తొలి తెలుగు శాసనం

A team of epigraphists locating the earliest Telugu inscription at Kalamalla
ఒంటేరు శ్రీనివాసరెడ్డి తెలుగు భాషా ప్రేమికుడు. తెలుగు భాష మీద ఎంత ఇష్టమంటే రాష్ట్రంలో ప్రభుత్వంలోనూ, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోనూ ఉన్న గ్రేడు 2 తెలుగు పండితుల పోస్టుల్ని అప్ గ్రేడ్ చెయ్యడం కోసం అతడు చెయ్యని ప్రయత్నం లేదు. అతడు పట్టిన పట్టు వల్ల రాష్ట్రంలో దాదాపు పదకొండువేలమంది తెలుగు పండితులకి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. ఆ క్రమంలో ఇంకా ఆరేడువందల మంది ఉపాధ్యాయులకి పదోన్నతి మిగిలి ఉంది. వాళ్ళ గురించి నాకో వినతిపత్రం ఇవ్వడం కోసం, పోయిన అక్టోబరులో నేను కడప జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు, నన్ను వచ్చి కలిసాడు. ఆ రోజు పొద్దున్న నేను గండికోట నుంచి బయలుదేరి కలమళ్ళ మీదుగా పొద్దుటూరు వెళ్ళబోతున్నాను. కలమళ్ళ వెళ్ళేదారిలో ఎక్కడో ఒక రెస్టారెంటులో బ్రేక్ ఫాస్ట్ కి ఆగినప్పుడు వచ్చి కలిసాడు. అక్కణ్ణుంచి మేము కలమళ్ళ వెళ్ళినప్పుడు మాతోనే ఉన్నాడు.
 
కడప జిల్లా కలమళ్ళలో తొలి తెలుగు శాసనం దొరికిందనేది తెలుగు సాహిత్యంతో పరిచయమున్నవారికందరికీ తెలిసిందే. ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు అనే ఒక రేనాటి చోడరాజు కాలంలో వేసిన శాసనం. సామాన్య శకం 575 నాటిది. తెలుగు భాషకి లిఖిత రూపం చాలా ప్రాచీన కాలంలోనే ఉన్నదనీ, అది ప్రజల భాషగా కూడా రాజాదరణ పొందిందనీ చెప్పే ఆధారాల్లో అదే ఇప్పటిదాకా మనకి లభిస్తున్న వాటిలో తొలి ఆధారం. కలమళ్ళలో చెన్నకేశవస్వామి ఆలయంలో ఆ శాసనాన్ని 1904 లో మొదటి సారి నకలు తీసారు. ఆ శాసనం దొరికిన ఆ ఊరిని ఒకసారేనా సందర్శించాలనే ఆ రోజు నేను కలమళ్ళ వెళ్ళింది. ఆ రోజు నా పర్యటన విశేషాలు ఇక్కడ ఇంతకుముందు రాసాను కూడా.
 
కాని కలమళ్ళలో తొలి తెలుగు శాసనం ఇప్పుడు లేదనీ, దాన్ని ఎప్పుడో మద్రాసు మూజియంకి తరలించారనీ, అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ బండ ఏమైపోయిందో ఎవరికీ తెలియదనీ తెలుగు సాహిత్య చరిత్రకారులు చెప్తూ వచ్చారు. ఈ వివాదంలో నిజమెంతో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో మిత్రుడు, యువ సాహిత్యవేత్త వేంపల్లి గంగాధర్ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆ శాసనం ఆనుపానుల గురించి సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించాడు. అటువంటి శాసనమేదీ తమదగ్గర లేదని తమిళనాడు ప్రభుత్వం అతడికి రాతపూర్వకంగా సమాధానమిచ్చింది.
 
ఆ రోజు మేము కలమళ్ళ చెన్నకేశవస్వామి ఆలయంలోనూ, ఆ ప్రాంగణంలో నడుస్తున్న పాఠశాల ఆవరణలోనూ, బయటా మూడు శాసనాల్ని చూసాం. అందులో ఒకటి గుడి బయట ఎండకి ఎండి వానకు తడుస్తూ ఉంది. అవి విజయనగరం కాలం నాటి శాసనాలని చెప్పాడు గంగాధర్. అయినప్పటికీ వాటినైనా ఒక చోట భద్రంగా నిలబెట్టి ప్రదర్శిస్తే బావుంటుంది కదా అన్నాను. తొలి తెలుగు శాసనం అక్కడ లభ్యమయిందని కనీసం ఒక బోర్డు రాసి పెట్టినా నలుగురికీ తెలుస్తుంది కదా అన్నాను. ఆ మాటలు శ్రీనివాసరెడ్డి విన్నాడు.
 
చాలా శ్రద్ధగా విన్నాడని ఆ తర్వాత తెలిసింది. నేను తిరిగి విజయవాడ వచ్చేసాక అతడు నాకో మెసేజి పంపించాడు. అందులో ఆ శాసనాల కోసం తానొక మందిరం నిరించబోతున్నట్టుగా చెప్తూ, ఆ మందిరం నమూనా గీయించి పంపాడు. చాలా సంతోషం, తప్పకుండా చెయ్యండి అని జవాబిచ్చాను.
 
నాలుగు రోజుల కిందట, అతడు తాను నిలబెట్టాలనుకుంటున్న శాసనాల గురించి పూర్తిగా తెలుసుకుందామన్న ఉద్దేశంతో నలుగురు పండితుల్ని కలమళ్ళ తీసుకువెళ్ళాడు. డా.కొండా శ్రీనివాసులు నేతృత్వంలో అక్కడకు వెళ్ళిన ఆ బృందంలో డా.అవధానం ఉమామహేశ్వర శాస్త్రి, ఆచార్య సాంబశివారెడ్డి, డా.గజ్జెల వేమనారాయణ రెడ్డి కూడా ఉన్నారు. వారంతా ఎపిగ్రాఫిస్టులు కూడా. ఆ బృందం తమ దగ్గర ఉన్న ఇండియన్ ఎపిగ్రఫీ జర్నల్సులో ఉన్న శాసనాల్ని ఆ గుడి ఆవరణలో పోల్చుకోడానికి ప్రయత్నించారు. వారి లెక్క ప్రకారం ఆరు శాసనాలు ఉండాలి. రోజంతా వెతికితే సాయంకాలానికి అయిదు దొరికాయి. ఆరవది?
 
ఆశ్చర్యం!
 
సాయంకాలానికి వారికి ఆ ఆరో శాసనం కూడా దొరికింది.
 
అదే మనం మాటాడుకుంటున్న శాసనం. మద్రాసుకి తరలిస్తే అక్కడ తప్పిపోయిందని ఇన్నాళ్ళూ భావిస్తూ వచ్చిన శాసనం!
 
తొలితెలుగు శాసనం!
 
ఆ రోజంతా నాకు శ్రీనివాసరెడ్డి ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. నేను రోజంతా ప్రాజెక్టు ఆఫీసర్ల సమావేశంలోనూ, ఆపైన పుస్తక ప్రదర్శనలో వడ్డాది పాపయ్య సంస్మరణ సభలోనూ, ఆ తర్వాత విద్యాశాఖ సమావేశంలోనూ, ఇలా ఆయన ఫొను చేస్తున్నా కూడా జవాబివ్వలేని పరిస్థితిలో ఉండి రాత్రి బాగా పొద్దుపోయాక ఫోన్ ఎత్తితే, ఇదీ వార్త.
 
అప్పటికే నాకు నందివెలుగు ముక్తేశ్వరరావు గారినుండి మెసేజి. తెలుగు భాషాభిమానుల బృందాల్లోనూ, చరిత్ర గ్రూపుల్లోనూ ఈ వార్త వైరల్ అయిపోయింది. రాత్రికల్లా సాయి పాపినేని గారు తమ వాల్ మీద వివరంగా ఒక పోస్టు పెట్టారు.
 
ఆ మర్నాడు అన్ని పత్రికల్లోనూ అది పతాకశీర్షిక అవుతుందనీ, సమాచార ప్రసార మాధ్యమాల్లో లైవ్ డిబేట్లు మొదలవుతాయనీ అనుకున్నానుగానీ, మర్నాడు ఎప్పట్లానే తెల్లారింది.
ఇదే ఐర్లండ్ లోనో, జపాన్ లోనో కనీసం తమిళనాడులోనో జరిగి ఉంటే ఈ పాటికి ప్రపంచమంతా దీని గురించే మాటాడుకుంటూ ఉండేవారు. కాని ఇది తెలుగు నేల. ఇక్కడ మనకు సినిమా నటులే ఆరాధ్యదైవాలు. వారి ప్రైవేటు జీవితాల గురించిన లీకులు మనల్ని ఉద్రేకపరిచినంతగా మరేవీ ఉద్రేకించవు.
 
కాని, పదిహేడు శతాబ్దాల కింద రాతి మీద చెక్కిన తెలుగు అక్షరాలు తెలుగు సీమలో, తెలుగు నేలమీదనే నిలిచి ఉన్నాయన్న సంగతి విని హృదయం ఉప్పొంగే వాళ్ళు కొందరేనా ఉన్నారు. వారందరూ ఒంటేరు శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞులుగా ఉంటారు. వారిలో ఎవరో ఒకరు అక్కడ కలమళ్ళలో ఆ శాసనాల్ని నిలబెట్టడానికి ఒక మందిరం నిర్మాణానికి ఎంతో కొంత చేయందించక పోరు కూడా.
 
9-1-2022
 

Leave a Reply

%d bloggers like this: