తేజో సముద్రపు కెరటం

ముగ్గురు టాగోర్ల గురించి చాలానే మాట్లాడుకున్నాం, వాళ్ళు గడిచిపోయిన కాలానికి చెందిన చిత్రకారులు, ఇప్పుడా ఆ బెంగాల్ లేదు, ఆ భారతదేశమూ లేదు అంటారు చాలామంది చిత్రకళాచరిత్రకారులు.
 
ఒకప్పుడు ఇరవయ్యవశతాబ్దంలోకి భారతదేశం మేల్కొంటున్న కాలంలో, కొత్త చిత్రకళని ఆవిష్కరించడం కోసం అవనీంద్రనాథ్ టాగోర్ అజంతా చిత్రలేఖనాలవైపు చూసాడు. పందొమ్మిదో శతాబ్దపు ఐరోపీయ చిత్రకళా ఉద్యమాల ప్రభావాన్ని తిరస్కరించి ప్రాచీన ప్రాచ్యకళా రీతుల్ని అన్వేషించడం మొదలుపెట్టాడు. అటువంటి రోజుల్లో జపాన్ కి చెందిన రసజ్ఞుడు ఒకకురొ కకుజొ ఆయనకి జపనీయ వాష్ టెక్నిక్ ని పరిచయం చేసాడు. సుమి-యె గా ప్రసిద్ధి చెందిన జపనీస్ ఇంక్ డ్రాయింగ్ నీ, జపనీస్ ప్రింట్ మేకింగ్ నీ పరిచయం చేసాడు. ఆ మాటకొస్తే పందొమ్మిదో శతాబ్దంలో పారిస్ లో, అమస్టర్ డాంలో చిత్రకారులు కూడా జపనీస్, చైనీస్ శైలి చిత్రలేఖనాల్ని చూసే కద తమ చిత్రకళని నవీన పర్చుకున్నది!
 
అవనీంద్రుడు జపనీయ శైలిని, అజంతా శైలినీ, భారతీయ గ్రామీణ చిత్రలేఖన శైలినీ మేళవించి ఒక నవీన భారతీయ శైలిని రూపొందించాడు. దాన్నే బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనీ, బెంగాల్ వాటర్ కలర్ అనీ, బెంగాల్ వాష్ టెక్నిక్ అనీ అంటారు. గగనేంద్రనాథ్ టాగోర్ అవనీంద్రుడి సోదరుడు. ఆయన కూడా తన అన్న బాటలోనే అద్భుతమైన చిత్రలేఖనాలు గీయడం మొదలుపెట్టాడు. టాగోర్ వారికి వరసకు మేనమామ అవుతాడు. ఆయన కూడా తన జీవితంలో కొద్దిగా ఆలస్యంగా, తనకు సాహిత్యకారుడిగా రావలసిన పేరు ప్రఖ్యాతులన్నీ లభించిన తరువాత, మరెవరైనా ఆ స్థాయికి చేరుకున్నాక జీవితంలో మరింకేమీ సాధించవలసింది లేదని భావించుకునే తరుణంలో, చిత్రకారుడిగా మారాడు. టాగోర్ బెంగాల్ వాష్ టెక్నిక్ లో బొమ్మలు గియ్యలేదు. కాని ఆయనకి తనలోని చిత్రకారుణ్ణి మేల్కొల్పడానికి యూరప్ వైపు చూడవలసిన అవసరం లేకుండాపోయింది. అందుకు ఆయన తన ఇద్దరు మేనల్లుళ్ళకీ ఋణపడి ఉంటాడు.
 
అవనీంద్రుడి చిత్రలేఖనాలు ఇంకా ట్రంకు పెట్టెల్లోనే ఉన్నాయి. ఆ సర్వస్వం ఇంకా పూర్తిగా రసజ్ఞుల కంటపడలేదు. కాని గగనేంద్రుడి చిత్రాలు మాత్రం పూర్తిగా మనకి లభ్యమవుతున్నాయి. వాటిలో చైతన్యమహాప్రభు సిరీస్ లో ఆయన చిత్రించిన చిత్రాల్లో ఒక చిత్రం ఈ దేవాలయ ద్వారం చిత్రం.
 
మొన్న నేను గగన్ బాబు చిత్రించిన ప్రతిమా విసర్జన్ చిత్రాన్ని పంచుకున్నప్పుడు మిత్ర్తుల హృదయాలు సంతోషంతో మూలగడం గమనించాను. అప్పుడే అనిపించింది నాకు, ముగ్గురు టాగోర్లకీ మృతి లేదు అని. ఆ చిత్రకళ అజరామరం అని.
 
ఈ చిత్రమే చూడండి. ఇది బెంగాల్ వాష్ టెక్నిక్ లో గీసిన చిత్రం. వాష్ టెక్నిక్ చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మొదటగా తాము గీయాలనుకున్న చిత్రానికి ఇంకులో ఔట్ లైన్లు గీసుకుంటారు. అప్పుడు ఆ కాగితాన్ని పూర్తిగా తడుపుతారు. అలా తడిపినప్పుడు చెరిగిపోయిన ఇంకు చెరిగిపోగా, ఆ ఔట్లైన్లు మిగిలిపోతాయి. అప్పుడు మళ్ళా ఆ గీతల మధ్య ఉన్న వివిధ ఆకృతులకి రంగులు పూస్తారు. అప్పుడు మళ్ళా ఆ బొమ్మని తడుపుతారు. చెరిగిపోయిన రంగు చెరిగిపోగా మిగిలిన రంగు ఆ కాగితంలోకీ ఇంకిపోయి మనకి కనిపిస్తుంది. మళ్ళా అప్పుడు ఆ బొమ్మ వెనక బాక్ గ్రౌండ్ కి రంగు పూస్తారు. అప్పుడు మళ్ళా తడుపుతారు. అదనంగా ఉన్న రంగు కరిగిపోయి అవసరమైన మేరకే రంగు మిగులుతుంది. మళ్ళా మరొకసారి పారదర్శకమైన మరొక రంగు పూత పూస్తారు. మళ్ళా తడుపుతారు. ఇలా తాము అనుకున్న ఎఫెక్ట్ వచ్చేదాకా రంగుపూస్తూ, తడుపుతూ వెళ్తారు. చివరికి బొమ్మ చిత్రణ పూర్తయ్యేటప్పటికి, ఒక అలౌకిక వాతావరణం ఆ బొమ్మలో ప్రస్ఫుటం కావడం మొదలుపెడుతుంది.
 
ఈ టెంపుల్ డోర్ చిత్రమే చూడండి. ప్రాతఃకాలవేళ ఆ దేవాలయంలో తెర ఇంకా తొలగకముందు, ఆ భిక్షువులూ, సాధువులూ, సన్న్యాసులూ ఆ దేవాలయ ద్వారం దగ్గర వేచి ఉన్న ఆ దృశ్యం మనలో రేకెత్తించగ్గల అపూర్వ స్ఫురణల్నీ, స్పందనల్నీ పోల్చుకుంటూ చూడండి. అది దేవాలయమా? బౌద్ధ మందిరమా? యూదుల సినగాగా లేక కాజీ నజ్రుల్ ఇస్లాం రాసిన ప్రభాత షహనాయి వాద్య సంగీతమా? ఆ వెలుగు దేవాలయంలోంచి వస్తున్నదా లేక తూర్పుదిక్కుగా వస్తున్నదా? ఇంతకీ ఆ వెలుగు బయటినుంచి వస్తున్నదా లేక అవనత శిరస్కులైన ఆ ధ్యానుల లోపలి వెలుగునా?
ఆ వెలుగునే రవీంద్రుడు గీతాంజలి పొడుగునా చిత్రించాడు. మరీ ముఖ్యంగా చలంగారి తెలుగులో ఈ కవిత చూడండి:
 
వెలుగు,
లోకాన్ని నింపే వెలుగు, కళ్ళని ముద్దిడే వెలుగు
హృదయాన్ని మాధుర్యంతో ముంచే వెలుగు.
 
ఆహా! నా జీవితకేంద్రంలో కాంతినృత్యం చేస్తోంది
ప్రియా! కాంతి నా ప్రేమతంత్రుల్ని మీటుతోంది.
ఆకాశం తెరుచుకుంది.
గాలి రివ్వుమని పరుగుతీస్తోంది.
భూమి పైన నవ్వు గంతులేస్తోంది.
 
తేజో సముద్రంపైన శీతాకోకచిలుకలు రెక్కలు జాచాయి.
కాంతి తరంగాలపైన కలవలూ మల్లెలూ
పొంగిపోతున్నాయి.
ప్రియా! ప్రతి మేఘం పైనా కాంతి
బంగారు ఛాయతో రత్నాలను విరివిగా వెదచిమ్ముతోంది.
 
ప్రియా! ఆకునుంచి ఆకుకి ఆహ్లాదం విస్తరిస్తోంది.
అంతులేని హర్షం అంతటా ఆవరిస్తోంది.
ఆకాశగంగ తన తీరాల్ని ముంచెత్తింది.
ఆనందార్ణవం అంతటా అలముకుంది.
 
అటువంటి తేజోసముద్రపు ఒక కెరటాన్నే గగన్ బాబు ఇక్కడ చిత్రించాడనుకుంటున్నాను.
 
23-10-2021

Leave a Reply

%d bloggers like this: