చిత్రకారుడు ఒక అనువాదకుడు

బోర్హెస్ ఒకసారి తాను ఎవరెవరినుంచి ఏ శిల్పరహస్యాలు నేర్చుకున్నాడో చెప్తూ అందులో ఐస్ లాండిక్ సాగాల కథకుల్ని కూడా పేర్కొన్నాడు. నమ్మదగ్గట్టుగా కథలు చెప్పే విద్య వాళ్ళకి చాలా బాగా తెలుసన్నాడు. ఉదాహరణకి మీరు కథ రాస్తున్నప్పుడు గతంలో జరిగిన ఒక సంఘటనని గుర్తు తెచ్చుకున్నట్టు చెప్పాలనుకోండి. ‘అది 1983 మే నెల మధ్యాహ్నం రెండు గంటలవేళ..’ అని మొదలుపెట్టారనుకోండి. ఆ కథ నమ్మదగ్గట్టుగా ఉండదు. అదే మీరు ‘ఆ సంగతి జరిగి ఇప్పటికి ముప్పై ఏళ్ళో, ముప్పై అయిదేళ్ళో అయిఉంటుంది, ఒక వేసవి కాలం మధ్యాహ్నం..’ అని చెప్పారనుకోండి, ఆ సంఘటన శ్రోతకి నమ్మదగ్గట్టుగా వినిపిస్తుంది.
 
ఇదేమి చిత్రం! వివరాలు చెప్తుంటే నమ్మదగ్గట్టుగా అనిపించకపోవడం. వివరాల్ని బ్లర్ చేస్తే ఎక్కువ విశ్వసనీయంగా అనిపించడం! కాని కథనంలో ఉన్న ఆకర్షణ ఇదే. కథకుడు కథ చెప్తున్నప్పుడు శ్రోత కేవలం ఆ కథని వింటూ కూచోడానికి ఇష్టపడడు. అతడు ఆ కథని మళ్ళా తనకి తాను చెప్పుకోడానికి ఉపక్రమిస్తాడు. కథకుడు చెప్తూ ఉండగానే శ్రోతకూడా ఆ కథ మళ్ళా తన భాషలో తనకు తెలిసిన వివరాల్తో, తనకి అర్థమయ్యే సందర్భాల్తో అన్వయించుకుని తనకు తాను చెప్పుకోవడం మొదలుపెడతాడు. అలా కాక తనకంటూ ఏమీ చోటు మిగల్చకుండా కథకుడు మొత్తం వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెడితే ఆ కథ వినడం పట్ల శ్రోతకి ఎట్లాంటీ ఆసక్తీ మిగలదు.
 
ఏళ్ళ తరబడి రంగుల్తోనూ, గీతల్తోనూ సాధన చేస్తూ వచ్చేక ఇన్నాళ్ళకు నాకు అర్థమయిందేమంటే చిత్రలేఖనం కూడా ఒక కథనం. అక్కడ వాస్తవంగా ఉన్న రంగులకన్నా నువ్వు ఏ రంగులు చేర్చి తిరిగి చెప్తున్నావన్నదే ఆ చిత్రానికి ఆకర్షణ.
 
చిత్రలేఖనం కూడా ఒక నెరేటివ్. అందులో నువ్వు ఏ వివరాలిస్తున్నావన్నదాన్ని బట్టి కాక వేటిని వదిలిపెడుతున్నావన్నదాన్ని బట్టి ప్రేక్షకుడికి ఆసక్తి పుడుతుంది.
 
లాండ్ స్కేప్ ఆర్టిస్టులు అన్నిటికన్నా ముందు simplification ని సాధన చేయాలని గొప్ప చిత్రకారులంతా ఎందుకు చెప్తూ వచ్చేరో ఇన్నాళ్ళకు గ్రహించగలిగాను. చిత్రకారుడి పని కెమేరాలాగా ప్రతి ఒక్క వివరాన్నీ, సూక్ష్మవివరాన్నీ కూడా వదలకుండా నమోదు చెయ్యడం కాదు. అన్నిటికన్నా ముందు అతడు తాను చూసినదాన్ని తిరిగి తక్కినవాళ్ళకి కథగా చెప్పడానికి ప్రయత్నించాలి. ఆ కథనంలో వివరాలు కాదు, అతణ్ణి ఆకట్టుకున్న ఆ ముద్రలు, ఆ రంగులు, ఆ మూడ్ చెప్పగలగాలి. అందుకనే ఒక చిత్రకళావేత్త అన్నాడట: నువ్వేది చూస్తున్నావో అది తక్కినవాళ్ళకి చూపించగలగడమే కళ అని.
 
ఇంప్రెషనిస్టులు ప్రకృతిలో కాంతిని చూసి కాన్వాసు మీద పట్టుకోడానికి ప్రయత్నించారు. దృగ్గోచర వస్తువు వెనక నిశ్చలమైన ఆకృతి ఏదైనా ఉందా అని షెజానె వెతుకులాడేడు. ప్రకృతిని చూస్తున్నప్పుడు తనలో కలుగుతున్న భావోద్వేగాల్ని మనకి నేరుగా పంచగలిగాడు కాబట్టే వాన్ గో మనల్ని మంత్రముగ్ధుల్ని చెయ్యగలుగుతున్నాడు.
 
నువ్వు చూస్తున్న దృశ్యాన్ని ముందు అనువదించుకోవాలి. చిత్రకారుడు ఒక అనువాదకుడు. అతడు ఏ భాషలోకి అనువదిస్తున్నాడో ప్రేక్షకుడు మాత్రమే గుర్తుపట్టగలుగుతాడు. చాలాసార్లు ఆ భాషని ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోవచ్చు, గొప్ప కవిత్వాన్ని మొదటిసారి విన్నప్పటిలా. కాని కాలం గడిచేకొద్దీ ప్రేక్షకులు ఆ భాషని పోల్చుకోగలుగుతారు. అప్పుడు వాళ్ళ దృశ్యమాన ప్రపంచం అంతకుముందు లాగా ఉండటంలేదని వాళ్ళకి నెమ్మదిగా అర్థమవుతుంది.
 
కాబట్టి అన్నిటికన్నా ముందు నువ్వు చూస్తున్న దృశ్యాన్ని నువ్వొక కథగా మార్చుకోగలగాలి. ఆ కథని మళ్ళా చెప్పగలగాలి. నా ఇరవయ్యేళ్ళప్పుడు నేను కథలు రాసే విద్య నేర్చుకున్నాను. ఇప్పుడు అరవై ఏళ్ళప్పుడు ఇలా చిత్రకథన విద్య నేర్చుకోవడం మొదలుపెడుతున్నాను.
 
5-11-2021

Leave a Reply

%d bloggers like this: