జుగల్ బందీ

సంగీతానికి సంబంధించిన పేజీలు తిరగేస్తుండగా,బిస్మిల్లా ఖాన్ పేజీలో ఈ వీడియో కనిపించింది. ఉస్తాద్ విలాయత్ ఖాన్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ల జుగల్ బందీకి సంబంధించిన పది, పన్నెండు నిమిషాల వీడియో క్లిప్. బహుశా అంత అపురూపమైన జుగల్ బందీ మరొకటి ఉండదేమో!

https://www.facebook.com/UstadBismillahKhanOfficial/videos/443642467267350/

కచేరీ మొదలవుతూనే ఉస్తాద్ విలాయత్ ఖాన్ తానే ముందు ఒక టుమ్రీ సితార్ మీద వినిపించడం మొదలుపెట్టాడు. ఆయనకు తోడుగా బిస్మిల్లా ఖాన్ తన సంగీతం వినిపించడానికి షెహనాయి అందుకున్నాడు. పెదాల దాకా తీసుకువెళ్ళాడు. కాని ఎంచాతనో ఆలపించలేదు. తన చేతుల్లో షెహనాయి పక్కన పెట్టి తన సహవాద్యకారుడికి సైగ చేసాడు. ఆయన బృందంలో సహకళాకారుడు షెహనాయి అందుకున్నాడు. విలాయత్ ఖాన్ అది చూసాడు. కాని ఏమీ మాట్లాడలేదు. బిస్మిల్లా ఖాన్ తనకన్నా వయసులో పెద్దవాడయిన కళాకారుడు కాబట్టి ఆయన పట్ల గౌరవసూచకంగా తన వంతు వాద్యం తాను వాయిస్తూ ఉన్నాడు. కాని మనసులో ఎదురుచూస్తూనే ఉన్నాడు. బిస్మిల్లా ఖాన్ ఎప్పుడు అందుకుంటాడా అని ఆ క్షణంకోసం ఒకవైపు ఎదురుచూస్తూనే ఉన్నాడు. దాదాపు రెండు నిమిషాలు గడిచాయి.

కాని బిస్మిల్లా ఖాన్ ఈ సారి షెహనాయి చేతుల్లోకి తీసుకోకుండా ఆ టుమ్రీ రాగాలాపన మొదలుపెట్టాడు. ఆకార్ ఆలాపన. ఏమాశ్చర్యం! ఒక వాద్యకళాకారుడు తన వాద్యానికి బదులుగా తన గళాన్నే ఎత్తుకోవడం! బహుశా ఏ తొమ్మిదవ సింఫనీకో స్వరకల్పన చేస్తున్నప్పుడు బీతోవెన్ వంటివాడు మాత్రమే తన వాద్యాన్ని దాటి తన గళాన్నే ఒక వాద్యంగా స్వరకల్పన చేసే క్షణం అది. ఆ క్షణాన విలాయత్ ఖాన్ వదనం చూడండి! ఆయన కళ్ళల్లో ఆ ఆనందం, ఆ ఆశ్చర్యం చూడండి! ఆ క్షణం తర్వాత ఆయన సితార్ తంత్రుల మీదా ఆ అంగుళులు ఎట్లా నాట్యమాడాయో చూడండి.

మరొక అరనిముషం గడిచిందో లేదో ఇప్పుడు స్వయంగా విలాయత్ ఖాన్ కూడా తనే స్వయంగా ఆ టుమ్రీ తాను కూడా ఆలపించడం మొదలుపెట్టాడు.

‘మోహే పన్ ఘట్ మే ఛేడ్ గయో రే నందలాలా మోహె పన్ ఘట్ మే’

ఆ గానంలో ఆయన తన గళానికి తన సితార్ తో తనకు తనే జుగల్ బందీ మొదలుపెట్టాడు. ఈ సారి మళ్ళా బిస్మిల్లా ఖాన్ అందుకున్నాడు. ఆయన కీర్తన కాదు, ఆ రాగాలాపననే, మళ్ళా ఆకార్. నాలుగో నిమిషంలో విలాయత్ ఖాన్ వదనం చూడండి. ఆ సంతోషం చూడండి.

అయిదో నిమిషం నుంచి బిస్మిల్లా ఖాన్ ని మరొకసారి చూడండి. ఆయన మళ్ళా ఒకటి రెండు సార్లు షెహనాయి చేతుల్లోకి తీసుకున్నాడు. పెదాల దాకా చేర్చుకున్నాడు. కాని మరొక నిమిషందాకా సన్నాయి ఎత్తుకోలేదు. కాని నిమిషమో, రెండు నిమిషాలో అంతే, మళ్ళా ఆ షెహనాయి పక్కన పెట్టేసాడు. ఈసారి విలాయత్ ఖాన్ సంతోషాన్ని తాను సంతోషంగా చూస్తూ ఉండిపోయాడు. తన దగ్గరున్న సన్నాయి పీకల్ని ఒకటీ ఒకటీ పరీక్షించుకుంటూ తన సహకళాకారుడి సితార్ అనే సెలయేటి ఒడ్డునే విహరిస్తూ ఉన్నాడు. పదో నిమిషం తర్వాత ఆయన వదనాన్ని చూడండి. ఆ పారవశ్యం చూడండి. మరొక అరక్షణం తర్వాత ఆయన కనుకొలకుల్లో అశ్రువు చిందడం చూడండి. ఒక సాధుపురుషుడు తన సజలనేత్రాన్ని ఎంత మృదువుగా తుడుచుకున్నాడో చూడండి.

భారతదేశంలో సితార్ అనగానే ముందు తన పేరే గుర్తు రావాలని చెప్పుకున్న ధిషణాహంకారి విలాయత్ ఖాన్. తనకన్నా ముందు వేరే సితార్ విద్వాంసులకి గౌరవాన్ని ఇచ్చారన్న కారణం వల్ల భారతప్రభుత్వం తనకు అందచూపిన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు మూడింటినీ తిరస్కరించినవాడు. భారతప్రధాని తనకి ఫోన్ చేస్తే తాను రియాజ్ లో ఉన్నాననీ, ఇప్పుడు మాట్లాడలేననీ చెప్పిన సంగీత సార్వభౌముడు. కాని ఆయన బిస్మిల్లా ఖాన్ పట్ల ఎటువంటి వినయాన్నీ, గౌరవాన్నీ చూపించాడో చూడండి.

వారిద్దరూ ముస్లిములు. ఒకరిది బెంగాల్, మరొకరిది వారణాసి. ఆలపించిందేమో ఒక గుజరాతీ హిందూ కవి రాసిన కృష్ణలీలా కీర్తన. ఆ వీడియో క్లిప్ కింద ఉన్న వందలాది కామెంట్లలో ఒకరు రాసారు కదా: ‘ఇద్దరు హిందువులు చేసిన అద్భుతమైన జుగల్ బందీ అది ‘ అని. కాని వాళ్ళిద్దరూ హిందువులూ కారు, ముస్లిములూ కారు. భారతీయులు.

భారతదేశం ఒక రాజకీయ నిర్మాణం కన్నా ముందు ఒక సాంస్కృతిక దేశం. కవులూ, కళాకారులూ దర్శించిన దేశం. భిన్న మతాలకూ, భాషలకూ, సంప్రదాయాలకూ చెందిన మనుషులు ఒకరినొకరు ఇష్టపడుతూ, గౌరవించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి జీవించడానికి ఒక ఉమ్మడి ప్రాతిపదికను వెతుక్కుంటూ వచ్చిన యుగానుభవం. జుగల్ బందీ.\

26-1-2022

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%