
విష్ణుపురం సాహిత్య సంఘం వారి సమావేశం అయిపోయి చాలారోజులు కావొస్తున్నా ఇంకా సాహిత్య మిత్రులు జయమోహన్ గారికి ఆ సమావేశ విశేషాల గురించి ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. అందులో నా ప్రసంగం గురించి కూడా ఎవరో ఒకరు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అటువంటి ఒక ఉత్తరం గురించి మిత్రుడు రాజు నాకు వారం పదిరోజుల కిందట చెప్పాడు. రాత్రి అతణ్ణుంచి ఒక మెసేజి:
~
మీ సెషన్-కి సంబంధించి సుందర వడివేలన్ అన్న పాఠకుడి స్పందనని అనువాదం చేస్తాను అని ఇదివరకు చెప్పాను. ఇంత ఆలస్యం చేసినందుకు క్షమించకండి..!
ఆ అనువాదం ఇది…
నమస్కారం,
‘వేద వాఙ్మయంలో కవి అన్న పదం అనాది పరమాత్మని సూచించే మాటగానే ప్రయోగించారు. కవిత అన్నది ఓ రసవాదం, అది ఓ కవిలో సంభవిస్తుంది. అలా సంభవించే ఆ క్షణాన్నీ, స్థలాన్నీ సూచించేది, ఇది అదేనని ఆవిష్కరించేది, ఇది ఇలాగే ఉందని గ్రహించేది, ఆ క్షణంగానే మారేది… దాన్నే కవిత పుట్టే క్షణం అంటాం-‘ అన్నారు వాడ్రేవు చిన వీరభద్రుడుగారు. ఆ అనుభవాన్ని epiphany అనే మాటతో సూచించారు.
ప్రతి సారీ, అలాంటి క్షణంలో కవి సత్యమే తానైనదాన్ని దేన్నో తన వేలితో స్పృశిస్తున్నాడు, ఆ రకంగా తానే సత్యమై నిలుస్తున్నాడు. ఆ సమున్నత దశ నుంచి ఒక్క అడుగు దిగొచ్చి, ఆ సత్య సాక్షాత్కారాన్ని అందరికీ పంపకాలు చేస్తున్నాడు. పూనకం వచ్చేటప్పుడు తనలో తాను పరవశించి(మరులాడి అనే చక్కటి తమిళ పదం వాడారు. మరులు+ఆడి!), తనలో సంభవించినదాన్ని మాటలుగా మలచి చెప్పడం లాంటిది ఇది. ఇందువల్ల కవిత అన్నది సమున్నత జ్ఞానంగా మారుతుందేమో? భద్రుడి ప్రసంగం విన్నాక కవి అన్న మాటని ఇకపైన ఇంత సాంద్రతా, బరువూ, వైశాల్యమూ కలిగిన పదంగా తప్ప మరోలా ఎలా చూడగం? ఓ బీజాక్షరంలా! ఓ మంత్రంలా!
కవి వీరభద్రుడు ‘ఆది కవి వాల్మీకి ఓ శోకాన్ని చూసాకే శ్లోకం పుట్టింది’… దృశ్యమో, సంఘటనా కాదు కవితగా మారేది.. వాటి ద్వారా కవి తాను అన్వేషించి అందుకున్న సత్యమే కవితగా మారుతుంది..’ అన్నారు. కవి మనం సంరక్షించుకోవాల్సినవాడు, ఏ వ్యాకరణాలకీ లొంగనివాడు.
ఇసుక గూళ్ళాడే చంటి పిల్లాడిలా, తన చిట్టి వేళ్ళతో గ్రహించిన సత్యాన్ని… ఫలానా వాళ్ళకని కాకుండా, కట్టిన గూడుని అక్కడే వదిలి మరో కొత్త చోటకి వెళ్లిపోతుంటాడు. అతను వదిలి వెళ్ళినదాన్ని సంరక్షించుకోవడం, అతను ఆడే స్థలాన్ని కాపాడుకోవడం, అతన్నీ కంటికి రెప్పలా కాచుకోవడం మన విధ్యుక్త ధర్మం. ఎందుకంటే ఓ కవి తాను సృష్టించి దాటి వెళ్ళిపోయినవాటిల్లో చాలావరకూ, మానవుడు అందుకోగల సమున్నత సాఫల్యాలకు చెందినవై ఉంటాయి కాబట్టి!
‘ఈండ్రు పురందరుదల్ ఎన్ తలై కడనే'(కని పోషించడం నా ప్రధాన ధర్మం.. అని అర్థం అనుకుంటాను) అన్న సంగ సాహిత్య గేయ పాదాల్లా.. కవిని సంరక్షించుకోవడం మన తొలి ధర్మం అనుకోవచ్చా?
– సుందర వడివేలన్.
15-1-2022