కొండ కింద పల్లె

KONDA KINDA PALLE

కొండ కింద పల్లె నా కవిత్వ సంపుటాల్లో ఏడవది. కరోనా కాలంవల్ల పుస్తకావిష్కరణ సభ అంటూ పెట్టలేదు. నా కవిత్వాన్ని ఇష్టపడే వాసుకి ఈ పుస్తకం కానుక చేసాను. ఆయన దీన్ని వెంటనే చదివి ఆనందంగా పలవరిస్తూ తన వాల్ మీద ఆవిష్కరించేడు. ఇప్పుడు ఈ పుస్తకం కావాలనుకున్నవాళ్ళు విజయవాడ బుక్ ఫెస్టివల్ లో ఎమెస్కో స్టాల్ లో చూడవచ్చు. పి డి ఎఫ్ చాలనుకునేవాళ్ళు ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

దృష్టాధ్వగమనం

ఓంప్రథమంగా ఒక ఋగ్వేదమంత్రం:

“ఉపహ్వరే గిరీణామ్ సంగథే చ నదీనామ్

ధియా విప్రో అజాయత.”

(ఋగ్వేదం, 8.6.28)

(“In a remote place of the mountains and at the conjunction of the rivers, the inspired poet was born with insight.” – Trans. Brereton & Jamison)

1

ఈ మంత్రం కొండ కింద పల్లెలో పుట్టిన వాడ్రేవు చినవీరభద్రుడికి అన్వయిస్తుంది. పై మంత్రంలోలేనిదీ, మనకు తెలిసిన విషయమల్లా ఏంటంటే, చినవీరభద్రుడు 1963లో పుట్టాడు. అక్కడుంది ఈ కవిత్వ నేపథ్యంలోని సింహభాగం. ఆ తరం (అంటే నా తరం) కవులందర్లాగే చినవీరభద్రుడూ పురాణాలు, కావ్యాలు, వేదాంతం, అభ్యుదయ, విప్లవ సాహిత్యాలు చదువుతూ పెరిగీ తనొక పరివ్రాజకుడో విప్లవకారుడో అవాలని ఉవ్విళ్ళూరాడు. ఆకటి చీకటి చిచ్చుల హాహాకారలూ ఆర్తారావాలు అందరూ ప్రతిదినమూ విన్న రోజులవి. అయితే, జీవికకై ప్రభుత్వోద్యోగం చేపట్టిన చినవీరభద్రుడిని తను పుట్టిన పల్లెటూరే గెల్చుకుంది. తాటాకుల ఇల్లు, వాకిలి, భళ్ళున తెల్లారగానే పక్షుల కిలకిలారావాలు, పొలం వెళ్ళే రైతులు, పంటలు, చలిమంటల చుట్టూ చేరి నలుగురు మాట్లాడుకునే పండగ సందర్భాలు, నలుగురూ నాట్యమాడే జాతరలు చినవీరభద్రుడిని పూర్తిగా వశం చేసుకున్నాయి. శ్రమైకజీవనసౌందర్యమేగానీ surplus value కానంబడని పల్లె. అక్కడికి ట్రాక్టర్‌లు పంటనెత్తుకుపోవడానికే వస్తాయి, పొలం దున్నడానికి కాదు. అది హాలికుల పల్లె.

గహనాంతరసీమకందమూలకౌద్దాలికుల పల్లె. నిజదారసుతోదరపోషణను మాత్రం ఆశించే “ప్రాచీన”, “ఆదిమ” మనుషుల పల్లె. దేవతలు పదేపదే ప్రత్యక్షమయ్యే పల్లె. ప్రకృతిలో మానవాళి ఏర్పరుచుకున్న తొలి ఆవాసస్థానమైన పల్లె. నిజానికి అక్కడ వస్తు మార్పిళ్ళ వ్యాపారస్తుల సంఖ్య కన్నా, ఈ దేవతల సంఖ్యే ఎక్కువ. అదుగో ఆ దేవతలను కొలవడం వల్లనూ వారి కరుణారసవృష్టిలో రోజూ తడవడంవల్లనూ చినవీరభద్రుడు ఇంతటి కవి కాగలిగాడు, తనలో పోరాటాలబాట పట్టలేకపోయాననే guilt కాస్త కనిపిస్తున్నా, కవి కాగలగడం సొంతూరు పెట్టిన భిక్షే. అక్కడి దేవతలు ప్రసన్నలు కావడమే. పల్లెను వీడిన తరువాతనే చినవీరభద్రుడు “ఒక ప్రాచీన భాషలో మాటలకోసం” తడుముకున్నాడు. ఇప్పుడు మనమా భాషలో కవి నిక్షేపించిన రహస్యాలనూ కవినీ వెతికి పట్టుకుందాం.

2

ఏనాడు నేనీ పల్లెకి దూరమై

ఏనాడు నేనీ పల్లెకి దూరమై

ఏనాడు నేనీ పల్లెకి దూరమై

ఏనాడు నేనీ పల్లెకి దూరమై

(“కొండ కింద పల్లె”, Title Poem),

ఎవరో ఎత్తుకున్న చంటిబిడ్డ అమ్మ చేతుల్లోకి మళ్ళీ జారుకున్నట్టుగానే.

ఈ “కొండ కింద పల్లె” చినవీరభద్రుడి “ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ”, “పునర్యానం”, “కొండ మీద అతిథి” వంటి కావ్యాలకు continuation, అదే దృష్టాధ్వగమనం. ఇదీ సాహసమే, ఈ సాహసం అందరూ చేయలేరు. చొక్కా మార్చినట్టు (వాసాంసి జీర్ణాని) కవిత్వ సందర్భాలను మార్చగలరు, మన కవులు. మహాకవులు తమ మార్గాలను విశాలం చేస్తూ మనకు నాలుగు అడుగుజాడలు చూపుతారు. అదుగో, ఆ కోవకు చెందిన కవి మన చినవీరభద్రుడు.

నేనెవరికీ ఏ స్వాతంత్ర్యాన్నీ వాగ్దానం చెయ్యలేను

కనిపించని ఊడిగాల్ని కనుక్కోవడమే నా దృష్టంతా

(Title poem)

ఇదీ చినవీరభద్రుడి విశిష్టత. కనిపించే ఊడిగాల్ని ప్రశ్నించేవారు చాలామంది ఉన్నారు మనకు. ఈ కనిపించని ఊడిగాల్నే చినవీరభద్రుడు “ప్లాట్‌ఫామ్ మీద పోర్టర్”లతో పోల్చాడు. “హైదరాబాద్:రెండు పద్యాలు”లో (ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ).

మన అలవాటుని ఎవడు భగ్నం చేస్తాడో వాడు కవి.

(“అర్ధరాత్రి పొలాలమీద”)

ఇదెంత నిజం! చినవీరభద్రుడైనా Salvatore Quasimodo అయినా, మనకు బలవత్ ఝరవత్ పరివర్తనను కలిగించిన ఎవరైనా మనకు సన్నిహితులౌతారు. నా మటుకు, చినవీరభద్రుడి “ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ” అటువంటి defining moment!

చినవీరభద్రుడి కవిత్వపు టెక్నిక్‌ని నింపాదిగా విశ్లేషించదలుచుకుంటే, ఈ కావ్యంలో ఎన్నైనా కవితాఖండికలూ, పంక్తులూ దొరుకుతాయి, “మాటలోకి ఆవేశం ప్రవేశించిన అద్భుతక్షణాల” సముదాయమే ఈ కావ్యం. ఇంకా, పల్లె వీడి విద్యుద్దీపాల వింత నగరానికొచ్చిన పిల్లవాడి అనుభవాల్లో ప్రకృతి ఎలా అమ్ముడుపోయిందీ, మనిషికీ మనిషికీ మధ్య తరాజుల చొరబాటు చిన్నబోయి పరిమాణాన్ని మార్చుకోవడమూ ఇందులో ప్రతిఫలిస్తుంది. ఎంత మహానగరంలోనైనా ఒక గుడి, ఒక మహావృక్షం, ఒక మల్లెపొద ఎప్పుడో కనిపించకమానవు. అవి పల్లె జ్ఞాపకాల తునకలే అయినా ఆ “అసీమిత నీలిమ” వల్ల కవి మళ్ళీ పల్లెలోకే జారుకుంటాడు.

టెక్నిక్ కోసమా? చూడండి:

ఇప్పుడు మనమా కాలాల్ని గుర్తుపట్టేది

ఆ రంగుతునకల్తోటే.”

(అభిజ్ఞాన శాకుంతలం)

“ఉరుము మాట్లాడుతున్నంతసేపూ

నువ్వు చెవుల్తో కాదు,

స్మృతుల్తో వినడం మొదలుపెడతావు.”

(ఉరుము చెప్పింది)

“దోసిళ్ళతో పట్టాలని చూసిన వడగళ్ళలాగా

కవితగా మార్చేలోపే ఆ కాంతి కరిగిపోతుంది.

(చెరకు తోటల్లో కోతలు)

మన కనిపించని ఊడిగాల వల్ల మనమే నష్టపోయిన వైనం:

“సిలువ వేసాక క్రీస్తు అంగీని చీట్లువేసి పంచుకున్నట్టు

పక్షుల స్వర్గాన్ని మనుషులు

ప్రజాస్వామికంగా ఆక్రమించుకున్నారు.”

(పెలికాన్ పారడైజ్, ఆటపాక, కొల్లేరు)

దైవంపై మనిషి నమ్మకం సరే, మనిషిమీద ఇంకా దైవానికి నమ్మకం పోలేదనడానికి నిదర్శనం:

“అక్కడ భగవంతుడి సత్రం లాగా

ఒక మల్లెపొద.”

(ఒక మల్లెపొద).

“అడవి కోసం ఊరూ,

ఊరి కోసం అడివీ-

ఎంతకీ తెమలని ముస్తాబు”

(రాజవొమ్మంగిలో…).

ఆ ముస్తాబు తెమిలిందా, రెండూ తేలిపోతాయి, వెలుతురులో కరిగిపోతాయి.

“నా చిన్నప్పుడు

ఈ తీర్థం నుంచి ఒక ఈల తెచ్చారు

పెద్దయ్యాక నేనీ

కవితనిస్తున్నాను.”

(రాజవొమ్మంగిలో…).

Distant thunder!.

“ఎంత చేసీ ఈ నగరం

ఆ మామిడి పళ్ళని

రెండు కేజీలకి కుదించలేకపోయింది.”

(నడివేసవి మధ్యాహ్నం).

ఈ తరాజుల నగరం పల్లెని కొలవగలదా, మన పిచ్చిగానీ!

“నలుగురు ఎక్కడ కూడితే

అక్కడ కరచాలనాల్లో ఆలింగనాల్లో

అత్తరు ప్రవహిస్తుంది.”

(గ్రీష్మ ఋతువులో రంజాన్).

మనుషుల కలయికలోనే సామూహిక నిశ్శబ్దప్రార్థనలోనే దైవం ప్రత్యక్షమౌతుంది.

“కలిసి పనిచేసిన క్షణాలు, సంపద సృష్టించే క్షణాలు,

సంఘంగా మారిన క్షణాలు,

అయ్యో, అవే నేను మనిషిగా రూపొందుతున్న క్షణాలు

సంఘంగా మారిన క్షణాలు కాకుండా పోతున్నవి.”

(ఒక మార్గశిర మధ్యాహ్నం).

ఏదో కనిపించని ఊడిగం అన్నాడు కదా కవి, ఈ ఆవేదనలోనే ఆ ఊడిగమేదో తెలుసుకోవాలి.

“నా ఉన్మత్త అధ్యాయం చివరి పుట మూసేసాను.” (అరూప అనుగ్రహం).

ఇక్కడ కాస్త వెనక్కి తిరిగి చూద్దాం. “కవిత అందరింటికీ రాదు. నేను ఉన్మత్తుణ్ణి ముందే” అని “పునర్యానం”లో చినవీరభద్రుడు చెప్పుకున్నాడు. దీని భావమేమి తిరుమలేశ అనుకోకుండా, కవి ఎక్కుతున్న మెట్లు చూడాలిక్కడ. మెట్లు ఎక్కుతున్నాడా లేక దిగుతున్నాడా? అతన్నే అడగక్కర్లేదు, ఎందుకంటే రెండూ అభేదాలు.

వాడ్రేవు చినవీరభద్రుడి కవితాప్రస్థానంలో సంగీతం, బుగ్గలపై చారికలు విడిచే సొంతూరి దిగులు, హృదయంలో ఊరి తునకలు నింపిన సంతసమూ ఉండడంవల్ల నగరంలో బతుకునీడుస్తున్నా, చినవీరభద్రుడు పెదవీరభద్రుడు కాకుండా తన కవిత్వమే తనను కాపాడింది.

3

కొండ కింద పల్లె లో ఒక్క అచ్చుతప్పు లేదు (నాకు అచ్చుతప్పు కనిపిస్తే కళ్ళు నొప్పెడతాయి). ఒక్క అతుక్కోని పదబంధం లేదు. కవితల్లో వాడిన కొన్ని మాటలకు చివర్న వివరణలున్నాయి. హాయిగా చదువుకున్నాను. మీరూ చదవండి.

న్యాయపతి శ్రీనివాసరావు
బెంగలూరు, 20-7-2021

One Reply to “కొండ కింద పల్లె”

  1. ఎన్నో అమూల్యమైన పుస్తకాలు చదివాను మీ సమీక్షలు పుణ్యమా అని, ఎన్నో ప్రదేశాల విశేషాలు, ఆచారాలు,యాసలు, భాషల సంగతులు తెలిసాయి మీ యాత్రానుభవాల్లో, ఎందరో విశిష్ట కవుల, దేవాలయాల, సమగ్ర సమాచారం దొరికింది మీ రాతల్లో, అందుకే మేదొక గొప్ప స్ధానం మా మనసుల్లో. అభినందనలు sir.

Leave a Reply

%d bloggers like this: