కథా ఉద్యమాలు-3

నాచురలిజం: మపాసా

యూరోప్ లో 1848 తో రొమాంటిసిజం ముగిసిపోయిందనీ, అదే ఏడాది రియలిజం మొదలయ్యిందనీ, 1850 ల్లో రియలిజం విస్పష్టమైన కళాధోరణిగా వికసించిందనీ చెప్పుకున్నాం. కాని, రొమాంటిసిజం రియలిజంగా పరిణమించే కాలంలో, క్రమంలో, ప్రకృతి పట్ల ఐరోపీయ మానవుడి దృక్పథంలో, కళాకారుల వైఖరిలో అస్పష్టత ఒకటి కొనసాగుతూనే వచ్చింది. రొమాంటిక్ మానవుడికీ, కళాకారుడికీ ప్రకృతి ఒక  కాల్పనిక ప్రదేశం. సభ్య, నాగరిక సమాజపు విలువలకు అతీతమైన ఒక ఆదిమస్వర్గం. అందులో అతడు మొదట సౌందర్యాన్ని చూసాడు. తర్వాత రోజుల్లో ఆ beautiful స్థానంలో అతడు sublime ని చూడటం మొదలుపెట్టాడు. మొదట్లో గంభీరంగానూ, ఉదాత్తంగానూ కనిపించిన ఆ సబ్లైమ్ తర్వాత రోజుల్లో భీకరంగానూ, మృత్యుసదృశంగానూ కనిపించడంతో రొమాంటిసిజం డార్క్ రొమాంటిసిజంగా మారిపోయిందని కూడా మనం తెలుసుకున్నాం.

రియలిస్టులూ, ప్రకృతీ

కాని 1848 తర్వాత రెండవ ఫ్రెంచి విప్లవం సంభవించాక మళ్ళా కళాకారులు మరొకసారి ప్రకృతి వైపు చూసారు. ఇలా చూడటం వెనక, 1850-60 దశకంలో రియలిస్టు ధోరణుల పట్ల వాళ్ళల్లో పొడసూపిన అసంతృప్తి కొంత కారణం. రియలిస్టులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చిత్రించడం మీదనే దృష్టి పెట్టినప్పటికీ, అందులో ఒక రాజకీయ సందేశం ఉంది. అది కొత్తగా తలెత్తుతున్న మధ్యతరగతి గురించి మాట్లాడుతున్నది. వాళ్ళ అవసరాలు, వాళ్ళ రాజకీయ హక్కులు, వాళ్ళ సామాజిక భవిష్యత్తు మీద అది దృష్టి పెడుతున్నది. రియలిస్టుల దృష్టిలో ప్రపంచమంటే, సాధారణ దైనందిన ప్రపంచమని కాక, మధ్యతరగతి, దిగువమధ్యతరగతికి చెందిన ప్రపంచమనే అర్థం ఏర్పడటం మొదలయ్యింది. అది కూడా పట్టణ, నాగరిక ప్రపంచం. 1831-51 మధ్యకాలంలో పారిస్ జనాభా రెండింతలయ్యింది. నగరవిస్తీర్ణం పెరిగింది. కొత్తగా బలపడుతున్న నాగరిక మధ్యతరగతి రాజకీయ ఆశయాల్ని ప్రతిబింబించేదిగా వాస్తవికతావాదాన్ని కళాకారులు స్వీకరించడం మొదలుపెట్టారు.

ఈ ధోరణి పట్ల అసంతృప్తి చెందిన మొదటి చిత్రకారుడు కెమిల్లి కోరో (1796-1875). కోరో కూడా కోర్బె లాగా గ్రామీణ జీవితాన్ని చారిత్రిక  దృశ్యాల్లాగా చిత్రించడం మొదలుపెట్టినప్పటికీ, అతడు నెమ్మదిగా, గ్రామీణ ప్రాకృతిక దృశ్యాల్ని, రియలిస్టు వస్తువుతోనూ, రొమాంటిసిస్టు భావొద్వేగాల్తోనూ చిత్రించడానికి మొగ్గు చూపడం మొదలుపెట్టాడు. 1870 లో అతడు చిత్రించిన Ville-d’Avray అనే చిత్రలేఖనం ఇందుకు చక్కటి ఉదాహరణ.

ఇందులో ఒక పల్లెటూరి చెరువు పక్క, ఒక గ్రామీణ స్త్రీ ఒంటరిగా కూర్చున్నది. ఆమె గ్రామీణ స్త్రీ కావడం,ఆ దృశ్యం ఒక ఫ్రెంచి గ్రామం కావడం వరకూ అది రియలిస్టు చిత్రం. కాని, ఆ వెండిరంగు వెలుగు, ఆ మృదు తూలికాస్పర్శ, నీటివెలుగుమీంచి దూరంగా కనిపించే గ్రామం, ఆ అపరాహ్ణవేళ అల్లుకునే మెత్తటి వెలుతురూ రొమాంటిసిస్టు భావోద్వేగాల్ని తలపించే లక్షణాలు. ఇందులో కనవచ్చే స్వాప్నిక ఛాయవల్ల ఈ ప్రపంచం వాస్తవప్రపంచమే అయినప్పటికీ, దృశ్యమానప్రపంచం కాక, మననీయ, మనోజ్ఞ ప్రపంచంగా ఎక్కువ భాసిల్లుతూ ఉంది.

ఈ స్వాప్నిక ఛాయలేకుండా గ్రామాల్ని చిత్రించిన చిత్రకారుల్లో కూడా ఇట్లాంటిదే మరొక రకమైన ఆహ్లాదలక్షణం కనిపిస్తూ ఉండింది. ఉదాహరణకి రోసా బోన్ హ్యూర్ (1822-1899) చిత్రించిన గ్రామీణ దృశ్యాలు. ఆమె  తల్లిదండ్రులు సెయింట్ సైమన్ స్థాపించిన యుటోపియన్ సోషలిస్టు భావజాలాన్ని నమ్మినవాళ్ళు. ఆ యుటోపియాలోని ఆరోగ్యవంతమైన ప్రపంచం రోసా బొమ్మల్లో కనిపిస్తుంది. ఉదాహరణకి Plowing in the Nivernais: The Dressing in the Vines అనే (1849) చిత్రలేఖనంలో ఆ బలమైన ఎడ్లు, వాటివెనక నాగలి పట్టుకుని సాగుతున్న ఆరోగ్యవంతుడైన యువకుడు, మేఘాలమీంచి తోంగిచూస్తున్న వెలుతురు, వాస్తవిక ప్రపంచాన్ని ఎంతో ఆదర్శవంతమైన రంగుల్తో, ప్రమాణాల్తో చిత్రించిన చిత్రం. వస్తువు వరకూ ఇది రియలిస్టు చిత్రలేఖనమే. కాని రియలిజంలో ఉండే నిరాశావాదం ఇందులో లేదు.

రోసా గొప్ప ఆత్మవిశ్వాసం కల స్త్రీ. ‘భవిషత్తు మాదే అని నాకు ధ్రువపడింది ‘అని రాసుకుందంట ఆమె తన జ్ఞాపకాల్లో.

కాని,ఈ ప్రాకృతిక చిత్రలేఖనాల్లో ఈ ఆదర్శమూ, ఈ స్వప్నమూ త్వరలోనే కనుమరుగైపోయి. రియలిస్టు నిరాశావాదం పట్ల తలెత్తిన నిరాశావాదం కూడా చిత్రకారుల్ని త్వరలోనే ఆవహించింది. ఆ నిరాశావాదం నుంచే వాళ్ళు ప్రకృతిని మళ్ళా కొత్తగా సమీపించడం మొదలుపెట్టారు.

ఈ కొత్త తరహా చిత్రలేఖనానికి జీన్ ఫ్రాంకో మిల్లె (1814-1875) ప్రతినిధి. అతడు చిత్రించిన గ్రామీణ దృశ్యాల్లో అపారమైన పేదరికంతో పాటు,నిస్సహాయతా, ఒంటరితనం, దుర్బలత్వం గోచరిస్తాయి. అతడి సుప్రసిద్ధ చిత్రలేఖనం The Gleaners (1857) లో అతడి భావసంచలనమంతా కనిపిస్తుంది.

ఇది ఫ్రెంచి పల్లెల్లో పంటకోతలవేళల్లో పరిగ ఏరుకునే గ్రామీణ నిరుపేదల చిత్రం. తమకంటూ సొంత ఆస్తిగాని, జీవనోపాధిగాని, బతుకుతెరువుగాని లేని గ్రామీణ నిరుపేదలు పొలాల్లో మిగిలిన పరిగె ఏరుకుని బతికే ఈ దృశ్యం వస్తువు రీత్యా రియలిస్టు చిత్రంగా కనిపిస్తుందిగానీ, ఇందులో రాజకీయ సందేశంకన్నా, విధివిలాసాన్ని అంగీకరించే నిస్సహాయత్వమే ఎక్కువ కనిపిస్తున్నది. మిల్లే సనాతన భావజాలం కలిగినవాడు. మనిషి చేసిన తప్పుకి అతడు స్వర్గ ఉద్యానం నుంచి బహిష్కృతుడయ్యాడనీ, ఆ శిక్షను అంగీకరించడం వినా మనిషికి మరో గత్యంతరం లేదనీ మిల్లె భావించాడు. అతడు బీదల్ని చిత్రించడం చూసి కొందరు విమర్శకులు అతడు మళ్ళా 1848 నాటి విప్లవాన్ని గుర్తుతెస్తున్నాడని భావించారు. కాని మిల్లె చిత్రలేఖనంలో కనిపిస్తున్న పాత్రల సాహసం సమాజాన్ని మార్చే సాహసం కాదు. తమకి ఏది లభిస్తే దాన్నే మౌనంగా అంగీకరించడంలోని సాహసం మాత్రమే. అంతేకాదు, ఆ మనుషుల రూపవివరాలు చిత్రించకుండా అతడు ఆ ప్రకృతి మార్పులేనిదనీ, సమాజం మారుతూ ఉండవచ్చుగాని, ప్రకృతికి మాత్రం మార్పులేదనీ చెప్తున్నాడు.

మిల్లె గ్రామీణ పేదరికాన్ని చిత్రిస్తే, పట్టణ పేదరికాన్ని చిత్రించిన మరొక విప్లవాత్మక చిత్రకారుడు హొనొరె డామియర్ (1808-1879. రియలిస్టుల వాస్తవికత రాజకీయ స్వరాన్ని సంతరించుకోగా, డామియర్ దానికొక అపూర్వ సామాజిక ప్రాసంగికతను తీసుకొచ్చాడు. అతడు చిత్రించిన The Thirdclass Cariiage (1862) ఆధునిక చిత్రకళ ప్రసాదించిన అత్యున్నత కానుకల్లో ఒకటి.

ఈ చిత్రంలో మొదటిసారి మనం సమాజాన్ని ఒక రైల్వే బోగీలో కూడా చూస్తున్నాం. రియలిజమంటే పెద్ద ఎత్తున చిత్రించే సామాజిక, రాజకీయ చిత్రాలే కానక్కర్లేదు, అది ఇళ్ళల్లో, ఇరుకుగదుల్లో, గనుల్లో, పనిస్థలాల్లో మనుషులు నిర్బంధంగానూ, తొడతొక్కిడిగానూ, సగం సగంఇష్టంతోనూ కలిసి ఉండవలసి వచ్చిన ఏ చోటును చిత్రించడమేనా కావచ్చని డామియర్ చూపించాడు.

ఇక్కడకి వచ్చేటప్పటికి, ప్రకృతికి అర్థం మారిపోయింది. ‘నేచర్ ‘అనే పదం అంతదాకా ‘ప్రాకృతిక ప్రకృతి’ని చూచిస్తున్నదికాస్తా ఇప్పుడది ‘స్వాభావిక ప్రకృతి’ని సూచించడం మొదలుపెట్టింది. మనిషి స్వభావరీత్యా నిష్కల్మషుడు అని రొమాంటిసిస్టులు భావించారు. కాని, పరిస్థితులు, సామాజిక శక్తులు మనిషిని బానిసగా మార్చగలవనీ, అవి అతడి స్వభావాన్నే మార్చేయ్యగలవనీ డామియర్ చిత్రలేఖనాలు రుజువు చేస్తున్నాయి. అంతేకాదు, చిత్రంలో మనకు కనిపిస్తున్న బీదవాళ్ళ కుటుంబానికీ వాళ్ళ వెనక తలలు మాత్రమే కనిపిస్తున్న సంపన్న, ఎగువ మధ్యతరగతి ప్రయాణీకులకీ మధ్య కనిపించని గోడలు కూడా మనం చూడగలం. మనకి కనిపిస్తున్న బీదకుటుంబంలో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, అది వాళ్ళ ముఖాల్లో ఆనందంగా మారడంలేదు. ఈ ప్రయాణాన్ని ఎట్లానో భరించి వీలైనంత తొందరగా ముగించాలన్న నిరీక్షణ మాత్రమే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది.

ఈ పరిస్థితులిట్లానే కొనసాగితే, ఇప్పుడు ఆరోగ్యకరంగా కనిపిస్తున్న జీవితం కూడా తొందరలోనే వడిలిపోయి రాలిపోతుందని ఇల్యా రెపిన్ చిత్రలేఖనాలు హెచ్చరిస్తుంటాయి. రెపిన్ (1844-1930) సామాజిక అన్యాయాల మీద గళమెత్తిన రష్యన్ చిత్రకారుడు. రియలిస్టు. అతడి ప్రసిద్ధ చిత్రం Bargehaulers on the Volga’ (1870-73) చూడండి.

నావని ఒడ్డుకి లాగడానికి మనుషుల్ని పశువులుగా వాడుతున్న సామాజిక దృశ్యం. కానీ, పూర్తిగా కృశించి క్షీణించిపోయిన ఆ మనుషుల మధ్య ఆరోగ్యవంతుడైన ఒక యువకుడు కూడా కనిపిస్తున్నాడు. రెపిన్ చెప్పేదేమంటే, మనమేదో ఒకటి చెయ్యకపోతే, ఆ యువకుడు కూడా తొందరలోనే కృశించిపోతాడు. అతడి జవసత్త్వాలు కూడా చూస్తూండగానే వృథా అయిపోతాయి అని.

ఏది వాస్తవికత?

సాహిత్యంలోనూ, చిత్రలేఖనంలోనూ రొమాంటిసిజం స్థానంలో 1850 లో వాస్తవికాతావదం తలెత్తాక ఇప్పటిదాకా కూడా అదే ప్రధాన సాహిత్యశిల్పకళాధోరణిగా ఉంటూ వస్తున్నది. కాని, అదే సమయంలో ఏది వాస్తవికత అనే ప్రశ్న కూడా పదే పదే తలెత్తుతూనే ఉన్నది. చిత్రలేఖనంలోనూ, సాహిత్యంలోనూ తదనంతరం తలెత్తిన ఉద్యమాలు ఇంప్రెషనిజం, మాడర్నిజం, సోషలిస్టు రియలిజం,క్రిటికల్ రియలిజం లతో పాటు సర్రియలిజం, అబ్సర్డిజం, మాజికల్ రియలిజం దాకా ప్రతి ఒక్క ఉద్యమం కూడా వాస్తవికతావాదాన్ని మరింత వివరించడానికో లేదా ప్రశ్నించడానికో లేదా సరిదిద్దడానికో తలెత్తిన ఉద్యమమే అంటే అతిశయోక్తి కాదు. అటువంటి ప్రయత్నాల్లో నాచురలిజం అన్నిటికన్నా మొదటిది. అందువల్లనే రియలిజానికీ, నాచురలిజానికీ మధ్య సరిహద్దులు గుర్తించడంలో సాహిత్యవిద్యార్థులు తరచు పొరపడుతూ ఉంటారు.

నిజానికి రియలిజం అనే మాట ఒక ధోరణి గా మారుతున్నప్పుడే, రియలిజం అంటే ఏమిటి అనే ప్రశ్న కూడా అంతే బలంగా వినపడుతూ ఉందింది. గుస్టావ్ కోర్బె మిత్రుడూ,అతడి రియలిస్టు మానిఫెస్టోకి ప్రధాన మద్దతుదారూ అయిన చామ్ ప్లెయిరీ  1857 లోనే ఇలా అన్నాడట:

‘రియలిజం అంటే ఏమిటో నేను నిర్వచించదలుచుకోలేదు. ఆ మాట ఎక్కడినుంచి వచ్చిందో ఎక్కడికి పోతుందో నాకు తెలియదు. అదేమిటో కూడా నాకు తెలియదు. ఆ మాట చివర ఆ ఇజం అనే పదమే  నాకు భరించలేనిదిగా అనిపిస్తుంది. ఈ సుప్రసిద్ధ పదం చుట్టూ ఇప్పటికే చెప్పలేనంత సంక్షోభం అల్లుకుపోయింది.’

చామ్ ఫ్లాయెరీ ఆ మాట అని రెండేళ్ళు కూడా తిరక్కుండానే ప్రపంచ చింతనను మలుపు తిప్పిన పుస్తకం ఒకటి వెలువడింది. 1897 లో ఛార్లెస్ డార్విన్ వెలువరించిన On the Origin of the Species by Means of Natural Selection, or the Preservation of Favored Races in the Struggle for Life యూరోప్ ఆలోచననే కాక, ప్రపంచాన్నే ప్రభావితం చేసిన పుస్తకం. ప్రకృతిని మొదటిసారి ఒక నిశ్చల వస్తువుగాకాక, పరిణామశీల శక్తిగానూ, అందులో కూడా ఎంపిక, పోరాటం,మనుగడ, మనుగడకోసం పోరాటం ఉంటాయని చెప్పిన రచన. ఆ పరిశీలనల ప్రభావం సాహిత్యం మీద రెండు రకాలుగా పడింది. మొదటిది, సాహిత్యసృష్టి, ముఖ్యంగా నవలా రచన కూడా ఒక శాస్త్రీయ పరిశోధనలాగా, వైజ్ఞానిక పరిశీలనలాగా సాగాలనేది. చుట్టూ ఉన్న వాస్తవాన్ని, అందులోనూ యథార్థాన్ని నిశితంగానూ, నిర్మమత్వంతోనూ పరిశీలించాలనీ, చూసినదాన్ని ఎంతో జాగ్రత్తగా, ఒక వైజ్ఞానిక నివేదికలాగా ప్రతిపాదించాలనేది. రెండవ ప్రభావం, దృక్పథానికి సంబంధించింది. మనుషులు ప్రాకృతిక శక్తుల ప్రభావానికి లోనై ప్రవర్తిస్తారనీ, వాళ్ళ జీవస్వభావం, వాళ్ళ ప్రకృతి,ఆనువంశికత వాళ్ళ ఆలోచనలనీ, సామాజిక ప్రవర్తననీ నిర్దేశిస్తాయని నమ్మడం. ఈ దృష్టితో రచనలు మొదలుపెట్టిన ఫ్రెంచి నవలాకారుడు ఎమిలి జోలా (1847-1902) మొదటిసారి ‘నాచురలిజం’ అనే పదం వాడాడు. 1867 లో తన నవల Therese Raquin తీవ్ర విమర్శకు గురయినప్పుడు, దాన్ని సమర్థించుకుంటూ, 1868 లో ఆ నవల రెండవ ఎడిషన్ కు రాసుకున్న ముందుమాటలో అతడిట్లా అన్నాడు:

‘నేను నాచురలిస్టులనే బృందానికి చెందిన రచయితని. ఆ బృందానికి ఇట్లాంటి రచనల్ని వెలువరించే సత్తా ఉంది. వాటిని సమర్థించుకోగల చావ కూడా ఉంది ‘.

నాచురలిజం అనే పదం సాహిత్యంలో ప్రవేశించిన తర్వాత అది రియలిజం సాధించలేనిదాన్ని దేన్నో సాధించడానికి ప్రయత్నిస్తున్నది అర్థమయిపోయింది. 1848 నుంచి 1868 దాకా ఇరవయ్యేళ్ళ పాటు సాహిత్య వాస్తవికతావాదం చుట్టూ ఉన్న వాస్తవాన్ని చిత్రించడానికి ప్రయత్నించినా అది చిత్రించగలిగింది కేవలం భావోద్వేగాల మీద ఆధారపడ్డ ఊహాగానాన్ని మాత్రమేననీ, చాలావరకూ అది ప్రతీకాత్మక వాస్తవంగా మాత్రమే మిగిలిపోయిందనీ, వాస్తవాన్ని పట్టిచ్చే fact కి అక్కడ చోటు లేదనీ నాచురలిస్టులు భావించారు. అందుకు బదులు తమ సాహిత్యం యథార్థం మీదా, తర్కం మీదా, నిర్మమత్వం మీదా ఆధారపడుతుందంటూ చెప్పుకొచ్చారు.

జోలా తన నవల ‘జెర్మినల్ ‘(1885) కి ‘రెండవ సామ్రాజ్యకాలంలో ఒక కుటుంబం తాలూకు ప్రాకృతిక, సామాజిక చరిత్ర ‘అనే ఉపశీర్షిక పెట్టడం గమనించాలి. నాచురలిస్టుల దృష్టిలో సాహిత్యం అంటే మనుషుల ‘ప్రాకృతిక-సామాజిక చరిత్ర ‘.

ప్రాకృతికవాద సాహిత్యకారులు

1860-70 మధ్యకాలంలో చిత్రలేఖనంలో మొదలైన నాచురలిజం దాదాపుగా అదే కాలంలో సాహిత్యంలో కూడా  మొదలుపెట్టింది. ఆ కాలం నాటి ప్రధాన సాహిత్య ప్రక్రియ కూడా నవలనే.  సాధారణ దైనందిన జీవిత వివరాల్ని ఒక చరిత్ర స్థాయిలో చిత్రించవలసి ఉన్నందున, చుట్టూ ఉన్న ప్రాకృతిక శక్తులు మనిషి జీవితంలో పోషించే నిర్ణాయక పాత్రను సమగ్రంగా ప్రతిపాదించవలసి ఉన్నందున, నాచురలిస్టులు శాస్త్రవేత్తల్లాగా తమ చుట్టూ ఉన్న జీవితాన్ని అధ్యయనం చేయడానికి పూనుకున్నారు. గని కార్మికుల జీవితాన్ని చిత్రించాలనుకున్న జోలా కొన్నేళ్ళపాటు గనుల్లో ఉన్న జీవితాన్ని ప్రత్యక్షంగా పరిశోధించాడు. అతడి సాహిత్య ప్రతిస్పర్థి ఫ్లాబే కూడా తన సాహిత్యసృజనకి అధ్యయనాన్ని అంతే తప్పనిసరిగా భావించాడు. ఫ్రాన్సులో వికసించిన నాచురలిజం తరవత రోజుల్లో అమెరికాలో కొనసాగింది. ఎమిలీ జోలా తో పాటు, సుప్రసిద్ధ కథారచయిత గైడి మపాసా (1850-1893) ఇంగ్లీషు నవలారచయిత థామస్ హార్డీ (1840-1928), అమెరికన్ రచయితలు స్టీఫెన్ క్రేన్ (1871-1900), ఫ్రాంక్ నోరిస్ (1870-1902), థియొడర్ డ్రెస్సర్ (1871-1945), ఎడిత్ వార్టన్ (1862-1937), రిచర్డ్ రైట్ (1908-1960)ప్రాకృతికవాదాన్ని సాహిత్యంలో అనుసరించిన ప్రసిద్ధరచయితలు.

ప్రాకృతికవాదం ముఖ్యలక్షణాలు

చిత్రలేఖనంలోనూ,సాహిత్యంలోనూ ప్రతిబింబించిన ప్రాకృతికతావాదానికి ముఖ్యలక్షణాలుగా వీటిని చెప్పుకోవచ్చు:

  • నిర్ణాయిక వాదం: మనుషులు తమ చుట్టూ ఉన్న ప్రాకృతికశక్తుల చేతుల్లో బందీలు. తమని మించిన శక్తులు ఎట్లా నడిపిస్తే అట్లా నడిచే జీవులు, మనం ఏ ప్రాకృతిక ఆవరణలో, పర్యావరణంలో పుట్టిపెరుగుతామో,ఆ ఆవరణనే మన ప్రవర్తననీ, మన భావోద్వేగాల్నీ నిర్ణయిస్తుంది. ఆ పరిణామాలు మనకి నచ్చకపోతే మనం ఆ పర్యావరణాన్నే పరిత్యజించవలసి ఉంటుంది.
  • నిరాశావాదం: మనిషి భవితవ్యం, అతడి జీవిత గమనం అతడి చేతుల్లో లేవు కాబట్టి, నాచురలిస్టు రచనల్లో సంతోషం కోసం, సుఖాంతాలకోసం వెతికి ప్రయోజనం లేదు. వాస్తవికతావాదంలో కూదా నిరాశ ఉందిగానీ, అక్కడ మనిషి తన చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చగలడనే ఆశ ఉంటుంది. ఇక్కడ మనిషి చెయ్యగలిగిందేమీ లేదు, నశించిపోవడం తప్ప.
  • సాంఘిక పర్యావరణ: ప్రాకృతిక శక్తుల్ని అధ్యయనం చేసే నాచురలిస్టు రచయిత తప్పని సరిగా సాంఘిక శక్తుల్ని కూడా అధ్యయనం చేస్తాడు. ఆ సాంఘిక వాతావరణం కూడా ప్రాకృతిక వాతావరణం వల్ల ఏర్పడేదే. ఒక మనిషి జీవితం, భవితవ్యం అతడు పుట్టిపెరిగిన సాంఘిక వాతావరణాన్ని బట్టే నిర్ణయమవుతాయి. ఆ ప్రభావాన్ని దాటి మనుగడసాగించగల అవకాశాలు మనుషులకు దాదాపుగా అలభ్యం.
  • ఆనువంశికత, మానవస్వభావం: మనుషులు తమ శారీరిక లక్షణాల్నే కాకుండా తమ ఆలోచనాసరళినీ, తమ భావోద్వేగాల్నీ, తమ స్పందనల్నీ కూడా ఆనువంశికంగా తమ తల్లిదండ్రులనుంచి అందిపుచ్చుకుంటారు. ఈ స్వాభావిక లక్షణాల్ని పట్టుకోవడంలోనూ, చిత్రించడంలోనూ ప్రాకృతికవాద రచయితలకు ఎక్కువ ఆసక్తి.
  • పేదరికం: వాస్తవికతావాదంలానే ప్రాకృతికతావాదం కూడా పేదరికాన్ని చిత్రించడం మీద ఎక్కువ దృష్టి పెట్టింది. ఎందుకంటే, మనుషుల మీద సామాజిక, ప్రాకృతిక శక్తులు చూపించగల ప్రభావానికి ప్రత్యక్ష ఉదాహరణ పేదరికం. పేదరికం మన ఎంపికలకొక సవాలు. ఆకలితో మాడుతున్నప్పుడు మనిషి ఏమి చేస్తాడు? దొంగతనమా, అడుక్కోవడమా, హత్యచేస్తాడా? ఆ ఎంపిక కూడా అతడు పుట్టి పెరిగిన వాతావరణమ్మీదా, అతడికి సంక్రమించిన ఆనువంశిక లక్షణాలమీదా ఆధారపడుతుందంటాడు ప్రాకృతికతావాద రచయిత.
  • డార్వినిజం: వాస్తవికతావాదానికి మార్క్స్ ప్రభావశీల శక్తికాగా, ప్రాకృతికతావాదానికి డార్విన్ నిర్ణాయిక శక్తి. జీవులు,ప్రకృతి పరిణామశీలాలు. అంతేనా? మనుగడ కోసం పోరాటం మన ఎంపికల్ని నిర్దేశిస్తుంది. మన ఎంపికలు మళ్ళా ప్రాకృతిక వారసత్వం మీద ఆధారపడతాయి.
  • మనుగడ: డార్విన్ ప్రకారం జీవపరిణామంలో దేనికి బలం ఉందో అదే నిలబడుతుంది. మనుగడకోసం పోరాటం ప్రకృతి ప్రధాన చలనసూత్రం. కాని మనుగడ కేవలం బలం మీదనే ఆధారపడి ఉండదు. అది ఎంపికమీద కూడా ఆధారపడిఉంటుంది. ప్రాకృతిక పరిణామంలో ప్రాణుల ఎంపిక వేరు. మనుషుల సామాజిక పరిణామంలో వాళ్ళు సామాజికంగా చేపట్టవలసిన ఎంపికలు అంత సరళంగా ఉండవు, సంక్లిష్టంగా ఉంటాయి.  తిరిగివాళ్ళ ఎంపికల్ని ఆ  సామాజిక పర్యావరణం నిర్దేశిస్తుంది.
  • నిర్మమత్వం:  నాచురలిస్టు రచయితలు తమని తాము సైంటిస్టులుగా భావించుకున్నారు. సామాజిక శాస్త్రవేత్తలన్నమాట. అందువల్ల తమ రచనలు అనవసర భావోద్వేగాలకు అతీతంగా, ఒక శాస్త్రవేత్తకు ఉండవలసిన నిర్మమత్వంతో ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. అది వాళ్ళ శైలినీ, శిల్పాన్నీ గణనీయంగా ప్రభావితం చేసింది.
  • సరైన పదజాలం: నిర్మమత్వంతోనూ, శాస్త్రవేత్తకి అవసరమైన నైశిత్యంతోనూ రచనలు చేయాలి కాబట్టి, రచయిత పదాలు వాడేటప్పుడు, le mot juste అంటే, ‘కచ్చితంగా సరైన పదం ‘ మటుకే పట్టుకుని ప్రయోగించాలి.
  • నవల: మనుషుల జీవితాలమీద ప్రాకృతిక, సామాజిక శక్తులు చూపించే నిర్ణాయకశీల ప్రభావాల్ని చూపించాలి కాబట్టి, ఆ చిత్రణ విస్తారమైన కాన్వాసు మీద చేపట్టాలి కాబట్టి, నాచురలిస్టులు కూడా నవలనే తమ ప్రధాన సాహితీ ప్రక్రియగా స్వీకరించారు.

నాచురలిజం: డార్క్ రియలిజం?

వాస్తవికతావాదం చుట్టూ ఉన్న సామాజిక వాస్తవాన్ని నిశితంగానూ, నిర్మమత్వంతోనూ చిత్రించడంలేదనే అసంతృప్తితో తలెత్తిన ప్రాకృతికతావాదం అతివాద వాస్తవికతావాదంగా మారిపోయిందని మనమిప్పుడు గ్రహించగలుగుతున్నాం. వాస్తవికతావాద రచయితలు సామాజిక  అన్యాయాలమీదా, పేదరికం మీదా దృష్టిపెడితే, ప్రాకృతికవాద రచయితలు పేదరికం ఎక్కడెక్కడ మానవత్వ క్షీణతకీ, విధ్వంసానికీ దారితీసిందో ఆ చీకటిమూలలమీద ఎక్కువ దృష్టిపెట్టారు. పేదరికం దీనత్వానికీ, అవినీతికీ, దుర్మార్గానికీ, వ్యాథికీ, అంతిమంగా హింసకీ దారితీస్తుంది కాబట్టి ఆ చీకటికోణం అట్టడుగున పడి కనిపించనికథల్ని తవ్వితీయడానికి ప్రాకృతికవాదరచయితలు తమ శక్తిసామర్థ్యాల్ని వినియోగించారు. దొంగతనం, వ్యభిచారం, రోగాలు, జాతివిచక్షణ, శారీరిక హింస, మానసిక క్షోభ వాళ్ళకు ప్రధాన ఇతివృత్తాలయ్యాయి. మనుషుల భావోద్వేగాల్ని ఉత్తేజపరిచే కాల్పనికసీమల్ని చిత్రించడంతో మొదలైన రొమాంటిసిజం డార్క్ రొమాంటిసిజంగా మారినట్టే, జీవితవాస్తవాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రించాలని మొదలైన వాస్తవికతావాదం నాచురలిస్టుల చేతుల్లో డార్క్ రియలిజంగా మారిపోయింది.

మపాసా: డార్క్ రియలిజం

మపాసా 1850 లో పుట్టాడు. అతడికి పదేళ్ళ వయసప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత అతడు తల్లిదగ్గరే పెరిగాడు.ఆ తర్వాత అతడి సాహిత్యంలో కనిపించే ఎందరో స్త్రీలకి ఆ తల్లినుంచే స్ఫూర్తి తెచ్చుకున్నాడు. ఆమెవల్లనే అతడికి గుస్టావ్ ఫ్లాబే (1821-1880) పరిచయమయ్యాడు. మపాసాని ఫ్లాబే తన ‘యువశిష్యుడి ‘గా పిలుచుకున్నాడు. ఏడేళ్ళపాటు మాపాసా రాసైన కథలు, కవితలు, పెద్దకథలు, చివరికి ఒక నాటకం-ఫ్లాబే అన్నిట్నీ చదివాడు. కాని ఏ ఒక్కదాన్నీ ఆమోదించలేదు. చివరికి ఒక రోజు తన ఇంటికి భోజనానికి పిలిచాడు. అతడికి సరైన పదప్రయోగం అంటే ఏమిటో ఎలా ఉండాలో చెప్పాడు. యాభై గుర్రపుబగ్గీల వరసలో ఒక గుర్రాన్ని వర్ణించవలసివస్తే, దాన్ని ఒక పదంలో విస్పష్టంగానూ, విలక్షణంగానూ వర్ణించడమెట్లానో, సాధనచెయ్యమన్నాడు. Le mot juste (సముచిత పదం)-అదే మపాసా కథనశిల్పాన్ని పట్టిచ్చే గుర్తుగా మారిపొయింది.

1869 లో మపాసా పారిస్ వెళ్ళాడు. అతడి తండ్రి దగ్గర ఉంటూ , న్యాయశాస్త్రం చదవడం మొదలుపెట్టాడు. కాని జర్మనీకీ, ఫ్రాన్సుకీ మధ్య తలెత్తిన ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధం వల్ల అతడు చదువు మానేసి యుద్ధంలో చేరాడు. యుద్ధకాలంలో మనుషుల ప్రవర్తన, సాహససం,పిరికితనం, ఉచ్చనీచాలు రెండింటినీ దగ్గరగా చూసాడు. 1872 లో యుద్ధం ముగిసిపోగానే, ఫ్లాబే మపాసాకి రకరకాల ఉద్యోగాలు వెతికిపెట్టాడు. అతడు నిర్విరామంగా రాస్తూ ఉండాలి, కాని ఏదీ తొందరపడి ప్రచురించగూడదని సలహా ఇచ్చాడు. మపాసా దాదాపు పదేళ్ళ పాటు ఆ సూచనకి కట్టుబడ్డాడు. ఈలోపు తన ఆనుభవాన్నీ, పరిశీలననీ పదునుపెట్టుకున్నాడు.ఆ రోజుల్లోనే ఫ్లాబే అతడికి జోలానీ, తుర్జనీవ్ నీ, హెన్రీ జేమ్స్ నీ కూడా పరిచయం చేసాడు. ఆ తర్వాత జోలా మపాసా రచనాజీవితంలో ప్రధాన పాత్ర వహించడం మొదలుపెట్టాడు.

1880లో, అంటే యుద్ధం ముగిసిన ఎనిమిదేళ్ళ తరువాత, జోలా ఇంట్లో కొందరు నాచురలిస్టు రచయితలు సమావేశమై, యుద్ధకాల అనుభవాల్ని కథలుగా రాయాలని అనుకున్నారు. ఎవరి వంతు కథవాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. మపాసా వంతు వచ్చేటప్పటికి అతడు తాను చూసిన ఒక అనుభవాన్ని వాళ్ళకు చెప్పుకొచ్చాడు. యుద్ధం మధ్యలో ఒక బండినిండా ఎగువమధ్యతరగతికి చెందిన కొందరు పెద్దమనుషులు ఒక బండిలో ప్రష్యన్ ఆక్రమిత ప్రాంతం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం,అప్పుడు వాళ్ళు చూపించిన ఆత్మవంచన, వాళ్ళల్లో ఒక స్త్రీ చూపించిన ఔదార్యం-అది ఇతివృత్తం. తరువాతి రోజుల్లో అతడు దాన్ని Buter de suif (కొవ్వుముద్ద) అనే కథగా వెలువరించడంతో ప్రపంచ సాహిత్యంలోనే సరికొత్త కథకుడొకడు ప్రభవించాడని లోకం గుర్తించింది.

జోలా ఇంట్లో సమావేశమైన రచయితలు తమని తాము నాచురలిస్టులు అని పిలుచుకోలేదు. అసలు వాళ్ళంతా ఒకే భావజాలానికి చెందిన రచయితలమని కూడా అనుకోలేదు. వాళ్ళేదీ ప్రకటన కూడా వెలువరించలేదు. వాళ్ళ ప్రధానమైన ఉద్దేశ్యమంతా, ఫ్రెంచి ఎన్లైటేన్ మెంటు రచయితలు మాంటేన్, రబెలయాస్, డిడిరో, వోల్టేర్ లు ఏ ఆదర్శాల కోసం రచనలు చేసారో, ఆ ఆదర్శాలనూ, ఆ వివేచననూ రొమాంటిసిజం మరుగుపరిచిందనీ, సాహిత్యాన్ని రొమాంటిసిస్టు ప్రభావమ్నుంచి తప్పించి తిరిగిమళ్ళా అర్థవంతం చేయాలనీ వాళ్ళు కోరుకున్నారు.

ఆ రోజు మపాసా జోలా ఆశయాలకు దగ్గరగా మాట్లాడినప్పటికీ అతడు తనని తాను నాచురలిస్టు అనుకోలేదు. అతడు తనని తాను ఫ్లాబే శిష్యుడిగానే పరిగణించుకుంటూ ఉన్నాడు. ఒకటి రెండు సందర్భాల్లో జోలా రచనాశిల్పాన్ని బహిరంగంగా అవహేళన కూడా చేసాడు.

కాని, మపాసా కథలు రొమాంటిసిజాన్ని ఎండగట్టి రియలిస్టు పద్ధతిలో జీవితాన్ని ప్రతిబింబించే రచనలు కావనీ, అవి డార్క్ రియలిజానికి చెందిన రచనలనీ మనం గుర్తుపట్టగలం. ఫ్రెంచి సాహిత్యంలో ఎన్ లైటెన్ మెంటు తత్త్వవేత్తల స్ఫూర్తిని మళ్ళా పునః ప్రతిష్టించాలని మపాసా కోరుకుని ఉండవచ్చు. కాని అతడిలోని కథకుడు ఆ స్థూల సాహిత్యప్రయోజనానికి కట్టుబడకపోవడమే అతడి సాహిత్యాన్ని అజరామరం చేసింది. ‘అతడి ప్రతిభ నన్ను నివ్వెరపరుస్తుంది, కాని అతడి సాహిత్యానికి ఒక నైతిక సూత్రం లేదు ‘అని టాల్ స్టాయి భావించి ఉండవచ్చుగాక, కాని ‘ఒక సామాజిక వ్యాఖ్యాతగా మపాసాలో చెప్పుకోవలసిందేమీ లేదు.కాని అతడి సాహిత్యకళ మాత్రం చాలా చాలా అరుదైనది ‘అని హెన్రీ జేమ్స్ అన్నాడని కూడా మనం మర్చిపోకూడదు.

కాని మపాసాకి రచయితకీ, నీతిసూత్రకారుడికీ మధ్య తేడా స్పష్టంగా తెలుసు.’రచయిత లక్ష్యం’ అనీ లేదా ‘వాస్తవికతావాది పద్ధతి ‘అనీ ప్రసిద్ధమైన ఒక వ్యాసంలో అతడిట్లా అనాడు.

‘గంభీరమైన లక్ష్యంతో రాసే రచయిత లక్ష్యం వట్టి కథ చెప్పడం కాదు. లేదా మనకి అహ్లాదం కలిగించడమూ కాదు. మనల్ని విచలితం చేస్తే చాలని అతడనుకోలేడు. అంతకన్నా కూడా మనల్ని ఆలోచించపచెయ్యడం, సంఘటనలవెనక ఉన్న లోతైన అంశాల్ని మనం అర్థం చేసుకునేటట్టు చూడటం అతడి ఉద్దేశ్యం. ఈ ప్రపంచాన్నీ, విషయాల్నీ, యథార్థాల్నీ , మనుషుల్నీ చూస్తూ వస్తున్నందువల్లా, వాటి గురించి ఆలోచిస్తూ వచ్చినందువల్లా అతడు వాటినిఒక ప్రత్యేక పద్ధతిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తనదే అయిన ఒక పద్ధతిలో అతడు వాటిని అర్థం చేసుకోవాలనుకుంటాడు. చూస్తూ వచ్చిన పరిశీలనలూ, వాటిగురించిన తన తలపోతాలూ-రెండూ కలిసిన ఒక దృక్పథమది. అట్లా ప్రపంచాన్ని తనదైన వ్యక్తిగత ప్రపంచంగా మార్చుకున్నకానే అతడు దాన్ని తన రచనలద్వారా తిరిగి మనముందు ప్రతిపాదిస్తాడు. జీవితవైభవాన్ని చూసి ముందు తాను చలించిన తరువాతనే మనల్ని చలింపచెయ్యాలనుకుంటాడు. అట్లా చెయ్యడానికి అతడికి తాను చూసిన దాన్ని ఎంతో నిర్ధుష్టంగా మనముందు చిత్రించడం అవసరం..

‘..రచయిత ప్రతిభ ఏదో ఒక భావోద్వేగాన్ని చూపించడమో లేదా పాఠకుల్ని సమ్మోహపరచడమో కాదు, గొప్పగా ఎత్తుకోవడమో లేదా ఊహించనివిధంగా  మలుపు తిప్పడమో కాదు.వాటన్నిటికన్నా కూడా అనేక చిన్న చిన్న యథార్థాల్ని నేర్పుగా అల్లి పాఠకుడి ముందుపెట్టగలగాలి,తద్వారా ఆ పాఠకుడు ఆ రచన ఉద్దేశ్యమేమిటో అవగతం చేసుకునేటట్టు చూడగలగాలి.’

‘జీవితంలో సంభవించే ప్రతి ఒక్కదాన్ని చిత్రించడం అసాధ్యం. అట్లా చెయ్యాలంటే ఒక్క గంటపాటు సంభవించే సంగతులు పట్టుకోవాలనుకున్నా,ఒక్కొక్క గంటని వర్ణించడానికి ఒక్కొక్క పుస్తకం అవసరమవుతుంది. వాస్తవికతావాదులు చెప్పే ‘మొత్తం వాస్తవం ‘అనే సిద్ధాంతానికి మొదటి ఎదురుదెబ్బ తగిలేదిక్కడే. అందుకని మనం చిత్రించవలసిన వాటిలో ఏవో కొన్నింటిని మాత్రమే ఎంచుకుని చిత్రించడం తప్పని సరి అవుతుంది. ‘

రచయితకి ఉండవలసిన లక్ష్యం, అనుసరించవలసిన శిల్పం గురించి చెప్పడానికి ఆ మొత్తం వ్యాసమంతా ఉల్లేఖించవలసి ఉంటుంది. కాని రొమాంటిసిజాన్ని వ్యతిరేకిస్తూ రచనలు మొదలుపెట్టిన మాపసా అనతికాంలోనే రియలిస్టు పద్ధతి పరిమితిని కూడా గుర్తుపట్టాడనడానికి, మరొక మూడు నాలుగు వాక్యాలు ఉదాహరిస్తే చాలు. అతడిట్లా రాస్తున్నాడు:

‘కాబట్టి నేనింతదాకా చేసిన విశ్లేషణని పట్టి చెప్పగలిగేదేమంటే, తాము వాస్తవాన్ని చిత్రిస్తున్నామని చెప్పుకునే రచయితలు నిజానికి తమ భ్రమల్ని మాత్రమే చిత్రిస్తున్నారని. వాళ్ళు తమని తాము రియలిస్టులు అని పిలుచుకునే బదులు ఇల్యూజనిస్టులు అని పిలుచుకోవడం సబబుగా ఉంటుంది..’

‘ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం, వ్యక్తిగతంగా ఈ ప్రపంచం గురించి ఒక వ్యక్తిగత భ్రమని ఏర్పరచుకుంటున్నాం. అది కవితాత్మకం కావచ్చు, రాగద్వేషభరితం కావచూ, ఉల్లసభరితం కావచ్చు, విషాదపూరితం కావచ్చు, అనైతికం కావచ్చు, అనుత్సాహకారకం కావచ్చు,ఏదైనా మన స్వభావానికి అనుగుణంగా మనమొక చిత్రాన్ని ఏర్పరచుకుంటున్నాం. కాని తన సాహిత్యసాధానసంపత్తినంతటినీ ఉపయోగించుకుని, ఈ భ్రమనే అత్యంత విశ్వసనీయంగా చిత్రించడమే ఏ రచయితకైనా కర్తవ్యమనిపించుకుంటుంది.’

గులాబి: వైరుధ్యాలూ, కళ

మపాసా పుట్టి పెరిగిన ఫ్రాన్సు వైరుధ్యాల పుట్ట. 1789 లో సుప్రసిద్ధ ఫ్రెంచి విప్లవం సంభవించింది. కానీ నిజమైన రిపబ్లిక్ 1878 దాకా ఏర్పడనే లేదు. ఈ రెండు సంవత్సరాల మధ్యకాలంలో , ఫ్రాన్సు ఇద్దరు చక్రవర్తుల్నీ, ముగ్గురు రాజుల్నీ, అల్పాయుష్కు అయిన ఒక రిపబ్లిక్కునీ, మూడు విప్లవాల్నీ చవిచూసింది! అంటువ్యాథులు, ప్రజాప్రతిఘటనలు, విరుద్ధ రాజకీయ పరిపాలనలమధ్య ఫ్రాన్సు ఊహించలేని ఉత్థానపతనాల్ని చవిచూసింది. పారిశ్రామిక విప్లవ నేపథ్యంలో, ప్రజాస్వామిక భావాల స్ఫూర్తితో సంభవిస్తున్న మహా రాజకీయ పరిణామాల మధ్య మనుషులు తమ తమ పరిమిత జీవితాల్లో తమ తమ వ్యక్తిగత స్వభావాలు ఎటు నడిపిస్తే అటు నడుస్తూ వచ్చారని పసిగట్టడంలోనూ, చిత్రించడంలోనూ కథకుడిగా మపాసా విజయాన్ని చూడాలి మనం.

ఉదాహరణకి ఇక్కడ పొందుపరిచిన ‘గులాబి’ కథ చూడండి. ఇది ప్రకృతి గురించిన కథ, మనుష్య ప్రకృతి గురించిన కథ కూడా. ప్రకృతిని ప్రాకృతిక ప్రకృతి అనే అర్థం నుంచి స్వాభావిక ప్రకృతి అనే పార్శ్వంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన కథ. ఈ చిన్న కథలో ఫ్రెంచి సామాజాన్ని అతలాకుతలం చేస్తున్న వైరుధ్యాలన్నీ ఎంతో కళాత్మకంగా చిత్రణకొచ్చాయి. కేన్స్ లో జరుగుతున్న ఆ పూలపండగలో సంపన్నవర్గానికీ, దిగువ వర్గాలకీ మధ్య అంతరాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.  కథా సన్నివేశం పూలపండగ. పూలు చల్లుకోవడం, విసురుకోవడం, బంతులాడుకోవడం. కథలో పాత్ర ‘గులాబి’. కాని ముల్లు ఉన్న గులాబి. వివిధ వైరుధ్యాలు: స్త్రీ ప్రకృతి, పురుషప్రకృతి, స్త్రీపురుష సాన్నిహిత్యం, స్వలింగ సాన్నిహిత్యం,ప్రేమప్రకటన, ప్రేమ తిరస్కారం, ఎగువ తరగతి-దిగువ తరగతిచట్టానికి అనుగుణంగా నడుచుకోవడం,చట్టాన్ని తప్పించుకోవడం, -మనుషుల సాన్నిహిత్యాన్ని పరిపాలించే సామాజిక లూ ఆకస్మికంగా, అనూహ్యంగా ఉల్లంఘనకి గురికావడం,కాని ఆ మళ్ళా ఆ సరిహద్దులు యథాతథస్థితికి చేరుకోవడం- ఇంత వైరుధ్యమయజీవితాన్ని పట్టుకోవడం రియలిస్టులకే కాదు, జోలాలాంటి నాచురలిస్టులకి కూడా సాధ్యం కాదు.

అయితే, ఈ కథలో నిజమైన ప్రతిభ,ఆ వైరుధ్యాల్ని పట్టుకోవడంలో లేదు. అది మనిషి స్వభావంలో ఉన్న లోతైన, నిగూఢమైన చీకటి కోణాన్ని పట్టుకోవడంలో ఉంది. కథలో మార్గరెట్ తన అస్తిత్వానికి నిజమైన ఆమోదం తన సామాజికమైన హోదాలోనో, తన తీరికతనంలోనో, అతలాకుతలంకాని తన శారీరిక సౌఖ్యంలోనో ఉందని భావించడం లేదు. తన శరీరం, తన సాన్నిహిత్యం మరొక మనిషిలో తృష్ణని మేల్కొల్పలేకపోయాయని తెలిసినప్పుడు తన అస్తిత్వం కనీసం ఆ మేరకు అర్థాన్ని కోల్పోయిందని ఆమె  భావించింది. ఏ సరిహద్దులవల్ల తన సామాజిక అస్తిత్వానికి భద్రత సమకూరిందో, ఆ సరిహద్దులవల్లనే తన స్వాభావిక అస్తిత్వానికి గుర్తింపు లేకపోయిందని ఆమే భావిస్తున్నది. బహుశా ఆమె భావన భ్రమతో కూడుకున్నదే కావచ్చు. కాని ఆ భ్రమ ఆమె స్వభావాన్ని బట్టి ఆమెకి కలిగిన యథార్థ అనుభవం. కేవలం తర్కంమీదా, వివేచనా మీదా ఆధారపడి వాస్తవాన్ని చిత్రించాలనుకునే రియలిస్టుకి ఈ ‘వాస్తవం’ ఎప్పటికీ చేజిక్కదనే మపాసా చెప్తున్నది.

మపాసా

గులాబి

ఆ ఇద్దరు యువతులు ఓ పెద్ద పూలగుట్ట కింద కప్పేసినట్టు కనిపిస్తున్నారు. వాళ్లు ప్రయాణిస్తున్న బండినిండా పూలు. అదో పెద్ద పూలగంపలాగా ఉంది. ఆ బండిలో ముందుసీటు మీద ఊదారంగుపూలతో నిండిన రెండు బుట్టలున్నాయి. ఆ యువతుల మోకాళ్ల దగ్గర ఓ మూటలో గులాబీలు, నిమోసాలు, డైసీలు, లిల్లీలు, నారింజరంగు పూలు రకరకాల పూలెన్నో కనిపిస్తున్నాయి. ఆ మూటని సిల్కురిబ్బన్‌లతో గట్టిగా చుట్టి కట్టారు. ఆ మూట ఆ కోమలమైన ఆ ఇద్దరి యువతుల దేహాల్ని నొక్కేస్తున్నట్టుంది. ధగధగ మెరుస్తున్న తీపి సుగంధాలు చల్లుతున్న ఆ పుష్పశయ్యలో వాళ్ల భుజాలూ, మోచేతులూ మాత్రమే కనిపిస్తున్నాయి. వాటిమధ్య నుంచి నీలంరంగు, లిలాక్‌ రంగులో వాళ్లు వేసుకున్న రవికలు కూడా కనిపిస్తున్నాయి.

బండివాడి చేతిలో కొరడాకి కూడా పూలు చుట్టారు. గుర్రాలకు కట్టిన కళ్లేలు కూడా రంగుకాగితాల్లాగా పూలు చుట్టివున్నాయి. బండి చక్రాల ఇరుసుల చుట్టూ పూలు అలంకరించారు. మామూలుగా బండిలో దీపాలు వేలాడేచోట రెండు పెద్ద పూల గుత్తులు వేలాడుతున్నాయి. ఆ బండి నడుస్తుంటే పెద్ద పూలపక్షి ఒకటి ముందుకు కదులుతున్నట్టూ, ఆ రెండు పూలగుత్తులూ విచిత్రమైన దాని కళ్లల్లానూ అనిపిస్తున్నాయి.

ఆ పూలబండి నెమ్మదిగా రోడ్డుమీద సాగుతోంది. ర్యూ-డి- అంటిబ్స్ దాటిపోయింది. దాని వెనుకనే మరెన్నో పూలబళ్లు తరలివస్తున్నాయి. వాటినిండా పూలమాలలు. అంచులదాకా పొంగిపొర్లు తున్న ఊదారంగు పూల వెల్లువలో తేలుతున్న స్త్రీలు. అది కేన్స్‌లో పూలపండగ జరిగే వేళ.

వాళ్లు బౌల్వార్డ్ డె లా ఫొన్సియె చేరుకున్నారు. పూలబాణాలతో యుద్ధం చేసుకునే చోటదే. జనసమ్మర్దంతో  నిండివున్న ఆ దారికటూఇటూ రెండు వరుసల్లో పూలబళ్లు వస్తూపోతూ రంగుపట్టీల్లాగా కనిపిస్తున్నాయి. బళ్ల మీంచే మనుషులు ఒకరిమీద ఒకరు పూలు విసురుకుంటున్నారు. ఆ పూలు గాల్లో తూటాలులాగా దూసుకుపోతున్నాయి. తాజాగా నవనవలాడుతున్న యువతుల్ని తాకుతున్నాయవి. అవి వాళ్లను తాకుతూ గిరగిరా తిరుగుతూ నేలరాలుతుంటే ఆ విథిలో పిల్ల గుంపు ఒకటి  వాటిని ఏరుకుంటోంది.

ఆ ఉల్లాసమంతటినీ అక్కడ చేరిన జనసముదాయం చూస్తూ ఉంది. అక్కడ రణగొణధ్వనిగా ఉన్న అవ్యవస్థ లేదు. వాళ్లంతా పేవ్‌మెంట్లమీద కూడి ఆ వినోదం చూస్తూన్నారు. గుర్రాలమీద తిరుగుతున్న సైనికులు వాళ్లని అదుపులో పెడుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దామని కాళ్లు పైకెత్తుతూ ముందుకి తోసుకొస్తున్న జనాల్ని వాళ్లు నిర్ధాక్షిణ్యంగా వెనక్కి నెట్టేస్తున్నారు. చూస్తూంటే ఆ పాటకజనం సంపన్నవర్గాలతో కలవకుండా ఉండటానికే వాళ్లట్లా చేస్తున్నట్టుంది.

పూలబళ్లల్లోంచి మనుషులు ఒకరునొకళ్లు బిగ్గరగా పలకరించుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్లు గుర్తుపడుతున్నారు. గులాబీలు ఒకరిమీద ఒకరు విసురుకుంటున్నారు. ఓ బండినిండా అందమైన స్త్రీలు కనిపిస్తున్నారు. వాళ్లంతా ఎర్రటి దుస్తుల్లో మోహినీపిశాచాల్లా ఉన్నారు. మిరుమిట్లు గొలుపుతున్న వాళ్ల ఆకర్షణ ప్రతిఒకరిదృష్టినీ తమవైపే లాగుతోంది. అక్కడొక పెద్దమనిషి పూలగుత్తులు విసురుతున్నాడు. చిత్రపటాల్లో కనిపించే నాలుగవ హెన్రీలాగా ఉన్నాడతను.  ఒక రబ్బరుతాటికి పెద్ద పూలగుత్తి కట్టి దాన్ని ఎగరేస్తున్నాడు. దాన్ని ముందుకి విసిరినప్పుడల్లా బెదురుతూ ఆ స్త్రీలు తమకళ్లు మూసుకుంటున్నారు. పురుషులు తలలు వంచుతున్నారు. కానీ ఆ ముందుకు విసిరిన పూలగుత్తి వేగంగా, మృదువుగా ముందుకు దూసుకొచ్చి ఒక వంపు తిరిగి మళ్లీ ఆ పెద్దమనిషి దగ్గరకే చేరుకుంటోంది. అతడప్పుడు మళ్లా దాన్ని మరో ముఖం వైపుకు విసురుతున్నాడు.

పూలబండిలో ఉన్న ఇద్దరు యువతులు తమ బండిలోంచి పిడికిళ్ల కొద్దీ పూలుతీసి నలుదిక్కులా వెదజల్లుతున్నారు. వాళ్లమీద కూడా వడగళ్ల వానలాగా పూలవాన కురుస్తూ ఉంది. అట్లా సుమారు ఓ గంటసేపు పూలయుద్ధం చేశాక చివరికి వాళ్లు కొద్దిగా అలసిపోయినట్టే కనిపించారు. అప్పుడు వాళ్లు బండివాడితో సెంట్‌జువాన్‌ సింధుశాఖకు పోయే దారి పట్టించమని చెప్పారు. ఆ రోడ్డుమీద పోతే సముద్రతీరానికి పోవచ్చు.

ఎస్టరల్‌ పర్వతం వెనగ్గా సూర్యుడు అదృశ్యమవుతూ ఉన్నాడు. నల్లగా గండశిలలతో నిండిన ఆ పర్వతం చుట్టూ ఎర్రరంగు పులుముతున్నాడు. ప్రశాంతసాగరం నీలంగా, నిర్మలంగా దిగంతం దాకా విస్తరించి అక్కడ ఆకాశంలో కలుస్తున్నట్టుంది. దూరంగా సింధుశాఖ మధ్యలో లంగరు వేసిన నౌకలు మహామృగాలగుంపులాగా ఉన్నాయి. అవి నీటిమీద నిశ్చలంగా ఉన్నాయి. వాటికి కవచాలు తొడిగినట్టు, వీపుమీద బరువులు మోపినట్టు కనిపిస్తున్నాయి. పొడవైన తెరచాప స్తంభాలు ఆ పక్షులఈకల్లాగా ఉన్నాయి. ఏదో ప్రళయకాలానికి చెందిన మృగాల్లాగా ఉన్న ఆ నౌకలనేత్రాలు చీకటిపడగానే వెలగడం మొదలుపెట్టాయి.

పూలబండిలో పెద్ద రగ్గుకింద కాళ్లు చాపుకుని కూర్చున్న ఆ యువతులు ఉదాసీనంగా అలసిపోయిన కళ్లతో ముందుకు చూశారు. చివరికి ఒకామె అన్నది:

‘ఒక్కొక్కప్పుడు నిజంగా ప్రతి ఒక్కటీ అద్భుతంగా ఉందనిపిస్తుంది. అట్లాంటి సంతోషభరిత సాయంకాలాలు చాలానే ఉంటాయి. కాదంటావా మార్గరేట్‌’.

ఆ రెండవ ఆమె జవాబిచ్చింది.

‘నిజమే అద్భుతంగా ఉంటాయి. కాని ఆ సంతోషం మధ్యలో ఏదో కొరవడుతున్నట్టే ఉంటుంది.’

‘ఏం తక్కువయిందంటావ్‌? నాకయితే చాలా సంతోషంగా ఉంది. నాకింకేమీ కావాలనిపించడంలేదు.’

‘నిజమే. నిన్ను చూస్తే అలానే ఉంది. కాని నేను చెప్తున్న విషయం నువ్వాలోచించడం లేదు. మనం పొందుతున్న ఈ సంతోషం మన దేహాల్ని ఎంత బాగా జోకొడుతున్నా మనకింకా ఏదో కావాలనే అనిపిస్తూ ఉంటుంది… ముఖ్యంగా మన హృదయాలకి.’

ఆ రెండవ ఆమె చిరునవ్వుతూ అంది.

‘ఒకింత ప్రేమ కావాలంటావా?’

‘అవును.’

వాళ్లిద్దరూ మౌనంగా ఉండిపోయారు. కొంతసేపు ముందుకే చూస్తూ ఉండిపోయారు. అప్పుడు వాళ్లల్లో మార్గరేట్‌ అన్నామె నెమ్మదిగా గొణుక్కుంది.

‘నాకెందుకో అది లేకపోతే జీవితం సహించదగ్గదిగా తోచదు. నన్నెవరో ఒకరు ప్రేమిస్తూనే ఉండాలి. చివరికి ఓ కుక్కయినా సరే. ఆ మాటకొస్తే మన స్త్రీలందరి మనోభావమూ ఇలాగే ఉంటుంది. నువ్వేమన్నా అను సైమోన్‌.’

‘నేనొప్పుకోను. ఆ మాటకొస్తే ఎవరిపడితే వాళ్లు మనల్ని ప్రేమించడం కన్నా అసలు మనం ప్రేమించబడకుండా ఉండడమే మెరుగంటాను. ఎవరుపడితే వాళ్లు మనల్ని ప్రేమిస్తే అది నిజంగానే ఆహ్లాదకరమా చెప్పు? ఎవరుపడితే వాళ్లంటే ఉదాహరణకి…’

ఆ ఎవరో ఊహించడానికి ఆమె ప్రయత్నించింది. తన ముందున్న విశాల సాగరదృశ్యం కేసి చూసింది. ఆ నేత్రాలు ఆ దూరదిగందనేత్రం మీంచి ముందుకుసాగి చుట్టూ తిరిగి చివరికి బండివాడి వీపుమీద కోటుకు మెరుస్తున్న రెండు రాగిబొత్తాముల మీద ఆగాయి. వాటిని చూడగానే ఆమె నవ్వుతూ ‘ఎవరుపడితే వాళ్లంటే, ఉదాహరణకి, ఇదిగో నా బండివాడు, వీడు ప్రేమిస్తే నాకు సంతోషంగా ఎలా ఉంటుంది చెప్పు.’

ఆమె మాటలకి మేడమ్‌ మార్గరేట్‌ వదనంలో మందహాసం కనిపించీ కనిపించకుండా తరలిపోయింది. ఆమె లోగొంతుకతో ఇట్లా అంది:

‘నీ పనివాడు నిన్ను ప్రేమించడంలో గొప్ప సరదా ఉందని నేను కచ్చితంగా చెప్పగలను. నాకట్లాంటి అనుభవం గతంలో రెండుమూడుసార్లు జరిగింది. వాళ్లు నిన్ను ప్రేమిస్తుంటే ఆ ప్రేమపారవశ్యంలో వాళ్లు నిన్ను చూస్తూ ఉండడం ఎంత వినోదంగా ఉంటుందంటే నీకు కడుపు చెక్కలయ్యేంత నవ్వొస్తూ ఉంటుంది. అలాగని నువ్వు నవ్వలేవనుకో. వాళ్లు నిన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తూంటే వాళ్లపట్ల నువ్వంత గంభీరంగా ప్రవర్తిస్తుంటావు. ఇక ఏదో ఒక రోజున ఏదో ఒక సాకు దొరకపుచ్చుకుని నువ్వు వాళ్లను బయటికి తోసేయాలి. ఆ వ్యవహారం మరీ ఎక్కువ కాలం కొనసాగితే నువ్వు నవ్వులపాలయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

మేడమ్‌ సైమోన్‌ ఆమె మాటల్నే వింటూఉంది. ఆమె కళ్లు దూరంగా చూస్తూన్నాయి. అప్పుడామె అందికదా,

‘లేదు లేదు నాకెంత ఆలోచించినా నా పనివాడి హృదయం నన్ను సంతోష పరచడానికి సరిపోయింది కాదనే అనిపిస్తోంది. అది సరేకాని, చెప్పు, ఇంతకీ వాళ్లు నీతో ప్రేమలో పడ్డారని నీకెలా తెలిసింది?’

‘తక్కిన మగాళ్లు నీతో ప్రేమలో పడితే నీకెలా తెలుస్తుందో అలాగే. వాళ్లు మూర్ఖంగా ప్రవర్తించడం మొదలుపెట్టగానే తెలుస్తుంది మనకి.’

‘కాని తక్కిన మగవాళ్లు నన్ను ప్రేమిస్తున్నప్పుడు వాళ్లేమంత మూర్ఖంగా కనిపించరే.’

‘లేదు మిత్రమా. వాళ్లు బొత్తిగా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. నువ్వడిగినదానికి సరిగా జవాబు చెప్పలేరు. అసలు నీతో ఒక్క నిముషం పాటు కూడా  సరిగ్గా మాట్లాడలేరు. అసలు నువ్వు చెప్పేదేమీ అర్థం చేసుకోలేరు.’

‘నీ పనివాడు నిన్ను ప్రేమిస్తుండడం, ఆ అనుభవం, అదెలా ఉంటుంది? అంటే వాళ్లు నిన్ను ముట్టుకోడానికి ప్రయత్నిస్తుంటారా? పొగుడుతుంటారా?’

‘ముట్టుకోవడమా? లేదు. పొగుడుతుండడమా? హాఁ కొద్దిగా. ఆ మాటకొస్తే నిన్నో మగవాడు ప్రేమిస్తుంటే వాడెవడన్నాకానీ, ఆ ప్రేమించడం దానికదే ఓ పొగడ్త.’

‘ఏం మాట్లాడుతున్నావు మార్గరెట్?’

‘నిజమే. నేను చెప్తున్నది నిజమే చూడు. నాకు ఇట్లాంటిదే ఓ విచిత్రమైన అనుభవం సంభవించింది. అట్లాంటి సందర్భాల్లో మనలో ఎంత సంక్షోభం, ఎంత ఇంద్రజాలం పోటెత్తుతాయో నువ్వే చూడు.’

‘ఇది జరిగి ఈ రాబోయే హేమంతానికి నాలుగేళ్లు అవుతుంది. ఆ రోజుల్లో  నాకు ఇంట్లో పనిమనిషి లేకుండా పోయింది. నేను తగిన పనిమనిషికోసం ఐదారుగుర్ని చూశాను. ఒకరివెనుక ఒకర్ని. కాని వాళ్లంతా పనికిమాలినవాళ్లే అనిపించారు. చివరికి పనిమనిషి దొరుకుతుందన్న ఆశ వదిలేశాను. అట్లాంటి రోజుల్లో ఒకరోజు పేపర్లో ఓ చిన్నిప్రకటన చూశాను. అందులో ఓ యువతి పనిమనిషిగా పనిచేయటానికి సిద్ధంగా ఉందనీ, ఆమె కుట్లు,అల్లికలూ కూడా చేయగలదనీ,  తలదువ్వి జడ వేయగలదనీ, ఆమె పనివెతుక్కుంటోందని, ఆ సంగతులన్నీ  వాకబు చేసి తెలుసుకోవచ్చనీ రాసి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆమె ఇంగ్లీషు మాట్లాడగలదని కూడా రాసి ఉంది.

నేను అక్కడ ఇచ్చిన చిరునామాకి వెంటనే ఉత్తరం రాశాను. ఆ మరుసటి రోజే ఆ యువతి నా ముందు ప్రత్యక్షమయ్యింది. ఆమె పొడుగ్గా, సన్నగా ఉంది. ముఖం కొద్దిగా పాలిపోయినట్టుగా ఉంది. బెదురుచూపులు. కాని ఆ కళ్లు నల్లగా, ప్రేమించదగ్గవిగా ఉన్నాయి. మేనిఛాయ మరులుగొల్పేటట్టు ఉంది. నేనామెను వెంటనే పనిలో పెట్టుకున్నాను. ఆమెగురించి వాకబు చేయడానికి తెలిసినవాళ్ల వివరాలు చెప్పమన్నాను. ఆమె ఒక ఇంగ్లీషు కుటుంబం వివరాలు ఇచ్చింది. తానింతకుముందు వాళ్ళ ఇంట్లోనే పదేళ్లపాటు పనిచేశానని చెప్పింది.

ఆ ఇంటివాళ్లతో ఆ వివరాలు గురించి కనుక్కుంటే ఆ అమ్మాయి తనంతట తనే వాళ్ల దగ్గర పని మానుకుందనీ, ముఖ్యంగా ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లిపోవడం కోసమే పని మానుకుందనీ, ఆమె వాళ్ల దగ్గర పనిచేసినంతకాలం వేలెత్తి చూపించుకోలేదననీ తెలిసింది. ఇక ఆమెలో నెపమంటూ ఏదన్నా ఎన్నవలసి వస్తే అది కూడా కొద్దిపాటి ‘ఫ్రెంచి రసికత’ తప్ప మరేమీ కాదని తెలిసింది.

ఆ ఇంగ్లీషు స్త్రీ అట్లా ‘ఫ్రెంచి రసికత’ అని అంటున్నప్పుడు చెప్పొద్దూ, నాకు కొద్దిగా సరదాగానే అనిపించింది. ఇక నేను ఏమీ ఆలోచించకుండా ఆ పనిమనిషిని పనిలో పెట్టుకున్నాను.

ఆమె ఆరోజే పనిలో చేరింది. ఆమె పేరు గులాబి.

ఓ నెలరోజులు గడిచేటప్పటికి నేనామెకు ఆరాధకురాలిగా మారిపోయాను.

ఆమె నిజంగానే ఓ విలువైన వజ్రం, ముత్యం, అద్భుతం!

ఆమె ఎంతో ఉన్నతస్థాయి అభిరుచికి తగ్గట్టుగా నాకు కేశాలంకరణ చేసేది. ఈ ప్రపంచంలో స్త్రీల టోపీలు అమ్మే గొప్ప దుకాణదారులకన్నాకూడా మించి ఆమె నా టోపీ లేసు తానే స్వయంగా అల్లేది. వస్త్రాలంకరణలో కూడా ఆమెది అందివేసిన చేయి అని చెప్పాలి.

ఆమె కౌశల్యాలు చూసి నేను నిశ్చేష్టురాలినయ్యాను. నా జీవితంలో నన్నంత బాగా ఎవరూ చూసుకోనేలేదు.

ఆమె ఎంతో నేర్పుగా నాకు వస్త్రాలంకరణ చేసేది.  ఒక్కసారి కూడా ఆమె వేళ్లు నా చర్మాన్ని తాకనే లేదు. ఎందుకంటే ఓ పని మనిషి చేతులు నన్ను తాకుతుండడం కన్నా నీకు చిరాకు తెప్పించేది మరేమీ ఉండదు. ఆమె సేవలతోటి నేను మరింత సోమరిగా మారిపోయాను. ఆమె ఆపాదమస్తకం నాకు వస్త్రాలు తొడుగుతూ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉండేది. పొడుగ్గా బెదురుచూపులు చూసే ఆ యువతి నాకు రవిక తొడుగుతుంటే, చేతులకు గ్లోవులు తొడుగుతుంటే, మధ్యమధ్యలో కొద్దికొద్దిగా సిగ్గు పడుతుంటే చూడటం నాకెంతో హాయిగా ఉండేది. నేను స్నానం చేసి బయటికి రాగానే ఆమె నన్ను పైనుంచి కింద దాకా జాగ్రత్తగా తుడిచేది. నేను శయ్యమీద మగతగా కనులు అరమోడ్చి పొడుకుని ఉంటే ఒళ్లంతా మర్దనా చేసేది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆమెను నేను ఏదో ఇంటి పనిమనిషిలా కాక ఒక స్నేహితురాలిలాగా, కాకపోతే కొద్దిగా కిందితరగతికి చెందిన చెందిన స్నేహితురాలిలాగా చూడటానికి అలవాటుపడ్డాను.

సరే. ఒకరోజు నా అంగరక్షకుడు నాతో ప్రత్యేకంగా మాట్లాడవలసిన పనిఉందన్నాడు. అతడి మాటలు నాకు గూఢంగా అనిపించాయి. ఆశ్చర్యమేసింది. ఏమిటి చెప్పమన్నాను. అతడు చాలా నమ్మకస్తుడైన మనిషి. మొదట్లో కొన్నాళ్ళు సైనికుడిగా పనిచేశాడు. నా భర్తకి కూడా సహాయకుడుగా పనిచేశాడు.

అతడు నాకా మాటలు  చెప్పవలసి వస్తున్నందుకు కొద్దిగా ఇబ్బందిపడ్డాడు. చివరికి తడబడుతూనే ‘అమ్మా, ఇక్కడ ఈ ఊళ్లో పోలీస్‌స్టేషన్‌ నుంచి ఇన్‌స్పెక్టరు మీతో మాట్లాడడానికి వచ్చాడు. అతడు కింద మీకోసం ఎదురుచూస్తూన్నాడు’ అన్నాడు.

‘అతనికేం కావాలట?’

కొద్దిగా తీవ్రంగానే అడిగాను.

‘అతడు ఈ ఇల్లు సోదాచేయవలసి ఉందిట.’

‘పోలీసులవల్ల ఉపయోగముంది నిజమే. కాని నాకు వాళ్లంటే అసహ్యం. అదేమంత మర్యాదకలిగిన వృత్తి అనిపించదు నాకు. ఏమయితేనేం ఆ రోజు ఆ సంగతి వినగానే నాకు కోపం వచ్చింది.’

‘సోదానా? ఎందుకు? దేనికోసం. అతడు లోపలికి అడుగుపెట్టడానికి వీల్లేదు’ అన్నాను.

‘ఈ ఇంట్లో ఓ నేరస్తుడు తలదాచుకుంటున్నాడని అతడంటున్నాడు.’ అన్నాడు నా అంగరక్షకుడు.

ఆ మాటవినగానే నాకు భయమేసింది. ఆ పోలీసు ఇనస్పెక్టర్‌ని లోపలికి తీసుకురమ్మన్నాను. ఆ మాటలేవో అతడినుంచే వినొచ్చనుకున్నాను. ఆ ఇనస్పెక్టరు దృఢకాయుడు. అతని దుస్తులమీద శౌర్యపతకాలు అలంకరించి ఉన్నాయి. అతడు వస్తూనే క్షమించమని కోరుకుంటూ, పదపదే సంజాయిషీ చెప్పుకుంటూ, మొత్తానికి నా ఇంట్లో ఉన్న పనివాళ్లల్లో ఓ నేరస్తుడు కూడా ఉన్నాడని చెప్పాడు.

నాకు చాలా నిస్త్రాణగా అనిపించింది. నా దగ్గరున్న పనివాళ్లు ప్రతిఒక్కళ్ల గురించీ నాకు తెలుసనీ, పేరుపేరునా వాళ్ల గురించి చెప్పగలనని చెప్పాను. ఒక్కొక్కళ్ల గురించీ కూడా అడిగాను.

‘మా అంగరక్షకుడు పియర్రి కోర్టిన్‌ గురించంటారా, ఆయన మాజీ సైనికుడు కూడా.’

‘అతడు కాదు.’

‘మా బండివాడు ఫ్రాంకాయిస్‌ పింగావు. అతడు షాంపైన్‌ నుంచి వచ్చిన రైతు. మా నాన్నగారి కౌలురైతుల్లో ఓ కౌలుదారు కొడుకు.’

‘అతడు కాదు.’

‘మా గుర్రపుశాల కుర్రవాడా? అతడు కూడా షాంపైన్‌ నుంచే వచ్చాడు. అతడు కూడా మా రైతుకుటుంబాలకి చెందినవాడే. అతడు మా ఇంట్లో పనివాడు కూడా. మీరిప్పుడే చూసారు.’

‘అతడు కాదు.’

‘చూశారా సార్‌. మీరు కచ్చితంగా పొరపాటు పడ్డారు.’

‘లేదు మేడమ్‌. నాకు తెలిసి నేను అస్సలు పొరపాటు పడలేదు. మేం వెతుకుతున్నది చాలా ప్రమాదకరమైన నేరస్తుడి గురించి. కాబట్టి మీ మొత్తం పనివాళ్లందర్నీ ఇప్పుడే ఇక్కడికి ఒకసారి పిలుస్తారా?’

నేను ముందు కొంత సంకోచించాను కాని చివరికి అతడడిగినట్టే నా పనివాళ్లందర్నీ మొత్తం ఆడామగా అందర్నీ అక్కడికి పిలిపించాను.

ఆ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వాళ్లందర్నీ ఒక్కక్షణం పరీక్షగా చూసి అప్పుడన్నాడు.

‘వీళ్లెవ్వరూ కాదు.’

‘అంతే సార్‌. ఇక మిగిలిందల్లా నా పని పిల్ల. ఒక యువతి. ఆమెను మీరు ఎలానూ నేరస్తురాలిగా భావించలేరు.’

‘నేనామెను కూడా చూడొచ్చా?’ అని అడిగాడతడు.

‘తప్పకుండా.’

నేను వెంటనే గులాబి కోసం కబురు పంపించాను. ఆమె తక్షణమే ప్రత్యక్షమయింది. ఆమె అక్కడ కనిపించిందో లేదో ఇన్‌స్పెక్టర్‌ ఎవరికో ఏదో సైగ చేశాడు. అప్పటిదాకా తలుపు వెనకాలే ఇద్దరు మనుషులు దాక్కుని ఉండడం నేను గమనించలేదు. వాళ్లు వెంటనే ఒక్కసారి ముందుకు ఉరికి ఆమె మీద పడి ఆమె రెండు చేతులు వెనక్కి విరిచి తాడుతో కట్టేశారు.

నేను కెవ్వున కేక పెట్టాను. ఆమెను రక్షించడం కోసం ముందుకు దూకబోయాను. కాని ఆ ఇన్స్‌స్పెక్టరు నన్ను ఆపేశాడు.

‘మేడమ్‌, ఈ అమ్మాయి నిజానికి ఓ అబ్బాయి. ఇతడి పేరు జీన్‌ నికొలస్‌ లెకాపెట్‌.  మానభంగం, హత్యానేరాలమీద 1879 లో ఇతనికి మరణశిక్ష విధించారు. ఆ తరువాత ఆ మరణశిక్షని జీవితఖైదుగా మార్చారు. ఇతడు నాలుగు నెలలకిందటే తప్పించుకున్నాడు. అప్పటినుంచీ మేమితణ్ణి వెతుకుతూనే ఉన్నాం.’

నేను నిర్ఘాంతపోయాను. నేనామాటలు నమ్మలేకపోయాను. అయినా ఆ ఇన్‌స్పెక్టర్‌ నవ్వుతూ ఇంకా చెప్తూనే ఉన్నాడు.

‘నేను మీకు కావాలంటే ఓ నిదర్శనం కూడా చూపిస్తాను. అతని కుడిభుజం మీద ఓ పచ్చబొట్టు ఉంటుంది.’

వాళ్లు అతడి దుస్తులు పైకి మడిచి చూసారు. అది నిజమే. ఆ పోలీసు కించిత్‌ కటువుగా ఇంకా ఇలా అన్నాడు.

‘ఇక మీరు అతణ్ణి మాకప్పగిస్తే తక్కిన సంగతి చూసుకుంటాం.’అని వాళ్లు నా పనిమనిషిని లాక్కుపోయారు.

‘అలా జరిగింది. కాని ఇంతకీ ఆ జరిగిందంతా చూస్తే నాకు కలిగిన మనోభావం కోపం కాదు, ఆ మాటకొస్తే నేను మోసపోయాననో లేదా అదంతా హాస్యాస్పదంగా పరిణమించిందనో కూడా కాదు. ఆ మాటకొస్తే నన్ను ఆ మగవాడు స్నానం చేయించాడనో దుస్తులు తొడిగాడనో లేదా నా దుస్తులు విప్పాడనో లేదా నా ఒళ్లు తుడిచాడనో, మర్థనా చేశాడనో అదంతా ఓ మగవాడు చేసినందువల్ల కలిగిన సిగ్గనో అనలేను. అదన్నిటికన్నా కూడా చాలా గాఢమైన అవమానం… ఒక స్త్రీగా నేనెదుర్కొన్న అవమానం. అర్థమవుతోందా?’

‘అంతగా అర్థం కావటం లేదు.’

‘అర్థం కావటం లేదా… ఒక్కసారి ఆలోచించి చూడు… వాడికి మరణశిక్ష విధించారు… ఎందుకు? మానభంగం చేసినందుకు… నేనాలోచిస్తున్నదదే. ఆ విషయం గురించే… అతడి చేతిలో మానభంగానికి గురయిన ఆ స్త్రీ గురించే… అదే నన్ను నిజంగా తీవ్రంగా అవమానిస్తున్న విషయం. సరిగ్గా చూడు నీకే బోధపడుతుంది… అర్థమవుతోందా?’

కాని మేడమ్‌ సిమోన్‌ ఏమీ బదులు పలకలేదు. ఆమె ఎప్పట్లానే ముందుకే చూస్తోంది. ఆమె కళ్లల్లో అదే చూపు. నిలకడగా. ఆ కోచ్‌మేన్‌ దుస్తుల మీద మెరుస్తున్న ఆ రెండు బొత్తాల్నీ ఆమె తదేకంగా చూస్తూ ఉంది. అప్పుడప్పుడు ఆడవాళ్ల వదనంలో కనవచ్చే నిగూఢమైన మందహాసమేదో అప్పుడామె ముఖంలో కదలాడింది.

31-8-2017

Leave a Reply

%d bloggers like this: