నీలిపడవ

Reading Time: 2 minutes
‘ఈ పుస్తకం నువ్వే ఆవిష్కరించాలి’ అంది పద్మ.
 
ప్రసిద్ధ రచయిత్రి, కథకురాలు, నా చిన్ననాటి మిత్రురాలు.
 
‘ఎప్పుడు? ఎక్కడ’ అనడిగాను. హైదరాబాదులోనా? విజయవాడలోనా? ఇంకా ఎవరెవరు ఉంటారు ఆ సభలో? ఆ వేదికమీద?
 
‘మరెవరూ ఉండరు. నువ్వొక్కడివే, కృష్ణమ్మ ఒడ్డున, ఇంకా వీలైతే ఒక పడవ మీద. అంతే’ అంది.
‘మోహనదీతీరమ్మీద నీలిపడవ.’
 
శ్రావణమేఘాలు దివినీ, భువినీ ఏకం చేస్తున్నప్పుడు నింగి కరిగి నదిగా ప్రవహిస్తున్నచోట, ‘మోహనదీతీరమ్మీద నీలిపడవ.’
 
బహుశా ఒక పుస్తకాన్ని ఎవరూ ఎక్కడా ఇలా ఆవిష్కరించి ఉండరు.
 
కాని మేమిద్దరం గోదావరి ఒడ్డున తిరిగిన వాళ్ళం. సాహిత్యమే జీవితంగా గడిపిన ఒక అరుదైన బృందానికి చెందినవాళ్ళం.
 
ఆ తర్వాత ఎవరి జీవితాలు ఎటు పయనిస్తూ వచ్చినా, ఆనాటి చెలిమిని ఒక కలగా పక్కన పెట్టెయ్యని వాళ్ళం.
 
శ్రావణమాసాన్ని నభోమాసమని కూడా అంటారు. ‘ప్రత్యాసన్నే నభసి దయితా జీవితాలంబనార్థీ..’ (మేఘదూతం, 1:4). నభస్సు అంటే పొగ, మంచు, నీళ్ళు, వాన, ఆకాశం, అన్నీను. లోకమంతా ఒక ఆకాశంగా మారినవేళ, నది ఒడ్డున మనుషులు కూడా వినిపించీ, వినిపించని గుసగుసగా మారిపోయినవేళ, ఒక పడవమీద కూచుని, తెరిచానీ పుస్తకం.
 
తెరవగానే ‘మోహనదీతీరమ్మీద నీలిపడవ’ కవిత.
 
తొలివేకువ గీసిన
లేత గాయాల్ని కప్పిపెడుతూ
నీరెండల పొగమంచు
యేమీ చెప్పదు.
 
తెరచాపలు దాచిన
కన్నీటి చెమ్మలని దాచిపెడుతూ
నీలి అలల సుదూరాలూ యేమీ చెప్పవు.
 
సుదీర్ఘ నిరీక్షణలనంతరం
గుండె వూసుల్ని మోసుకొచ్చిన
మోహనదీతీరమ్మీద
నీలిపడవ.
 
పోనీ నువ్వు చెప్పు
పాటల్ని చేజార్చుకున్న ఆ వొంటరి నావికుడు
నదితో చేసే ఆ రహస్య సంభాషణ ఏమిటో?
 
సుదీర్ఘ యానాల
అగాధ గీతాల్ని నెమరేసుకొంటూ
మోహనదీ తీరమ్మీద
నీలిపడవ.
 
శిథిలమయ్యే గట్లని ఒరుసుకుంటూ
శిశిరం రాల్చే వొడలిన ప్రేమలేఖలూ
యె గుండె గుట్టునీ విప్పవు.
 
మూగబోయే బాటలమీద విచ్చుకుంటూ
కాలం చిగిర్చే గడ్డిపూలూ
ఏ పరిమళాన్నీ కానుకివ్వవు.
 
నువ్వు యెవరికీ చెప్పకు
వెన్నెల మీద వూగుతోన్న పడవ వొడ్డుకు చేరుస్తోన్న
అవిరామ మార్మికతల్ని.
 
సుదీర్ఘగానాలని
నిశి నిశ్శబ్దాలని ప్రకంపిస్తూ
మోహనదీ తీరమ్మీద
నీలిపడవ.
 
బహుశా
మోహగీతం
నదీతీరం
నీలిగీతం
ప్రేమే కదా…!
 
తాను రాసే కవితలు లోకానికి రాసిన లేఖలంది ఎమిలీ డికిన్ సన్. పద్మ రచనలన్నీ కూడా ప్రేమలేఖలే. ఆమె ఉత్తరాలు రాస్తూనే ఉంది, గత ముప్పై ఏళ్ళుగా. ఆమె వెతుకుతున్న ఆ మనిషి ఏ దిగంతాల అంచుల్లోనో సంచరిస్తూనే ఉన్నాడు. అప్పుడప్పుడు అతడినుంచి ఏ శ్రావణమేఘమో లేదా ఏ కార్తికదీపమో ఒక జవాబుగా ఆమె వైపు ప్రసరిస్తూంటుంది. అటువంటి జవాబు అందుకున్న క్షణాల్ని ఇలా కవితలుగా మార్చిందామె. అందుకనే ముందుమాటలో ఇలా రాసుకున్నది:
 
‘కాలం ఏదైనా కానీ…
జీవితంలో యెప్పుడో వొకసారి అకస్మాత్తుగా యెదురయ్యే అత్యంత ఆత్మీయ అపరచిత పదధ్వనుల కోసం యెడతెగని నిరీక్షణ, మెలితిప్పేసే బెంగా, వుబికి వచ్చే దుఃఖం, యెగసిపడే సంబరం, ఆశానిరాశల కలకలం. ప్రకృతి కావొచ్చు, ప్రేమ కావొచ్చు, స్నేహం కావొచ్చు, మరేదైనా బంధం కావొచ్చు… అది మిగిల్చిన అనేనాకనేక వర్ణమయ అనుభూతుల సంకలనం యిది.’
 
ఎందుకంటే టాగోర్ అనలేదా!
 
‘అనేకమైన మనోచ్ఛాయల్లో వివిధాలుగా గానం చేశాను
కానీ వాటి స్వరాలు సర్వదా ప్రకటించేది
ఒకే విషయం- అతను వొస్తున్నాడు. వొస్తున్నాడు,
నిరంతరం వొస్తూనే ఉన్నాడు.’
 
ఈరోజు శ్రావణ పూర్ణిమ.
బరసే బదరియాఁ సావన్ కీ
 
సావన్ కీ మన్ భావన్ కీ.
సావన్ మేఁ ఉమంగ్యో మేరే మన్
 
ఝనక్ సునీ హరి ఆవన్ కీ.
ఉమడ్ ఘుమడ్ ఘన్ మేఘా ఆయాఁ
 
దామినీ ఘన్ ఝుర్ లావన్ కీ
బీజా బూందా మేహా ఆయాఁ
సీతల్ పవన్ సుహావన్ కీ.
 
మీరా కే ప్రభు గిరిధర నాగర్
బేలా మంగల్ గావన్ కీ.
 
ఈ మంగళగీతినిట్లా మీ చేతులకందిస్తున్నాను.
 
22-8-2021

Leave a Reply

%d bloggers like this: