వెళ్ళిపొయ్యాడతడు

కాఫ్కా గురించి తెలుగు పాఠకులకి కూడా ప్రత్యేకమైన ఆసక్తి. కాని ఆయన రచనల గురించి సాధికారికంగా వివరించగలిగేవారు తెలుగులో చాలా తక్కువమంది, అంటే బహుశా ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో నా మిత్రుడూ, ముప్పై ఏళ్ళ కింద అకస్మాత్తుగా అదృశ్యమైపోయిన కవులూరి గోపీచంద్ అందరికన్నా ముందు గుర్తొస్తాడు.
 
1983 లోనో, 84 లోనో, నేను మొదటిసారిగా భమిడిపాటి జగన్నాథరావు గారి దగ్గర కాఫ్కా పేరు విన్నాను. 50 ల్లో వచ్చిన ‘అభ్యుదయ’ పత్రికలో ఒక సంచికలో పాలగుమ్మి పద్మరాజు గారు కాఫ్కాగారి దుర్గం అనే పేరిట The Castle నవల గురించి ఒక వ్యాసం రాసారు. ఆ వ్యాసం చదివిన కుతూహలంతో కాఫ్కా గురించి తెలుగులో మరేమైనా సమాచారం దొరుకుతుందేమో అని వెతుకుతుంటే జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం పుస్తకంలో కాఫ్కా కథ ‘తీర్పు ‘ అనువాదం కనబడింది. అలాగే ఆయన గురించిన ఒక స్థూల పరిచయం కూడా. ఆ కథ చదవమని గోపీచంద్ కి ఇచ్చాను. కాని అది అతడి జీవితాన్నే అదృశ్యం చేస్తుందని ఊహించలేకపోయాను.
 
కవులూరి గోపీచంద్ ది ఏలూరు. వాళ్ళ నాన్నగారు కవులూరి వెంకటేశ్వర రావుగారు చాలా కాలం విశాలాంధ్ర పత్రికలో పనిచేసారు. కమ్యూనిస్టు. ఆ నేపథ్యం వల్ల గోపీచంద్ కూడా చిన్న వయసులోనే మార్క్స్, ఎంగెల్స్ రచనలు చదివాడు. సైన్సు చదువుకున్నాడు. హేతువాదిగానూ, నిరీశ్వరవాదిగానూ పెరిగాడు. కొంత రాయిస్టు కూడా. కాని కాఫ్కా కథ చదివినతరువాత అతడు ఒకటీ ఒకటీ కాఫ్కా రచనలన్నీ తెప్పించుకుని చదివాడు. ఆ తర్వాత రాజమండ్రినుండి రాయగడలో జె.కె.పేపర్ మిల్లులో కెమిస్టుగా చేరిన తర్వాత మరీ కాఫ్కాకి సన్నిహితుడయ్యాడు. అటువంటి రోజుల్లో ఒకనాడు తన భార్యనీ, పిల్లవాణ్ణీ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పణ్ణుంచి ఇప్పటిదాకా అతడి జాడ తెలియదు.
 
ఇదిగో, ఈ కవిత రాసుకోవటం తప్ప నాకు ఏమి చెయ్యాలో తెలియలేదు. ఇప్పటికీ.
 
~
 
అయినా నాకిష్టం
తనని తాను మోసగించుకోలేని మనిషిలాంటిదా పట్టణం.
 
అతడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, తెల్లవారితే లేదెటువంటి ఉత్తరం
ఏ సందేశం, ఎక్కడ కూడా లేదెటువంటి చేవ్రాలు
ఇప్పుడే వస్తానుండండని రైలు దిగివెళ్ళిపొయ్యాడతడు.
 
సాయంకాలమంతా గడిపాక ‘ఇక వెళ్ళొస్తాన’ ని
తన ఇంటికో, గదిలోకో, తనుండే ఊరికో వెళ్ళినట్టే
వెళ్ళిపోయాడతడు, మరేమీ చెప్పకుండా
వదిలి ఉంచకపోయినా ఏ సంకేతాలూ.
 
పసిగట్టగలను నేనూ కొన్ని ఆనవాళ్ళు
మొదటిది: అన్నాడొకమాటు ‘ఎవడూ లేడని తెలిస్తే భరించలేం
సర్వాంతర్యామి నేత్రమేమీ లేదు, నీకు బాధ్యుడివి నువ్వే.’
చెప్పకపోయినా రెండవది, మూడవది, నాల్గవది, పట్టగలనిప్పుడా జాడలు.
 
మొదటిది: ఆ రైల్వే స్టేషన్ ఎదట ఆ పిచ్చిది, గుడ్డలిప్పుకు తిరిగేది
చూడు, దానికి నువ్వే బాధ్యుడివి.
 
రెండవది: ఆ హోటల్ బల్లలమీద చాలీ చాలని నిద్రకళ్ళ చిన్నారులు
తన్నుల్తో తెల్లవారుతుంది, ఉమ్ముల్తో పొద్దు కుంకుతుంది
కడిగే కప్పుల్తో లెక్కపెట్టుకుంటారు రోజుల్ని
అవును, వాళ్ళకి నువ్వే బాధ్యుడివి.
 
మూడవది, చదివావు కదా, పేపర్లో, ఎక్కడో ఆఫ్రికాలో లేదా పెరూలో
ఉగాండాలో, టింబక్టూలో
ఒక మనిషి చర్మాన్ని ఒలిచి దుప్పటిగా కప్పుకున్నారని , లేదా
అటువంటిదేదో
తప్పదు, ఒప్పుకో, తెలియని ఆ దేశాల తెలుస్తున్న గాథలన్నిటికీ
‘నువ్వే బాధ్యుడివి ‘, ‘నువ్వే బాధ్యుడివి ‘
 
ఇక రెండు విషయాలు మిగిలాయి, చెప్పేస్తానవి కూడా
ఒకటి: గాబ్రియల్ గార్షియా మార్క్వుజ్ నోబెల్ బహుమతినందుకుంటూ
చెప్పాడట కొన్ని మాటలు, వందేళ్ళ ఏకాకి నిశ్శబ్దాన్ని చీల్చుకొచ్చిన మాటలు
హారి దేవుడా, ఎవరిచ్చారో గాని ఆ పుస్తకాన్ని, చదివాతడా మాటలు.
 
రెండు: అవును, ఆ అత్యంత దురదృష్టకరమైన ఆ రెండవ సంఘటన జరిగింది నా వల్లే
ఇచ్చానతనికి కాఫ్కా కథని, ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని ఇంకుతో కొట్టేసి ఉంటే సరిపోయేది.
కాని ఏ వాక్యాన్ని చెరిపెయ్యాలో నాకేం తెలుసు, బహుశా తెలియదు కాఫ్కాకి కూడా
తగలబెట్టెయ్యమన్నాడట తన రచనలన్నిటినీ
అదిగో ఆ వాక్యమే ( ఇప్పటికీ తెలియదు నాకా వాక్యం) అతణ్ణి అదృశ్యం చేసేసింది.
 
(పునర్యానం, అగ్ని, 2:17)
 
ప్యోతోర్ దుమాల్ అనే ఆయన కాఫ్కా మీద తీసిన యానిమేషన్ చూడగానే ఇదంతా నా మనసులో చెలరేగింది మళ్ళా మరొకసారి.
 
2-11-2021

Leave a Reply

%d bloggers like this: