కవి సమ్రాట్

Reading Time: 3 minutes

నిన్న విశ్వనాథ సత్యనారాయణగారి 126 వ జయంతి ఉత్సవం సందర్భంగా మాకినేని బసవపున్నయ్య భవనంలో జరిగిన సమావేశంలో పాల్గొనే అవకాశం లభించింది. కిందటి ఏడాది జూం లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడమని పిలిచారుగాని, ప్రపంచవ్యాప్తంగా విశ్వనాథ అభిమానుల్తో కిక్కిరిసిపోయిన ఆ జూమ్ వేదికలో ఒక్క క్షణం కూడా నాకు దొరకలేదు.
 
అందుకని విశ్వనాథ ఫౌండేషన్ అధ్యక్షులు, విశ్వనాథ సత్యనారాయణగారి మనుమడు విశ్వనాథ సత్యనారాయణ ఈసారి నాకు కీలక ఉపన్యాసం చేసే అవకాశాన్నిచ్చారు. నాతో పాటు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, అప్పాజోస్యుల సత్యనారాయణ వంటి పెద్దలు కూడా పాల్గొని ప్రసంగించారు.
కాని నిన్నటి సమావేశంలో ప్రత్యేక ఆకర్షణ ‘కవి సమ్రాట్’ అనే ఒక బయో-పిక్ ప్రదర్శన.
 
ఎల్.బి.శ్రీరాం విశ్వనాథ సత్యనారాయణగా సవిత్ సి చంద్ర అనే ఒక యువకుడు రాసి, దర్శకత్వం వహించిన ఆ చలనచిత్రం నిడివి యాభై నిమిషాలే గాని, చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్నీ హత్తుకుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపూ నా కళ్ళు కన్నీళ్ళు కారుస్తూనే ఉన్నాయి.
 
ఇరవయ్యవశతాబ్దంలో తెలుగు సాహిత్యంలో అపారమైన సాహిత్య సృష్టి చేసిన ఒక మహాకవి జీవితంలోంచి ఏది ఎంచుకోవాలి, ఏది వదిలిపెట్టాలి, ఏ పార్శ్వంలో చిత్రీకరించాలి అన్నది చాలా కష్టమైన విషయం. కాని ఆ దర్శకుడు, అతడి సాంకేతిక బృందం పాతిక ముప్పై ఏళ్ళ యువకులు. వాళ్ళు విశ్వనాథను, అన్నిటికన్నా ముందు, ఒక మనిషిగా ఆయన సజీవ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. ఒక కొడుకుగా, భర్తగా, సోదరుడిగా, మిత్రుడిగా, చదువరిగా, కవిగా విశ్వనాథను చూపిస్తూ వాటన్నిటితోనూ కలిపి ఆయన్ను ఆత్మవిశ్వాసభరితుడైన మనిషిగా చూపించడంలో పూర్తిగా సఫలమయ్యారు.
 
అన్నిటికన్నా ముఖ్యం ఎల్.బి. శ్రీరాం విశ్వనాథను మన కళ్ళముందు ప్రత్యక్షం చేసారు. ఏ విధంగా చూసినా ఎల్.బి.శ్రీరాం రూపానికీ, విశ్వనాథ రూపానికీ పోలికల్లేవు. కానీ, తెరమీద మూడు నాలుగు నిమిషాలు గడవగానే ఎల్.బి. శ్రీరాం అదృశ్యమైపోయి విశ్వనాథ మాత్రమే కనిపించడం మొదలుపెట్టాడు. ఆ సినిమా పూర్తయి సభమొదలయ్యాక కూడా సభికులు ఎల్.బి.శ్రీరాం ను చుట్టుముట్టి ఫొటోలు తీసుకుంటూ ఉండటమే అందుకు నిదర్శనం.
 
విశ్వనాథను యాభై నిమిషాల్లో ఎలా ప్రెజెంట్ చెయ్యడం? ఇప్పటి యువకులు తమకి ఆయన ఏమి అర్థమయ్యాడో, ఆయనలో తమని ఆకర్షించింది ఏదో తెలుసుకునే ప్రయత్నంగా ఆ సినిమా నాకు కనిపించింది. అసలు సినిమా మొదలవుతూనే ఒక స్థానిక రచయిత విశ్వనాథ రాసిన ‘ఇంకొక విధము’ కథ గురించి ఆయన్ని నిలదీస్తున్నప్పుడు నేను చెప్పలేని కుదుపుకు లోనయ్యాను. ఎందుకంటే, నాకు తెలిసి, తెలుగులో వచ్చిన మొదటి ‘గే ‘కథ అది. ఇవాళ ప్రపంచమంతా ఎల్.జి.బి.టి హక్కుల గురించి, వారి సున్నితమైన అస్తిత్వాలగురించీ మాట్లాడుతున్నప్పుడు విశ్వనాథ ఎనభై తొంభై యేళ్ళకు ముందే ఆ అంశంతో కథ రాసాడని దర్శకుడు గుర్తు చేస్తున్నప్పుడు, నేను చూడబోతున్నది ఒక సంప్రదాయ రచయిత గురించి మాత్రమే కాదనీ, ఒక పోస్ట్ మాడర్న్ రచయిత గురించి కూడా అనీ ఛళ్ళున చరిచి చెప్పినట్టయింది.
 
ఆ చిత్రం విశ్వనాథ మీద డాక్యుమెంటరీ కాదు. అయిదారేళ్ళ కిందట లామకాన్ లో అనంతమూర్తి మీద ఒక డాక్యుమెంటరీ చూసినప్పుడు తెలుగు కవుల మీదా, రచయితలమీదా కూడా అటువంటి స్థాయి డాక్యుమెంటరీలు ఎప్పుడు వస్తాయా అనుకున్నాను. కాని ఈ చిత్రం అంతకన్నా ఒక అడుగు ముందుకు వేసింది. ఇది జీవితచిత్రణ. రేపు శ్రీ శ్రీ మీద కూడా ఇటువంటి బయో-పిక్ ఒకటి తీయాలని తాము అనుకుంటున్నామని ఎల్.బి.శ్రీరాం సభాముఖంగా ప్రకటించారు. అలానే చలం, జాషువా, చెరబండరాజు, రేవతీదేవి వంటి కవులమీదా, రచయితలమీదా కూడా ఇటువంటి జీవితచిత్రణలు వస్తాయనీ, వాటిని కూడా పాతికేళ్ళలోపు యువతీయువకులు తీస్తారనీ ఆశిద్దాం.
 
విశ్వనాథను కళ్ళారా చూసి, స్వయంగా అయన మాటలు విన్నట్టుగా అనిపించిన ఆ అనుభూతిని నేను ఏదో ఒక సుదీర్ఘ ప్రసంగం చేసి పోగొట్టుకోవాలనుకోలేదు. అందుకని క్లుప్తంగానే మాట్లాడేను. ముఖ్యంగా, 1970 లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా కోసం ఎ.ఎస్.రామన్ విశ్వనాథ తో చేసిన ఇంటర్వ్యూను గుర్తు చేస్తూ ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అని మరో మారు గుర్తుచేసాను. ఆ ఇంటర్వ్యూలో విశ్వనాథ ఇంగ్లీషులోనే జవాబులిచ్చారు. పదేళ్ళ కిందట వెల్చాల కొండలరావుగారు వెలువరించిన ‘విశ్వనాథ’ అనే ఒక ఇంగ్లిషు సంపుటంలో ఆ ఇంటర్వ్యూ మొదటిసారి చదివినప్పుడు నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. భూగోళాన్ని అరచేతిలో పెట్టుకుని మాట్లాడేడు విశ్వనాథ అందులో. ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ పూర్తి పాఠం ఇక్కడ చదవవచ్చు.
 
ఆ ఇంటర్వ్యూలోంచి కొన్ని మాటలు నిన్న మిత్రులకి గుర్తు చేసాను. తన జీవితం పొడుగునా తనకి ఇరుపక్కలా ఒకవైపు నిర్మల పవిత్ర గంగాస్రవంతి, మరొక పక్క దుర్గంధభూయుష్ఠమైన మురికి కాలువా ప్రవహిస్తూనే ఉన్నాయని ఆయన చెప్పుకున్నాడు. సమాజంలో తనని ప్రేమించేవాళ్ళూ, ద్వేషించేవాళ్ళూ తనకి ఇరుపక్కలా తన జీవితం పొడుగునా కొనసాగుతూనే ఉన్నారని చెప్పడం అది.
 
ఒకప్పుడు తాను జయంతి పత్రికకు చందాలు కట్టించుకోవడం కోసం తిరుగుతూ,పార్వతీపురంలో ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మగారిని కలిసిన సంఘటన మరొకటి. తనకన్నా ముప్పై ఏళ్ళు పెద్దవాడు, తొలి తెలుగు కథారచయితగా సాహిత్యలోకంలో చిరపరిచితుడూ అయిన సాంఖ్యాయన శర్మగారు విశ్వనాథను గుమ్మందాకా సాగనంపుతూ, తన బల్లమీద ఎప్పుడూ రెండు పుస్తకాలుంటాయనీ, తనకి దిగులు, నిరాశ, నిర్వేదం కమ్మినప్పుడు ఆ పుస్తకాల్ని ఆశ్రయిస్తాననీ, అవి ఒకటి భగవద్గీత, మరొకటి ఆంధ్రప్రశస్తి అనీ చెప్పారట!
 
ఆ ఇంటర్వ్యూలో విశ్వనాథ తాను చదివిన యూరపియన్, అమెరికన్ సాహిత్యాల గురించీ, ఆ రచయితల గురించీ కూడా మాట్లాడేరు. తాను షేక్స్పియర్ నాటకాలు మొత్తం చదివానని చెప్పడమే కాకుండా తన నర్తనశాల నాటకం షేక్ స్పియర్ పంథాలో రాసాననీ చెప్పుకున్నారు. ఆయన చదివిన సాహిత్య విస్తృతి మనకి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన టాల్ స్టాయి ని చదవడమే కాదు, టాల్ స్టాయి షేక్ స్పియర్ నాటకశిల్పాన్ని విమర్శించాడనీ, షా కూడా షేక్ స్పియర్ ని విమర్శించినా టాల్ స్టాయి అంత తీవ్రంగా కాదని కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం మనం చూడవచ్చు.
 
విశ్వనాథ అభిప్రాయాలని మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కాని ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకూ ఆయన టి.ఎస్.ఇలియట్ వంటి కవి, విమర్శకుడు అని మర్చిపోకూడదు.
 
~
 
ప్రసంగం వినాలనుకుంటే:
 
11-9-2021

Leave a Reply

%d bloggers like this: