చిన్న చీమ హెచ్చరిక

కాఫ్కా రాసిన మెటామార్ఫాసిస్ బాగా సుప్రసిద్ధమే. అందులో ఒక యువకుడు తెల్లవారేటప్పటికి ఒక పురుగ్గా మారిపోయి ఉంటాడు. ఆ పురుగు యూరపియన్ సాహిత్యంలో పందొమ్మిదో శతాబ్దంలోనే ప్రవేశించింది. నిజానికి ఆ పురుగు ఆదికాండంలో ఈడెన్ ఉద్యానంలోనే మొదటిసారి కనబడిందని చెప్పాలి. అప్పుడది మనిషిని సర్వేశ్వరుడికి దూరం చేసింది. తిరిగి పందొమ్మిదో శతాబ్దంలో మనిషికి సర్వేశ్వరుణ్ణి గుర్తుచేసేటందుకు కనబడిందని చెప్పాలి. ఆ ఘట్టాన్ని నా పునర్యానం కావ్యంలో ఇలా చిత్రించడానికి ప్రయత్నించాను:
 
~
 
( మా ప్రయాణమక్కడితో ఆగలేదు. సుపర్ణం నన్నక్కడినుంచి జర్మన్ సామ్రాజ్యపరిథిలోని ఫ్రాంక్ ఫర్ట్ నగరంలో జోహాన్ ఉల్ఫ్ గాంగ్ గొథే విశ్వవిద్యాలయ ఆవరణలోకి తీసుకుపోయింది. అక్కడ చెస్ట్ నట్ చెట్ల కింద ముగ్గురు విద్యార్థులు కూచుని ఉన్నారు. ఒకామె యువతి. ఆమె గొథే కావ్యం ఫౌస్ట్ చదువుతోంది. మరొక విద్యార్థి మాంచెస్టర్ కి చెందిన ఇంగ్లీషు యువకుడు. అతని దగ్గర కారల్ మార్క్స్ రచనల జర్మన్ సంపుటముంది. మూడవ వ్యక్తి ఇద్దరి కన్న వయసులో కొద్దిగా పెద్దగా కనిపిస్తున్నాడు. అతడు రష్యానుంచి వచ్చి జర్మనీలో చిన్న ఉద్యోగమేదో చేసుకుంటూ తీరికవేళల్లో యూనివెర్సిటీ విద్యనభ్యసిస్తున్నాడు. వాళ్ళ మధ్య గాఢమైన ఉద్రేకం, మధ్య మధ్య నిర్వేదంతో చర్చ సాగుతోంది.)
 
జర్మన్ యువతి
 
ఆకాశం మీంచి మానవప్రపంచాన్ని
ఐరోపా ఖండం మీదకెవరు దింపారో గాని ఎంత వేదన, ఎంత వేదన.
ఎండుకింత అశాంతిని కోరుకున్నాడు మనిషి
ఎందుకొదులుకున్నాడు అతడు దైవహస్తాన్ని, ఆ శుభ్ర ఆశీర్వచనాన్ని
తన కోసం సదా నిరీక్షించే పవిత్ర నేత్రయుగ్మాన్ని.
 
ఆధునిక మానవుడి విషాదం గొథేకి తెలుసు
సైన్సు గురించి మాట్లాడినప్పుడే, ప్రయోగపరత్వం గురించి మాట్లాడినప్పుడే
పాతాళశక్తులకమ్ముడుపోతున్నాడని మనిషి, గ్రహించాడతడు
 
ఈ స్వగతం చూడండి:
 
(అప్పుడామె ఫౌస్ట్ నాటకంలోంచి ఈ వాక్యాలు చదివింది)
 
‘”నేను తత్త్వశాస్త్రం చదివాను. న్యాయశాస్త్రం చదివాను
కొంత వైద్యశాస్త్రమూ చదివాను, ఈశ్వరశాస్త్రాలు సరేసరి
ఆ కొసనుంచి ఈ కొసదాకా ఏం కష్టపడి చదివానని
కానీ అయ్యో చూడెట్లా మూర్ఖుడిలా పడి ఉన్నానో
కాలేకపోయాను కించిన్మాత్రం కూడా ముందటికన్నా వివేకిని.”
 
తన జ్ఞానం తనకి ఎముకల్లోకీ చొచ్చుకుపోయిన మానవుడు
మన కాలపు ఐరోపామానవుడు అహంకారి, అంధుడు
అవివేకి, ఏం సాధించాడతడు దేవుడినుంచి దూరం జరిగి
తనను తాను నమ్ముకుని చివరికి అమ్ముకున్నాడొక దెయ్యానికి
అసత్యం, వంచన, ప్రగల్భం, మోసం, ప్రేమ రాహిత్యం
ఫౌస్ట్ నడిచిన దారి మనుషులు కోరుకోవలసిన దారి కాదు.
 
ఇంగ్లీషు యువకుడు
 
యువతీ, నీదొక సరికొత్త పాత ప్రలాపం, అదే సనాతన విలాపం
గ్రహించు నువ్వు గొథే మాట్లాడుతున్న ఆదర్శాలొక పై పై మాలీసు మాత్రమేనని
హెగెల్ మాట్లాడిందదే, షిల్లర్ మాట్లాడిందదే
మతం నుంచి విముక్తపరుస్తుందనుకున్న సమస్త బూర్జువా ప్రపంచం మాట్లాడుతున్నదదే.
 
ఫౌస్ట్ వేదన అతీంద్రియ అతిలోక వేదన కాదు, మహత్తర ఆధ్యాత్మిక వేదనంతకన్నా కాదు.
గ్రహించు, ఇది సరికొత్త మతమని, చెప్పాడొకప్పుడు ఇషయ్యా దీన్నే.
 
కొయ్యముక్కనొకదాన్ని తెచ్చుకుని విగ్రహంగా చెక్కుకుని మనిషి
దానిముందు సాగిలపడుతున్నాడని.
 
చెప్తున్నాడిప్పుడు మార్క్స్ ఆ మాటల్నే మనకి బోధపడే రీతిలో
ఈ వేదన ఈశ్వరీయ వేదన కాదు, ఇది మనిషి తనకు తాను పరాయి కావడంలోని మర్మవేదన
తన శ్రమ తనకు చెందకపోవడంలోని విషాదగానం
 
మార్క్స్ ఏమంటున్నాడో విను:
 
(అతడప్పుడొక అధ్యాయానికధ్యాయమే చదవసాగాడు. నాకు గుర్తున్న కొన్ని వాక్యాలివి)
 
“శ్రమ పనివాడికి బయటిది కావడంతో, అతనికి చెందకపోవడంతో
అదతడి అసలైన అస్తిత్వాన్ని స్పృశించనేరదు
కనుక అతడు పని ద్వారా తనను తాను
కనుగొనలేడు, పైగా నిరాకరించుకుంటాడు, వేదనపడతాడు, దుఃఖపడతాడు
అదతని స్వతంత్ర మానసిక శక్తుల్ని ఉద్రేకించనేరదు, పైగా ధ్వంసం చేస్తుందతని రక్తమాంసాల్ని
ధ్వంసం చేస్తుందతడి మనస్సుని, సమ్యక్ సంవేదనల్ని.
చూడు చిత్రం, అందుకని శ్రామికుడు పనిచేయనప్పుడే మనిషిగా ఉంటాడు
ఉల్ల్లాసభరితుడిగా ఉంటాడు
అదే పనిచేస్తున్నాడా, కాకుండాపోతాడు తనకి తాను
సరిగ్గా మతంలో జరిగినట్టే
తన ఉత్పత్తికి తాను దాసోహమన్నట్టే
తన పనికి తనే బందీ అవుతాడు
తనని తాను కోల్పోతాడు, ఇంకా చూడు, ఒక జంతువులాగా
తిన్నప్పుడు, తాగినప్పుడు, అప్పుడు
మాత్రమే అతడు మనిషిననుకుంటాడు, మరి మనిషిలాగా పనిచేస్తున్నప్పుడో
తనను తానొక పశువుననుకుంటాడు, ఎద్దనుకుంటాడు, గాడిదనుకుంటాడు.”
 
రష్యన్
 
మిత్రులారా, మీరు మేధావులు, మీకు జీవిత సిద్ధాంతాలు తెలుసు, మిమ్మల్ని మీరు
ఆవిష్కరించుకోగలరపరిమితంగా.
నేనొక పేద రష్యన్ ని, రెకాడితేగాని డొక్కాడదు నాకు.
నాకు తెలిసిందల్లా కొద్దిపాటి రష్యన్ సాహిత్యం,
కొంత డాస్టవస్కీ, కొంత టాల్ స్టాయీనూ.
 
గ్రహించానొకటినేను, సత్యం తెలియడం వేరు, బుద్ధిపూర్వకంగా,
సత్యాన్ని జీవించడం వేరు, అనుభవ పూర్వకంగా.
సత్యం మిరుమిట్లు గొల్పదు, వినబడదెల్లప్పుడూ
అది నీకొక కానానుని దానం చేసే ఉరుము ఘోషగా.
 
సత్యం నీ చాపకింద నుంచి నీకు తెలీకుండానే నీ మీద పాకి
నీ కాలరుమడతలోంచి కుట్టే చిన్న చీమ హెచ్చరికలాంటిది.
 
ఏమంత ప్రమాదకరం కాదు, నువ్వు మరణించవు, కాని
తెలియపరుస్తుందది, తానున్నానని, నువ్వొక్కడివే లేవని
ఇది కూడా తెలియపరుస్తుందది, జీవితసన్నివేశాలు
గతితార్కిక భౌతికవాదాలంత విస్పష్టం కావని.
 
ఎందుకు కుట్టింది నిన్నా చీమ ఆ క్షణంలో
ఏ ఉత్పత్తి శక్తులకు నువ్వు బానిసవయినందుకు నీ మీంచి పాకిందది?
 
కొట్టిపారేయకండి దాన్ని అముఖ్యమని, తెలుసా మీకు నిజంగా ఏది ముఖ్యమో
మీకు విసుగుపుట్టదంటే వినిపిస్తాను కొన్ని వాక్యాలు డాస్టవస్కీ నుంచి:
 
(అప్పుడతడు ఒక రష్యన్ నవలని చదవడం ప్రారంభించాడు)
 
“పెద్దలారా, మీరు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా నేను మీకు చెప్పాలనుకున్నదిదే
నేనొక కీటకాన్ని, ఒక పురుగునెందుకు కాలేకపోయానన్నది:
ప్రమాణం చేసి చెప్తున్నాను,
నేనెన్నో సార్లు ఒక కీటకాన్ని కావాలని తపించాను
నిజానికి నేను దానిపాటి కూడా కాదు,
నిజం చెప్తున్నాను, మిత్రులారా, మరీ చైతన్యంతో ఉండటమనేది
నిజంగా ఒక జబ్బు
తీవ్రాతి తీవ్రమైన రుగ్మత, మనిషికి తన దైనందిన అవసరాలకు చాలు కొద్దిపాటి చైతన్యం
మన పందొమ్మిదవ మహాశతాబ్దపు నాగరిక విద్యాధిక మానవుడి చైతన్యంలో
అయితే సగమో లేదా పావుభాగమో చాలు మనకి
ముఖ్యంగా పీటర్స్ బర్గ్ నగరవాసి కావడమనే
దురదృష్టానికి నోచుకున్న నాబోటి వాడికి
నిజమే మనుషులు తమ రుగ్మతలకి గర్విస్తారు
ముఖ్యంగా అందరికన్నా ఎక్కువగా నేను..”
 
(అతడు చదవడం ఆపాడు. అక్కడొక ఈగ ఎగురుతుంటే దాన్ని తదేకంగా చూసాడు)
 
మిత్రులారా చైతన్యమంటే ఏమిటి? మన ఇంగ్లీషు మిత్రుడు
వైజ్ఞానిక భౌతికవాది.
 
అతిని దృష్టిలో చైతన్యమంటే గుండె కొట్టుకోవడం, మెదడుకి రక్తమెక్కడం
తనున్న సాంఘిక పరిస్థితుల వల్ల మనిషి ప్రభావితుడు కావడం
ప్రభావితుడైన మనిషి మళ్ళా తన పరిస్థితుల్ని ప్రభావితం చెయ్యడం.
 
అంగీకరిస్తున్నాను అతనిదొక ఆదర్శచైతన్యముఖచిత్రమని
ఒప్పుకోలేను నీ జీవితం, నా జీవితం ఇంత స్పష్టంగా ఉంటాయని, వినండి.
రాస్కల్నికావ్ గురించి టాల్ స్టాయి అన్న మాటలు:
 
(అప్పుడున్ పుస్తకంలోంచి ఒక కాగితం బయటకు తీసి చదవడం మొదలుపెట్టాడు)
 
“రాస్కల్నికావ్ నిజంగా జీవించిన క్షణాలంటూ ఉంటే
అతడు తన గదిలో సోఫామీద
అడ్డదిడ్డంగా దొర్లిన క్షణాలే. అప్పుడతడు ఆలోచిస్తున్నదా
ముసలిదాని గురించి కాదు
ఈ భూమ్మీద మరొక సహచరమానవుడి అశ్రువులు తుడవడం
అంగీకారయోగ్యమేనా
లేదా ప్రమాదకరమా, అనవసరమా అని కూడా కాదు, అసలు తను
పీటర్స్ బర్గ్ లో ఉండాలా వద్దా
తన తల్లినుంచి సొమ్ము తెచ్చుకోవాలా వద్దా లాంటివి
అసలా ముసలిదానికేవిధంగానూ
సంబంధించనవి, అటువంటివే ఏవో, అదిగో, పశుప్రాయకార్యకలాపానికి
ఆవలుండే అటువంటి క్షణాల్లోనే అతడు నిశ్చయించుకున్నది
ఆ ముసలిదాన్ని చంపాలా వద్దా అన్నది, అతని నిశ్చయాత్మక క్షణాలతడేదో
ఒక పని చేస్తున్న క్షణాలు కాదు, అసలేమీ చెయ్యకుండా ఉన్న
క్షణాలు, శుద్ధపర్యాలోక క్షణాలు
అతని చైతన్యం క్రియాశీలకంగా ఉన్నదప్పుడే, ఏ చిన్నపనిగానీ; అప్పుడు;
ఒక గ్లాసు బీరు
లేదా ఒక సిగరెట్, అతన్నా నిశ్చయం నుంచి తప్పించి ఉండేవి
పనిని వాయిదా వేసి ఉండేవి
అతని చైతన్యాన్ని అతని పశుప్రవృత్తివైపు నెట్టివేసి ఉండేవి..”
 
(అతడింక చదవలేక, మాట్లాడలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు)
 
సుపర్ణం
 
చర్చించింది చాలు, రెండు ప్రపంచయుద్ధాలు విరుచుకుపడ్డాయి యూరప్ మీద
ఆశ్చర్యంలేదు, ఫౌస్ట్ యాత్ర రాస్కల్నికావ్ తో ముగిసిపోవడం.
 
(పునర్యానం: మరుత్, 3:3)
 
31-10-2021

Leave a Reply

%d