
మధ్యాహ్నం నాయుడిగారి బస్సులో దిగినప్పటినుండి చింతామణి డ్రామాట్రూపు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఒకచేత్తో పురమాయింపులు, మరోవంక ఆరోపణలు ఉన్నచోటే పెద్ద తీర్థమూ, సంతానూ, పిలిచిందేమో రామనవమి ఉత్సవాలకాయే. మొదటినాడే పిలుద్దామనుకున్నారు. మరీ చింతామణితో ఓం ప్రథమమేమిటని బాగోదంటే హరికథ పెట్టుకున్నారు.రెండోనాటికి ఎలాగూ హరిశ్చంద్ర ముందే సెటిలయ్యింది. ద్వారపూడి బృందం, హరిశ్చంద్రుడూ, నక్షత్రకుడూ పోటాపోటీ పడ్డారు. నాటకం అయ్యేటప్పటికి తొలిజాము కోడి కూసింది. జనానికి ఇంటికెళ్ళే ధ్యాస వుంటేనా? ఒకటే కన్నీరు, ఇంకా ఆ కాటికాపరి సీను కళ్ళముందు నుంచి తప్పుకోలా. ఇదిగో ఇవాళ వీళ్ళు తెరిపిన పడేస్తారని జనానికి ఆశ. కడుపారా నవ్వుకోవచ్చని.
అదిగో అతనే- ఆ ఎర్ర శాలువా, షరాయీ .. శ్రీహరి వేషం కడతాడు. దాని సిగతరగ. గొప్ప జమాయిస్తాడులే ఇదిగో ఆ లావుగావున్నాడే ఎత్తుపళ్ళూ, బట్టతలానూ ఆయనేమో సుబ్బిశెట్టి. స్కూలు మాస్టరీ చేస్తున్నాట్ట. పోయినా దఫా వచ్చాడు. విశ్వామిత్రుడు కాబోలు వేశాడు. రాగం బాగా గుక్కపట్టాడులే. కురుక్షేత్రంలో రాజరాజు వేస్తాడుట. ఆ బక్కపలచని గుంటేమో చిత్ర. ఒచ్చినప్పటినుంచీ ముంగిలాగ వూతి మెదపదు, బస్సు దిగీదిగగానే రోడ్డుమీదే ట్రంకు పెట్టి మీద బైఠాయించింది దిక్కులు చూస్తూ. అవును, ఇంతకీ చింతామణి ఏదీ!
రామనవమి ఉత్సవాలు ముందటేడు కన్నా ఘనంగా చెయ్యాలని అందరికీ వుంది గానీ, సారాకొట్టు రమణగారు దన్ను నిలిచేదాకా ఎవడూ ముందుకు రాలేదు. రమణగారు కుర్రాడు. జమాజెట్టిలాంటి విగ్రహం. ఈ మధ్య రెండు లారీలు కొన్నాడు, ఇదేమీ కాదు, పైడితల్లిని వుంచుకున్నప్పటి నుంచీ కొత్త రోషమూ, పౌరుషమూ వచ్చాయంటారు కిట్టనివాళ్ళు. ఎంత కిట్టకపోతే, వున్నమాట అంత బాగా అంటారు! రమణగారు, మున్సిబుగారు, కరణంగారూ వూరంతా ఫర్మానా జారీ చేశారు- పండగ అయ్యేదాకా దేవుడి కోసం ఏమడిగినా ఎవరూ కాదనకూడదని. ఈ నాటకాల వాళ్ళూ కథలు చెప్పేవాళ్ళూ బయటనుంచి వస్తారు.వుండేది ఒక్క పూట, ఆ ఒక్కపూటా ఏమరిచి లోటు చేశామా ‘మన వూరి లాంటిది’ ‘మనం ఇలాగ’ అని తక్కిన దేశమంతా టాంటాం చేస్తారు. అందుకని మరింత జాగర్తగా వుండాలి అని.
ఊరిమధ్య రామకోవిలే స్టేజీ విడిదీ అన్నీను. రామకోవిల ఎదురుగుండా బల్లలు పరిచి టెంపరరీ స్టేజి ఏర్పాటు చేశారు. లోపల కటకటాల్లో ఓ మూల మైకులవాడూ, వాడి గ్రామఫోను పెట్టీ. ఇంకో మూలకి దుకాణం అంతా సరిచేసి డ్రామా జట్టు. సర్పంచిగారు రావడం చూస్తూనే మైకుల వాడు ఒద్దిగ్గా లేచి నిలబడ్డాడు.‘ఆ, ఏమబ్బాయ్, టిఫినీ అది చేశారా….’ ఆయన మాటకి జవాబిస్తుండగానే, పక్కన వూచల్లోంచి సందుచేసుకుని పిల్లలు గ్రామఫోను పెట్టె తడుముతున్నారు. మైకుల వాడు సర్పంచి గార్ని ఇబ్బందిగా చూస్తూనే, ఒక చేత్తో పక్క నుంచి వాళ్ళని తోసేస్తున్నాడు. అరకంట ఆ సీను చూస్తో మెత్తగా బీడీ దమ్ము లాగుతున్నాడు.
శ్రీహరి వేషం కట్టే అబ్బులుబాబు లగేజి సరుకు వచ్చిందో లేదో లెక్క చూస్తుండగా సర్పంచిగారు దగ్గరగా వచ్చి ‘‘కాఫీలూ, టీలూ గట్రా అందాయా’ అన్నాడు. అబ్బులుబాబు బుజంమీది శాలువా సరిచేసుకుంటూ, మొహం నిండా చల్లని నవ్వు పరుచుకొని ‘మహప్రభువులు, తమరే దయచేశారు. అదే పదివేలు’ అని సుబ్బిశెట్టి మాస్టార్ని కదిపి ‘మాస్టరుగారూ, వీరికీ మాకు ఎన్నేళ్ళ బాంధవ్యమండీ, వారు పెట్టేవారు, మనం తినేవాళ్ళం, బహుయోగ్యులైన మనుషులు, ధర్మదాతలు, ఈ దేశం ఎవరు ఒచ్చి వెళ్ళినా వారి పేరు చెప్పుకోకుండా వుండరు.’
‘అయ్యో, నాకు ఎరికే కదా ముందటేడు….’ మాస్టారు అందుకున్నాడు. ఆయన మాట పూర్తి కాకుండానే అబ్బులుబాబు ‘అయ్యా, తమ దయవల్ల మాకు ఏ లోటూ లేదు, అన్నీ మహదివ్యంగా అమర్చి వున్నాం, కాని చూశారూ, కాస్త …’ సర్పంచి గారు నల్లకోటేశుని ముందుకు తోసి ‘ఒరే, ఆయన చెపేవన్నీ విని ఏం కావాలో దగ్గరుండి చూడు’ అంటూ రెండడుగులు వేసి గంభీర ముద్ర పట్టి, ఒక్క క్షణం తటపటాయించి చిన్నినవ్వు పులుముకుని‘ఇంతకీ, హీరోయినేదండీ, అదే, మన చింతావణి’ అన్నాడు.
అబ్బులుబాబు విధేయంగా మొహం పెట్టి ‘లెక్కకి మాతో పాటు వచ్చెయ్యాలి. కాని ఏదో పనుండి, జరూరుపనిలెండి, ఎనకాలే వస్తానంది. ఈ పాటికి సగం దారిలో వుండాల’ అని ‘ఇంతకీ, రాగానే అయ్యగారి దర్శనం చేసుకొమ్మని చెప్పనా?’ అన్నాడు.
‘అబ్బే, అబ్బే కనబడకపోతేనూ, అంతే, మరేం లేదు..’
సర్పంచిగారు పెద్దపెద్ద అంగల్తో వెళ్ళిపోయాడు.
సాయంకాలం అయింది. ఊరంతా నెమ్మదిగా కోవిల ముంగిట్లోకి చేరుతోంది. ఎలక్ట్రీ దీపాల్తో పందిరంతా మెరిసిపోతోంది. చిన్నచిన్న బల్బులు సిరీలు సెట్లు రంగురంగుల్లో నాలుగువేపులా పెట్టారు. ఎదురుగుండా రోడ్డు వేపు పందిరిమీద అంజనేయులు, వినాయకుడు, లక్షిందేవి బొమ్మలు పెట్టారు.లక్షిందేవి చేతుల్లోంచి రంగురంగుల కాసులు కిందికి ఒలికిపోతున్నట్లు దీపాలు. నాలుగేసి స్తంభాలకు ఒకటి చొప్పున ట్యూబులైట్లు. రోడ్డుకి అటూ ఇటూ జంతికలూ, వేరుశెనిగలూ అమ్మేవాళ్ళు, బడ్డీ టీ కొట్టూను. రెండు చింత చెట్ల కిందా పులి జూదంగాళ్ళు పటాలు పరిచేశారు. కిళ్ళీకొట్లూ, అరవసాయిబు కొట్టూ జనాల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. మైకువాడు ఇప్పటిదాకా రెస్టు తీసుకుని ఫ్రెష్‌గా ‘నమో వెంకటేశా’ వేశాడు. ఇంకా ఒక రెండు దేవుడి పాటలు వేస్తేనే గాని సినిమా పాటలకి రాడు. చిల్లరకొట్టు చిట్టెమ్మ పాటలు వెయ్యమని కుర్రాళ్ళ గోల. బయటి స్టేజి మీద అబ్బులుబాబు తెరలు కట్టుకుంటుంటే కుర్రాళ్ళు పక్క నుంచి లాగేస్తున్నారు. ఎదురుగుండా హార్మోనిస్టు సంగీత బృందానికి చోటు చేసుకుంటున్నాడు.
‘మీ దగ్గర ఫోకస్ లైట్లుంటాయా?’ నల్ల కోటేశు.
‘ఎక్కడ చూసావేంటి ఆ లైట్లు?’ అబ్బులుబాబు నవ్వుతూ అడిగేడు.
‘మరేనండీ. మావూరోళ్ళు పూలరంగడు ఆడతారట కదా. ఆ రోజుకి ఏర్పాటుచేస్తారంట. ఆ లైట్లుంటే గొప్పగా వుంటుందట కదా, ఏడుపు సీన్లో ఎర్ర రంగొస్తదట. మరేమో ..’
‘అదా, మా దగ్గర వున్నాయిలే, ఇవాళ చూద్దువుగాని’ అంటుంటే బుచ్చిరాజు వచ్చి భోజనాలకు రమ్మని కబురు చేశాడు. అబ్బులుబాబు తెరలు కట్టేపని నల్లకోటేశుని చూడమని హార్మోనిస్టుని పిలిచి లోపలకు వెళ్ళేసరికి సుబ్బిశెట్టి మాస్టారు రాగాలు దట్టించేస్తున్నాడు. బిల్వమంగళుడి వేషం ఆనవాయితీ ప్రకారం హార్మోనిస్టే వేస్తున్నాడు. చింతామణికి సొంత హార్మోనిస్టు ఆయన. తనూ వుండి చింతామణితో కలిసి వస్తానంటే అబ్బులుబాబు హడావిడి పెట్టి లాక్కొచ్చేశాడు.
బిల్వ మంగళుడి సతీమణి రాధవేషం ఈసారి మొగాయనే వెయ్యాలనుకున్నారు. ఆ సదరు శాల్తీ నల్లతుమ్మ మొద్దులాంటి ఒళ్ళు బద్ధకంగా విరుచుకుని ‘మాస్టారూ, నన్నడిగితే మీరు రాధ వేషమూ, నేను సుబ్బిశెట్టి వెయ్యాలండీ’ అన్నాడు బొంగురుగా నవ్వుతూ.
‘బాబ్బాబూ! ఈ సారికి ఇలా కానీ, అయినా నా ఎత్తు పళ్ళు చూడలేదూ. అయినా ఈసారి సుబ్బిశెట్టి నాకు ఛాలెంజి, ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాననీ, వెరయిటీ వుండాలండీ, వెరయిటీ, కారెక్టరు ఆక్టరన్నమాట. చూడండి’ అని ‘చిత్రా’ అంటూ బొంగురుగా పిలిచాడు. ‘మీ అమ్మ నన్ను గేటుకాడ నిలబెడుతుందటే’ అంటో ఒక డైలాగు వల్లించి ‘ఎన్నో యేండ్లు గతించిపోయినవి కానీ’ అంటో ఎత్తుకున్నాడు.
భవానీ శంకరుడు ఇంతసేపూ కునుకు తీస్తున్నవాడు ఉలిక్కిపడి లేచి ‘హార్ని తస్సాదియ్యా, చంపావు కదయ్యా అయినా అరుశ్చంద్రుడి పద్యాలు కదయ్యా అవీ’ అన్నాడు.
‘పోనీ భవానీ శంకరుడి పద్యాలే అనుకుందాం. ఏదీ, అత్తవారిచ్చిన అంటుమామిడితోట’ అని
రెండున్నరలోవాయిస్తుంటే ‘ఏమి హడావిడి మాష్టారూ మీది, మరీ చిన్న పిల్లాడిలాగ, లేవండి, లేవండి, భోజనాలకు కబురొచ్చింది’ అన్నాడు అబ్బులుబాబు.
‘ఇంతకీ కోణ్ణి కోసారా?’ భవానీ శంకరుడు తాపీగా అడిగాడు.
‘కొక్కొరోకో’ అన్నాడు మాస్టారు.
‘బాపనాడివి కదయ్యా’ అని ఎవరో అంటుంటే, ‘కనుకనే, పదండయ్యా’ అంటో కసిరాడు హార్మోనిస్టు.
రాజు వెడలె రవి తేజములలరగ అన్నట్టు డ్రామా ట్రూపు రాత్రి భోజనాలకి మార్చింగు చేస్తుంటే వెనుక నుంచి చిత్ర పీలగొంతుతో ‘బాబయ్యా! ఇంతకీ అక్కేదీ’ అంది.
‘మీ అక్క ఆస్పటల్లో వుంది’ అన్నాడు మాష్టారు బొంగురుగొంతుతో.
‘మీరూరుకోండి. పీకలమీద సరసమాడతారు’ సన్న గొంతుతో కసిరి మళ్ళీ కాస్త గట్టిగా అంది.
‘ఇంతకీ బయలుదేరిందా లేదా?’
ఎవరూ మాట్లాడలేదు. ఎవరికి వారికి మధ్యాహ్నం నుంచి ఎదురుచూడడంగానే వుంది. ఎవరికీ ఆ వక్క పైకి అనుకోవాలని లేదు. లోపల బెరుగ్గా వుంది. పైకి బెట్టుగా వున్నారు.
‘అదే వస్తుంది’ నిర్లక్ష్యంగా మొహం పెట్టి ఆ పైని పక్కకు తిరిగి అబ్బులుబాబు ‘అయ్యా బుచ్చిరాజు గారా, బుచ్చిబాబుగారా? మనూరు లాస్టు బస్సు ఎన్నింటికండి’ అన్నాడు.
‘ఏవేపుది? అప్పా? డౌనా? డౌనయితే ఇంకో అరగంటకి, అప్పుబస్సు ఈ పాటికి వచ్చెయ్యాల’
కమ్మరి పేట కోళ్ళు మహ రుచిగా వున్నాయి.
మున్సబుగారు భోజనాల దగ్గర ప్రత్యేకించి మరీ శ్రద్ధ చూపించాడు. సర్పంచి గారి మనుషులు అందర్నీ పేరుపేరునా అడిగి మరీ తినిపించారు మాష్టారు తన చిన్నప్పుడు మాంసం తింటూ వాళ్ళ నాన్నకి దొరికిపోయిన సంగతి చెప్తున్నాడు.
‘అబ్బులూబాబూ, ఇంతకీ మన పిల్ల ఎక్కడా?’ మున్సిబు పొగాకు చుట్టుకొంటూ తీరిగ్గా అడిగేడు. ‘అదే మన చింతామణి’.
‘అదా, ఒచ్చేస్తుంది బాబూ ఈ పాటికి సగం దూరంలో వుండాలి’
‘ఈ మధ్య బాగా ప్రోగ్రాములున్నాయేంటి?’
‘ఆవును బాబూ సీజను కదా! ఇదయ్యాక తూర్పుకి పోవాలి. టైము ఎడ్జస్టు చెయ్యలేక కొన్ని పోగ్రాములు ఒదిలేసుకుంటున్నాం. మరి ఈ ప్రోగ్రామంటే మహాప్రభువులు, మీ ఉప్పుతిన్నవాళ్ళం గనుక హాజరయ్యేం’
‘చింతామణికేటి? ఒంట్లో నలతా’ మున్సిబు ఒదిలేట్టులేడు.
‘అమ్మ! నంజికొడుకు. కోణ్ణి తిననివ్వడంలేదు’ హార్మోనిస్టు అబ్బులుబాబు చెవిలో గొణిగేడు.
‘అబ్బే, అలాంటిదేమీ కాదండీ, ఇదిగో మా ఆరమణిస్టు చెప్తున్నాడు కదా, ఒక కోర్టుకేసుంటేనూ, ప్లీడరుగార్ని కలవాలనందట’ అబ్బులుబాబు మొహమాటంగా అన్నాడు.
‘అదీ, అలా చెప్పు’ ప్లీడరు మాట వినగానే మున్సిబు చింతామణి గొడవ ఒదిలేశాడు. ‘ఇదిగో బుచ్చిరాజూ, ఆ అరటితోట తగాయిదా..’
రాత్రి తొమ్మిదయింది. స్టేజి మీద కరణం గారి అబ్బాయి మైకులో ‘ప్రేక్షక మహాశయులారా, ఈ రోజు రాత్రి పదిగంటలకి శ్రీఅన్నపూర్ణ నాట్యమండలి వారిచే మహత్తర నాటక ప్రదర్శన, చింతామణి, భారీ సెట్టింగులతో అపూర్వ అభినయకౌశలంతో నేడే మీ ముందు ప్రదర్శింపబడుచున్నది. త్వరపడండి. చింతామణి.. గొప్ప హాస్యరస నాటకం చింతామణి.’
చింతామణి అటునుంచి ఒచ్చేబస్సులోనూ రాలేదు, ఇటునుంచి పొయ్యే బస్సులోనూ రాలేదు. లోపల డ్రామా జట్టు మేకప్ సామాగ్రీ, దుస్తులూ పరచుకుని రంగులు పులుముకోవడం మొదలుపెట్టారు. చిత్ర ట్రంకు పెట్టెలోంచి అద్దం, తిలకం, రిబ్బన్లూ, పిన్నీసులూ,పెద్ద అలంకరణ సామాగ్రి అంతా పరచుకుని ఆలోచిస్తుంటే అబ్బులుబాబు కసిరాడు.
‘ఏమిటా పరధ్యానం రంగు వేసుకో, అదొచ్చేస్తది. నీ వేషం నువ్వు కట్టెయ్యాల’ అని పురమాయించేసాడు.
‘ఇదిగో గురువుగారూ నేను చూడండి’ అంటూ అరిచాడు మాష్టారు. మేకప్‌మేన్ అతని ముఖానికి నల్లరంగు దట్టంగా పులిమి తెల్లరంగుతో నామం దిద్దుతున్నాడు. ఆయన ఉత్సాహమనాలో అల్లరనాలో అబ్బులుబాబుని క్షణం పాటు కట్టిపడేసింది.
‘ఇదిగో అమ్మాయ్, చూడు మేష్టార్లా ఉండాలి. నా వయసులో నాకిలాంటి వాళ్ళు దొరికుంటేనా! షణ్ముఖి అంజనేయరాజు, పీసపాటి నరసింహమూర్తి పత్తాలేకుండా పోదురు’ అన్నాడు.
‘ఉండవయ్యా, మేష్టరుని మహా పొగుడుతున్నావు. నాసంగతి చూడు’ అన్నాడు భవానీ శంకరుడు. అంతా గొల్లున నవ్వారు. ‘సర్లే, నీదీ ఓ మేకప్పేనేంటీ?’అన్నాడు మాష్టారు ఎకసెక్కంగా.
జిగురు రాసి ముంగురులు ఒంకీలు తిప్పి అంటించుకుంటుంటే కటకటాల కంతల్లో ముఖాలు పెట్టి కుర్రాళ్ళు ఆసక్తిగా చిత్రనే చూస్తుండిపోయారు. తన కళ్ళకి మందంగా కాటుక పెట్టుకుని సన్నని రంగు రంగులలో చుక్కలు దిద్దుకుంది. పెదాలకి ఎర్రరంగు పూసుకుంది.
‘అయ్యా శంకరంగారూ, ఇదిగో ఈ వెనకాల కాస్త సరిచెయ్యండి’ అంటో పిలుస్తుంటే ‘నీకు ఎనకాల ఏటయింది సిత్రా’ అన్నాడు మాష్టారు బొంగురుగా.
మళ్ళీ గొల్లున నవ్వు.
ఇంతలో మళ్ళీ లోపలకి వచ్చాడు అబ్బులుబాబు. ఈసారి అతని ముఖం కులాసాగా లేదు.
బరువుగావుంది.‘ఆరమణిస్టేడీ?’ అన్నాడు. ‘బయటే వున్నాడు కదా’ ఎవరో అన్నారు. ‘ఇంతకీ చింతామణి రాలేదా?’ భవానీ శంకరుడు తాపీగా అడిగాడు. ‘ఏడ్చినట్లే వుంది. అదే వుంటే ఇదంతా ఎందుకు? ఇవేళ అభాసుపాలంపోతాం. ఇన్నేళ్ళు నాటకా లాడేను, ఇదిగో ఇన్నిసార్లు. జుట్టు చేతుల్లోకి పీక్కుంటూ, ఇన్నాడేను, ఎన్నడూ ఎరుగనిలాగ, దానికేం పొయ్యేకాలమని’ అన్నాడు.
‘ఇంతకీ ఇక రాదంటారా?’ మళ్ళీ శంకరంగారు తాపీగా.
‘రాదయ్యారాదు. ఇదిగో ఇంకో మాట, మనం ఇకణ్ణుంచి పొద్దున్నకి కదల్లేం. ఊళ్ళోవాళ్ళు మన కాళ్ళు విరగ్గొట్టి మరీ పడేస్తారు. కిరాయికి ఒప్పుకున్నాక ఆడాలా వద్దా? ఆడాలి. మరి చింతామణ్ణి లేకుండా ఎలా ఆడుతాం?’ అబ్బులుబాబు జుట్టు పీక్కున్నాడు. తుఫానులో నౌకలు చిక్కుకున్నప్పుడు ముసలి సరంగులు జుట్టుపీక్కున్నట్టు. ‘ఆడలేం, ఆడలేం అంటున్నాను.’
‘ఆ మాట వాళ్ళకి చెప్పేద్దాం’ మళ్ళీ శంకరుడు.
‘ఎవళ్ళకి?’ కోలగా నవ్వేడు. ‘ఏడిసినట్టే వుంది. ఆళ్ళకా? ఆళ్ళకి చెప్తాడుటండీ ఈయన’ తక్కిన వాళ్ళవేపు తిరిగి ‘అయ్యా, చింతామణి రాని కారణం చేత ఇవేళ మేము నాటకం కట్టబోవటం లేదు. ఏమీ అనుకోకండి’ అని చెప్తావా? మక్కెలిరగదంతారు. పైగా ఈ బోడి జట్టుకి కోళ్ళు కావాల్సి వచ్చేయేం అని మరీను’.
‘కోడికూరా!అబ్బ మహా రమ్యంగా వుంది’ మాష్టారు ఈ లోకం లోకి వచ్చాడు.
అబ్బులు బాబు అతణ్ణి నిస్సహాయంగా చూసాడు, బయటకి పోబోతూ ‘ఏడీ హార్మోనిస్టు, ముందు ప్రార్థన చేసేద్దాం. పదYఈపోయింది. తర్వాత సంగతి తర్వాత’ అనేసి వెళ్ళిపోయాడు.
అతని నిబ్బరం అందర్నీ ఆశ్చర్యపెట్టింది. అంత నిబ్బరమంతుడు గనుకనే అన్నాళ్లు నాటకాలాడేడు అనుకున్నట్లున్నారు.
‘మా చెడ్డముండాకొడుకు’ అన్నాడు భవానీ శంకరుడు.
ఎవ్వరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్లు.
‘ప్రేక్షక మహాశయులారా. మీరు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చింతామణి మరి కొద్దిసేపట్లోనే ప్రదర్శంచబడుతుంది. శ్రీ అన్నపూర్ణ నాట్యమండలి వారి మహత్తర హాస్య రస ప్రదర్శన చింతామణి’.
‘ప్రార్ధనకి రండి, రండి’
‘హారతి ప్రేమిదేదీ’
‘ఒత్తీ, నూనే’
హడావిడిలో ఎవరో మంచినీళ్ళ చెంబుని తన్నేసారు. నీళ్ళు ఒలికి పోయేయి. మేకప్‌మేన్ తిట్టుకుంటూ సామాను ఓ మూలకి జరుపుతుంటే కోటిగాడు, సూరిసత్తిగాడు హడావిడిగా లోపలికొస్తూ ‘ఏమండీ, చింతామణి రాలేదా? మరి నాటకం ఎలా ఆడాలనుకుంటున్నారు?’ అంటో కేకలేసారు.
‘ఒరే నే ముందే చెప్పానురా మనాళ్ళకి. ఈ డ్రామాగాళ్ళంతా వేష్టని. రికార్డ్రీ డేన్సు పెట్టుకుందామంటే అన్నారా? ఇప్పుడు చూడు’ అన్నాడు కోటిగాడు.
‘పరబ్రహ్మ పరమేశ్వర..’
ఎర్రని పాతకాలపు సిల్కుతెర. దాని ఆకుపచ్చని అంచుల లోపల నటగాయక బృందం గొంతెత్తి ఆలాపన, ఆ సన్నని కాంతిలో మిలమిలల తెరలోంచి మెరిసే ఆరతిదీపం వెలుతురు. ఎదురుగా హార్మోనిస్టు శృతి, జనాన్ని మత్తెక్కించే నాటకాలమాజిక్కు, మంత్రజాలం, పైనుంచి కాంతులు చినికే చుక్కలు, దూరంగా పులిజూదం మీద చిల్లర లెక్క పెట్టుకుంటున్న చప్పుడు. బళ్ళ ఎద్దులు మెత్తగా నెమరు వేస్తున్న వేళ.
‘ఇంతకీ చింతామణి వచ్చిందంటావా?’ ఎవరో బిగ్గరగా అడిగారు.
‘రాలేదట, కోర్టు కేసట’ ఎవరో గొణిగేరు.
‘కోర్టుకేసా? ఏ లాడ్జిలో చిక్కిందంట?’
‘లాయరుగారి దగ్గర కెళ్ళిందట’
‘ఇంటికా?’
ముందు వరుసలో జనం గొల్లుమన్నారు. దూరంగా సాయిబు కొట్టు దగ్గర మూగిన కుర్రాళ్ళు ‘నాటకం లేకపోతే వూరుకొనేది లేదు’ అంటో అరిచారు. ఈ మూల కిళ్ళీ బడ్డీల నుంచీ అవే అరుపులు.
అబ్బులుబాబు తెర వెనుక నుంచి మైకులో ‘అయ్యా, ప్రభువులు చిత్తగించాలి. కొద్ది ఆలస్యం. చింతామణి వేషం వెయ్యల్సిన సదరు అమ్మాయి’ అంటూండగానే ప్రేక్షకులు గోల చేసారు. కుర్రాళ్లు మూదుకు కొచ్చి ‘నాటకం లేకపోతే పోనీండి, రికార్డింగ్ డాన్స్ కావాలి’ అంటో అరిచారు. లోపల డ్రామా ట్రూపు బిక్క చచ్చిపోయి వున్నారు.
‘పోనీ నువ్వు చింతామణి వెయ్యకూడదూ’ అబ్బులుబాబుకి ఆ మాట వినగానే అంత అయోమయం మధ్యా నవ్వొచ్చింది. గడిచిపోయిన కాలం గుర్తొచ్చింది. ‘ఆ రోజులయితేనా’ అనుకున్నాడు.
ఆలస్యం కూడదు, నిర్ణయం తీసుకోవాలి.
‘చిత్రా, అయిందెలాగూ అయింది. మాట దక్కించాలంటే ఆ రికార్డింగు డాన్సేదో చెయ్యక తప్పదు. నువ్వు కాస్త మేకప్పు గట్రా దిద్దుకో’ అన్నాడు. అతను చెప్తున్నదేమిటో అర్ధమయ్యేసరికి ఆ అమ్మాయికి ఒణుకు పుట్టింది. చెమటలు పోసేయి.
‘నేనా’
‘నువ్వే మరి. ఏం చేస్తాం’
హార్మోనిస్టు బిల్వ మంగళుడి వేషం తప్పిపోయిన ఆనందంలో వున్నాడు. భవానీ శంకరుడు తాపీగా కళ్ళు వూసుకుని ధ్యానం చేస్తున్నాడు. మాష్టారు అద్దంలోకి చూస్తూ డైలాగులు ఒప్పజెప్పుకుంటున్నాడు. ఆయన అవ్వాళ నాటకం వేస్తేనే గాని నిద్ర పోడల్లే వుంది. రాధ వేషం వెయ్యాల్సిన నల్లతుమ్మమొద్దు బయటికి పరిచిన సామానంతా పెట్టెలోకి ఎత్తుకొన్నాడు. చిత్ర అబ్బులు బాబుని చూసింది. అతని మొహంలో ఆదుర్దా. మాట పడాలన్న బాధ. తండ్రిలాగా ఆదుకున్న మనిషి.
‘కానీండి బాబయ్యా, స్టేజి ఎక్కుతాను. ఇంతకీ డాన్సరేడీ?’
‘ఎవళ్ళో ఒకళ్ళు. వూళ్ళో కుర్రాళ్లు’ అని అంటుండగానే సూరి సత్తిగాడు బెల్‌బాటమ్ పాంటూ, ఎర్రచేతుల టీషర్టూ తొడుక్కుని వచ్చేసాడు. ‘ఏదీ, కాస్త మేకప్ కొట్టండి’ అంటూ.
ఇంకా కోరమీసం రాని పదహారేళ్ళవాడు పిటపిటలాడే ఆటగత్తె పక్కని డాన్సు అనుభవానికి తహతహలాడుతున్నాడు.
‘తమ్ముడిలా వున్నాడు’
‘ప్రేక్షకమహాశయులారా. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహత్తర సినీ రికార్డింగ్ డాన్స్ మరి కొద్ది సేపట్లో ప్రదర్శింపబడుతుంది. సైలెంట్. అంతా నిశ్శబ్దంగా వుండాలి. గ్రామఫోన్ల అబ్బాయి ఎక్కడున్నా సరే స్టేజి దగ్గరికి రావాలి.ప్రేక్షక మహాశయులారా’
రాత్రి పదకొండు గంటలకి రికార్డింగ్ డాన్స్. ఒక దాని వెనుక ఒకటి లేటెస్టు రికార్డులన్నీ మోగించారు. ఒకడి వెనక ఒకడు కుర్రాళ్ళంతా స్టేజి ఎక్కారు. చిత్ర నడుమూ, బుజాలూ,అప్పుడప్పుడు పిరుదులూ కుర్రవాళ్ల చేతుల వేడికి, పొంగే రక్తపుపెళపెళకి అలిసిపొయ్యాయి. సూరి సత్తిగాడు డాన్సు బలేగా చేశాడు. వాడి డాన్సు చూస్తే చిత్రకే ముచ్చటేసింది. కుర్రముండ, మీద చేతులు వెయ్యడానికి వెహమాటపడ్డాడు.తనే అటూ ఇటూ తిరిగి కాస్త జోడు నిలబడింది. మధ్యలో ఒకటి రెండుసార్లు కావలించుకుంది. ఇంకా ఆడదేహపు ఆకలి అనుభవానికి రాని ఒళ్ళు, వెచ్చని వూర్పులు, సిగ్గరితనం, అరమోడ్పుగా వాలిపోయే కళ్ళు, అరవసాయబు మేనల్లుడిలా ఒళ్ళంతా ఆకలిగా తడిమెయ్యలేని ఆడపిల్లల మెత్తదనం.
డాన్సులు అయ్యేప్పటికి రాత్రి రెండు. నాలుగు గంటలపాటు డాన్సు చేసి ఒళ్ళు తీపులు పుట్టి చెమటలు పోసి పోసి అలసిపోయింది చిత్ర. కాళ్ళు దిగలాగుతున్నాయి.
లోపల డ్రామా ట్రూపు టీలు తెప్పించుకుని తాగుతున్నారు. వాళ్ళ కళ్ళలో భయం పోయింది. ‘చిత్రా మీ అక్క మన్ని మోసం చేసింది’ అంటున్నాడు మాష్టారు బొంగురు గొంతుతో.
‘మీరీ నాటికింక వేషం విప్పర్లే వుంది’ చిత్ర విసుక్కుంది.
మేష్టరుకి కోపం ముంచుకొచ్చింది. ‘నాలుగుగెంతులు గెంతేప్పటికి హద్దులు మర్చిపోతున్నావు’ అంటో లేచాడు.నోరు విప్పితే గుప్పున సారా కంపు. అతను నోటికొచ్చినట్టు పేలుతుంటే శంకరం తాపీగా వింటున్నాడు. హార్మోనిస్టు వాద్యం సర్దుకుంటున్నాడు.
చిత్రకి నిస్త్రాణ కలిగింది.ఇంతసేపూ తనుపడ్డ శ్రమ ఏమయినట్లు? ప్రేక్షక మహాశయులకి వాళ్ళ వినోదం వాళ్ళకి దొరికింది. అబ్బులుబాబుకి మర్యాద దక్కింది. సుబ్బిశెట్టి మోజు సుబ్బిశెట్టిది. మరి తనకి?
ఒక మూలగా నిల్చొని డ్రామాచీరె విప్పుకుంటుంటే లోపలికి హడావిడిగా వచ్చాడు సారాకొట్టురమణగారు. అతని కళ్ళు జీరెక్కి వున్నాయి. వస్తూనే ‘ఏమే పిల్లా’ అంటో దగ్గరగా వచ్చి ఒక చేత్తో తన జబ్బ నొక్కి ‘ఎక్కడ నేర్చుకున్నావే ఈ ఆటలన్నీను’ అన్నాడు. తనచీర కట్టు సగంలో వుండిపోయింది.సిగ్గుతో ఒళ్ళంతా చల్లబడింది. ‘ఏటీ చీర కట్టాలంటావా?’ పళ్లన్నీ బయటపెట్టి నవ్వాడు రమణగారు, ఈసారి ఎడంచేత్తో పిర్ర మీద గిల్లుతూ. ‘అయ్యా, తమ దయ, మా మర్యాద దక్కింది, అంతే చాలు’ అబ్బులుబాబు వెనకనుంచి వినయంగా చెప్తున్నాడు ‘సరే సరి,బాగా ట్రైనింగు ఇవ్వు పిల్లకి. ఇంకా పైకొస్తాది’ అంటూ కుడిచేతి చూపుడువేలితో ఆమె పొట్టమీద అడ్డంగా గీసి బయటకు వెళ్లిపోయాడు.
‘‘తొందరగా కానీ, ఎంత సేపు బట్టలు మార్చుకోవడం’ అబ్బులు బాబు కసిరేడు.
‘బాబయ్యా అక్క ఎందుకు రాలేదు?’ చిత్ర పీల గొంతుతో అంది.
‘ఏమి అపద వచ్చిపడ్డాదో?’
‘సరి సరి, దాని మాటెత్తకు నాదగ్గర’ కసిరాడు అబ్బులు బాబు.
అప్పుడు చూసింది చిత్ర. రామ కోవిలకీ రెడ్దిగారి బంగళాకి మధ్య సందులో ఏటవాలుగా పడుతున్న నీడచాటున నిల్చి కటకటాల్లోంచి చూస్తో సూరిసత్తిగాడు! ఒక్క క్షణం ఆసక్తిగానూ జాలిగానూ చూసింది వాణ్ణి.
‘కానీండి అబ్బులు బాబూ, ఇంతింత వేషాలేసే వాళ్లకే ఇంతలేసి పొగరయితే ఎలా చెప్పండి?’ సారామత్తూ, అసూయ మత్తూ రెచ్చగొడుతుంటే మాష్టరు ఎగురుతున్నాడు. అబ్బులుబాబు అతడి బుజాల్ని చేతుల్తో ఆదిమి కూచోబెడుతున్నాడు.
బయట తెరలు అలానే వున్నాయి. వాటిని విప్పండర్రా, విప్పండి.
1986