శివతాండవం

Reading Time: 3 minutes

కలమళ్ళ నుంచి పొద్దుటూరు చేరేటప్పటికి నడిమధ్యాహ్నం కావొస్తూంది. నేను రెండింటికల్లా పీలేరు చేరుకోవాలి. కాబట్టి పొద్దుటూరు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఉన్న పుట్టపర్తి నారాయణాచార్యులుగారి విగ్రహానికి పూలమాల వేసి వెళ్ళిపోదామనుకున్నాను. మేము పొద్దుటూరు చేరుకునేటప్పటికే ఆ సెంటరులో చాలామంది మిత్రులు మా కోసం వేచి ఉండి మాకు స్వాగతం పలికారు. వారిలో నరాల రామారెడ్డిగారు కూడా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంతటి మహాపండితుడు, అవధాని నా కోసం వచ్చారని తెలియడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది.
ఆ సెంటర్ లో అంతమందిని ఒక్కసారి చూసేటప్పటికి ట్రాఫిక్ పోలీసులు కూడా గాభరా పడ్డారు. ఆ నాలుగురోడ్ల కూడలిమధ్య గంభీరంగా, సజీవంగా నిలబడి ఉన్నాడేమో అన్నంత భ్రాంతి కలిగిస్తూ మేరునగసమానుడిగా సరస్వతీ పుత్రుడు. ఆ రోజు ఆయన్ని పూలమాలల్తో నింపేసాం. అది ఎండ అనిగానీ, కింద కాళ్ళు కాలుతున్నాయనిగానీ అనిపించలేదు. గురువుకి సన్మానం చేయడానికి ఉత్సాహపడుతున్న శిష్యుల్లాగా ఒకరితో ఒకరం పోటీపడ్డాం.
 
ఇక మళ్ళా ప్రయాణం మొదలుపెట్టబోతూండగా, గుళ్ళోకి వెళ్దాం రండి అన్నారు మిత్రులు. ఆ కూడలి దగ్గరే ఒక పక్క అగస్త్యేశ్వర స్వామి ఆలయం. ఎప్పుడో చోళరాజుల కాలంలో కట్టించిన పురాతన ఆలయం. లోపలకి అడుగుపెట్టామేగాని, అప్పటికే గుడికట్టేసినట్టున్నారు. మరి ఎందుకు రమ్మన్నారా అని చూసేటంతలో ఆ గుడి ప్రాంగణంలో ఒక చెట్టునీడన నారాయణాచార్యుల విగ్రహం కనిపించింది. ఇది చిన్న విగ్రహం. ఆసీనమూర్తి.
 
నారాయణాచార్యులుగారి జీవితం ఆ గుడితో పూర్తిగా ముడిపడింది. ఆయన ఆ గుళ్ళో కూచునే శివతాండవం రాసారు. ప్రతి రోజూ కొన్నిసార్లేనా ఆ గుడిలో ప్రదక్షిణం చేయకుండా తనకి రోజు గడిచేదికాదని ఆయనే ఎక్కడో రాసుకున్నారు. ఇప్పుడు రోజూ ఆయన్ని చూడందే శివుడికి కూడా తృప్తి లేదన్నట్టు అక్కడ ఆయన శాశ్వతంగా ప్రతిష్టితుడైపోయాడు.
 
మళ్ళా ఆ విగ్రహానికి పూలమాలలు సమర్పించాం. నరాల రామారెడ్డిగారు అంతసేపూ అక్కడే ఉన్నారు. ఆయన్ని పుట్టపర్తి వారి పైన ఒక ప్రసంగం చేయమని అడిగాను. శివతాండవం నుంచి కూడా కొన్ని పంక్తులేనా వినిపించమని అడిగాను. రామారెడ్డిగారు చిన్న ప్రసంగం చేసారు. తనకీ పుట్టపర్తివారికీ ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. తన పెళ్ళికి వచ్చి తనని ఆశీర్వదిస్తూ సరస్వతీ పుత్రుడు చెప్పిన పద్యాల్ని తలుచుకున్నారు. శివతాండవం నుంచి కొన్ని పంక్తులు వినిపించారు. ఆ తర్వాత నేను మాట్లాడేను. ఆ సమయాన నా ఒళ్ళు ఉప్పొంగుతూ ఉంది.
నారాయణాచార్యులుగారు అక్కడ ఉన్నారనీ, నా మాటలు వింటున్నారనీ అనుకుంటూ మాట్లాడేను.
అటువంటి బహుభాషాకోవిదుడు, రసజ్ఞుడు, పండితుడు తెలుగులో మరొకరు లేరనీ, నిజంగా అన్ని సాహిత్యాలతో పరిచయం కలిగిఉండటాన్ని మించిన దానికన్నా మించిన ఐశ్వర్యం మరొకటిలేదనీ, అటువంటి ఐశ్వర్యవంతుణ్ణి చూసి నాకు అసూయ కలుగుతూ ఉంటుందని కూడా చెప్పాను.
 
నలుగురం కలిసి ఆయన్ని తలుచుకున్నాక కూడా వెంటనే సెలవుతీసుకోడానికి మాకు కాళ్ళు రాలేదు. అక్కడ ఉన్న కల్యాణమంటపంలో మరికొంతసేపు కూచున్నాం. ఎవరో అందరికీ మట్టిపిడతల్లో పెరుగు అందించారు. ఆ వైష్ణవశిఖామణి ఆ కొంతసేపు మా సత్సంగాన్నీ ఒక గోకులంగా మార్చేసాడు. ఆ రోజు నన్ను కలుసుకోడానికి తెలుగు పండితులు చాలామంది వచ్చారు. ఒంటేరు శ్రీనివాసరెడ్డి, అంకయ్యగారూ మాత్రమే కాక, రాజేశ్వరీ రామాయణం కూడా వచ్చారు. నేను పొద్దుటూరు వస్తున్నాని తెలిసి నన్ను చూడటానికి ఆమె సెలవు పెట్టి మరీ వచ్చారు.
 
పొద్దుటూరు తెలుగు సాహిత్యంలో అవధాన రాజధాని. అక్కడి ఓరియెంటల్ కళాశాల ఎందరో శతావధానుల్ని, సహస్రావధానుల్ని తెలుగు సాహిత్యలోకానికి అందించింది. కాని కలువపూల మధ్య తామరపువ్వులాంటి సరస్వతీపుత్రుణ్ణి అందించినందుకు పొద్దుటూరి మట్టికి మరిన్ని నమస్సులు.
 
2
 
అక్కణ్ణుంచి పీలేరు, ఆ తర్వాత చిత్తూరు వెళ్ళానన్న మాటేగాని, ఆ మర్నాడంతా కౌంటింగ్ పర్యవేక్షిస్తున్నానన్నమాటేగాని, నా మనసంతా శివతాండవం నడుస్తూనే ఉంది. నాకు కొన్ని గంటల పాటేనా పుట్టపర్తివారి గురించీ, సంస్కృత, ప్రాకృత సాహిత్యాల గురించీ, తులసీదాస్ గురించీ, మహారాష్ట్ర సంత్ కవుల గురించీ ఎవరితోనైనా ఎడతెగని చర్చ చేయాలనిపించింది. నేనొకప్పుడు పుట్టపర్తి గురించి చేసిన ప్రసంగాన్ని మళ్ళా విన్నాను. నిజంగానే, సాహిత్యమూ, సజ్జనగోష్ఠీ లేకపోయుంటే సంసార విషవృక్షం నీడ కూడా కటికచేదుగా ఉండిఉండేది.
 
తాను శతాధికంగా రచనలు చేసినప్పటికీ తన పేరు శివతాండవంతో పెనవేసుకుని ఉండటం భగవంతుడు చేసిన చిత్రమని నారాయణాచార్యులుగారు రాసుకున్నారు. అది సంగీతం, నాట్యం, గానం, కావ్యం. శబ్దంతో చెక్కిన శిల్పం.
 
మొలకమీసపు గట్టు, ముద్దు చందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు కురియు మంటల రట్టు
సికపై ననల్ప కల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతి చెర్లాడు మధురవాసనలు
బింబారుణము కదంబించు తాంబూలంబు
తాంబూల వాసనలు తగులు భృంగ గణంబు
కనుల పండువు సేయ, మనసునిండుగ బూయ
ధణ ధణ ధ్వని దిశాతతి పిచ్చలింపంగ
 
ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు
 
అది మామూలు నాట్యం కాదు, అది మామూలు వర్ణన కాదు. ఆయన ఏ అతిలోక పారవశ్యాన్నో పొంది ఆ తపోభూమికలోంచి తాను చూసింది చూసినట్టుగా మాటల్లో పట్టుకోడానికి ప్రయత్నించాడు.
 
మబ్బుగము లుబ్బికొని ప్రబ్బికొన్న విధాన
అబ్బురపు నీలములు లిబ్బిసేరు విధాన
నల్లగలువలు దిక్కులెల్ల విచ్చు విధాన
మొల్లముగ తుమ్మెదలు మొనసికొన్న విధాన
వగలు కాటుకకొండ పగిలి చెదరు విధాన
తగిలి చీకటులు గొచ్చగ కప్పెడు విధాన
తనలోని తామసము కనుల జారు విధాన
తనలోని వక్రతయె కనుల తీరు విధాన
కులుక నీలపు కండ్ల తళుకు చూపులు పూయ
ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రోయ
 
ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు
 
ఇంకా-
 
తమ్ములై, ఘటితమోదమ్ములై, సుకృతరూ
పమ్ములై, శాస్త్రభాగ్యమ్ములై, నవకోర
కమ్ములై, వికచపుష్పమ్ములై, తుమ్మెదల
తమ్ములై, భావమంద్రమ్ములై, హావఫు
ల్లమ్ములై, నూత్నరత్నమ్ములై, వల్గుహా
సమ్ములై, కన్గొనల సొమ్ములై, విశ్రాంతి
దమ్ములై, రక్తకిసలమ్ములై, రక్తిచి
హ్నమ్ములై, తంద్రగమనమ్ములై, కెడకూడి
కులుకునీలపు కండ్ల తళుకు చూపులు పూయ
ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రోయ
 
ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు
 
కొన్నిచోట్ల వాల్మీకి గంగని వర్ణించినట్లే-
 
మలక మెరపులు కొన్ని, నిలువు మెరపులు కొన్ని
సొలపు మెరపులు కొన్ని, సూది మెరపులు కొన్ని
కోల మెరపులు కొన్ని, క్రొత్త మెరపులు కొన్ని
చాలు మెరపులు కొన్ని, జారు మెరపులు కొన్ని
ప్రక్క మెరపులు కొన్ని, సొక్కు మెరపులు కొన్ని
నిక్కు మెరపులు కొన్ని, నిండు మెరపులు కొన్ని
క్రేళ్ళు మెరపులు కొన్ని, క్రేటు మెరపులు కొన్ని
సుళ్ళ మెరపులు కొన్ని, త్రుళ్ళు మెరపులు కొన్ని
కులుకునీలపు కండ్ల తళుకు చూపులు పూయ
ఘల్లుమని కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రోయ
 
ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు
 
ఇక మరికొంతసేపటికి, అది నిజంగా తాండవమే-
తకిటతక, తకతకిట, తకతకిట, తకిటతక
తకతదిగిణతొగిణతొ, కిటతకతదిగిణతొ
కిటతకతగిణతొ, కిటతకదిగిణతొ
చటులంబులగు జతులు సరిగాగా తూగించి
ససరిరిస, రిగరిరిస, సరిగాగ, రీగాగ
గసగాగ ధవసాన
రి రి స రి స స రి గా గ రీ గా గ రి గ రి రి స
స రి సా స ప ద పా పా సరిగ నెత్తులు ముడిచి
 
ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు
 
అటువంటి ఒక రసజ్ఞుడు పుట్టడం కోసమే పూర్వమహాకవులంతా స్వర్గంలో నిరీక్షిస్తుంటారు. అటువంటి రసజ్ఞుడికోసమే సహృదయులందరూ సాయంకాలం గుమికూడతారు. అటువంటి కవిగాయకుడికోసమే ప్రతి సంధ్యవేళా శివుడు తాండవం చేస్తుంటాడు. అటువంటి వ్యక్తిని తలచుకున్న సంతోషం ఎటువంటిదని చెప్పను!
 
ఓ హో హో హో
ఊహాతీతం
బీయానందం
బిలాతలంబున!!
 
5-10-2021

Leave a Reply

%d bloggers like this: