75 సంవత్సరాలు

Reading Time: 2 minutes

75 సంవత్సరాలు.
 
ఒక విధంగా చూస్తే సుదీర్ఘమైన కాలమే. దాదాపు శతాబ్దానికి దగ్గరగా. మరొకవైపు చూస్తే చాలా చిన్న వ్యవధి. అయిదువేల ఏళ్ళ భారతదేశ చరిత్రతో పోలిస్తే.
 
కాని భారతదేశ చరిత్రని దృష్టిలో పెట్టుకుని చూస్తే దేశమంతా ఒకే పాలనాచట్రం కింద, ఒకే సంవిధానం కింద ఇన్నేళ్ళుగా కొనసాగిన ఘట్టం ఇంతకుముందు మరెప్పుడూ లేదు. భిన్నభాషలు, మతాలు, తెగలు, సంస్కృతులు రాజకీయంగా ఇట్లా సహజీవనం చేసింది కూడా ఎన్నడూ లేదు.
ఈ విజయం భారత రాజ్యాంగానిది. భారత రాజ్యాంగ రూపకల్పన వెనక ఉన్న జాతీయోద్యమానిది, ఈనాటి మన స్వాతంత్య్రం కోసం ఆ రోజు తమ జీవితాల్ని త్యాగం చేసిన పోరాట కారులది.
ఎంత దూరం ప్రయాణించాం మనం. ఒక్కొక్కసారి తలుచుకుంటే చాలా గర్వంగా ఉంటుంది.
 
ఒక్కొక్కసారి భయం వేస్తుంది, పట్టలేనంత దుఃఖం కలుగుతుంది. నా చిన్నప్పుడు తాడికొండ స్కూల్లో మాతో భారాతరాజ్యాంగ ప్రవేశిక వల్లె వేయిస్తున్నప్పుడు మా ఉపాధ్యాయులు మాకు కులమతాలకు అతీతమైన ఒక దేశాన్ని చూపించారు. ‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’ మా ఆశయాలు కావాలని నూరిపోశారు. కాని ఒకసారి ఆ స్కూలు నుంచి బయటకు రాగానే ఎక్కడ చూసినా కులం, ఎవరిని కదిపినా మతం. దేశం ఇంత పరస్పర ద్వేషంతో అట్టుడికిపోయిన కాలం కూడా భారతదేశ చరిత్రలో మరొకటిలేదు.
 
కాని స్వాతంత్య్రమంటే ఏమిటన్న ప్రశ్న కూడా ఇప్పుడు మనల్ని నిలదీస్తున్నంతగా గతంలో ఎన్నడూ నిలదీసింది లేదు. ప్రపచం ఒక గ్లోబుగా కుంచించుకుపోతున్న ఈ కాలంలో జాతి, జాతీయ రాజ్యం వంటి పదాలు ఈ రోజు తీవ్రపరీక్షకు గురవుతున్నాయి. ఒకవైపు హద్దులు చెరిగిపోతున్న వైశ్వికత, మరొకవైపు కొత్త రూపాలు సంతరించుకుంటున్న స్థానికత, వీటిమధ్య జాతీయత ఒక భావంగా ఎన్నడూ లేనంత నిశిత పరీక్షకు గురవుతున్నది.
 
భారతదేశ చరిత్ర ఎంత రాజకీయమో అంతకన్నా కూడా అనేకవిధాలుగా సాంస్కృతికం. ఆదినుంచీ భారతదేశం అనే ఒక భావన కొన్ని సార్లు centri-fugal, మరికొన్ని సార్లు centri-petal. ఒక్కొక్కసారి మనమంతా ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి అనే భావన ప్రచలితమవుతుంది. మరికొన్నిసార్లు మనం అనేక ప్రాంతాలం, అనేక సంస్కృతులం అనే బహుళత్వం బలం పుంజుకుంటుంది. పైకి వైరుధ్యంగా కనిపించే ఈ వైవిధ్యంలో ఏకత్వాన్ని బోధపరుచుకున్నప్పుడే ఒక మనిషి భారతీయుడిగా మారతాడు. ఏకత్వం వేరు, ఏకశిలాసదృశంగా ఉండటం వేరు. దేశమంటే మట్టి కాదు, మనుషులు. ఎప్పటికప్పుడు మనుషులు తమ దేశాన్ని తాము దర్శించే ప్రయత్నం చేస్తారు, తమ దర్శనానికి అనుగుణంగా నిర్మించే ప్రయత్నం చేస్తారు.
 
ఈ మధ్య ‘చెక్ దే ఇండియా’ సినిమా చూసాను. ఆ సినిమాలో వివిధ రాష్ట్రాలనుంచి హాకీ శిక్షణ కోసం వచ్చిన క్రీడాకారుల్ని వాళ్ళ కోచ్ ప్రతి ఒక్కర్నీ నువ్వెక్కడ నుంచి వచ్చావని అడుగుతాడు. ఒకరు చండీగడ్ అంటారు, ఒకరు జార్ఖండ్ అంటారు, ఒకరు మిజోరం, మరొకరు ఆంధ్రా అని చెప్తారు. ఒకమ్మాయి మాత్రమే తనని తాను ‘ఇండియన్ ‘ గా పరిచయం చేసుకుంటుంది. ఆమెని ఆ బృందానికి కెప్టెన్ ని చేస్తాడు కోచ్. ఆ దృశ్యం నాకు కళ్ళనీళ్ళు తెప్పించింది. అక్కడ ‘ఇండియన్ ‘ అనే పదం మూఢ జాతీయతని కాదు, ఉజ్జ్వలమైన బృంద స్ఫూర్తిని స్ఫురింపచేస్తున్నది. అక్కడ ఇండియా ఒక దేశం కాదు, ఒక జాతి కాదు, ఒక రాజకీయ పార్టీ కాదు, ఒకే ఒక్క మతం అంతకన్నా కాదు. అక్కడ ఇండియా ఒక టీం, ఒక ఉమ్మడి భావన, వ్యక్తి తనని తాను వెనక్కి నెట్టుకుని తనొక బృందంగా మారే క్రమశిక్షణ, సంస్కారం, సంస్కృతి.
 
అటువంటి భారతదేశం కావాలి నాకు. నా పూర్వీకులు బానిసలుగా జీవిస్తూనే అటువంటి ఒక స్వతంత్ర భారతదేశాన్ని దర్శించారు, దాని కోసం పోరాడేరు. మనం మన పిల్లలకి ఏ భారతదేశాన్ని కానుక చేస్తున్నాం? అంతకన్నా ఉజ్జ్వలమైన భారతదేశాన్ని అందిద్దామని సంకల్పం చెప్పుకుందాం.
 
సరిగ్గ 75 ఏళ్ళ కిందట, ఈ రోజు, శ్రీ శ్రీ చెప్పుకున్న మహాసంకల్పాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం:
 
అతణ్ణి జాగ్రత్తగా చూడండి
స్వతంత్ర భారతపౌరుడు
అతని బాధ్యత వహిస్తామని
అందరూ హామీ ఇవ్వండి…
 
స్వాతంత్య్రం ఒక చాలా సున్నితమైన పువ్వు
చాలా వాడైన కత్తి, విలువైన వజ్రం
స్వాతంత్య్రం తెచ్చేవెన్నెన్నో బాధ్యతలు
సామర్థ్యంతో నిర్వహిస్తామని
సంకల్పం చెప్పుకుందాం…
 
ఇది నా స్వాతంత్య్ర దిన
మహాసంకల్పం
ఇది నా ప్రజలకు నివాళి
స్వతంత్ర భారత పతాకాని
కిది నా అభివాదం
భవిష్యదుజ్జ్వల
భర్మయుగానికి ఆహ్వానం.
 
సరిహద్దులు లేని
సకల జగజ్జనులారా!
 
మనుష్యుడే నా సంగీతం
 
మానవుడే నా సందేశం!
 
15-8-2021

Leave a Reply

%d bloggers like this: