సర్దార్ ఉద్ధం సింగ్

‘నా చిన్నప్పుడు నా ఉపాధ్యాయుడు నాకో మాట చెప్పాడు. యవ్వనం అనేది ఒక కానుక అనీ, దానికొక అర్థాన్నిస్తావో లేక వృథాచేసుకుంటావో నీ చేతుల్లోనే ఉందని చెప్పాడు. ఇప్పుడు నాకు ఆయన్ని తొందరగా కలవాలని ఉంది. నేను నా యవ్వనాన్ని సార్థకం చేసుకున్నానో లేదో అడగాలని ఉంది’
 
సర్దార్ ఉద్ధం సింగ్ ఈ మాటలు చెప్తుండేటప్పటికి నా హృదయం పూర్తిగా కరిగిపోయింది. రెండు గంటల నలభై నిమిషాల సర్దార్ ఉద్ధమ్ సినిమా జాతీయోద్యమం తాలూకు కథ అనీ, ఒక దేశభక్తుడి ఆత్మదానానికి సంబంధించిన ఇతివృత్తమనీ మర్చిపోయాను. అన్నిటికన్నా ముందు అది ఒక మనిషి తన జీవితానికొక లక్ష్యాన్ని ఎంచకుని, ఒకసారి లక్ష్యాన్ని ఎంచుకున్నాక ప్రతి ఒక్క అడుగూ ఎంతో తదేకంగా, ఎంత నిబద్ధంగా, ఎంతో ప్రగాఢంగా తన లక్ష్యాన్ని సాధించడం కోసమే వేసిన ఒక యువకుడి కథగానే మనసులో చిత్రితమైపోయింది. సినిమా పూర్తయ్యేటప్పటికి, గొప్ప పుస్తకాలు చదివినప్పటిలా, గొప్ప కథలు విన్నప్పటిలా, చాలా ప్రభావశీల జీవితాన్ని చాలా దగ్గరగా చూసిన అనుభూతి మిగిలిపోయింది.
 
జలియన్ వాలా బాగ్ దురంతానికి కారణమైన జనరల్ డయ్యర్ ని హతమార్చాలని ఉద్ధం సింగ్ అనే ఒక యువకుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడనీ కానీ అతడు పొరపాటున మరొక డయ్యర్ ని హతమార్చాడనీ-ఇంతే చరిత్రద్వారా మనకు తెలిసింది. కానీ, ఉద్ధం సింగ్ చంపాలనుకున్నది జనరల్ డయ్యర్ ని కాదనీ, అప్పట్లో పంజాబ్ గవర్నర్ గా పనిచేసిన మైకెల్ డయ్యర్ నే అనీ, ఆ లక్ష్యంతోనే అతడు ఇరవయ్యేళ్ళ పాటు సుదీర్ఘకాలం పాటు వ్యూహాలు రచిస్తూ వచ్చాడనీ చివరికి ఆ ప్రయత్నంలో సఫలుడయ్యాడనీ ఈ చిత్రం చెప్పకపోతే మనకి తెలిసి ఉండేది కాదు. అన్నిటికన్నా కూడా ఉద్ధం సింగ్ భగత్ సింగ్ స్థాపించిన హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ ని పునరుద్ధరించడానికీ, దానికి అంతర్జాతీయంగా మద్దతు సమకూర్చడానికీ ప్రయత్నించాడనీ, అతడు జీవితంలో చివరి క్షణందాకాకూడా భగత్ సింగ్ కి పూర్తి అనుచరుడుగానే జీవించాడని కూడా ఈ సినిమా చూస్తేనే తెలుస్తుంది.
 
సినిమా ఆద్యంతం అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించినట్టు మనకి అర్థమవుతుంది. కథనంలో కూడా రేఖీయ పద్ధతి కథనంకాక, వర్తుల మార్గంలో, తిరిగి తిరిగి, జరిగిన కథను మనముందు పునర్నించుకుంటూ రావడంలో గొప్ప కథనబలం కనిపిస్తుంది. సన్నివేశాల్ని కల్పించడంలో, పాత్రల్ని ఆవిష్కరించడంలో, అన్నిటికన్నా ముఖ్యంగా దాదాపు వందేళ్ళ కిందటి చారిత్రిక స్థితిగతుల్ని పునర్నిర్మించడంలో మొత్తం బృందం నూటికి నూరు శాతం సఫలురయ్యారనే చెప్పాలి.
 
కథ ప్రకారం ఉద్ధం సింగ్ డయ్యర్ ని కాల్చి చంపే దృశ్యం పతాక సన్నివేశం కావాలి. కాని అందుకు బదులు అసలు డయ్యర్ ని చంపాలన్న ఊహకి కారణమైన జలియన్ వాలా బాగ్ దురంతాన్ని పతాక సన్నివేశంగా చిత్రించడంలో అనూహ్యమైన కథనం ఉంది. దాదాపు ముప్పై నిమిషాలకు పైగా సాగిన జలియన్ వాలా బాగ్ సన్నివేశాలు మొదలయ్యేదాకా సినిమా మొదలైనట్టే లేదు అని ఒక సమీక్షకుడు అన్నాడట. నేనలా భావించడం లేదు. కేవలం సంఘటనల క్రమాన్ని చెప్పుకుంటూ పోతున్నప్పుడు కూడా ఆ సినిమా ఊహించలేనంత ఉత్కంఠని రేకెత్తిస్తూనే ఉంది. చిన్న చిన్న వివరాల్లో కూడా ఆ సినిమా మన హృదయాన్ని ఎక్కడ గాయం చేయాలో అక్కడ గాయం చేస్తూనే ఉంది. ఉదాహరణకి కోర్టులో విచారణ మొదలయ్యేముందు ప్రమాణం చేయడానికి నిందితుడు ఏ పుస్తకాన్ని ఎంచుకున్నాడని జడ్జి అడిగినప్పుడు, ఉద్ధం సింగ్ తరఫు న్యాయవాది అతడొక పంజాబీ జానపద కథాపుస్తకం మీద ప్రమాణం చేస్తాడని చెప్తాడు. అదేమైనా రాజద్రోహానికి సంబంధించిన పుస్తకమా అని అడుగుతాడు జడ్జి. అది ఏ పుస్తకమైనా కానీ, తనకి నచ్చిన పుస్తకం పేరిట ప్రమాణం చేసే హక్కు తన క్లయింటుకి ఉందంటాడు లాయరు. అప్పుడు ఆ పుస్తకం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అది పంజాబ్, సింధ్ ప్రజాహృదయాల్లో అమరత్వాన్ని పొందిన ప్రేమికులు హీర్-రాంజాల ప్రేమకథ. ఆ పుస్తకం కనిపించగానే నా ఒళ్ళు గగుర్పాటుకు లోనయ్యింది. నాకు ఆ క్షణంలో బాబా బుల్లేషా ప్రత్యక్షమయినంత పులకింత కలిగింది.
 
భారతీయ చలనచిత్రకారులకి చరిత్రని సినిమాగా తీయడం చాతకాదు. కాని ఈ సినిమా దానికి అపవాదం. రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యాక బ్రిటిష్ చక్రవర్తి ప్రధానమంత్రి చర్చిల్ ని పిలిపించి మాట్లాడుతున్నప్పుడు, అప్పటి చక్రవర్తికి నత్తి ఉందనే విషయంతో సహా, చరిత్రలోని ఏ చిన్ని వివరాన్ని, విశేషాన్ని కూడా దర్శకుడు మర్చిపోలేదు. తెలుగు చిత్రదర్శకులు ఇటువంటి చలనచిత్రాల్ని తియ్యగలగడం అలా వుంచి కనీసం అర్థం చేసుకోగలరా అనిపించింది నాకు. ‘నేను ఒక అసమ్మతిని తెలియపర్చడానికి హత్య చేసానా లేక ఒక హత్య చేయడం ద్వారా అసమ్మతి తెలియచేసానా అన్నది ఎవరు చెప్పగలరు?’ అనడుగుతాడు ఉద్ధం ఒక చోట. ఇటువంటి ఒక మాట రాయాలంటే అన్నిటికన్నా ముందు నీ జాతి గురించీ, నీ జాతి చరిత్ర గురించీ అణచుకోలేని ఆవేదన ఒకటి నీ గుండెల్లో ఉబికి ఉప్పొంగుతూ ఉండాలి. ‘శాతకర్ణి’, ‘లింగ’, ‘రుద్రమదేవి’ వంటి సినిమాలు మాత్రమే తియ్యగలిగిన తెలుగు దర్శకులకి ఈ స్థాయికి చేరడానికి కనీసం మరొక యాభై ఏళ్ళు పడుతుంది.
 
ఈ చిత్రానికి ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్ పురస్కారం ఎలాగూ అందుతుంది, కానీ వందేళ్ల కిందట చేసిన దురాగతానికి ఇప్పటిదాకా బ్రిటన్ భారతదేశానికి క్షమాపణ కూడా చెప్పలేదు అనే విషయం కూడా ప్రపంచం అంతరంగంలో బలంగా నాటుకుపోతుంది.
 
మనకి కూడా ఇటువంటి విస్మృత మహనీయుల కథలున్నాయి. అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి సరే, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, కన్నెగంటి హనుమంతు, ద్వారబంధాల చంద్రయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, మద్దూరి అన్నపూర్ణయ్య, దర్శి చెంచయ్య, పింగళి వెంకయ్య వంటి మహనీయుల జాబితా చిన్నదేమీ కాదు. కాని ఆ కథల్ని అధ్యయనం చేసేవాళ్ళూ, వాటిని తెరకి ఎక్కించాలని తపసు చేసేవాళ్ళూ ఎక్కడ?
 
21-10-2021

Leave a Reply

%d bloggers like this: