MOHAN DAS K GANDHI

కొంతమంది హైస్కూలు హైస్కూలు విద్యార్థుల్లానే నేను కూడా ఎందుకో తెలీకుండానే గాంధీని ద్వేషించాను. నాగార్జున సాగర్ గురుకులం కళాశాలలో ఇంటర్మీడియేటు రెండో సంవత్సరంలో ఉండగా శ్రీనివాస రెడ్డి అనే ప్రిన్సిపాలు గారు వచ్చారు. ఆయన భావాల్లోనూ, ఆచరణలోనూ కూడా గాంధేయవాది. ఆయనవల్ల మొదటిసారిగా నా దృష్టి గాంధీ వైపు మళ్ళింది. బి ఏ మొదటి సంవత్సరం చదువుతుండగా, జార్జి కాట్లిన్ అనే ఆయన రాసిన ‘గాంధీజీ అడుగుజాడల్లో’ అనే పుస్తకం నేను చదవడం, అది నా జీవితాన్ని మార్చెయ్యడం అదంతా నా ‘సత్యాన్వేషణ’కు రాసిన ముందు మాటలో వివరంగా రాసేను.

అయితే రాజమండ్రిలో ఉండగా, యునెస్కో ప్రచురించిన All Men Are Brothers, Life & Thoughts of Mahatma Gandhi as told in his own words తెలుగు అనువాదం ‘మానవులంతా సోదరులు’ చదివాను. కృష్ణ కృపలాని సంకలనం చేసిన ఆ పుస్తకం గాంధీ గురించి గాంధీ మాటల్లోనే తెలుసు కోవాలనుకునేవారికి చక్కటి ప్రారంభ పరిచయం.

ఆ పుస్తకం చదివిన కొన్నాళ్ళ పాటు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ‘సత్యాన్వేషకుడు ధూళికన్నా వినమ్రంగా ఉండాలి’ అని గాంధీ పదే పదే చెప్పిన మాటలు నాకు అర్థమయినట్టుగా అనిపించింది. అప్పుడు, రాసిన కవిత ఇది.

~

మోహనదాస్ కరంచంద్ గాంధీ

ఆయన

ఆవుల్నీ, అస్పృశ్యుల్నీ, ఆడవాళ్ళనీ ఆరాధించాడు. ఈ లోకంలో వాళ్ళ వేదన స్థాయికి తనూ చేరాలని జీవితమంతా మథనపడ్డాడు.

ఏం లోకం ఇది? కసాయి కబేళాలూ, కంచికచర్లలూ, కిరొసిన్ పోసి కాల్చెయ్యడాలూ.

అయినా, సగం సగం కాలిన చమురుకంపు శవాలూ, పాపక్రిముల్తో కుళ్ళిన రోగగ్రస్త దేహాలూ, జీవగంగ నైర్మల్యాన్ని కలుషితం చెయ్యగలవా?

విడిచిన బాణాలు నెత్తురు చిందిస్తే, విడిన కన్నీళ్ళు కొత్త నెత్తురు పోస్తాయి.

నశింపులేని అశ్రునైర్మల్యమే సత్యమయితే నిశ్చయంగా ఆయన ఈశ్వరుణ్ణి చూసినవాడే.

15-11-1984

MOHAN DAS K GANDHI

The meek, the outcast, and the women captured his attention.
And all his life,
He longed to meet their suffering.

Dowry deaths, lynchings, and slaughterhouses,
Still, plague the world.

Do half-charred corpses and sickness unto death
Pollute the Ganges of life?

When released, arrows shed blood.
When relieved, tears restore life.

If tears are a reflection of truth,
He must have seen God.

Leave a Reply

%d bloggers like this: