమే ఒక సవాలు.’ (పే.14)
 
‘ఆశ్చర్యం ఏమిటంటే చాలా సాంప్రదాయిక సమాజాల్లో, సమయాల్లో, ధిక్కార స్వరం ప్రస్ఫుటంగా ఉంటే, ఇప్పటి ప్రగతిశీల, ఉదారసమాజంలో, సమయంలో తత్ విరుద్ధంగా ఉండటం..’ (పే.70)
 
‘ఈ విధంగా నాలో చిన్నవయసులోనే perspective ను విశాలపరుచుకునే అవకాశమిచ్చాడు సాహిర్. ఈ వయసులో నేను వ్రాయడం కాదు, చిన్నవయసులో ఆలోచించేలా చేశాడే అదీ…'(పే.92)
 
ఈ పాటల్లో కొన్ని నాకెంతో ఇష్టమైనవి, నేనెన్నో సార్లు విన్నవి. కొన్ని ఇప్పుడే మొదటిసారి పరిచయమైనవి, ఇంకా వినవలసి ఉన్నవి. ఒక పాటని ఎలా వినాలో తెలుసుకోవాలనుకున్నవాళ్ళూ, ఎలా రాయాలో నేర్చుకోవాలనుకునేవాళ్ళూ కూడా భరత్ వ్యాస్, శైలేంద్ర, మజ్రూ సుల్తాన్ పురీ, షకీల్ బదాయునీ, సాహిర్ లూధియాన్వీ వంటివారు రాసిన గీతాల్ని అధ్యయనం చెయ్యడం ఎంతో ఉపకరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అటు హిందీ భక్తి కవులకీ, ఇటు ఉర్దూ ప్రేమకవులకీ సమానంగా వారసులు.
 
చాలా ఏళ్ళ కిందట నేను కవిత్వం రాయడం మొదలుపెట్టినప్పుడు, కాకినాడలో నా మిత్రుడు సి.ఎస్ తనకి గురువూ, మిత్రుడూ అయిన వక్కలంక వెంకట కృష్ణారావుని పరిచయం చేసాడు. ఆయనతో నేను మాట్లాడింది ఒకటి రెండు సార్లే కాని, ఆ కొద్ది సంభాషణలోనూ ఆయన భరత్ వ్యాస్ గీతాల గురించి చెప్పిన మాటలు నా హృదయంలో నాటుకు పోయాయి. ఆ తర్వాత, రాజమండ్రిలో ఎన్నో సాయంకాలాలు వంక బాలసుబ్రహ్మణ్యం వల్ల హిందీ పాటల గురించీ, సంగీతమాంత్రికులైన ఆ ‘అయిదుగురు’ స్వరకర్తల ( సి.రామచంద్ర, నౌషాద్, మదన మోహన్, శంకర్-జైకిషన్, ఎస్.డి.బర్మన్) గురించీ తెలుసుకున్నదానివల్ల కొంతా, విన్నదానివల్ల మరికొంతా పాత హిందీ పాటల పట్ల నాకు కలిగింది ఇష్టం కాదు, పిచ్చి.
 
ఆ పిచ్చిని ఈ పుస్తకం మరింత ఎగసనదోస్తున్నది. ఆ పాటలు సరే, మనవాడి తెలుగు వాక్యాలు చూడండి:
 
‘పరిచయమే జబ్బుగ పరిణమిస్తే
దానికి మరచిపోవడమే మందు.
బాంధవ్యమే బరువైపోతే దాన్ని తెంచుకోవడమే మార్గం
ముగింపుదాకా తీసుకువెళ్ళలేనప్పుడు కథను
వొ అందమైన మలుపు తిప్పి వదిలి వేయడం మంచిది.’
 
‘నువ్వు తాకిన ఈ దేహాన్నైతే
ప్రపంచం నుంచి దాయగలను గాని
నీ చూపులు తాకిన ఈ మనస్సును
ఎవరికి చూపను?’
 
‘నీ కాళ్ళు ఆ పరచిన పూలను తాకనివ్వు, నీ కృప వుండనీ
లేదంటే నాకే కాదు, ఈ పూలకీ నీపై ఫిర్యాదుంటుంది.’
 
‘దేవుడి ముందే ఎలాంటి పరదా చాటు లేనప్పుడు
అతని సేవకుల ముందు పరదా చాటు ఎందుకో!’
 
‘రాకుండ ఉండటానికి యెన్నెన్ని సాకులు నీకు వున్నాయో
అలాగే మరలా వెళ్ళకపోవడానికి
ఏదో సాకుని కనిపెట్టి మరీ రా ‘
 
నువ్వంటే కోపం కాదు, జీవితమా, కలవరము తప్ప
నువ్వు అమాయికంగా వేసే ప్రశ్నలకు
వ్యాకులపడుతున్నానే తప్ప
మరేమీ లేదు.’
 
బాలసుబ్రహ్మణ్యం నాకు పరిచయం చేసిన రెండు పాటలు ఇందులో ఉన్నాయి. ఒకటి ‘ఆప్ కీ నజరోఁ నే సమఝా ‘, మరొకటి, ‘ వక్త్ నే కియా క్యా హసీ సితం’. కానీ, ఇక్కడ మళ్ళా ఆ పాటల గురించి చదువుతుంటే మళ్ళా కొత్తగా ఉన్నాయి. అది పరేశ్ ప్రతిభ అనే చెప్పక తప్పదు.
 
ఇంకో సంతోషం కూడా ఉంది, నా పేరు ఈ పుస్తకంలో రెండు తావుల్లో కనబడ్డందుకు. ఒకటి నూర్ జహాన్ ను తలుచుకుంటున్నప్పుడు, మరో మారు ‘నిర్ దయీ ప్రీతమ్’ పాటను పరిచయం చేస్తున్నప్పుడు. హిందీ సినీకావ్యదేవతలు ఈ నిరక్షరాస్య భక్తుణ్ణి మర్చిపోలేదన్నమాట!
 
కానీ, పరేశ్, ఉమ్రావ్ జాన్ పాటకి నువ్వు రాసిన పరిచయం చదువుతూండగానే నా హృదయం మీద మబ్బు కమ్మి, చివరికి ఆ పాట దగ్గరీకి వచ్చేటప్పటికి నా కళ్ళు సజలాలైపోయాయి. ఎటువంటి పాట అది! ఎన్నిసార్లు విన్నాను! నలభై ఏళ్ళ కిందట నేనూ మా అక్కా, ఆ సినిమా చూసినప్పుడు, ఆ కథానాయిక తన పుట్టింట్లో తన సోదరుడి దగ్గర నిరాదరణకు గురైన తర్వాత, ఆ ఇంట్లో అద్దంలో తనను చూసుకున్నప్పుడు, ఆ అద్దం మీద మసక తుడిచి తనని తాను చూసుకున్నప్పుడు నేను మా అక్కతో అన్నాను ‘చివరికి ఆమెకి ఆమెనే మిగిలిందన్నమాట’ అని. అప్పుడు మా అక్క అన్నది కదా ‘అయ్యో, ఆమె కి ఆమె కూడా మిగల్లేదు, చూడు’ అని.
 
యే క్యా జగేహ్ హై దోస్తోఁ ఏ కౌన్ సా దయార్ హై..
 
‘ఇదే ప్రాంతం మిత్రులారా? ఇదే నేల?
కనుచూపు మేరా రేగిన ధూళి తెరలే కదా!
ఇది ఏమి మజిలీనో జీవితం నన్ను తీసుకు వచ్చినది!
ఆనందం మీద అదుపు, బాధలపట్ల యెంపిక వీలు లేదు ఇక్కడ!’
 
పరేశ్, ఇంకా రాయండి, రాస్తూండండి, మరో వెయ్యి పాటల గురించి.
 
18-1-2022

Leave a Reply

%d bloggers like this: