
గొప్ప సంగీతం విన్పించిన వెనుక మూగబోయిన వాద్యంలా వుంది మా వూరు సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత. ఇవాళ అంతా తిరుగు ప్రయాణం హడావిడిలో వున్నాం. పెద్దన్నయ్య కుటుంబం కనుమనాడే వెళ్ళిపోయింది. చాలా కాలం తర్వాత వచ్చిన పిన్నీ, అక్కా నేను మాత్రం ఈ రోజు కూడా వుండిపోయాం.
ఉదయం శీతాకాలపు గాలుల మధ్య పెరట్లో జామిచెట్టు నీడల్లో పల్చని ఎండ వాల్తూన్నపుడు మంచం వాల్చుకు కూచున్నాను. అమ్మ వచ్చి కూచొని కష్టం సుఖం చెప్పుకొచ్చింది. నేను ఈ మధ్య కొన్నేళ్ళుగా అసలీవూరు రావడమే కుదరడం లేదు.చిన్నపుడు చదూకునే రోజుల్లో ఈ వూరికి దూరమైన వాణ్నియివాల్టిదాకా తిరిగి సమీపం కాలేకపోయాను. చదువూ, బాంకు ఉద్యోగమూ, సివిల్‌సర్వీస్ పరీక్షలూ, యిప్పుడు సెక్రటేరియటూ, నగర జీవితమూ..నా జీవితం తనదైన పంథాలో వందుకు వెళ్ళిపోయిందే గాని ఈ వూరి దగ్గిర ఆగిపోలేదు.
ఈసారి పండగకి రావడం ఆకస్మికం. కొన్ని ముఖ్యమైన పనులుంటే వచ్చాను. ఒక్కణ్ణే. కుటుంబాన్ని కూడా పండక్కి తీసుకొస్తే బాగుణ్నని తర్వాత అన్పించింది. ఎక్కడ చూసినా ఈ మధ్య జీవితంలో వెలితి కన్పిస్తోంది. తెలియకుండా నిరాశ అవరిస్తోంది. ఇలా చేసిఉంటే బాగుణ్నేమో అన్న సందేహం ఎప్పుడూ పీకుతోంది.
అమ్మ చెప్పే కష్టం సుఖం నాకేమీ ఎక్కడం లేదు. ఎంత కావాలంటే అంత డబ్బు పంపుతున్నాం. ఇంకా ఈ కష్టాలేమిటి అన్పిస్తుంది నాకు.
అమ్మ అంటోంది‘మనుషులు కనబడకపోతే ఎలాగరా? మాకు మిమ్మల్ని చూస్తేనే బలం, కనీసం ఏడాదికోసారన్నా రాకపోతే ఎలాగ?’ అని.
‘ఇక్కడికి నేను రాలేను. కావాలంటే మీరు వచ్చేసి నా దగ్గర వుండిపోండి’ అన్నాను.‘ఎలా వచ్చేదిరా? ఇంత కాలం పుట్టి పెరిగిన ఈ వూర్ని వదులుకొని’. కళ్ళనీళ్ళు పెట్టుకొంది అమ్మ. నాకేమీ కదలిక కదలలేదు సరికదా ఆ దుఃఖమంతా ఏదో అపరిచిత దృశ్యంలో మల్లే వుంది.
ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఈ మధ్య నా పరిస్థితి అలానే వుంటోంది. వచ్చేరోజునా అంతే. చిన్నమ్మాయి మారాం చేసింది. ‘ఆ వూరు వస్తాన్నాన్నా’ అని. తీసుకురావచ్చు. సమస్యకాదు, కాని ఎందుకో దాన్ని తీసుకు రాలేకపోయాను.
ఈ రోజు ఉండి పోయానన్నమాటేగాని బయటకు కూడా వెళ్ళలేదు. అక్క రెండుసార్లు మాట్లాడదామని ప్రయత్నించి కూడా నన్ను ఎలా కదపాలో తెలియక వెళ్ళిపోయింది. గదిలో సోమరిగా పడుకుని రోజంతా గడిపేసాను. ఏం తోచక కాసేపు పాత పుస్తకాలు, పత్రికలు తిరగవేసాను. ఏదో చిత్రమైన కుతుహలం.
సాయంకాలం కప్పెర కప్పెర చీకుట్లు పడుతున్నాయి. పిన్ని సాయంకాలమే ప్రయాణమవుతున్నది. అంతా వీథరుగు మీద కూర్చున్నాం. సాయంకాలపు చివరి కిరణాలు అరుగుమీంచి వెనక్కి జారుతున్నాయి. ఇంటిమీద కాశీరత్నం తీగె నిండుగా పూసింది. వీథుల్లో పిల్లలు దొంగాట ఆడుతున్నారు. కేకలు చాలా రిథమిక్‌గా విన్పిస్తున్నాయి. నాన్నగారు మంచం మీద పడుకున్నారు. చెల్లాయి హరికేన్ లాంతరు వెలిగించి తెచ్చి తలుపువారగా వుంచింది.
మంగళసూత్రాలు కళ్ళకద్దుకొంటున్న పిన్ని భుజం మీద చెయ్యివేసి ‘పిన్నీ ఒక పాటపాడరాదూ, బస్సు వచ్చేలోగా’ అంది అక్క.
పిన్ని పాటలు పాడుతుందా అని ఆశ్చర్యపడబోయి తమాయించుకొన్నాను. ఈ విషయం ఎలా మర్చిపోయానా అని. పిన్ని చిన్నగా నవ్వింది. దీపం వెలుతురు ఆ నవ్వులో పువ్వులు పూసింది. ‘నేను ఇంకా ఏం పాడగలనే పాపాయి? అదే రోజుల్నాటి మాటో’ అంది.
‘ఆ రోజులు గుర్తొచ్చేందుకైనా పాడాలి పిన్నీ’చటుక్కున అన్నాను గానీ నా మాటలు నాకే కొత్తగా వున్నాయి.
పిన్ని ఎక్కువ బతిమాలించుకోలేదు. ఆమె లోపలి లోకాల్లోకి వెళ్ళిపోయిన పాట పంజరం వొదిలిన పిట్టలా బయటకు వచ్చి రెక్కలూపింది.
‘కోటి నదులూ ధనుష్కోటిలోనుండగ..’
‘పాట పాడుమా కృష్ణ పలుకుతీపి తేనెలొలుక..’
ఆ కంఠం ఆ సాయంకాలపు వాతావరణాన్ని ఒక మాయాజాలంలో బంధించేసింది. ఏదో పురాపురా సౌహృదాలు చెలరేగి ఎప్పటిదో పెళ్ళి బృందాల కోలాహలం విన్పించింది. ఒక మార్మిక నైరూప్యచిత్రలేఖనంలా ఆ దృశ్యం చెప్పలేని ఒక చిత్రమైన కదలిక నాలో రేకేత్తింది.
అక్కా, పిన్నీ రాజేశ్వరరావు గురించీ, మల్లీశ్వరీ గురించీ మాట్లాడుతున్నారు. అక్క తన చిన్నప్పుడు పిన్ని పాడిన పాటలన్నీ ఒకటొకటే గుర్తుకు తెచ్చుకుంటూ పాడిస్తోంది.
‘ఆంధ్రమాతా`పాటపాడు పిన్నీ’
‘అవన్నీ జాతీయ గీతాలు’ అంది పిన్ని.
‘అయినా పాడరాదూ’’ అడిగాను.
‘జాతీయ గీతాలు నీకిష్టమేనా?’ నవ్వుతో తలూపాను.
‘ఆంధ్రమాతా.. అతులిత చరిత..’
ఈ సారి ‘తానే మారెనా, గుణమ్మే మారెనా..’
‘నాకు దేవదాసు పాటలు ఒక కాగితం మీద రాసివ్వకూడదూ, మర్చిపోయేను ఆ పాటలన్నీ’ అంది పిన్ని.
‘ఎందుకు కాసెటే పంపిస్తాను’ అంది అక్క. ‘అయినా పాటల పుస్తకాలు దొరుకుతాయిలే టౌన్లో’ అని కూడా అంది.
కాసేపు నిశ్శబ్దం. అమ్మ లోపల వంటపనిలో వుంది. ఇప్పట్లో బస్ వచ్చే సూచనలు లేవు. ‘బావున్నాయర్రా పాటలు. ఇంక బస్సు రాదు, పొద్దున్నే ప్రయాణం. ఒరే ఎవర్రా అక్కడ, సామాను లోపలకు తెచ్చేయండి’ అనేసి నాన్నగారు వీథిలోకి వెళ్ళిపోయారు.
నాకేమిటో సరదా వచ్చేసింది. పిన్ని వెళ్ళిపోతోందంటే నిమిషాల మీద పుట్టిన బెంగ ఇట్టే కరిగిపోయింది. ప్రయాణం ఉదయానికి వాయిదా పడగానే కలిగిన సంతోషం నాకే ఆశ్చర్యంగా వుంది.
రాత్రి దీపం వెలుతుర్లో ఇంటిల్లిపాదీ నవ్వుల మధ్య ఎప్పటివో ముచ్చట్ల మధ్య భోజనాలు చేశాం. కంది పచ్చడి, వుల్లిపాయ పులుసుతో. భోజనాలు కాగానే పిన్నీఅక్కా నేనూ మళ్ళీ అరుగు మీద చేరాం. పూర్వం అంతా కలిసి వుండే రోజుల్నాటి ముచ్చట్లు తవ్వి పోసుకున్నారు. ఆనక గోరింటాకు పెట్టుకున్నారు. నా చేతిలో పేరు రాసింది అక్క. చల్లని గాలులు వీస్తున్నాయి. మంచు తెరపి లేకుండా రాల్తోంది. వీథి దీపాలు మంచువానలో వెలుతురు ముద్దల్లా వున్నాయి. గదుల్లో పక్కలు వేస్తోంది అమ్మ. పిన్ని పాటల మధ్యలో హఠాత్తుగా నా వైపు తిరిగి ‘నీ కిష్టమైన పాటపాడుతున్నాను. విను’ అని పాట మొదలు పెట్టింది.
నేను విపరీతంగా ఆశ్చర్యపోయాను. పాట అంతా విన్న తర్వాత ‘ఇది నా కిష్టమైన పాటా?’ అనడిగాను.
‘అవును, చిన్నప్పుడు మరీ మరీ అడిగి పాడించుకొనే వాడివి’ అంది పిన్ని. అసలు అటువంటి పాట వుందనే గుర్తులేదు నాకు. ఇక చిన్నప్పటి ముచ్చట ఏం గుర్తు? ఇక ఆ తర్వాత అదే ధ్యాస. ఎలా మర్చిపోయేను ఆ పాటని? ఇదే ప్రశ్న.
మా కబుర్లు తెమిలేటప్పటికి చాలా రాత్రయింది.ఆ ఇద్దరాడవాళ్ళూ రెండు సముద్రాలు సంగమించినంత విశాలమైపోయారు. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను. ఏవేవో కలలు, ఏవేవో వలయాల్లోంచి ఎక్కడికో పరుగులు తీస్తున్నట్టు వలయాల మధ్య ఓ బాట, నిశ్చితమైన గమ్మాన్ని చూపిస్తున్నట్టు.
2
నేను మళ్ళీ నా వుద్యోగ జీవితంలో అడుగు పెట్టగానే క్షణం తీరిక లేకుండా పోయింది. ఎలెక్షన్లు, కొత్తనాయకత్వం, కొత్త మంత్రివర్గం అధికారంలోకి రావడం, ఆ హడావిడి, అల్లర్లు, కొత్త మంత్రివర్గం వాగ్దానాలు, అర్డినెన్సులు, అర్డర్లు, ప్రజా సంక్షేమ పథకాలు. సెక్రటేరియేట్‌కి వూపిరి పీల్చుకోనివ్వనంత పనిభారం.
కొన్ని రోజుల తర్వాత.
ఆఫీసు టైం ఆవుతోంది. తొందర తొందరగా తయారై బ్రేక్‌ఫాస్ట్ తీసుకొంటున్నాను. ఆమె నిశ్శబ్దంగా వడ్డిస్తోంది. (ఆమెకి, నాకూ మధ్య మాట్లాడు కోవడానికి ఏమీ కన్పించక చాలా కాలమే అయింది. అంతా యాంత్రికంగా గడిచిపోతుంటుంది. తడుముకోవడానికి గాని, హెచ్చరించడానికి గాని అవకాశమివ్వకుండా అన్నీ అమర్చుతుంది. మా యిద్దరి మధ్య నిశ్శబ్దం లోనే ఎక్కువ అవగాహన). హఠాత్తుగా నా చెవుల్ని పాత హిందీపాట ‘చోడ్‌గయే బాలమ్’, బర్సాత్ లోది కాబోలు.
‘ఈ పాట ఎక్కడ్నుంచి వస్తోంది?’
ఆమె నా వంక చూడకుండానే జవాబిచ్చింది. ‘రేడియో సిలోన్‌లోంచి’
రేడియో సిలోన్! హుషారొచ్చింది. చిన్నప్పుడు హాస్టల్లో వుండే రోజుల్లో ఒక ఆదివారం ఉదయం ఓ మాష్టారి ఇంటి కెళ్లాను. మామూలుగా గంభీరంగా, అన్‌ఎప్రోచబుల్‌గా వుండే మాష్టారు రిలాక్స్‌డ్‌గా పువ్వుల లుంగీలో, వొళ్ళొ రేడియో పెట్టుకొని, మడత కుర్చీలోవాలి పాటలు వింటున్నాడు. లోపల్నుంచి వంటలు ఘుమఘుమలాడుతున్నాయి. నేను ఎందుకు వెళ్ళానో మర్చిపోయేను.
‘మాష్టారూ, ఈ పాటలు ఏ స్టేషన్లో వస్తాయండీ?’
‘సిలోన్లో’, గుర్తుపెట్టుకున్నాను.
‘రోజూ వింటారండీ?’
‘రోజూ తీరికేదిరా? అందుకే ఆదివారం కోసం చూడటం’ అప్పట్నుంచీ కోరిక. కాని ఎందుచేతనో తీరనేలేదు.
కాళ్ళకు చక్రాలున్నట్లుగా పరిగెత్తే పెద్దమనిషి పాటలు వింటూ కూచోడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. కాని ఆ ఆశ్చర్యాన్ని తొణకనివ్వకుండానే తన పనుల్లో తాను. కొద్దిగా ఆగి ‘బాగున్నాయి కదూ పాటలు’ అన్నాను. ఆమె మెల్లగా నవ్వి వూరుకొంది. మరేమీ మాట్లాడాలో తెలియలేదు.
నా ఏకాకితనమూ, నా మౌనమూ కొత్తగా అర్థమవుతున్న రోజుల్లో ఆమె ముఖాముఖి ప్రశ్నించలేక ఉత్తరం రాసింది. ‘మీరు ఎందుకు ఎప్పుడూ ఏదో పొగొట్టుకొన్నట్లు అలా పరధ్యానంగా వుంటారు? నా కొరత ఏమైనా వుందా?’ అని. చాలా దీనంగా. ఎపీలింగ్‌గా, నేనేమి జవాబివ్వలేదు. (నాకు తెలిస్తేగా) కాని ఆమె ఏమనుకుందో ఏమో నెమ్మదిగా అలవాటు పడిపోయింది.
ముప్పై అయిదేళ్ళ వయసుకే వుద్యోగంలో నేను కూరుకుపోయిన తీరు నా సీనియర్స్‌ని చాలా ఆశ్చర్యపరచింది. దాన్ని డివోషన్ అనే అనుకున్నారంతా. అందువల్ల చాలా ముఖ్యమైన బాధ్యతలు, క్లిష్టమైన వ్యవహారాలు నాకే అప్పగించడం మొదలుపెట్టారు. ఆ పెద్ద యంత్రంలో అత్యావశ్యకమైన పనముట్టుని అయిపోయాను. ఇలా ఎందుకు జరిగింది? ఆ ప్రశ్న వేసుకోవాల్సిన అవసరమే కలగలేదు ఇంతదాకా.
ఆ వూళ్ళో వున్న వూడు నాలుగురోజులూ, ఆ జ్ఞాపకాలూ నన్ను వొదలకుండా వెంటాడుతున్నాయి. మంచుపొరల మధ్య విరిసే ప్రభాతాలు చలిగాలుల మధ్య నెగళ్ళు కాగడాలూ, రివ్వున ఆకులు రాలిపోయే హేమంత వృక్ష పంక్తుల మధ్య సాయంసంధ్యా రాశిలో తడుస్తూ షికార్లు, ముఖ్యంగా ఆ రాత్రీ, ఆ పాటలూ.
ఆ పాట ముఖ్యంగా మరీమరీ సమ్మోహ పర్చింది. నేను నాదయిన స్వీయలోకం నుంచి చాలాకాలం క్రితమే దూరమయిపోయానని ఆ పాటే చెప్తోంది. ఆ పాట ఆధారంగా తిరిగి ఆ లోకంలోకి ప్రయాణం చేయాలి. ఆ మర్నాడు పిన్ని వెళ్ళిపోతూ వుంటే అసంకల్పితంగా కళ్ళు చెమర్చాయి.
అక్క అంది ‘పిన్నీ నువ్వు పాటలు ఎంత ఫ్రెష్‌గా పాడావో తెలుసునా?’
పిన్ని నవ్వి ‘అదేమిటే పాపాయి, కన్నుల్లో నీరు,గొంతులో గమకం ఎక్కడకు పోతాయి?’ అంది.
‘అవును, సరస్వతి ఎక్కడకు పోతుంది? అందుకే అంతర్వాహిని అన్నారు’ అన్నాను. నేను ఆ వూరునుంచి వచ్చేస్తున్నప్పుడు చాలా బెంగ పడ్డాను. కర్మాగారాలూ, రోడ్లూ, ఆఫీసులూ, జనసందోహం వుండే ఒక విశాల బృహత్ప్రపంచం అసలు స్పృహకి రాలేదు. అమ్మని వదలి వచ్చేస్తుంటే కళ్ళు చెమర్చాయి. వొదులులాగూ, చెరిగిన క్రాపూ, పలకా, బొమ్మల పుస్తకంతో పొద్దున్నే బడికి వెళ్ళే పసివాడ్నయి పోయాను.
జీవితంలో ఈ పరాయితనం ఎందుకేర్పడుతోంది? అసలు ప్రశ్న ఇదే. జీవితం నానుంచి ఎందుకు తప్పించుకుపోతోంది? ఒకటే సందేహం. అంత ఇష్టపడ్డ పాటని ఎలా మర్చిపోయేను?
3
నగరంలో ఒక సాయంకాలం, ఆకాశం మేఘావృతమై వుంది. ఆఫీసులో కరెంటుపోయింది. గాలిలో కనరాని గడుసు దెయ్యాల్లా చుట్టూ ఆఫీసు ఫైళ్ళు,బీరువాలు, బల్లలు ఆవులిస్తున్నాయి. కూచోవాలనిపించక బయటకు నడిచాను. నల్లని ఆకాశం నేపథ్యంగా పల్చని రావిఆకులు మెరుస్తున్నాయి. డ్రైవరు కారు తియ్యబోయాడు. వద్దని చెప్పి రోడ్డు మీదకు అడుగుపెట్టాను. అంత మంది జనం మోచేతి దూరంలో తొక్కిసలాడుతొంటే వాళ్ల మధ్యనుంచి ఆవ్యక్తంగా నిశ్చయించుకొన్న గమ్యంవైపు అడుగు వేసాను.
చిన్నతనంలో వూళ్ళో వానాకాలంలో ఏరు పొంగేది. పెద్దలోతు లేకపోయినా వడి వుండేది. దాన్లోంచి ఎదురుగా నడిచేవాళ్ళం. ఎర్రని వరదనీరుపంట్లాన్ని తడిపేస్తో కాళ్ళ చుట్టూ లుంగలు తిరిగి పోతుంటే ఒక్కో అడుగూ ముందుకు వేసేవాళ్ళం. ఇప్పుడలాగే అన్పిస్తోంది. అలా ఎంత దూరం నడిచానో, నగరం మీద మెరుపులు తెగుతున్నాయి. తిరిగి కరెంటు వచ్చేసరికి ఆశ్చర్యం, చార్మినార్ దగ్గర వున్నాను.
చార్మినార్‌ని చూడగానే పోగొట్టుకున్న పెన్నిధి దొరికిన ఆనందం. ఏదో పెద్ద దిగులు కూడా అవరించింది. నేను చార్మినార్‌కే రావాలనుకున్నట్లుగా మనసు ఏమూలో సాక్ష్యమిస్తోంది. చార్మీనార్‌ని చూస్తో అలా ఎంతసేపు వుండిపోయానో తెలీదు. ఆ తుఫాను రాత్రి, ఆ చీకట్లో, ఆ పురాతన ఇండోశారసనిక్ కట్టడం ఎదుట నాలోని ఏ వుద్వేగాలు పొంగాయో ఏ దుఃఖాలు వుపవమించాయో నాకు తెలీదు.
మా వూరి చివర బ్రిటిష్‌వాళ్ళ కాలంలో కట్టిన ఓ గ్రామచావడి వుండేది. కొన్నాళ్ళు అది మాకు బడి. అప్పట్లో పంతులమ్మగారు మాకు ఎన్నో కథలు చెప్పి పాటలు నేర్పేది.
‘కాకి ఒకటి నీళ్ళకు కావుకావుమనుచును..’
‘క్యా పాగల్ హో?’ ఎవరో భుజం తట్టిపోతే వులిక్కి పడ్డాను. (పాట గట్టిగా పాడుతున్నానా?)
వెండి సామాను దుకాణాల్లో రద్దీ తగ్గింది. ఒక చిన్న ఇరానీ హోటల్లో రికార్డర్లో కేసెట్ మార్చాడు. ఏవో హిందీ మ్యూజికల్ హిట్‌లో మెలోడిస్. టీ కోసం వచ్చానా?ఆ కాసెట్ పూర్తయ్యే దాకా అలానే వుండిపోయాను. బిల్లు చెల్లిస్తూ అడిగాను. ‘ఈ పాటలు ఏ ఫిల్మ్‌లోవి?’
వాడు నన్ను అదోలా చూసి ‘ఉమ్రావ్‌జాన్’ అన్నాడు.
‘ఆడుతోందా వూళ్ళో?’
థియేటర్ పేరు చెప్పాడు. చిల్లర జేబులో వేస్తోంటే చేతికి ఏదో విజిటింగ్ కార్డు తగిలింది. తీసి చూశాను. అదొక రచయితగారి చిరునామా. అక్కడికి దగ్గర్లోనే. ఆ రాత్రివేళ వెళ్ళి అతన్ని ఆశ్చర్యపరిచాను.
నన్ను చూడగానే గుర్తు పట్టాడు. ‘మీరు.. కదూ!’ అన్నాడు.
మళ్ళీ వెచ్చటి టీ. కాసేపు నిశ్శబ్దం. ‘మీకు వేరే పనేమీ లేకపోతే, ఇక్కడ ఒక మిత్రుడి ఇంట్లో ముషాయిరా,వెళ్దామా’ అన్నాడు.
అంతకన్నానా? తిరిగి చార్మినార్‌వైపు. అక్కడ పాత భవనంలో పై అంతస్తులో కొద్దిమంది మిత్రుల కలయిక. ముగ్గురు నలుగురు యువతులు కూడా.
‘నాకు సాహిత్యంతో అట్టే పరిచయం లేదు, ఆసక్తి అంతే.’ ఇంగ్లీషులో సంజాయిషీ ఇచ్చాను.
వాళ్ళలో ముస్లిం యువతి నల్లని కనురెప్పల్తో నవ్వింది. పక్కన పూల కుండీల్లో రోజాలు వానకి తడుస్తున్నాయి. చినుకుల చప్పుడు దూరంగా విన్పిస్తోంది. పైన షాండ్లియర్ డిమ్‌గా వెలుగుతోంది. షర్బత్తులు ఖాళీ అవుతున్నాయి. వాళ్ళు కొన్ని ఘజల్సు, ఔత్తరాహ భక్తికవుల దోహాలు కొన్ని పాడారు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ గురించీ, కుర్తలైన్‌హైదర్ గురించీ ప్రస్తావించారు. నాకు కొంత అర్థమయింది. కొంత అర్థం కాలేదు. కాని ఆ సన్నివేశంలో నేను వుండటమే ఒక అనుభవం. వింత పరిమళం నన్ను ఆలమికొంది.
ఇంతలో ముస్లిం యువతి కన్నుల్లో నీళ్ళు. మిత్రబృందం కదిలి పోయింది. ఆమె మొగుడు ఈ స్నేహాలు వదులుకోనందుకు ఆమెను మళ్ళీ కొట్టాట్ట. ఆమె దుఃఖగాథతో గాలి బరువెక్కింది. ఒకళ్ళిద్దరు అవేశపడ్డారు.
కాని ఆమె శాంతంగా చెప్పుకొచ్చింది. ‘నిజమే, నాకు చాలా కష్టాలు. కాని మా ఇంటి ఎదుట ఒక చెప్పులు కుట్టేవాడున్నాడు. అక్కడేమీ బేరాలుండవు. అయినా ఏదో దారం పేనుతోనో, మరొక పని చేస్తూనో పాటలు పాడుకుంటూవుంటాడు. చుట్టుపక్కల వాళ్ళూ, బీటుకానిస్టేబులూ రోజూ అతనితో గొడవపడతారు. అతని కంఠం అంతగా బాగుండక పోవచ్చు. న్యూసెన్సే కావచ్చు. కాని అది అతనికి ఎంత ముఖ్యమో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఆ పాట కోసం అతను మంచి సెంటర్లు అన్నీ వదులుకొని ఆ మూల కొచ్చాడు. పాటలు పాడుకోవడం కోసం పోరాటం చేస్తూనే వుంటాడు. హి ఈజ్ మై ఇన్‌స్పిరేషన్. వుర్దూకవి రవాన్ అనలేదూ..’ అనొక గజల్ వినిపించింది.
కాసేపు సైగల్‌ని విన్నాం. వ్యథితరాత్రం సైగల్ స్వరంతో మరింత ప్రిదిలిపోయింది.
మెట్లుదిగి వస్తూండగా మిత్రుడ్నడిగాను. ‘ఆ గజల్ అర్థమేమిటని?’ అని.
అతను చెప్పాడు. ‘నవ్వాం, ఏడ్చాం, కాని మనకేమి అర్థమయింది ఆనందమంటే ఏమిటో విషాదమంటే ఏమిటో` . టెరిఫిక్ కదూ, రియల్లీ టెరిఫిక్. యహీ జిందగీ ముసీబత్, యహీ జిందగీ ముసర్రత్..’
వొళ్ళు జివ్వుమంది నాకు. టైం చూశాను. పన్నెండు దాటింది. వర్షం పెద్దదవుతోంది. రిక్షా పట్టుకొని ఇంటికి . ఈ నగరానికి వచ్చిన ఇంత కాలానికి ఈ నగరం తన ఆత్మని చూపించింది. రిక్షావాడు హమ్ చేస్తున్నాడు. చలిగాలి రివ్వున వీస్తోంది. నిర్మానుష్యమూ, విశాలమూ అంయిన రాజపథాలు వానకు తడిసిన చోటల్లా మెర్క్యురీ దీపాలు గుత్తులు గుత్తులుగా కాంతుల్ని పూశాయి. విన్న మెలోడిస్ మధురంగా వున్నాయి. కాని మధురాతి మధురమైన మెలోడిస్‌ని ఇంకా వినాల్సి వుంది.
4
ఉమ్రావ్ జాన్ ఫిల్మ్‌కి ఆమెతో వెళ్దామనుకున్నాను. కాని అప్పటికే ఫిల్మ్ వెళ్ళిపోయింది. కాని ఆ రాత్రి విన్న పాటలు స్పష్టంగా నోటికి రాక పోయినా చెవుల్లో మోగుతోనే వున్నాయి.
ఒక మధ్యాహ్నం లంచ్‌వేళ సీనియర్ సెక్రటరీ ఒకాయన బడ్జెట్ గురించీ, ఇకనమిక్స్ గురించీ దంచేస్తుంటే మధ్యలో అడిగాను ‘ఉమ్రావ్ జాన్ ఫిల్మ్ చూసారా?’
ఆయన నిశ్చేష్టుడయిపోయాడు. నేను అడిగిందేమిటో కూడా ఆయనకు అర్థం కాలేదు. కాని ఫైల్సు సర్దుతూన్న అటెండర్ మాత్రం ‘నేను చూశాను సార్’ అన్నాడు.
ఆ సాయంకాలం పబ్లిక్‌గార్డెన్స్ ఎదుట అతన్ని అడిగాను ‘నీ చిన్నతనపు రోజులు ఎలా వుండేవో చెప్పగలవా?’ అని. అతను స్పష్టంగా చెప్పలేకపోయాడు. ఆకలిమధ్య, అసౌకర్యం మధ్య పెరిగిన వ్యక్తి.
‘నీకు పాటలంటే ఇష్టమేనా?’
‘బలే అడిగారు సాబ్. మిఠాయి అంటే తియ్యగా వుండేదానా అని?’ అన్నాడు. ఇంకా చెప్పాడు ‘నా చిన్నతనంలో మా వూళ్ళో డ్రామాట్రూపు కొన్నేళ్ళపాటు మకాం వేసేరండీ, వాళ్ళలో ఒకామె చాలా బాగా పాటలు పాడేది. కొంత కాలం అయ్యేటప్పటికి మా వూళ్ళో తెల్లారదనిపించేది, కాని ఓ తెల్లవారుజామున ఆ ట్రూపు మా వూరొదిలి వెళ్ళిపోయారనుకోండి. నాకు రేఖాలో ఆవిడే కన్పించింది’.
‘రేఖా ఎవరు?’
‘అబ్బా, రేఖా ఎవరంటారేమిటండీ, ఉమ్రావ్‌జావ్‌లో హీరోయిన్, ఆ కళ్ళు, ఆ కళ్ళల్లో..ప్చ్.. చెప్పలేనండీ, చాలా లోతైన కళ్ళు, ‘ఖూబ్ సూరత్.’` ఆ మాటలన్నవాడు మా ఆఫీసులో అటెండర్. చాలా ఎన్వియస్‌గా చూసాను అతన్ని.
‘అన్నట్టు ఇవాళ రవీంద్ర భారతిలో ఏదో ప్రోగ్రాం వుందండీ’ ఇద్దరం కలిసే వెళ్ళాం. అనూప్ జలోతా ఘజల్స్. మా అటెండర్ చెప్పకపోతే ఆ ఘజల్స్‌లో ఎన్నో అందాలు తెలీక పోయుండేవి.
‘మీరు పంకజ్ వుథాస్‌ని విన్నారా? ప్రీతి సాగర్?’
5
నేను సాయంకాలాలు త్వరగా ఇంటికి రావడం, ఏవేవో ప్రోగ్రామ్స్‌కి ఇద్దరం వెళ్తూండడం, పిల్లల్తో ఇష్టంగా దగ్గరగా మాట్లాడటం మా ఆవిడ్ని చాలా ఆనందపెట్టాయి. కాని ఆమె తొందరగా బయట పడదు. ఈ మార్పు తాత్కాలికమో, శాశ్వతమో ఆమె ఇంకా నిర్ధారించుకోవాలి. మా ప్లాట్ అంతా తెల్ల కాలర్ల కుటుంబాలు. బహుశ నేనూ అందులో వొకటి కావడం వల్ల వాళ్లంటే నాకు కంటెమ్ట్. ఆ కాలనీలో రానురాను కాంక్రీట్ సంస్కృతీ, పాలరాతి వెంకటేశ్వరుడూ, శనివారాలు భజన్లూ. నాకు వూపిరాడటం లేదు. ఇదివరకు ఈ దిగులు నిరాకారంగా వుండేది. ఇప్పుడలా కాదు, పూర్వాపరాలు తెలుస్తున్నాయి.
ఆగష్టు పదిహేనున ఆఫీసులో హడావిడి. అంతా గవర్నమెంటు వారు రాజ్యాంగంలో నిర్దేశించిన తీరులో పతాకావిష్కరణా వుపన్యాసాలూ అవీను. ఎవరేనా జాతీయ గీతాలు పాడితే ఎంత బాగుణ్నని! (నీకు జాతీయ గీతాలు ఇష్టమేనా?).
ఇంటికొచ్చిన తర్వాత మా పెద్దమ్మాయిని అడిగాను. ‘ఇవాళ బళ్ళో ఏం చేశారు?’ ‘మరేమో జెండా ఎగరేసి బిళ్ళలు పంచి పెట్టారు. నాకేమో ప్రైజులు కూడా ఇచ్చారు.’
‘ఎందుకు’
‘ఎస్సె రైటింగులో ఫస్టు’
‘ఏమిటి రాసావు?’
‘ఏమిటి రాసానబ్బా.. మరేమో..మర్చిపోయాను’
ఆమె నన్ను జాలిగా చూసింది. నేను నా చదూకొనే రోజుల్ని గుర్తుకు తెచ్చుకోబోయాను. ముందురాత్రి బళ్ళో రంగు కాగితాలు జూలు కత్తిరించడం, జెండాలు అంటించడం, ఉదయం జెండా ఎగరేయ్యడం, పాటలు..ఏం పాటలూ చెప్మా? ఆ ‘ఎగరాలి, ఎగరాలి స్వాతంత్య్ర జెండా మా ఐక్య జెండా జాతీయజెండా..’ పెద్దగా పాడేసాను ఆ పాట.
పిల్లలిద్దరూ ఒకటే గోల, ఆ పాట నేర్పి తీరాలని.
ఆ రాత్రి ఆమెనడిగాను.‘నీ చిన్నతనం ఎల్లా వుండేది?’
ఆమెకి మంచి ఎక్స్‌ప్రెషన్ వుంది. ఎంతో వివరిస్తుందనుకున్నాను. కాని నిశ్శబ్దంగా వూరుకొంది. ‘జీవితంలో కెల్లా బాల్యమే మధురమైంది అంటారు కదా! నీకు అలా అన్పించదా?’ అనడిగాను.
ఆమె చిరునవ్వు నవ్వి ‘నాకు నా జీవితం ఆసాంతం మధురంగానే వుంటుంది’ అంది.
‘నేను నమ్మలేను, అందుకు దాఖలాలేమీటి?’
ఆమె కాసేపాగి ‘గొప్ప సంతోషానికి దాఖలాలేవంటాం? కబీరు దోహా ఒకటి నాకు బాగా గుర్తు. భగవంతుడు అనే ఆనందాన్ని ఎలా వివరించగలను? అది మూగవాడు తిన్న బెల్లం అన్నాడాయన’ అంది.
నేను పెళ్ళయి ఇంతకాలమైన తర్వాత మొదటిసారిగా ఆమెను చూసినట్లు ఫీలయ్యాను. ఆమె తనని ఇంత కాలానికి కన్పరచుకొంది. ఆ విషయాన్నే పైకి వొప్పుకోవడానికి అహం అడ్డొచ్చి సంభాషణని అక్కడితో తుంచేశాను.
ఒకరోజు ఉదయం ఆఫీసుకి వెళ్ళగానే గొప్ప ఆశ్యర్యంగా వొకప్పటి నా క్లాస్‌మేట్ నా కోసం ఎదురు చూస్తూన్నాడు. కుశల ప్రశ్నలూ, సంభాషణా అయిన తర్వాత ‘ఒక వారం రోజులపాటు సోషల్‌స్టడీస్‌లో క్లాసెస్ నిర్వహిస్తున్నాం. అన్ని కోణాల్లోనూ సమకాలీన సమాజాన్నీ అధ్యయనం చెయ్యడం. ఒక రోజు ప్రోగ్రాంకి నువ్వు ఛీఫ్‌గెస్ట్‌గా రావాలి’ అన్నాడు.
అతడు ఈ మధ్య కాలంలోనే చాలా చదివాడు, ఎదిగాడు. తెలుసుకున్నాడు. అంయినా ఇంకా తృష్ట, ఇంకా జిజ్ఞాస. అతనితో మాట్లాడిన ఆ కొద్దిసేపట్లోనూ నేనెంతో ఎడ్యుకేట్ అయినానిపించింది.
‘వుద్యోగం, పిల్లలూ?’ అనడిగాను.
‘ఉద్యోగమా? పోష్టల్‌లో క్లార్క్‌ని. ఇక పెళ్ళంటావా?’ అని నవ్వాడు.
‘ఏమిటి?’
‘ఏముంటుంది? ఏనొక వియోగగీతిక’ అనేసి వెళ్ళిపోయాడు.
నేను వెళ్ళిన రోజు వక్త అతనే. మార్క్సిస్ట్ ఎనాలిసిస్. నాకు ఎక్కువ అర్థం కాలేదు. కాని ఎలియనేషన్ అనే కాన్సెప్ట్‌గురించి అతను చెప్పింది సూచనప్రాయంగా అర్థమయింది. మీటింగ్ అయిపోయాక అడిగాను. ‘వైమసస్యం అనేది ఎలా పోతుంది?’
అతను ఒక క్షణం ఆలోచించి ‘సామాజిక వైమసస్యం విప్లవం ద్వారానే పరిష్కారమవుతుంది.. ఈలోగా ఎవరేనా వ్యక్తి తన జీవితంలోని వైమసస్యం గురించి ప్రశ్నిస్తే అందుకు సమాధానం స్పష్టంగా లేదు. సాధారణంగా వైయక్తిక వైమసస్యం నుంచి సంగీతమూ, ఇన్‌టాక్స్‌కేటింగ్ మందులూ, ఆశ్రమాలూ విడుదల కలిగిస్తాయి. ఏమంటే వ్యక్తి తనని ఆ సాంగత్యాల్లో కోల్పోతాడు కనుక. అలా కాక తన వ్యక్తిత్వం నిలకడగా వుంటో, ఈ పరాయీకరణ పోవాలంటే, అందుకు బహుశా..’ అని ఆపేసి ‘సారీ నేను ఇంకా ఎంతో తెలుసుకోవాలి, ఇప్పుడేమీ చెప్పలేను’అని సెలవు తీసుకున్నాడు.
ఇంటికి వెళ్ళేసరికి చిన్నమ్మాయి పెద్దగా పాడుతోంది. ‘అరె భాయ్ జర దేఖ్ ఛెలో’అంటో. నన్ను చూసి ఆపేసింది. నేను విననట్టుగా లోపలికి అడుగు పెట్టి దాని క్లాస్‌బుక్స్ తీసుకురమ్మన్నాను. అయిన పాఠాల్లో ప్రశ్నలడిగాను. అసైన్‌మెంట్స్ చెక్ చేశాను. భారత ప్రధాని ఎవరు? పత్తి పొడుగు పింజరకం ఎక్కడ విస్తారంగా పండుతోంది? అని కూడా అడిగాను. షి ఈజ్ వోకే. ‘‘వెరీగుడ్, కీపిటప్’ అన్నాను. అది పుస్తకాలు లోపల పడేసి ఎదుట లాన్స్‌లోకి పోయి మళ్ళీ అదే పాట ఎత్తుకుంది.
ఆ రాత్రి ఆమె వొళ్ళొ తల పెట్టుకొని ఆమె కన్నుల్లో ఈదుతో` పిన్ని పాటలు పాడటం, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పులు అన్నీ చెప్పి ‘నాకు వొకటే సందేహం, ఆ పాటని నేను ఎందుకు మర్చిపోయాను చెప్పు’ అని అడిగాను.
‘బావుంది, పజిల్స్ విప్పుతూ కూచోడమే నా పనా?’ అందామె ముద్దుగా.
‘అలా కాదు, నువ్వే చెప్పగలవు. ఇవాళ మా ఫ్రెండ్ గొప్ప ప్రసంగం చేశాడు. ఎలియనేషన్ అంటో! తీరా చేసి ఎలా దాన్నించి తప్పించుకోవడమంటే తనకే తెలీదు పొమ్మన్నాడు. నాకు వీటిన్నిటికీ ఒకటే జవాబు కన్పిస్తోంది చెప్పవూ’ అన్నాను.
ఆమె నవ్వి ‘పుటుక్కు జరజర డుబుక్కు మే’ అంది.
వొకటే నవ్వు ఇద్దరం.‘నా తండ్రీ, ఎందుకు మనకా చర్చలు? ఎలియనేషన్ యిదిగో ఇట్లా పోతుంది’ అంటో మెత్తగా కావిలించుకొంది.
6
ఆ పాట ఇన్నాళ్ళయినా నన్ను ఛాయలా వదల్లేదు. ఆ ఛాయ తనతో తెచ్చిన ప్రకాశం నెమ్మదిగా నన్ను వెలిగించింది. ఆ పాట ఇప్పుడు గుర్తొస్తోంటే, అందులో వాక్యాలొక్కటే కాదు, నా బాల్యమంతా గుర్తొస్తోంది. ఎర్రని బోగన్‌విల్లియాలు పూసిన పెళ్ళి పందిట్లో గ్రామఫోను పెట్టెలో పాటలు మొదటిసారిగా వినడం, తోలుబొమ్మలాట చేసే చప్పుళ్ళు, పండుగ రోజుల్లో తాళాలు మోగిస్తో గంగిరెద్దులవాళ్ళు చేసే రాగాలు, ఇంటిలో చిన్నపుడు బంధువర్గమంతా కలిసి చెప్పుకొన్న కబుర్లు, నానబెట్టిన ధాన్యాన్ని మంగలంలో వేయించి రోట్లో పోస్తే ఆడవాళ్ళు పాటలు పాడుతూ అటుకులు దంచడం, అమ్మవారి తిరునాళ్ళలో బూరాలు కొనుక్కొని పీ`పీ అని వూదడం,ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఆ పాట నా జీవితం నుంచి ప్రత్యేకమైన అస్తిత్వం లేనంతగా ఐక్యమై పోయింది. అప్పటి అనుభవాల్ని మినహాయించిచూసామా, ఆ పాట నాకు ఎప్పటికీ గుర్తుకురాదు.
ఒక సాయంకాలం మా అటెండరు గోడవారగా కూర్చొని బీడీ దమ్ము లాగుతూ ఒక పుస్తకం పఠిస్తోంటే దగ్గరకు వెళ్ళిచూశాను. దేవదాసు పాటల పుస్తకం.
‘ఇది నాకిచ్చెయ్యవా?’ (యీ కుర్ర ఆఫీసరుకి ఈ గారాలేమిటి?)
‘మీకెందుకు సాబ్ యిది, అయినా మీరు అడిగితే కాదంటానా?’ అని తటపటాయించి ‘సాబ్ ఏమీ అనుకోకపోతే ఒక్కమాట’
‘ఏమిటి’
‘ఈ మధ్య మీలో మార్పు కన్పిస్తోందండీ’
ఉలిక్కి పడ్డాను. ‘మార్పా? మంచి మార్పా? చెడ్డమార్పా?’
వాడు పళ్ళికిలించాడు. ‘హేపీ సార్, హేపీ’ అన్నాడు.
చెప్పొద్దూ, అంత గొప్ప ప్రశంస నా జీవితంలో అంతదాకా నేను అందుకోనేలేదు.
నాలుగయిదు నెలలు గడిచాం. నాలో ఆలోచనలన్నీ అక్కయ్యకు ఉత్తరం రాసి, పిన్నిని చూడాలని వుంది, నేరుగా అక్కడికే రమ్మనమని కబురుచేశాను. నేనూ, మా ఆవిడ, పిల్లలూ కలిసివెళ్ళాం పిన్నీ వాళ్ళవూరు. ఆ పల్లెటూరు నా చిన్నపుడు ఎలా వుందో ఇప్పుడూ అలానే వుంది. మా చిన్నాన్న అక్కడ వ్యవసాయం. వాళ్ళ యింటి పరిస్థితి చూస్తే చాలా విషాదకరంగా అన్పించింది.
చిన్నాన్న తన జీవితంలో ప్రయోజకుడిగా ముద్ర పడలేకపోయాడు. ఆ తాటాకుల యిల్లు లోగిలి కాకుండానే అతను ముసలివాడయిపోతున్నాడు. కొడుకు అక్కడే పోస్టుమాస్టరు చేస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలకు ఇంకా పెళ్ళిళ్ళు కావాల్సి వుంది. ఆ ఇంటిలో పేదరికం తాలూకు యిరుకు ప్రస్ఫుటంగా కన్పిస్తోంది. నిజానికి ఒక్కసారిగా అంతమంది అతిథుల్ని వాళ్ళు భరించగలరా అన్నది కూడా సందేహమే.
అంతే ఇవన్నీ నా ఆలోచనలే. అక్కనీ, నన్ను, మా కుటుంబాన్నీ చూసి వాళ్ళు పొంగిపోయారు. ఏవేవో కబుర్లు ఎడతెరపిలేకుండా. ఆమె నన్ను వొదిలేసి ఆ పొగచూరిన వంటింట్లో ‘అత్తయ్యగారూ’ అంటూ పిన్నితో కబుర్లాడుతూ కూరలు తరిగింది.
అక్క పిన్ని కోడల్తో కబుర్లు చెప్తోంది. నేను వంటింట్లో గడప దగ్గర పీట వాల్చుకొని ‘పిన్నీ నీకు దేవదాసు పాటల పుస్తకం తెచ్చాను. ఇదిగో’ అన్నాను. ఆ పుస్తకం చూసి ఆమె ముఖం చాటంత అవుతుందని ఆశపడ్డాను.
కాని ఆమె ‘మా నాయనే, ఎంత గుర్తుపెట్టుకున్నాను నీ యాతనలో వుండి కూడా’ అని మాత్రం వూరుకొంది.
అక్కడ పిన్నిని చూసి నేను చాలా నిస్పృహ చెందాను. ఎడతెగని ఇంటి చాకిరీకి బీదరికపు ఇరుకుకీ ఆమె చిక్కి శల్యమైంది. మా పెద్దమ్మాయి ‘ఈ పిన్ని నిజంగా పాటలు పాడుతుందా నాన్నా’ అని ఎక్కడ అడుగుతుందో అని భయపడ్డాను.
ఆ స్త్రీలూ, ఆ ఆడపిల్లలూ వాళ్ళ గోష్ఠుల్లో ఏమీ పాటలు పాడలేదు. కాని ఎడ తెరపి లేకుండా కబుర్లు చెప్పుకొన్నారు. మధ్యలో ఏ కారణాలు పురస్కరించుకునో కన్నీళ్ళు, వోదార్పులు. ఒకళ్ళకొకళ్ళు జడలల్లుకున్నారు. చీరెల గురించీ, నగల గురీంచీ నోరారా చెప్పుకున్నారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున పూత రేకులు చుట్టారు. సాయంకాలం చుక్కలు వెలిగే ఆకాశం కింద మంచాలు వాల్చుకొని సన్నజాజులు మాలలు గుచ్చుకొంటూ రహస్యమైన పులకరింతల్తో పరవశం చెందారు.
నేను శూన్యంగా, సోమరిగా పెరట్లో చంద్రకాంతం పువ్వుల్ని చూస్తో నిల్చున్నాను. వెనుక నుంచి పిన్ని మనువడు ఏడేళ్ళవాడు అంటున్నాడు. ‘మరేమో చిన్నాన్నా, నేనూ శంకరాభరణం పాటలు పాడతాను, వినవూ.. ఈ సారి వొచ్చేటప్పుడు ఆ పాటల పుస్తకం తేవూ..’
మా ఆవిడ మెత్తగా నా బుజం మీద చెయ్యివేసి చిరునవ్విన అనుభూతి.
1986
A story so engrossing, took me to my childhood to date and thinking of ALIANATION
మీ కలం వెన్నెల ను వర్షించిందండీ ఇలా.
కథ చాలా బాగా వచ్చింది.1986 లో అంటే మీకు షుమారు 23/24 ఏళ్ళు ఉండవచ్చు. కానీ ఈ కథనం తీరు మంచి పరిపక్వతని సూచిస్తోంది. యాంత్రిక జీవనంలో అలవాటు పడ్డ వాళ్ళు ఏమి కోల్పోతున్నారో చాలా చక్కగా చెప్పారు. మనిషికి జీవితంలో ఉద్యోగం అనేది ఒక దశ మాత్రమే,దానిని అలాగే చూడాలి. ఈ కారణంగా వ్యక్తిగత జీవితాన్ని వదులుకో కూడదు.మనిషికి ఏ దశలోనూ శూన్యం మిగల కూడదు. పరిపక్వతతో కూడిన కథనం (1986 కు ముందుది అయినా ) ఇన్నాళ్ళకు చదవగాలిగాను.ధన్యవాదాలు
మీ కథ ఆసక్తిగా చదివాను. 1986 లోనే మీలో గొప్ప రచయిత దాగున్న విషయం అర్ధమైంది. నన్ను ఈ మధ్య ఒక సెంట్రల్ జైల్ ఖైదీ ఒకరు (open prison) మార్నింగ్ వాక్ చేస్తుంటే విష్ చేశారు. మీకు అటెండర్ అయితే నాకు ఖైదీ ఆనందాన్ని పంచారు. ఆమె అన్న పదం ఎంత చక్కగా ఉపయోగించారు. రిటైర్మెంట్ అనేది కేవలం ఉద్యోగానికే, వ్యాసంగానికి కాదు. మీ నుంచి మరిన్ని మంచి పోస్టులు ఆశిస్తూ!
‘కథ’ అంటే నమ్మలేకపోయాను. మీ డైరీలోని పేజీ అని భ్రమపడ్డాను. హృదయాన్ని స్పృశించింది.
మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు