ఒక ఆదిమ మంత్రజాలం

ఆ విధంగా మనిషి శుద్ధ చైతన్యం అతను ఏదో ఒక పనంటూ చెయ్యనప్పుడే అనుభవంలోకి వస్తుందనేది ఎవరూ పెద్దగా పట్టించుకోని జీవితరహస్యం. కాని దాని గురించే జెన్ సాధువులు, వేదాంతులు చెప్తూ ఉన్నారు. పని అంటే ఏదో ఒక కార్యకలాపమే కాదు, అసలు ఆలోచన కూడా లేని స్థితి. కాని ఉండటం చేసే పని ఆలోచననే అన్నాడు హిడెగ్గర్.
 
Letter on Humanism అనే ఒక వ్యాసంలో ఆయనిలా రాస్తున్నాడు:
 
“ఆలోచించడమంటే ఉండటం. ఉండటాన్ని పట్టించుకోవడం. ఈ రెండు పదాల్ని ఒక్కసారి చెప్పడం భాషాపరంగా సాధ్యం అవునో కాదో నాకు తెలియదు. కాని ఇలా చెప్పవచ్చు. ఆలోచన అంటే ఉండటాన్ని పట్టించుకోవడం..”
 
Thinking, in contrast, lets itself be claimed by Being so that it can say the truth of Being. Thinking accomplishes this letting. Thinking is engagement by Being for Being. I do not know whether it is linguistically possible to say both of these (“par” and “pour”) at once, in this way: thinking is the engagement of Being.
 
హిడెగ్గర్ ఇంకో ముఖ్యమైన మాట కూడా అన్నాడు: in thinking Being comes to language.
 
కాని భాష ఇంకా ఏర్పడని రోజుల్లో మనిషి తాను ఉండటాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోగలిగాడు? బహుశా బొమ్మల ద్వారానా? జీవితకాలంపాటు తన అస్తిత్వం గురించిన అన్వేషణకి భాషని వెతుక్కున్న కాఫ్కా తన రాతల మధ్యలో బొమ్మలు గియ్యకుండా ఉండలేకపోవడం ఇందుకేనా?
 
తన Conversations with Kafka లో గుస్టావ్ జనోక్ ఇలా రాస్తున్నాడు:
 
‘..అక్టోబరులో వానకురుస్తూ చిత్తడిగా ఉన్న ఒక రోజు. ఇన్సూరెన్సు కంపెనీ ఆఫీసులో దీపాలు వెలుగుతున్నాయి. కాఫ్కా ఆఫీసు మసకసంజె కాంతిలో గుహలాగా ఉంది. అతడు తన బల్లమీదకు వంగి ఉన్నాడు. అతడి ముందు ఆఫీసు కాగితం ఉంది. అతడి చేతుల్లో ఒక పెన్సిలు. పసుపుపచ్చగా, పొడుగ్గా. నేనతడి దగ్గరకు వెళ్ళేటప్పటికి అతడు ఆ పెన్సిలుతో ఆ కాగితం మీద ఏవో విచిత్రమైన ఆకృతుల్ని త్వరత్వరగా గీస్తూ ఉన్నాడు.
 
‘మీరు బొమ్మలేస్తున్నారా?’
 
కాఫ్కా ఇబ్బందిగా చిరునవ్వి ‘లేదు, ఏవో పిచ్చిగీతలు ‘అన్నాడు.
 
‘నేను చూడొచ్చా? మీకు తెలుసా? నాకు డ్రాయింగు అంటే చాల ఇష్టం.’
 
‘కాని ఇవి ఎవరికీ చూపించడానికి గీసుకున్నవి కావు. పూర్తిగా నా కోసం నేను గీసుకున్న, ఎవరికీ అర్థం కాని చిత్రలిపి.’
 
అతడా కాగితం చేతుల్లోకి తీసుకుని రెండు చేతుల్తోనూ ఉండలా చుట్టి బల్లపక్కనుండే చెత్తబుట్టలోకి పారేసాడు. ‘నేను గీసే బొమ్మలకి స్పష్టమైన కొలతలేవీ ఉండవు. మామూలుగా బొమ్మలకి ఉండే దిగంతరేఖ వాటికి ఉండదు. నేను చిత్రించాలని చూసే ఆకృతుల పెర్ స్పెక్టివ్ కాగితానికి అవతల, పెన్సిల్లో ములుకు చెక్కని వైపు, అంటే నాలోనే ఉంటుంది!’
 
అతడు మళ్ళా ఆ చెత్తబుట్టలోంచి ఆ కాగితం ఉండ బయటకు తీసి ఆ కాగితాన్ని సాపుచేసి అప్పుడు మళ్ళా దాన్ని ముక్కలుముక్కలుగా చింపేసి బలంగా మళ్ళా ఆ బుట్టలోకి విసిరేసాడు.
 
కాఫ్కా అలా బొమ్మలు గీసుకుంటూ ఉండటం నేను చాలా సార్లు చూసాను. అతడట్లా తన భాషలో ‘పిచ్చిగీతలు ‘గీసుకున్న ప్రతిసారీ ఆ కాగితాన్ని ఉండచుట్టి చెత్తబుట్టలో పారేస్తూ ఉండేవాడు.లేదా తన ఆఫీసు కాగితాల మధ్య దాచుకుంటూ ఉండేవాడు. అది చూస్తే అతడి రచనల కన్నా కూడా అతడి చిత్రలేఖనాలు మరింత వ్యక్తిగతమైన విషయంగానూ, అతడి ఆత్మకి ఎక్కువ సన్నిహితమైన విషయంగానూ అనిపించేది. సహజంగానే నాలో అది గొప్ప కుతూహలాన్ని రేకెత్తించింది, కాని అది కాఫ్కా ముందు బయటపడకుండా చూసుకునేవాణ్ణి. అతడట్లా తొందరతొందరగా బొమ్మలు గీస్తున్న విషయం నేనసలు పట్టించుకోనట్టే ఉండేవాణ్ణి. కాని అది లోపల్లోపల నా మనసుమీద ఏదో ఒత్తిడి చేస్తూనే ఉండేది. అతడు నానుంచి ఏమీ దాచటంలేదన్నట్టుగా ఉన్నాడన్నప్పుడు కూడా నాకెందుకో అంత సౌకర్యంగా ఉండేది కాదు.
 
అది కాఫ్కా దృష్టిలో పడకుండా పోలేదు. నేను ఇబ్బంది పడుతున్నానన్న విషయం గుర్తించాడతడు. అందుకని ఒకరోజు అతడు బొమ్మలు వేసుకుంటూ ఉండగా నేను వెళ్ళినప్పుడు ఆ నోటుబుక్కు నా ముందుకు తోసి నాకేసి నేరుగా చూడకుండా ‘ఇదిగో నా పిచ్చిగీతలు చూడు. వాటి గురించి నీలో అనవసరమైన కుతూహలం రేకెత్తించడం నాకు ఇష్టం లేదు. ఆ కుతూహలాన్ని నువ్వు దాచుకోవడం అంతకన్నా ఇష్టం లేదు. నా మీద కోపం తెచ్చుకోకు ‘అన్నాడు.
 
నాకేమి మాట్లాడాలో తోచలేదు. ఏదో కానిపని చేస్తూ పట్టుబడ్డట్టుగా అనిపించింది నాకు. ఆ బొమ్మల పుస్తకం అట్లానే చూడకుండానే అతడి వైపు జరిపెయ్యాలనిపించింది. కాని మళ్ళా నన్ను నేను కూడదీసుకుని నా తల ఓరగా వాల్చి ఆ కాగితాల కేసి చూసాను. దానిమీద రకరకాల చిన్న చిన్న స్కెచ్ లు ఉన్నాయి. వాటన్నటిలోనూ కదలిక ప్రధానంగా కనబడుతోంది. చిన్న చిన్న మనుషులు పరుగెడుతూ, దెబ్బలాడుకుంటూ, పాకుతూ, దేకుతూ కనిపించారు.
 
నాకు చాలా నిరుత్సాహం కలిగింది.
 
‘కాని వీటిలో ఏమీ లేదే. వీటిని మీరు నా నుంచి దాచవలసిన పనే లేదు. ఇవి ఎవరికీ ఏమీ హాని చెయ్యని బొమ్మలు.’
 
కాఫ్కా తన తల ముందుకీ వెనక్కీ ఆడించాడు-‘ఓహ్! అలా అనకండి, అవి మరీ కనిపించేటంత అమాయికమైనవేం కాదు. నాలో చిరకాలంగా వేళ్ళుతన్నుకున్న ఒక గాఢోద్వేగం నుంచి వచ్చినవి ఇవి. అందుకనే వాటిని మీ కంటబడకుండా దాచుకుంటూ వస్తున్నాను.’
 
నేను మళ్ళా ఆ కాగితంకేసీ, ఆ చిన్న చిన్న బొమ్మల కేసీ చూసాను.
 
‘కాని డాక్టర్ నాకు అర్థం కావడం లేదు, వీటిలో ఉన్న భావోద్వేగం ఏమిటి?’
 
కాఫ్కా మనసారా చిరునవ్వాడు. ‘నిజమే. అయితే ఆ ఉద్వేగం కాగితం మీద కాదు, నాలోపల ఉంది. నాకు చిత్రలేఖనం చెయ్యాలని గొప్పకోరిక. కనిపిస్తున్నదాన్ని చూడాలనీ, చూసినదాన్ని పట్టుకోవాలనీ- గట్టి కోరిక.’
 
‘మీరు డ్రాయింగు క్లాసులకి వెళ్ళారా? ‘
 
‘లేదు. నేను చూస్తున్నదేదో నాకై నేను బోధపర్చుకోవాలనీ దాన్ని నాదైన పద్ధతిలో చిత్రించాలనీ నా కోరిక. నా డ్రాయింగులు బొమ్మలు కావు. అవి నా వ్యక్తిగత చిత్రాక్షరాలు.’ కాఫ్కా మళ్ళా చిరునవ్వాడు.- ‘నేనింకా ఈజిప్షియన్ దాస్యంలోనే ఉన్నాను. ఎర్రసముద్రం ఇంకా దాటలేదు.’
 
నేను నవ్వాను. ‘ఎర్ర సముద్రం దాటగానే మొదట తగిలేది ఎడారి.’
 
‘అవును.’ కాఫ్కా తలూపాడు. ‘బైబిల్లోనూ, మరెక్కడైనా కూడా అంతే.’
 
అతడు తన చేతుల్ని బల్లకి ఆనించి కుర్చీలో వెనక్కి జారబడి శరీరాన్ని కులాసాగా మలుపుకుని పైకప్పు కేసి చూపు సారించాడు.
 
‘ఏదో ఒక భౌతిక సాధనంతో స్వాతంత్య్రం సాధించామని భావించడం ఒక పొరపాటు, ఒక అయోమయం, ఇంకా చెప్పాలంటే ఒక ఎడారి. అక్కడ భయం, నిస్పృహ అనే రెండు మొక్కలు తప్ప మరేమీ పెరగవు. అది సహజమే. ఎందుకంటే యథార్థ, శాశ్వత విలువ కలిగింది ఏదైనా లోపలనుంచి రావలసిందే తప్ప, బయటినుంచి కాదు. జీవితస్వాతంత్య్రం సమస్తం ఆ షరతుకి లోబడిందే. ఏదో కృత్రిమంగా రూపొందించిన సామాజిక వాతావరణం కాదు, మన పట్లా, ప్రపంచం పట్లా మనకి ఎటువంటి దృక్పథం ఉండాలనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉండవలసిన పోరాటం. మనిషి స్వతంత్రంగా ఉండాలంటే తప్పనిసరి షరతు అది.’
 
‘షరతు?’ సందేహంగా ప్రశ్నించాను.
 
‘అవును.’ కాఫ్కా మళ్ళా తన నిర్వచనాన్ని మరొకసారి వినిపించాడు.
 
‘కాని అందులో వైరుధ్యం లేదా?’ అనడిగాను.
 
కాఫ్కా గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడన్నాడు. ‘అవును. మన వ్యక్త చైతన్యాన్ని నిర్ధారించే ఆ మెరుపు ఒక కొసనుండి మరొక కొసకి ఒక్క గెంతులో దాటి ఆ వైరుధ్యాన్ని దాటిపోవాలి. ఒక క్షణం పాటు మెరుపు మెరిసినట్టుగా మనం ఈ ప్రపంచాన్ని చూడగలగాలి.’
 
నేనొక క్షణం పాటు మౌనంగా ఉన్నాను. అప్పుడు ఆ కాగితం వైపు చూపించి నెమ్మదిగా అడిగాను: ‘సరే, ఈ మనుషులు, వీళ్ళ మాటేమిటి?’
 
‘వాళ్ళు చీకట్లోంచి వచ్చి చీకట్లో అదృశ్యమైపోతారు’ అంటో తన బల్ల సొరుగు తెరిచి ఆ కాగితాన్ని అందులోకి నెట్టేసి ఎటువంటి భావోద్వేగాలు లేని గొంతుతో అన్నాడు కదా: ‘ నా చిత్రలేఖనం నేను ఎప్పటికప్పుడు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండే ఒక ఆదిమ మంత్రజాలం. కాని అందులో నేనెప్పటికీ కృతకృత్యుణ్ణి కాలేకపోతున్నాను.’
 
నేనతడి వైపు అర్థంకాని చూపుల్తో చూసాను. నా చూపులు మరీ మూర్ఖంగా ఉండిఉంటాయి. కాఫ్కా నోరు ముడుచుకుపోయింది. అతడు తన చిరునవ్వుని పట్టి ఉంచుతున్నట్టు తెలుస్తూనే ఉంది. అతడు తన చేతిని నోటికి అడ్డుపెట్టుకుని చిన్నగా దగ్గి, అన్నాడు కదా:’ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటీ ప్రాణం పోసుకున్న చిత్తరువే. ఎస్కిమోలు ఒక కట్టెని మంటపెట్టాలనుకున్నప్పుడు దాని మీద తరగల్లాగా గీతలు గీస్తారు. అది నిప్పు తాలూకు మంత్రచిత్రం. రెండు కట్టెల్ని రాపాడి వాళ్ళు నిప్పుకి ప్రాణం పోస్తారు. నేను చేసేదీ అదే. నేను గీసే బొమ్మల ద్వారా నేను దర్శిస్తున్న ఆకృతుల్ని ఒక దారికి తెచ్చుకుంటాను. కాని నా వేళ్ళల్లోంచి నిప్పు పుట్టడం లేదు. బహుశా నా దగ్గర సరైన సామగ్రి లేదనుకుంటాను. బహుశా నా పెన్సిలుకి సరైన శక్తుల్లేకపోయి ఉండవచ్చు. లేదా బహుశా నాకే ఆ శక్తి ఏదో చాతకాకపోయి ఉండవచ్చు..’
 
ఇంత సుదీర్ఘంగా ఈ సంభాషణ రాయడానికి కారణం, చిత్రలేఖనంలో కాఫ్కా ఒక ఆదిమ మంత్రశక్తిని చూసాడని చెప్పడం. చిరకాలంగా న్యాయవివాదంలో పడి ఇన్నాళ్ళకు వెలుగు చూసిన కాఫ్కా చిత్రలేఖనాల్ని చూస్తూ ఉంటే, హిడెగ్గర్ మాటల్ని తిరిగి రాయాలని ఉంది.
 
‘in drawing, Being comes to being.
 
 

కాఫ్కా చిత్రలేఖనాలు దాదాపు 160 దాకా ఇప్పుడు నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇజ్రాయిల్ వారు ఆన్ లైన్లో ప్రదర్శిస్తున్నారు.

 
1-1-2021

Leave a Reply

%d bloggers like this: