ఎండ్లూరి సుధాకర్

Reading Time: 2 minutes

ఎండ్లూరి సుధాకర్ ని కలుసుకున్నది మొదటిసారి 1992లో. ఆ ఏడాది ఆగస్టులో నా పెళ్లి అయిన వెంటనే ఎర్రాప్రగడ రామకృష్ణ రాజమండ్రిలో ఒక చిన్న విందు ఏర్పాటు చేసి కొందరు మిత్రుల్ని పిలిచాడు. అప్పుడు చూసాను సుధాకర్ ని మొదటిసారి. ఆయన ‘వర్తమానం’ కవితా సంపుటం అప్పుడే వెలువడింది. ఆయన ఆ పుస్తకాన్ని నాకు కానుక చేస్తూ అందులో తన కవిత ‘సహచరి’ నాకు చదివి వినిపించాడు. ఆ కవిత విజ్జికి ఎంతో నచ్చింది. ఆ తర్వాత చాలా రోజుల పాటు ఆమెకి ఎప్పుడు మనసు బాగోలేకపోయినా ఆ కవిత చదువుకునేది.

తర్వాత చాలా కాలానికి ఒకసారి హైదరాబాదులో సిటీ సెంట్రల్ లైబ్రరీ లో ఏదో సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మరొకసారి సుధాకర్ ని కలుసుకున్నాను. సమావేశం ప్రారంభం కావడానికి ముందు బయట వెయిట్ చేస్తూ ఉండగా ఆయనకీ నాకూ మధ్య కొంత సంభాషణ నడిచింది. అప్పట్లో మల్లెపూల గొడుగు అనే శీర్షిక మీద అనుకుంటాను ఆయన కొన్ని కథలు రాస్తూవున్నారు. ఆ కథల్లో ఒకటి నాకు నచ్చింది. నేను దాని గురించి ప్రస్తావించాను. అప్పుడు ఆయన నేను రాసిన ‘అమృతం’ కథ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. శ్యామల అందులో పాత్ర. శ్యామల వంటి స్నేహితురాలు జీవితంలో దొరకాలని ఎవరు కోరుకోరు అన్నాడాయన.

మళ్లీ మరొక సాహిత్య సమావేశంలో మేము కలుసుకున్నప్పుడు మళ్లీ ఇలాగే సమావేశానికి ముందు ఇష్టాగోష్టి నడుస్తోంది. అప్పుడు ఎవరో ఆయన్ని ఉర్దూ గజల్ గురించి అడుగుతున్నారు. ఏదో మాట్లాడించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను మౌనంగా వింటూ ఉన్నాను. అప్పుడాయన ‘నా పక్కన కూర్చున్న ఆయన నాకన్నా ముందే ఉర్దూ గజల్ గురించి రాశాడు కానీ ఏమీ తెలియనట్టు ఎంత మౌనంగా ఉన్నాడో చూడండి’ అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ‘నేను గజల్ గురించి ఎప్పుడు రాశాను’ అని అడిగాను. ‘అదేమిటి మీరు నిర్వికల్ప సంగీతం లో బహదూర్ షా గజల్ ని అనువదించలేదా’ అనడిగాడు. నేను మరింత ఆశ్చర్యపోయాను. ఆ విషయమే నాకు గుర్తులేదు. కాని ఉర్దూ పారశీక కవిత్వం గురించి సుధాకర్ గారికి తెలిసిన దానితో పోలిస్తే నాకు తెలిసింది చాలా స్వల్పమని చెప్పగలను. అయినా ఆయన నా గురించి ఆదర పూర్వకంగా ఆ రెండు మాటలు మాట్లాడడం నాకెంతో ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఎంత సహృదయుడో ఆ ఒక్క క్షణం లో నాకు అర్థం అయింది.

దాదాపు ముప్పై ఏళ్ల ఈ పరిచయం మరింత బలపడి సాహిత్యానుబంధంగా వికసించి ఉంటే బాగుండేది అని ఇప్పుడు అనిపిస్తున్నది. కవి, పండితుడు, సహృదయుడు సుధాకర్ కూర్చున్నంత సేపూ నేను అంతగా గమనించలేదు కానీ ఇప్పుడు ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆ ఖాళీ కుర్చీ నా దృష్టిని పదేపదే తనవైపు తిప్పుకుంటున్నది.

29-1-2022

Leave a Reply

%d bloggers like this: