డొక్కాసీతమ్మా, పండిత రాయలూ

నాడు నేడు కార్యక్రమానికి పాతగన్నవరం వెళ్ళినప్పుడు లంకల గన్నవరం కూడా వెళ్ళాను. ఆతిథ్యానికి, అన్నదానానికి మారుపేరైన డొక్కా సీతమ్మగారి ఊరు అది.
 
నా మిత్రుడూ, ప్రసిద్ధ కవి, కథకుడు ఎం.ఎస్.సూర్యనారాయణ కొన్నేళ్ళ కిందట డొక్కా సీతమ్మ గారి పైన ఒక దీర్ఘకవిత రాసాడు. ‘దయామేఘ మల్హరి’ అనే ఆ కావ్యానికి నన్ను ముందుమాట రాయమని అడిగినప్పుడు మొదటిసారిగా ఆమె గురించి కొంత తెలుసుకున్నాను. ఆమె దాతృత్వం గురించిన ఖ్యాతి ఇంగ్లాండుదాకా వ్యాపించిందనీ, ఎడ్వర్డు ప్రభువు పట్టాభిషేకానికి ఆమెని కూడా ఒక అతిథిగా లండన్ ఆహ్వానించారనీ, కానీ, అన్నాళ్ళు తాను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక్కడ అన్నార్తుల్ని పట్టించుకునేవాళ్ళుండరు కాబట్టి తాను రాలేననీ ఆమె చెప్పిందని విన్నాను. ఆమె రాకపోతే కనీసం ఆమె ఛాయాచిత్రమైనా పంపించమని రాజు అడిగాడనీ, ఆ పట్టాభిషేక సమయంలో, ఆ దర్బారు హాల్లో ఒక కుర్చీలో ఆమె ఫొటో పెట్టుకున్నారనీ కూడా సూర్యనారాయణ చెప్పాడు. ఆ నేపథ్యంలో ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ కొన్ని వాక్యాలు రాయడమైతే రాసానుగానీ, అప్పణ్ణుంచీ, డొక్కా సీతమ్మ గారు నివసించిన ఇంటిని ఒక్కసారేనా చూడాలన్న కోరిక అలానే ఉండిపోయింది.
 
లంకల గన్నవరం పదహారణాల కోనసీమ అగ్రహారం. ఒకవైపు గోదావరి పాయ. చుట్టూ కొబ్బరితోటలు. పూర్వకాలపు పెంకుటిళ్ళు. ఒకప్పుడామె నివసించిన ఇంట్లో ఇప్పుడొక పోస్టాఫీసు నడుపుతున్నారు. అయితే, ఆ ఇల్లు చూడటానికి యాత్రీకులు రావడం అక్కడివారికి అలవాటైపోయినట్టుంది, ఆ ఇరుగుపొరుగు ఆ ఇంటి గురించీ, సీతమ్మగారి గురించీ ఏవో విషయాలు తమకి తెలిసినవి చెప్పారు.
 
ఆ పక్కనే మరొక ఇంటిముందు అందమైన మాధవీ లత అల్లుకుని ఉంది. అక్కడే ఆగిపోయి ఆ తీగనే చూస్తూ ఉండగా, ఆ ఇంటిపెద్దమనిషి వచ్చి తనని తాను పరిచయం చేసుకుని తమ ఇంట్లోకి అహ్వానించాడు. వారిది కూడా డొక్కావారి వంశమే. ఆ పెద్దమనిషి తండ్రి డొక్కా జోగారావు. ఆయన ఎనభయ్యేళ్ళకు పైబడ్డ వృద్ధుడు. ఒకరొకరే ఆ కుటుంబసభ్యులంతా వచ్చి పలకరించి భోజనాల వేళ అయ్యింది ఏమైనా తినివెళ్ళమని అభ్యర్థించడం మొదలుపెట్టారు. డొక్కా సీతమ్మ ఇంకా అక్కడ జీవిస్తూనే ఉన్నదని అర్థమయింది. మాకు భోజనానికి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పడంతో కనీసం మజ్జిగేనా తాగి వెళ్ళమని అడిగారు. డొక్కా సీతమ్మ గారి జీవితచరిత్ర పుస్తకం మూడు నాలుగు ప్రతులు నా చేతుల్లో పెట్టారు. తమ ఇంట్లో భోజనం చేయడానికేనా మరొక సారి లంకల గన్నవరం వస్తానని నాతో వాగ్దానం చేయించుకున్నాకగానీ మమ్మల్ని వదల్లేదు.
 
2
ముంగండ అగ్రహారం కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్నదని తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళకుండా ఎలా ఉండగలను?
 
మునిఖండంగా స్థానికులు పిలుచుకునే ముంగండ గురించి చాలా కాలం కిందట భమిడిపాటి జగన్నాథరావుగారు ఒక మాట చెప్పారు: ‘అక్కడి బ్రాహ్మణులు అటు వేదమూ, ఇటు కమ్యూనిస్టు మానిఫెస్టో కూడా సమానంగా అధ్యయనం చేసినవాళ్ళు ‘ అని. మహీధరసోదరులు రామ్మోహనరావుగారూ, జగన్మోహనరావుగారూ కూడా ముంగండ ప్రాంతానికి చెందినవారే. ‘రథచక్రాలు’, ‘కొల్లాయిగట్టితేనేమి’ వంటి నవలల ద్వారా రామ్మోహనరావు గారు తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులు. మహీధర జగన్మోహనరావు గారు కూడా తెలుగు సాహిత్యానికి చేసిన కృషి తక్కువేమీ కాదు. విశ్వసాహిత్యమాల పేరిట ఆయన ఎంతో విలువైన ప్రపంచసాహిత్యాన్ని తెలుగులోకి తీసుకువచ్చారు. టాగోర్ సాహిత్యవ్యాసాల్ని ‘సాహిత్యజగత్తు’, ‘కావ్యజగత్తు’ పేరిట తెలుగులోకి తెచ్చినది ఆయనే. ఆ తర్వాత ఎంతోకాలానికిగాని సాహిత్య అకాదెమీ టాగోర్ సాహిత్యవ్యాసాల్ని తెలుగులోకి తీసుకురాలేదు.
 
కాని ఆ రోజు నేను వెతుక్కున్నది జగన్నాథ పండితరాయల స్మారకచిహ్నాల గురించి. పండితరాయల గురించి నేను విన్నది ఎప్పుడని! నా చిన్నతనంలో, మా ఊళ్ళో, ఆ తాటాకు ఇంట్లో, ఎప్పుడో తాను సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు మా అక్క చెప్పింది ఆయన గురించి. ఆయన గొప్ప పండితుడనీ, ఢిల్లీ వెళ్ళాడనీ, షాజహాన్ ఆస్థానంలో ఉన్నాడనీ, ఆయన కుమార్తె లవంగిని ప్రేమించాడనీ, కాని రాజు ఆ ప్రేమని అంగీకరించలేదనీ, అప్పుడు పండితరాయలు లవంగికతో గంగానది ఒడ్డున గంగానదిని ప్రార్థిస్తే ఆ నది ఒక్కొక్కమెట్టే పైకి ప్రవహించి వారిద్దరినీ తనలో లీనం చేసేసుకుందనీ. ఆ తర్వాత ఆ కథకి మరెన్నో రూపాలున్నాయని తెలుసుకున్నాను గాని, ఆ పసితనంలో నేను ఏ రూపంలో విన్నానో ఆ రూపంలోనే ఆ కథ నా మనసులో అచ్చుపడిపోయింది.
 
ఇన్నాళ్ళకు ముంగండ వెళ్ళగలిగాను, ఆ నా చిన్నప్పటి ఆ కథానాయకుణ్ణి, ఆ కవికుమారుణ్ణి తలుచుకుంటూ. అక్కడ పండితరాయల పేరుమీద ఒక కమ్యూనిటీ హాలు తప్ప మరేమీ లేదు. ఆయన విగ్రహం కాని, స్మారకమందిరం గాని ఏదీ లేదు. కనీసం ఆ ఊళ్ళో గ్రంథాలయానికి కూడా ఆయన పేరు పెట్టినట్టు లేదు. కాని కనీసం ఒక భవనం మీదనైనా ఆయన పేరు ఉండటమే నాకెంతో గొప్పగా అనిపించింది. ఆ భవనం ఉన్న ప్రాంగణంలోనే జిల్లా పరిషత్ హైస్కూలు ఉంది. అక్కడి ఉపాధ్యాయులందరికీ పండితరాయల పేరు తెలుసని అర్థమయింది. కాని అంతవరకే. అంతకుమించి ఆయన గురించి అక్కడ చెప్పగలిగేవాళ్ళు ఎవరూ లేరు.
 
పండితరాయలు అన్నిటికన్న ముందు గొప్ప ఆలంకారికుడు. రసగంగాధరం ఆయన గ్రంథం. రమణీయార్థాన్ని ప్రతిపాదించే వాక్యమే కావ్యం అన్నది ఆయనే. తన ప్రతిపాదనకు లక్ష్యంగా ఆయన భామినీ విలాసమనే ముక్తకసంపుటాన్ని వెలువరించాడు. ఆ పుస్తకానికి ఇంగ్లిషు, ఫ్రెంచి అనువాదాలు నా కంటపడ్డాయిగాని, తెలుగులో ఏమీ అనువాదం వచ్చినట్టు నాకు కనిపించలేదు. భామినీవిలాసంలో అన్యోక్తివిలాసం, శృంగార విలాసం, కరుణవిలాసం, శాంత విలాసం పేరిట ముక్తకాలు ఉన్నాయి. సాధారణంగా సంస్కృత అలంకారికులు కావ్యలక్షణాల్ని వివరించడానికి ప్రాకృతం నుంచీ, సంస్కృతం నుంచీ శ్లోకాల్ని ఉదాహరిస్తారు. లేదా కొన్ని సార్లు తామే రచిస్తారు. పండితరాయలు కూడా కావ్యస్వరూపం గురించి తన అభిప్రాయాలకు ఉదాహరణగా ఈ శ్లోకాలు రచించాడనిపిస్తుంది. ఆయనకు తన కావ్యనిర్మాణ కౌశల్యం పట్ల ఉన్న నమ్మకం ఎటువంటిదో మొదటి శ్లోకంలోనే చెప్పాడు:
 
మాధుర్యపరమసీమా సారస్వత జలధిమథన సంభూతా
పిబతామనల్పసుఖదా వసుధాయాం మమ సుధా కవితా
 
(నా కవిత మాధుర్యానికి చరమసీమ. సాహిత్యమనే సముద్రాన్ని మధిస్తే పుట్టిన అమృతం. ఈ భూమ్మీద నా కవిత్వాన్ని అస్వాదించేవాళ్ళకి కలిగే సంతోషం అంతా ఇంతా కాదు)
 
అంత నిర్భరంగానూ చివరి శ్లోకాల్లో కూడా తన కవిత్వం గురించి చెప్పుకున్నాడు. ద్రాక్షారసంతోనూ, చెరకురసంతోనూ తన కవిత్వాన్ని పోల్చుకున్నాడు. ఆ ముక్తకాలు అన్నీ అదే స్థాయిలో ఉన్నాయని చెప్పలేను గానీ, ఆ భాషామాధురి మాత్రం సామాన్యమైనది కాదని చెప్పవచ్చు. కొన్ని ముక్తకాల్లో ఆ మాధుర్యానికి భావనాబలం కూడా తోడయ్యింది. ఒకటి రెండు ఉదాహరణలు చూడండి:
 
అయి దలదరవింద స్యందమానం మరందం
తవ కిమపి లిహంతో మంజు గుంజంతు భృంగాః
దిశి దిశి నిరపేక్షస్తావకీనం వివృణ్వన్
పరిమలమయమన్యో బాంధవా గంధవాహః (1:4)
 
(పూర్తిగా వికసించిన ఓ అరవిందమా! భృంగం నీ మకరందాన్ని పీలుస్తూ నీ దగ్గరే ఉండిపోయింది. కాని ఆ గాలి చూడు, నీ దగ్గర ఆగలేదన్నమాటేగాని, నీనుంచి ఏమీ కోరకుండానే నీ పరిమళం గురించి నాలుగు దిక్కులా చాటుతోంది.)
 
స్వేదాంబు సాంద్రకణశాలి కపోలపాలీ
దోలాయితశ్రవణకుండలనందనీయా
ఆనందమంకురయతి స్మరనేన కాపి
రమ్యా దశా మనసి మే మదిరేక్షణాయా (2:3)
 
(ఆమె కపోలతలమ్మీది నును స్వేదబిందువుని తాకీతాకనట్టుగా అల్లల్లాడే ఆ లోలాకుల్ని తలుచుకుంటే చాలు, నా మనసు చెప్పలేని ఆనందంలో మునిగిపోతుంది)
 
తీరే తరుణ్యా వదనం సహాసం
నీరే సరోజం చ మిలద్వికాసం
ఆలోక్య ధావత్యుభయత్ర ముగ్ధా
మరందలుబ్ధాలి కిశోరమాలా (2: 21)
 
(అటు గట్టుమీద హసిస్తున్న తరుణి వదనం, ఇటు సరసులో వికసించిన సరోజం, ఆ తుమ్మెద పిల్లలు ఎటు పోవాలో తెలీక కంగారులో రెండుదిక్కులా పరుగులుపెడుతున్నాయి)
 
The Indian Poetic Tradition లో అజ్ఞేయ చేసిన అనువాదం:
 
A Word of Warning
 
My soul, I tell you, watch out. Don’t take up with that cowherd.
Whose skin is the hue of fresh rain clouds, the one who pastures
His herd in Vrindavana. He’s shrewd. He’ll charm you first with his smile,
Then his looks. Your senses will fail, and then oblivion.
 
గంగాలహరి 53 శ్లోకాల కావ్యం. అది పండితరాయలే చెప్పుకున్నట్టు పీయూష లహరి కూడా. అసలు తెలుగు కవులు సంస్కృతంలో శ్లోకాలు చెప్పినప్పుడు ఆ మాధుర్యమే వేరు. లీలాశుకుడి శ్రీకృష్ణామృతం, నారాయణతీర్థుల శ్రీకృష్ణలీలా తరంగిణి చూడండి. ఆ సంస్కృతం నిర్మల ప్రవాహంగానూ, ఎడతెగని ధారగానూ, సరళసుబోధకంగానూ, సుగ్రాహ్యంగానూ ఉంటుంది. గంగాలహరి కూడా, అన్నిటికన్నా ముందు, ఒక వాగ్ధార.
 
సమృద్ధం సౌభాగ్యం సకలవసుధాయాః కిమపి తత్
మహైశ్వర్యం లీలాజనిత జగతః ఖండపరశోః
శృతీన సర్వస్వం సుకృతమథ మూర్తం సుమనసాం
సుధాసౌందర్యం తే సలిలమశివం నః శమయతు (1)
 
(అమ్మా నువ్వు ఈ లోకానికి సౌభాగ్యానివి. ఈశ్వరుడు ఒక లీలగా సృష్టించిన ఈ జగత్తుకి పట్టిన గొప్ప ఐశ్వర్యానివి. వేదాల సమస్త సారం నువ్వు. సుమనసులకి నువ్వు సుకృతానివి, సుధవి, సౌందర్యానివి. అమ్మా, నాలో, శివం కానిదేదన్నా ఉంటే దాన్ని నీ జలాలతో పూర్తిగా కడిగెయ్యి)
 
పురో ధావం ధావం ద్రవిణమదిరాఘూర్ణితదృశాం
మహీపానాం నానాతరుణతఖేదస్య నియతం
మమై వాయం మంతుః స్వహితశతహంతుర్జడధియో
వియోగస్తే మాతః యదిహ కరుణాతః క్షణమపి. (19)
 
( అమ్మా, నీ నుంచి క్షణమేనా ఎడంగా ఉన్నానంటే అది నా తప్పే. సంపదలతో మత్తెక్కిన రాజులముందు తిరుగాడుతూ నేను లేక్కలేనన్ని బలహీనతలకు లోనయ్యాను. మందమతిని, నా క్షేమానికి అడ్డుపడుతున్నదెవరన్నా ఉంటే అది నేనే)
 
చివరి శ్లోకం:
 
విభూషితానంగరిపూత్తమాంగా
సద్యః కృతానేకజనార్తిభంగా
మనోహరోత్తుంగచలత్తరంగా
గంగా మమాంగాన్యమలీకరోతు (52)
 
ఒక సహృదయుడు ఈ చివరిశ్లోకం లోని ‘-ంగ ‘ శబ్దం వింటున్నప్పుడల్లా ఈ శ్లోకం చెప్తూ కవి గంగా నదిలో బుడుంగుమంటూ మునకవేసినట్టే అనిపిస్తూంటుందన్నాడు!
 
~
 
తాజాకలం:
 
భామినీ విలాసానికి తెలుగు అనువాదాలు లేవేమో అన్నదానికి సమాధానంగా గాలినాసరరెడ్డి పుట్టపర్తి వారి అనువాదం ఉన్నదని చెప్పాడు. మళ్ళా నెట్ శోధిస్తే archive.org లో వడ్డాది సుబ్బారాయుడిగారి అనువాదంతో పాటు కనీసం ఆరు అనువాదాలున్నాయి!
 
1-9-2021

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading