బూజంటని పద్యాలు

Goldie

వాళ్ళిద్దరూ పూర్వజన్మలో అన్నాతమ్ముడూ. లేదా తండ్రీ కూతురూ లేదా తల్లీకొడుకూ. అప్పుడు మేమంతా ఒకవూళ్ళో ఉండేవాళ్ళం. వాళ్ళు కలిసి కవిత్వం చదువుకునేవారు. అప్పుడప్పుడు ఆ పద్యాలు నా చెవిన కూడా పడేవి. ఆ బంధమేదో ఇప్పటికీ నన్ను వదల్లేదు. లేకపోతే ఏమిటి! ఈ పద్యాలకి నేనే ముందుమాట రాయాలని ఈ కవి ఇన్నాళ్ళు నా మాటలకోసం ఎదురుచూడటం!

ఇవి మామూలు పద్యాలు కావు. బూజంటని పద్యాలు. ఇందులో చూడవలసింది గణయతిప్రాసల కోసం కాదు, పద్యాన్ని ప్రేమించిన కవుల్ని ప్రేమించకుండా ఉండలేని జీవలక్షణం ఏ పూర్వజన్మలనుంచో మోసుకొచ్చిన రసజ్ఞతని చూడాలి.

పద్యంలో మద్యం కలిపిరి

హృదయంగా మన పూర్వకవులదేమో చిత్రం

సద్యోరసానుభవ నై

వేద్యంరా మన తెలుగు కవిత్వం.

అని అననే అన్నాడు. పద్యం ఇప్పుడెందుకు అనేవాళ్ళకి జవాబుగా ‘పద్యానికి మద్యానికి ఆద్యంతాలుండవు కద’ అని కూడా అన్నాడు.

ఏ జన్మలనుంచో తనకీ మరో ప్రాణికీ కొనసాగుతున్న అకలంకానుబంధం, తనకీ పద్యానికీ మధ్య తెంచుకోలేనంతగా ముడిబడ్డ రసాభ్యుచితబంధం- ఈ రెండూ కలిసి ఈ కావ్యంగా రూపుదిద్దుకున్నాయి. ఏ అతీతకాలంలోనో ఆ రెండు బంధాలకీ సాక్షిగా       ఉండిఉంటాను కాబట్టి, ఇప్పుడు ఈ మైత్రినిట్లా ప్రశంసించే భాగ్యం నన్ను వెతుక్కుంటూ వచ్చింది.

2

కవి అందరికన్నా ముందు మనిషి. అందరికన్నా సున్నితమైన మనిషి, లోతైన మనిషి. అందరికన్నా బలవంతుడు, అందరికన్నా బలహీనుడు. అతడి హృదయంలో గూడుకట్టుకున్న జననాంతర సౌహృదాల్ని మేల్కొల్పటానికి రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చే కప్పురవిడెమే కానక్కరలేదు, ఒక కుక్కపిల్ల చాలు, నీలోకి చూస్తూ తనలోతు కనుక్కోమంటుంది అన్నాడు మహాకవి. లక్షణవాక్యంలాంటి ఆ మాటలకి లక్ష్యకావ్యంలాంటిదీ పద్యప్రబంధం.

ఇందులో వర్ణితమయింది వట్టి స్నేహం కాదు. ఆ స్నేహం  తనకు చూపించిపెట్టిన సంతోష సౌందర్యాలూ, తనలో వికసింపచేసిన వివేక, వైరాగ్యాలూను. తన మిత్రుడు కవితో అనుక్షణం, అనుదినం ఏదో సంభాషిస్తోనే ఉన్నాడు. ఆ భాష కవికి మాత్రమే అర్థమవుతున్నది. దాన్ని తిరిగి కవి తెలుగులో మనకి అందివ్వడం మన భాగ్యం. ఎందుకంటే,  ఒక మనిషికి లభించిన ఆనందంలో సమస్త మానవజాతికీ వాటా ఉంది కదా.

కవికి తన మిత్రుడు కవీ, పాఠకుడూ కూడా. ‘అతడు కంఠం సవరిస్తే’ తనకో కవితరాసినట్టనిపిస్తుంది. తాను ‘కిరణాలు పట్టి కవితా చరణాలుగా రాసుకునే సాయంకాలాల్లో’ ఆ మిత్రుడు తనను చదివే సహృదయుడు. అతడు పద్యం కూడా. ‘ఆకాశంఫ్రేములో రాకాశశి వెలిగినట్టు రసకందంలో కట్టిన పటం’. అతడు మొత్తం ‘బతుకుని తెలిపే పొత్తం’ కూడా. ఇక అన్నిటికీ మించి ఆ మిత్రుడు ‘శోకం తీర్చే శ్లోకంలా ఆదుకున్న ఋషి!’

కవి ఇన్నాళ్ళూ వర్గస్పృహతో పద్యాలు రాయడం సాధనచేసాడు. ఎందుకంటే ‘ఏ యుగమందున్నామో ఆ యుగధర్మానికున్న ఆకాంక్షలు’ వ్యక్తం చేయడం కవి బాధ్యత కాబట్టి. కానీ ఈ పద్యాల్లో ‘వర్గాలు లేని సుందర స్వర్గాల’ వైపు ప్రయాణించేడు. తానేదో విరచిస్తే తన కవితల్లో లోకం ప్రతిఫలిస్తుందని ఆశించాడు మహాకవి. ఈ కవి తాను విరచిస్తే తన నవనాడుల రహస్యకాంతుల్లో మానవుడే ధ్వనిస్తాడని చెప్పుకుంటున్నాడు. ఈ స్నేహం అతడి నవనాడుల్లోంచీ మానవత్వాన్ని మరింత వెలారిస్తున్నది. ‘సహజీవన సంస్కృతికే తన చివరి ఓటు’ అని కవితో చెప్పిస్తున్నది. అతడిలో ఆ మానవత్వాన్ని మరింత శోభింపచేసిన ఆ మిత్రుడు నా కళ్ళకు గొప్ప మానవుడిగా కనిపిస్తున్నాడు.

నీ మిత్రుడు మనిషినా, తిర్యక్కునా అన్నదాంతో నాకేం పని? నీ ప్రేయసినో, నీ తోటికవినో నిన్ను నువ్వున్నచోటనే   ఉండిపొమ్మని శాసిస్తూ సంకెలలు తగిలిస్తున్నప్పుడు, నీ పెంపుడు పుత్రుడు నిన్ను నదిలా ప్రవహించమని చెప్తున్నాడే, అదిగో, అది నాకు వేదవాక్యంలాగా వినిపిస్తున్నది. ‘అతడితో స్నేహం వల్లనే భూతదయ హృదయంలో నిండిపోయింది’ అని నువ్వు చెప్తున్నప్పుడు అటువంటి మిత్రుడు నాక్కూడా ఉంటే బాగుణ్ణనిపిస్తున్నది.

ఎట్లాంటి విశేషణాలు వాడావు నువ్వు నీ మిత్రుడికి: అతడు నీకు ‘ఆయువుపట్ట’ట. ‘రాయిని రత్నం చేసిన మాయాగేయమ’ట. ‘నవ్వుల వ్యాకరణమ’ట. తన ‘దృక్కులతో నిన్ను చెకచెకా చెక్కే శిల్పి’యట.  ఏ రహస్య గమ్యంకోసమో ఇలకి వచ్చిన ఆ మిత్రుడి ‘స్వాధ్యాయపు వీక్షణాలు’ ‘అధ్యయనం చేసే కొద్దీ ఆధ్యాత్మిక కనుల’ట. అతడు నువ్వు ‘అదిలించినా వదిలించినా వడలని నీడ’అట. అతడికీ నీకూ మధ్య పెంపొందిన ఆ బాంధవ్యాన్ని నువ్వెత్తిచెప్పిన ప్రతిసారీ అదొక సుశ్లోకమే. ఎటువంటి మాటలు పలికించాడు అతడు నీతో! ఆ ‘చూపుల్లో చెరుకురసముంద’ట. అది ‘లిపిలేని, శబ్దమెరుగని అపురూపపు మౌనభాష’ట. అతడు నీ ‘మదిని చుట్టిన మోహన మాయగొలుసు’ అట. చివరికి అతడు ‘కవి పట్టిన బంగారమ’ట. ‘ఆత్మకు దొరికిన ఇంత స్పృహ!’ అట.

అప్పుడు మీరూ నేనూ కలిసి నివసించిన ఆ గ్రామాన్ని గుర్తుపట్టడానికి కొన్ని మాటలు దొరికాయి నాకీ పద్యాల్లో. ‘వస్తూ పోయే సూర్యుడు కస్తూరిని రాల్చిన ధవళకాంతులు’, ‘బాల్కనిలో సాయంత్రపు ఆల్కెమి’, ‘అటు ఇటు నింగిన పూచిన మాఘసంధ్యల చటులాలంకృతులు’, ‘చంద్రుడు మసకబారే సమయాలు’, ‘రోజూ సూర్యుడు విసిరే తాజా నీరెండవల’ నన్ను కూడా ఆ లోకానికి నడిపిస్తున్నవి. మీలాగే నాక్కూడా ‘పొగమంచు పాట’ రాయాలనీ, ‘గగనంలో సీతాకోక చిలుకల్లా ఎగరాలనీ’ మక్కువవుతున్నది.

3

ఇవి కందాలో, మధుర రసనిష్యందాలో నాకు తెలియదుగానీ, ఇటువంటి పద్యాలు చదువుతుంటే నా మనసుకేదో చెప్పలేని స్వస్థత చేకూరుతున్నదనీ, మీక్కూడా చేకూరగలదనీ చెప్పగలను.

ఒకనితో జతకట్టిన

సకలావరణాల సఖ్యతపైన సఖ్యత కుదిరెన్‌

శుకపిక జీవాదులపై

అకలంక ప్రేమ కలిగెనయ్యా గోల్డీ.

సకుటుంబ సమేతంగా

ప్రకటనచేస్తాను జీవరాశులలో యే

ఒకటో మన దరిచేరిన

ఇక ఈ బతుకు పరిపూర్ణమేరా గోల్డీ.

సుమతీ శతకం మాదిరి

విమలామృత ప్రజలవాణి వేమనలాగే

అమరం నీ కథ, నాలో

తిమిరం నిన్నంటి తేటదీరును గోల్డీ.

19 డిసెంబరు 2021

2 Replies to “బూజంటని పద్యాలు”

Leave a Reply

%d bloggers like this: