నేను కూడా భాగస్వామిని

Reading Time: 3 minutes

ఆ ఫొటో ఈ మధ్య నేను తాడికొండ గురుకులపాఠశాలకు వెళ్ళినప్పటిది. రాలిన ఆ పున్నాగ పూల పక్కన ఉన్న పాత భవంతి ఒకప్పటి మా ఏ-డార్మిటరి. తర్వాత రోజుల్లో దాన్ని అశోకా డార్మిటరీ అనేవారు. ఆ భవనంలో కనిపిస్తున్న ఆ చిన్న గదిలోనే ఒకప్పుడు మా ఆర్టు మాష్టారు వారణాసి రామ్మూర్తిగారు బొమ్మలు గీసుకునేవారు. అది నా స్వప్నలోకం. ఒక పసివాడుగా నేనెప్పుడూ ఆ గదిచుట్టూతా తిరుగుతుండేవాణ్ణి. కన్నబిడ్డకన్నా ఎక్కువగా నా పై ఆయన వర్షించిన ఆ ప్రేమామృతం తలపుకి వస్తుంటే ఇప్పుడు కూడా నా గుండె కరిగిపోతూ ఉంది.
 
కాలం ఎంత తొందరగా గడిచిపోయింది. చూస్తూండగానే దాదాపు యాభై ఏళ్ళు గడిచిపోయాయి. వారం రోజుల కిందట నేనక్కడ పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా నిలబడ్డాను. వారం రోజులు గడిచాయో లేదో నేనీ రోజు పాఠశాల విద్యాశాఖ బాధ్యతలనుంచి రిలీవ్ అవుతూ గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడిగా చేరబోతున్నాను.
 
రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో చేరి ముప్పై నాలుగేళ్ళు గడిచిపోయాయి. ఈ మూడున్నర దశాబ్దాలుగా విద్యకి సంబంధించిన బాధ్యతలే నిర్వహించే అవకాశం రావడం నా భాగ్యం. అన్నింటికన్నా ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖకి ఇంఛార్జి కమీషనరుగా, డైరక్టరుగా, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టుకీ, ఆ తర్వాత సమగ్ర శిక్షా ప్రాజెక్టుకీ స్టేట్ ప్రాజెక్టు డైరక్టరుగా పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. నా గురువులు నాకు అందించిన ఆశీస్సు. ఆ మాటే చెప్పాను గౌరవనీయ ముఖ్యమంత్రిగారితో. ‘ Sir, with tears in my eyes, I tell you, you have given me an opportunity to render a life fulfilling responsibility ‘ అని.
 
రెండున్నరేళ్ళ ఈ కాలం ఎంత సుదీర్ఘంగా గడిచింది! ఎంత అవ్యవధిగా కూడా గడిచిపోయింది! బహుశా ఈ రెండున్నరేళ్ళల్లో పాఠశాల విద్యాశాఖ చూసినన్ని సంస్కరణలు గత యాభై ఏళ్ళ కాలంలో ఎన్నడూ చూసి ఉండదు. రెండు సార్లు కరోనా చుట్టుముట్టిన ఈ కాలంలాంటి విపత్కర కాలం కూడా విద్యారంగం ఎన్నడూ చూసి ఉండదు. కాని ఎన్నో సమస్యల మధ్య, ఒడిదుడుకుల మధ్య, మహమ్మారి ఎదట, పాఠశాల విద్యాశాఖ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామిని కావడం నిజంగా జన్మసార్థక్యంగా భావిస్తున్నాను.
 
ఇప్పటికే రెండు సార్లు అమలు చేసిన అమ్మఒడి, రెండు సార్లు పిల్లలకు అందించిన జగనన్న విద్యాకానుక, పిల్లల్ని బడికి రప్పించడంకోసం, వాళ్ళకి రుచికరమైన, ఆకర్షణీయమైన, పుష్టికరమైన మధ్యాహ్నభోజనం అందించడంకోసం అమలు చేస్తున్న గోరుముద్ద, అన్నిటికన్నా ముఖ్యం, దాదాపు పదహారు వేల పాఠశాలల్లో ఇప్పటికే పూర్తయిన మనబడి నాడు నేడు- ఈ కార్యక్రమాల రూపకల్పనలో, అమలులో, సమీక్షలో నాక్కూడా కొంత స్థానం లభించడం నేనూహించని అవకాశం.
 
ఒకటవ తరగతి నుండి ఏడవతరగతి దాకా రూపకల్పన చేసిన కొత్త పాఠ్యపుస్తకాలు, మొదటిసారిగా రాష్ట్రంలో ఒకటవ తరగతినుండి అయిదవ తరగతి దాకా అందించిన వర్కు పుస్తకాలు, కరోనా కాలంలోనూ, కరోనా తరువాతా అందించిన విద్యావారథి బ్రిడ్జి కోర్సులు, విద్యాకలశం, విద్యామృతం వంటి ఆన్ లైన్ కోర్సులు, నిరంతర ఉపాధ్యాయ శిక్షణాకార్యక్రమాలు మామూలు ప్రయత్నాలు కావు.
 
పాఠశాల విద్యాశాఖ సంచాలకుడిగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు పర్సన్ ఇంఛార్జిగా కూడా ఉండే అవకాశం లభించడంతో పెద్ద ఎత్తున పాఠశాలల్నీ, గ్రంథాలయాల్నీ అనుసంధానం చేస్తూ ‘చదవడం మాకిష్టం’ లాంటి కార్యక్రమాన్ని చేపట్టగలిగాం. ఎన్నో ఏళ్ళుగా కొనుగోలు లేకుండా నిలిచిపోయిన గ్రంథాలయ పుస్తకాల కొనుగోలు పునరుద్ధరించగలిగాం. ఇక స్వాతంత్య్ర అమృతోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది జరిపిన జాతీయ గ్రంథాలయ వారోత్సవానికి గొప్ప స్పందన రావడం కూడా చూసాను.
 
తాడికోండలోని రీజనల్ స్కౌట్ ట్రయినింగ్ సెంటరులో నా పసితనంలో నేను అందుకున్న స్కౌటు శిక్షణని నేనెప్పటికీ మరవలేను. గిరిజనసంక్షేమాధికారి పనిచేస్తున్నప్పుడు అదిలాబాదులో, విశాఖపట్టణంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ తప్పనిసరి కార్యక్రమంగా ప్రవేశపెట్టాను. ఇప్పుడు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ ఛీఫ్ కమిషనర్ గా స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాన్ని బలోపేతం చెయ్యడానికి కూడా నేను చెయ్యగలిగినదంతా చేసాను.
 
ఈ కాలమంతా రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ పర్యటించాను. ఎన్నో పాఠశాలలు సందర్శించాను. ఎందరో ఉపాధ్యాయులతో, పిల్లలతో కలుసుకోగలిగాను, వారితో మాట్లాడేను, నా మనసు విప్పి నిస్సంకోచంగా వారి ముందు పరిచాను. జిల్లా విద్యాశాఖా కార్యాలయాలు, సమగ్ర శిక్ష కార్యాలయాలు, జిల్లా విద్యా శిక్షణా సంస్థలు, స్కూల్ కాంప్లెక్సులు, మండల రిసోర్సు కేంద్రాలు, భవిత కేంద్రాలు, మదర్సాలు- శ్రీకాకుళం నుండి అనంతపురందాకా రాష్ట్రమంతా సంచరించాను.
 
ఈ రెండున్నరేళ్లు నిర్విరామంగా అహర్నిశలు పని చేశాను. దాదాపు పాతిక వేల ఫైళ్ళు క్లియర్ చేసివుంటాను. కొన్నివేల అర్జీలు, దరఖాస్తులు పరిష్కరించి ఉంటాను. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యల్నీ, వందలాది కోర్టు కేసుల్నీ ఒక కొలిక్కి తెచ్చే పని చేసాను.
 
అన్నిటికన్నా ముఖ్యం, ఈ రెండున్నరేళ్ళ కాలంలో పాఠశాల విద్య గురించి నేనెంతో తెలుసుకున్నాను. దాదాపు మూడు దశాబ్దాల పాటు గిరిజన బాలబాలికల వైపునుంచి పాఠశాల విద్యాశాఖని చూస్తూ వచ్చాను. ఇప్పుడు ఆ శాఖాధిపతిగా గడిపిన రెండేళ్ళ కాలంలో ఆ శాఖ ను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగాను. ఈ దేశంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడాలంటే ఏమి చెయ్యవలసిఉంటుందో ఇప్పటికి నాకు అర్థమయింది.
 
నా ఉద్యోగ జీవితం తొలి పదేళ్ళ కాలంలో గిరిజన విద్యారంగంలో నేను నేర్చుకున్న పాఠాల్ని ‘కొన్ని కలలు కొన్ని మెలకువలు ‘పేరిట గ్రంథస్థం చేసాను. పాఠశాలని పిల్లవాడికి అందుబాటులోకి తేవడమెలా అన్నది ఆ అనుభవాల సారాంశం. ఆ తర్వాత రెండున్నర దశాబ్దాలుగా, ముఖ్యంగా ఈ రెండున్నర ఏళ్ళుగా schooling is not learning అనే మెలకువతో విద్యారంగంలో పనిచేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ అనుభవాలూ, నేను నేర్చుకున్న కొత్త పాఠాలూ ‘మరి కొన్ని కలలు, మరికొన్ని మెలకువలు’ గా రానున్నాయేమో!
 
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారికి, మా ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి, విద్యా శాఖలో నా సహోద్యోగులకు, అందరు విద్యాశాఖ అధికారులకు, ఇంజనీర్లకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష సిబ్బందికి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ పేరుపేరునా ఆశీస్సులు.
 
29-11-2021

Leave a Reply

%d bloggers like this: