ప్రేమలోనూ, కళలోనూ

Reading Time: 2 minutes

చిన్న బస్తీ పెద్ద పట్టణంగా మారిందని ఎప్పుడు చెప్పగలం? ఆ ఊళ్ళో సెకండ్ హాండ్ పుస్తకాల దుకాణం వచ్చినప్పుడు అని రాసాడు బుచ్చిబాబు. ఒక పట్టణం మహానగరంగా మారిందని ఎప్పుడు చెప్పగలం? ఆ ఊళ్ళో నీటిరంగుల చిత్రలేఖనసామగ్రి దొరికినప్పుడు అని చెప్తాన్నేను.
 
ఆ మాట చెన్నై గురించి చెప్పవచ్చు. పది పదిహేనేళ్ళ కిందట చెన్నైలో రాయపేట హైవేలో ఉండే హిందూస్తాన్ ట్రేడింగ్ కంపెనీ పరిచయమయ్యాక చాలా సామగ్రి దొరికింది. కాని ఎప్పుడేనా హఠాత్తుగా బుద్ధి పుడితే ఎలాగు? చైనీస్ ఇంకు, జపనీస్ రైస్ పేపరు, సెన్నెలియర్ పేస్టల్సు కొనుక్కోవాలనిపిస్తే? నీటిరంగులకి కావలసిన బ్రష్షులు,పేపర్లు, రంగులు హైదరాబాదులో కూడా దొరకడం కష్టంగా ఉండేది. గన్ ఫౌండ్రీ దగ్గర సారమేసన్స్ అని ఒక సింధీ కుటుంబం నడుపుకునే దుకాణం ఉంది. హోల్ సేల్ దుకాణం. నా కోసం రంగులు, కాగితాలు ప్రత్యేకంగా తెప్పించేవారు. విజయవాడ ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు.
 
కాని గవర్నరుపేటలో ఉన్న సర్వోదయ మార్కెటింగ్ కంపెనీ షాపు చిన్నదేమీ కాదు. ఔత్సాహిక నీటిరంగుల చిత్రకారుడికి కావలసిన సామగ్రి కొంతైనా అక్కడ దొరుకుతుంది.
 
మొన్న ఆ షాపుకి వెళ్ళినప్పుడు, ఆ షాపు కుర్రవాడు రెండు రోజుల ముందే గిరిధర గౌడ్ వచ్చివెళ్ళాడని చెప్పాడు. కేన్సన్ కాగితాలు కొనుక్కోడానికి వచ్చాడని చెప్పాడు. ఆ కాగితాల మీద గిరిధర్ ఏమి చిత్రిస్తున్నాడో ఆ ముందురోజే చూసాను కాబట్టి నాకు ఆ వార్త ఆశ్చర్యం కలిగించలేదు. కాని మామూలుగా చిత్రలేఖన సామగ్రి కొనుక్కోడానికి దుకాణానికి వచ్చేవాళ్ళు పెన్నులో, బ్రష్షులో సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోడానికి అక్కడ డూడుల్స్ గీసి చూసుకోడానికి ఆ షాపుల్లో ఒక కాగితాల బొత్తి పెడతారు. అటువంటి కాగితాల బొత్తిమీద తాను కొనుక్కున్న బ్రష్షు ఎలా పనిచేస్తోందో చూడటానికి గిరిధర్ అక్కడికక్కడే ఒక స్కెచ్ వేసి చూసుకున్నాడు. ఆ స్కెచ్ ని ఆ షాపు యజమాని అపురూపంగా ఒక ఆల్బంలో దాచుకున్నాడు. ఆ ఆల్బం తీసి నాకు చూపించాడు. అది బర్న్ట్ అంబర్ లో గీసిన నీటిరంగుల స్కెచ్.
 
మామూలుగా మనం రంగులు మహత్తు చేసాయనుకుంటాం. కాని ఆ ఇంద్రజాలం టోన్ ది. నీటిరంగుల చిత్రకారులు తాము వేస్తున్న చిత్రాల టోన్ సరిగ్గా వస్తుందో లేదో చూసుకోడానికి బర్న్ట్ అంబర్ లో స్కెచ్ లు వేసుకుని చూస్తారు. ఒక ఆకృతిలోని వివిధ ఛాయల్ని పట్టుకోవడంలో బర్న్ట్ అంబర్ చూపించగల ప్రతిభ అపారం. ఆ స్కెచ్ ని అట్లానే చూస్తూండిపోయాను. ఆ వదనంలో, సగం నిమీలితాలయిన ఆ నేత్రాల్లో ఎంత సౌందర్యం. ఆ లలన ఏదో ఆనందాన్ని గుర్తు చేసుకుంటున్నట్టుగానో లేదా మరొకమారు కోరుకుంటున్నట్టుగానో కనిపిస్తున్నది.
 
‘మీరు కూడా నాకొక స్కెచ్ వేసి ఎందుకివ్వకూడదు?’ అనడిగాడు ఆ షాపు కుర్రవాడు. ‘గిరిధర్ గారి బొమ్మతో పాటు మీ బొమ్మ కూడా దాచుకుంటాను’ అన్నాడు.
 
నాకు నవ్వొచ్చింది. గిరిధర్ తో పాటు నన్ను కూడా కలుపుకుంటున్నాడే! ‘నాకే గనుక మరికొంత వయసు ఉండి, ఇంకాస్త ఓపిక ఉండి ఉంటే మీ దగ్గర శిష్యరికం చేసిఉండేవాణ్ణి’ అని రాసాడు ఒక ప్రసిద్ధ చిత్రకారుడు గిరిధర్ కి ఒక ఉత్తరంలో. ఎంత తీవ్ర సాధన చేస్తే గిరిధర్ కి సమానం కావడం అలాఉంచి, కనీసం సమీపంగా పోగలను!
 
గిరిధర్ ఒక తపస్వి. గోలోకదూత. కైలాసంలో శివుడు సంధ్యానృత్యం చేస్తున్నప్పుడు పక్కన కూచుని బొమ్మలు వేసుకోడానికి అనుమతి పొందినవాడు.
 
అయినా ప్రలోభం పెద్దది. ఆ షాపు పిల్లవాడు ఇచ్చిన ఆర్చిస్ సాంపిల్ మీద ఒక పూల గిన్నె చిత్రించకుండా ఉండలేకపోయాను. బహుశా ప్రేమలోనూ, కళలోనూ ఎంత ప్రలోభపడితే అంత మంచిదనుకుంటాను.
 
12-9-2021

Leave a Reply

%d bloggers like this: