అత్తలూరి నరసింహారావు

‘ఆయన చాలా స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఉండే మనిషి. ముందే చెప్తున్నాను. కాబట్టి ఆయన నీతో ఎలా ఉన్నా ఏమీ అనుకోకు’ అన్నారు భమిడిపాటి జగన్నాథ రావు గారు.
 
అత్తలూరి నరసింహారావు గురించి.
 
ఆయన నాట్యసుధ అనే ఒక సంచిక ఏదో వెలువరిస్తున్నప్పుడు దానికి వ్యాసాలు రాసేవాళ్ళ పేర్లు సూచించమని అడిగినప్పుడు జగన్నాథ రావుగారు నా పేరూ, మా అక్క పేరూ చెప్పారు. వెంటనే అత్తలూరి నుంచి ఒక ఉత్తరం వ్యాసం కావాలని. 1985 లోనొ, 86 లోనో. గుర్తులేదు. 84 లో నేను విజయనగరంజిల్లాలో పాచిపెంటలో కళిగాంధ్ర సాహిత్యం గురించి ఒక ప్రసంగం చేసాను. ఆ ప్రసంగాన్నే ఒక వ్యాసంగా రాసి పంపించాను. నాతో ఆ ప్రసంగం చేయించింది గణపతిరాజు అచ్యుతరామరాజు గారు. అందుకని ఆ వ్యాసాన్ని ఆయనకు కానుకగా ఇస్తున్నట్టుగా రాసాను.
 
‘వ్యాసం బాగుంది కానీ, ఆ అంకితమే బావులేదు’ అన్నాడట అత్తలూరి జగన్నాథ రావు గారితో. కాబట్టి మేము అత్తలూరిని మొదటిసారి కలుసుకోబోతున్నప్పుడు, ఆయన ఏమైనా నిష్కర్షగా మాట్లాడితే ఏమీ అనుకోకు అని ముందే హెచ్చరించారు జగన్నాథ రావుగారు.
 
దాదాపు నలభయ్యేళ్ళు కావొస్తోంది. మేము విశాఖపట్టణంలో రైలు దిగినప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ కి వచ్చిన అత్తలూరి ని మొదటిసారి కలుసుకుని. కాని ఇన్నేళ్ళ పరిచయంలోనూ, స్నేహంలోనూ ఆయన నా మనసుని నొప్పించే మాట ఒక్కటి కూడా ఆడకపోగా తనకన్నా వయసులో చిన్నవాణ్ణి అయినప్పటికీ, ఎంతో గౌరవంగా, హుందాగా, స్నేహంగా ప్రవర్తిస్తూనే వచ్చాడు.
 
85 నుంచి 95 దాకా అత్తలూరివారితో సన్నిహితంగా మెలిగే చాలా అవకాశాలు లభించాయి. ఒకటి రెండు రోజులు వారింట్లో అతిథిగా కూడా ఉన్నాను. నేను పార్వతీపురంలో పనిచేస్తున్నప్పుడు ఆ పరిచయం స్నేహంగా కూడా బలపడింది. ఆ రోజుల్లోనే నాతో ఆంధ్రా యూనివెర్సిటీలో ఒక సాహిత్య ప్రసంగం ఏర్పాటు చేసారు. ఎన్నడూ యూనివెర్సిటీలో చదువుకోలేకపోయిన నాకు అలా యూనివెర్సిటీ హాల్లో ఆ విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించడం ఎంతో గొప్పగా అనిపించింది. అలానే శిఖామణి ‘మువ్వలచేతికర్ర’ ఆవిష్కరణ సభలో ప్రసంగించే అవకాశం కూడా. నేనెప్పటికీ మర్చిపోలేనివి.
 
ఆ రోజుల్లో అత్తలూరికీ, అజంతాకీ, అత్తలూరికీ, త్రిపురకీ మధ్య ఉన్న స్నేహం లెజెండరీ. నిజానికి అది స్నేహం కూడా కాదు. తానెంతో ఇష్టపడే ఆ ఇద్దరు రచయితలకీ ఆయన చేసింది సపర్య, శుశ్రూష. అజంతా అంటే అత్తలూరికి ఎంత ఇష్టమంటే, తన కూతురికి అజంతా అని పేరుపెట్టుకునేటంత. త్రిపుర గారి కథల్ని సంకలనం చేసి మొదటి కథాసంపుటం వెలువరించింది కూడా అత్తలూరినే. త్రిపుర పట్ల ఎంత ఇష్టం ఉండేదంటే, ఎప్పుడన్నా త్రిపుర తనని తెలిసీ తెలియకుండా మాటలతోనో, ప్రవర్తనతోనో గాయపరుస్తున్నా కూడా పట్టించుకునే వాడు కాడు.
 
ఆ స్నేహం గాఢాతిగాఢంగా ఉన్నరోజుల్లో ఆయనా, త్రిపురా ఒక సారి పార్వతీపురం వచ్చారు. నేనక్కడ జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా పనిచేసేవాణ్ణి. వాళ్ళని కలుసుకోడానికి భూషణంగారు వచ్చారు. సవర గూడలు, సవర జీవితాలు చూడాలని త్రిపుర అడిగితే ఆ రోజు గుమ్మలక్ష్మీపురం, ధర్మలక్ష్మీపురం, నీలకంఠాపురం దాకాతీసుకువెళ్ళాను.  మధ్యలో సవరకోటపాడులో ఉండే హార్టికల్చర్ ఫారం కి కూడా తీసుకువెళ్ళాను. అక్కడ అత్తలూరికి ఒక జామమొక్క బహూకరించాను. ఆ విషయమే మర్చిపోయానుగాని, నాలుగైదేళ్ళ తరువాత అత్తలూరిని కలవడానికి విశాఖపట్టణం వెళ్ళినప్పుడు వాళ్ళింట్లో ఏపుగా పెరిగిన ఒక జామచెట్టుని చూపిస్తూ, ఇది మీరు ఇచ్చిన కానుక అన్నాడాయన నాతో. మనుషులకే కాదు, వాళ్ళతో తన అనుభవాల జ్ఞాపికలకు కూడా అత్తలూరి ఇచ్చే గౌరవం అది!
 
నేను పార్వతీపురంలో ఉండగానే ఒకసారి పద్మినిగారి వీణకచేరి ఏర్పాటు చేసాను. పార్వతీపురం సంగీతప్రధానమైన కేంద్రం కాదుగాని, ఆ రోజు ఆ సభకి జనం చాలా బాగా వచ్చారు. అప్పుడు అక్కడ మాకు ప్రాజెక్టు ఆఫీసరుగా పనిచేసిన ఎల్.వి.సుబ్రహ్మణ్యంగారినీ, వారి శ్రీమతినీ ముఖ్య అతిథులుగా ఆహ్వానించేం. పద్మినిగారు ఎంతో సున్నితమనస్కురాలు. ఒక పువ్వు రేకల్ని తాకుతున్నంత మృదువుగా ఆమె వీణావాదనం చేసినట్టుగా ఒక దృశ్యం ఇప్పటికీ నా మనసులో నిలిచిపోయింది.
 
ఆ తర్వాత మళ్ళా కొన్నేళ్ళకు నాకు పాడేరు బదిలీ అయినప్పుడు, ఆ బదిలీలో నన్నూరించిన ఒకటి రెండు అంశాల్లో అత్తలూరి, త్రిపురలకు దగ్గరగా ఉంటానన్న ఊహ. కాని ఈ సారి ఎందుకనో అత్తలూరితో మళ్ళా అంత సన్నిహితంగా గడిపే అవకాశాలేమంత దొరకలేదు. అందుకు ప్రధానమైన కారణం పాడేరులో నా పని ఒత్తిడి అనే అనుకుంటున్నాను.
 
కాని ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, పద్మినిగారు బాలసాహిత్యం గురించి మాట్లాడుతూ, ‘పేపరు పాపాయి’ అనే పుస్తకం ఇచ్చారు నాకు. ఆ పుస్తకం తనకి ప్రాణసమానం అని చెప్తూ చదవగానే తిరిగి ఇచ్చెయ్యమన్నారు. కాని నేను ఆ పుస్తకం తిరిగి ఇవ్వకుండానే పాడేరు నుంచి వచ్చేసాను. ఆ తర్వాత నా ఉద్యోగజీవితం దాదాపుగా హైదరాబాదులోనే గడిచినందువల్ల ఆ పుస్తకం చాలాకాలం పాటు నా దగ్గరే ఉండిపోయింది. కానీ ఇళ్ళు మారుతున్న ప్రతిసారీ, పుస్తకాలు సర్దుకునేటప్పుడు, ఆ పుస్తకాన్ని మాత్రం ఒక సజీవమైన హృదయాన్ని భద్రపరుచుకోవలసివచ్చినట్టుగా దాచేవాణ్ణి.
 
దాదాపు ఇరవయ్యేళ్ళ తరువాత, ఒక రోజు పద్మినిగారికి ఫోన్ చేసి వారి ఇంటి అడ్రస్ అడిగి ఆ పుస్తకం వాళ్ళకి కొరియర్ చేసాను, ఆ పుస్తకం చూసి పద్మినిగారు ఎంత సర్ప్రైజ్ అయిఉంటారా అని ఊహిస్తూ. నేనకున్నట్టే ఆమె వెంటనే ఫోన్ చేసారు. మామూలుగా ఎరువిచ్చిన పుస్తకాల విషయంలోలానే ఆ పుస్తకం కూడా ఎవరికో ఎరువిచ్చినట్టు గుర్తుందిగానీ, ఎవరికి ఎరువిచ్చానో గుర్తులేదనీ, ఇన్నాళ్ళకు ఆ పుస్తకం మళ్ళా తనని చేరినందుకు తనకెంతో సంతోషంగా ఉందనీ చెప్పారు. అప్పుడు సరదాగా ‘మరి తక్కిన పుస్తకాలు కూడా తొందరలో పంపించెయ్యండి ‘ అన్నారు.
 
ఆమె పుస్తకాలు మరేమీ నా దగ్గర లేవుగానీ, ఎప్పుడేనా మళ్ళా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు నా పుస్తకాలు వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకున్నానుగానీ, ఆమె ఈ లోకం నుంచే వెళ్ళిపోయారు.
 
కొన్నేళ్ళ కిందట ‘మోరీ తో మంగళవారాలు’ పుస్తకం గురించి ఎవరో చెప్తే సంపాదించి చదివాను. అత్తలూరి దంపతుల అనువాదం. ఒక ఉపనిషత్తులాగా అనిపించింది ఆ పుస్తకం. ఆ మాట ఆయన్ను కలిసి చెప్పాలనుకున్నాను. అలానే ‘నాకూ ఓ కల ఉంది’ పుస్తకం కూడా. ఆ పుస్తకం చదివాక ఆనంద్ వెళ్ళకుండా ఉండలేకపోయాను కూడా. కాని ఈ పుస్తకాల గురించి అత్తలూరితో ముచ్చటించడం కుదరనే లేదు.
 
సంస్కారవంతులు అని ఎవరి గురించైనా చెప్పాలనుకుంటే అందరికన్నా ముందు నాకు అత్తలూరి దంపతులు గుర్తొస్తారు. వాళ్ళు సాహిత్యాన్ని, సంగీతాన్ని, స్నేహాల్ని ప్రేమించారు. మనుషుల్ని ఇష్టపడ్డారు, గౌరవించారు. హృదయానికి దగ్గరగా హత్తుకున్నారు. అటువంటి ప్రేమాస్పదుల్ని జీవితంలో ఒక్కసారి కలుసుకున్నా కూడా వాళ్ళు ఎన్నటికీ మనతోనే ఉండిపోయినట్టుగా అనిపిస్తుంది.
 
16-9-2021

Leave a Reply

%d bloggers like this: