వెన్నెల తడి

‘ఇప్పుడు మీరు ఆలపించారే ఆ రాగం పేరేమిటి?
విజయానంద చంద్రిక.
రాగలక్షణం?
సలక్షణమే.’
 
దాదాపు నలభయ్యేళ్ళ కిందట గోదావరి ఒడ్డున ఒక సాయంకాలం మాట్లాడుకున్న ఈ మాటలు నిన్న రాత్రే విన్నట్టుంది. చక్రవాక కానాడ రాగాలతో కలిపి రూపొందించిన ఆ రాగంలో ‘రసికరాజ తగువారము కామా’ పాట ఎట్లా కూర్చారో, ఎలా రాసారో, ఎలా పాడారో నా మిత్రులు మహేష్, వంక బాలసుబ్రహ్మణ్యం, గోపీచంద్ మాట్లాడుకున్న మాటలు ఇంకా నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి.
 
ఆ వెన్నెల రాత్రుల్లో మా ఊరి ఏటి ఒడ్డున వంతెన మీద ఇమ్మాన్యుయేలు ‘రాగమయీ రావే’ అని పాడుతున్నప్పుడు కొండా, కోనా, ఏరూ, నింగీ ఎట్లా చెవులప్పగించి వింటూ ఉండేవో నా కళ్ళ ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నది.
 
పది పదిహేనేళ్ళ కిందట, వరల్డ్ స్పేస్ తెలుగు రేడియో ‘స్పందన’ కోసం ‘మోహన రాగం’ ప్రసంగాలు చేస్తున్నప్పుడు, నా మాటల మధ్యలో పాటలు కూర్చడానికి పాతపాటలన్నీ వెతుకుతున్నప్పుడు ‘సంగీత సాహిత్యమే, మేమే, నవ శృంగార లాలిత్యమే’ అన్న పాట వెతుక్కుని పెట్టినప్పుడు ఆ పాట ఇంకా వేళ్ళ మధ్య తారాడుతూనే ఉన్నది.
 
రెండేళ్ళ కిందట విల్లుపురం వెళ్ళినప్పుడు పాటలు పుట్టిన తావులు వెతుక్కుంటూ తిరిగినప్పుడు చిదంబరంలో నందనార్ కోవెల కు వెళ్ళినప్పుడు ‘నందుని చరితము వినుమా, పరమానందము కనుమా ‘ అని నా పక్కన ఎవరో పదే పదే పాడుతున్నట్టే ఉండింది.
 
కాబట్టి జయభేరి చూడాలని గాని, చూడలేదని గాని నాకు అనిపించకపోవడం సహజమే కదా. ఆ సినిమా నాతోనే ప్రయాణిస్తున్నది ఇన్నేళ్ళూ. కాని చూసాను మొన్నా, అటుమొన్నా. ఈ సారి పుస్తకప్రదర్శనలో పి.పుల్లయ్య, శాంతకుమారి దంపతుల మీద ఓలేటి శ్రీనివాస భాను రాసిన ‘అనురాగమూర్తులు’ ఆవిష్కరణ సభలో ఆ పుస్తకాన్ని పరిచయం చేసి వచ్చాక, ఆ సినిమా చూడాలనిపించింది. సినిమా కోసం కాదు, కథ కోసం కాదు, పాటల కోసం కూడా కాదు, పి.పుల్లయ్యగారి దర్శకత్వం ఎలా ఉంటుందో చూడాలని. ఆ సినిమా నన్ను నిరాశపర్చలేదు. అది నిజంగానే ఒక శ్రవ్యకావ్యం.
 
ఎంతో కొంత మెలోడ్రామా తప్పని ఆ నాటి ఆ కథనంలో కూడా ఇప్పటికీ కంట తడిపెట్టించే సన్నివేశాలు కనిపించడంలో ఆశ్చర్యం లేదనిపించింది. కాని ఇంట్లో సోఫాలో కూచుని ఆ సినిమా చూస్తున్నంతసేపూ బయట రెండెడ్ల బళ్ళు ఆగిఉన్నాయనీ, ఎడ్లు నెమ్మదిగా ఎండుగడ్డిపోచల్ని నెమరేసుకుంటున్నాయనీ, వాటిమీద మూడవజాము వెన్నెల రాలుతూ ఉందనీ అనిపిస్తూనే ఉంది. సినిమా అయిపోగానే ఆ ఎడ్లబండిమీద తిరిగి ఆ వెన్నెల రాత్రి అడవి దారిన మా ఊరు వెళ్ళిపోతానని అనుకుంటూ ఉన్నాను.
 
పాతసినిమాలు, జానపదాలు చూసేటప్పుడు, ఆ పాటలు స్టూడియోలో తీసినప్పుడు వెనగ్గా సీనరీ చిత్రించిన తెరలు వాడతారే, ఆ తెరలు చూస్తే నాకేదో అద్భుతమైన లోకమొకటి చూస్తూన్నట్టు ఉంటుంది. ఆ తెరలమీద దూరంగా కోటగోడలూ, అటూ ఇటూ చెట్లూ, దూరంగా ఒక కాలవ, పైన సగం చంద్రుడూ, పలచగా పరుచుకున్న వెన్నెలా కనిపిస్తుంటాయి. నా దృష్టి ఎంతసేపూ ఆ పాటలమీద కాక, అపురూపమైన ఆ మంత్రనగరం మీదనే ఉంటుంది. అందుకనే ఈ సినిమాలో కూడా ‘సవాల్ సవాల్ అను చినదానా, సవాల్ సవాల్ పై సవాల్ ‘ అనే పాట చూస్తూన్నంతసేపూ నేను కూడా ఏదో పూర్వకాలపు గ్రామంలో, ఏదో జక్కుల భాగోతం చూస్తున్నట్టే ఉంది. ఇక ఆ పాట నడుస్తున్నంతసేపూ అంజలీ దేవి ఆశ్చర్యంతో ముంచెత్తుతూనే ఉంది నన్ను .
 
నా చిన్నప్పుడు తారాశంకర్ బందోపాధ్యాయ రాసిన ‘కవి’నవల చదివినప్పుడు అటువంటి లోకమొకటి నా మనసులో చిత్రించుకున్నాను. ‘కవి ‘సినిమాలో కూడా కనిపించని ఆ లోకం మళ్ళా ఈ సినిమాలో ఆ పాట వింటున్నంతసేపూ కనిపిస్తూనే ఉంది. నా చిన్నప్పుడు, మరీ పసివయసులో, మా ఊరు ఏటికవతల జాగరాలమ్మ గుడి ముంగిట ఒక రాత్రి జక్కుల వాళ్ళు భాగవతం ఆడారు. మా అన్నయ్య నన్ను ఆ నాటకం చూడటానికి తీసుకువెళ్ళాడు. పదిమంది కూడా ప్రేక్షకులు లేని ఆ ఆరుబయలు ప్రదర్శనలో ఆ భాగవతులు పూర్తి నాటకం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేరు. ఆ కథ ఏమిటో, ఆ పాత్రలు ఏమి పాడేరో, మాట్లాడేరో నాకేమీ గుర్తు లేదుగానీ, ఆ రాత్రంతా మా మీద ధారాళంగా వర్షించిన వెన్నెల తడి ఇప్పటికీ నా వీపుకి అంటుకునే ఉంది.
 
అందుకే వెళ్ళి వచ్చాను మళ్ళీ ఆ లోకానికి, మా ఊరికి, రాజమండ్రికి, చిదంబరానికి, వరల్డ్ స్పేస్ రేడియో స్టూడియోకి.
 
10-1-2022

Leave a Reply

%d