తొలి తెలుగు శాసనం

ఆ రాత్రి ఎర్రగుంట్ల నుంచి గండికోట వెళ్ళాం. అయిదారేళ్ళ కిందట మిత్రురాలు, చిత్రదర్శకురాలు రమ కడప జిల్లా టూరిజం శాఖ కోసం తీసిన ఒక డాక్యుమెంటరీ చూపించారు. అందులో మొదటిసారి గండికోట దృశ్యాలు చూసాను. ఆ పురాతనమైన శిలాసముచ్చయం, వాటిమధ్య ఒక గోర్జలాగా ప్రవహించే పెన్నానది నా మనసులో ముద్రపడిపోయాయి. అప్పణ్ణుంచీ కోరిక గండికోట చూడాలని.
 
మర్నాడు పొద్దున్నే ఇంకా తెల్లవారకుండానే గండికోట కోటలోంచి పెన్నానది ఒడ్డుకి చేరుకున్నాం. దాన్ని ఒడ్డు అనడం సమంజసం కాదు. అదొకి అగాధమైన లోయ. అక్కడ ఏ కొన్ని కోట్ల సంవత్సరాల కిందటనో నేల పగులు విచ్చి, ఆ నెర్రెలోంచి ఒక నది ప్రవహించింది. రెండుగా విచ్చిపోయిన ఆ నేల సహజశిలాకుడ్యంలాగా అమరింది. అత్యంత ప్రాచీనమైన ఆ శిలారూపాలు పెట్టనికోటలాగా అటూ ఇటూ అమరి ఉండగా ఆ నది గంభీరంగా, లోతుగా, దట్టంగా కదీకదలనట్టుగా ప్రవహిస్తూ ఉంది.
మేం వెళ్ళేటప్పటికే అక్కడ చాలామంది యాత్రీకులు చేరుకుని ఉన్నారు. ఎత్తైన ఆ కొండకొమ్ము మీద ఎవరికి వారు ఏదో ఒక బండనో, రాళ్ళపోగునో ఆశ్రయించుకుని కూర్చుని ఉన్నారు.
 
అక్కణ్ణుంచి కనబడపోయే సూర్యోదయ దృశ్యాన్ని చూడాలన్న ప్రతీక్ష వాళ్ళది. మేము కూడా నెమ్మదిగా ఆ కొండ ఎక్కి, ఆ కొమ్ముమీద ఎత్తైన ఒక చోటు వెతుక్కుని కూచునేటంతలోనే తూర్పున ఒక పండుపండుతున్నట్టుగా సూర్యబింబం కనిపించడం మొదలుపెట్టింది. ఆ బింబం పూర్తిగా గోచరమై, ఆ పైన ఆ కాంతి నాలుగు దిక్కులా వ్యాపించడం మొదలుపెట్టింది. ఆ కాంతి కిందనున్న నదిలో ప్రతిఫలించే దృశ్యం మరింత రామణీయకంగా ఉంది. అంతదాకా వట్టి గోడగా మాత్రమే ఉన్న కొండ అంచు అప్పుడు నీడగా మారి ఆ నదిమీద పరుచుకోవడం మొదలుపెట్టింది. ఆ నీడని దాటుకుని ఆ సూర్యరశ్మి ఒక బంగారు చాందినీ కప్పినట్టుగా ఆ నదీశయ్య మిలమిల్లాడటం మొదలుపెట్టింది. అది అలా ఎంతసేపేనా చూడాలనిపించే దృశ్యం.
 
అప్పటికే మనుషుల కోలాహలం కూడా మరింత పెరిగింది. రెండు మూడు జంటలు వెడ్డింగ్ షూట్ లు మొదలుపెట్టారు. అక్కడికి వచ్చినవాళ్ళల్లో ఎక్కువమంది యువతీయువకులే కనిపిస్తున్నారు. అక్కణ్ణుంచి మేం నెమ్మదిగా కొండదిగి, కోటలోపల ధాన్యాగారం, మసీదు, మాధవస్వామి దేవాలయం చూసాం. ఆ కోట, ఆ దేవాలయాలు అన్నీ పూర్తిగా విజయనగర వాస్తు. కాని కాలం విజయనగరాన్ని దాదాపుగా ధ్వంసం చేయగలిగిందిగాని, గండికోటను ధ్వంసం చేయలేకపోయింది. విగ్రహాలైతే లేవుగాని, ఆ దేవాలయ వైభవం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని చెప్పవచ్చు.
 
మేం గెస్టు హవుస్ కి వచ్చాక నా చేతుల్లో ఎవరో ‘గండికోట చరిత్ర యాత్రాదర్శిని’ అనే పుస్తకం పెట్టారు. నడమల గంగాధర రెడ్డి అనే ఆయన కడప ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా, 2007 లో రాసిన పుస్తకం అది. ఆ చిన్నపుస్తకంలో గండికోట చరిత్ర, ముఖ్యదర్శనీయ స్థలాల వివరణ, శిల్పసంపద గురించిన వివరణ, రిఫరెన్సు పుస్తకాల పట్టిక కూడా ఉన్నాయి. టావెర్నియర్ అనే ఫ్రెంచి వజ్రాల వ్యాపారి 1652 లో గండికోటను సందర్శించి రెండవ హంపీగా ఆ కోటను పేర్కొన్నాడని కూడా రాసాడు.
 
2
 
గండికోట నుంచి త్వరత్వరగా బయలుదేరి ఆ రోజంతా కడప జిల్లాలో కొన్ని పాఠశాలలు చూడాలని అనుకున్నానుగాని, మళ్ళా చిత్తూరు జిల్లాలో పరిషత్తు ఎన్నికల కౌంటింగ్ కి పరిశీలకుడిగా వెళ్ళమని ఉత్తర్వులు వచ్చాయి. అందుకని గండికోట నుంచి నేరుగా చిత్తూరు వెళ్ళాలనుకుని ఆ దారిలో కలమల్ల, పొద్దుటూరు చూసుకుంటూ వెళ్ళాలనుకున్నాను.
 
కలమల్ల తెలుగు భాషలో రాసిన మొదటి శాసనం దొరికిన స్థలం. క్రీ.శ 575 లో ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు అనే రాజు వేయించిన ఒక శాసనం అక్కడ దొరికింది. తెలుగుని ఒక ప్రాచీన భాషగా నిలబెట్టే ఆధారాల్లో అది అత్యంత ముఖ్యమైన ఆధారం. ఆ శాసనం మీదా, ఆ ప్రాంతం మీదా అపారమైన పరిశోధన చేసిన వేంపల్లి గంగాధర్ ‘తొలి తెలుగు శాసనం’ అనే ఒక పుస్తకం కూడా వెలువరించాడు.
 
మేం కలమళ్ళ వెళ్ళేటప్పటికి పది గంటలు కావొస్తూంది. ఆ ఊళ్ళో చెన్నకేశవ స్వామి గుడిముంగటనే రోడ్డు పక్క ఒక శాసనం నేలలోకీ దిగ్గొట్టబడి కనిపించింది. కనీసం మైలురాయికి ఉండే పాటి భద్రత కూడా ఆ శాసనానికి లేదనిపించింది. ఆ గుడిలో అడుగుపెట్టగానే మరొక పక్క చిన్న శాసనం ఒకటి నేలలోకి కూరుకుపోయి కనిపించింది. ఇక మూడవ శాసనం చెన్నకేశవస్వామి గుడిలో భద్రంగా కనిపించింది.
 
నేను మొదట ఆ శాసనమే తొలి తెలుగు శాసనం అనుకున్నాను. కాని ఆ తర్వాత గంగాధర్ నా ఊహని సరిదిద్దాడు. క్రీ. శ 575 నాటి తొలితెలుగు శాసనాన్ని పరిశోధకులు కనుక్కోగానే అప్పటి ప్రభుత్వం చెన్నై కి తరలించిందనీ, ఆ తర్వాత ఆ శాసనం ఏమైపోయిందో ఎవరికీ తెలియడంలేదనీ చెప్పాడు అతడు. ఆ శాసనం నకలు మాత్రం మైసూరులో భద్రపరిచారని చెప్పారు. ఆ శాసనపాఠం ఇలా ఉంటుంది:
 
1. ……
2. కల్ ము(తు) రా
3. జు ధనంజ
4. యన్రు రేనా
5. ణ్డు ఏళన్
6. చరుమ్బూరి
7. రేవణకాలు (పం)
8. పు చెనూరుకాజు
9. అళిక ళా (ఊ) రి
10.ణ్డవారు (ఊరి)
11-14 (……)
15. …పంచ (మ)
18. హాపాతక శ
17. కు.
 
ఈ శాసనం తెలుగు భాషకి పెద్దదిక్కు. ఇటువంటి లిఖిత ఆధారం ఇంత ప్రాచీనతతో ఐర్లండ్ కో, ఇంగ్లాండ్ కో, జపాన్ కో దొరికి ఉంటే వాళ్ళీపాటికి ఈ ప్రాంతాన్ని ఒక ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మార్చేసి ఉండేవారు. కాని మనం ఆ శాసనాన్ని కాపాడుకోక పోగా, అటువంటి శాసనం దొరికిన చోటు గురించి కూడా నలుగురికీ చెప్పుకోలేకపోతున్నాం.
 
అయితే నేను ఆ గుడిలో చూసిన శాసనాలు ఏమిటి? నేను తిరిగి వచ్చాక గంగాధర్ వాటి గురించిన పూర్తి సమాచారం పంపించాడు.మహనీయుడు పి.వి. పరబ్రహ్మ శాస్త్రిగారు సంకలనం చేసిన కడపజిల్లా శాసనాల్లో 117, 118 శాసనాలు అవి. పదహారో శతాబ్దం నాటి శాసనాలు. నాకు ఆ శాసనాలు చూపించడానికి వచ్చిన ఒంటేరు శ్రీనివాసరెడ్డి ఆ మూడు శాసనాల్నీ ఆ గుడి ఎదట ఒక షోకేసులాగా కట్టి అందులో ప్రదర్శించే ఏర్పాటు చేయిస్తానని చెప్పాడు. ఆ శాసనాలు మరీ ప్రాచీనాలు కాకపోయినా, తొలితెలుగు శాసనాన్ని గుర్తు చేస్తాయి కాబట్టి అవి కూడా మనకి గర్వకారణాలే.
 
కిందటేడాది పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నప్పుడు తొలి తెలుగు శాసనం గురించి కూడా ఒక పాఠం పెట్టమని కొందరు నన్ను అడిగారు. కాని అప్పటికే పాఠ్యపుస్తకాలు దాదాపుగా రూపొందించి ఉండటంతో ఐదవ తరగతి తెలుగు పుస్తకంలో ఒక అనుబంధం గా మాత్రమే పరిచయం చేయగలిగాం. కాని ఆ పరిచయపాఠానికే ‘తొలి తెలుగు మూలాల అధ్యయన సంఘం’ వారు ఒక పండగలాగా జరుపుకోవడం నేనెన్నటికీ మరవలేను.
 
ఆ శాసనం వట్టి దానశాసనం కాదు. తెలుగు రాజభాషగా మారింది అనడానికి తొలి ఆధారం అది. ఒక వైపు తమిళం, మరొకవైపు ప్రాకృతం, అన్నివైపులా సంస్కృతం రాజభాషలుగా చలామణి అవుతున్నకాలంలో ఆ మూడు భాషలతో సంబంధంలేని తెలుగు భాషకి రేనాటి చోడులు పట్టం కట్టారు. ఇవాళ ఏ కార్యాలయంలోనూ కూడా తెలుగులో ఒక ఉత్తరం కూడా రాయడానికి సిద్ధంగా లేని మనం దాదాపు పదిహేను శతాబ్దాల కిందట దానశాసనాన్ని నలుగురూ చదివేలా తెలుగులో చెక్కించిన ఆ రాజుల్నీ, ఆ పాలననీ ఏమని ప్రశంసించగలుగుతాం!
 
4-10-2021

Leave a Reply

%d bloggers like this: