అలా బొమ్మలు గియ్యాలంటే ఎలా?

నిన్న దాట్ల దేవదానం రాజు గారు ఇలా అడిగారు:
 
‘ఒక ప్రాకృతిక దృశ్యాన్ని ఫొటో తీసినట్టు ఎలా గీస్తారు? ముందస్తుగా మనోఫలకంపై చిత్రించుకుని ఆనక తీరిగ్గా కాన్వాస్ మీద ఒలకబోయడం లేదా సరంజామా అంతా ప్రకృతి చెంతకు మోసుకుని అచ్చు దింపడం లేదా అప్పటికే ఎవరో చిత్రించిన దాన్ని దించడం…ఇందులో ఏది సహజత్వం మూటగట్టుకుంటుంది?’
 
పై ప్రశ్నలో ఆయన దేన్లో సహజత్వం ఎక్కువ కనిపిస్తుంది అని అడిగారు, కాని ఏది ఎక్కువ చూపరులమీద ప్రభావం చూపిస్తుంది అని అడగడం ఆయన ఉద్దేశ్యం కావచ్చు.
 
సహజత్వం అంటే likeness అనుకుంటే, అంటే ఒక దృశ్యం బయట ఎలా కనిపిస్తున్నదో అలానే బొమ్మలో కూడా కనిపించడం అనుకుంటే, ఒక్క యూరపియన్ చిత్రకళమాత్రమే ఆ కౌశల్యం కోసం ఎక్కువగా పరితపించింది. అది కూడా మొదటి యుగాల్లోనే. పందొమ్మిదో శతాబ్దం నుంచీ ఆ ధోరణి మీదా, ఆ తాపత్రయం మీదా ఎన్నో తిరుగుబాట్లు వస్తూనే ఉన్నాయి. కాని ప్రపంచవ్యాప్తంగా యూరోప్ కి ఆవల ఉన్న చిత్రకళా రీతులు మాత్రం బొమ్మలు అచ్చుగుద్దినట్టుండాలనే కోరికనుంచి ఎప్పుడో బయటపడిపోయాయి. అటువంటి చిత్రకళా రీతుల్లో అన్నిటికన్నా చెప్పవలసింది రెండు కళారీతులు: ఒకటి చీనా, జపాన్ చిత్రకళా రీతి, రెండవది, ఆఫ్రికన్ ఆదిమజాతుల కళారీతి. యూరప్ ఈ రెండు కళారీతుల్నీ చూస్తో తనని తాను ఆధునీకరించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది.
 
ఒక దృశ్యం మనకి ఎలా కనిపిస్తున్నదో అలా గీయడానికి అన్నిటికన్నా ముందు కావలసింది perspective. ఈ రహస్యాన్ని రినైజాన్సు కళాకారులు గుర్తుపట్టారు. నిజానికి బాహ్యదృశ్యం మనకి ఎప్పుడూ ఒక దృగ్భ్రమతోటే కనిపిస్తుంది. ఉదాహరణకి మనమొక రోడ్డు మీద నించున్నామనుకోండి, ఆ రోడ్డు దిగంతరేఖలో కలిసే చోట దాని రెండు అంచులూ కలిసిపోయినట్టు అనిపిస్తుంది. ఆ vanishing point నిజానికి ఒక భ్రమ. అలాగే ఆ రోడ్డు మీద మనకి దగ్గరగా ఉండే చెట్లు పెద్దవిగానూ, దూరంగా ఉండే చెట్లు చిన్నవిగానూ, దగ్గరగా ఉండే పొదలు దట్టంగానూ, దూరంగా ఉన్నవి అస్పష్టమైన నీలి లేదా ఊదారంగు ముద్దలుగానూ కనిపిస్తాయి. కాని రోడ్డు ఎక్కడైనా అదే వెడల్పుతో ఉంటుందనీ, చెట్లు ఎంతదూరంపోయినా ఎత్తుతగ్గిపోవనీ మనకి తెలుసు. కానీ అటువంటి దృగ్భ్రమని చిత్రిస్తేనే మనం ఉన్నదున్నట్టుగా చూపించలుగుతాం. ఇదొక paradox.
 
కానీ చూపరి భ్రమని తృప్తి పరచడం మీద చీనా, పారశీక చిత్రకారులకి ఆసక్తి లేదు. వారు ఎప్పుడూ ఒక vanishing point మీద ఆధారపడ్డ చిత్రాన్ని చిత్రించలేదు. పారశీక మీనియేచర్ చిత్రాలు చూడండి: అక్కడ ఒక దృశ్యం వెనగ్గా ఉన్న మరొక దృశ్యం అస్పష్టంగా అదే తలం మీద ఉండదు. అందుకు బదులు మొదటి దృశ్యం కనిపిస్తున్నంత స్పష్టంగానూ, ఆ దృశ్యానికి వెనగ్గా కాక, ఆ దృశ్యం పైన మరొక దృశ్యంగా కనిపిస్తుంది. ఈ non-linear perspective ని యూరప్ మొదట్లో చిన్నపిల్లల చిత్రకళ అనుకుంది. కాని ఇరవయ్యవ శతాబ్దం మొదలయ్యేటప్పటికి, ఎంతో పరిణతి చెందిన చిత్రకారులు తప్ప అటువంటి శైలిని రూపొందించుకోలేరని తెలుసుకోగలిగింది.
 
మరొక ఉదాహరణ, చిన్నప్పుడు మా ఆర్ట్ మాష్టారు చెప్పింది చెపుతాను. మనిషి ఒక వైపు ముఖం తిప్పినప్పుడు, అంటే అతడి ప్రొఫైల్ లో ఒక కన్ను మాత్రమే కనిపిస్తుందని మనకి తెలుసు. కాని ప్రాచీన ఈజిప్షియన్ చిత్రకారులు పిరమిడ్లలో బొమ్మలు గీసినప్పుడు ప్రొఫైల్లో ఉన్న ముఖాలకి రెండు కళ్ళూ చిత్రించారు, ఎందుకని? మనిషి ముఖం పక్కకు తిప్పగానే అతడికి ఒక కన్నే కనిపిస్తుందని అనుకోకండి, అది భ్రమ మాత్రమే, అతడు ముఖం పక్కకు తిప్పినప్పుడు కూడా అతడి రెండు కళ్ళూ అలానే ఉన్నాయని గుర్తుచేయడమా లేకపోతే అతడు తన ముఖాన్ని పక్కకు తిప్పినా అతడి దృష్టిలో ఎటువంటి మార్పూ ఉండదని చెప్పడమా?
 
బయట కనిపిస్తున్న దృశ్యాన్ని సహజంగా కాన్వాసుమీదకు దింపడం అత్యున్నత చిత్రకళా కౌశల్యమని రినైజాన్సు చిత్రకారులు డావిన్సీ, మైకెలాంజిలో వంటి వారు భావించారు. వారిలో ఆ నైపుణ్యం పతాక స్థాయికి చేరిన చిత్రకారుడు రాఫెల్. ఆయన చిత్రించిన ఒక బొమ్మ కింద ఇస్తున్నాను చూడండి.
 
ఇప్పటికీ అటువంటి కౌశల్యానికి అతడే ఒక ఆదర్శం. classicism అని మనం వ్యవహరించే శిల్పశైలికి ఆయన ఒక ప్రతీక. కాని నువ్వు రాఫెల్ కావాలంటే ఒక జీవితకాలం కూడా సరిపోదు. ఆ తర్వాత చిత్రాలు గీసిన ప్రతి ఒక్క చిత్రకారుడూ తాను రాఫెల్ కావడమెట్లా అనే తపించాడు, కాలేకపోతున్నానని నిస్పృహ చెందాడు.
 
చివరికి ఒకరోజు పికాసో ఆఫ్రికన దారు ప్రతిమల ఒక ఎగ్జిబిషన్ ని చూసేదాకా ఆ తపన యూరప్ ని వెన్నాడుతూనే ఉంది. ఆఫ్రికన్ ఆదిమజాతులు రూపొందిన మాస్కుల్ని చూసినప్పుడు పికాసో విచలితుడైపోయాడు, చిత్రకారుడి కౌశల్యం కంటికి కనిపిస్తున్నదాన్ని కనిపిస్తున్నట్టుగా చిత్రించడంలో లేదనీ, అది చిత్రకారుడు తన మనసుకి కనిపిస్తున్నదాన్ని మనసు చూసినట్టుగా చిత్రించడమేననీ గ్రహించాడు. ఆఫ్రికన్ మాస్కుల్ని చూసిన మర్నాడే అతడు ‘పారిస్ లో వ్యభిచారిణులు ‘చిత్రం గీసాడు.
 
ఆ బొమ్మతో 1907 లో, యూరప్ ఒక్కసారిగా సంప్రదాయ చిత్రకళ సంకెళ్ళనుంచి విడివడి ఆధునిక చిత్రకళగా మారిపోయింది. ‘రాఫెల్ లాగా చిత్రించడానికి నాకు నాలుగేళ్ళు పట్టింది కానీ ఒక చిన్న పిల్లవాడి లాగా చిత్రించడానికి ఒక జీవిత కాలం పట్టింది ‘ అని పికాసో చెప్పుకున్న మాటలు సుప్రసిద్ధమే కదా.
 
కాబట్టి ఒక దృశ్యాన్ని సహజత్వం ఉట్టిపడేటట్టు చిత్రించడం ఆధునిక చిత్రకళకి ఇంకెంతమాత్రం ఆదర్శం కాదు. (ఇప్పుడు కూడా photorealism అనే ధోరణి లేకపోలేదు, కాని ఆ బొమ్మలు ఆ చిత్రకారుడి కౌశల్యాన్ని పట్టించినంతగా అతడి భావోద్వేగాలనీ, దర్శనాన్నీ మనకు అందించవు).
ఒక దృశ్యం చూసినప్పుడు చిత్రకారుడి మనసులో ఒక ఉద్వేగం కలుగుతుంది. ఒక కథకుడికి కథ రాయాలన్న తలపు ఎప్పుడు కలుగుతుందో, ఏ క్షణాన్న గుండె పాటగా మారడాంకి గొంతుకలో కొట్లాడుతుందో మనకి తెలియనట్టే, ఒక చిత్రకారుడికి బొమ్మ్మ గియ్యాలన్న కోరిక ఏ క్షణాన కలుగుతుందో చెప్పలేం. కాని ఆ ఉద్విగ్నతని తక్షణమే తైలవర్ణ చిత్రంగా గియ్యలేం. ఎందుకంటే తైల వర్ణాల మొదటి పూత ఆరడానికే నాలుగు రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి ఒక తైలవర్ణం చిత్రించడానికి ఒక ఏడాది పైననే పడుతుంది. ఫ్లెమిష్ చిత్రకారులకైతే కొన్నేళ్ళు కూడా పడుతూ ఉండేది. ఒక చిత్రకారుడు తనలోని ఆ ప్రథమ భావోద్విగ్నతను అన్నాళ్ళ పాటు ఎలా కాపాడుకోవడం? అందుకు చిత్రకారులు రెండు మార్గాలు ఎంచుకున్నారు: ఒకటి, తమ భావోద్విగ్నతను నిర్దుష్ట ఆకృతిగా చిత్రకళా నియమాలు ప్రకారం చిత్రించడంలోకి అనువదించు కోవడం. లేదా రేఖానైపుణ్యాన్ని పక్కన పెట్టి రంగుల్లో తమ హృదయాన్ని వొలకబోసుకోవడం. మొదటిదాన్ని neo classicism అన్నారు. ప్రసిద్ధ ఫ్రెంచి చిత్రకారుడు ఇంగ్రె దానికి ప్రతినిధి. రేఖానైపుణ్యంలో అతడు మరొక రాఫెల్.
 
 
రెండవ ధోరణిని romanticism అన్నారు. మరొక సుప్రసిద్ధ ఫ్రెంచి చిత్రకారుడు డెలాక్రా దానికి ప్రతినిధి. 
 
 
కాని చిత్రలేఖనం చూపరిని ఆకట్టుకోవడానికి, ఉన్నది ఉన్నట్టుగా చిత్రించే నైపుణ్యంగాని, రేఖలు గాని, రంగులు కాని కాదని, ఒక సద్యః స్ఫురణ, నీకొక చిత్రం చిత్రించాలన్న కోరికకలిగిన తక్షణమే దాన్ని బొమ్మగా గియ్యగలడమేనని వాదించిన ఇంప్రెషనిస్టులు యూరపియన్ చిత్రకళని సమూలంగా మార్చేసారు, ప్రబంధ కవుల కావ్యాల స్థానంలో మన భావకవుల ఖండకావ్యాలు తీసుకు వచ్చిన మార్పులాంటిదది. ఒక సూర్యోదయాన్ని మోనె అనే చిత్రకారుడు ఎలా చిత్రించాడో చూడండి.
 
 
ఇలా ఈ చరిత్రను నేను మరికొంత సేపు చెప్పవచ్చుగాని, చివరికి యూరపియన్ చిత్రకళ ( తర్వాత రోజుల్లో అమెరికన్ చిత్రకళతో కలిపి) ఎక్కడికి చేరిందంటే, అసలు బాహ్యప్రకృతిని చిత్రించడం ద్వితీయ స్థాయి నైపుణ్యం మాత్రమేననీ, చిత్రకారుడి అంతః ప్రకృతిని చిత్రించేదే అత్యున్నత స్థాయి చిత్రలేఖనమనీ నమ్మేదాకా. ఇప్పుడు మొదటిదాన్ని representational art అనీ, లేదా perceptual art అనీ, రెండవదాన్ని conceptual art అనీ అంటున్నారు. మనం చూసే అన్నిరకాల నైరూప్య చిత్రలేఖనాలూ conceptual art కిందకే వస్తాయి. జాక్సన్ పోలాక్ అనే సుప్రసిద్ధ అమెరికన్ చిత్రకారుడు చిత్రించిన ఒక చిత్రలేఖనాన్ని ఇక్కడ  పొందుపరిచాను చూడండి. 
 
 
కాని ఇంత దూరం ప్రయాణించినా యూరపియన్-అమెరికన్ చిత్రకళకి తృప్తి లేదు. చీనాలో ప్రాచీన చిత్రకారులు చిత్రించిన కొండల్నీ, వెదురుపొదల్నీ, పువ్వుల్నీ, సీతాకోక చిలుకల్నీ చూసినప్పుడల్లా ఆధునిక చిత్రకారుడు అశాంతికిలోనవుతూనే ఉన్నాడు. ఎలాగు? అలా బొమ్మలు గియ్యాలంటే ఎలా? ఏ వివరాలు, ఆ perspective లో చిత్రిస్తే ఆ చీనా లాండ్ స్కేప్ చిత్రలేఖనాలు మనమీద చూపించే ప్రభావం లాంటి ప్రభావాన్ని సాధించగలుగుతాం? ఇక్కడ పొందుపరిచిన బొమ్మ చూడండి.
 
 
 
వాళ్ళు దృశ్యాన్ని కాదు, ఆ దృశ్య సారాంశాన్ని పట్టుకున్నారని తెలుస్తూనే ఉంది. కాని ఆ సారాంశాన్ని పట్టుకోవాలంటే ఎలానో అయివందల ఏళ్ళ తరువాత కూడా యూరప్ కి అర్థం కాకుండానే ఉంది.
 
6-11-2021

Leave a Reply

%d bloggers like this: