కథా ఉద్యమాలు-4

Reading Time: 29 minutes

ఇంప్రెషనిజం: చెఖోవ్

పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్థంలో, వాస్తవికతావాదం తీవ్రత పెంచుతూ దాన్ని స్వాభావికతావాదంగా మారుస్తూ మపాసా ఇలా అన్నాడని ఇంతకు ముందు చెప్పాను.

‘ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం, వ్యక్తిగతంగా ఈ ప్రపంచం గురించి ఒక వ్యక్తిగత భ్రమని ఏర్పరచుకుంటున్నాం. అది కవితాత్మకం కావచ్చు, రాగద్వేషభరితం కావచ్చు , ఉల్లాసభరితం కావచ్చు, విషాదపూరితం కావచ్చు, అనైతికం కావచ్చు, అనుత్సాహకారకం కావచ్చు,ఏదైనా మన స్వభావానికి అనుగుణంగా మనమొక చిత్రాన్ని ఏర్పరచుకుంటున్నాం. కాని తన సాహిత్యసాధనసంపత్తినంతటినీ ఉపయోగించుకుని, ఈ భ్రమనే అత్యంత విశ్వసనీయంగా చిత్రించడమే ఏ రచయితకైనా కర్తవ్యమనిపించుకుంటుంది.’

కాని, ఇలా అంటున్నప్పుడు, అతడు తనకు తెలియకుండానే వాస్తవికతావాదంలోని నిస్పాక్షికత స్థానంలో,పూర్తి వస్త్వాశ్రయత స్థానంలో, తిరిగి ఒక ఆత్మాశ్రయతను ప్రవేశపెడుతున్నాడు. నిజానికి, ‘ట్రెడిషనలిస్టు’ అనే అతణ్ణి ‘వ్యవస్థావాది’ గా, ‘రొమాంటిసిస్టు’ ను స్వేచ్ఛావాదిగా పరిగణించినప్పుడు, ‘రియలిస్టు’ ని , యథార్థవాది అనీ, ‘నాచురలిస్టు’ ను స్వాభావికతావాది అనీ అర్థం చేసుకోవలసి ఉంటుంది.వీటిలో వ్యవస్థ, స్వేచ్ఛ అనే పదాలకి ఉన్న నిర్దిష్టత ‘యథార్థం’, ‘స్వభావం’ అనే పదాలకు లేకపోవడం గమనించాలి. మనిషి తన అంతరంగాన్నే బయటి ప్రకృతి మీద ఆరోపించడం రొమాంటిసిజం లక్షణమనీ, దాన్ని ధిక్కరిస్తూ, బయటి వాస్తవానికి అంతరంగంతో సంబంధంలేనిదని చెప్తూ రియలిజం తలెత్తిందనీ చెప్పుకున్నాం. కాని, 1848 లో కూలిపోయిన రొమాంటిసిస్టు ఆత్మాశ్రయత, 1888 లో మపాసా ఈ మాటలు రాసినప్పుడు మరో రూపంలో మళ్ళా ప్రత్యక్షమయింది. అయితే,ఈ ఆత్మాశ్రయతకీ, మపాసా మాట్లాడుతున్న ఆత్మాశ్రయతకీ మధ్య తేడా ఉంది. రొమాంటిసిస్టు ఆత్మాశ్రయత ఈ లోకం నుంచి విడివడి తనదైన కాల్పనికలోకానికి సంబంధించిన ఆత్మాశ్రయత. కానీ మపాసా మాట్లాడుతున్నది, పూర్తిగా ఈ లోకానికి సంబంధించింది, ఈ లోకాన్ని దర్శించడంలోనూ,అర్థం చేసుకోవడంలోనూ, లోకం గురించిన ఒక సత్యాన్ని తనకోసం తాను నిర్మించుకోవడంలోనూ కళాకారుడు తప్పించుకోలేని ఆత్మాశ్రయత. మపాసా ఈ మాటలు రాయడం వెనక 1870-80 మధ్యకాలంలో ఐరోపీయ చిత్రకళా రంగాన్ని ఒక కుదుపు కుదిపి దాని స్వరూప స్వభావాల్ని ఊహించలేనంతగా మార్చివేసిన చిత్రకళా ఉద్యమం ఇంప్రెషనిజం ఉంది.

ఇంప్రెషనిస్టు చిత్రలేఖనం

ఇంప్రెషనిస్టు చిత్రలేఖనానికి ఆ పేరు రావడం వెనక కొంత యాదృచ్ఛికతా, కొంత తాత్త్వికతా రెండూ ఉన్నాయి. ప్రసిద్ద ఫ్రెంచి చిత్రకారుడు క్లాడ్ మోనె (1840-1926) 1874 లో తన చిత్రమొకదాన్ని ప్రదర్శిస్తూ, కాటలాగులో దాన్ని పేరు ‘ఇంప్రెషన్, సన్ రైజ్’ అని రాసాడు. బహుశా సాంప్రదాయిక చిత్రలేఖనాల్లో ఉండే పూర్తిస్థాయి ‘ఫినిష్’ అందులో లేదని విమర్శకులు తనని ఎత్తిచూపకుండా అతడా పేరు పెట్టి ఉండవచ్చు. కాని, ఆ ప్రదర్శనను సమీక్షిస్తూ ఒక సమీక్షకుడు ఆ కొత్త తరహా చిత్రలేఖనాన్ని ‘ఇంప్రెషనిజం’ అని పిలిచాడు. దాంతో ఆ నవ్యధోరణి ఇంప్రెషనిజంగా రూఢి అయిపోయింది.అంతదాకా, ఇంప్రెషనిజమంటే ప్రకృతి చిత్రకారుడిమీదా, ఒక చిత్రలేఖ్నం దాన్ని చూసే సందర్శకుడిమీదా ముద్రించే ప్రభావాన్ని సూచించడానికి వాడిన పదం. కానీ, 1874 తర్వాత ఆ పదం ఒక చిత్రలేఖనం కనబరుస్తున్న తాత్త్వికతకు గుర్తుగా వాడుకలోకి వచ్చింది.

ఉదాహరణకి, మోనె చిత్రించిన సూర్యోదయ దృశ్యమే చూద్దాం.ఇందులో మనని తక్షణమే ఆకర్షించేది, ఆ రంగులూ, వాటి ప్రకాశమానతా. చిత్రించిన దృశ్యం మోనె స్వస్థలమైన లే హవ్రే రేవుపట్టణంలో ఒక ప్రభాతదృశ్యం. పారిశ్రమికంగానూ, వాణిజ్యపరంగానూ పురోగమిస్తున్న పట్టణం అది. కాని ఆ దృశ్యంలోని వస్తు యాథార్థ్యం ప్రధానం కాదు. ఆ రేవుపట్టణం, ఆ ఫాక్టరీలు, ఆ క్రేన్లు అవన్నీ సూచనమాత్రంగానే ఉన్నాయి. ప్రధానమైనదల్లా సూర్యుడు, ప్రభాతవర్ణాలూ, నీళ్ళమీద వాటి వెలుగునీడలూ. చిత్రకారుడు ఏ ఒక్క వస్తువునీ కూడా వివరంగా గానీ, వివరాలతో గానీ చిత్రించలేదు. అతడు చేసిందల్లా వాటి సూచనల్ని మనకి స్ఫురింపచెయ్యడమే. కాని, ఆ చిత్రలేఖనంలో ఒక నూతనశక్తి, ఉత్సాహం, సత్త్వసముపార్జన ఉన్నాయి. 1870-71 ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో ఫ్రాన్సు ఓడిపోయినతర్వాత వచ్చిన చిత్రలేఖనం అది. ఆ యుద్ధంలో ఫ్రెంచి సమాజం చూపించిన దివాలాకోరు మనస్తత్వాన్ని మపాసా చిత్రిస్తే, ఆ యుద్ధానంతర ఫ్రాన్సుకి కొత్త ఊపిరి పోయడానికి మోనె ఈ చిత్రం చిత్రించాడు.

ఒకరకంగా ఇది నూతన యుగాన్ని దర్శించడానికి చేసిన ప్రయత్నం. ఈ ప్రయత్నానికి ఇంప్రెషనిజమనే పేరు 1874 లో వచ్చి ఉండవచ్చుగానీ, ఆ ధోరణికి అంకురం  1863 లోనే పడింది. ప్రసిద్ధ ఫ్రెంచి కవి బోదిలేర్  The painter of the modern life అనే ఒక వ్యాసం రాస్తూ, కొత్త కాలంలో చిత్రకారుడు నవీనకళారూపాల్ని సృజించాలనుకున్నప్పుడు, ఆ కళాసామగ్రిని కూడా సమకాలిక జీవితం నుంచే తెచ్చుకోవాలి తప్ప,ప్రాచీన, మధ్యయుగాల కళాసామగ్రినుంచీ, కవిసమయాలనుంచీ కాదని రాసాడు. ముఖ్యంగా, ఈ వాక్యాలు:

‘..మన చుట్టూ సాహసోపేతమైన ఆధునిక జీవితం పరుచుకుని ఉంది. కాని జీవితాన్ని దాని పౌరణీక పార్శ్వం నుంచి తెగ్గొట్టి, మనం మన నెక్ టై లతోనూ, వార్నిషు వేసుకున్న బూట్లతోనూ ఎంత రాజసంగా కనిపిస్తున్నామో, గీతల్లోగాని, రంగుల్లో గాని చిత్రించగల  చిత్రకారుడెవరూ నాకు తారసపడలేదు.’

ఈ వాక్యాలు అతడి మిత్రుడూ, బార్బిజాన్ రియలిస్టు చిత్రకారుల అనుచరుడూ అయిన ఎడ్వర్డ్ మానె మీద గాఢమైన ప్రభావం చూపించాయి. తన సమకాలిక జీవిత సామగ్రిని తీసుకుని ప్రాచీన పౌరాణిక గాథలతో సమానంగా నిలబడగల ఒక చిత్రాన్ని చిత్రించలేనా అని అతడనుకున్నాడు. అందుకతడు రెండు నమూనాలు తీసుకున్నాడు. మొదటిది, టిటియన్ చిత్రించిన ఫస్తొరల్ చొంచెర్త్ (1509-10) అనే వర్ణచిత్రం. 

రెండవది, రినైజాన్సు చిత్రకారుడు రాఫేల్ పద్ధతిలో మర్కంటోనియో రైమొండి అనే ఇటాలియన్ చిత్రకారుడు చిత్రించిన The Judgment of Paris (1520) అనే ఒక ఎంగ్రేవింగ్.

వీటి నమూనాలో అతడు Luncheon on Grass (1863) అనే వర్ణచిత్రాన్ని చిత్రించి ఫ్రెంచి అకాడెమీకి పంపించాడు.

ఆ చిత్రలేఖనం ఫ్రెంచి అకాడెమీనే కాక, ఫ్రెంచి పౌరసమాజాన్ని కూడా తీవ్రంగా కలతపరిచింది. ఆ చిత్రలేఖనంలో అతడు నగ్నత్వాన్ని చిత్రించడం సమస్యకాదు, ఆ నగ్న పాత్రలు అప్సరసలో, గంధర్వులో అయి ఉంటే సమాజం ఆ చిత్రాన్ని తప్పకుండా నెత్తినపెట్టుకునేది. కాని ఆ పురుషుల్లో తమ రోజువారీ సమకాలిక జీవితంలోని మనుషుల్నీ, ఆ స్త్రీలో నిస్సిగ్గుగా కూచున్న ఒక వ్యభిచారిణినీ ఆ సమాజం చూసింది.ఆ సాహసాన్ని ఫ్రెంచి సమాజం తట్టుకోలేకపోయింది. మానె ఇంప్రెషనిస్టు కాడు, రియలిస్టే. కాని ఆ చిత్రలేఖనంలో ఇంప్రెషనిస్టు లక్షణాలు మొదటిసారిగా పొడసూపడం మనం గమనించవచ్చు. అవి:ఒకటి, రినైజాన్సు కాలం నుండీ చిత్రలేఖనం లీనియర్ పెర్ స్పెక్టివ్ మీద ఆధారపడి ఉంది. అంటే సందర్శకుడి దృక్కోణం నుంచి దృశ్యాన్ని చూపడం. అక్కడ చిత్రలేఖనం ఒక కిటికీలాగా ప్రపంచాన్ని చూపించే ఒక సాధనం. రెండు కొలతల కాన్వాసు మీద లోతు అనే మూడవ కొలత తీసుకురావడంలోనే చిత్రకారుడి నైపుణ్యం కనిపించాలి. కాని, ఈ చిత్రంలో, లోతు మీద దృష్టి లేదు. ఇది దాదాపుగా రెండు కొలతలతో బల్లపరుపుగా ఉండే కాన్వాసునే స్ఫురింపచేస్తూ ఉంది.

రెండవది, చిత్రలేఖనంలో మూడవకొలతని స్ఫురింపచెయ్యడానికి రంగుల శ్రేణిని జాగ్రత్తగా చిత్రించడం అవసరం. values  అనబడే రంగుల ఛాయాభేదాలవల్లనే దృశ్యానికి వాస్తవికతా స్ఫురణ సాధ్యమవుతుంది. రియలిస్టులు దాని మీదనే దృష్టిపెట్టారు. అందుకు, ఒక చిత్రలేఖనంలో మధ్యస్థ విలువల్ని నేర్పుగా చిత్రించాలి. కాని ఈ చిత్రలేఖనంలో గాఢమైన రంగులూ, లేతరంగులూ తప్ప మధ్యస్థవర్ణాల మీద దృష్టి లేదు. చిత్రలేఖనంలో లోతు కొరవడటానికి అదే కారణం. మామూలుగా అయితే ఇటువంటి చిత్రకారుణ్ణి అపరిణత చిత్రకారుడిగా తీసిపారెయ్యవచ్చు. కాని నేర్పు కలిగిన చిత్రకారుడిగా అతడు గీతలకి బదులు రంగుమీదా, కాంతిమీదా ఆధారపడుతుండటాన్ని చూపరులు విస్మరించలేరు. కాబట్టి, ఇది నైపుణ్యం లేనందువల్లకాక, కావాలని చిత్రించిందని ఫ్రెంచి సమాజానికి అర్థమయింది. ఆ సాహసాన్ని వాళ్ళు క్షమించలేకపోయారు.

ఇంప్రెషన్: ఒక క్షణకాల దృశ్యం మాత్రమే

మానె చిత్రించిన  A Bar at the FolieS-Bergere(1882) అనే చిత్రం ఇంప్రెషనిస్టు తాత్త్వికతను మరింత స్పష్టంగా వెల్లడి చేస్తున్నది.

ఇందులో ఉన్నది ఒక సాయంకాలం బార్ లో ఉన్న ఒక సేవిక. ఈ చిత్రలేఖనంలో కథ లేదు, ఒక నీతి లేదు, ఒక ఇతివృత్తం లేదు. దీని వెనక ఎటువంటి రంగస్థల నిర్వహణా లేదు. ఎమిలీ జోలా కథానాయిక ‘నానా ‘లాగా ఈమె కూడా పరిస్థితుల పర్యవసానంగా, ఒక నిశ్శబ్ద మానవ సంపుటంగా మాత్రమే కనిపిస్తున్నది. నాచురలిస్టు వర్ణనల్లో ఉండే శాస్త్రీయత, వైజ్ఞానికత, పాఠకుడికి ఒక అవగాహన కలిగించవలసిన బాధ్యత ఏవీ కూడా ఈ చిత్రకారుడికి లేవు. ఇతడి దృష్టి ఎంతసేపూ ఒక క్షణకాల దృశ్యాన్ని మనముందు ఆవిష్కరించడం మీదే. కళ్ళముందు కనిపిస్తున్నదాన్ని దర్శనీయం చెయ్యడం, ఒక క్షణాన్ని ఉన్నదున్నట్టుగా పట్టిబంధించడం. ఈ దృశ్యంలో మనకి కనిపించేది ఆ రంగులు, ఆ దీపాల కాంతీ, ఆ సంరంభం, వాటి మధ్య వాటికి చెందకుండా ఉండే చూపుల్తో ఉన్న ఒక మనిషి మాత్రమే.

20 వ శతాబ్దంలో నైరూప్యతకు చేరుకున్న చిత్రలేఖనపు తొలిచిహ్నం ఇది. ఈ చిత్రలేఖనం  ఫ్రెంచి సమాజాన్ని తీవ్రంగా కలవరపరిచింది. అందుకు కారణం ఇదీ అని చెప్పడం కష్టం. కాని ఎర్నెస్ట్ రేనాన్ అనే విమర్శకుడు ఒక మాటన్నాడు.

‘ఐరోపీయ చిత్రకారుడు  మొదట్లో అద్భుత, అతిమానుష శక్తుల్ని చిత్రించాడు. ఆ తర్వాత ఆదర్శవంతమైన ఇతివృత్తాల్ని చిత్రించాడు. కాని ఒకసారి అతడు కళ్ళముందున్న కనిపిస్తున్న వాటిని ఉన్నదున్నట్టుగా చిత్రించడం మొదలుపెట్టాక, స్వర్గమూ, భూమీ కూడా కూలిపోయినట్టనిపించింది యూరోప్’.

ఆ మాటలో ఎంతో అర్థముంది. వాస్తవికతను చిత్రించడమంటే నీతిరాహిత్యాన్నీ,ఆదర్శరాహిత్యాన్నీ చిత్రించడం. దాన్ని ఏ సమాజమూ భరించలేదు. (గురజాడ మొదటి కన్యాశుల్కం కూర్పుని చలంగారు  జీవంలేనిఘోరం అన్నాడు). రియలిస్టులు కనీసం ఒక దృక్పథాన్నివ్వడానికి ప్రయత్నించారు. కాని, ఇంప్రెషనిస్టులు అటువంటి ప్రయత్నమేమీ చెయ్యకపోవడం మరీ దుస్సహమనిపించింది అప్పటి సమాజానికి.

ఇంప్రెషనిస్టుల దృష్టి ఒక క్షణాన్ని మనముందు చూపించడమే. అప్పుడే రూపుదిద్దుకుంటున్న ఫొటోగ్రఫీ వాళ్ళకొక దారిచూపించింది. కెమేరా దృశ్యాన్ని crop చేస్తుంది. మానవనేత్రం చూడగల మధ్యస్థవిలువల్ని flatten చేస్తుంది. ఇంప్రెషనిస్టు చిత్రకారులు ఈ రెండు అంశాల్లోనూ కెమేరాను అనుసరించారు. ఉదాహరణకి, గుస్టావ్ కెయిలెబోటె (1848-93) వాన పడుతున్న రోజు పారిస్ లో ఒక వీథిని చిత్రించిన దృశ్యం చూడండి. ఈ చిత్రంలో కూడా మనం చూసేది కెమేరాలాగా బంధించిన ఒక క్షణాన్ని మాత్రమే.

యథార్థాన్ని ఏదో ఒక్కలామటుకే వ్యాఖ్యానించలేం

ఎడ్వర్డ్ మానె తనని తాను ఇంప్రెషనిస్టుగా పిలుచుకోలేదు. అట్లానే పూర్తిగా ఇంప్రెషనిస్టుగా మనం వర్గీకరించలేని మరొక చిత్రకారుడు ఎడ్గర్ డేగా (1834-1917)తన తొలిరోజుల్లో ఒకసారి ప్రసిద్ధ నియో క్లాసికల్ చిత్రకారుడు ఇంగ్రె ని కలిసాడు. ఇంగ్రె అతణ్ణి గీతలమీద దృష్టిపెట్టమన్నాడు.ఆ ప్రభావం డేగా మీద చివరిదాకా ఉంది. కాని,తాత్త్వికంగా డేగా ఇంప్రెషనిస్టు చిత్రకారుల కోవకి చెందటమేకాక, ఆ తాత్త్వికతకొక గాఢతను కూడా తీసుకొచ్చాడు. ఉదాహరణకి అతడు 1868-70 లో చిత్రించిన Interieur(Le Viol) అనే చిత్రం చూడండి.

పందొమ్మిదో శతాబ్ది ఉత్తరార్థంలో ఫ్లాబే, జోలా, మపాసాల్ హెన్రీ జేమ్స్,ఇబ్సెన్, చెకోవ్ లు కథ, నవల, నాటకంలో ఏది అన్వేషిస్తున్నారో, ఆ చిత్రం కూడా అదే అన్వేషిస్తున్నది. మానవసంబంధాల్ని, ముఖ్యంగా స్త్రీపురుష సంబంధాల్ని కొత్త దృష్టితో చూడటం. కానీ, ఆ చిత్రంలో ఇతివృత్తం ఏమిటి? కథ ఏమిటి? Lev Viol అంటే రేప్ అని అర్థం. కాని అంత మాత్రాన ఆ చిత్రం మనకేమి అర్థమయింది? అసలు ఆ చిత్రంలోని మనుషులు మనల్ని చూడటం లేదు. వాళ్ళకీ, మనకీ సంబంధం లేదు. మనం వాళ్ళ వ్యక్తిగతస్థలంలోకి, వాళ్ళ ఆంతరంగిక జీవితంలోకి తొంగిచూస్తున్నామంతే.

ఒక విమర్శకుడన్నట్టుగా, వందేళ్ళ తరువాత చలనచిత్రకళ చేస్తున్నది ఇదే కదా. ఆ చిత్రంలో ఉన్నది యథార్థ దృశ్యమే కాని, దాన్ని ఏదో ఒక వ్యాఖ్యానానికి కుదించలేం. రియలిస్టుల్లాగా దానికొక రాజకీయ దృక్పథాన్నిగాని, నాచురలిస్టుల్లాగా  ఒక శాస్త్రీయ దృక్పథాన్ని గాని ఆరోపించలేం. అది చూసిన తరువాత మనకు మిగిలేది ఒక దృక్పథం కాదు, విషయపరిజ్ఞానం కాదు, కేవలం ఒక ఇంప్రెషన్ మాత్రమే.

ఇంప్రెషన్ ఒక సంవేదన మాత్రమే

రినైజాన్సు తర్వాత ఐరోపీయ చిత్రకళ స్వరూప స్వభావాలు మార్చివేసిందని చెప్పుకునే ఇంప్రెషనిజం మొత్తం రంగులమీదా, కాంతిని పట్టుకోవడం మీదా దృష్టిపెట్టింది. కాని రంగుల గురించి ఇంప్రెషనిస్టు చిత్రకారులు కొత్తగా చెప్పిందేమీ లేదు. రినైజాన్సు కాలంలో డావిన్సీ, బరోక్ యుగంలో రూబెన్స్, ఎన్ లైటెన్ మెంటు కాలంలో గొథే, రొమాంటిక్ యుగంలో డెలాక్రా, టర్నర్, కాన్ స్టేబిల్ చెప్పిందానికన్నా అదనంగా వాళ్ళు చెప్పిందేమీ లేదు. కాని, ఆ విప్లవాత్మకత వాళ్ళు దృశ్యాన్ని సమీపించిన తీరులో ఉంది. రంగులు ట్యూబుల్లో రావడం వల్ల వాళ్ళు స్టూడియో వదిలి ఆరుబయట చిత్రలేఖనం వేసుకునే అవకాశం వచ్చింది. విరిడియన్ ఆకుపచ్చ, కోబాల్ట్ ఊదా 1859 లోనూ, సెరులియన్ నీలం 1860 లోనూ కనిపెట్టడంతో ప్రకృతిని మరింత సజీవంగా చిత్రించే అవకాశం లభించింది. అన్నిటికన్నా ముఖ్యంగా,  రంగు వాళ్ళ దృష్టిలో ఒక కాంతిసంవేదన. మోనె అన్నట్టుగా ‘ రోజంతా పట్టిపీడించే వ్యసనం, ఒక సంతోషం,  చెప్పలేని రంపపుకోత.’ వాళ్ళకి దృశ్యమంటే వస్తుసముదాయం కాదు, ఒక సంవేదన మాత్రమే. అందుకే మోనె తన మిత్రుడితో అన్నాడట: తాను అంధుడిగా పుట్టి, ఆ తర్వాత తనకి దృష్టి వచ్చిఉంటే బావుండేదని. అంటే, ఆ వస్తువుల గురించిన పూర్వజ్ఞానం లేకుండాఆ,వాటిమీద కాంతిపడేటప్పటి తన సంవేదనల్ని మరింత తాజాగా చిత్రించేవాణ్ణని అతడి ఉద్దేశ్యం.  నువ్వు స్టూడియోలో కూర్చుని చిత్రించేటప్పుడు, వస్తువుల మీద పడే వెలుగు నువ్వు కోరుకున్నంతసేపు నిశ్చలంగా ఉండగలదు. కానీ, నువ్వు ఆరుబయట చిత్రించేటప్పుడు, సూర్యకాంతి, మబ్బులు, నీడలు ఒక క్షణంలో ఉన్నట్టు మరొక క్షణంలో ఉండవు. కాబట్టి నువ్వు వాస్తవాన్ని పట్టుకోవాలంటే, ఆ సత్వర క్షణంలోనే దాన్ని బంధించాలి. సత్యం, వాస్తవం,యథార్థం సార్వత్రికం అనీ,నిశ్వలం అనీ, కాలాతీతం అనీ భావించే దృక్పథం స్థానంలో, వాస్తవం కేవలం క్షణికం,క్షణభంగురం అని ఇంప్రెషనిస్టులు అనుభవం ద్వారా తెలుసుకున్నారు, తెలియచెప్పారు.

తమ ఈ తాత్త్వికతకి ఇంప్రెషనిస్టులు ఎంత కట్టుబడ్డారో జేమ్స్ అబోట్ మెక్ నీల్ విష్లర్ (1834-1903) జీవితమే ఒక ఉదాహరణ. అతడు చిత్రించిన  Nocturne in Blue and Gold, Old Battersea Bridge (1877) అనే చిత్రం చూసి ప్రసిద్ధ ఇంగ్లీషు చిత్రకళా రసజ్ఞుడు జాన్ రస్కిన్ కోపం పట్టలేకపోయాడు.

విష్లర్ ఇంత కడవెడు రంగుతీసి ప్రజల ముఖం మీద చిమ్మ్మాడని విమర్శించాడు. అతడి విమర్శను తట్టుకోలేని విష్లర్ రస్కిన్ మీద పరువునష్టం దావా వేసాడు. కోర్టు ముందు అతడు సమర్పించిన వాజ్మూలంలో ఇలా అన్నాడు:

‘ఆ వంతెన తాలూకు ‘కచ్చితమైన’ చిత్రాన్ని గీయడం నా ఉద్దేశ్యం కాదు. అదొక వెన్నెలరాత్రి దృశ్యం. ఆ చిత్రం మధ్యలో మీరు చూస్తున్న వంతెన స్తంభం పగటిపూట మీరు చూడటానికి అలవాటుపడ్డ బేటర్సీ బ్రిడ్గ్ స్తంభాల్లాగా కనిపించదు. ఆ చిత్రం ఏమి చూపిస్తుందనేది దాన్నెవరు చూస్తున్నారు అన్నదాని మీద ఆధారపడుతుంది. కొంతమందికి వాళ్ళు చూడాలనుకున్నదంతా మొత్తం చూపిస్తుందది. కొందరి దృష్టిలో అది ఏమీ చూపించదు కూడా.’

విష్లర్ కేసయితే నెగ్గాడుకానీ, ఆ జడ్జికూడా ఆ పౌరసమాజానికి చెందిన మనిషే కాబట్టి నష్టపరిహారం కింద ఒక ఫార్థింగు మాత్రమే చెల్లించమని రస్కిన్ ని ఆదేశిస్తూ, కోర్టు ఖర్చులు మొత్తం విష్లర్ పెట్టుకోవాలని  తీర్పునిచ్చాడు. నైతికంగా గెలిచినప్పటికీ, ఆ కేసుతో విష్లర్ ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు.

చెకోవ్: ఇంప్రెషనిస్టు

ఇంప్రెషనిజం నిజానికి ఒక సాహిత్య ఉద్యమంగా పూర్తిగా వికసించనే లేదు. ఫ్రెంచి సాహిత్యంలో రొమాంటిసిజం మీద తిరుగుబాటుగా నవలాకారులు రియలిజాన్ని అనుసరిస్తున్నప్పుడు, కవిత్వంలో పర్నాషియన్ బృందం అత్యున్నత కవితాశిల్పం కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఇంప్రెషనిజానికి సమకాలంలోనే మొదలైన బెల్జియన్ సింబలిజం పోస్ట్ ఇంప్రెషనిస్టు ధోరణిగా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. కాని, ఈ రోజు ఇంప్రెషనిస్టు సాహిత్య సృష్టి చేసినవాడిగా చెకోవ్ ని ఎక్కువ తలుచుకుంటున్నారు.

నాకు బాగా గుర్తు. మేము రాజమండ్రిలో 82-87 మధ్యకాలంలో సాహిత్యవేదికలో సాహిత్య విమర్శలో మొదటి ఎక్సర్ సైజులు సాధన చేస్తున్నప్పుడు, ఒకసారి చెకోవ్ మీద సమాలోచన జరిగింది. ఆ రోజు నా మిత్రులు మహేష్, గోపీచంద్ చెకోవ్ ని రియలిస్టు అని వివరిస్తుంటే,నేను వారిని కవ్వించడం కోసం చెకోవ్ రొమాంటిసిస్టు అని వాదించాను. నేనలా వాదించడానికొక కారణముంది. తెలుగు కథకుల్లో కొడవటిగంటి కుటుంబరావుని చెకోవ్ తో పోల్చే ఒక సంప్రదాయముంది. ఆ పోలిక ఎవరు తెచ్చారోగాని, వాళ్ళకి అటు చెకోవ్ అర్థం కాలేదు, ఇటు కొ.కు కూడా అర్థం కాలేదని చెప్పడం కోసం నేనట్లా వాదించాను. కాని,నిజానికి, చెకోవ్ సాంప్రదాయిక రియలిస్టు కాడనీ, మపాసా చూపించిన తోవలోనే అతడు వాస్తవికత అనేది దాన్ని దర్శిస్తున్న ద్రష్ట ఆత్మాశ్రయతనుంచి ఎప్పటికీ తప్పించుకోలేదని భావించినవాడిగా ఈ రోజు అర్థమవుతున్నాడు.

1889 లో రాసిన ఒక ఉత్తరంలో ఆయనిట్లా రాసాడు:

‘రంగస్థలానికి మల్లే కథానికారచనకి కూడా దానివైన  కొన్ని సంప్రదాయాలున్నాయి.  మొత్తం రచన చదివాక, ఆ రచన, కథగానీ, నవలగానీ, పాఠకుడి మీద ఎటువంటి ముద్ర వేస్తుందన్న దాని గురించి నేను ఎంతో కళాత్మకంగా దృష్టి పెట్టవలసిఉంటుంది. అందుకోసం నేను ప్రతిపాదిస్తున్నవాటి గురించి కొన్ని సూచనలు యాథాలాపంగా ప్రస్తావించవలసి ఉంటుంది .’

రష్యాలో ఇంప్రెషనిజం ఆలస్యంగా ప్రవేశించింది. అంతకన్నా ముందే డికడెంట్ సాహిత్యమూ, సింబలిజమూ ప్రవేశించాయి. మరొకవైపు చెకోవ్ ముందు మపాసా ఉన్నాడు. కాని  రియలిస్టు దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికో,  నాచురలిస్టు ధోరణికోసమో కాక కథా రచనకి సంబంధించిన మెలకువలకోసం చెకోవ్ మపాసా ను తనముందొక నమూనా గా పెట్టుకున్నాడు. అలాగని అతడు సింబలిస్టుల్ని నిరాకరించనూ లేదు, ఆ ధోరణిని పూర్తిగా స్వాగతించనూ లేదు. ఇక అతడికి సమకాలికుడిగా డాస్టవిస్కీ, టాల్ స్టాయి,  తుర్జనీవ్ లు ఉన్నారు. వారి మహాసాహిత్యసృష్టి ముందు చెకోవ్ ఒకింత ఆత్మసంశయంతోనూ, వినయంతోనూ కథలూ, రూపకాలూ రాస్తూ వచ్చాడు. అయినప్పటికీ, ప్రపంచ కథారచయితలందరిలోనూ అగ్రగణ్యుడిగా గుర్తింపు పొందే విధంగా చెకోవ్ చరిత్రలో నిలిచిపోవడానికి కారణమేమిటి? బహుశా, అతడు జీవించిన కాలమాన పరిస్థితుల వల్ల మాత్రమే అతడు తన సాహిత్యం వాచ్యంగా కాక ధ్వనిపూర్వకంగా ఉండేలా చూసుకున్నాడని చెప్పవలసి ఉంటుంది.

అతడు తన జీవితకాలంలో (1860-1904) ముగ్గురు జార్ చక్రవర్తుల్నీ, రెండు చారిత్రక మహాసంఘటనల్నీ చూసాడు. 1861 లో రెండవ అలెగ్జాండర్ రష్యన్ సెర్ఫ్ వ్యవస్థను రద్దు చెయ్యడం రష్యా చరిత్రను సమూలంగా మార్చివేసింది. చెకోవ్ తాత కూడా ఒక సెర్ఫ్ గా బతికినవాడే.కొత్తగా లభించిన స్వేచ్ఛ వల్ల ఆ కుటుంబానికి రష్యాలో ఎక్కడికైనా పోగల అవకాశం లభించింది. అతడి తండ్రి చేపట్టిన వ్యాపారం కొంత కలసిరావడంతో వాళ్ళు మాస్కోకి తరలిపోయారు. అక్కడ అతడు వైద్యశాస్త్రం చదువుకున్నాడు. 1880 లో కథారచన మొదలుపెట్టాడు. కాని 1881 లో రెండవ అలెగ్జాండర్ తనమీద జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించాక అతడి కుమారుడు మూడవ అలెగ్జాండర్ రాజయ్యాడు. అతడు తండ్రి చేపట్టిన సంస్కరణలకి స్వస్తి పలికి దేశాన్ని బయటనుంచీ, లోపలనుంచీ కూడా బంధించేసాడు. తండ్రి పాశ్చాత్యీకరణకు తలుపులు తెరిస్తే కొడుకు పూర్తిగా రూసిఫికేషన్ మీద దృష్టిపెట్టాడు. 1889 లో చెకోవ్ సైబీరియా వెళ్ళి అక్కడొక పీనల్ కాలనీ ని సందర్శించి, అధ్యయనం చేసాడు, తిరిగి 1892 లో మాస్కో  శివార్లలో ఒక సుక్షేత్రం కొనుక్కుని అక్కడ మళ్ళా రచనమీదా, గ్రామీణ జీవితం మీదా దృష్టిపెట్టాడు. 1894 లో మూడవ అలెగ్జాండర్ అర్థాంతరంగా మరణించి అతడి కొడుకు రెండవ నికొలస్ అధికారంలోకి వచ్చాడు. అతడికి ప్రభుత్వ యంత్రాంగం మీదగాని, ఆర్థికవ్యవస్థ మీద గాని పట్టులేదు. అప్పటికే ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చెకోవ్ మరణించిన కొన్ని నెలలకే, 1905  జనవరిలో సెంట్ పీటర్స్ బర్గ్ నగరంలో శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న ప్రజలమీద సైన్యం కాల్పులు జరిపింది. ఆ రోజు రక్తసిక్తమైన ఆదివారంగా చరిత్రలోకి ఎక్కడమే కాకుండా, 1905 రష్యన్ విప్లవానికి దారితీసింది.

1860-70 మధ్యకాలంలో రష్యాలో, రచయితలకి సామాజిక స్పృహ ఉండాలనీ, వాళ్ళు పాఠకులకి నీతిబోధ చెయ్యాలనీ సాహిత్యవిమర్శకులు వాదించారు. 1880 లో చెకోవ్ కథారచన మొదలుపెట్టేటప్పటికి ఆ వాదం ఇంకా బలంగా నిలిచే ఉంది. కాని జార్ చక్రవర్తి ప్రవేశపెట్టిన సంస్కరణలవల్ల కొత్తగా స్థానిక పరిపాలన మొదలయ్యింది. వాటికోసం పెద్ద ఎత్తున తక్కువ జీతాలకు పనిచేయగల ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ అవసరమయ్యారు. ఆ ఉద్యోగాల్లో కుదురుకున్నవాళ్ళు ప్రధానంగా సగం చదువు మానేసినవాళ్ళూ లేదా ప్రజల్ని ఉద్ధరించాలనే ఉద్దేశ్యంతో ముందుకొచ్చినవాళ్ళూ. వాళ్ళింకా అరవైల నాటి భావజాలంలోనే కూరుకుపోయినందువల్ల కొత్త మార్పుల్ని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. మరోవైపు 80 ల్లో ప్రవేశించిన సింబలిజం కొత్త కళారూపాల్ని అన్వేషిస్తూ ఉంది. వాటిని ప్రజలు వెంటనే స్వీకరించే పరిస్థితిలో లేరు. అందువల్ల చెకోవ్ ఆ రెండు ధోరణులకీ మధ్యస్థంగా ఉండే ఒక శైలినీ, రచనావిధానాన్నీ ఎంచుకోవలసి వచ్చింది. అంటే, తన రచనలు పైకి సరళంగా కనిపిస్తాయి, కాని నిగూఢమైన అంతరార్థాలతో కూడి ఉంటాయన్నమాట. ముఖ్యంగా 1894 తర్వాత అతడు రాసిన కథలన్నిటిలోనూ సమాజం పట్ల గొప్ప అవేదన, మానవుడి కర్తవ్యం పట్ల ఒక మెలకువా కనిపిస్తాయి. కాని అతడి సామాజిక స్పృహ ఎక్కడా వాచ్యంగా ఉండదు. చెకోవ్ కథల్ని అజరామరం చేసిన సాహిత్యశిల్ప రహస్యం ఇదే.

మిద్దె ఇల్లు: ఇంప్రెషనిస్టు కథ

చెకోవ్ 1896 లో రాసిన ‘మిద్దె ఇల్లు ‘ కథ ఆ కాలానికీ, అప్పటి సంఘర్షణకీ,చెకోవ్ అంతరంగంలో జరిగిన సంఘర్షణకీ కూడా పూర్తిగా అద్దం పట్టిన కథగా చెప్పవచ్చు. నేను దీన్ని ‘మిద్దె ఇల్లు ‘ అని అనువదించానుగాని, ఇంగ్లీషులో mansard లేదా mezzanine అంటే రెండంతస్తుల ఇల్లు అని. కింద ఒక ఇల్లూ, అటకమీద మరో గది లేదా గదులు ఉండే ఇల్లని అర్థం. అంటే రెండతస్తుల జీవితమన్నమాట. ఈ కథాశీర్షికనుంచే ఆ ద్వంద్వం కనిపిస్తూ ఉంటుంది. ‘మిద్దె ఇల్లు’ అనే పేరుతో పాటు ‘ఒక చిత్రకారుడి కథ ‘అనే రెండవ శీర్షిక కూడా పెట్టాడు. అంటే ఏకకాలంలో ఇది ఇద్దరి కథ. ఏ ఒక్కరో కథనో కాదు.

కథ చదువుతున్నంతసేపూ మనమొక ఇంప్రెషనిస్టు శైలిలో చిత్రించిన ప్రకృతి దృశ్యాన్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఇంప్రెషనిస్టు చిత్రకారుల్లానే కథకుడు కూడా వెలుగునీ, ప్రకృతి మీద (బయటి ప్రకృతీ, పాత్రల ప్రకృతీ కూడా) వెలుగునీడల సయ్యాటని ఎంతో కవితాత్మకంగా, కళాత్మకంగా చిత్రిస్తూపోతాడు. ‘అప్పటికి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. పాలకంకులు విచ్చుకుంటున్న యవచేలమీద సాయంకాలపు నీడలు పరుచుకుంటూ ఉన్నాయి’, చెట్ల చిటారుకొమ్మల్ని అల్లుకున్న సాలెపురుగు గూళ్లమీద ఇంద్రధనుస్సులాగా సూర్యకాంతి తళుకులీనుతూంది’,  ‘ప్రకాశమంతమైన ఆ బంగారు తునకలు తప్ప తక్కిందంతా చీకటిగానూ, నిశ్శబ్దంగానూ ఉంది’, ‘కిందటేడు హేమంతంలో రాలిన చెట్ల ఆకులు పాదలకింద విషాదభరితంగా, మృదువుగా చప్పుడు చేస్తున్నాయి. చెట్లకాండాల మధ్యగా వెనక్కి జారిపోతున్న సాయంసంధ్యాకాంతిలో నీడలు దోబూచులాడుతున్నాయి’ లాంటి వాక్యాలు చూడండి. ఇటువంటి వాక్యాలు ఉదాహరించాలంటే, మొత్తం కథ అంతా ఎత్తిరాయవలసి ఉంటుంది. చివరికి, కథలో ముఖ్యపాత్రల్ని కూడా అతడు ముందు ‘చూస్తాడు’, తర్వాతనే అవి కథలో ముఖ్య పాత్ర వహించడం మొదలుపెడతాయి. కథ చెప్పడానికి కథకుడు వాడిన శైలిలో జానపద కథల లక్షణముంది. ‘ఇదంతా జరిగింది ఆరేడేళ్ల కిందట’ అని మొదలుపెడతాడు. ‘అనగా, అనగా’ పద్ధతిలో. కాని బోదిలేర్ కోరుకున్నట్టుగా,ఆధునిక జీవితాన్ని అధునిక సామగ్రితోనే చిత్రిస్తాడు. కాని ఆ చిత్రించే శైలి మటుకు జానపద కథల శైలి కావడంతో, ఏదో ఒక అలౌకిక స్వప్న ప్రపంచం మనముందు మేల్కొంటూ ఉంటుంది. ఒక రకంగా అది సింబలిస్టు లక్షణం కూడా. కానీ, ఒక రొమాంటిక్ కథ రాయడం చెకోవ్ ఉద్దేశ్యం కాదు. కథకుడి స్వాప్నిక, కళాత్మక దృష్టికి పూర్తి విరుద్ధంగా సామాజిక బాధ్యతతోనూ, ప్రాపంచిక దృష్టితోనూ లిడా కనిపిస్తుంది. ఆ రెండు జీవితదృక్పథాలూ కూడా, తన కాలం నాటి రెండు సామాజిక దృక్పథాలకీ ప్రతినిధులు. 60 ల భావజాలం ప్రభావంలో కొత్తగా ఏర్పడ్డ గ్రామపాలనా సంస్థల్ని చక్కదిద్దాలనీ, ప్రజలకి విద్య,ఆ రోగ్యం, సంరక్షణ కావాలనే దృక్పథానికి లిడా, అటువంటి ప్రజాకర్షక పథకాలు ప్రజలకి నిజంగా మేలు చెయ్యవనీ, అవి వాళ్ళని ఒక దాస్యం నుంచి మరొక దాస్యానికి తీసుకుపోతాయనీ, అంతిమంగా కావలసింది మానసిక స్వాతంత్ర్యమనీ నమ్మే కొత్త కళా దృక్పథానికి ప్రతినిధిగా కథకుడు కనిపిస్తాడు. ఈ ఇద్దరిలో చెకోవ్ నిజంగా ఎవరి పక్షం తీసుకున్నట్టు? ఇంతకు ముందు వివరించిన డేగా చిత్రంలోలాగా, ఈ కథని మనం ఏదో ఒక్క వ్యాఖ్యానానికి ముడిపెట్టలేం. అసలు, మన తీర్పుతో ఆ పాత్రలకి నిమిత్తం లేదు.

కథకుడిగా తన దృష్టి ఎంతసేపూ కథ పూర్తవగానే అది పాఠకుడి మీద విడిచిపెట్టే ముద్రతోనే అన్న చెకోవ్ ఈ కథద్వారా మనమీద విడిచిపెట్టే ముద్ర రెండు రకాలుగా ఉంటుంది. ఒక వైపు అది సౌందర్యాత్మకంగా ఉంటుంది. కానీ అక్కడితో ఆగకుండా,మనం ఆ కథలో కథకుడు నిజంగా ఏమి చెప్తున్నాడని ఆలోచించడం మొదలుపెడితే, కొంత తికమకగా ఉంటుంది. కథ రెండతస్తుల ఇల్లు చుట్టూ నడిచింది. ఆ రెండవ అంతస్తు ప్రాముఖ్యత కథలో చివరిలో తప్ప కనిపించదు. కథ చివర్లో, రాత్రి కథకుడూ, జెన్యా ఒకరి హృదయం ఒకరికి విప్పి చెప్పుకున్నాక,ఆమె ఇంట్లోకి వెళ్ళిన తరువాత, ఆ మేడ మీద కొంత సేపు వెలుగు కనిపిస్తుంది, ఏవో మాటలు నడుస్తాయి.అప్పుడు దీపం మందగిస్తుంది. అప్పుడేమి జరిగిందో ఆ మర్నాటిదాకా కథకుడికీ, మనకీ తెలియదు. అంటే, ఆ కథలో సంభవించవలసిన ముఖ్యమైన మలుపు, ఒక రకంగా కథాంతం, ఆ మేడమీద గదిలో, చీకట్లో సంభవించింది. ఇది నాచురలిస్టు కథనపద్ధతి కాదు. మపాసా వంటి కథకుడు, ఇబ్సెన్ వంటి నాటకకర్త ఇళ్ళల్లో, గదుల్లో సమాజం ఏ విధంగా రూపుదిద్దుకుంటోందో విస్పష్టంగా చూపిస్తారు. కాని ఈ కథలో కథకుడు ఇంప్రెషనిస్టు చిత్రకారుడిలాగా కథ అంటా ఆరుబయట నడిపిస్తాడు. కాని నిజంగా జరిగే కథ ఇంట్లో జరిగిపోతుంది.

కథలో లిడాకీ, కథకుడికీ మధ్య జరిగిన వివాదమంతా ఒక సైద్ధాంతిక వివాదంలాగా కనిపిస్తుంది. తనంటే ఆమెకి ఇష్టం లేదని కథకుడు అనుకుంటాడు. తన సామాజిక కార్యక్రమాల్లో కథకుడికి ఆసక్తి లేదని లిడా అనుకుంటుంది. కాని అది నిజంగా నిజమేనా?  కథ మొదట్లో లిడా బెలుకురోవ్ ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు, తానూ, తన తల్లీ కూడా కథకుడికి అభిమానులమని చెప్పడం మర్చిపోకూడదు. అప్పుడామె తన చెల్లెలి గురించి ప్రస్తావించకపోవడం కూడా గమనించాలి. ఒక రోజు కథకుడూ, జెన్యా కలిసి రావడం చూసాకనే, లిడా వైఖరిలో మార్పు వచ్చిందని మనం గుర్తుపట్టకపోం. అంటే లిడా లో తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి తోటిమనుషుల కోసం కష్టపడే మనిషితో పాటు,ఒక సాధారణ మహిళ, అహంభావానికీ,అసూయకీ అతీతురాలుగాని వనిత కూడా ఉందనుకోవాలా?

నిజానికి,కథకుడు మాట్లాడుతున్న మానసిక స్వాతంత్ర్యంగానీ, లిడా మాట్లాడుతున్న సామాజిక స్పృహ గానీ, ఒక స్థాయిదాటాక బోలుగానూ, పసలేనివిగానూ అనిపించకపోవు. ఒక విమర్శకుడు అన్నట్లుగా, వాళ్ళిద్దరూ కూడా అంతిమంగా ఆదర్శవాదులు మాత్రమే. లిడా తననొక రాడికల్ గా భావించుకుంటుంది, కాని కథకుడు ఆమెదంతా అనవసర జోక్యమనే అనుకుంటాడు. కథకుడు తానొక విస్తృత చిత్రాన్ని ఊహిస్తున్నానుకుంటాడు. కాని లిడా అతణ్ణి పలాయనవాది అనుకుంటుంది. ఇద్దరికీ, తమగురించీ,ఎదటి వ్యక్తి గురించీ కూడా తామేర్పరుచుకున్న ‘ఇంప్రెషన్లు ‘ ప్రధానం. ఏ ఒక్కరూ ఎదటివ్యక్తిని సానుభూతితో అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరు. అంతిమంగా ఇద్దరూ ఆత్మవంచకులే అనిపిస్తుంది. లిడా తన సుసంపన్నమైన జీవితాన్నీ, కథకుడు తన సోమరితనాన్నీ దాటి ఒక్క అడుగు కూడా ముందుకెయ్యరు. వాళ్ళిద్దరి మధ్యా వివాదం ఎప్పటికీ తెగేది కాదు.

కాని కథాసారాంశం ఏమిటి? రష్యాలోని ఏ సంక్షుభిత కాలంలో చెకోవ్ ఈ కథ రాసాడో, ఆ కాలమే కథావస్తువూ,సారాంశమూ కూడా. ‘అయితే ఏం చెయ్యాలి?’అన్న ప్రశ్ననే కథానాయిక, కథానాయకుడూ కూడా. బీదరికంతోనూ, సామాజిక అసమానతలతోనూ నలుగుతున్న రష్యాలో విద్యావంతుడైన, బాధ్యతాపరుడైన, సామాజికచైతన్యశీలుడైన మనిషి ఏమి చెయ్యాలి? ప్రశ్న ఒక్కటే, సమాధానాలు అనేకం. పాశ్చాత్యసానుభూతి పరులు రష్యా పాశ్చాత్యదేశాల్లాగ పారిశ్రమీకరణ చెందాలనీ, ప్రజాస్వామికం కావాలనీ, ఆధునీకరింపబడాలనీ వాదించారు. స్లావోఫిల్ వర్గాలు ( రష్యా సంప్రదాయ అనుకూల భావజాలం కలిగినవాళ్ళు)  రష్యా సంప్రదాయ శక్తుల్నే నమ్ముకోవాలని భావించారు. నరొదక్న్ లు (ప్రజాపక్షవాదులు) ప్రజలకు చేరువకావాలని  పోవాలని తపించారు. సొషలిస్టులూ, నిహిలిస్టులూ, అనార్కిస్టులూ ఒక విప్లవంతో రష్యాని గతం నుంచి బయటపడెయ్యాలని కోరుకున్నారు. అందరీ ప్రశ్నా అంతిమంగా ఒక్కటే. తనలో తను అనుకుంటున్నట్టుగా, రష్యా అంతా వినేలాగా, ప్రపంచమంతా వినబడేలాగా టాల్ స్టాయి వేసుకున్న ప్రశ్న: what is to be done?

ఆంటన్చెకొవ్

మిద్దెయిల్లు

ఒక చిత్రకారుడి కథ

I

దంతా జరిగింది ఆరేడేళ్ల కిందట. అప్పుడు నేను తి-ప్రాంతంలో బెలుకురొవ్ అనే భూస్వామికి అతిథిగా ఉండేవాణ్ణి. అతడు యువకుడు. తెల్లవారేజామునే లేచేవాడు. ఒక్ చక్కటి రైతుకోటు లాంటిది తొడుక్కుని మరీ  బయటికి వెళ్లేవాడు. సాయంకాలంపూట బీరు తాగేవాడు. తనపట్ల ఎవరూ ఎక్కడా సానుకూలత చూపటంలేదని వాపోతూండేవాడు. అతడి సుక్షేత్రంలో ఒక పెద్ద తోట ఉండేది. ఆ తోటలో ఒక పాతభవంతి ఉండేది. దానికి ఆనుకుని ఉన్న కొత్త ఇంట్లో అతడుండేవాడు. ఆ పాత ఇంట్లో నేనుండేవాణ్ణి. ఆ పాత ఇంట్లో పెద్దపెద్ద స్తంభాలున్న ఒక బాల్ రూంలో పెద్ద సోఫాతప్ప మరేదీ ఉండేదికాదు. నేనా సోఫామీదే పడుకునేవాణ్ణి. ఆ పక్కనే ఒక బల్ల. దానిమీద మేం పేకాడుకునేవాళ్లం. ఎల్లవేళలా, వాతావరణం బాగున్నప్పుడు కూడా ఆ గదిలో పాతకాలపు స్టవ్లు మండుతూనే ఉండేవి. పెద్దపెద్ద తుఫానులు వచ్చినప్పుడల్లా ఆ మొత్తం ఇల్లంతా కూలిపోయి తునాతునకలయిపోతుందా అన్నట్లుగా ఊగిపోతూండేది. అటువంటి తుఫాను రాత్రుల్లో ఆ ఇంటికుండే పెద్దపెద్ద కిటికీలు మెరుపులతో మెరిసిపోతూండేవి.

జీవితంలో సోమరిగా జీవించవలసివచ్చిన భాగ్యానికి నోచుకొన్నందున నేను చెప్పుకోదగ్గ పనేమీ చేసేవాడినికాను. గంటలతరబడి కిటికీలోంచి ఆకాశాన్నీ, పక్షుల్నీ చూస్తూండేవాణ్ణి. అప్పుడప్పుడు తోటలో పచార్లు చేస్తూండేవాణ్ణి. పోస్టులో ఏమొస్తే అది చదివేవాణ్ణి, నిద్రపోయేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు ఇల్లు దాటి రాత్రి బాగా పొద్దుపోయినదాకా అలా తిరుగుతూండేవాణ్ణి.

అలా బయట తిరిగినంతసేపూ తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు ఒకరోజు నేను అంతదాకా చూడని పెద్ద సుక్షేత్రమొకటి చూశాను. అప్పటికి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. పాలకంకులు విచ్చుకుంటున్న యవచేలమీద సాయంకాలపు నీడలు పరుచుకుంటూ ఉన్నాయి. అక్కడ ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా రెండు వరుసల్లో పొడవైన ఫర్ చెట్లున్నాయి. వాటిని నాటినప్పుడు చాలా దగ్గర దగ్గరగా నాటడంతో అవి దాదాపుగా దృఢమైన గోడలాగా అతుక్కుపోయాయి. వాటి చక్కని నల్లని నీడల్లో నడవడం అందమైన అనుభవం. నేను కంచె దాటి ఆ సుక్షేత్రంలో అడుగుపెట్టి ఆ చెట్లకిందనే నడవడం మొదలుపెట్టాను. ఆ దారి పొడుగునా రాలిన చెట్ల ఆకులు దట్టమైన తివాసీలాగా పరుచుకుని ఉన్నాయి. నా పాదాలు వాటిమీద జారిపోతున్నాయి. చెట్ల చిటారుకొమ్మల్ని అల్లుకున్న సాలెపురుగు గూళ్లమీద ఇంద్రధనుస్సులాగా సూర్యకాంతి తళుకులీనుతూంది. ప్రకాశమంతమైన ఆ బంగారు తునకలు తప్ప తక్కిందంతా చీకటిగానూ, నిశ్శబ్దంగానూ ఉంది. ఫర్ చెట్ల మీంచి వీస్తున్న పరిమళం సమ్మోహనకరంగా ఉంది. నేను ఆ చెట్లకిందనుండి దారికటూఇటూ నాటిన నిమ్మచెట్ల దారిలో అడుగుపెట్టాను. అక్కడ కూడా ప్రతిఒక్కటీ ఎవరూ పట్టించుకోనట్టుగా పాతబడ్డట్టుగా ఉంది. కిందటేడు హేమంతంలో రాలిన చెట్ల ఆకులు పాదలకింద విషాదభరితంగా, మృదువుగా చప్పుడు చేస్తున్నాయి. చెట్లకాండాల మధ్యగా వెనక్కి జారిపోతున్న సాయంసంధ్యాకాంతిలో నీడలు దోబూచులాడుతున్నాయి. నాకు కుడివైపు ఒక పురాతన నికుంజంలో పక్షి ఒకటి బలహీనస్వరంతో ఎవరికీ అక్కర్లేని పాట ఒకటి పాడుతోంది. బహుశా ఇక్కడున్న తక్కినవాటన్నిట్లానే ఆ పిట్టకూడా పాతపడి అలసిపోయుండాలి. ఆ నిమ్మచెట్ల దారి చివరకు ఒక పాత ఇంటిముందుకు చేరుస్తున్నది. ఆ ఇంటికొక వసారా, ఇంటిపైన రెండు మిద్దెలూ ఉన్నాయి. అక్కడ నాకొక ముంగిలి, ఒక పెద్ద కొలను, ఆ కొలను ఒడ్డుమీద స్నానశాల పక్కనే ఆకుపచ్చని విల్లో తరువుల సముదాయం కనిపించాయి. ఆ చెరువుకు ఆవలివైపు ఓ గ్రామం, ఆ గ్రామం మధ్యలో సన్నని పొడవైన చర్చిగోపురం కూడా కనిపించాయి. ఆ గోపురం పైన శిలువను అస్తమిస్తున్న సూర్యుడి చివరి కిరణాలు వెలిగిస్తూఉన్నాయి.

ఒక్కక్షణంపాటు నేను నాకేదో అత్యంత పరిచితమైనదాన్ని చూస్తున్నట్టుగా మంత్రముగ్ధుణ్ణయిపోయాను. ఆ సుందరదృశ్యం నేనింతకుముందు ఎప్పుడో చూసినట్టుగానూ,  బహుశా నా పసితనంలో చూసినట్టుగానూ, అది నాకు చాలా కాలం కిందటే పరిచయమైనట్టుగానూ గోచరించింది.

ఆ ఇంటి ఆవరణకు ముందు తెల్లరాళ్లతో నిర్మించిన దృఢమైన గుమ్మం ఉంది. ఆ గుమ్మానికి అటూఇటూ సింహప్రతిమలున్నాయి. ఆ ద్వారం పొలాలవైపు తెరుచుకున్న చోట ఇద్దరు యువతులు నిల్చొనిఉన్నారు. వారిలో పెద్దమ్మాయి సన్నగా, మరీ తెల్లగా చాలా అందంగా ఉంది. ఆమె జుత్తు గోధుమరంగులో ఉంది. కానీ ఆమె నోరు చిన్నగా, బింకంగా ఉంది. ఆమె చూడటానికి కొంత కఠినంగానే కనిపిస్తున్నది.  ఆమె నన్ను గమనించనే లేదు. మరొకమ్మాయి చిన్న బాలిక. బహుశా పదిహేడు పద్ధెనిదేళ్లకన్నా మించి ఉండదు. ఆమె కూడా సన్నగా, మరీ తెల్లగా ఉంది. కానీ ఆమె నోరు మాత్రం బాగా పెద్దది. ఆమె ఆశ్చర్యభరితనేత్రాలతో నన్నే పరికించిచూస్తూన్నది. నేను ఆ పక్కనించే వెళ్తున్నప్పుడు ఒకటీ రెండు ఇంగ్లీషు పదాలు కూడా ఆమె నోటివెంట విన్నాను. నన్ను చూసి ఆమె హటాత్తుగా కంగారుపడింది. ఆ సమ్మోహనకరమైన వదనాలను నేను ఎన్నడో ఏ సుదూరగతంలోనో చూసినట్టే నాకవి బాగా పరిచయమైనట్టే అనిపించింది. ఏదో సంతోషభరిత స్వప్నం కలగన్న అనుభూతితో నేను ఇంటికి తిరిగివచ్చాను.

కొన్నిరోజుల తరువాత. ఒక మధ్యాహ్నం బెలుకురొవ్, నేనూ ఆ ఇంటిముందు నుంచే నడిచి వెళ్తున్నాం. ఆ ఇంటిముందు ముంగిలిలో ఒక పెద్ద బండి మలుపు తిరుగుతోంది. దాని చక్రాలకింద పొడవైన గడ్డి మృదువుగా చప్పుడు చేస్తూ ఉంది. అందులో నేనింతకుముందు చూసిన అమ్మాయిల్లో పెద్దమ్మాయి కూర్చొనిఉంది. ఆమె కొంతమంది అగ్నిప్రమాద బాధితులకు సహాయం చేయడంకోసం చందాపట్టీ ఒకటి తీసుకువచ్చింది. ఆమె మాకేసి చూడకుండానే సియనొవొ అనే గ్రామంలో ఎన్ని ఇళ్లు తగలబడిందీ, ఎందరు స్త్రీలు, పురుషులు, పిల్లలు నిరాశ్రయులయ్యిందీ ఆ వివరాలన్నీ గంభీరస్వరంతో చెప్పుకొచ్చింది. వారికి పునరావాసం కల్పించడంకోసం, సహాయం అందించడంకోసం అక్కడ కమిటి ప్రతిపాదించిన తాత్కాలికచర్యల గురించికూడా చెప్పింది. ఆ కమిటిలో ఆమె కూడా ఒక సభ్యురాలు. ఆ చందాపట్టీమీద సంతకాలు అయిన తరువాత ఆమె దాన్ని మడిచిపెట్టి మా నుంచి వెంటనే సెలవు తీసుకోవడానికి ఉద్యుక్తురాలయ్యింది.

వీడ్కోలు పూర్వకంగా చేయి చాపుతూ ‘మీరీమధ్య మమ్మల్ని బొత్తిగా మర్చిపోయారు, ప్యొతొర్ పెట్రోవిచ్’ అందామె బెలుకురొవ్ తో. ‘అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూస్తూండండి. అలాగే శ్రీ ఎన్. (ఆమె నా పేరు పలికి) తన అభిమానులు కొందర్ని చూడాలనుకుంటే నేనూ, మా అమ్మా కూడా ఎంతో సంతోషంగా స్వాగతిస్తాం’ అన్నది.

నేను శిరసు వంచాను.

ఆమె వెళ్లిపోయిన తర్వాత ప్యొతొపెట్రోవిచ్ ఆమె గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆమె పేరు లిడియా వొల్చానినొవ అనీ, ఆమె చక్కటి కుటుంబం నుంచి వచ్చిందనీ ప్రస్తుతం తన తల్లితో, చెల్లెలితో ఆమె ఉంటున్న సుక్షేత్రమూ, ఆ చెరువుకు అవతలి వైపున ఉన్న గ్రామమూ మొత్తాన్నీ కలిపి షెల్కొవ్క అంటారని చెప్పారు. ఆమె తండ్రి మాస్కోలో చాలా ఉన్నతస్థానానికి చేరుకున్నాడనీ, ప్రీవి కౌన్సిలర్ గా పనిచేస్తూ మరణించాడని కూడా చెప్పాడు. సహజంగా కలిగేవాళ్లే అయినప్పటికీ వొల్చానినొవలు దాదాపుగా ఏడాది పొడుగునా గ్రామసీమలోనే నివసిస్తూఉంటారనీ లిడియా తన స్వగ్రామమైన షెల్కొవ్కలోని స్థానిక జెంస్త్వొ పాఠశాలలో నెలకు పాతికరూబుళ్ల జీతంమీద పిల్లలకు బోధిస్తూఉంటుందని కూడా చెప్పాడు. తన వ్యక్తిగత అవసరాలు ఆ డబ్బుతో సరిపెట్టుకుంటుందనీ తన జీవనోపాధి తనే సంపాదించుకుంటున్నందుకు ఆమె ఎంతో గర్విస్తూంటుందననీ కూడా చెప్పాడు.

‘చాలా ఆసక్తికరమైన కుటుంబం’ అన్నాడు బెలుకొరొవ్. ‘మనం ఒకసారి వాళ్ల దగ్గరికి పోయివద్దాము. నువ్వొస్తే వాళ్లు చాలా సంతోషిస్తారు.’

ఒకరోజు- ఆరోజేదో పండగరోజు కూడా – సాయంకాలం భోజనమయిన తరువాత మేము వొల్చానినొవలను గుర్తుచేసుకుని షెల్కొవ్క బయలుదేరాం. మేం వెళ్లేటప్పటికి ఆ తల్లీ ఇద్దరు కూతుళ్లు కూడా ఇంటిదగ్గరే ఉన్నారు. వాళ్ల అమ్మ యెకతెరీనా పావ్లొవ్న ఒకప్పుడు అందగత్తె అయి ఉండాలి. అయితే ఇప్పుడు వయసుకుమించి బాగా లావెక్కింది. అందువల్ల త్వరగా అలసిపోయినదానిలాగా కూడా కనిపిస్తోంది. విషాదభరితంగానూ, పరధ్యానంగానూ ఉన్నట్టు కనిపించింది. ఆమె నాతో చిత్రకళ గురించి మాట్లాడాడానికి ప్రయత్నించింది. నేను షెల్కొవ్క వచ్చి వాళ్లను కలవబోతున్నానని వాళ్లమ్మాయి చెప్పగానే ఆమె నేను గీసిన రెండూమూడు ప్రకృతి దృశ్యాలను గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నించింది. ఆమె వాటిని ఎప్పుడో మాస్కోలో ఏ  చిత్రకళాప్రదర్శనల్లో చూసిఉంటుంది. వాటి ద్వారా నేను ఏం వ్యక్తంచేయాలనుకున్నానో చెప్పమని ఇప్పుడడిగింది. లిడియా లేదా ఆమెను ఇంట్లో పిలిచేటట్టుగా, లిడా నాతోకన్నా బెలొకురొవ్ తోటే ఎక్కువ మాట్లాడింది. ఆమె వదనం మందహాసభరితంగానూ, గంభీరంగానూ ఉంది. అతడు జెంస్త్వొలో ఎందుకు పనిచేయటంలేదనీ, ఆ గ్రామ పాలనాసంస్థ సమావేశాలు ఒక్కదానికికూడా అతడెందుకు హాజరుకావటంలేదనీ అడిగింది.

‘అలా చేయడం సరైంది కాదు ప్యొతొర్ పెట్రోవిచ్’ అన్నదామె కొద్దిగా మందగింపు ధోరణిలో. ‘నిజంగానే అలా చేయడం సరైంది కాదు. మిమ్మల్ని చూసి మీరు సిగ్గుపడాలి’ అంది.

‘అవును, లిడా, నిజమే’ తలూపింది వాళ్లమ్మ. ‘అలా చేయడం సరైంది కాదు.’

లిడా  నావైపు తిరిగి చెప్పడం కొనసాగించింది, ‘మనం మొత్తం జిల్లా అంతా కూడా బలగిన్ చేతుల్లో ఉంది. అతడు స్థానిక పాలనాసంస్థ అధ్యక్షుడు. అతడు తన అల్లుళ్లతో, మేనళ్లులతో మొత్తం జిల్లా పదవులన్నీ నింపేశాడు. ఇష్టంవచ్చినట్టు చేస్తున్నాడు. అతణ్ణి మనం ఎలాగైనా సరే ప్రతిఘటించితీరాలి. మనం యువతీ యువకులమంతా సంఘటితపడాలి. కానీ నీకు తెలుసు మన యువతరం ఎట్లా ఉందో. అస్సలు బాగోలేదు ప్యొతొర్ పెట్రోవిచ్’ అంది.

అట్లా జెంస్త్వొ గురించి చర్చిస్తున్నప్పుడు ఆమె చెల్లెలు జెన్యా ఏమీ మాట్లాడలేదు. అటువంటి గంభీరసంభాషణల్లో ఆమె ఏ విధంగానూ పాలుపంచుకోలేదు. ఆమె కుటుంబం ఆమెనింకా ఎదిగిన పిల్లగా చూడడం లేదు. ఆమెనింకా వాళ్లు ఆమె చిన్నప్పటి ముద్దుపేరుతో ‘మిస్సీ’  అనే పిలుస్తున్నారు. ఆమె తన చిన్నప్పుడు తన ఇంట్లో పనిమనిషిని అలా పిలిచేదట. ఆమె నన్నే కుతూహలంగా చూస్తూ ఉన్నది. నేను వాళ్ల కుటుంబఫొటో ఆల్బమ్ తిరగేస్తూ ఉండగా ఆమె వాళ్లందరి గురించీ చెప్తూ ఉన్నది. ‘ఆయన మా మామయ్య… ఆయన మా తాతయ్య’ అంటూ ఉంది. ప్రతి ఒక్కరి ముఖచిత్రాన్నీ వేలితో తాకి చూపిస్తూండగా ఆమె భుజం అనుకోకుండా నా భుజానికి తాకుతూన్నది. అట్లా ఆ భుజం తాకుతూన్నప్పుడల్లా ఇంకా సుస్పష్టాకృతి పొందని ఆమె లేత వక్షం కనిపిస్తూన్నది. ఆమె సన్నని భుజాలు, జడ, గట్టిగా బిగించిన నడుము, మొత్తం ఆకృతి అంతా కనిపిస్తున్నది.

మేము ఆ పచ్చికలో టెన్నిస్ ఆడుకున్నాం. ఆ తోట చుట్టూతా పచార్లు చేశాం. టీ తాగాం. ఆ తరువాత చాలా సేపు రాత్రి భోజనం దగ్గరే గడిపేశాం. నేను ఉంటూన్న విశాలమైన ఆ శూన్యమందిరం నాకు బాగా అలవాటయిపోవడంతో ఈ చిన్న ఇంట్లో నేను అంత సౌకర్యవంతంగా కుదురుకోలేకపోయాను. ఇక్కడి గోడలమీద తైలవర్ణ చిత్రాలేవీ లేవు. పనివాళ్లని అందరూ సంబోధించేటట్టుగా ‘నువ్వు’ అని కాక వాళ్లు ‘మీరు’ అని పిలుస్తున్నారు. లైదా, మిస్సీ ఆ వాతవరణాన్ని ఎంతో నవనవంగా, నిర్మలంగా మార్చేశారు. అక్కడ ప్రతిఒక్కటీ నిజాయితీతో శోభిస్తూన్నది. రాత్రి భోజనం దగ్గర లిడా బెలుకురొవ్ తో మళ్లా జెంస్త్వొ గురించీ, బలగిన్ గురించీ పాఠశాలగ్రంథాలను గురించి మాట్లాడుతున్నది. ఆమె మాటలు ఎంతో నిజాయితీతో, ఎంతో ఉత్సాహంతో, ఎంతో నిబద్ధతతో వినిపిస్తున్నాయి. ఆమె సుదీర్ఘంగా మాట్లాడుతున్నప్పటికీ, బిగ్గరగా మాట్లాడుతున్నప్పటికీ అలా మాట్లాడుతుంటే వినడం ఆసక్తికరంగానే ఉంది. బహుశా ఆమె పిల్లలకి బోధిస్తుండడం కూడా ఇందుకు కారణమై ఉండవచ్చు. అయితే నా స్నేహితుడు ప్యొతొపెట్రోవిచ్ మాత్రం తన విద్యార్థిజీవితపు అలవాట్లనుంచి ఇంకా బయటపడలేదు. ప్రతి సంభాషణనీ వాదోపవాదంగా మారుస్తూండే అలవాటుకు అతడింకా అంటిపెట్టుకునే ఉన్నాడు. దాంతో తన తెలివితేటలు, అభ్యుదయభావాలు చూపించాలన్న సుస్పష్టమైన కోరికతోటి అతడు అడ్డదిడ్డంగా వినేవాళ్లు అలసిపోయేటట్టుగా మాటాడుతూనే ఉన్నాడు. మాటల మధ్యలో ఏదో ఆహారపదార్థం కావాలని సైగ చేయడంలో అతడి చేయి తగిలి పచ్చడిగిన్నె కిందపడి ఆ భోజనాల బల్ల గుడ్డ మీద పచ్చడి ఒలికి అలుక్కుపోవడం నేను తప్ప మరెవరూ గమనించలేదు.

మేము తిరిగి ఇంటిదారి పట్టేటప్పటికి అంతా నిశ్శబ్దంగానూ, చిమ్మచీకటిగానూ ఉంది.

‘సంస్కారమంటే భోజనాల బల్లమీద పచ్చడిగిన్నె పడేయకుండా ఉండడంకాదు, అలా మరెవరన్నా పడేస్తే, దాన్ని చూసీచూడకుండా ఉండడం’ అని నిట్టూర్చాడు బెలుకురొవ్. ‘వాళ్లు నిజంగానే ఆహ్లాదభరితులైన, సంస్కారవంతులైన మనుషులు. నేను చక్కటి మనుషుల్ని చూసి ఎన్నాళ్లో అయింది. నేను బొత్తిగా చెడిపోతున్నాను. చేయవలసింది చాలా ఉంది. ఎంతో ఉంది ‘ అన్నాను.

ఎవరైనా ఆదర్శవంతులైన భూస్వామి కావాలంటే ఎటువంటి కృషి చేపట్టాలో చెప్పాడతడు. కానీ అతడెంత సోమరి అనుకున్నాను. అతడేదన్నా గంభీరవిషయం గురించి మాట్లాడుతున్నప్పుడు అతడి మాటల్లో అక్కడక్కడా శబ్దాలు మరీ గట్టిగా ఒత్తి పలుకుతూంటాడు. అతడు చేసే పనులు కూడా అతడు మాట్లాడుతున్నట్టే చప్పుడు చేస్తుటంఆయి, నెమ్మదిగా, మందకొడిగా, ఏదీ సకాలంలో పూర్తిచేయకుండా. అతడు ఏదన్నా ఆచరించి చూపగలడని నేనెప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే నేనెప్పుడన్నా అతడికి పోస్టు చేయమని ఉత్తరాలిస్తే, వాటిని  జేబులోనే పెట్టుకుని వారాలతరబడి మర్చిపోతాడు.

నాతోపాటే నడుస్తూ అతడు గొణుక్కుంటూనే ఉన్నాడు. ‘అన్నిటికన్నా దారుణమేమిటంటే, నువ్వు పని చేస్తూనే ఉంటావు, మరింత పని చేస్తూనే ఉంటావు. కానీ నీకెవ్వరినుంచీ సానుభూతి దొరకదు. ఎటువంటి సానుభూతి కూడా.’

II

వొల్చనినొవల దగ్గరికి వెళుతుండడం నాకు అలవాటుగా మారింది. అక్కడికి వెళ్లగానే వరండాలోకి దారితీసే మెట్టదగ్గర అన్నిటికన్నా కింద మెట్టుమీద కూర్చునేవాణ్ణి. చాలా త్వరితంగానూ, నిస్సారంగానూ సాగిపోతూండే జీవితం గురించి తలచుకోగానే నన్నేదో చెప్పలేని దుఃఖం ఆవహిస్తూండేది. నాకు భారంగా పరిణమించిన నా హృదయాన్ని ఛేదించుకుంటే బాగుణ్ణని నాకునేనే పదేపదే చెప్పుకునేవాణ్ణి. నేనట్లా అక్కడ కూర్చున్నంతసేపూ వరండాలో ఎవరోఒకరు మాట్లాడుతూనే ఉండేవారు. మనుషులు అటూ ఇటూ కదులుతున్నట్టుగా కదులుతున్నప్పుడు వాళ్ల వస్త్రాలు చేసే మర్మర ధ్వని, పుస్తకాల పుటలు తిప్పుతున్న చప్పుడు వినవస్తూనే ఉండేది. లిడా రోగులకు చికిత్స చేస్తూండడం, చదవడానికి పుస్తకాలు ఇస్తూండడం, పగటిపూట తలకేమీ కప్పుకోకుండానే గొడుగువేసుకుని గ్రామంలోకి వెళ్లి వస్తూండడం, సాయంకాలంపూట పెద్ద గొంతుకతో జెంస్త్వొ గురించి, పాఠశాలలగురించి మాట్లాడుతూండటం నాకలవాటయిపోయాయి. సన్నగా, ఆకర్షణీయంగా,కానీ, చాలా గంభీరంగా ఉండే ఆ యువతి తన చిన్ని అందమైన నోరు తెరిచి సామాజిక అవసరాలు గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే నావైపు తిరిగి ఇలా అనేది:

‘ఈ విషయం నీకు ఆసక్తి కలిగించదు.’

ఆ మాటలు ఆమె తరువాత మాట్లాడబోయే మాటలకు ఉపోద్ఘాతంలాగా వినిపించేవి. ఆమెకు నేనంటే ఎంతమాత్రం ఇష్టంలేదు. నేను కేవలం ప్రకృతిదృశ్యాలు చిత్రించుకునే చిత్రకారుడిగా ఉంటున్నందుకు ఆమె ఎంతో బలంగా నమ్ముతున్న విషయాలపట్లా, విశ్వాసాలపట్లా నేను ఉదాసీనంగా ఉంటున్నానని ఆమె అనుకుంటున్నందువల్లా నా పట్ల చాలా అయిష్టత పెంచుకుంది. ఒకప్పుడు నేను బైకాల్ సరస్సు తీరంలో గుర్రంమీద ప్రయాణిస్తున్నాను. అప్పుడు మరొక గుర్రంమీద చొక్కా, నీలంరంగు పంట్లాం ధరించిన ఒక బురియా యువతిని చూశాను. నేనామెను తన పైపు అమ్మమని అడిగాను. కానీ ఆమె నా ఐరోపీయ ముఖకవళికలు, నెత్తిన టోపీ చూసి నా పట్ల చాలా ఏహ్యభావం కనబరిచింది. ఒక్క నిముషం కూడా నాతో పూర్తిగా  మాట్లాడకుండానే గట్టిగా గుర్రాన్ని అధిలిస్తూ వేగంగా దౌడుతీసింది. లిడాకి కూడా బహుశా నాలో ఏదో విజాతీయమైంది కనిపించి ఉండాలి. ఆమె తన అయిష్టతను బయటికి చూపించకపోయినా నేను ఆమె మనోభావాన్ని గ్రహించకుండా ఉండలేకపోయాను. అక్కడ వరండా దగ్గర అన్నిటికన్నా చివరిమెట్టు మీద కూర్చొని ఆమె పట్ల నాలో కలుగుతున్న విసుగును నాతోనేనే పంచుకునేవాణ్ణి. నువ్వు స్వతహాగా వైద్యం చదవకుండా రైతులకి చికిత్స చేయటం మోసం తప్ప మరేమీ కాదనీ, విస్తారమైన భూక్షేత్రం ఉన్నవాళ్లెవరికైనా దానదర్మాలు చేయడం సులభమేనని అనుకునేవాణ్ణి.

కాని ఆమె సోదరి మిస్సీకి మాత్రం ఈ ప్రపంచం పట్టేదికాదు. ఆమె కూడా నాకులానే పూర్తి సోమరితనంలో కాలం గడిపేసేది. పొద్దున్న లేచీ లేవగానే ఆమె వరండాలో మడతకుర్చీలో పూర్తిగా ముడుచుకుని ఏదో ఒక పుస్తకం చదవడం మొదలుపెట్టేది. అట్లా కూర్చున్నప్పుడు ఆమె పాదాలు నేలని ఆనేవే కావు. లేదా ఆ పుస్తకంతో అట్లానే నిమ్మచెట్ల బాటమీదనో లేదా ఆ సింహద్వారం దాటి పొలాల్లోకో నడుచుకుంటూ పోయేది. ఆమె రోజంతా చదువుతూనే ఉండేది. పుస్తకాల పేజీలు ఆబగా తిరగేస్తూ ఉండేది. అప్పుడప్పుడు ఆమె ముఖంలో కనబడే అలసట, అర్థరహితమైన చూపు, పూర్తిగా కళతప్పిన వదనం చూస్తే,  ఈ చదవడం వల్ల ఆమె మానసికంగా బాగా అలసట పడుతున్నట్టుగా అనిపించేది. నేను అక్కడికి వెళ్లినప్పుడు ఆమె నన్ను చూడగానే ఆమె బుగ్గలు కనిపించీ కనిపించకుండా ఎర్రబారేవి. వెంటనే ఆమె చేతిలోఉన్న పుస్తకం పక్కనపెట్టేసి తన పెద్దనేత్రాలతో నన్నే చూస్తూండేది. నేను చివరిసారి కలిసినప్పటినుంచీ అప్పటిదాకా ఏమేమిజరిగిందో అదంతా చెప్పుకొచ్చేది – పనివాళ్ల ఇళ్లల్లో పొగగొట్టానికి నిప్పంటుకుందనో లేదా చెరువులో పెద్ద చేప దొరికిందనో ఏదో ఒకటి – మామూలురోజుల్లో ఆమె లేతరంగు రవిక, ముదురు నీలంరంగు పావడా ధరించేది. ఆమె, నేనూ కలిసి అట్లా నడుచుకుంటూ పోయేవాళ్లం. పచ్చడికోసం ఉసిరికాయలు ఏరడం, లేదా చెరువులో పడవ నడుపుకుంటూ పోవడమో చేస్తూండేవాళ్లం. ఎప్పుడైనా ఆమె కొమ్మలమీద అందీఅందని ఉసిరికాయలు తెంపటానికి పైకి ఎగరినప్పుడు లేదా పడవ తెడ్డు నడపడానికి ముందుకు చేతులు చాచినప్పుడో సున్నితమైన ఆమె మోచేతులు ఆమె చొక్కా చేతుల్లోంచి బయటపడుతుండేవి. ఒకొక్కప్పుడు నేను బొమ్మలు గీసుకుంటుంటే ఆమె పక్కననిల్చొని అదంతా ఎంతో ఆరాధనా పూర్వకంగా చూస్తూండేది.

జులై మాసాంతంలో ఒక ఆదివారం నేను పొద్దున్న తొమ్మిదిగంటలవేళ వొల్చనినొవల ఇంటికి బయలుదేరాను. కానీ వాళ్లింట్లో అడుగుపెట్టకుండా అక్కడికి కొద్దిగా దూరంలో తోట చుట్టూ తిరుగుతూ పుట్టగొడుగుల కోసం వెతుకుతున్నాను. వేసవిలో అవి బాగా విరివిగా తలెత్తేవి. అవి ఎక్కడెక్కడ కనబడ్డాయో అక్కడల్లా పుల్లలు పాతి గుర్తు పెట్టుకుంటూ ఉన్నాను. మళ్లా జెన్యాతో వచ్చి వాటిని ఏరుకోవచ్చని నా ఆలోచన. వెచ్చని గాలి వీస్తూఉన్నది. జెన్యా, వాళ్లమ్మ ఆదివారం పూట వేసుకొనే లేతరంగు దుస్తుల్లో చర్చినుండి ఇంటికి తిరిగివస్తూ కనిపించారు. జెన్యా తన టోపీ తీసి దారికడ్డంగా పెట్టుకుని కనిపించింది. అప్పుడు వాళ్లు వరండాలో కూర్చొని టీ తాగుతున్నట్టుగా అప్పుడు వినవస్తున్న చప్పుళ్లనుబట్టి పోల్చుకున్నాను.

ఎటువంటి బరువుబాధ్యతలు లేని నాలాంటి మనిషికి, సోమరిగా గడపడానికి ఎప్పుడూ ఏదోఒక నెపంకోసం వెతుక్కొనే నాలాంటివాడికి మన గ్రామక్షేత్రాల్లో కనవచ్చే ఇటువంటి వేసవికాలపు ఆదివారాలు, ఇటువంటి ప్రభాతాలు మరీ ప్రత్యేకంగా మరీ సమ్మోహనకరంగా ఉంటాయి. ఇటువంటప్పుడు తోట మరీ ఆకుపచ్చగా అక్కడక్కడా మెరుస్తున్న మంచుతునకలతో మరీ శోభాయమానంగా ఉంటుంది. సూర్యకాంతిలో మెరుస్తూ ఉల్లాసభరితంగా కనిపిస్తుంది. ఇంటికి ఆనుకుని ఉన్న పూలతోటలో గన్నేరులూ సంపెంగలూ పరిమళం వెదజల్లుతూ ఉంటాయి. అప్పుడే చర్చినుంచి తిరిగివచ్చి యువజనం తోటలో కూర్చొని టీ తాగుతూఉంటారు. ప్రతిఒకళ్లూ ఎంతో ఉల్లాసభరితంగా, ఎంతో ఆకర్షవంతంగా దుస్తులు వేసుకుని ఉంటారు. ఎంతో ఆరోగ్యవంతంగా చాలా అందంగా పుష్ఠిగా కనిపించే ఈ మనుషులంతా మొత్తం రోజుపొడుగునా ఏ పనీ చేయకుండానే గడిపేస్తారని స్ఫురించగానే జీవితం ఎల్లప్పుడూ ఇలానే గడవాలని వెర్రిగా కోరుకుంటాను. ఆ మొత్తం రోజు పొడుగునా లేదా ఆ వేసవి అంతా నాకేమీ చేయటానికంటూ ప్రత్యేకంగా లేకపోవడంతో ఈ ఉదయం కూడా నేను ఇవే ఆలోచనలతో తోటలో అకారణంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాను.

తన చంకనొక బుట్ట తగిలించుకుని జెన్యా కనిపించింది. ఆమెను చూస్తే ఆ రోజు ఆ తోటలో నేనామెకు కనిపించే తీరుతానన్నట్టుగా ఆమె భావిస్తున్నట్టుగానే ఉంది. మేమిద్దరం కలిసి పుట్టగొడుగులు ఏరుకున్నాం. ఎన్నో మాట్లాడుకున్నాం. మాటల మధ్యలో ఆమె నన్నేదో అడుగుతున్నప్పుడు, నాముఖం బాగా కనిపించాలని నాకు ఎదురుగా వచ్చి నిల్చొంది.

‘నిన్న ఊళ్లో ఓ అద్భుతం జరిగింది’ అందామె. ‘పాపం పెలగెయ ఏడాది పాటుగా జబ్బు పడి ఉంది. ఎటువంటి వైద్యులు ఎటువంటి మందులూ కూడా ఆమె రోగాన్ని మాన్చలేకపోయారు. అట్లాంటిది నిన్నెవరో ఒక సాధువు ఒకామె వచ్చి ఆమె చెవిలో ఏదో మంత్రం పలికింది. దాంతో ఆమె జబ్బు ఉన్నట్టుండి మాయమైపోయింది.’

‘అదేమీ విశేషం కాదు’ అన్నాన్నేను. ఎవరన్నా మనుషులు ముసలివాళ్లయినప్పుడో లేదా జబ్బు పడ్డప్పుడు మాత్రమే మనం మంత్రాలకోసం, మహిమలకోసం వెతక్కూడదు. ఆ మాటకొస్తే, మనుషులు ఆరోగ్యంగా ఉండడమే ఒక అద్భుతం కాదా? జీవితం దానికదే మహిమోపేతం కాదా? మనం అర్థం చేసుకోలేని ప్రతిఒక్కటీ కూడా నా దృష్టిలో ఒక అద్భుతమే!’

‘నువ్వు అర్థం చేసుకోలేని విషయాలను చూస్తే నీకు భయమేయదా?’

‘లేదు. నాకు అర్థంకాని విషయాలని నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. వాటికి లొంగిపోను. నేను వాటికన్నా ఎక్కువే అనుకుంటాను. ఏ మనిషైనా తనని సింహాలకన్నా, పులులకన్నా, నక్షత్రాలకన్నా, ఈ సమస్తప్రకృతి కన్నా సమున్నతుడిగానే భావించవలసిఉంటుంది. ఆ మాటకొస్తే మనకర్థంకాని విషయాలకన్నా అద్భుతమైన విషయాలనుకునే వాటికన్నా, ఉన్నతంగానే పరిగణించుకోవలసి ఉంటుంది. లేకపోతే అతడు మనిషే కాడు. ప్రతిఒక్కదానికీ భయపడే చుంచెలుకగానే మిగిలిపోతాడు.’

ఒక కళాకారుడిగా నాకు చాలా విషయాలు తెలిసిఉంటాయనీ, నాకు తెలియని విషయాలు కూడా నేను చాలా సరిగ్గా ఊహించగలుగుతాననీ జెన్యా భావించింది. నేను ఆమెను మరో ప్రపంచానికెక్కడికో, నా స్వంత ప్రపంచమేదో అక్కడికి,  ఈ ప్రపంచం కన్నా ఉన్నతప్రపంచానికెక్కడికో ఎగరేసుకుపోవాలని కోరుకునేది. ఆమె నాతో భగవంతుడి గురించీ, అనంతమైన జీవితం గురించీ, అద్భుతాలగురించీ మాట్లాడేది. మరణించడంతోటే మన భావనాప్రపంచం కూడా అంతరించిపోతుందని నమ్మేమనిషిని కాదుకాబట్టి నేను ‘ఔను మనుషులకి మరణం లేదు’ అనో లేదా ‘అనంతమైన జీవితం మనకోసం వేచి ఉంద’నో అనేవాణ్ణి. ఆమె కూడా మరో నిరూపణలేవీ అడక్కుండానే నా మాటలు ఎంతో నమ్మకంగా వింటూండేది.

మేము మళ్లా ఇంటిదారి పట్టినప్పుడు ఆమె హటాత్తుగా ఒక్కసారి ఆగి అన్నదికదా, ‘లిడా నిజంగానే అద్భుతమైన మనిషికదా. నేను ఆమెని ఎంతో ఆరాధిస్తాను. ఆమె కోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు నా జీవితాన్ని త్యాగం చేసేగలననిపిస్తుంది. కానీ ఎందుకని…’ అని జెన్యా నా కోటుమీద తన చూపుడువేలును ఆన్చి ‘ఎందుకని నువ్వెప్పుడూ ఆమెతో వాదిస్తుంటావు? ఎందుకంత తొందరగా ఉద్రేకపడుతుంటావు?’ అని అడిగింది.

‘ఎందుకంటే ఆమె చెప్పేది తప్పు కాబట్టి.’

నా మాటలు అంగీకరించనట్టుగా జెన్యా తల అడ్డంగా ఊపింది. ఆమె కళ్లల్లో నీళ్లు పొంగుకొచ్చాయి.

‘అర్థం చేసుకోవడం ఎంత కష్టం’ అందామె.

లిడా అప్పుడే ఎక్కడినుంచో వచ్చినట్టుంది. అక్కడ వసారాలో ఒక చేతితో టోపీ పట్టుకుని నిల్చొని ఎవరో పనివాళ్లకు ఏదో పురమాయిస్తూ ఉంది. సన్నగా, అందంగా సూర్యకిరణాల్లో వెలిగిపోతూ ఉంది. అప్పుడు తన కోసం వచ్చిన ఇద్దరు ముగ్గురు రోగులను లోపలికి తీసుకువెళ్లి వారితో బిగ్గరగా ఏదో మాట్లాడింది. ఆమె ఎదుట చాలా ముఖ్యమైన పని ఉన్నట్టుగా, అస్సలు తీరికలేనట్టుగా గదినుంచి గది కలియతిరుగుతూ ఒక్కొక్క బీరువా తీసి చూస్తూ అప్పుడు మేడమీదికి వెళ్లింది. ఆమెను భోజనానికి పిలవడం కోసం వాళ్లు చాలాసేపే వేచిచూశారు. కానీ ఆమె కిందకి వచ్చేటప్పటికి మేము సూపు తాగడం పూర్తయిపోయింది. అర్థరహితమైన ఈ చిన్నివివరాలు ప్రతిఒక్కటీ కూడా నేనెంతో ఇష్టంగా గుర్తుపెట్టుకున్నాను. ఆ రోజు విశేషించి చెప్పుకోదగింది ఏదీ జరగకపోయినప్పటికీ, ఆ రోజు గురించి నా జ్ఞాపకం, ఇప్పటికీ ఎంతో పదిలంగా, సజీవంగా ఉంది. భోజనం పూర్తయ్యాక జెన్యా ఎప్పటిలానే తన పడక్కుర్చీలో కుదురుకుని చదువుకుంటూ ఉంది. నేను వరండాలో చివరిమెట్టుమీద కూర్చొనిఉన్నాను. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఆకాశమంతా మబ్బులు ఆవరించి ఉన్నాయి. కొద్దిగా తేలికపాటి జల్లు పడింది. గాలివీచడం ఆగిపోవడంతో కొద్దిగా ఉక్కగా, వెచ్చగా కూడా ఉంది. ఆ రోజట్లానే అంతంలేకుండా, సుదీర్ఘకాలంపాటు కొనసాగేటట్టే అనిపించింది. ఇంకా నిద్రమత్తు వీడకుండానే యెకతెరీనా పావ్లొవ్న బయటికి వరండాలోకి వచ్చింది. ఆమె చేతిలో విసనకర్ర ఉంది.

‘ఓ అమ్మా!’ అంది జెన్యా ఆమె చేతిని ముద్దాడుతూ. ‘పగటిపూట పడుకోవడం నీకు మంచిది కాదు.’

వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం. వాళ్లల్లో ఏ ఒకరైనా తోటలోకి వెళ్లారంటే రెండవమనిషి తక్షణమే వరండాలో ప్రత్యక్షం కావడం ఖాయం. అట్లా వరండాలోకి వచ్చిన నిల్చొని చెట్లవైపు, చెట్లమధ్యనుండే ఖాళీలవైపు చూపులు సారిస్తూ, ‘ఓ జెన్యా’ అనో లేదా ‘అమ్మా ఎక్కడున్నావు’ అనో పిలుచుకోవడం కూడా ఎప్పుడూ జరిగేవే. వాళ్లెప్పుడూ ప్రార్థనలు కలిసేచేసేవాళ్లు. ఇద్దరూ నిష్టాపరులే. వారిద్దరూ పెద్దగా మాట్లాడుకోకపోయినా ఒకర్నొకరు చాలా చక్కగా అర్థం చేసుకునేవారు. తక్కినవాళ్ల గురించి వాళ్లకున్న అభిప్రాయాలు కూడా ఒక్కలాంటివే. యెకతెరీనా పావ్లొవ్న కూడా తొందరలోనే నేనంటే ఇష్టం పెంచుకుంది. ఎప్పుడైనా రెండుమూడు రోజులపాటు వాళ్లను పోయి కలవకపోతే నా ఒంట్లో బాగుందాలేదా అని ఆరాతీసేవాళ్లు. ఆమె కూడా నా బొమ్మల్ని ఎంతో ఆరాధనాపూర్వకంగా పరికించేది. మిస్సీలానే తను కూడా స్వేచ్ఛగా నిస్సంకోచంగా ప్రతిఒక్కటీ నాకు చెప్పేది. అలా చెప్పుకునేవాటిలో, అప్పుడప్పుడూ ఇంటి రహస్యాలు కూడా ఉండేవి.

ఆమెకి తన పెద్దమ్మాయంటే బెదురుగానే ఉండేది. లిడాకి ప్రేమాభిమానాలు వ్యక్తం చేయడమెలానో తెలియదు. ఆమె ఎప్పుడూ గంభీరవిషయాలగురించే మాట్లాడేది. ఆమెదొక ప్రత్యేక జీవితం. ఓడమీద తక్కిన నావికుల నుంచి తననుతాను వేరుచేసుకుంటూ ప్రత్యేకమందిరంలో కూర్చొనే ఓడ కెప్తానులాగా ఆమెకూడా తన తల్లికీ, సోదరికీ ఏదో ప్రత్యేకమైన, గంభీరమైన, పవిత్రమైన విషయంలాగా గోచరించేది.

‘మా లిడా చాలా గొప్ప మనిషి కదా’ అనేది వాళ్లమ్మ తరచూ.

ఇప్పుడుకూడా సన్నగా వానపడుతున్నప్పుడు మేము లిడా గురించే మాట్లాడుకున్నాం.

‘ఆమె చాలా అద్భుతమైన మనిషి’ అన్నది వాళ్లమ్మ. అప్పుడు అటూ ఇటూ బెదురుచూపులు చూస్తూ, రహస్యం చెప్తున్నట్టుగా స్వరం తగ్గించి, ‘ఆమెలాంటి వాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. కానీ నాకెందుకో చాలా భయమేస్తుంటుంది తెలుసా? పాఠశాలలు, ఆసుపత్రులు, పుస్తకాలు – ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరీ అంత దూరం పోవాలా? ఆమె కిప్పటికే ఇరవైనాలుగేళ్లు. ఆమె తన భవిష్యత్తు గురించి పట్టించుకోవలసిన సమయమిది. ఈ పుస్తకాలు, ఆసుపత్రులు వీటన్నిటిగురించీ ఆలోచిస్తుంటే కాలం గడిచిపోవడం కూడా తెలియదు… ఇప్పుడామెకి పెళ్లీడువచ్చింది’. జెన్యా చదువుతున్న పుస్తకంలోంచి తలెత్తింది. ఆమె జడ ముడివేసి ఉంది. చాలా సేపటినుంచి చదువుతున్నందువల్లనేమో ఆమె ముఖం కొద్దిగా తెల్లబారి ఉంది. ఆమె వాళ్ల అమ్మకేసి చూస్తూ, కానీ తనకుతాను చెప్పుకుంటోందా అన్నట్టుగా:

‘మనమంతా భగవంతుని చేతుల్లో ఉన్నామమ్మా!’ అని మళ్లా పుస్తకంలో మునిగిపోయింది.

ఇంతలో బెలొకురొవ్ ప్రత్యక్షమయ్యాడు. పువ్వులు అల్లిన చొక్కా, రైతుకోటు ధరించాడు. మేం కలిసి టెన్నిసు ఆడుకున్నాం. చీకటి పడ్డాక చాలా సేపు భోజనాల బల్ల దగ్గరే గడిపేశాం. లిడా మళ్లా పాఠశాలలగురించి మాట్లాడుతూ ఉంది. మొత్తం జిల్లానంతటినీ తన గుప్పెట్లో పెట్టుకున్న బలగిన్ గురించి కూడా మాట్లాడింది. నేనా రాత్రి వొల్చనినొవ్ల నించి సెలవు తీసుకుని ఇంటిదారి పట్టినప్పుడు చాలాచాలా సుదీర్ఘమైన ఒక  సోమరిదినాన్ని సంతోషభరితంగా గడిపిన జ్ఞాపకం వెంట తీసుకుపోయాను. ఎంత సుదీర్ఘంగా గడిచినప్పటికీ, ఈ ప్రపంచంలో ప్రతిఒక్కటీ గడిచిపోకతప్పదని ఎంతో విషాధభరితంగా నాకునేను చెప్పుకున్నాను. బహుశా ఆ రోజు పొద్దుణ్ణుంచీ సాయంత్రందాకా ఆమెతోటి గడిపినందువల్ల కాబోలు జెన్యా మాకు వీడ్కోలు చెప్పడానికి గుమ్మందాకా వచ్చింది. ఆమె లేకుండా ఉండడమంటే ఒంటరిగా గడపడమని నాకు తెలుస్తూ ఉంది. ఆ మొత్తం కుటుంబమంతా ఆ సమ్మోహనకర సభ్యులంతా నాకెంత ఆత్మీయులైపోయారో బోధపడుతూ ఉంది. అప్పుడు, ఏదైనా ఒక చిత్రాన్ని చిత్రించాలన్న కోరిక, ఆ వేసవిలో మొదటిసారిగా నాలో ఉదయించింది.

మేమిద్దరం కలిసి ఇంటిదారిన నడుస్తున్నప్పుడు ‘నీ జీవితం అంత కళావిహీనంగా, అంత నీరసంగా ఎందుకుండాలి?’ అని అడిగాను బెలుకొరోవ్ ని. ‘నా జీవితం నిస్సారంగా, విసుగ్గా, చర్వితచరణంగా ఉందంటే దానికి కారణం నేనో కళాకారుణ్ణీ, ఓ పిచ్చివాణ్ణి. నా చిన్నప్పటినుంచీ కూడా నా కృషిలో నాకెంతో అపనమ్మకం, వేదన, అసహనం. వీటితోనే పుట్టిపెరిగాను. బహుశా నా జీవితమంతా నేనొక నిరుపేదగా, దిమ్మరిగానే బతకవలసి ఉంటుంది. కానీ నువ్వు – ఆరోగ్యవంతుడవైన మనిషి, ఒక భూస్వామివి, కులీనుడివి – అటువంటిది నీ జీవితం కూడా ఎందుకంత శుష్కంగా, సారవిహీనంగా గడుస్తోంది? ఉదాహరణకి లిడాతోనో లేదా జెన్యాతోనో నువ్విప్పటికే ప్రేమలో పడి ఉండవలసింది. కానీ అట్లా ప్రేమించకుండా నీకేది అడ్డుపడుతోంది?’

‘నేను మరో స్త్రీని ప్రేమిస్తున్నానన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు’అన్నాడు బెలుకురోవ్.

అతడు ల్యుబొవ్ ఇవనొవ్న గురించి మాట్లాడుతున్నాడని నాకు తెలుసు. ఆమె అతడితో కలిసి జీవిస్తోంది. లావుగా, గుండ్రని ముఖంతో ఒక బాతులాగా తోటలో కలియతిరుగుతూ ఉండే ఆమెను ప్రతిరోజూ నేను చూస్తూనే ఉంటాను. పూసలదండలు, సాంప్రదాయిక రష్యా దుస్తులు ధరించి ఒక గొడుగు వేసుకుని తిరుగుతూంటుంది. టీ తాగమనో, భోజనానికి రమ్మనో పనివాళ్లు ఆమెనెప్పుడూ పిలుస్తుంటారు. మూడేళ్ల కిందట ఆమె ఒక వేసవికాలం గడపడానికి ఒక భవంతి అద్దెకు తీసుకున్నప్పుడు ఆమె బహుశా ఒక జీవితకాలంపాటు అక్కడే ఉండిపోవడానికా అన్నట్టు బెలుకురోవ్ తో ఉండిపోయింది. ఆమె బెలుకురోవ్ కన్నా పదేళ్లు పెద్దది. అతణ్ణి పూర్తిగా తన చేతుల్లో పెట్టుకుంది. అతడు ఎక్కడికి వెళ్లాలన్నా ముందు ఆమె అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అప్పుడప్పుడు ఆమె బిగ్గరగా కర్ణకఠోరంగా ఏడుస్తూంటుంది. ఆ ఏడుపు వినబడ్డప్పుడల్లా ఆమె తన ఏడుపు ఆపకపోతే నేను వెళ్లిపోకతప్పదని కబురు పంపిస్తూంటాను. అప్పుడు కానీ ఆమె ఏడుపు ఆపదు.

మేం ఇంటికి వెళ్లాక బెలుకురోవ్ నా సోఫామీద కూర్చున్నాడు. అతడేదో ఆలోచిస్తున్నట్టుగా కనుబొమలు ముడివడిఉన్నాయి. నేను అక్కడే ఉద్విగ్నమనస్సుతో ప్రేమలో కూరుకుపోయినవాడిలాగా అటూఇటూ పచార్లు చేస్తూఉన్నాను. వొల్చనినోవ్ల గురించి మాట్లాడాలని ఆరాటపడ్డాను.

‘లిడా జెంస్త్వొలో పనిచేసే ఎవరో ఒక సభ్యుడు తనలానే పాఠశాలలగురించీ, ఆసుపత్రుల గురించీ పట్టించుకొనేవాణ్ణి మాత్రమే ప్రేమించగలదేమోననిపిస్తుంది’ అన్నాను. కానీ అట్లాంటి యువతికి లభించే మనిషి జెంస్త్వొలో సభ్యుడయితేనే సరిపోదు, అతడు ఏదో జానపదకథలోలాగా ఇనప బూట్లతో నడిచేవాడు కూడా కావాలి. ‘మరి మిస్సీ?’ మిస్సీ ఎంత బంగారుతల్లి!

మళ్లా ఎప్పటిలానే తన వొత్తులతో బెలుకురోవ్ సుదీర్ఘ సంభాషణ మొదలుపెట్టాడు. అతడి ప్రసంగవిషయం నిరాశ – మనకాలపు వ్యాధి. అతడు చాలా దృఢంగా మాట్లాడాడు. కానీ అతని కంఠస్వరాన్నిబట్టి చూస్తే నేను అతడితో వాదిస్తున్నట్టుగా నా వాదన ఎదుర్కోవడానికి అతడట్లా మాట్లాడుతున్నట్టుగా ఉంది. నీ గదిలో కూర్చొని అసలు బయటికి పోడా అన్నట్టుగా అంతం లేకుండా మాట్లాడుతుండే మనిషికన్నా దుర్భరమైన విషయం మరొకటుండదు. ఎటుచూసినా సారవిహీనంగా విసుగుపుట్టించే అంతులేని మైదానం కూడా ఆ మనిషికన్నా శుష్కతరం కాదు.

‘ఇది ఆశావాదానికీ, నిరాశావాదానికీ సంబంధించిన విషయంకాదు’ అన్నాన్నేను విసుగ్గా. ‘విషయమేమిటంటే నూటికి తొంభైఐదు శాతం మనుషులకి అసలు తెలివిలేదు’ అన్నాను.

నా మాటలు తనను ఉద్దేశించే అన్నాననుకుని బెలుకురోవ్ మనస్సు చిన్నబుచ్చుకుని బయటికి వెళ్లిపోయాడు.

III

రాజకుమారుడు మలొజెమెవొ దగ్గర విడిది చేశాడు. ఆయన మీకు శుభాకాంక్షలు పంపాడు’ అంది లిడా వాళ్లతో. ఆమె అప్పుడే ఎక్కడినుంచో వచ్చింది. తన చేతి గ్లోవులు తొలగిస్తూ ఉంది. ‘ఆయన చాలా ఆసక్తికరంగా ఉన్నాడు. మళ్లీ జరిగే కౌన్సిల్ సమావేశంలో మలొజెమెవొలో ఒక ఆసుపత్రి ఏర్పాటుచేసే విషయంమీద తప్పనిసరిగా ప్రస్తావిస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఆ విషయంమీద అంతగా ఆశ పెట్టుకోద్దని కూడా అన్నాడు’ అని నావైపు తిరిగి ‘క్షమించండి. ఇలాంటి విషయాలు మీకంత ఆసక్తికరంగా ఉండవన్న విషయం మర్చిపోతూ ఉంటాను’ అంది.

నాలో ఒక్కసారి ఆగ్రహం పెల్లుబికింది.

‘ఎందుకుండదు?’ అడిగాను నా భుజాలెగరేస్తూ. ‘మీరు నా అభిప్రాయం తెలుసుకోవాలనుకోరు. అంతే. కానీ ఒక్కటిమాత్రం చెప్పగలను మీరు మాట్లాడుతున్న విషయం నాకు కూడా చాలా ముఖ్యమైన విషయమే’ అన్నాను.

‘నిజంగానా?’

‘అవును. నిజంగానే. నా దృష్టిలో మలొజెమెవొలో ఆసుపత్రి అవసరమే లేదు.’

నా ఆగ్రహం ఆమెకు పూర్తిగా అర్థమైంది. కళ్లు చిట్లించి నావైపే చూస్తూ అన్నది కదా,

‘మరింకేమిటవసరం? ప్రకృతిదృశ్యాల బొమ్మలా?’

‘ప్రకృతిదృశ్యాలు కూడా అవసరం లేదు, ఆ మాటకొస్తే, ఏదీ అవసరం లేదు.’

ఆమె తన చేతినున్న గ్లోవులు తీసేసి అప్పుడే పోస్టాఫీసునుంచి వచ్చిన వార్తాపత్రిక తిరగేయబోయింది. ఒక నిముషం తరువాత నెమ్మదిగా మాట్లాడింది. తన కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది.

‘పోయినవారం అన్నా ప్రసూతిలోనే మరణించింది. మన దగ్గరలో ఒక వైద్యుడు ఉండిఉంటే ఆమె కూడా ఇప్పుడు మనలానే జీవించి ఉండేది. బొమ్మలేసుకునే వాళ్లకుకూడా ఇటువంటి విషయాల్లో గాఢాభిప్రాయాలుంటాయని అనుకోలేదు నేను.’

‘ఈ విషయంలో నాకు చాలా నిశ్చితమైన అభిప్రాయాలున్నాయని చెప్పనివ్వండి’ అన్నాన్నేను. కానీ ఆమె నా మాటలు వినకూడదన్నట్టుగా వార్తాపత్రికలో తన మొహం దాచుకుంది. ‘నా అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రులు, పాఠశాలలు, గ్రంథాలయాలు వైద్యశాలలు మన బానిసత్వాన్ని మరింత బలపరచడానికే పనికొస్తాయి. ఇప్పటికే ప్రజలు చాలా బరువైన సంకెళ్లలో తగులుకుని ఉన్నారు. ఆ సంకెళ్లను ఛిన్నాభిన్నం చేయడానికి మీరేమీ చేయరు సరికదా, కొత్తసంకెళ్లు మాత్రం తగిలిస్తున్నారు. ఇదే నా నిశ్చితాభిప్రాయం.’

ఆమె నా వదనాన్ని చూడటానికని కళ్లు పైకెత్తింది. తిరస్కారంతో చిరునవ్వింది. కానీ నేను నా మనస్సులోని ఉద్దేశం స్పష్టంగా చెప్పటానికే ప్రయత్నించాను.

మనం గమనించవలసిందేమిటంటే, అన్నా ప్రసూతిసమయంలో మరణించిందని కాదు, అసలు ఈ అన్నాలు, మావ్రాలు, పెలగెయలు పొద్దున్నుంచీ రాత్రిదాకా బండచాకిరీ చేస్తూఉండక తప్పట్లేదనీ, కఠోరశారీరకశ్రమ వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారనీ, తమ జీవితకాలం పొడుగుతా తమ పిల్లలు ఆకలినుంచీ, రోగంనుంచీ తప్పించుకోలేక పోతున్నారని ఆదుర్దా చెందక తప్పట్లేదనీ గమనించాలి. వ్యాధుల్నీ, మృత్యువునీ చూసి ఎప్పటికప్పుడు భయపడుతూ త్వరితంగా వార్దక్యం పాలపడుతూ తొందరగా అలసిపోయి, ఒడలిపోయి మురికిలోనూ, దుర్గంధంలోనూ మరణిస్తున్నారని గమనించాలి. వాళ్లపిల్లలు ఎంత తొందరగా పెరిగితే అంత తొందరగా వాళ్లు కూడా తమ తల్లిదండ్రుల బాటనే నడుస్తున్నారనీ, వందలాది ఏళ్లు ఇలానే గడుస్తున్నాయనీ, లక్షలాదిమంది మనుషులు ఒక రొట్టెముక్కకోసం చెమటోడుస్తూ నిరంతరభయాందోళనలమధ్య జంతువులకన్నా హీనంగా జీవిస్తున్నారనీ గుర్తుపెట్టుకోవాలి. ఇక వాళ్లు జీవించే పరిస్థితులోని అత్యంత భయానకవిషయమేమిటంటే వాళ్లకి వాళ్ల ఆత్మలగురించికానీ, తాము భగవంతుడి ప్రతిరూపాలమనిగానీ తలచుకోవడానికి తీరిక చిక్కనే చిక్కదు. మనుషుల్ని పశువులనుంచి వేరుచేసి జీవితాన్ని జీవించదగ్గదిగా చేసేది ఆధ్యాత్మిక కార్యక్రమం. అటువంటి ఆధ్యాత్మికమార్గంలో ఆకలి, వ్యాధి, జీవితభయాలు, బండచాకిరీ ఎప్పటికప్పుడు అవరోధాలుగా అడ్డుపడుతూనే ఉన్నాయి. మీరు ఆసుపత్రులు, పాఠశాలల రూపంలో వాళ్లకు సాయం చేయాలనుకుంటున్నారు. కానీ ఇది వాళ్లని వాళ్ల శృంఖలాలనుంచి బయట పడవేయగలిగేది కాదు. పైగా దీనివల్ల మీరు వాళ్ల జీవితాల్లో కొత్తమూఢవిశ్వాసాలు ప్రవేశపెడుతున్నారు. వాళ్ల ఆకాంక్షల్ని పెంచుతున్నారు. అందువల్ల ఇవి వాళ్లను మరింత దాస్యానికే గురిచేస్తాయి. ఇక వీటికోసం వాళ్లు జెంస్త్వొలో ఉన్న జలగలకీ, వాళ్ల పుస్తకాలకీ మరింత చెల్లించకతప్పదనే కఠోరవాస్తవం ఎలానో ఉండనే ఉంది. ఏతావాతా జరిగేదేమిటంటే, వాళ్లు ఇప్పటికన్నా మరింత చెమటోడ్చవలసి ఉంటుంది.’

వార్తాపత్రికలను కొద్దిగా కిందకి జరిపి ‘నేను మీతో వాదించాలనుకోవడం లేదు’ అంది లిడా. ‘నేనిదంతా ఇంతకుముందు విన్నదే. నేను చెప్పేదొక్కటే. ఎవరైనాకానీ ఏమీచేయకుండా కేవలం చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చొంటే సరిపోదు. మేం మానవాళిని ఉద్ధరించడంలేదు. నిజమే. బహుశా మేము చాలా తప్పులు కూడా చేస్తూండవచ్చు. కానీ మేమేం చేయగలమో అదిమాత్రం చేయకతప్పదు. అలా చేయడమే సమంజసం. విద్యావంతుడైన ఏ మనిషికైనా అత్యున్నత అతిపవిత్ర కర్తవ్యం తన పొరుగువాడికి సాయపడటమే. ఈ కర్తవ్యాన్ని మేం మా శాయశక్తులా నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం. మేమేం చేస్తున్నది మీరు ఇష్టపడ్డం లేదు. అయితే ఆ మాటకొస్తే మనం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ సంతోషపరచలేమని కూడా గుర్తుపెట్టుకోవాలి’ అంది.

‘నిజం, లిడా, నిజం’ అంది వాళ్లమ్మ.

ఆమె లిడా పక్కనున్నప్పుడు ఎప్పుడూ భయంగా, పిరికిగా ఉంటుంది. తను మాట్లాడేటప్పుడు తనేదైనా అనుచితంగానో మూర్ఖంగానో మాట్లాడుతున్నానేమోనన్న భయంతో బెదురుచూపులు చూస్తూంటుంది. ఆమె తన పెద్దమ్మాయికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడదు. ఆమె ఏం చెప్పినా వెంటనే ‘నిజం, లిడా, నిజం’ అని తలూపుతుంది.

గ్రామీణఅక్షరాస్యత, సాధారణ లోకోక్తులు, దుర్భరమైన నీతిపాఠాలతో నిండిన పుస్తకాలు, కొత్త ఆసుపత్రులు ప్రజలతాలూకు అజ్ఞానాన్నిగానీ లేదా వాళ్ల మరణాల్ని గానీ ఎంతమాత్రం తగ్గించలేవు. మీ ఇంటి కిటికీల్లోంచి బయటపడుతున్న వెలుతురు ఈ మొత్తం తోటను వెలిగించగలదనడం ఎంత నిజమో మన ప్రయత్నాలు వాళ్లను చైతన్యవంతుల్ని చేస్తాయనడం కూడా అంతే నిజం’ అని అన్నాన్నేను. ‘మీరు వాళ్లకేమీ ఇవ్వకండి. వాళ్ల జీవితాల్లో మీ జోక్యంవల్ల మీరు చేస్తున్నదల్లా వాళ్లకు కొత్త అవసరాలు సృష్టించడం, వాళ్లు మరింత ఊడిగం చేయడంకోసం కొత్త కారణాలు అందించడం మాత్రమే.’

‘కానీ ఏదో ఒకటి చేయకతప్పదే’ అంది లిడా విసుగుతో, కోపంతో. ఆమె కంఠస్వరాన్నిబట్టి చూస్తే నా వాదనలు ఆమెకు తృణీకరించదగ్గవిగానూ, తిరస్కార యోగ్యంగానూ కన్పించినట్టు బోధపడుతూనే ఉంది.

‘ఈ దారుణమైన కాయకష్టం నుంచి మనుషులు విముక్తులు కావాలి’ అన్నాను నేను. ‘వాళ్ల బరువు తేలికపడాలి. వాళ్లకెంతోకొంత తీరిక దొరకాలి. వాళ్ల జీవితమంతా వంట చేసుకుంటూనో, గుడ్డలుతుక్కుంటూనో, పొలాల్లో పనిచేస్తూనో గడిపేయకూడదు. వాళ్లకి తమ ఆత్మలగురించీ, సర్వేశ్వరుడి గురించీ ఆలోచించుకునే సమయముండాలి. వాళ్ల ఆధ్యాత్మిక సామర్థ్యాలను వ్యక్తీకరించుకునే అవకాశం దొరకాలి. ప్రతిమనిషికీ తనదంటూ ఒక ఆధ్యాత్మికవ్యాపకముంటుంది. సత్యంకోసం, జీవిత సార్థక్యంకోసం నిరంతర అన్వేషణ ఉంటుంది. వాళ్లని ఈ కఠోర కాయికశ్రమ నుంచి విడుదలచేయండి. వాళ్లు తమ స్వాతంత్య్రాన్ని గుర్తించేలా చేయండి. అప్పుడు ఈ పుస్తకాలు, ఆసుపత్రులు ఎంత హాస్యాస్పదమో మీరే తెలుసుకుంటారు. ఒక మనిషి తన యథార్థజీవనవ్యాపార మేమిటో తెలుసుకున్నరోజు అతణ్ణి తృప్తిపరచగలిగేవి ఆధ్యాత్మికసాధన, సైన్సు, లలితకళలు మాత్రమే తప్ప, ఇటుంటి అల్పవిషయాలు కావు.’

‘శారీరకశ్రమ నుంచి విడుదల!’ హేళనగా నవ్వింది లిడా. ‘అదేదో నిజంగానే సాధ్యమన్నట్టు.’

‘సాధ్యమే. వాళ్ల పని కొంత వాళ్ల భుజాలమీంచి మీ చేతుల్లోకి తీసుకుంటే. సమస్తమానవాళీ వాళ్ల భౌతికావసరాల తృప్తికోసం జీవితమంతా ధారబోస్తున్న పనిలో మనందరం పట్టణాల్లో, గ్రామాల్లో ఉంటున్నవాళ్లమంతా ఎటువంటి మినహాయింపూ లేకుండా పాలుపంచుకోవడానికి ముందుకొస్తే బహుశా మనలో ఏ ఒక్కరికీ కూడా రోజుకి రెండుమూడు గంటలకన్నా ఎక్కువ పని చేయవలసిన అవసరముండదనుకుంటాను. ఆలోచించండి. మనందరం బీదా, గొప్పా అందరం ఒక్కలానే రోజుకి కేవలం మూడు గంటలు మాత్రమే పనిచేసి తక్కిన సమయమంతా మనకోసం మనమే జీవించగలిగితే ఎలా ఉంటుంది? మన శరీరశ్రమ మీద తక్కువ ఆధారపడ్డం కోసం కాయకశ్రమ తగ్గించడం కోసం మనం మన కష్టాన్ని పంచుకొనే యంత్రాల్ని కనిపెడితే ఎలా ఉంటుంది! అలాగే మన అవసరాలు కూడా చాలా తగ్గించుకుని కనీస అవసరాలకే పరిమితమైతే! ఇందుకుగాను మనం మననీ మనపిల్లల్నీ కూడా సుశిక్షితం చేసుకుంటే. ఈ అన్నాలు, మావ్రాలు, పెలగెయలు పడుతున్నట్టుగా పిల్లలగురించి నిరంతరం ఆందోళన పడనవసరం లేకుండా ఆకలిదప్పుల భయం నుంచి విముక్తులం కాగలుగుతాం. ఒక్కసారి ఆలోచించండి. మనకీ మందులు, వైద్యశాలలు లేకపోతే, ఈ పొగాకు కర్మాగారాలు, ఈ మద్యంబట్టీలు లేకపోతే దానివల్ల మనకి ఎంత తీరికసమయం దొరుకుతుందో చూడండి. అలా దొరికిన సమయమంతా కూడా మనం విజ్ఞానశాస్త్రానికీ, కళాసృష్టికీ అంకింతం చేయవచ్చు. చూడండి, అప్పుడప్పుడు గ్రామీణులంతా కలిసి ఒక సమూహంగా రహదారులు మరమ్మత్తు చేసుకుంటారే, అలాగే మనం కూడా అందరం కలిసి ఒక బృందంగా అందరి ఆమోదంతో సత్యాన్ని అన్వేషించడానికి జీవితానికి అర్థం వెతకడానికి పూనుకోవచ్చు. అలా చేయగలిగినట్లయితే సత్యం తప్పక సాక్ష్యాత్కరిస్తుందనే నాకనిపిస్తుంది. ఈ నిరంతర ఆందోళనాత్మక, పీడనాత్మక వృద్ధి భయం నుంచి, ఆ మాటకొస్తే ఏకంగా మృత్యువునుంచే మానవాళి విముక్తి చెందితీరుతుంది.’

‘కానీ మీ మాటలు మీరే ఖండిస్తున్నారు’ అంది లిడా. ‘ఒకవైపు మీరు విజ్ఞానశాస్త్రం గురించి బోధిస్తున్నారు, మరోవైపు అక్షరాస్యత వ్యాప్తిని తిరస్కరిస్తున్నారు.’

‘రోడ్డుమీద గుర్తుల్ని గుర్తుపట్టడానికీ, తనకు అర్థంకాకపోయినా అప్పుడప్పుడూ ఒకటీఅరా పుస్తకాలు చదవడానికి మాత్రమే పనికొచ్చే ఈ అక్షరాస్యత ఇప్పుడేమిటి, రష్యా పుట్టినప్పుడే పుట్టింది. గొగొల్ రచనల్లో మనకి కనబడే పెట్రుష్క కూడా అక్షరాస్యురాలే. అయితేనేమిటి? గ్రామీణరష్యా రష్యా పుట్టినప్పటినుండీ అలానే ఉంది. మనకి కావలసింది అక్షరాస్యత కాదు, మన ఆధ్యాత్మిక సామర్థ్యాల్ని వెల్లడిచేయగల తీరిక సమయం. అందుకు మనకు కావలసింది పాఠశాలలు కాదు, విశ్వవిద్యాలయాలు.’

‘కానీ మీరు వైద్యశాస్త్రాన్ని నిరాకరిస్తున్నారే.’

‘అవును. వైద్యశాస్త్రం అవసరం ఎంతవరకూ అంటే, జీవజాలానికి సహజంగా సంక్రమించే వ్యాధుల్ని అధ్యయనం చేయడం వరకూ మాత్రమే. కానీ వాటికి చికిత్స చేయటానికి కాదు. మనం నిజంగా చికిత్స చేయవలసింది వ్యాధి కారణానికి తప్ప, వ్యాధికి కాదు. వ్యాధులన్నిటికీ మూల కారణం శారీరక శ్రమ. దాన్ని తొలగించండి. వ్యాధులే ఉండవు. మనుషుల్ని స్వస్థ పరచగలదని చెప్పేదాన్ని దేన్నీ నేను విజ్ఞానశాస్త్రంగా గుర్తించలేను.’ నా మాటలు నాకే ఎంతో ఉత్సాహకారకంగా అనిపించాయి. నేను ఇంకా ఇట్లా చెప్పాను. ‘నిజమైన విజ్ఞానశాస్త్రంగానీ లేదా కళకానీ తాత్కాళిక, పాక్షిక పరిష్కారాలు కోరుకోవు. శాశ్వత సార్వజనీన పరిష్కారాలమీద మాత్రమే అవి దృష్టిపెడతాయి. అవి సత్యంకోసం జీవితానికొక అర్థంకోసం, దేవుడికోసం, ఆత్మకోసం అన్వేషణ సాగిస్తూంటాయి. వాటిని మనం తక్షణఅవసరాలకు కట్టి పడేసినప్పుడు, ఆసుపత్రులకీ, గ్రంథాలయాలకీ పరిమితం చేసినప్పుడు అవి జీవితాన్ని సంక్లిష్టం చేస్తాయి. బరువెక్కిస్తాయి. మనకీరోజు వైద్యులు, రసాయనవేత్తలు, న్యాయవాదులు చాలామంది ఉన్నారు. అక్షరాస్యులు కూడా అపారంగా ఉన్నారు. కానీ మనకు లేనిదల్లా జీవశాస్త్రవేత్తలు, గణితశాస్త్రవేత్తలు, తత్త్వవేత్తలు లేదా కవులు. మన మేధాశక్తి, మన ఆత్మికశక్తి తాత్కాలిక అవసరాలను తీర్చుకోవడంలోనే వృథా అయిపోతున్నాయి… శాస్త్రవేత్తలు, రచయితలు, చిత్రకారులు ఒక సంకల్పంతో పనిచేస్తారు. వాళ్ల వల్ల మన జీవితసౌకర్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. మన కోరికలు కూడా అంతులేకుండా విస్తరిస్తున్నాయి. కానీ మనమింకా సత్యానికి సుదూరంగానే ఉన్నాం. ఇప్పటికీ మనిషి జంతువులన్నిటిలోనూ అత్యంత అపరిశుభ్రమైన, అత్యంత క్రూరమైన జంతువుగానే కొనసాగుతున్నాడు. ప్రతిఒక్కటీ కూడా మానవత్వం క్షీణించడంవైపు, జీవశక్తి కోల్పోవడంవైపూ మొగ్గుచూపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే ఒక కళాకారుడి జీవితం అర్థరహితంగానే ఉంటుంది. అతడు ఎంత ప్రతిభావంతుడయితే అతడి కర్తవ్యం ప్రజలకి అంత అర్థంకాకుండా పోతుంది. ఎందుకంటే, అతడు ఈ అపరిశుభ్ర నిర్ధాక్షిణ్య మృగాన్ని సంతోషపెడుతూండడం కోసమే ఈ యథాతథ పరిస్థితి కొనసాగడానికి సహకరిస్తూండడం కోసమే పాటుపడవలసిఉంటుంది. అందుకనే నాకు పనిచేయటం ఇష్టంలేదు, నేను పనిచేయదలచుకోలేదు… నాకేమీ అక్కర్లేదు. ప్రపంచం ఎటుపోయినా పోనీయ్…’

‘మిస్సీ వెళ్లిపో’ అంది లిడా తన చెల్లెలితో. బహుశా అటువంటి చిన్నారిబాలిక వినడానికి నామాటలు తగవనికాబోలు.

శోకభరిత దృక్కులతో జెన్యా వాళ్లమ్మనీ, అక్కనీ చూస్తూ బయటకు వెళ్లిపోయింది.

‘మనుషులు తమ నిష్క్రియనీ, ఉదాసీనతనీ సమర్థించుకోవటానికి ఇటువంటి చక్కటి మాటలే చెప్తూంటారు’ అంది లైలా. ‘బోధించడం కన్నా రోగులకు చికిత్సచేయడం కన్నా ఆసుపత్రుల, స్కూళ్ల ప్రయోజనాన్ని తిరస్కరిస్తూ మాట్లాడడం చాలా సులభం…’

‘నిజం, లిడా, నిజం’ అంది వాళ్లమ్మ.

‘మీరు అవసరమైతే మీ చిత్రకళను కూడా పక్కన పారేస్తానన్నారు’ లిడా కొనసాగించింది. ‘చూడబోతే మీరు మీ కృషిని చాలా ఎక్కువగా భావిస్తున్నట్లుంది. మనం వాదించడం ఇక్కడితో ఆపేద్దాం. మనం బహుశా ఎప్పటికీ ఏకీభవించం. మీరు ఎంతో తృణీకరిస్తూ మాట్లాడిన గ్రంథాలయాలు, ఆసుపత్రులు అవి ఎంత అసమర్థంగానైనా పనిచేయనివ్వండి, ఎంత అస్తవ్యస్తంగానైనా ఉండనివ్వండి, అవి ఈ ప్రపంచంలోని సమస్త ప్రకృతి దృశ్యచిత్రలేఖనాల కన్నా అత్యున్నతమైనవనే నేను భావిస్తాను’ అని వాళ్లమ్మవైపు తిరిగి కంఠస్వరం స్థాయి మార్చి ‘రాజకుమారుడు మరీ చిక్కిపోయాడు. ఆయన ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పటికన్నా ఇప్పుడు మరీ మారిపోయాడు. ఇప్పుడు అతణ్ణి ‘విచి’ కి పంపిస్తున్నారు’ అంది. నాతో మాట్లాడకుండా ఉండడంకోసం ఆమె తన తల్లితో రాజకుమారుడికోసం మాట్లాడింది. తన ఉద్రిక్తతను అణచుకొనే ప్రయత్నంలో ఆమె ముఖం ఎర్రబారిపోయింది. ఆమె బల్లమీద మరీ ముందుకువాలి వార్తాపత్రిక చదువుతున్నట్లుగా నటించడం మొదలుపెట్టింది. నేనక్కడ ఉండడం ఆమెకు ఎంతమాత్రం అంగీకారయోగ్యంగా లేదన్నది బోధపడుతూనే ఉంది. నేను సెలవు తీసుకుని ఇంటికి వచ్చేశాను.

IV

ఇంటి ప్రాంగణంలో మరీ నిశ్శబ్దంగా ఉంది. చెరువుకి అవతలవైపు గ్రామం అప్పటికే నిద్రలో మునిగిపోయింది. చెరువుపైన కనిపించీ, కనిపించకుండా మెరుస్తున్న తారల పేలకాంతితప్ప, ఎక్కడా ఒక్క దీపకిరణం కూడా మిణుకుమనడం లేదు. సింహప్రతిమల ద్వారం దగ్గర జెన్యా నిశ్చలంగా నిల్చొని ఉంది. నాకు వీడ్కోలు తీసుకోవడం కోసం వేచి ఉంది. ఆ ఊళ్లో అంతా పూర్తిగా నిద్రలోకిజారిపోయారు అన్నాను నేను ఆ చీకట్లో ఆమె శరీరాకృతి పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ. కానీ నన్నే తదేకంగా చూస్తున్న నల్లని విషాదభరిత నేత్రద్వయం తప్ప మరేమీ కనిపించలేదు. సత్రం యజమానులు, గుర్రాల దొంగలు కూడా హాయిగా నిద్రపోతున్నారుకానీ, మనమే మర్యాదస్తులం. ఒకర్నొకరం రెచ్చగొట్టుకుంటున్నాం, వాదించుకుంటున్నాం.’

అది శ్రావణమాసపు వ్యాకులభరిత రాత్రి. వ్యాకులమే. ఎందుకంటే అప్పటికే గాల్లో హేమంతకాలపు సూచనలు పొడసూపుతున్నాయి. లేత నారింజరంగు మబ్బుమీంచి చంద్రుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. కానీ బాటమీద వెన్నెల ఇంకా పేలగా ఉంది. బాగా దున్నిన హేమంతకాలపు పొలాలు బాటకు అటూఇటూ పరచుకొని ఉన్నాయి.

ఆకాశం పొడుగుతా అంతులేకుండా ఉదయిస్తున్న నక్షత్రకాంతులు. జెన్యా ఆ దారి పొడుగునా నాతోకలిసి నడిచింది. కానీ ఆకాశంలో తలెత్తుతున్న తారలను చూడవలసి వస్తుందేమోనన్న భయంతో తల పైకెత్తకుండా ఉండడానికి ప్రయత్నించింది. ఎందుకనో ఆ తారలు ఆమెని భయపెట్టినట్టినట్లున్నాయి.

‘నీ మాటలు నిజమనే అనిపిస్తోంది’ అందామె సాయంకాలపు తేమగాలికి ఒకింత వణుకుతూ. ‘మనమంతా, అందరం కలిసి ఆధ్యాత్మికసాధన కోసం నిజంగానే అంకితమైతే బహుశా తొందరలోనే ప్రతిఒక్కటీ దర్శించగలుగుతాం.’

నిజమే మనం నిజంగానే ఉన్నతమైన ప్రాణులం. నిజంగానే మనం మానవమేధాశక్తి ఎటువంటిదో తెలుసుకోగలిగితే ఉన్నతఆశయాలకోసం మాత్రమే జీవించగలిగితే మనం ఎప్పటికైనా దేవతాసమానులం కాగలుగుతాం. కానీ అలా జరగబోవటం లేదు. మానవత్వం క్షీణించపోనుంది. తొందరలోనే ప్రతిభావిశేషపు జాడ కూడా మిగిలేటట్టు లేదు.

మాకు ఇంటివాకిలి కనుమరుగయ్యేంతదూరం రాగానే జెన్యా అక్కడే నిలబడి ఆతృతగా నా చేయిపట్టుకుని నొక్కింది.

‘ఇంక ఉందామా’ అంది వణుకుతూ. ఆమె వేసుకున్న చొక్కా మరీపల్చగా ఉంది. అప్పటికే అది చలికి ముడుచుకుపోయింది. ‘రేపు మళ్లా రా.’

నాపట్లా ఇతరులపట్లా కూడా తీవ్రమైన అసంతృప్తి నాలో మేల్కొన్న ఈ తరుణంలో నేనొక్కణ్ణి మళ్లా ఒంటరిగా గడపాలన్న ఊహ నన్నెంతో భయపెట్టింది. నేను కూడా ఆకాశంలో మెరుస్తున్న చుక్కల్ని చూడడానికి భయపడ్డాను.

‘ఇంకొంతసేపు నా దగ్గరే ఉండవా?’ అనడిగాను.

నేను జెన్యాను ప్రేమిస్తున్నాను. బహుశా ఆమె నన్ను స్వాగతించే తీరు, నాకు వీడ్కోలు చెప్పే తీరు చూసి ఆమెతో ప్రేమలో పడ్డాననుకుంటాను. ఆమె నా చుట్టూ పరిచే ఆరాధనాపూర్వక కోమలవీక్షణాలకోసం నేనామెను ప్రేమిస్తున్నాననుకుంటాను. ఆమె తెల్లని వదనం, ఆ కంఠం,  ఆ మోచేతులు, ఆమె సౌకుమార్యం ఆమె అట్లానే ఊరకనే గడపడం, ఆమె పుస్తకాలు ఇవన్నీ కూడా ఆమెపట్ల నాలో ఒక ఆకాంక్షను మేల్కొల్పాయనుకుంటాను. ఆమె మనస్సు? ఆమెకు చాలా అసాధారణమైన తెలివితేటలు ఉన్నాయనే అనుకుంటాను. నన్నెంతమాత్రం ఇష్టపడని అందమైన, గంభీరమైన వాళ్ల అక్క కన్నా భిన్నంగా ఆమె ఆలోచించగలుగుతుంది కాబట్టి ఆమె విశాలహృదయాన్ని కూడా నేను ఆరాధించాను. జెన్యా నన్నొకచిత్రకారుడిగా ఇష్టపడింది. నేను నా ప్రతిభతో ఆమె హృదయాన్ని జయించగలిగాను. ఆమె నా జీవితానికి ఒక మహారాణిలాగా భావిస్తూ, మేమిద్దరం ఈ చెట్లమీద, ఈ పొలాలమీద, ఈ పొగమంచు, ఈ సాయంకాలపు వెలుతురు, ఈ మంత్రమోహన ప్రేమాన్వితగ్రామసీమ పైనా పరిపాలన సాగించగలమని కలలుగన్నాను. ఇంతవరకూ ఎంతో ఒంటరిగా, నిరర్ధకంగా కనిపించిన ఈ ప్రదేశమే ఇప్పుడు నాకెంతో జీవించదగ్గదిగా తోచింది. నేను ఆమె కోసమే చిత్రలేఖనాలు చిత్రిస్తూండాలని బలంగా కోరుకున్నాను.

‘ఇంకొద్దిసేపు ఉండవా?’ అని యాచించాను. కొద్దినిముషాలు మాత్రమే. నేను నా కోటువిప్పి వణుకుతున్న ఆమె భుజాలమీదుగా పరిచాను. ఒక మగవాడి కోటులో విచిత్రంగానూ, హాస్యాస్పదంగానూ కనిపిస్తానన్న భయంతో ఆమె నవ్వేసి ఆ కోటును పక్కకు విసిరేసింది. నేను నా చేతులు ఆమె చుట్టూ చుట్టి ఆమె వదనంమీద, భుజాలమీద, చేతులమీద ముద్దులు వర్షించాను.

‘రేపటిదాకా’ అందామె గుసగుసలాడుతూ. ఆ రాత్రి నిశ్శబ్దాన్ని ఎక్కడ భంగపరుస్తామో అన్న భయంతో అన్నట్టుగా ఎంతో మృదువుగా నన్ను కావలించుకుంది. ‘మాకు ఒకరినుంచి మరొకరికి దాచుకోడానికి ఏ రహస్యాలు లేవు. నేను వెంటనే ఇదంతా ప్రతిఒక్కటీ మా అమ్మకీ, అక్కకీ చెప్పేస్తాను. కానీ ప్రియా, నాకెందుకో చాలా భయంగా ఉంది. అమ్మ సంగతి పర్వాలేదు. అమ్మకు నువ్వంటే ఇష్టమే. కానీ లైదా!’

ఆమె గుమ్మంవైపు పరుగెత్తింది.

‘వీడ్కోలు’ అంటూ అరిచింది.

ఒకటిరెండు నిమిషాలపాటు నేనామె అడుగుల చప్పుడే వింటూఉండిపోయాను. నాకు ఇంటికి వెళ్లాలనిపించలేదు. ఇంటికి వెళ్లడానికి ఏ కారణమూ కనిపించలేదు. కొద్దిసేపు గాఢాలోచనలో అట్లానే నిలబడిబోయాను. ఇక అప్పుడు ఆమె ఉంటున్న ఆ ఇంటిని మరొక్కసారి చూడటం కోసం నెమ్మదిగా రెండు అడుగులు వెనక్కి వేశాను. నాకెంతో ప్రియాతిప్రియమైన అమాయకమైన ఆ పాతఇల్లు, ఆ మిద్దెఇల్లు, తన కిటికీలే నేత్రాలన్నట్టుగా ప్రతిఒక్కటీ తను అర్థం చేసుకున్నట్టుగా నావైపు చూస్తూఉంది. నేను వరండా దాటి టెన్నిస్ మైదానం పక్కన ఒక పురాతన ఎల్మ్ వృక్షం నీడన చీకట్లో బెంచీమీద కూర్చున్నాను. అక్కడనుంచి మళ్లా ఆ ఇంటిని చూశాను. ఇంటిమిద్దెమీద మిస్సీ ఉంటున్న గదికిటికీ లగుండా ఒక దీపం ప్రకాశమానంగా వెలుగుతూఉంది. అప్పుడు ప్రశాంతపూర్వకమైన ఆకుపచ్చ రంగు వెలుతురు అంతటా వ్యాపించింది. బహుశా ఎవరో ఆ దీపంమీద ఒక ఆకుపచ్చని తెర కప్పి ఉంటారు. అటూఇటూ నీడలు కదలాడాయి. నేనుకూడా ప్రేమలో పడగలిగానని బోధపడటంతో మృదుభావాలతో, ప్రశాంతితో, సంతృప్తితో నా హృదయం నిండిపోయింది. కానీ అదే సమయంలో అక్కడికి కొద్దిదూరంలోనే నన్ను ఎంతమాత్రం ఇష్టపడని, నన్ను అసహ్యించుకునే లిడా కూడా ఆ ఇంట్లో ఒక గదిలో ఉంటుందన్న ఊహ రాగానే చెప్పలేని దిగులుకూడా నన్ను ఆవహించింది. నేను మళ్లా జెన్యా కనిపిస్తుందన్న ఆశతో అట్లానే నిరీక్షిస్తూ కూర్చుండిపోయాను. చెవులటే రిక్కించాను. ఆ మిద్దెమీద మాట్లాడుకుంటున్న మాటలు కూడా వినగలనేమోననిపించింది.

దాదాపు ఒక గంట గడిచింది. ఆ ఆకుపచ్చ వెలుతురు కూడా అదృశ్యమైపోయింది. ఇక ఏ నీడలూ కనిపించడం మానేశాయి. ఇప్పుడు చంద్రుడు ఆ ఇంటిమీద పూర్తిగా ప్రకాశిస్తున్నాడు. ఆ నిద్రపోతున్న తోటల్నీ, నిర్జనమైన బాటల్నీ కూడా వెలిగిస్తున్నాడు. ఇంటిముందు డాలియాలు, గులాబీలు స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఆ వెన్నెల్లో అన్నీ ఒక రంగులోనే ఉన్నాయి. అంతా బాగా చల్లబడిపోయింది. నేను తోటనుంచి బయటికి అడుగుపెట్టి అక్కడ పడిఉన్న నా కోటు తీసుకుని నెమ్మదిగా ఇంటిదారి పట్టాను.

ఆ మర్నాడు మధ్యాహ్నం నేను వొల్చానినొవల ఇంటికి వెళ్లేటప్పటికి తోటవైపు తలుపు బార్లా తీసి ఉంది. నేను అక్కడే వరండా మీద కూర్చున్నాను. అక్కడ టెన్నిస్ కోర్టులోనో, లేదా ఏదో ఒక బాటమీదనో జెన్యా హటాత్తుగా ప్రత్యక్షమవుతుందని నిరీక్షిస్తూ ఆ ఇంట్లో ఆమె మాటలు వినబడటంకోసం ఎదురుచూస్తూఉన్నాను. అప్పుడు కొంతసేపటికి ఇంట్లో నలుగురూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకొనే గదిలో అడుగుపెట్టాను. ఆ తరువాత భోజనాలగదిలోకి ప్రవేశించాను. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. భోజనాలగదినుంచి హాలులోకి దారితీసే నడవాగుండా మళ్లా వెనక్కి వచ్చాను. ఆ నడువా పొడుగునా ఎన్నో తలుపులు తెరిచిఉన్నాయి. అక్కడ ఉండే ఏదో ఒక గదిలోంచి లిడా కంఠస్వరం వినవచ్చింది.

‘కాకి ఒకటి నీళ్లకు కావు కావు మనుచును…’ అని పాటపాడుతున్న స్వరంతో ఆమె గట్టిగా బహుశా ఎవరికో పాఠం చెప్తున్నట్టుగా పలుకుతూ ఉంది. ‘కాకి ఒకటి నీళ్లకు – ఎవరది?’ అని హటాత్తుగా అరిచింది ఆమె నా అడుగుల చప్పుడు విని.

‘నేనే’.

‘ఓ. ఇప్పుడు నాకు నీతో మాట్లాడే తీరికలేదు. నేను దాశాకు పాఠం చెప్తున్నాను.’

‘యెకతెరినాపావ్లొవ్న తోటలో ఉన్నారా?’

‘లేదు. ఆమె మా చెల్లెలు కూడా ఈ రోజు పొద్దున్నే పెంజాలో ఉండే మా మేనత్తను చూడటానికి వెళ్లారు. ఈ శీతాకాలం వాళ్లు బహుశా విదేశం కూడా వెళ్లవచ్చు’ అందామె క్షణం విరామం తరువాత.

‘కాకి ఒకటి నీళ్లకు కావు కావు మనుచును… రాశావా?’

నేను మళ్లా హాల్లోకి వెళ్లి అక్కడే నిలబడిపోయాను. ఆ చెరువువైపూ, ఆ సుదూరగ్రామం వైపూ శూన్యదృక్కులతో చూస్తూండిపోయాను. నా చెవుల్లో ఇంకా ఆ మాటలే మార్మోగుతున్నాయి. ‘కాకి ఒకటి నీళ్లకు కావు కావు మనచును…’

నేను మొదటిసారి ఏ దారమ్మట ఆ సుక్షేత్రానికి వచ్చానో అదే దారమ్మట మళ్లా వెనక్కి నడిచాను. ఆ ఇంటిముంగిలి నుంచి తోటలోకి, ఇల్లు దాటి, అప్పుడు ఆ నిమ్మచెట్ల బాటన… అప్పుడొక చిన్నపిల్లవాడు నన్ను ఆపి నా చేతికో చీటీ ఇచ్చాడు. ‘నేను మొత్తమంతా మా అక్కకి చెప్పాను. ఆమె మనం తక్షణమే విడిపోయి తీరాలంది.’ ఇంకా చదివాను. ‘నాకు ఆమె మాటను ధిక్కరించి ఆమెను బాధపెట్టాలని లేదు. భగవంతుడు నిన్ను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను – నన్ను క్షమించు. మా అమ్మా, నేను ఈ సమయాన ఎంతలా ఏడుస్తున్నామో తెలుసా నీకు.’

అప్పుడు ఫర్ చెట్ల బాట. విరిగిన కంచె. పూతకొచ్చిన రై పొలాల్లో ఎక్కడో ఒక పూరేడుపిట్ట విలపిస్తూ ఉంది. అక్కడా అక్కడా ఆవులు, గుర్రాలు కుంటినడక నడుస్తున్నాయి. అక్కడా అక్కడా కొండలమీద శీతాకాలపు పొలాలు ఆకుపచ్చరంగు తిరిగి కనిపిస్తున్నాయి. సాధారణ దైనందిన జీవితపు నిస్సార మనః స్థితి నన్ను చుట్టుముట్టింది. నేను వొల్చనినొవల దగ్గర మాట్లాడిందంతా తలచుకొని నాకే సిగ్గనిపించింది. జీవితం మళ్లా మరొకసారి దుర్భరవ్యవహారంగా మారిపోయింది. నేను ఇంటికి వెళ్లగానే నా సామాన్లు సర్దుకుని ఆ సాయంకాలమే పీటర్స్ బర్గ్ వెళ్లిపోయాను.

నేను వొల్చనినొవులను మళ్లా చూడనేలేదు. ఆ మధ్య ఒకసారి క్రిమియా వెళ్తున్నప్పుడు రైల్లో బెలుకురోవ్ ను కలిశాను. అతడింకా తన పువ్వులచొక్కా, రైతుకోటూ వేసుకుంటూనే ఉన్నాడు. అతడెట్లా ఉన్నాడని కుశలప్రశ్నలడిగితే, బాగానే ఉందని చెప్పాడు. మేం చాలాసేపే మాట్లాడుకున్నాం. అతడు తన పాతసుక్షేత్రం అమ్మేసి ల్యుబోవ్ యివనోవ్న పేరుమీద మరో చిన్న సుక్షేత్రం కొన్నాడు. వొల్చనినొవుల గురించి అతడేమీ ఎక్కువ చెప్పలేకపోయాడు. లిడా ఇంకా షెల్కొవ్కలోనే ఉంటున్నదనీ, అక్కడి గ్రామపాఠశాలలోనే బోధిస్తూ ఉందనీ చెప్పాడు. ఆమె నెమ్మదిగా తన చుట్టూ తనలాంటి భావాలే కలిగిన ఒక చిన్న బృందాన్ని సమకూర్చుకుందని వాళ్లంతా ఒక సుసంఘటితమైన పక్షంగా తయారయ్యారనీ, గత జెంస్త్వొ సమావేశంలో వాళ్లు బలగిన్ ని, అప్పటిదాకా ఆ మొత్తం జిల్లానంతటినీ తన చేతిలో పెట్టుకున్న ఆ పెద్దమనిషిని ఒక ఊపుఊపారని చెప్పాడు. ఇక అతడు జెన్యా గురించి నాకు చెప్పగలిగినదంతా ఆమె అక్కడ ఉండటంలేదనీ, ఆమె ఎక్కడ ఉంటుందో తనకు తెలీదనీ.

నేను నెమ్మదిగా ఆ మిద్దె ఇంటిని మరిచిపోసాగాను. కానీ ఎప్పుడైనా బొమ్మలు వేస్తున్నప్పుడో, చదువుకుంటున్నప్పుడో ఆనాడు కిటికీలో పరుచుకున్న ఆకుపచ్చని వెలుతురు, ఆ రాత్రి పొలాల్లో నా పాదాలచప్పుడు నాకే వినిపించిన ప్రతిధ్వని, ప్రేమలో పూర్తిగా ములిగి ఇంటికి వెళ్లిన ఆ రాత్రి, చలికి చల్లబారుతున్న నా చేతుల్ని వెచ్చబరుచుకోవడం ఏ కారణం లేకుండానే గుర్తొస్తుంటాయి. అప్పుడప్పుడూ నన్ను దారుణంగా చుట్టుముట్టిన వ్యాకులత్వంలో మరీ అరుదుగా నేనేవో అస్పష్టమైన జ్ఞాపకాల్లోకి జారిపోతూంటాను. నన్నుకూడా ఆమె గుర్తు పెట్టుకున్నదనీ, నాకోసం కూడా ఆమె నిరీక్షిస్తూఉందనీ మేము తప్పకుండా లుసుకుంటామనీ కలలుగనడం మొదలవుతుంది…

‘మిస్సీ… ఎక్కడున్నావు?’

24-9-2017

           

Leave a Reply

%d bloggers like this: