వడ్డాది పాపయ్య

చిన్నప్పుడు నా ఊహాలోకాన్ని పెంచి పోషించినవాటిలో చందమామ ఎలానూ ఉంటుంది, దానితో పాటు ఆ పత్రికలో శంకర్, చిత్రలు గీసిన బొమ్మల్తో పాటు వపా పేరిట వడ్డాది పాపయ్య వేస్తూ ఉండిన ముఖచిత్రాలు కూడా ఉంటాయి.
 
1968- 72 మధ్యకాలంలో ఏ చందమామకి ఏ ముఖచిత్రం ఉందో నా మనసులో ఇప్పటికీ అచ్చుగుద్దినట్టే ఉంటుంది. ఆ బొమ్మ చూడగానే ఆ చిన్నప్పటి ఊహాలోకంలోకి ఇట్టే ఎగిరిపోగలను. కొద్దిగా పెద్దయ్యాక యువ దీపావళి సంచికల ముఖచిత్రాలూ, లోపల వర్ణచిత్రాలూ కూడా వడ్డాది పాపయ్యవి గుర్తే.
 
మహాభారతం వ్యాసుడు రాసిందీ, కవిత్రయం రాసిందీ చదవడం చాలా ఏళ్ళయ్యాక సంగతి. కాని నాకు తెలిసిన మహాభారతం చందమామలో నెలనెలా కొకు చెప్పిందే. ఆ కథలకి వపా గీసిన బొమ్మలే ఆ ఇతిహాసం గురించిన నేను చూసిన తొలిచిత్రాలు. ఆ కృష్ణుడు, ఆ భీష్ముడు, ఆ అంబ, ఆ జర, ఆ అభిమన్యుడు- వాళ్ళంతా వపా చూపించి పరిచయం చేసినవాళ్ళే. వాళ్ళ గురించి ఇప్పుడు చదివినా వాళ్ళను మరోలా ఊహించుకోలేను.
 
ఈ అనుభవం నా ఒక్కడిదే కాదు. ‘చందమామ కథలో చదివా, రెక్కల గుర్రాలుంటాయనీ, నమ్మడానికి ఎంతబాగుందో ‘ అన్నాడొక కవి. దాదాపుగా నా తరంవాళ్ళంఅంతా ఆ నమ్మకాల్తో పెరిగేం. మా మనసుల్లో మేము వ్యక్తావ్యక్తంగా ఏర్పరచుకున్న మైథాలజీకీ రూపురేఖలిచ్చింది వడ్డాది పాపయ్య అంటే అతిశయోక్తి కాదేమో.
 
అందుకనే నిన్న విజయవాడలో వడ్డాది పాపయ్య శతజయంతి ఉత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. నా చిన్నప్పటిలోకానికి చెందిన ఒక మనిషిని చూడబోతున్నానంత ఉత్సాహం కలిగింది. ఆ ఉత్సవంలో సభ ఒక్కటే కాదు, వడ్డాది పాపయ్య చిత్రాలకు రూపొందించిన నకళ్ళతో ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేసారు. దాదాపు నలభై మందికి పైగా ప్రసిద్ధ, ఔత్సాహిక చిత్రకారులు వపా బొమ్మలకి తాము మళ్ళా ప్రాణం పోసారు. అసలు ఒక చిత్రకారుడికి అటువంటి నివాళి ఇవ్వగలమని నాకిప్పటిదాకా తెలియలేదు.
 
ఆ సభకి అధ్యక్షత వహించిన సుంకర చలపతిరావు గారు చెప్పినదేమంటే, ఇంతదాకా తెలుగులో ఏ చిత్రకారుడికీ శతజయంతి ఉత్సవాలు జరగలేదనీ, ఇదే ప్రథమమనీ. ఈ సందర్భం పురస్కరించుకుని ఇప్పటికే విశాఖపట్టణంలో ఇటువంటి ప్రదర్శన ఏర్పాటు చేసామనీ, రానున్న రోజుల్లో తిరుపతిలోనూ, హైదరాబాదులోనూ కూడా ఇటువంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయబోతున్నామనీ చెప్పారు. ఆ ప్రదర్శనని నా చేతుల్తో ఆవిష్కరించే అవకాశం నాకు లభించడం నా భాగ్యం.
 
ఆ సభలో ఆంధ్రప్రదేశ్ దృశ్యకళల అకాడెమీ ఛైర్ పర్సన్ శ్రీమతి శైలజగారూ, జాషువా వేదిక అధ్యక్షులు నారాయణ గారూ, గోళ్ళనారాయణరావుగారూ, యెల్లపు కళాసాగర్ గారూ కూడా పాల్గొన్నారు. శతజయంతి ఉత్సవాల సందర్భంగా వపా పైన ఒక సావనీర్ కూడా వెలువరించారు. ఆ స్మారకసంచికలో వ్యాసాలు చదివితే ఇంతదాకా తెలియని కొత్త వపా ప్రత్యక్షమయ్యాడు. ఆయన జీవితకాలం పాటు సన్మానాలకీ, ప్రచారానికీ, చివరికి సందర్శకులకి కూడా విముఖుడిగా ఉన్నాడనీ, ఎంతసేపూ ఒక తపస్విగా తన పని చేసుకుంటూ ఉండేవాడనీ దాదాపుగా ప్రతి ఒక్కరూ రాసేరు. ఒకసారి బాపట్లనుంచి తనను చూడటానికి కొందరు చిత్రకారులు కశింకోట వస్తున్నారని తెలుసుకుని ఆయన తన ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోయాడట. తిరిగి ఆ బృందం అక్కణ్ణుంచి వెళ్ళిపోయారని రూడిచేసుకున్నాకనే తిరిగి ఇంటికి వచ్చాడట. ఇటువంటి సంఘటనలు ఎవరో జెన్ సాధువుల జీవితాల్లో మాత్రమే వింటాం!
 
మాటల మధ్యలో చలపతిరావుగారు తన చేతిసంచీలోంచి రెండు పటాలు తీసి చూపించారు. ఆ రెండూ వపా చిత్రించిన చిత్రాల ఒరిజినల్స్. అందులో పల్లెపడుచు అన్న చిత్రం ఎంత ముగ్ధమనోహరంగా ఉందో చెప్పలేను. ఆ చిత్రాన్నట్లానే చాలాసేపు తదేకంగా చూస్తూండిపోయాను. ఆ పడుచుని చిత్రిస్తున్నప్పుడు చిత్రకారుడు ఆమె యవ్వనం మీద కన్నా ఆమె ముగ్ధత్వం మీదనే దృష్టిపెట్టాడని తెలుస్తూ ఉండింది.
 
తన చిత్రాలకు సంతకం మాత్రమే కాదు లోగో వేసుకున్న మొదటి చిత్రకారుడు కూడా వపానే. 010 గా ఆయన చిత్రించుకున్న లోగో ఇంతకీ జగన్నాథముఖచిత్రమట!

11-10-2021
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Leave a Reply

%d bloggers like this: