అన్నిటికన్నా ముందు విద్యావేత్త

గురజాడ అప్పారావు గారు పుట్టి నూటయాభైతొమ్మిదవ సంవత్సరం. కాని ఆయన గురించి బయటి రాష్ట్రాల వారికి, బయటి దేశాల వారికి ఎంత మాత్రం తెలియపరచగలిగాం? రవీంద్రుడు, సుబ్రహ్మణ్య భారతి, ప్రేం చంద్ ల గురించి ప్రపంచానికి ఎంతో కొంత తెలుసు. కాని గురజాడ గురించి చైనాలోనో, నైజీరియాలోనో, స్వీడన్ లోనో ఎవరికైనా తెలుసా? నాకు పుష్కిన్ గురించి తెలిసినట్టు రష్యన్లకు గురజాడ గురించి తెలుసా? తెలిస్తే ఎలా తెలుసు? ఆయన గురించిన వారి అవగాహన ఏమిటి? నాకు తెలియదు.
 
అసలు భారతదేశంలోనే గురజాడ కృషి గురించిన అంచనా ఏదైనా ఉందా? డా.యు.ఏ.నరసింహ మూర్తి గారు కన్యాశుల్కం మీద వెలురించిన సమగ్రమైన ప్రామాణిక తులనాత్మక పరిశీలన హిందీలోకి అనువాదమైంది. కాని ఆ పుస్తకం మీద హిందీ సాహిత్య రంగం ఏ విధంగా ప్రతిస్పందించిందో నాకైతే తెలియదు. కన్యాశుల్కంలోని భాష, వస్తువు ల్లోని అత్యంత స్థానికత వల్ల ఆ నాటకాన్ని మరో భాషలోకి అనువదించినప్పుడు ఆయా భాషా పాఠకులు దాన్ని ఏ మాత్రం అర్థం చేసుకోగలరో నేను ఊహించలేను. ఉదాహరణకి ద్వితీయాంకంలో ఈ సన్నివేశం చూడండి:
 
 
గిరీ: వాట్, ఈమె నీ సిస్టరా? తలచెడ్డట్టు కనబడుతున్నదే!
వెంక: మా అక్కే, జుత్తుకి చవుర్రాసుకోదు.
 
 
ఈ రెండు చిన్న వాక్యాల మధ్య గొప్ప నాటకం ఉంది. అదంతా ‘తలచెడ్డట్టు’ అనే తెలుగు జాతీయం మీద ఆధారపడి ఉంది. గిరీశం దృష్టిలో తలచెడ్డట్టు కనబడటమంటే భర్తని కోల్పోవడం. కాని వెంకటేశం దృష్టిలో తలచెడ్డట్టు ఉండటమంటే జుత్తుకి చమురు రాసుకోకపోవడం. గిరీశానికి ఆ పల్లెటూళ్ళో అడుగుపెట్టగానే తన శిష్యుడి ఇంట్లోనే ఒక విధవరాలు కనిపించడంలో అతడిలో ఎన్నో రహస్య ఉద్రేకాలు ఒక్కసారిగా మేల్కొన్నాయన్న విషయం మనకి ఆ వాక్యం మొదట్లోని ‘వాట్’ అన్న మాటలో వినిపిస్తున్నాయి.
 
‘తలచెడ్డట్టు కనబడుతున్నదే’ అన్న వాక్యం చివర ఆశ్చర్యార్థకం ఆమె దుఃస్థితి పట్ల జాలిని కాక, దాచుకుందామని కూడా అనుకోని ఒక చెప్పలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది. ఆ ఒక్క మాటలో గిరీశం పాత్ర మొత్తం సంపూర్ణంగా మన కళ్ళ ముందు ఆవిష్కారమవుతున్నది. కాని అతడి ప్రశ్నకు    (నిజానికి అది ప్రశ్న కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే గిరీశం తనలో తాను చెప్పుకుంటున్న మాట పైకి చెప్తున్నట్టే) వెంకటేశం ఇచ్చిన జవాబులో అతడి పసితనం మొత్తం పరిపూర్ణంగా ద్యోతకమవుతున్నది.
 
ఒక విధంగా చూస్తే కన్యాశుల్కం నాటకంలో ఇంతకన్నా దయనీయమైన వాక్యం మరొకటి కనబడదు. తలుచుకున్నప్పుడల్లా గుండెల్ని పిండేసే వాక్యం ఇది. బహుశా ఈ రెండు వాక్యాలకు సాటి రాగల మరొక రెండు వాక్యాలు మహాప్రస్థానంలో మాత్రమే కనిపిస్తాయి:
 
గతమంతా తడిసె రక్తమున
కాకుంటె కన్నీళులతో.
 
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గురజాడని తక్కిన ప్రపంచానికి పరిచయం చేయడానికి మనం ఆయన రచనలు అనువదిస్తే చాలదు, వాటిని తక్కిన ప్రపంచం అర్థం చేసుకోవడానికి అవసరమైన సాధనసంపత్తిని కూడా మనం ఒక డిస్కోర్సు రూపంలో ప్రపంచ సాహిత్యలోకంలో ప్రవేశపెట్టాలి. ఇంటర్నెట్ లో కిర్క్ గార్డ్ కారిడార్ వున్నట్లే గురజాడ వరండా కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఎక్కడెక్కడి పాఠకులూ చేరి కొంతసేపు తమకి తోచిన నాలుగు మాటలు మాట్లాడిపోతూ ఉండాలి.
 
ఇప్పుడు సాహిత్య అకాడెమీ వారు గురజాడ రచనలనుంచి ఎంపిక చేసిన కొన్ని రచనల ఇంగ్లిషు అనువాదాల్ని సంకలనం చేయమని మృణాళినిగారిని అడిగారు. ఆ సంకలనం దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఆ పుస్తకానికి నన్ను కూడా గురజాడ గురించి ఒక పరిచయ వ్యాసం రాయమని అడిగితే, నేను ఆలోచించింది ఇదే. గురజాడని పందొమ్మిదో శతాబ్దానికి చెందిన ఒక సంస్కర్తగానో, లేదా ఇరవయ్యవ శతాబ్దానికి చెందిన వాడుకభాషా ప్రవక్తగానో పరిచయం చేసి ఊరుకోవడమా లేక అంతకన్నా కూడా ఘనిష్టమైన బాధ్యతని ఆయన నిర్వహించాడనీ, ఆయన కృషిలో తక్కిన భారతీయ రచయితలు, రవీంద్రుడు, అరవిందుడు, భారతి మొదలైనవారంతా ఆయన కన్నా వెనకనే ఉన్నారనీ తెలియపరచడమా?
 
గురజాడ అన్నిటికన్నా ముందు ఒక విద్యావేత్త అనీ, తన జాతి జనులు ఆధునీకరణ చెందడానికి వారికి అన్నిటికన్నా ముందు కావలసింది ఆధునిక విద్య అనీ, అందుకు గాను ఆధునిక వచనాన్ని అందిస్తే తప్ప ప్రజలు ఆధునిక విద్యావంతులు కాలేరనీ గురజాడ భావించాడనడానికి ఆయన సాహిత్యం, లేఖలు, డైరీలు మొత్తం తార్కాణ. తన అసమ్మతి పత్రంలో ఆయనిలా అన్నాడు:
 
Is it worthwhile to have in Telugu a modern prose such as they have in English? The question is capable only of one answer and it is no longer left to our option to have it or not to have it. Social, political and literary ideals have changed. Literature is no longer confined to a cult, and mass education which is one of the greatest blessings of the British rule has necessitated the creation of modern prose in Telugu.
 
మృణాళిని గారి కోసం ఒక వ్యాసం రాయడమైతే రాసానుగానీ, గురజాడ గురించి నేను తెలుసుకోవలసింది చాలా ఉందని కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది నాకు.
 
21-9-2021

Leave a Reply

%d bloggers like this: