రెల్లు, రెల్లు, రెల్లు

Reading Time: 2 minutes

వసంతకాలంలో అడవి పూస్తుంది, కొండలు పూస్తాయి, కోనలు పూస్తాయి. శరత్కాలంలో నదీతీరాలు పూస్తాయి, చెరువులు, దొరువులు, వాగులు, వంకలు పూస్తాయి. నేలా నింగీ కూడా ఒక్కటై పూస్తాయి.

ఎప్పుడో చిన్నప్పుడు నాకు ఊహతెలియని వయసులో మా ఊళ్ళో అడివి పుయ్యడం చూసాను. చాలా ఏళ్ళు గడిచాక నెమ్మదిగా తెలుసుకున్నదేమంటే, వసంతకాలపు అందమంతా, ఫాల్గుణ మాసపు కృష్ణపక్షంలో ఉంటుందని. వసంతాగమన సంతోషం ఎలా ఉంటుందో చూడాలంటే, చైత్రంలో కాదు, ఫాల్గుణ పున్నమినుంచి ఉగాది దాకా ఆ రెండూవారాల్లోనూ చూడాలి. ఆ రహస్యం తెలిసినవాడు కాబట్టే టాగోర్ వసంత ఋతుగీతికలు అధికభాగం ఫాల్గుణమాసంలో అల్లినవే.

ఇన్నాళ్ళకు మళ్ళా నదీతీరంలో నివసిస్తున్నందువల్ల శరదాగమన సంతోషం భాద్రపద కృష్ణపక్షంలో ఉంటుందని తెలుసుకోగలిగాను. గడచిన రెండువారాల్లోనో, ఓహ్, ఏం పూసాయి, నేలా, నింగీనూ!

ఎక్కడ చూడు, నదీ తీరం పొడుగునా, ఏమి పూసింది రెల్లు! పుయ్యడమంటే అది, తనువెల్లా విచ్చి పుయ్యడం, పిచ్చిగా పుయ్యడం. కింద కూలంకషంగా రెల్లు పూస్తే పైన అభ్రంకషంగా మేఘాలు పూసాయి. నిన్నటిదాకా బరువుగా పయనించిన పుష్కలావర్తాలు ఇప్పుడు నీళ్ళు ఖాళీ చేసిన కడవల్లాగా తేలిగ్గా, దూదిపింజల్లాగా ఆకాశంలో తేలియాడుతుండే దృశ్యాల్ని చూడటానికి నా రెండు కళ్ళే కాదు, నాకున్న ఒక్క మనసూ కూడా చాల్లేదు.

పయనించాను ఒక రోజంతా కృష్ణ ఒడ్డున, అవనిగడ్డదాకా, అక్కణ్ణుంచి రేపల్లెదాకా, వట్టి రెల్లు చూడటానికే. తిరుగాడేను వెర్రిగా ఆ కాశవనాలమధ్య, నడిమధ్యాహ్నం, పగలు వెన్నెలయిందన్నట్టుగా. మరొక రోజు రాజమండ్రిదాకా పయనించాను, గోదావరి పొడవునా లంకల్లో, ఇసుక బయళ్ళలో, ఎక్కడ చూడు రెల్లు, రెల్లు, రెల్లు.

కృష్ణప్రేమికులు ఆ రెల్లు గడ్డిని తలుచుకుని ఎందుకంత వివశులైపోతారో అర్థమయింది. చూడగా చూడగా ఆకాశం రెల్లుని పూసిందనీ, నదులూ, వాగులూ, వంకలూ, నెర్రెలూ, దొరువులూ మేఘాల్ని పూసాయనీ గ్రహించాను.

ఒక సాయంకాలం ఆ రెల్లు నన్ను పిలవడం మొదలుపెట్టింది. నేనూ నా కూతురు ఆ నదీతీరానికి బయల్దేరాం. ఊరి చివర, నది ఒడ్డున వరద మేటు వేసి తరలిపోయిన చోటల్లా రెల్లు. ఆ రెల్లుపూలని అట్లా చూస్తూనే ఉండిపోయాను. శిశిరవసంతాల మధ్య వచ్చే విచిత్రమధురమైన మార్పు మనకి ఎలానూ తెలుసు, కాని వర్షాకాలానికీ, శరత్కాలానికీ మధ్యవచ్చే కుసుమపేశలమైన మార్పుని ఇన్నాళ్ళకు గుర్తుపట్టాన్నేను. ఆ రెల్లు పొదల మధ్య, ఒక అదృశ్య, అనాహత మురళీగానం వినబడుతోందని కూడా అర్థమయింది నాకు. అట్లాంటి కాశమయ సాంధ్యవేళల్లో ఎన్నిసార్లో సంచరించి ఉంటారు కాబట్టే శుకుడు, లీలాశుకుడు, జయదేవుడు అట్లాంటి కృష్ణగానం చెయ్యగలిగారు.

ఒక మనిషి జీవితం సార్థకంగా జీవించాడనడానికి ప్రమాణాలేమిటి అనడిగాడు ఎరిక్ ఫ్రాం ఒక పుస్తకంలో. ఈ రెండు వారాలూ పగలంతా ఏ పని వ్యగ్రతలోనైనా గడిపి ఉండవచ్చు నేను, కాని సాయంకాలాలు ఆకాశమంతా ఆవరించిన మేఘమండలాల్నే చూస్తో, ఎక్కడ ఏ నెర్రెలో ఇంత మట్టిచేరినా అక్కడ తెల్లనెమళ్ళ గుంపు వాలినట్టు పూసిన రెల్లుపొదల్నే చూస్తూ గడిపాను. నా జీవితం సఫలమయింది, సార్థకమయింది.

‘ఆ ఊరి చివర అడవిలో పిల్లంగోవి ఊదుకునే ఒక పిల్లవాణ్ణి చూడు, నువ్వు మళ్ళా తిరిగిరానక్కర్లేని దారి చూపిస్తాడు’ అన్నాడు కృష్ణకర్ణామృతకారుడు. అట్లాంటి దారి ఏదో చూడగలిగాను. ఇప్పుడు ఈ క్షణాన ఈ లోకం నుంచి సెలవు తీసుకోమన్నా తృప్తిగా వెళ్ళిపోతాను.

7-10-2021

One Reply to “రెల్లు, రెల్లు, రెల్లు”

  1. ఇది చదివాక నేను..పుస్తకం అలా పక్కన పెట్టాను..ఇంక ఎమి చదవ బుద్ది కాలేదు..చేయబుద్ది కాలేదు..

Leave a Reply

%d bloggers like this: