మాకొద్దీ తెల్లదొరతనమూ

Reading Time: 4 minutes

కిందటి వారం రాజమండ్రి వెళ్ళినప్పుడు బి ఇ డి కాలేజికి కూడా వెళ్ళాను. ఇప్పుడు దాన్ని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సడ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అని పిలుస్తున్నారు. ఉపాధ్యాయ శిక్షణ రెండు విధాలుగా ఉంటుంది. ఇంటర్మీడియేట్ అయిన తరువాత ఇచ్చేదాన్ని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటారు. ఆ శిక్షణ ఇవ్వడానికి ప్రతి జిల్లాల్లోనూ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రయినింగ్ ఉన్నాయి. వాటిని డైట్లు అంటారు. డిగ్రీ అయిన తరువాత ఇచ్చే శిక్షణని బేచలర్ ఇన్ ఎడ్యుకేషన్, బి ఇ డి, అంటారు. ఆ శిక్షణ ఇవ్వడానికి నెల్లూరులోనూ, రాజమండ్రిలోనూ రెండు ప్రభుత్వ కళాశాలలు, కర్నూలులో ఒక కాలేజి ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఉన్నాయి.
 
రాజమండ్రిలో నేనున్నంతకాలం ఎన్నోసార్లు ఆ బియిడి కాలేజి పక్కనుంచే వెళ్తుండేవాణ్ణి కాని ఎన్నడూ లోపల అడుగుపెట్టలేదు. కాని ఆ కళాశాల విశిష్టత గురించి మొదటిసారి తెలిసింది మాత్రం ప్రొఫెసర్ శశిధర రావుగారి ద్వారా. ఆయన ఆ కాలేజిలో ప్రొఫెసరుగా, ప్రిన్సిపాలుగా కూడా పనిచేసారు. ఆ తర్వాత రోజుల్లో అదిలాబాదు జిల్లా ఉట్నూరులో ఏజెన్సీ జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసినప్పుడు నేనక్కడ జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా పనిచేసాను. మేమక్కడ కలిసి పనిచేసింది ఏడాదిన్నర కాలమే అయినప్పటికీ, ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. విద్య గురించిన మౌలిక భావనలు, తాత్త్విక నేపథ్యం, బోధనాపద్ధతులు మొదలైనవన్నీ ఆయన్నుంచే తెలుసుకున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఆయనతో కలిసి పనిచేసిన ఆ ఏడాదిన్నర కాలం నాకు ఒక డిప్లొమా కోర్సు లాంటిదాని చెప్పవచ్చు.
 
నేను పాఠశాల విద్య డైరక్టరుగా బాధ్యతలు స్వీకరించి రెండేళ్ళు కావొస్తున్నప్పటికీ, రాజమండ్రిలో బి ఇ డి కళాశాల పర్యవేక్షణ బాధ్యత కూడా నాదే అయినప్పటికీ, ఇప్పటికిగాని అక్కడ అడుగు పెట్టలేకపోయాను. కాని, ఒకసారి ఆ కళాశాల సందర్శించగానే, ఆ కళాశాల చరిత్ర తెలియగానే నా ఉరం గర్వంతో ఉబ్బిపోయింది.
 
మేము ఆ కళాశాలలో అడుగుపెట్టగానే అక్కడి ఉపాధ్యాయులు ఒకప్పుడు ఇక్కడ డా. రాధాకృష్ణన్ పనిచేసాడనీ, ఆయన అప్పుడు కూర్చున్న కుర్చీ ఇప్పటికీ భద్రంగా అలానే ఉందనీ చెప్పారు. అవును, 1916-19 మధ్యకాలంలో డా.రాధాకృష్ణన్ రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో తత్త్వశాస్త్రం బోధించారు. అప్పుడు ఆయన ఈ కళాశాలలో కూడా విద్యాతత్త్వశాస్త్రం పాఠాలు చెప్పారు. ఆ కుర్చీ కూడా ఇప్పటికీ భద్రంగా ఉంది. కానీ, అంతకన్నా నా ఒళ్ళు గగుర్పాటు చెందిన విషయాలు ఆ తర్వాత గానీ తెలియలేదు. 
 
ఆ కళాశాల స్థాపించి ఇప్పటికి 139 ఏళ్ళు. ఒకప్పుడు ఆంధ్రప్రాంతమంతటికీ ఇదొక్కటే ఉపాధ్యాయ శిక్షణాసంస్థ. బ్రిటిషు ప్రభుత్వ కాలంలో అది ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఆ కళాశాల విజిటు రిజిస్టరులో 1934 లో మద్రాసు గవర్నరు వచ్చి సందర్శించినట్టుగా రాసిన పరిశీలనలు ఉన్నాయి.
 
కళాశాల రెండు అంతస్థుల పురాతన భవనం. కిందన ఉన్నత పాఠశాల నడుస్తున్నది. ఉపాధ్యాయ శిక్షణ పొందే విద్యార్థులకు టీచింగు ప్రాక్టీసుకోసం ఏర్పడి నడుస్తున్న పాఠశాల అది. పైన బి ఇ డి క్లాసులు నడుస్తున్నాయి. కిందన ఉన్నత పాఠశాలలో ఒక తరగతిలో అడుగుపెట్టేటప్పటికి అక్కడ సంగీత ఉపాధ్యాయిని పిల్లలకి ‘సారే జహాసే అచ్ఛా’ గీతాన్ని నేర్పుతున్నది. ఆ పిల్లలతో కలిసి ఆ గీతం పల్లవి ఆలపించాం. ఆ తర్వాత ఆ కళాశాల లైబ్రరీ చూసాం. దాదాపు నలభైవేల పుస్తకాలు. ఒక శతాబ్దకాలపు విజ్ఞానకోశం అది.
 
అక్కణ్ణుంచి మేడ మీదకు వెళ్ళేటప్పటికి బి ఇ డి విద్యార్థులంతా ఒక హాల్లో ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళతో కొద్దిసేపు ముచ్చటించాం. నాతో పాటు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహాం, ఎస్.సి.ఇ.ఆర్.టి డైరక్టరు డా.ప్రతాపరెడ్డి కూడా ఉన్నారు. మేమంతా ఆ పిల్లలతో మాట్లాడుతుండగా, అక్కడ గోడమీద ఉన్న ఒక పటాన్ని చూపించి ‘ఆయన ఎవరు’ అని ప్రాంతీయ సంచాలకుడు పిల్లల్ని అడిగాడు. వెనకనుంచి ఒకపిల్లవాడు ‘గరిమెళ్ళ సత్యనారాయణ’ అని చెప్పాడు. ఆ పిల్లవాణ్ణి ముందుకు రమ్మన్నాను. గరిమెళ్ళ ఎవరు అని అడిగాను. దేశభక్తుడు, కవి, స్వాతంత్య్రంకోసం పాటలు పాడాడు, జైలుకు వెళ్ళాడు అని చెప్పాడు. ఆయన ఎక్కడివాడు అని అడిగాను. శ్రీకాకుళం అని చెప్పాడు. నువ్వు ఎక్కడినుంచి వచ్చావు అని అడిగాను. శ్రీకాకుళం అన్నాడు. మరి ఆయన చిత్రపటం ఇక్కడ ఎందుకుంది అని అడిగాను.
 
ఎందుకంటే ఆయన ఇక్కడ చదువుకున్నాడు. ఈ కళాశాలకు ఆయన పేరే పెట్టారు కాబట్టి అన్నాడు.
నాకు చెప్పలేని గగుర్పాటు కలిగింది. గరిమెళ్ళ ఈ కళాశాలలో చదువుకున్నాడా! ఈ కళాశాల పేరు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సడ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషనా! నా పర్యవేక్షణలో ఉన్న ఒక ప్రతిష్టాత్మక కళాశాలకు ఒక మహాకవి, ప్రజాకవి పేరు పెట్టారని, నాకిన్నాళ్ళూ తెలియనందుకు, నేను పాఠశాల విద్యాశాఖ అధిపతిగా రెండేళ్ళుగా పనిచేస్తున్నప్పటికీ, ఇప్పటిదాకా తెలుసుకోనందుకు సిగ్గుతో చచ్చిపోయాను. కాని మరుక్షణమే గర్వంతో పునర్జన్మించాను.
 
ఆయన రాసిన పాట ఒకటి పాడగలవా అనడిగాను.
 
ఆ పిల్లవాడు గుర్తుచేసుకోడానికి ప్రయత్నించాడు. కాని నేను ఆగలేకపోయాను.
 
‘మాకొద్దీ తెల్లదొరతనమూ..’ విన్నావా ఈ పాట అనడిగాను. కాని అతడి జవాబు కోసం ఆగకుండానే వెంటవెంటనే ఆ పంక్తులు బిగ్గరగా వినిపించాను.
 
మా కొద్దీ తెల్లదొరతనమూ-దేవ
మా కొద్దీ తెల్లదొరతనమూ
మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే
మా కొద్దీ తెల్లదొరతనమూ!
 
పండ్రెండు దేశాలూ పండుతున్నాగానీ
పట్టెడన్నమె లోపమండీ
ఉప్పుముట్టుకుంటే దోషమండీ
నోటమట్టిగొట్టీ పోతడండీ, అరె
కుక్కలతో పోరాడీ కూడుతింటామండీ!
 
మా కొద్దీ తెల్లదొరతనమూ- దేవ
మా కొద్దీ తెల్లదొరతనమూ
 
పిల్లలు చప్పట్లు కొట్టారు. కాని నా ఉద్వేగం ఉపశమించలేదు. గరిమెళ్ళ ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణకోసం చేరాడుగానీ, 150 పంక్తులకు పైగా సాగే ఈ గీతం రాయగానే ఆయనకు కలెక్టరునుంచి కబురు వచ్చింది. తన సమక్షంలో ఆ పాట పాడమన్నాడు కలెక్టరు. ఆయన ఎలుగెత్తి ఆలపించాడు. ‘తెలుగు అర్థం కాని నాకే ఈ గీతం వింటూంటే ఒళ్ళంతా మంటలు పుడుతున్నట్టుంది, ఇది వింటే ప్రజల్లో ఎంత విప్లవం చెలరేగుతుందో ఊహించగలను’ అన్నాడు కలెక్టరు. వెంటనే ఆ కవికి ఏడాది జైలు శిక్ష వేసాడు. ఒక పాట రాసినందుకు జైలు శిక్ష బహుమానంగా పొందిన మొదటి కవి బహుశా భారతదేశంలో గరిమెళ్ళ మాత్రమేనేమో.
 
అయితే ఆ రోజు రాజమండ్రి బి ఇ డి కళాశాల నాకు అందించిన పులకరింత అదొక్కటే కాదు. మరొక మహనీయుడు, దక్షిణభారతదేశంలో రాజద్రోహ నేరం మీద మొదటిసారిగా శిక్షకు గురయిన గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు కూడా ఆ కళాశాలలోనే చదువుకున్నాడని కూడా అప్పుడే తెలిసింది. వందేమాతరం రోజుల్లో ఆ కళాశాలలో ఆయన నేతృత్వంలో విద్యార్థులు చూపించిన అసమ్మతి జాతీయోద్యమంలో విద్యార్థుల తిరుగుబాటుకు సంబంధించిన మొదటి సంఘటన అని కూడా చెప్పవచ్చు.
 
‘సర్వోత్తమ జీవితం’ లో (పే.35-36) మాదలవీరభద్రరావుగారు ఆ ఘట్టాన్నిట్లా వివరించారు:
 
‘..బిపిన్ చంద్ర పాల్ ఉద్రేకపూరిత ఉపన్యాసాలివ్వగల వక్త. వీరి ఉపన్యాసాలతో ఆంధ్రవిద్యార్థిలోకం ఉద్రిక్తమైపోయింది. వారు జాతీయ భావ ప్రపూరితులైనారు. రాజమండ్రి విద్యార్థులు వందేమాతరం బిళ్ళలు ధరించి పాల్ ఉపన్యాసానంతరం బ్రహ్మాండమైన వీడ్కోలిచ్చారు. ఆ బిళ్ళలతోనే విద్యార్థులు కళాశాలకు రావటం కాలేజి ప్రిన్సిపాలుగా ఉన్న మార్కు హంటరుకు కన్నుగుట్టినట్టయింది. ఆ చిహ్నాలు తీసివేయమని హుంకరించాడు. కాని అతని మాటనెవరూ వినిపించుకోలేదు. పాఠశాలనుండి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. కాని విద్యార్థులు కేకలు వేస్తూ గేలి చేయసాగారు. హరిసర్వోత్తమరావుగారు అక్కడకు వచ్చి వారిని శాంతపరిచారు. విద్యార్థులందరికీ ఆయనంటే ఎంత అభిమానమో అర్థమయింది. ఈ విద్యార్థుల ఆందోళనకంతా రావుగారే కారణమని శిక్షిస్తానన్నాడు హంటర్. ప్రిన్సిపాల్ మరొక విద్యార్థిని కొట్టబోగా రావుగారు ముందుకొచ్చి ‘అతన్ని కొట్టబోకండి ‘ అని వారించాడు. హరిసర్వోత్తమరావుగారిని బడిలోనించి తీసివేశానన్నాడు. ఇది విని ఆర్ట్సు కాలేజీ, ట్రయినింగు కాలేజీ విద్యార్థులంతా బయటికి వచ్చి రావుగారిని అనుసరించారు. పవిత్ర గోదావరిలో స్నానం చేసి దీక్షాకంకణం ధరించారు. మరల కళాశాలలో కాలుపెట్టమని శపథం చేసారు. ఈ విధంగా రాజమహేంద్రవరం విద్యార్థులు తెలుగుదేశంలో వందేమాతరం ఉద్యమానికి మార్గదర్శకులైనారు..’
 
ఇటువంటి చరిత్రకు సాక్షిగా నిలిచిన ఆ కళాశాలలోనే చలంగారు కూడా అధ్యాపకుడిగా పనిచేసారని గుర్తు చేసుకున్నాను. ఆ రాత్రి విజయవాడకు తిరిగివస్తున్నంతసేపూ ఆ ఉద్యమకారులు, సంస్కర్తలు నా మనసులో పదేపదే మెదుల్తూ ఉన్నారు. అటువంటి చారిత్రాత్మక కళాశాలకు నేనేమి చెయ్యగలనా అని ఆలోచిస్తూ ఉన్నాను.
 
కొంతసేపటికి ఆ ఆలోచనలు కూడా అదృశ్యమై గరిమెళ్ళ ఒక్కడే నా మనసంతా నిండిపోయాడు. యూ ట్యూబ్ తెరిచి మాకొద్దీ తెల్లదొరతనమూ పాట ఎక్కడెక్కడ ఎవరు పాడారా అని చూడటం మొదలుపెట్టాను. ఏమాశ్చర్యం! పోయిన ఏడాది కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నప్పుడు, ఆరవ తరగతి తెలుగు వాచకంలో ఈ పాట పొందుపరిచాం కదా, ఎందరో ఉపాధ్యాయులూ, ఉపాధ్యాయినిలూ ఆ పాట తాము పాడిందీ, తమ పిల్లలూ పాడిందీ, ఆ పాటకు నాట్యం చేసిందీ ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో పెట్టినవి కనబడటం మొదలుపెట్టాయి. నాకు చెప్పలేని తృప్తి కలిగింది. ఆ మహనీయుడి పాట పాఠ్యపుస్తకాల్లో భాగంగా మరొకతరానికి చేరవెయ్యగలిగానన్న సంతోషం నా మనసంతా నిండిపోయింది.
 
9-10-2021

Leave a Reply Cancel reply

Exit mobile version
%%footer%%