మగత్తాన ఆసిరియర్

నిన్న పొద్దున్న జయమోహన్ నుంచి ఒక మెసేజి. నేను తమ సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు చెప్తూ, కొన్నేళ్ళ కిందట తాము ప్రసిద్ధ కన్నడ సాహిత్యవేత్త ఎచ్.ఎస్.శివప్రకాశ ని పిలిచినప్పుడు ఆ సెషన్ గొప్పగా శోభించిందనీ (electrifying) , తిరిగి మళ్ళా నాతో చేసిన గోష్టి ఆ విధంగా అనిపించిందనీ రాసారు. నన్ను వారికి పరిచయం చేసిన మిత్రుడు రాజు కూడా, ఆ కార్యక్రమాల మీద కదిర్ మురుగన్ అనే మిత్రుడు రాసిన సమీక్ష నాకు పంపించాడు. ఆ సమీక్షకుడు నా సెషన్ గురించి రాస్తూ ‘గొప్ప గురువు’ ( మగత్తాన ఆసిరియర్ ) దగ్గర తెలుగు సాహిత్యం గురించి తెలుసుకున్నట్టు ఉందని రాసాడట. మరొక మిత్రుడు కూడా నాకు మెసేజి పెడుతూ, ఆ సెషన్ తనని నిశ్చేష్టుణ్ణి (awestruck) చేసిందని రాసాడు. ఈ ప్రతిస్పందనలన్నీ ఒక సాహిత్యబృందంగా వారి జిజ్ఞాసనీ, ఉన్నత సంస్కారాన్నీ మరింతగా నాకు పరిచయం చేస్తున్నాయి. కాని ఆ గోష్టిని ఎవరూ రికార్డు చేసినట్టు లేదు. అందుకని, నాకు గుర్తున్నంతవరకూ, కొన్ని ప్రశ్నల్నీ, వాటికి నా సమాధానాల్నీ ఇక్కడ పొందుపరిచే ప్రయత్నం చేస్తాను.
 
గోష్టి ప్రారంభిస్తూ నా మిత్రుడు నేను తెలుగు సీమలో గోదావరీ తీరానికి చెందినవాణ్ణనీ, తెలుగు ఆదికావ్యం గోదావరి ఒడ్డునే వికసించిందనీ, ఆధునిక యుగంలో కందుకూరి వీరేశలింగంతో పాటు తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన గొప్ప రచయితలు చాలామంది గోదావరి ఒడ్డునే సాహిత్య కృషి చేసారనీ చెప్పాడు. నేను గోదావరి జిల్లాలో గిరిజన ప్రాంతంలో పుట్టిపెరిగాననీ, నా తండ్రి అక్కడ గ్రామాధికారిగా పనిచేసాడనీ, అక్కడి గిరిజనజీవితం, ప్రాకృతిక సౌందర్యం నన్ను గాఢంగా ప్రభావితం చేసాయని చెప్తూ, చిన్నప్పుడు మా అక్క, ఆ తర్వాత ఎందరో సాహిత్యవేత్తలు నాకు సాహిత్యాన్ని లోతుగా పరిచయం చేసారనీ చెప్పాడు. ఆ తర్వాత నా కవిత్వ సంపుటాలు ప్రతి ఒక్కదాని గురించీ స్థూలంగా పరిచయం చేస్తూ, తన వంతు ప్రశ్నగా మొదటి ప్రశ్న అడిగాడు.
 
నేను ఆ ప్రశ్నకి జవాబివ్వడానికి ముందు, నేను రెండువేల తమిళ కవిత్వానికి ఆరాధకుణ్ణని చెప్పాను. నాకు తమిళం రాదనీ, లిపి కూడా పోల్చుకోలేననీ, ‘క’ కీ ‘చ’ కీ మధ్య తేడా గుర్తుపట్టలేననీ, అయినా కూడా పూర్వ తమిళ సాహిత్యం సంగం కాలం నాటి ఎనిమిది సంకలనాలూ, పది దీర్ఘకవితలూ, పంచమహాకావ్యాల్లో శిలప్పదికారంతో పాటు తిరుక్కురళ్, కారైక్కాల్ అమ్మైయ్యార్, ముగ్గురు నాయనార్లు, మాణిక్యవాచకర్, ఆళ్వార్లతో పాటు, సుబ్రహ్మణ్య భారతియార్ దాకా మహాకవుల కవిత్వాన్ని ఇంగ్లిషులో చదువుకోగలిగాననీ, ఆ విధంగా ఆ కవిత్వాన్ని ఇంగ్లిషులో అందించగలినందుకు తమిళ సాహిత్యలోకానికి నేనెప్పటికీ కృతజ్ఞుణ్ణనీ చెప్పాను.
మహావిద్వాంసుడు స్వామినాథ అయ్యర్ ఆత్మకథ చదివి ఆయన మహాపండితుడు మీనాక్షి సుందరం పిళ్ళై దగ్గర విద్యాభ్యాసం చేసిన తిరువావుడుదురై ఆధీనానికి కూడా వెళ్ళానని చెప్పాను. ఆ మహాకవులు, పండితులు నన్ను ఆశీర్వదించి మీ వంటి సాహిత్యబృందానికి నన్ను పరిచయం చేసారని కూడా చెప్పాను. ఆ తర్వాత ఆ ప్రశ్నలకి జవాబులు ఇవ్వడం మొదలుపెట్టాను.
 
~
ప్రశ్న: మీరు నిర్వికల్ప సంగీతం వెలువరించిన రోజుల కవిత్వానికీ, నీటిరంగుల చిత్రం కవితలకీ మధ్య చాలా తేడా ఉంది. దీని వెనక మీమీద చీనా కవిత్వం, సంగం కవిత్వం ప్రభావం ఉందని చెప్పారు. ఆ ప్రభావం ఎటువంటిదో వివరిస్తారా?
 
జవాబు: నేను తెలుగులో కవిత్వం రాయడం మొదలుపెట్టేటప్పటికి తెలుగు సాహిత్యలోకంలో ఒక విభజన ఉండేది, కవిత్వం ఆత్మాశ్రయం, వస్త్వాశ్రయం అనీ, ప్రేమకవిత్వం రాసేవారు ప్రగతి కవిత్వం రాయకూడదనీ, విప్లవ కవిత్వం రాసేకవి ప్రేమ కవిత్వం రాయకూడదనీ ఒక అలిఖిత శాసనం లాంటిదుండేది. అది నాకెందుకో అంగీకారయోగ్యం అనిపించేది కాదు. ఒక మనిషి హృదయంలో కలిగే అనుభూతిని మనం అలా విభజించి చూడలేమనిపించేది. కవిత్వాన్ని self-conscious అనీ, socially conscious అనీ వేరుచేయడం కృత్రిమం అనిపించేది.
 
అటువంటి రోజుల్లో మొదటిసారి ప్రాచీన చీనా కవిత్వం, ముఖ్యంగా తాంగ్ యుగం నాటి మహాకవులు, వాంగ్ వీ, లి బాయి, దుఫు, మెంగ్ హావో రాన్ వంటి వారి కవిత్వం చదివాను. వారిలో మరీ ముఖ్యంగా దు-ఫు. ఆయన ఏకకాలంలో ప్రేమికుడూ, సైనికుడూ కూడా. వాళ్ళ కవిత్వంలో అవిభాజ్యమైన హృదయస్పందన కనిపించింది. ఆ కవులు నాకు కొంత ధైర్యాన్నిచ్చారు.
 
ఆ తర్వాత ఇరవయ్యేళ్ళ కిందట ఎ.కె.రామానుజన్ పుస్తకాల ద్వారా సంగం కవిత్వం గురించి తెలిసింది. సంగం కవులు ఏకకాలంలో అకం, పురం పద్ధతుల్లో రాసిన కవితలు, ఆ తిణై, exterior నీ, interior నీ వారు సమన్వయించుకున్న తీరు నన్ను విభ్రాంతికి గురి చేసింది. ఆ కవిత్వం గురించి నాకు నా నలభయ్యేళ్ళప్పుడు కాక ఇరవయ్యేళ్ళప్పుడే తెలిసి ఉంటే ఎంతో బాగుండనిపించింది. ఒక విధంగా చెప్పాలంటే, మానవ అనుభూతిలోని వివిధ అవస్థల్ని పట్టుకోవడంలోనూ, ఆ సంక్లిష్టతలకి ఒక ఆలంకారశాస్త్రాన్ని నిరించడంలోనూ సంగం కవులు చీనాకవుల కన్నా ఎంతో ముందున్నారనీ, ఆ మాటకొస్తే ప్రపంచ సాహిత్యంలోనే అటువంటి కావ్యశాఖ మరొకటి లేదనీ అనిపించింది. ఆ తర్వాత నేను వెనుదిరిగి చూడలేదు.
 
ప్ర: మీ కవితలు చదివాం. అవి ఆధునికంగా ఉన్నాయి. అయితే తెలుగు కవిత్వంలో స్థానికత ఎంతవరకూ ఉంటుంది? మీమీద స్థానిక ప్రభావాలు ఏ మేరకు ఉన్నాయి?
 
జ: అసలు తెలుగు కవిత్వం మొదటినుంచీ కూడా మార్గ-దేశి సంప్రదాయాల సంగమంగా ఉంటూ వచ్చింది. తెలుగులో చెప్పుకోదగ్గ ప్రతి ఒక్క కవీ ఈ మార్గ-దేశి ధోరణుల్లో ఏదో ఒకరీతిలో తనదంటూ ఒక వర్ణమిశ్రమం తయారు చేసుకున్నవాడే. తెలుగులో ఆది కవి అని చెప్పదగ్గ నన్నయ తన కవిత్వంలో ఎనభై శాతం మార్గపద్ధతిలోనూ, ఇరవై శాతం దేశి ధోరణిలోనూ కవిత్వం చెప్పాడు. ఆయన ఎంచుకున్న పదజాలంలోనూ, ఛందస్సుల్లోనూ, తన కావ్యవస్తువుగా మహాభారతాన్ని తీసుకోవడంలోనూ అది స్పష్టంగా కనబడుతుంది. దానిమీద ధిక్కారంగా పన్నెండో శతాబ్ది శివకవులు పాలుకురికి సోమన వంటివారు ఎనభై శాతం దేశి ధోరణిలోనూ, ఇరవై శాతం మాత్రమే మార్గపద్ధతిలోనూ కవిత్వం చెప్పారు. ఆయన ఎంచుకున్న పదజాలం దాదాపుగా తత్సమభూయిష్టంకాని తెలుగు, ఛందస్సు ద్విపద. రాసిన కావ్యం బసవేశ్వరుడి జీవితచరిత్ర.
 
అప్పుడు వాళ్ళు మార్గ అన్నదాన్ని నేను ఇప్పుడు global అంటాను. దేశి అని వ్యవహరించినదాన్ని local అంటాను. నా కవిత్వంలో కూడా ఈ రెండు సంప్రదాయాల్నీ సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నేనే కాదు, తెలుగులో తన కవిత్వం శక్తిమంతంగానూ, ప్రభావశీలంగానూ ఉండాలనుకునే ప్రతి ఒక్క కవీ ఈ పని చేస్తూనే ఉన్నాడు.
 
ఉదాహరణకి ఆధునిక తెలుగు కవుల్లో అగ్రశ్రేణి కవిగా మేము కొనియాడే శ్రీ శ్రీ పదిహేడో శతాబ్దికి చెందిన వేమనని తనకి స్ఫూర్తిగా చెప్పుకున్నాడు. వేమన ఆశ్చర్యం కలిగించే కవి. ఆయన పదజాలంలో ఇది సంస్కృతం, ఇది తెలుగు అని విడదియ్యలేం. ఎటువంటి పదజాలమైనా తేటతెలుగులాగా వినిపిస్తుంది. ఆటవెలది అనే దేశి ఛందస్సుకి ఒదిగిపోతుంది. తెలుగులో చిన్నపిల్లలకి భాషాబోధన ఆయన పద్యాలతో మొదలుపెడతారు. మేమంతా అలా చదువుకున్నవాళ్ళమే.
 
కాని ఇదిగో ఇప్పుడు అరవయ్యవ ఏట అడుగుపెడుతున్న నాకు వేమన పద్యాల్ని ఇన్నాళ్ళూ నిజంగానే అర్థం చేసుకున్నానా అనిపిస్తుంది. ఈ పద్యం చూడండి:
 
అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమోగునట్టు కనకంబు మోగునా
విశ్వదాభిరామ వినురవేమ
 
ఇందులో అల్పుడు, సజ్జనుడు, కనకము సంస్కృతపదాలు. విశ్వదాభిరామ సంస్కృతపదం. వినురవేమ తెలుగు పదాల కూడిక. ఆ పాదాలు యతి స్థానం దగ్గర సరిగ్గా విడిపోతాయి. ఆ పద్యం ఎంతో స్పష్టంగానూ, వాచ్యంగానూ ఉందనుకుంటామా, కాని లోతుగా చూస్తే అందులో గొప్ప ధ్వని ఉంది. ఎందుకంటే అల్పుడూ, సజ్జనుడూ ఇద్దరూ చేసేది ‘పల్కడమే’. కాని ఒకరిది ఆడంబరమైన పలుకు, మరొకరిది చల్లగా వినిపించే పలుకు. ఆడంబరానికి వ్యతిరేకపదం చల్ల కాదు. కాని కవి చల్లగా అనే మాట ఎందుకు వాడాడు? ‘చల్లగా’ అంటే శాంతంగా అనే కాదు, నెమ్మదిగా అని కూడా అర్థం ఉంది. ఆ రెండు పలుకుల్లోనూ తేడా మూడవ పాదంలోగాని మనకి తెలియడం లేదు. అదేమంటే కంచు లాగా కనకం మోగదు అంటున్నాడు. అంటే ఆడంబరంగా పలికే పలుకు మోగే పలుకు, మోతపెట్టే పలుకు అన్నమాట. ఇంకా చెప్పాలంటే కవుల్లో కూడా రెండు రకాలూ ఉన్నారు. ఒకళ్ళు మోతపెట్టే కవులు, మరొకళ్ళు నెమ్మదిగా పలికే కవులు. అంతే కాదు నెమ్మదిగా పలికే పలుకు వేడెక్కించే పలుకు కాదు, ఉద్రేకించే పలుకు కాదు. అది చల్లటి పలుకు. నిన్ను చల్లపరిచే పలుకు. ఇలా చాలా ధ్వని ఉంది ఈ చిన్న పద్యంలో. కాబట్టి శ్రీ శ్రీ కే కాదు, నాక్కూడా వేమన ఒక ఆదర్శం, ‘చల్లగా’ పలకడం ఎలానో నేర్పే విద్యకి ఒజ్జ.
 
ప్ర: మీకు తత్త్వశాస్త్రంలో కూడా అభిరుచి ఉందని విన్నాను. మీ కవిత్వం మీద ఫిలాసఫీ ప్రభావం ఏ మేరకు ఉంది?
 
జ: నేను తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేసాను. అదంతా ఒక పెద్ద కథ. నా మిత్రుడు రాజు మీకెప్పుడేనా చెప్తాడు. కాని తత్త్వశాస్త్రం చదువుకున్నందువల్ల నాకు కలిగిన ప్రయోజనమేమంటే ఆ పదజాలాన్ని అర్థం చేసుకోగలిగే అర్హత లభించింది. Existentialism, Phenomenology లాంటి పదాలు ఇప్పుడు నాకు ఎంతో కొంత అర్థమవుతాయి. పాశ్చాత్య తత్త్వశాస్త్రమే కాదు, భారతీయ దర్శనాల్ని కూడా ఎంతో కొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేసాను.
 
కాని మీరు గమనించవలసింది, అసలు ఫిలాసఫీ ప్రయోజనమేమిటని? రస్సెల్ ఒక వ్యాసం రాసాడు. యూరోప్ లో ప్లేటో మొదలై రెండున్నర వేల ఏళ్ళ పాటు తత్త్వశాస్త్రం నడుస్తూ వచ్చాక, రస్సెల్ అసలు తత్త్వశాస్త్రం ఎందుకు దాని ప్రయోజనమేమిటని ప్రశ్నిస్తూ ఒక వ్యాసం రాసాడు. ఆయన చెప్పిందేమంటే, తత్త్వశాస్త్రం పని ప్రశ్నిస్తూ ఉండటమే, జవాబివ్వడం కాదు అని. ఏదైనా ఒక ప్రశ్న లేవనెత్తినంతవరకే తత్త్వశాస్త్రం తన తాత్త్వికతను నిలుపుకుంటుంది. దానికి ఇదీ అంటో ఇతమిత్థంగా ఏదో ఒక జవాబివ్వగానే అది మరొక సైన్సు అయిపోతుంది తప్ప, తత్త్వశాస్త్రం కాకుండా పోతుంది. ఉదాహరణకి న్యూటన్ తన పుస్తకాన్ని నాచురల్ ఫిలాసఫీ అన్నాడు. ఆయన తర్వాతే ఫిజిక్సు అనే పదం వచ్చింది. అలానే పందొమ్మిదో శతాబ్దానికి ముందు సోషియాలజీ అనే పదం, ఇరవయ్యవశతాబ్దానికి ముందు మనకు తెలిసిన అర్థంలో సైకాలజీ అనే పదం లేదు. ఇవన్నీ ఫిలాసఫీ లేవనెత్తిన ప్రశ్నలకి ఇచ్చిన జవాబుల్లోంచి పుట్టిన శాస్త్రాలు. కాబట్టి నా కవిత్వంలో కూడా తాత్త్వికత నేను ఏదో ఒక ప్రశ్నని ఎదుర్కుంటూ ఉండటంలో ఉంది తప్ప, ఏదో ఒక జవాబు ఇవ్వడంలో లేదు.
 
ప్ర: మీ కవితలు చదివినప్పుడు వాటిలో చాలా కవితలు అసలు కవిత రాయడం గురించి, మీరు కవిగా మారడం గురించే ఉన్నాయి. ఎందుకని మీరు ఈ predicament మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు?
 
జ: చాలా మంచి ప్రశ్న. అసలు ఆధునిక కవిత్వం పుట్టడమే కవి ఒక కవిత ఎలా రాస్తాడు, ఎక్కడ ఒక మాట కవితగా మారుతుంది అన్న ఆలోచనలోంచే. ఆధునిక కవిత్వానికి తొలిగొంతు అని చెప్పదగ్గ బోదిలేర్ కవిత్వం చూడండి. కవి predicament గురించిన కవిత్వమే అది. నా అన్వేషణ కూడా అదే. కవిత ఎక్కణ్ణుంచి పుడుతుంది? ఏ క్షణంలో నేను కవిగా మారుతున్నాను. ఒక వేటగాడు జంటపక్షుల్లో ఒక పక్షిని నేల కూల్చినప్పుడు మరొక పక్షి లోనైన శోకాన్ని చూసి అతడిలో శ్లోకం ప్రభవించిందని మనం విన్నాం.
 
శోకం శ్లోకంగా మారే ఆ స్థలం ఏది? అది ఎక్కడుంది? అటువంటి ఒక అనుభవం, ఒక అనుభూతి, అది temporal. దాన్ని మనం కవితగా మారుస్తున్నప్పుడు రెండు కొలతల కాగితం మీద దాన్ని spatial గా పరుస్తున్నాం. కాని ఆ కవిత నీలో ఉదయించిన ఆ క్షణం అది అవిభాజ్యక్షణం. ఆ అనుభూతి ప్రతి ఒక్క మనిషికీ సాధ్యమయ్యేదే అయినా, ఆ అనుభూతి అక్షరంగా మారుతున్నప్పుడు మాత్రం, ఆ మనిషి, అతడి ప్రజ్ఞ వ్యక్తిగతం కావు. అలాగని మనకి తెలిసిన అర్థంలో సామాజికం, సామూహికం కూడా కావు. ఒక కవిత రాసిన చినవీరభద్రుడూ, రోజూ ఆఫీసుకి వెళ్ళే చినవీరభద్రుడూ ఒకరు కారు. ఆ కవిత నాలో ఉదయిస్తున్న ఆ తావుని పట్టుకోవడంటే ఒక transcendental వ్యక్తిత్వాన్ని పట్టుకోవడం.
 
ఆ వ్యక్తిని ఒకప్పుడు మన భక్తికవులు తమ ఇష్టదైవంగా వర్ణించడానికి ప్రయత్నించారు. ఎందుకంటే, ఆ తావు ఎవరికి వారికి మాత్రమే అనుభవానికొచ్చే ఒక అనుభూతి కాబట్టి. కొందరు భక్తి కవులు దాన్నొక రూపంతో వివరించడానికి ప్రయత్నించారు, మీరా ‘గిరిధర్ గోపాల్’ అని పిలిచినట్టుగా. కొందరు దాన్ని ఒక నామంతో సంకేతపరచడానికి ప్రయత్నించారు, కబీరు రాముడిలాగా. కొందరు నామరూపాలు రెండింటినీ కలిపి చెప్పారు, బసవణ్ణ ‘కూడల సంగమేశ్వరుడి’ గురించి చెప్పినట్టుగా.
 
కాని ఆధునిక యుగం మొదలయ్యాక టాగోర్ ఆ అనుభవాన్ని ప్రపంచమంతటితోటీ పంచుకోడానికి వీలుగా ఆ నామవాచకాన్ని సర్వనామంగా మార్చేసాడు. ఆయన గీతాంజలి చూడండి. అందులో దైవం ఒక నామం కాదు, ఒక రూపంకాదు. ఎంతసేపూ ఆ దైవం ‘అతడు’, ‘ఆమె’, ‘అది’ లేదా ‘నువ్వు’. ఆ అనుభూతిని నామవాచకంగానూ, సర్వనామంగానూ గుర్తుపట్టడానికి ప్రయత్నించిన భక్తి కవుల దారిలోనే నేను నడిచాను. కాని ఆ అనుభూతిని నేనొక పేరుతో కాక, ఒక epiphany గా గుర్తుపట్టే ప్రయత్నం చేసాను. భక్తికవులకి ఆ అనుభూతి అయితే నామవాచకం లేదా సర్వనామం. నాకు అది తక్కిన భాషాభాగాలన్నీ, అంటే కొన్ని సార్లు క్రియ, కొన్ని సార్లు విశేషణం, కొన్నిసార్లు క్రియావిశేషణం, కాని చాలా సార్లు వట్టి అవ్యయం.
 
ప్ర: మాకు ఒక సంగీత సంప్రదాయం ఉంది. అందులో సంగీతం కర్ణాటకం, కాని కీర్తనలు మాత్రం తెలుగు. మాకు తెలుగు అంటే త్యాగయ్యనే. తెలుగు కవిత్వం మీద, ముఖ్యంగా ఆధునిక తెలుగు కవిత్వం మీద త్యాగయ్య, అన్నమయ్య వంటివారి ప్రభావం ఏ మేరకు ఉంది?
 
జ: చాలామంచి ప్రశ్న. తెలుగులో కవిత్వం మూడు రూపాల్లో వికసించింది. పద్యం, పదం, వచనం. కాని వెయ్యేళ్ళ తెలుగు కవిత్వంలో పద్యకవిత్వమే ప్రధాన స్రవంతి కవిత్వంగా చలామణి అవుతూ వచ్చింది. తమిళ, కన్నడ పద్యఛందస్సు కన్నా తెలుగు పద్యం చాలా కఠిన నియమాలతో కూడుకున్న వ్యవస్థ. అలాగే తెలుగు కావ్యనిర్మాణం చంపూ పద్ధతిలో అంటే పద్యం, వచనం కలిసి నడుస్తుంది. కవి కావాలనుకున్న ప్రతి ఒక్కడికీ ఒక చంపూకావ్యాన్ని నిర్మించడమే ఆశయంగా ఉంటూ వచ్చింది. దాంతో పదకవుల్ని ద్వితీయశ్రేణిలో పెట్టేసారు.
 
అన్నమయ్య పదకవితా పితామహుడు. మేమాయన్ని సంకీర్తనాచార్యుడు అంటాం. ఆయన ముందు కృష్ణమాచార్యుడు సింహగిరి వచనాలు రాసాడు. ఆయన తరువాత క్షేత్రయ్య, త్యాగయ్య, రామదాసు, వీరబ్రహ్మం వంటి పదకర్తలున్నారు.
 
అయితే ఇరవయ్యవ శతాబ్దం మొదలవుతూనే గురజాడ అప్పారావు పద్యాన్ని ద్వితీయశ్రేణికి నెట్టి పదాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఆధునిక పారిశ్రామిక యుగానికి పద్యం సరిపోదనీ పాట మాత్రమే ఇప్పటి అవసరాలకు సరిపోతుందనీ ఆయన భావించేడు. శ్రీ శ్రీ దీన్నొక రూపకాలంకారంతో వివరించేడు. పద్యం ప్రాచీన కాలపు రథం లాంటిదనీ, ఇప్పుడు మనం రోడ్లమీద మోటారు కారులో వెళ్తాం తప్ప రథంలో కాదు కదా అన్నాడాయన. గురజాడతో వెయ్యేళ్ళ తెలుగు కవిత్వం మరొక మలుపు తిరిగింది. ఆ మలుపు వెనక మహనీయులైన తెలుగు పదకర్తలందరూ ఉన్నారు.
 
ప్ర: సంగీతం గురించిన చర్చ వచ్చింది కాబట్టి, ఒక ప్రశ్న. తమిళంలో భారతియార్ కన్నా ముందటి కవిత్వం చాలావరకూ సంగీతాత్మకం. కాని భారతియార్ తరువాత తమిళ కవిత్వం సంగీతం నుంచి చాలా దూరంగా జరిగింది. తెలుగులో పరిస్థితి ఏమిటి?
 
జ: ఓహ్, ఇది నాకు చాలా ఇష్టమైన టాపిక్. ఎంతసేపేనా ఎన్ని ఉదాహరణలేనా ఇస్తూ మాట్లాడాలనిపిస్తుంది. అన్నిటికన్నా ముందు మనం గమనించవలసిందేమంటే తెలుగు సహజంగానే సంగీతాత్మకమైన భాష. ఈ మాట ప్రతి ఒక్క భాష గురించీ కూడా చెప్పవచ్చు కదా అనొచ్చు. కాని తెలుగుకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా యాభై ఆరు అక్షరాలు, సరళాలూ, పరుషాలూ సమానంగా పలికే పదజాలం, సంస్కృత, ద్రావిడభాషల సమన్వయం వంటివన్నీ తెలుగుని మరింత నాదాత్మకంగా, రాగాత్మకంగా మార్చేసాయి. తెలుగు పద్యం చదివేదికాదు, పాడేది అని కూడా మనం గమనించాలి. తెలుగు కవుల్లో అత్యంత ప్రజాదరణకి నోచుకున్న కవి పోతన్న. తెలుగునాట ఒకప్పుడు ఆయన పద్యం వినిపించని గ్రామంగాని ఇల్లుగాని లేవనే చెప్పవచ్చు. ఉదాహరణకి ఈ పద్యం చూడండి:
 
‘మందార మకరంద మాధుర్యమున..’ (పద్యం పూర్తిగా వినిపించేటప్పటికి హాలంతా కరతాళ ధ్వనులు)
 
ఆధునిక కవిత్వం మొదలయ్యాక, పద్యాన్ని పక్కన పెట్టేసిన శ్రీ శ్రీ వంటి వాడి కవిత్వంలో కూడా ఆ నాదాత్మకత అలానే కొనసాగింది. ఈ కవిత చూడండి:
 
‘కవితా, ఓ కవితా ‘( కవితలో కొంత భాగం వినిపించగానే మళ్ళా హాలంతా ఆగకుండా కరతాళ ధ్వనులు)
 
కాని ఇరవయ్యవశతాబ్దం చివరికి వచ్చేటప్పటికి కొందరు కవులు కవిత్వంలోని ఈ నాదాత్మకతమీద తిరుగుబాటు చేసారు. కవిత తన భావనాబలం వల్ల కవితగా నిలబడాలి తప్ప, సంగీతం వల్ల కాదని వారి వాదన. గొప్ప సంగీతకారుడు రాగాలాపన చేస్తున్నప్పుడు ఎలాగైతే స్వరాల్ని మాత్రమే పట్టుకుని కీర్తనని వదిలిపెట్టేస్తాడో అలానే కవి కూడా శుద్ధస్థాయిలో అక్షరాల్ని మాత్రమే పట్టుకుని సంగీతాన్నివదిలిపెట్టెయ్యాలని వారి వాదన. ఇస్మాయిల్ అనే కవి రాసిన ఈ కవిత చూడండి:
 
పికాసో చిత్రమైన అచిత్రకారుడు.
అతడు గీసిందానికన్నా
చెరిపిందే ఎక్కువ
మన కళ్ళమీది మసకల్ని చెరిపేసాడు.
అప్పణ్ణుంచీ మన కళ్ళు ఎగరడం నేర్చుకున్నాయి.
 
( కవిత వినిపించినప్పుడు నిశ్శబ్దం, దాని అర్థం మళ్ళా ఇంగ్లిషులో వివరించినప్పుడు చప్పట్లు).
 
నేను కూడా ఒకప్పుడు ఆ వాదన ప్రభావానికి లోనయి కవిత్వం రాసాను. నా ‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ ‘ అన్న సంపుటంలో కవితలు చాలావరకు ఆ పద్ధతిలో రాసినవే. కాని ఏళ్ళ మీదట ఇప్పుడు నా అభిప్రాయం మార్చుకున్నాను. మంచి కవితకి శబ్దమూ, అర్థమూ రెండూ ముఖ్యమే. Music, meaning రెండూ ముఖ్యమే.
 
ఇప్పుడు పాశ్చాత్య విమర్శకులు వీటిని metonymy, metaphor అని వ్యవహరిస్తున్నారు. ఈ పదాలు మనకి మొదట్లో కొంత గందరగోళంగా వినిపించవచ్చుగానీ, ఈ భావనలు మనకి బాగా చిరపరిచితమైనవే. వీటిని మన లాక్షణికులు శబ్దాలంకారాలూ, అర్థాలంకారాలూ అన్నారు. ఒక కవిత వేరే భాషలోకి అనువాదమైనుప్పుడు నష్టపోయేది శబ్దాలంకారం. కాని ఒక కవిత వేరే భాషలోకి వెళ్ళినప్పుడు కూడా దాన్ని బతికించేది అర్థాలంకారం. మంచి కవిత్వానికి రెండూ అవసరమే.
 
ప్ర: ఇప్పటి యువతకి ఈ కవిత్వం మీద శ్రద్ధ ఉండటం లేదు. వారి దృష్టి ఎంతసేపూ అమెరికా మీదనే ఉంటోంది? దీనికి మీరేమంటారు?
 
జ: అందుకు కారణం నాలాంటి వాళ్ళు చెయ్యవలసినంత కృషి చెయ్యకపోవడమే. ఇంగ్లిషు కవిత్వం మొత్తం కలిపి ఎనిమిది శతాబ్దాల సాహిత్యం. అమెరికా అయితే రెండు వందల ఏళ్ళే. కాని తమిళం రెండువేల యేళ్ళ సాహిత్యం, సంస్కృతి. తిరుక్కురళ్ లో మూడో అధ్యాయం, దాని పేరేమిటి? (కామత్తుప్పాల్ అని చాలా గొంతులు సమాధానమిచ్చాయి) ఆ అధ్యాయంలో ఉన్న కవిత్వంతో సమానమైన కవిత్వాన్ని నేనిప్పటిదాకా ఎక్కడా చదవలేదు. ప్రసిద్ధి చెందిన యూరపియన్ కవుల్ని నేనెందరినో చదివాను. జర్మన్, స్పానిష్, ఫ్రెంచి, రష్యన్, కాని అటువంటి కవిత్వం నాకెక్కడా తారసపడలేదు. హైకూ ఉంది కాని అది మూడు పాదాల కవిత. కురళ్ కేవలం ఒకటిన్నర పాదాలు మాత్రమే. మరి అంత గొప్ప కవిత్వం మీకుండి కూడా మీ యువత దాన్ని పట్టించుకోవడం లేదంటే అది నిజంగా విషాదకరం. ఈ పరిస్థితి తెలుగులో కూడా ఉంది. ఇక్కడ సాహిత్యగోష్టి అంటే కనీసం ఇంతమంది యువతీయువకులు వచ్చారు. అదే, తెలుగులో అయితే, సాహిత్యంటే దాదాపుగా pensioners pass time మాత్రమే. దీన్నుంచి బయటపడాలంటే ప్రతి భాషలోనూ, ప్రతి ఊళ్ళోనూ ఒక జయమోహన్ రావలసి ఉంటుంది.
 
ప్ర: మీ కవితలు చదివాను. అందులో మూడు రకాల ధోరణులు కనిపించాయి. మీరు చిత్రకారులు కాబట్టి వాటిని కాన్వాస్ లు అంటాను. ఉదాహరణకి కవిత రాయడంటే ప్రపంచాన్ని మేల్కొల్పడం..’అంటో రాసిన మీ కవితలో బయటి ప్రపంచం గురించిన స్పృహ ఉంది. దానిలో కొంత ప్రోపగాండా ఉందనికూడా చెప్పవచ్చు. అదే మరో కవిత ‘పిల్లలకి తిండి లేని గ్రామాల్లో పాలు నల్లగా ఉంటాయి ‘ అని రాసిన కవితలో ప్రోపగాండా కన్నా మీలో మీరు ఆవేదన చెందే పాలు ఎక్కువ ఉందనిపిస్తున్నది. ఇక మీరు ‘వేపపూల తీపిగాలి మిమ్మల్ని గాయపరుస్తున్నదని’ రాసిన కవితలో పూర్తి యాబ్ స్ట్రాక్ట్ గా, మీలో మీరు పూర్తిగా లీనమై రాసినట్టు వినిపిస్తున్నది. ఇవి మూడు వేరు వేరు కాన్వాసులుగా నాకు కనిపిస్తున్నాయి. నా ప్రశ్న ఏమిటంటే, మీరు ఈ మూడు కాన్వాసులూ ఏకకాలంలోనే చిత్రించారా లేకపోతే మీ జీవితంలో వివిధ దశల్లో చిత్రిస్తూ వచ్చారా?
 
జ: మీ ప్రశ్న నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఒక కవి రాసిన కవితల్ని, అది కూడా అనువాదాల్లో చదివి ఇంత లోతుగా మననం చెయ్యవచ్చా? ఈ ప్రశ్నతో మీ సాహిత్యబృందం పట్ల నాకు మరింత గౌరవం పెరుగుతున్నది.
 
మీరడిగినది నిజమే. ఆ మూడు కవితలూ మూడు వేరు వేరు అవస్థలకు చెందిన కవితలు. కాని అవి నేను రాసిన ‘పునర్యానం’ అనే ఒక కావ్యంలోని కవితలు. నేను ఆ కావ్యాన్ని తైతీరీయ ఉపనిషత్తు స్ఫూర్తితో రాసాను. మీకు తెలుసు తైత్తిరీయం మానవ చైతన్యం అయిదు కోశాలతో నిర్మాణమైందని చెప్తుంది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన మయ, ఆనందమయ కోశాలు అని. హెన్రిక్ జిమ్మర్ అనే ఒక జర్మన్ ఇండాలజిస్టు ఆ ఉపనిషత్తుని universal communist manifesto అన్నాడు. మామూలుగా సామాజిక స్పృహతో రాసే కవిత్వం అన్నమయ, ప్రాణమయ కోశాల్ని మాత్రమే పట్టించుకుంటుంది. వాటిని దాటిన లోకాల్ని కూడా చూడాలన్న తపనతో నేనా కావ్యం రాసాను.
 
చివరి ప్రశ్న: మీ కవిత్వం చాలావరకూ contemplative. అది reactive కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది spiritual గా కూడా ఉంది. ఇది మీరు తెలిసి చేస్తున్న పనేనా?
 
జ: అవును. నేనింతకుముందే చెప్పినట్టుగా, నాలోపలి మనిషిని పట్టుకునే ప్రయత్నంలో నేను కవిత్వం రాస్తున్నాను. ఆ లోపలి మనిషి నా బయటి జీవితపు ‘నేను’ కాదు. కాని నా బయటి జీవితం లేకపోతే ఆ లోపలి నేను కూడా లేడు. అంటే నేను నా బయటి జీవితం ఆధారంగా ఆ లోపలి ‘నేను ‘ ని పట్టుకోవడం ద్వారా మీ లోపలి ‘నేను’ కి connect అయి మీకందరికీ చేరువకావాలన్నదే నా తపన.
 
31-12-2021

One Reply to “మగత్తాన ఆసిరియర్”

 1. ఈ గద్యం నాకు కుడా electrifying గా మీటింది.

  సంగం కవులు, తిరుకురల్ వంటి వారి తమిళ సాహిత్యం గుర్చి మీ వ్యాక్యానం..అశ్చర్యం కలిగించలేదు..కాని..నా శరీరం గ్గగుర్పాటు కు గురై..కళ్ళు చమ్మర్చాయి. ఎందుకో తెలియదు.

  ఇంకా నా లో సత్యాన్వేషకుడి ని తృప్తి పరిచిన అంశాలు.
  ->మార్గ – దేశి పద్దతుల వ్యాక్యానం..
  ->తత్త్వశాస్త్రం పని ప్రశ్నించడమే అనే స్పష్టత.
  ->తెలుగు భాష సంగీతాత్మకత.

Leave a Reply

%d bloggers like this: