ఎర్రాప్రగడ

Reading Time: 2 minutes

కొన్ని రోజుల కిందట గుంటూరులో కుందుర్తి స్వరాజ్య పద్మజగారి పుస్తకం ఆవిష్కరణ జరిగినప్పుడు ఆ సభకి పుట్టం రాజు శ్రీరామచంద్రమూర్తి గారు అధ్యక్షత వహించారు. ఆయన ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ రోజు ఆయన నాకు కానుకగా ఇచ్చిన పుస్తకాల్లో ‘ఎర్రాప్రెగ్గడ: సాహిత్య వ్యాసాలు’ (2006) అనే పుస్తకం కూడా ఉంది. దాన్ని అద్దంకి కి చెందిన సృజన సాహిత్య సంస్థ ప్రచురించింది.
 
ఇంటికి వచ్చిన తరువాత అన్నిటికన్నా ముందు ఆ పుస్తకం ఆసక్తిగా తిరగేసాను. అందులో ఎర్రాప్రగడ మీద పది వ్యాసాలున్నాయి. అవన్నీ ప్రసిద్ధ పండితులు, ఎర్రన వ్యాఖ్యాతలు రాసినవి. అటువంటి పుస్తకం ఒకటి వచ్చిందని తెలుగు సాహిత్యరంగంలో ఎందరికిన్ తెలుసు? పధ్నాలుగో శతాబ్దికి చెందిన అటువంటి కవి గురించి యూరోప్ లోగాని, అటువంటి పుస్తకం వచ్చి ఉంటే కొన్ని నెలలపాటు అక్కడి యూనివెర్సిటీలు ఆ రచన గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఉదహరణకి ఛాసరు కూడా పధ్నాలుగో శతాబ్దికి చెందిన కవినే. ఆయన ఇంగ్లిషు మిడిల్ ఇంగ్లిష్. ఇప్పటి ఇంగ్లాండ్ వాసులకి ఆ ఇంగ్లిషు అర్థం కాదు కూడా. కాని ఛాసరు మీద ఎవరేనా పది వ్యాసాలతో ఒక పుస్తకం వెలువరించి ఉంటే ఈపాటికి పత్రికలన్నీ ఆ పుస్తకం మీద సమీక్షలతో, చర్చలతో నిండిపోతాయి. కాని తెలుగుకి అటువంటి అదృష్టం లేదు.
 
ఇది మరీ ఇటీవలి పరిస్థితి అనుకుందామా అంటే, ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో జి.ఎస్.ఎస్ దివాకర దత్ అనే ఆయన ఎర్రన హరివంశానికి వేలూరి శివరామశాస్త్రిగారు రాసిన పీఠిక నుంచి ఈ వాక్యాలు ఎత్తిచూపారు:
 
‘1901 లో అచ్చయిన ప్రతి మరల 1960 లో అచ్చగుచున్నదనిన రమారమి 60 ఏండ్లకు గాని వేయి ప్రతులు అమ్ముడుపోలేదన్నమాట. గ్రంథమా భారతశేషము! కవియా ఎర్రాప్రెగడ! కవిత్రయములో ఒక్కడయిన ఎర్రయ గ్రంథమునే తెలుగువారు చదువుకొనుట లేదన్నమాట.’
 
అయినా కూడా నిస్పృహ చెందకుండా ఇటువంటి ఒక వ్యాససంకలనాన్ని తీసుకువచ్చినందుకు అద్దంకి సృజనవారిని మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్క వ్యాసం విలువైనదేగాని, నా మనసును రసముగ్ధం చేసిన ఒక పద్యాన్నిక్కడ పరిచయం చెయ్యాలని తహతహలాడుతున్నాను.
 
‘ప్రబంధ పరమేశ్వరుడు’ అనే వ్యాసంలో జి.వి సుబ్రహ్మణ్యంగారు ఎర్రన కవితాపాకాన్ని వివేచిస్తూ నోరి నరసింహశాస్త్రిగారు ఈ పద్యాన్ని గుర్తుచేసారని రాసారు. ఇది హరివంశంలో ధేనుకాసుర వధ వృత్తాంతం సందర్భంగా కృష్ణబలరాములు ఒక తాటిచెట్ల అడవిలో ప్రవేశించినప్పుడు అన్నకి మిగలముగ్గిన తాటిపండ్లని చూపిస్తూ కృష్ణుడు చెప్పిన పద్యం (7:77):
 
క్రమపాకంబున, కెంపుతోడి నలుపెక్కన్, మిక్కుటంబైన గం
ధము దిక్కుల్ సురభీకరింప రసమంతర్గామియయ్యున్ వెలిం
గమియం కారుచునున్న చాడ్పున విలోకప్రీతి కావింప హృ
ద్యములై ఉన్నవి చూచితే ఫలములీ తాళద్రుమశ్రేణులన్
 
(చూసావా, ఆ తాటిచెట్ల తోపులో చెట్లకు కాసి మిగలముగ్గిన ఆ తాటిపండ్లని! అవి నెమ్మదిగా పరువెక్కి ఎర్రదనంతో కూడిన నలుపుదనంతో చుట్టూ ఉన్న అడవినంతా సువాసనతో సురభీకరిస్తున్నాయి. తియ్యటి రసం లోపలనే ఉన్నా పైకి పొంగిపొర్లుతున్నదా అన్నట్టు చూస్తూనే మనసును హరిస్తున్నాయి)
 
ఈ పద్యాన్ని పేర్కొంటూ సుబ్రహ్మణ్యంగారు ఇలా రాస్తున్నారు:
 
‘.. ఈ విధముగా ధేనుకాసురుని తాళవనములోని ఫలములను బలరామునికి శ్రీకృష్ణుడు చూపుచు పలికినాడు. ముట్టినంతనే స్రవించుపోవు ద్రాక్షాఫలముల రసము కాదు. అతి కష్టముగ సాధ్యమగు నారికేళ రసమును కాదు ఎర్రయకు అభిమానమైనది! అంతర్గామియై చిక్కని రసముండుటే కాక అది వెలింగమియ కారుచున్నట్లుండి నేత్రపర్వము చేయుచు ఉచితమగు పాకముచే దట్టమగు సుగంధము దిక్కులు నిండిపోవునట్లు చేయగల తాళఫల రసపాకమతని కభిమానపాత్రమైనది!’
 
ఆహా! ఇది కదా నిజమైన కావ్యవివేచన! ఇప్పుడు ఏ మిగలముగ్గిన తాటిపండుని చూసినా ఎర్రాప్రగడ గుర్తుకు వస్తాడు. ఎర్రన రాసిన ఏ పద్యం చదివినా చెట్టుమీదే పండి చుట్టూ గాలిని సురభీకరించే తాటిపళ్ళు గుర్తొస్తాయి.
 
27-11-2021

Leave a Reply

%d bloggers like this: