సూరసముద్రం

స్నానం లేదు, సంధ్య లేదు. రాత్రి సూర్ సాగర్ చదువుతూ పడుకునిపోయినవాణ్ణి మళ్ళా నిద్రలేస్తూనే సూర్ సాగర్ లో మునిగిపోయాను. మా మాష్టారు అనేవారట, ఒక్కొక్క రోజు, మా అక్క చెప్పేది, అమ్మా ఈ రోజు నాకూ స్నానం లేదు, నా దేవుడికీ స్నానం లేదు అని. శివుడికి అభిషేకం చెయ్యందే ఆయన రోజు మొదలయ్యేది కాదు. కాని ఒక్కొక్కప్పుడు, బహుశా, ఏ కృష్ణకర్ణామృతమో చేతిలో ఉన్నప్పుడు, శివుడికి కూడా స్నానం ఉండదు. ఈ రోజు నా పరిస్థితీ అంతే.
 
అసలు కృష్ణుడితో ఉన్న చిక్కే ఇది. ఆయన అన్నిటికన్నా ముందు నీ దైనందిన జీవితాన్ని భగ్నం చేస్తాడు. నీది నీది కాకుండా చేస్తాడు. ఈ రోజైతే కనీసం ఒక్కసారేనా, కనీసం క్షణం పాటేనా, ఈ ఉద్యోగమూ, సద్యోగమూ వదిలి, ఈ గీతాలు చదువుకుంటూ గడిపెయ్యాలనిపించింది.
 
సూర్ సాగర్ ప్రసిద్ధ హిందీ భక్తి కవి సూర్ దాస్ కృష్ణలీలా గీతాల సంపుటం. సూర్ దాస్ రాసినవిగా ప్రచలితంగా ఉన్న దాదాపు అయిదారువేల గీతాలనుంచి ఆ గీతాల్లో తొలిగీతాల్ని కెన్నెత్ బ్రైంట్ అనే ఆయన ఎంపికచేసాడు. కబీర్ లానే, వేమనలానే ఒక సూరదాస్ రాసిన ఒక సంపుటమంటూ ఏదీ తేల్చలేం. అందుకని ఆ తొలిగీతాల్ని కూడా ఆయన ఎవరో ఒక్క సూర దాస్ రాసిన గీతాలుగా చెప్పకుండా సూర్ సంప్రదాయానికి చెందిన తొలిగీతాలని మాత్రమే పేర్కొన్నాడు.
 
ఆ విధంగా Kenneth E Bryant ఎంపిక చేసిన మొత్తం 433 పదాల్ని John Stratton Hawley అనే ఆయన ఇంగ్లిషులోకి అనువదించాడు. ఆ అనువాదాన్ని మూర్తి క్లాసికల్ లైబ్రరీ వారు Sur’s Ocean: Poems from the Early Tradition (2015) పేరిట ప్రచురించారు. ఈ పుస్తకం కొనుక్కుని అయిదారేళ్ళు కావొస్తున్నా నిన్ననే తెరిచాను.
 
ఇన్నాళ్ళూ ఎందుకు తెరవలేదంటే, ఇదిగో, ఇందుకే, సూర్ నీ, మీరా నీ, లీలాశుకుణ్ణీ, నమ్మాళ్వారునీ, చండీదాస్ నీ తెరిచిన తర్వాత నువ్వు నువ్వు కాకుండా పోతావు. ఆ సముద్రాన్ని తెరిచి పెట్టుకున్నతరువాత, మళ్ళా ఫైళ్ళూ, మీటింగులూ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లూ అంటే కుదరదు. ఇదిగో, ఆ పీతాంబర ధారి కనబడ్డాక తన జీవితం ఎలా అయిపోయిందో సూరదాస్ నే స్వయంగా చెప్తున్నాడు:
 
బలి బలి మోహన మూరత్ కీ బలి
బలి కుండల్ బలి నైన బిసాల్
 
బలి భోహైన్ బలి తిలక్ కీ సోభా
బలి మురలీ బలి సబద్ దసాల్
 
బలి కుంతల్ బలి పాగ్ కీ సోభా
బలి కపోల్ బలి ఉర బన్ మాలా
 
బలి యహ్ దరస్ బ్రహ్మాదిక్ మోహే
బలి ఉపరైనా గిరిధర్ లాల్
 
బలి వై భుజా సషా గ్రీవా మిలి
బలి కుల్ స్యామసుందర్ కీ చాల్
 
బలి వహ్ కాఛ్ పీత పట్ బాంధై
సూరదాస్ బలి మదన గుపాల్ (72)
 
(ఆ మోహన మూర్తికి నా ఆత్మార్పణ, నా సర్వసమర్పణ. ఆ కుండలాలకి నా సమర్పణ, ఆ విశాలనేత్రాలకి నా సమర్పణ. ఆ కనుబొమలకి నా సమర్పణ, ఆ కస్తూరి తిలక శోభకు నా సమర్పణ. ఆ మురళికి నా సమర్పణ, ఆ వేణుగానానికి నా సమర్పణ. ఆ ముంగురులకు నా సమర్పణ, కలకల్లాడే ఆ తలపాగాకి నా సమర్పణ. ఆ చెక్కిళ్ళకి, ఆ ఉరస్థలాన వేలాడే ఆ వనమాలకి నా సమర్పణ. బ్రహ్మాదిదేవతలందరినీ సమ్మోహపరిచే ఆ దర్శనానికి నా సమర్పణ. ఆ గిరిధారి తనువుని అలంకరించిన ఉత్తరీయానికి నా సమర్పణ. స్నేహితుల కంఠాలచుట్టూ పెనవేసుకున్న ఆ బాహువులకి సమర్పణ. శ్యామసుందరుడు తన గోకులంతో కలిసి వచ్చే ఆ అడవి దారికి నా సమర్పణ, కటిబంధంగా అలరారుతున్న ఆ పీతాంబరానికి నా సమర్పణ. సూరదాస్ చెప్తున్నాడు, ఆ మదనగోపాలుడికి నా సంపూర్ణ సమర్పణ.)
 
ఈ అనువాదకుడి హాలీ సంగతే తీసుకుందాం. ఆయన తన జీవితంలో నలభయ్యేళ్ళు ఈ అనువాదానికి ధారపోసాడు. ఈ కవితల్లో కొన్నింటిని గతంలో The Memory of Love: Suradas Sings to Krishna (2009) పేరిట తీసుకువచ్చాడు. కెన్నెత్ బ్రైంట్ సంకలనం చేసిన మొత్తం కవితల్లో మూడవ వంతు కవితలకి అనువాదంతో పాటు సుదీర్ఘమైన పరిచయ వ్యాసం కూడా ఉంది ఆ పుస్తకంలో. కాని ఇప్పుడు మూర్తి క్లాసికల్ లైబ్రరీ వారి ఉపాదానంగా మొత్తం సముద్రాన్నే మనకు కానుక చేసాడు.
 
2009 లో వెలువరించిన పుస్తకానికి Memory of Love అని ఎందుకు పేరుపెట్టాడు? అది సూర దాస్ రాసిన రామకథాపదాల్లోని ఒక పదంలోని మాట. ఆ పదమిట్లా ఉంది:
 
మేరౌ కౌ తౌ వినతీ కీబీ
 
పహిలై నావుఁ సునాయీ పాయీ పరి
మని రఘునాథ హాథ లై దీబీ
 
మందాకిని తట ఫటిక సిలా పర్
సుమిరత సురతి హోతి ఉర్ అరనీ
 
కహా కహూ కపి కహై బనై అబ్
ముష ముష జోరి తిలక్ కీ కరనీ
 
తుం హనవంత పునీత పవన సుత
కహియౌ జాయి జు హై మైఁ బరనీ
 
సూర్ సునైనని ఆని దిషావహు
మూరతి దుసహ దోష దుష హరనీ.
 
(కపివరా, నేను చెప్పదలుచుకున్నదింతే. ముందు నా పేరు చెప్పు, అప్పుడు ఆ పాదాలకు మొక్కు, ఆ పైన, ఇదిగో, ఈ మణిని రఘునాథుడి హస్తాలకి అందించు. ఆ మందాకినీ తీరాన, ఆ స్ఫటిక శిలాతలాన, ఆ సురతిస్మరణ నా గుండెకి అడ్డుపడుతోంది. నేనెట్లా చెప్పేది? చెప్పాలంటే అదిప్పుడు జరిగినట్టే అనిపిస్తుంది. నా నుదుట తిలకం దిద్దడానికి ఆ ముఖం, నా ముఖం ఒక్కటైన ఆ క్షణం. హనుమంతా, నువ్వు వాయుపుత్రుడివి, వెళ్ళు, వెళ్ళి నేను తలచుకుంటున్న ఈ క్షణాన్ని ఆయనకు వివరించి, ఆ మూర్తి నా కళ్ళముందు ప్రత్యక్షమయ్యేలా చూడు, ఆ వదనం, భరించలేని దుఃఖాన్నీ, దోషాన్నీ తుడిచిపెట్టేసే ఆ వదనం ప్రత్యక్షమయ్యేలా చూడు).
 
ఉహు. నా వాక్యాలు సూరదాస్ హృదయాన్ని వివరించలేకపోతున్నాయని నాకు అర్థమవుతున్నది. ఈ కవితలో సీతమ్మ ఏమి చెప్పాలనుకున్నదో అది చెప్పనే లేదు. ఆ చెప్పాలనుకున్నదాన్ని చెప్పలేకపోవడమే సూరదాస్ ని నా ముందు ఆకాశమంత ఎత్తు నిలబెడుతున్నది. ఒకప్పుడు మందాకినీ నదిలో రాముడూ, సీతా జలక్రీడలాడారు. ఆ ఆటలో తడిసిన సీతమ్మ నుదుట తిలకం చెదిరింది. అప్పుడు రఘునాథుడు ఆ స్ఫటిక శిలాతలం నుంచి ఇంత రంగు తీసి ఆమె నుదుటన తిలకం దిద్దాలనుకున్నాడు. ఆమె మోముకి తన ముఖాన్ని దగ్గరగా తీసుకువెళ్ళాడు. తిలకం దిద్దాలంటే కదలకూడదు కదా, ఇద్దరూ కదలకూడదు. ఒకరి ముఖానికి మరొకరి ముఖం చేరువచేసిన ఆ క్షణాన, ఇద్దరి తనువులూ ఒకరికొకరు సన్నిహితమైన ఆ క్షణం, ఆమె కదలకుండా నిల్చున్నప్పుడు, ఆయన కూడా తాను కదలకుండా తిలకం మాత్రమే దిద్దడానికి ఉపక్రమిస్తున్న ఆ క్షణం- అంతకు మించి తాను చెప్పలేననన్నది, సీతమ్మ, తాను కూడా చెప్పలేకపోయాడు సూర దాస్.
 
ఒక విదేశీయుడు ఇంతగా రామహృదయాన్ని, సూరసహృదయాన్ని ఎట్లా సమీపించగలిగాడు! కృష్ణుడనే పరసవేది ఎవర్ని సోకితే వారు బంగారమైపోతారన్నమాట!
 
సూర్ సాగర్ నిజంగా సముద్రం. అది ఒక సెలవురోజున, ఆ సెలవుదినం కృష్ణాష్టమి అయినా సరే, తొందర తొందరగా చదువుకుపోయేది కాదు. నువ్వట్లా ఆ సముద్రం ఎదట నిలబడ్డప్పుడు, ఆ కెరటాలు సుదూరనీలం నుంచీ నీ దాకా ప్రవహించి నీ ఎదటనే ఎగిసిపడుతున్నప్పుడు, తక్కినవన్నీ మరిచి నువ్వా అఖండ నీలిమనే ఎట్లా సందర్శిస్తూ ఉంటావో, ఎట్లా సంభావిస్తో ఉంటావో, అట్లా నీ జీవితాన్ని పక్కన పెట్టి, నువ్వు విలువైనవీ, ముఖ్యమైనవీ అనుకుంటున్నవన్నీ పక్కన పెట్టి ఆ సముద్రానికి నిన్ను నువ్వు పూర్తిగా ఇచ్చేసుకోవాలి.
 
అది ఏమి రహస్యమో, ఏమి విశేషమో తెలియదు గాని, ఆ శ్రీకృష్ణుణ్ణి వర్ణించడానికి భాగవతకర్త ఏ భాషని ఎంచుకున్నాడో గాని, ఆ భాష, సంస్కృతంలో, తెలుగులో, తమిళంలో, బ్రజ్ లో, మైథిలో, రాజస్తానీలో, చివరికి ఇంగ్లిషులో కూడా ఒక్కలానే వినిపిస్తుంది, మైమరపిస్తుంది.
 
భాగవతపురాణం (10:21:1-9) లో పద్యం చూడండి:
 
బర్హాపీడం నటవర వపుః కర్ణయోః కర్ణికారమ్
బిభ్రద్వాసః కనకకపిశం వైజయంతీం చ మాలామ్
రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపవృందై
వృందారణ్యం స్వపదరమణమ్ ప్రావిశద్గీతకీర్తిః
 
ఆ పద్యమే తెలుగులో ( భాగవతము: 10:1:771) చూడండి:
 
శ్రవణోదంచిత కర్ణికారకముతో స్వర్ణాభ చేలంబుతో
అవతంసాయుత కేకిపింఛకముతో అంభోజదామంబుతో
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబు పూరించుచు
న్నువిదా మాధవుడాలవెంట వనమందొప్పారెడిం జూచితే.
 
దాదాపుగా ఇదే రూపం, ఇదే అవస్థాసమ్మోహత్వంతో శ్రీకృష్ణకర్ణామృతంలో (2:6)చూడండి:
 
మందం మందం మధురనినదైః వేణు మాపూరయంతమ్
బృందం బృందావనభువి గవాం చారయంతం చరంతమ్
ఛందోభాగే శతమఖముఖధ్వంసినాం దానవానామ్
హంతారం తం కథయ రసనే గోపకన్యాభుజంగమ్
ఇదే దృశ్యం సూరదాసుని బ్రజభాషలో ఇలా వినిపిస్తున్నది:
 
కమల ముష
సోభిత సుందర బైను
 
మోహన రాగ బజావత గావత
ఆవత చారై ధేను
 
కుంచిత కేస సుదేస దేషియత
జను సాజై అలి సైను
 
సహి న సకత మురలీ మధు పీవత
చాహత అపనౌ ఏను
 
భ్రుకుటీ జను కర చారు చాప లై
భయౌ సహాయిక మైను
 
సూరదాస ప్రభు అధర సుధా లగి
అపుజ్యౌ కఠిన కుచైను. (73)
 
(తామరపువ్వులాంటి ఆ వదనమ్మీద సుందరవేణు శోభ. గోవుల్ని మేపుకుని తిరిగి వస్తూ మోహనుడు రాగాలు ఆలపిస్తున్నాడు. అతడి ముఖం మీద అల్లల్లాడుతున్న ఆ ముంగురులు తుమ్మెదల్లాగా ఉన్నాయి. ఆ అధరసుధారసం ఒక్క పిల్లంగోవికి మాత్రమే ఎందుకు చెందాలని పోటీపడుతున్నాయవి. ఆ కనుబొమలు చూస్తే విల్లుపట్టుకుని మన్మథుడుకూడా సాయానికి వచ్చినట్టుంది. సూరదాసుడి ప్రభువు అధరసుధారసం వారందరినీ అశాంతికి గురిచేసినట్టుంది)
 
ఇది సూరసముద్రం. తులసీదాస్ చంద్రుడు కానీ సూర్ దాసు సాక్షాత్తూ సూర్యుడే అని బ్రజభాషలో ఒక సామెత ఉన్నదట. సూర దాస్ ఎట్లాంటి సూర్యుడంటే, ఆ భక్తిసముద్రం మనల్ని గుడ్డివాళ్ళని చేసేటంత. మరింకేమీ కనిపించకుండా చేసేటంత. ఈ నాలుగైదు కవితలకే నా కళ్ళు బైర్లు కమ్మాయి. మొత్తం చదివితే మరింకేమవుతుందో!
 
30-8-2021

Leave a Reply Cancel reply

Exit mobile version
%%footer%%