ఆమె నడిచిన దారి

నా మిత్రుల్లో కవులున్నారు, రచయితలున్నారు, సామాజిక కార్యకర్తలున్నారు, కళాకారులున్నారు, క్రీడాకారులున్నారు, ఉపాధ్యాయులున్నారు, శాస్త్రవేత్తలున్నారు, ఆస్తికులున్నారు, నాస్తికులున్నారు. కాని ఆధ్యాత్మిక సాధకులు,ముముక్షువులు మాత్రం చాలా తక్కువమంది, అది కూడా వేళ్ళమీద లెక్కపెట్టేటంత మంది మాత్రమే ఉన్నారు. అటువంటి వారిలో Sandhya Yellapragada ఒకరు.
 
ఆమె అట్లాంటాలో ఉంటున్నప్పటికీ, ఈ దేశపు నదులూ, ఆశ్రమాలూ, హిమాలయాలూ ఆమెని అక్కడ ఉండనివ్వవు. ఒక గురువుని వెతుక్కుంటూ ఆమె చేసిన అన్వేషణ మామూలు అన్వేషణ కాదు. తన అన్వేషణానుభవాల్ని ‘సత్యాన్వేషణ ‘ పేరిట పుస్తకంగా రాసి నన్ను ముందుమాట రాయమని అడిగినప్పుడు, నాకు ఆ అర్హత ఉందా అని సంశయించాను. కాని ఆమె అభ్యర్థన మూగవాడికి గొంతునిచ్చినట్టు నాకు మాటలనిచ్చింది. రెండు వాక్యాల ముందుమాట రాయగలిగాను.
ఆ పుస్తకం ఒక ప్రతి నా చేతుల్లో పెట్టడం కోసం ఆమె నిన్న మా ఇంటికి వచ్చారు. ఈ సారి భారతదేశానికి మిమ్మల్ని రప్పించిందెవరు అని అడిగితే ‘ఇప్పుడే నర్మద పరిక్రమ పూర్తి చేసుకుని వస్తున్నాను’ అన్నారు. నర్మద ప్రదక్షిణం చేసేవారు నర్మదా స్వరూపులే అంటారు కాబట్టి కృష్ణ ఒడ్డున ఉన్న మా ఇంటికి నిన్న నర్మద వచ్చినట్లే అనుకున్నాను.
 
ఆమె పుస్తకానికి నేను రాసిన ముందుమాట మీ కోసం:
 
~
 

ఆమె నడిచిన దారి

 
యెల్లాప్రగడ సంధ్య గారు ఫేస్ బుక్ ద్వారా నాకు మిత్రురాలు. మూడేళ్ళ కితం హైదరాబాదులో మా ఇంటికి వచ్చారు. ఆమె మాటల్లోనూ, మా ఇంట్లో ఉన్న కొద్దిసేపూ ఆమె మసలిన తీరులోనూ ఎంతో క్రమశిక్షణ, సంస్కారం గోచరించాయి. ఆమెకి ఒక జ్ఞానతృష్ణ ఉన్నదని కొంతవరకూ గుర్తించానుగానీ, ఆమె ఆత్మ ఎంత పరిశుద్ధమైనదో, తనకి తాను చేరువుగా ఉండటానికి ఆమె ఎంత గాఢంగా తీవ్రంగా తపిస్తూ ఉన్నదో, ఏడేళ్ళ పాటు ఆమె చేసిన తపస్సు ఎంత కఠోరమో ఈ సత్యాన్వేషణ చదివినదాకా నాకు తెలియలేదు.
 
సత్యాన్ని తెలుసుకోడానికీ, ఆ సత్యసాన్నిధ్యం నుంచి ఒక్క క్షణం కూడా ఏమరుపాటుకు లోను కాకుండా ఉండటానికీ, తనని తాను కాపాడుకుంటూ, తనని నిజంగా తనుగా ఉంచే ఒక గురుకటాక్షం కోసం ఆమె ఎంతటి ఆర్తికి లోనయ్యిందో ఈ పుస్తకంలో ప్రతి ఒక్క పుట సాక్ష్యమిస్తుంది.
 
అరుణాచలం నుంచి హిమాలయాలదాకా, గోదావరీతీరం నుంచి గంగా తీరందాకా ఆమె చేసిన ప్రయాణాలు, ఆ వెతుకులాట మనల్ని నివ్వెరపరుస్తాయి. ఇదంతా మరీ ఇటీవలి కాలంలోనే, అంటే, మనమంతా మన రోజువారీ జీవితాల్లో కూరుకుపోయిఉండగానే ఆమె తన వెచ్చని ఇంటినీ, కుటుంబ భద్రతనీ, సౌకర్యవంతమైన దైనందిన జీవితాన్నీ వదులుకుని ఈ అన్వేషణ సాగిస్తూ ఉన్నదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది.
 
తన యాత్ర చివరి పేజీలకు వచ్చేటప్పటికి ఆమె ఇలా రాస్తున్నది:
 
‘ ఈ అన్వేషణలో అన్నీ వదిలేసాను. డబ్బు, మంచి చీరలు, నగలు, సమాజము, అందులో ఒక పేరు, రాజకీయాలు, సంఘాలు, వాటిలో పొజిషన్లు, బిరుదులు, ఒకటేమిటి, ఒక్కొక్కటే పొరలు పొరలుగా ఉండిన ఉల్లి పొరలులా విచ్చుకు వూడిపోయాయి. నాకు నేను తెలుసుకునే నెపంతో దేన్నీ పట్టించుకోలేదు. మంది బట్ట, కడుపునిండా తిండి కూడా సహించని స్థితికి వచ్చాను. చాలా చాలా సున్నితమైన స్థితిలోకి వచ్చి దిక్కుతోచక కొట్టుకుపోతున్నా. పై పై మెరుగులుగా ప్రపంచము తోచింది. ఇక గురువుల కృప రాకపోతే మాకేమిచెయ్యాలో కూడా తెలియదు. ఎంత కాలము వేచి చూడాలో. ఆ రాత్రి కంటికి నిదురలేదు. ‘రేపటి ఉదయమన్నా నాకు అరుణోదయమవుతుందా?’
 
ఆ మర్నాడు ఆమెకి గురువు అనుగ్రహం లభించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒకసారి పరమహంసను ఎవరో భగవత్సాక్షాత్కారం ఎప్పుడవుతుంది అని అడిగితే, ఆయన నిన్నెవరన్నా నీళ్ళల్లో నీ ముఖాన్ని ముంచి, అట్లానే కొన్ని క్షణాలు అదిమిపెడితే, గాలికోసం, ఊపిరికోసం కొట్టుకుపోతావు చూడు, అట్లా భగవంతుడి కోసం ఎప్పుడు కొట్టుమిట్టాడతావో అప్పుడు సంభవిస్తుంది అన్నాడట.
 
ఈ పుస్తకమంతా అట్లా కొట్టుమిట్టాడిన అనుభవం. ఆమెకి ఒక గురువు జీవితంలో లభించిన తరువాత అనుభవాలేమీ ఆమె ఈ పుస్తకంలో రాయలేదు. రాయవలసిన అవసరం లేదు కూడా. ఎందుకంటే, ఎవరి ఆధ్యాత్మిక సాక్షాత్కారం వారిదే. ఒకరికి కనిపించిన భగవంతుడు మరొకరికి అదే రూపంలో కనిపించవలసిన అవసరం లేదు. కాని అటువంటి సాక్షాత్కారంకోసం పడిన తపనలో మాత్రం సాధకులందరి అనుభవం ఒక్కలాంటిదే. అక్కడ ఏ ఒక్క సాధకుడి అనుభవమైనా తక్కిన సాధకులందరికీ ఎంతో కొంత ఊరటనిచ్చేదే, ధైర్యం చెప్పేదే, దారిచూపించేదే.
 
ఈ అన్వేషణలో మరో గొప్ప అంశం ఇది భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో దీపస్తంభాల్లాంటి మహనీయుల గురించిన తలపోత కూడా. ఒక సంధ్య నడిచిన దారి ప్రతి ముముక్షువూ నడవాలని కోరుకునేదే.
 
పుస్తకం మొత్తం ఏకబిగిన పూర్తిచేసేసాను. పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుణ్ణి దర్శించుకుని మా ఊరు వెళ్ళే దారిలో మొత్తం పుస్తకం చదవడం పూర్తయిపోయింది. పుస్తకం మొదటి పుటల్లో ఒకటి రెండుచోట్ల నా కళ్ళల్లో సన్నని నీటిపొర. గొప్ప యోగుల జీవితాల్లో కనవచ్చేటట్టే ఆమె కూడా మృత్యుముఖంలోనే సత్యాన్ని పసిగట్టింది. కొన్ని వాక్యాలు నిజంగా తీవ్ర ఆధ్యాత్మిక సాధకులకి మాత్రమే స్ఫురించే సత్యాలు. పుస్తకం చివరి పుటలకు వచ్చేటప్పటికి మా ఊరు వెళ్ళే అడవి దారి పొడవునా ఆకాశాన కమ్ముకున్న మబ్బులు, పుస్తకం చివరి పుటలు మూసేటప్పటికి మహావర్షం. ఒక సాధకురాలి చరిత్ర నేను చదివినందుకు నింగీనేలా కూడా కలిసి పండగ చేసుకున్నాయి.
ఆద్యంతం గొప్ప వేదమంత్రాలు, ఉపనిషద్వాక్యాలు, స్తోత్రాల్లోని మననీయ శ్లోకాలతో ఈ పుస్తకం చదవడమే ఒక తీర్థయాత్రలాగా అనిపిస్తుంది.
 
చివరికి వచ్చేటప్పటికి ఆమె ఐతరేయ బ్రాహ్మణం నుంచి పేర్కొన్న ఈ మంత్రం నన్ను నిశ్చేష్టుణ్ణి చేసింది:
 
‘చరించినందువల్లనే తేనెటీగలకు మధువు దొరుకుతోంది.
చరించినందువల్లనే పక్షులకు స్వాదువైన ఫలాలు లభిస్తున్నాయి.
చరిస్తున్నందుకు సూర్యుడు గౌరవించబడుతున్నాడు.
నడవాలి, నడవండి, నడుస్తుంటే చేరేది గమ్యమే.’
 
ఒక అవిశ్రాంత పథికురాలి ప్రయాణం ఇది. విరామంలేకుండా ఆమె నడిచింది కాబట్టే మనకి ఈ పుస్తకంద్వారా తేనె, తియ్యటి ఫలాలూ, సూర్యకాంతీ ప్రాప్తిస్తున్నాయి.
 
సన్మార్గగాములైనవారందరి తరఫునా, సత్యశోధకులందరి తరఫునా ఆమెకి నా ధన్యవాదాలు.
 
30-1-2022

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading