గురువు ఒక థెరపిస్టు

రాత్రి The Kings Speech (2010) చూసాను. 83 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆ సినిమాకి ఉత్తమ చిత్రంతో పాటు మరొక మూడు అవార్డులు కూడా వచ్చాయని చెప్పింది మా అమృత. అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలబడగలిగే అర్హతలన్నీ మెండుగా ఉన్న ఆ చిత్రం ఒకచారిత్రిక కథాంశాన్ని నాటకీయంగా మలచిన కథనం.
 
అనుకోని పరిస్థితుల్లో ఆరవజార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించవలసి వచ్చిన బ్రిటిష్ రాకుమారుడికి నత్తి సమస్య ఉంటుంది. ఆ సమస్య పుట్టుకతో వచ్చింది కాదు. పెంపకంవల్ల, ఇతర కుటుంబకారణాలవల్లా, రాచరిక సమస్యలవల్లా ఏర్పడ్డ ఒక వైకల్యం అది. కాని రవి అస్తమించని సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండవలసినవాడు కనీసం స్పష్టంగా, తడుముకోకుండా, ధారాళంగా మాట్లాడటం ముఖ్యమని అందరితో పాటు ఆ రాకుమారుడు కూడా భావిస్తాడు. ఆ సమస్యనుంచి అతణ్ణి ఒక స్పీచ్ థెరపిస్టు ఏ విధంగా బయటపడవేసాడన్నదే చిత్రం ఇతివృత్తం. సినిమా ముగిసేటప్పటికి, ఆ రాకుమారుడు ఆరవ జార్జి చక్రవర్తిగా 1939 లో జర్మనీ మీద ఇంగ్లాండు యుద్ధం ప్రకటించక తప్పని అత్యంత క్లిష్ట చారిత్రక సందర్భంలో ప్రజల్ని ఉద్దేశించి ఒక గంభీరమైన ప్రసంగం చేస్తాడు. ఆ తర్వాత కూడా మరెన్నో ప్రసంగాలు చేసాడనీ, యుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రజల నిబ్బరానికీ, మనోస్థైర్యానికీ ఆరవజార్జి ప్రసంగాలు చిహ్నాలుగా మిగిలిపోయాయనీ చెప్తూ సినిమా ముగుస్తుంది.
 
ఆ సినిమా గురించిన మరెన్నో ఆసక్తి కరమైన విషయాలు, ముఖ్యంగా ఆ రాకుమారుడి నత్తి సమస్యను చిత్రీకరించడానికి దర్శకుడు ఎంత ప్రతిభ చూపించిందీ, ఆ దృశ్యాల్లోని సూక్ష్మవివరాలను పట్టుకోవడానికి ఎటువంటి లెన్సులు వాడిందీ, ఆ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నప్పుడు, ఆ ఇరుకునీ, ఆ ఇబ్బందినీ మనం అనుభూతి చెందేలా ఎటువంటి విజువల్స్ ని ఏ విధంగా రూపకల్పన చేసిందీ, అటువంటి వివరాలెన్నో నెట్ లో ఉన్నాయి. నేను మళ్ళా వాటిని ఇక్కడ పునరుక్తం చేయాలనుకోవడం లేదు.
 
మొన్న రాత్రి కొంతా, నిన్న రాత్రి కొంతా ఆ సినిమా చూసినప్పుడు అది ప్రధానంగా ఒక వైద్యుడు లేదా ఒక చికిత్సకుడు ఒక రోగికి లేదా ఒక సమస్యాత్మకమైన వ్యక్తికి ఒక గళాన్నీ, ఆ క్రమంలో ధైర్యాన్నీ ఇచ్చే కథగానే అనిపించింది. కాని తెల్లవారి లేస్తూనే, మెలకువలోకి అడుగుపెడుతున్నప్పుడు ఆ సినిమా నెమ్మదిగా మళ్ళా నా తలపుల్లో మెదలగానే అన్నిటికన్నా ముందు అది ఒక గురువుకీ, శిష్యుడికీ మధ్య కథ అని స్ఫురించింది.
 
గురువు అన్నిటికన్నా ముందు ఒక వైద్యుడు. రాకుమారుడు రాజు అయినతర్వాత ఆ వైద్యుడు రాజమందిరంలో అడుగుపెట్టినప్పుడు రాజరిక వ్యవస్థ అతణ్ణి అంగీకరించదు. అతడికి డిగ్రీలు, డిప్లొమాలు, క్వాలిఫికేషన్లూ లేవని, అటువంటివాడి సలహా తీసుకోవడాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించదని రాజుకు చెప్తారు. రాజు ఆ వైద్యుణ్ణి కూడా అదే ప్రశ్నిస్తాడు. అప్పుడతడు తాను తన వైద్యం మొదలుపెట్టినప్పుడు డిగ్రీలు అంత ముఖ్యంగా ఉండేవి కావనీ, అందుకే తాను తన పేరు చివరగానీ,ముందుగానీ డాక్టర్ అని రాసుకోలేదనీ, కేవలం స్పీచ్ థెరపిస్టు అని మాత్రమే రాసుకుంటున్నాననీ చెప్తాడు. అది చాలా కీలకమైన మాట అనిపించింది నాకు. ఎప్పుడైనా గురువుకి ప్రధానంగా కావలసింది ప్రాక్టీసు, ఆచరణ. డిగ్రీలు కావు, క్వాలిఫికేషన్లు కావు. అతడు అన్నిటికన్నా ముందు చికిత్సకుడు, వైకల్యాన్ని కనిపెట్టేవాడు, సరిదిద్దేవాడు. ఆ సరిదిద్దే క్రమంలో అన్నిటికన్నా ముందు తన శిష్యుడికి ధైర్యాన్నిచ్చేవాడు, ఆ క్రమంలో అతణ్ణి ఒక సంపూర్ణవ్యక్తిగా రూపొందించేవాడు. గురువు ఒక థెరపిస్టు అనుకోవడంలో ఎంతో కొత్త వెలుగు కనిపిస్తూ ఉంది నాకు. నా చిన్నతనంలో నన్ను గాఢంగా ప్రభావితం చేసిన గురువులు నాలోపలి ఎన్నో అవకరాల్ని సరిదిద్దినవాళ్ళే అని ఇప్పుడు అర్థమవుతోంది.
 
గురువు అన్నిటికన్నా ముందు ఒక మిత్రుడు. సినిమాలో రాకుమారుడు తన జీవితంలోని అత్యంత పరీక్షాత్మక ఘడియలో నిలబడ్డప్పుడు, జాతిని ఉద్దేశించి ఉత్తేజపూరితమైన ఒక ప్రసంగం చేయవలసి వచ్చినప్పుడు, ఆ డాక్టరు అతడి ముందు నిలబడి, ‘నీ ప్రసంగం నాకోసం చెయ్యి, ఒక మిత్రుడితో చెప్పుకుంటున్నట్లుగా ప్రసంగించు’ అంటాడు. గురువు నీ ముందు మిత్రుడిగా నిలబడ్డ ప్రతిసారీ ఊహించలేనంత పొడుగ్గా కనిపిస్తాడు.
 
నాకు ఇప్పటికీ గుర్తు, నా చిన్నప్పటి ఒక సంఘటన. మేము తాడికొండలో చదువుకుంటున్నప్పుడు ఎప్పుడేనా ఏడాదికి ఒకసారి ఊళ్ళో ఉన్న సినిమాహాలుకి సినిమాకి తీసుకువెళ్ళేవారు. అది కూడా మేటినీ షోకి. పిల్లలమంతా లైనుగా స్కూలు నుంచి సినిమాహాలుదాకా వెళ్ళి, సినిమా చూసి, మళ్ళా లైనుగా స్కూలుకి తిరిగివచ్చేవాళ్ళం. అలా ఒకసారి మేమొక సినిమా చూసాం. ఆ సినిమా పేరు ‘సంసారం-సాగరం.’ అప్పటిదాకా సినిమాల్లో విలన్ పాత్రలు వేసే సత్యనారాయణ ఆ సినిమాలో ప్రధాన పాత్ర. అందులో అతడు చివరికి ఆత్మహత్య చేసుకోవడంలాంటిదేదో జరుగుతుంది. ఆ విషయం అంతగా గుర్తులేదు, కాని కఠిననిర్ణయమేదో తీసుకున్నట్టు గుర్తు. ఆ సినిమా అయిపోయాక, మేము తిరిగి స్కూలుకు వెళ్తుండగా, మాకు తోడుగా వచ్చిన ఒక మాష్టారు మాతో పాటే నడుస్తూ, నా పక్కన అడుగులు వేస్తూ, ‘ఒరే, సత్యనారాయణ అటువంటి నిర్ణయం తీసుకోవడం సరైనదే అంటావా? నీ అభిప్రాయం ఏమిటి?’ అనడిగారు. మా స్కూల్లో తక్కిన పిల్లలందరికన్నా పొట్టిగా ఉండే నేను ఆ క్షణంలో ఒక్కసారిగా పొడుగ్గా ఎదిగిపోయాను. ఆరో తరగతినో, ఏడో తరగతినో చదువుతున్న నన్ను మా ఉపాధ్యాయుడు నా అభిప్రాయం చెప్పమని అడిగిన క్షణాన్ని నేను ఎప్పటికీ మరవలేను. అది ఉపాధ్యాయుడు నా కోసం తాను దిగివచ్చిన క్షణం కాదు, నన్ను తన స్థాయికి ఎదిగించిన క్షణం. గురువు పిల్లవాడిని తనతో సమానుడిగా ఎప్పుడు భావిస్తాడో అప్పుడు మాత్రమే అతడు గురువు, తక్కినసమయాల్లో ట్రయినరు మాత్రమే.
 
తక్కినవాటన్నిటికన్నా ముందు గురువు ఒక తల్లి. ఆ సినిమాలో రాకుమారుడికి నత్తి రావడానికి ఒక ముఖ్యకారణం అతడికీ అతడి తండ్రికీ మధ్య ఉన్న రాచరిక అగాధం. తన తండ్రిని తాను తండ్రిగా కాకుండా చక్రవర్తిగా చూడవలసి రావడం. ప్రేమ ఉండవలసిన చోట, ఆధిపత్యం, అధికారం ఎదురయ్యే వ్యవస్థల్లో మనుషులు తమ కనీస భావాలు చెప్పుకోవడానికి కూడా తడబడక తప్పదు. తాను ఏమి మాట్లాడితే ఏమి పొరపాటు అవుతుందో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో అన్న భయం మనుషుల్ని వికలం చేస్తుంది. ఆ భయాన్ని సరిదిద్దగలిగేవాళ్ళల్లో తల్లీ, గురువూ, మిత్రులూ ముందుంటారు. నువ్వు నీ తల్లిదగ్గర ఉన్నంత స్వతంత్రంగా మరెక్కడా ఉండలేవు. తల్లికి నీ తప్పొప్పులతో పనిలేదు. ఆమె దృష్టి ఎంతసేపూ నువ్వు సౌకర్యవంతంగా ఉన్నావా లేవా అన్నదానిమీదనే ఉంటుంది. తల్లి తర్వాత ఆ పాత్ర పోషించవలసింది గురువునే. ప్రపంచమంతా కూడా పాఠశాలలు ఆధిపత్యభావజాలానికి ఊయెలతొట్లుగా మారిపోయినవేళ, గురువు నిర్వహించవలసిన పాత్ర మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటున్నది. నిజానికి వైకల్యం సమాజానిది, ఆ సమాజిక వైకల్యాన్ని ప్రతిబింబిస్తున్న పాఠశాలది. కానీ సమాజమూ, పాఠశాలా కూడా ఆ వైకల్యం పిల్లవాడిదంటున్నాయి. కాదని చెప్పవలసింది గురువు, ఓదార్చవలసింది గురువు.
 
ఆ సినిమాని మరోసారి నా మనోనేత్రం ముందు ద్యోతకం చేసుకుంటే, ఆ డాక్టరు ఆ రాకుమాడికి అన్నిటికన్నా ముందు గొప్ప కంపేనియన్ అని అర్థమయింది. ఒక పిల్లవాడికి ఇంటి బయట దొరికే సహచరులందరిలో గురువే అత్యుత్తమ సహచరుడు. అతడు పిల్లవాడితో కలిసి నడుస్తాడు. ఆడతాడు, పాడతాడు, మాటాడతాడు, అన్నిటికన్నా ముందు పిల్లవాణ్ణి engage చేస్తాడు. పిల్లవాణ్ణి పట్టించుకోకుండా మనం వాడికి ఏది అందించినా దాన్ని విద్య అనలేం. చదువు ఒక గోరుముద్ద. ఆన్ లైన్లూ, డిజిటల్ పరికరాలూ, పుస్తకాలూ, వర్కు బుక్కులూ ఒక ఉపాధ్యాయుడికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవని కరోనా మనకి పూర్తిగా రుజువు చేసింది. నువ్వేమీ చెయ్యకపోయినా పర్వాలేదు. పిల్లవాడూ, నువ్వూ తరగతిగదిలో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నా కూడా అదే గొప్ప అభ్యసన కార్యక్రమం. అటువంటిది, ఆ గురువు పిల్లవాణ్ణి పట్టించుకోవడం మొదలుపెడితే, అతడికోసం కథలు చెప్పగలిగితే, పాటలు కట్టగలిగితే, కలిసి ఆటలాడితే, మాటలాడితే- విద్య అంటే అది మాత్రమే.
 
నా మిత్రుడూ, గురువు రవీంద్రకుమార శర్మ ఒకసారి ఒకమాటన్నారు, ఎవరి దగ్గర చదువుకుంటే నీకు ఓటమి సంభవించదో అతడే గురువు అని. దాన్ని మనం ఇప్పుడు పరీక్షలో ఉత్తీర్ణుడు కావడమనే స్థాయికి కుదించి అర్థం చేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముందు గురువు నిన్ను నీకు పరిచయం చేస్తాడు, నిన్ను నీకు తెచ్చిస్తాడు, అందిస్తాడు. అప్పుడు అతడు నీలో ఒక భాగంగా మారిపోతాడు. ఏదో ఒక దశలో గురువునించి నువ్వు భౌతికంగా దూరంగా జరుగుతావు, కాని నీ జీవితంలోని ప్రతి మలుపులోనూ, నీ వైకల్యాల మీద నువ్వు సాధించే ప్రతి విజయంలోనూ అతడు నీ పక్కనే ఉన్నట్లుగా నువ్వు అనుభూతి చెందుతూనే ఉంటావు.
 
అటువంటి గురువుల కోసం ఈ ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా మరింత దప్పిపడి ఉంది.
 
5-9-2021

Leave a Reply

%d bloggers like this: