మహాప్రస్థానం

పదేళ్ళ కిందట టాగోర్ 150 వ జయంతి సందర్భంగా హైదరాబాదులో బెంగాలీ సమాజం ఒక సమావేశం నిర్వహించుకున్నారు. ఆ రోజు విలియం రాడిస్ గీతాంజలికి తాను చేసిన సరికొత్త ఇంగ్లీషు అనువాదం గురించి మాట్లాడేడు. ఆ ప్రసంగంలో భాగంగా ఆయన గీతాంజలినుంచి కొన్ని గీతాలు చదివి వినిపిస్తున్నప్పుడు అక్కడున్న శ్రోతలు కూడా ఆయనతో పాటు ఆ గీతాలు గొంతెత్తి పాడటం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరిదగ్గరా గీతాంజలి పుస్తకం ఉంది. ఆ దృశ్యం నన్నెంతో ముగ్ధుణ్ణి చేసింది. ఇలా ఎప్పుడేనా ఒక తెలుగు కవి గురించి మాట్లాడుకుంటే వినే రోజు వస్తుందా అనుకున్నాను.
 
నిన్న అట్లాంటి రోజు. శ్రీ శ్రీ ప్రింటర్స్ అధినేత విశ్వేశ్వరరావుగారు నిలువెత్తు మహాప్రస్థానాన్ని వెలువరించిన సందర్భంగా తెలుగు రాష్త్రాల్లోని సాహిత్యాభిమానుల్తో పాటు అమెరికానుంచి కూడా తెలుగు మిత్రులు ఆన్ లైన్లో పాల్గొని నీరాజనాలు అర్పించిన రోజు.
 
సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో హాలంతా నిండిపోయింది. శివారెడ్డిగారు, తనికెళ్ళ భరణి, వాసిరెడ్డి నవీన్, ఇతర మిత్రులతో పాటు నాక్కూడా ఆ సభలో పాల్గొని మాట్లాడే అవకాశం లభించింది.
 
కాని నాకు ఆ సందర్భంగా శ్రీ శ్రీ కవిత్వాన్నీ, మహాప్రస్థానాన్నీ మళ్ళా కొత్తగా సమీక్షించాలనిపించలేదు. అంతకన్నా కూడా ఆ సెలబ్రేషన్ లో భాగంగా కొన్ని మహాప్రస్థాన గీతాల్ని ఎలుగెత్తి ఆలపించాలనిపించింది. నలుగురూ వినేలా నోరారా నినదించాలనిపించింది.
 
మహాప్రస్థానంలో కొంపెల్ల జనార్దన రావుకోసం రాసిన అంకిత పద్యం కాక మొత్తం నలభై కవితలున్నాయి. నలభై అనే అంకెకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుస్తకం శ్రీ శ్రీ నలభయ్యవ ఏట వెలువడింది. జాయిస్ ‘యులిసెస్ ‘కూడా అతడి నలభయ్యవ ఏట వెలువడిందనీ, తాను కూడా జాయిస్ స్థాయికి చేరుకున్నాననీ రాసుకున్నాడు శ్రీ శ్రీ ఒక చోట. కాని మహాప్రస్థానం అనగానే మనం కొన్ని గీతాలే గుర్తు చేసుకుంటాం. ‘మహా ప్రస్థానం’, ‘ప్రతిజ్ఞ’, ‘దేశచరిత్రలు’, ‘జగన్నాథుని రథచక్రాలు’, ‘కవితా ఓ కవితా’ వంటి కవితలు. కొన్నిసార్లు ‘భిక్షువర్షీయసి’, ‘బాటసారి’, ‘అవతారం’వంటి కవితలు కూడా. కాని ఎక్కువంది ఎక్కువసార్లు తలవని శక్తివంతమైన ఒకటి రెండు గీతాలు, ‘అభ్యుదయం’, ‘గంటలు’, జ్వాలాతోరణం’ వంటి కవితలు నోరారా చదివాను. వాటితో పాటు, ఒకప్పుడు ఎంతో ఉత్తేజభరితంగానూ, ఇప్పుడు విషాదభరితంగానూ, ఒకింత రిడిక్యులస్ గా కూడా వినిపించే ‘గర్జించు రష్యా’ కూడా.
 
శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున స్వామి ఎదట మంటపంలో నా పెళ్ళి జరిగినప్పుడు, వేదమంత్రాలు పూర్తయ్యాక, మా సోమయాజులు ఆ పెళ్ళిమంటపంలో బాసింపట్టు వేసుకుని కళ్ళు మూసుకుని, ‘కవితా ఓ కవితా’ గానం చేయడం మొదలుపెట్టాడు. మహాప్రస్థానాన్ని ఒక యువకుడికో, భిక్షుకుడికో, deathbed present గానో పంపండి అని రాసాడు చెలంగారు. కాని అది ఒక పెళ్ళికానుకగా బహూకరించదగ్గ పుస్తకం కూడా అని అర్థమయింది ఆ రోజు.
 
కాబట్టి నిన్న మళ్ళా ‘కవితా ఓ కవితా’ చదవకుండా ఎలా ఉండగలను? ఒకప్పుడు తడుముకోకుండా అప్పచెప్పగలిగేవాణ్ణి. జీవితంలో చాలా దూరం వచ్చేసాను. ఇప్పుడు అక్కడక్కడ పుస్తకం చూసుకుంటే తప్ప పూర్తిగా వల్లించలేకపోయాను. ఏమైనా చదవగలిగాను, ఆ అయిదు గీతాల్ని, హృదయంతో, దేహంతో, ఉచ్ఛ్వాసనిశ్వాసాల్తో, ఇన్నాళ్ళూ నిలబెట్టుకోగలిగిన నా సమస్త విశ్వాసాల్తో.
 
13-9-2021

Leave a Reply

%d bloggers like this: