కృషీవలుడు

Painting by Ramkinkar Baiz (Farmers harvesting, 1943)

మొన్న నెల్లూరులో దువ్వూరి రామిరెడ్డిగారి 126 వ జయంతి సమావేశంలో పాల్గొన్నాను. దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన సమితి, పొణకా కనకమ్మ ఆశయ సాధన సమితి వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం నిజంగా నా భాగ్యమే. ఇంతకుముందొకసారి ఆ పురమందిరంలోనే రామిరెడ్డిగారి పైన సమగ్రమైన ప్రసంగం ఒకటి చేసాను. మిత్రులు అల్లు భాస్కర రెడ్డిగారు ఆ ప్రసంగాన్ని క్యురేట్ చేసి మూడు భాగాలుగా యూ ట్యూబ్ లో పొందుపరిచారు.
 
ఇప్పుడు మళ్ళా రామిరెడ్డిగారి గురించి కొత్తగా ఏమి మాట్లాడగలనా అనుకున్నాను గాని, ఆయన ‘కృషీవలుడు’ కావ్యం మళ్ళా నాలో కొత్త భావాల్నీ, స్పందనల్నీ రేకెత్తించింది. ఆ కావ్యం గురించి ఆ సమావేశంలో మాట్లాడటానికి సమయం లేకపోయింది. అందుకని, ఇదిగో, ఈ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నాను.
 
కృషీవలుడు కావ్యానికి ముందుమాట రాస్తూ డా. కట్టమంచి అటువంటి కవిత్వాన్ని పాస్టొరల్ కవిత్వం అంటారని చెప్తూ, గ్రీకు, లాటిన్ కవిత్వాలతో పాటు భాగవతాన్నీ, జయదేవుణ్ణీ, యెర్రాప్రగడనీ తలుచుకున్నారు. అటువంటి కవిత్వాన్ని ఇంగ్లీషులో idyllic poetry అనీ, bucolic poetry అని కూడా వ్యవహరిస్తారు. ప్రసిద్ధ గ్రీకు కవి థియోక్రిటస్ రాసిన idylls, హెసియోద్ రాసిన Work and Days అటువంటి తరహా కవిత్వాలకి ఆది గీతాలు. ఆ తర్వాత వర్జిల్ Eclogues, పాతనిబంధనలోని రూతు కథ, సామ గీతాలు ఉండనే ఉన్నాయి. అటువంటి ఘనతర కావ్యసంప్రదాయంలో కృషీవలుణ్ణి చేర్చడం ద్వారా డా. రామలింగారెడ్డి ఆ కావ్యాన్ని అజరామరం చేసేసారు.
 
ఇప్పుడు కృషీవలుడు చదువుతూ ఉంటే ఎంతో కొత్తగానూ, తాజాగానూ, అప్పుడే కోసి గంపకెత్తిన కూరగాయల రాశిలానూ, దోసపండ్ల బుట్టలానూ కనిపిస్తున్నది. ఆ సంతోషాన్ని ఎంతో కొంత మీతో పంచుకుందామని ప్రయత్నించాను. వీలైతే వినండి.
 
 
 
11-11-2021

Leave a Reply

%d bloggers like this: