కథా ఉద్యమాలు-2

రియలిజం: నికొలాయి గొగోల్, ఓవర్ కోటు

‘రియల్’ అంటే ‘యథార్థమైన’ అని అర్థం. అంటే మన మనోభావాలతో సంబంధం లేకుండా ఉండేది. దాన్ని మనం మన ఇంద్రియసంవేదనల్తో గ్రహిస్తాం. కాని, మనం చూసినా, చూడకపోయినా కూడా ఒక వస్తుగత సత్యం ఉంటుందని చెప్పే  తాత్త్వికభావాన్ని రియలిజం అంటారు. అయితే, సాహిత్యంలోనూ, కళారూపాల్లోనూ మనం మాట్లాడుతున్న వాస్తవికతావాదం ఈ తాత్విక రియలిజం(మెటఫిజికల్ రియలిజం) మీదనే ఆధారపడి ఉంటుందిగాని, దానికన్నా ప్రత్యేకమైన ఒక వైఖరి అది.

యూరోప్ లో పందొమ్మిదో శతాబ్దిలో ఈ ధోరణి బలపడకముందే ప్రాచీన కాలం నుంచీ ఏదో ఒక రూపంలో రియలిస్టిక్ కళ గురించిన భావాలు ప్రబలంగానే ఉంటూ వచ్చాయి. ఉదాహరణకి అరిస్టాటిల్ ‘పొయెటిక్స్ ‘లో వివరించిన మిమెసిస్. సాహిత్యం లేదా కళ ధర్మం జీవితాన్ని అనుకరించి చూపడమని అరిస్టాటిల్ అభిప్రాయపడ్డాడు. కళలో చూపించే యథార్థం నిజమైన వస్తువుకి మూడింతలు దూరంగా జరుగుతుందని ప్లేటో చెప్పినదాన్ని పక్కకునెడుతూ చేసిన ప్రతిపాదన అది. కాని, ఒక కళా ఉద్యమంగా ఆధునిక సాహిత్యాన్ని ప్రభావితం చేసిన రియలిజం కేవలం యథార్థ ప్రపంచాన్ని అనుకరించడంతో తృప్తి చెందేది కాదు. దాని వెనక ఒక విస్పష్టమైన సామాజిక-రాజకీయ దృక్కోణముంది.

సామాజిక -రాజకీయ నేపథ్యం

రొమాంటిసిజం 1848 లో ముగిసిపోయిందని చెప్పుకున్నాం. ఆ ఏడాది ఫ్రాన్సులో సంభవించిన విప్లవం, ఆ ఏడాదే మార్క్స్, ఎంగెల్సులు వెలువరించిన ‘కమ్యూనిస్టు మానిఫెస్టో’ రొమాంటిసిస్టు స్వప్నాలనుంచి యూరోప్ ని వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాయి. తన కాలం నాటికి యూరోప్ ఆర్థిక-రాజకీయ రంగంలో ప్రధాన పాత్ర వహిస్తున్న  బూర్జువాజి (పారిశ్రామికీకరణవల్ల సంపన్నవంతమైన నూతన కులీన, మధ్యతరగతి) మానవసంబంధాల్ని వ్యాపారసంబంధాలుగా మార్చివేసిందని చెప్తూ మార్క్స్, ఎంగెల్సులు కమ్యూనిస్టు ప్రణాళికలో ఇలా రాసారు:

‘ఇంతదాకా సమాజంలో, ప్రతి ఒక్క వృత్తివ్యాపకం కనపరుస్తూ వచ్చిన  ధగధగనీ, వాటిపట్ల సమాజం చూపించే గౌరవాన్నీ బూర్జువాజి పూర్తిగా లాగిపారేసింది. వైద్యుడు, న్యాయవాది, పూజారి, కవి, శాస్త్రవేత్త ప్రతి ఒక్కరూ దానిముంగిట రోజుకూలీలుగా మారిపోయారు. ఉత్పత్తి విధానాల్ని ఎప్పటికప్పుడు విప్లవీకరింపబడటం, సామాజిక పరిస్థితులు సదా డోలాయమానంగా ఉండటం, అంతులేని అనిశ్చితత్వం, అలజడీ, ఆందోళనల్తో బూర్జువా యుగంలో చరిత్రలో ఇంతదాకా గడిచిన పూర్వయుగలాకన్నా ప్రత్యేకంగా తయారైంది. ..ఇంతవరకూ స్థిరంగా ఉన్నవనుకున్నవన్నీ గాల్లో కలిసిపోతున్నాయి, పవిత్రమైందంతా పాపిష్టిదైపోతోంది,  ఇక, చిట్టచివరికి, మనిషి తన గుండె గట్టి చేసుకుని యథార్థ జీవితపరిస్థితుల్నీ, తనతోటి మనుషులతో తన సంబంధాల్నీ ముఖాముఖి ఎదుర్కోకతప్పదు.’

మార్క్స్ మాటలు భవిష్యవాణిలాగా పనిచేసాయి. రానున్న 25 సంవత్సరాల పాటు, 1875 దాకా, ఐరోపీయ రచయితలూ, కవులూ, కళాకారులూ తమ గుండె గట్టిపరుచుకుని మారుతున్న మానవసంబంధాల్ని గుర్తిస్తూ, చిత్రిస్తూ వచ్చేరు. వ్యాపారసంబంధాలుగా మారిపోతున్న మానవసంబంధాల పట్ల ఆగ్రహాన్నీ, సానుభూతిని ప్రకటిస్తూ వచ్చారు. ఆ క్రమంలో కొత్తగా కనిపెట్టిన సమాచార ప్రసార, ప్రయాణ సాధనాలు కూడా వాళ్ళకు తోడయ్యాయి. 1830ల్లో పూర్తిస్తాయిలో రూపొందిన కెమేరా, 1830 లో మొదటి స్టీము రైలు, 1837 లో టెలిగ్రాఫ్, 1876 లో టెలిఫోన్ లు కాలాన్నీ, దూరాన్నీ తగ్గించడం మొదలుపెట్టాయి. సుదూరగతంలోకో లేదా అతీతస్వప్నలోకంలోకో లేదా పురాతన శిథిలాలమధ్యకో,హిమాలయాలకో పోయి ప్రకృతి ఒడిలో సేదదీరాలనుకునే రొమాంటిక్ మానవుడికి బదులు తన కళ్ళముందున్న యథార్థప్రపంచంలోకి మేలుకున్న రియలిస్టు మానవుడు ప్రభవించాడు.

వాస్తవికతావాద చిత్రలేఖనం

ఈ యథార్థ ప్రపంచాన్ని అందరికన్నా ముందు గుర్తుపట్టినవాళ్ళు చిత్రకారులు. 1849 లో గుస్టావ్ కోర్బె చిత్రించిన ‘స్టోన్ కట్టర్స్’ చిత్రంతో మొదటిసారి సామాన్యమానవుడు చిత్రకళాప్రపంచంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ చిత్రం తాత్త్విక రియలిజం నుంచి కళాత్మకవాస్తవికతావాదాన్ని వేరుచేసి చూపిస్తోంది. కళలో రియలిస్టు మానవుడి మనోభావాలకు వెలువపల ఒక బయట ప్రపంచం ఉందని మాత్రమే చెప్పడంతో రియలిస్టు కళాకారుడికి తృప్తి లేదు. ఆ ప్రపంచం ప్రధానంగా కష్టజీవుల ప్రపంచమని చెప్పడంలోనే అతడికి ఆసక్తి.

ఉదాహరణకి స్టోన్ కట్టర్స్ చిత్రం చూడండి. అందులో మనుషులకి పేరులేదు, వాళ్ళ ముఖాలు కూడా మనకి కనిపించడం లేదు, వాళ్ళు అనామకులు, వాళ్ళ మానవదనం మనకి గోచరించడం లేదు, వాళ్ళు తమ మానవత్వానికే పరాయివాళ్ళయిపోయారు. వాళ్ళ పని తప్ప, అక్కడ మనం గుర్తుపట్టడానికేమీ లేదు. ఆ పనికూడా మానసిక ఉల్లాసాన్నీ,ఉత్సాహాన్నీ కలిగించే సృజనాత్మక కార్యకలాపం కాదు, తిరిగి తిరిగి చెయ్యవలసిన బరువైన కాయకష్టం మటుకే.

‘స్టోన్ కట్టర్స్ ‘ చిత్రించిన మరుసటి సంవత్సరమే కోర్బె ‘అర్నాన్స్ లో అంత్యక్రియలు’ (1849-50) అనే చిత్రం చిత్రించాడు. తన స్వగ్రామమైన అర్నాన్స్ లో  ఒక అంత్యక్రియల దృశ్యమది. ఆ దృశ్యం ఒక సాధారణ ఫ్రెంచి గ్రామసీమల దైనందిన జీవితాన్ని వర్ణించింది. అయితే కోర్బె దాన్ని చారిత్రిక చిత్రాల స్థాయిలో పెద్ద కాన్వాసుమీద, ఒక చారిత్రిక సంఘటనలాగా చిత్రించడం చిత్రకళా ప్రపంచంలో పెద్ద దుమారాన్ని లేవనెత్తింది.

 ఫ్రెంచి చిత్రకళా పండితవర్గం అతడి చిత్రాల్ని ప్రదర్శించడానికి ఇష్టపడలేదు. అప్పుడతడు తన చిత్రాల్ని తానే ప్రదర్శించుకున్నాడు. 1855 లో ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శనకు ‘లా రియలిస్మే’ (రియలిజం ) అని పేరుపెట్టుకున్నాడు. 1848 నుంచి 1855 దాకా ఒక చిత్రకారుడిగా తనలో సంభవించిన పరిణామాన్ని ‘ద స్టూడియో: ఎ రియల్ అలిగరి సుమ్మింగ్ అప్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ యాజ్ ఏన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ 1848 టు 1855 ‘ అనే ఒక బృహత్తర చిత్రంగా చిత్రించాడు.

ఈ చిత్రం దానికదే ఒక వాస్తవికవాద నవల వంటిది, కావ్యం వంటిది. అతడే చెప్పుకున్నట్లుగా ఆ చిత్రంలో అతడు సమాజాన్ని ‘అత్యున్నత, సగటు, అతి క్షుద్ర ‘ లక్షణాలతో చిత్రించాడు. మొత్తం 30 ఆకృతులున్న ఈ చిత్రంలో ఎడమవైపు సాధారణ ప్రజానీకం ఉన్నారు. వాళ్ళల్లో  గ్రామీణులు, కూలివాళ్ళు, అడుక్కుంటున్న ఒక సైనికుడు, ఒక యూదు, వీథుల్లో తిరిగి సరుకులమ్ముకునే వాడు, ఒక బలాఢ్యుడు, ఒక విదూషకుడు, బిడ్డకు పాలు పడుతూ రోదిస్తున్న మహిళ ఉన్నారు. నేలమీద పడి ఉన్నవాటిలో కత్తి, గిటారు, తురాయి టోపీ రొమాంటిసిజం పతనాన్ని సూచిస్తున్నాయి. వార్తాపత్రికమీద కపాలం పత్రికా రచన మరణాన్ని సూచిస్తున్నది.మధ్యలో కుర్చీమీద కూర్చుని చిత్రిస్తున్నది కోర్బె. అతడి పక్కన అతడికి కనబడనట్టుగా ఉన్ననగ్నపురుషాకృతి సాంప్రదాయిక చిత్రకళకి చిహ్నం. కోర్బె కి కుడివైపున ప్రకాశవంతమైన భాగంలో అతడి మిత్రులు, సన్నిహితులు, రచయితలు, చిత్రలేఖనాల్ని సేకరించి విక్రయించే ఒక సంపన్నుడు, అతడి భార్య, ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. చిత్రంలో మరీ కుడివైపున కూర్చుని చదువుకుంటున్నది ప్రసిద్ధ ఫ్రెంచి కవి బోదిలేర్. కోర్బె కి ఎడమవైపున చిత్రంలో మనకి కనిపించే నగ్న స్త్రీమూర్తి చిత్రకళాదేవత. కోర్బె ఆమెవైపు వీపు తిప్పి కూర్చున్నాడు. అతడి ముందు నిలబడీ అతణ్ణే ఆసక్తి గా చూస్తున్న బాలుడు బహుశా కోర్బె బాల్యం కావచ్చు, లేదా చిత్రకళా ప్రేక్షకులు కావచ్చు.

ఈ చిత్రాన్ని ఎడమవైపునుంచి కుడివైపుకైనా చదవవచ్చు లేదా కుడివైపు బోదిలేర్ తో మొదలుపెట్టి ఎడమవైపు కైనా చదవవచ్చు.

తన చిత్రకళా ప్రదర్శనకి  రాసుకున్న కేటలాగులో కోర్బె తన చిత్రకళా ఆదర్శాల్ని వివరిస్తూ కొన్ని వాక్యాలు రాసాడు. ఆ రచన ‘రియలిస్టు మానిఫెస్టో ‘గా ప్రసిద్ధి చెందింది. అందులో అతడిట్లా అన్నాడు:

‘1830 ల్లో చిత్రలేఖకులమీద రొమాంటిక్ అనే ముద్ర వేసినట్టే, నా మీద కూడా రియలిస్టు అనే ముద్ర పడింది. కాని ఇట్లాంటి పేర్లనుంచి మనకి అదనంగా తెలిసేదేమీ ఉండదు. ఒట్టి పేర్లతోనే అంతా తెలిసిపోతే, కళాకృతులు చిత్రించవలసిన అవసరమే లేదు.’

అయినప్పటికీ ఇట్లాంటి అపార్థాల్ని తొలగించడం కోసం తాను మరొక రెండు మూడు వాక్యాలు రాయకతప్పదని చెప్తూ ఇలా అన్నాడు:

‘ఎట్లాంటి ముందస్తూ అభిప్రాయాలూ పెట్టుకోకుండా, అపోహలకీ లోనుకాకుండా నేను ప్రాచీనుల చిత్రకళనీ,ఆధునికుల చిత్రకళనీ కూడా అధ్యయనం చేసాను. వాటిని అనుకరించడం గానీ లేదా వాటికి నకలు రాయడం గానీ నా లక్ష్యం కాదని తెలుసుకున్నాను. కళ కళ కోసమే అనే తక్కువరకం లక్ష్యం నాది కాదనిపించింది. సంప్రదాయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని, ఆ వెలుతురులో నా స్వంత వ్యక్తిత్వాన్నీ, చైతన్యాన్నీ సముపార్జించుకోవడమే నా గమ్యమని అర్థం చేసుకున్నాను.  సృజించడానికి ముందు తెలుసుకోవాలన్నదే నా  ఉద్దేశ్యం. నేను అర్థం చేసుకొగలిదిన దాన్ని బట్టి నా సమకాలం నాకెట్లా కనిపిస్తోందో దాన్నీ, నా కాలం నాటి ఆచారాల్నీ, అభిప్రాయాల్నీ  చిత్రలేఖనంలోకి అనువదించగలగడం. అలాగని కేవలం చిత్రకారుడిగా మాత్రమే కాదు, అన్నిటికన్నా ముందు ఒక మనిషిగా ఒక సజీవకళని సృష్టించగలగడం, క్లుప్తంగా ఇదీ నా లక్ష్యం.’

రియలిస్టు పద్ధతిలో చిత్రలేఖనం చేపట్టాలనే ఈ ధోరణి వెనక బ్రిటిష్ లాండ్ స్కేప్ చిత్రకారులున్నారు. ముఖ్యంగా బ్రిటిష్ లాండ్ స్కేప్ చిత్రకారుడు కాన్ స్టేబిల్ ఏర్పాటు చేసిన ప్రదర్శన వల్లా,ప్రీ రాఫలైట్ చిత్రకారుల ప్రభావం వల్లా 1830 ల ప్రాంతంలో కొందరు ఫ్రెంచి చిత్రకారులు ఫ్రాన్సులో ఫోంటెన్ బ్లా అనే అడవి దగ్గరుండే బార్బిజాన్ అనే పల్లెటూరికి పోయి అక్కడి ప్రకృతి దృశ్యాలు చిత్రించడం మొదలుపెట్టారు. వారిని బార్బిజాన్ బృందంగా పేర్కొంటారు. గ్రామీణ, అటవీ సౌందర్యం చిత్రించడం రొమాంటిసిస్టు సంప్రదాయమే అయినప్పటికీ, బార్బిజాన్ స్కూలు చిత్రకారులు కేవలం ప్రకృతి ని మాత్రమే చిత్రించడంతో తృప్తి చెందకుండా గ్రామీణ జనజీవనాన్ని కూడా చిత్రించారు. వారిలో మిల్లె, థియొడర్ రూసో, కెమిల్లి కోరోట్ వంటి చిత్రకారులు సాధారణ గ్రామీణ దైనందిన దృశ్యాలైన పొలాల్లో గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, విత్తనాలు చాలడం, పంట కోత కొయ్యడం, ప్రార్థనవేళ రైతులు పంటపొలాల్లోంచే ప్రార్థన చేసుకోవడంవంటి వాటిని చిత్రించడం మొదలుపెట్టారు. ఆ విధంగా సామాన్యజీవన చిత్రాల్ని చిత్రించడంతో రొమాంటిసిజం రియలిజంగా రూపుదిద్దుకుందని మనం చెప్పవచ్చు.

వాస్తవికతావాద సాహిత్యకారులు

1830-55 మధ్యకాలంలో చిత్రలేఖనంలో మొదలైన రియలిజం కొద్దిగా అటూ ఇటూగా సాహిత్యంలో కూడా వికసించడం మొదలుపెట్టింది. ఆ కాలం నాటి ప్రధాన సాహిత్య ప్రక్రియ నవల. రియలిజం సాధారణ దైనందిన జీవిత వివరాల్ని చిత్రించవలసి ఉన్నందున, విశ్వసనీయంగా సామాజిక జీవితాన్ని ప్రతిబింబించవలసి వచ్చినందున, విస్తృతమైన కాన్వాసు మీద నవలలు రాయడం ద్వారా రచయితలు తమ కాలానికి అద్దం పట్టడానికి ప్రయత్నించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన నవలాకారులు స్టెంధాల్ (1783-1842), బాల్జా (1799-1850), ఛార్లెస్ డికెన్స్ (1812-1870), తుర్జెనీవ్ (1818-1883),  జార్జి ఇలియట్ (1819-1880), గుస్టావ్ ఫ్లాబే (1821-1880), డొస్టోవిస్కీ (1821-1881),  టాల్ స్టాయి (1828-1910), మార్క్ ట్వేన్ (1835-1910), ఎమిలీ జోలా (1840-1902), వంటి రచయితలు వాస్తవికవాద సాహిత్యాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకుపోయారు.

వాస్తవికతావాదం ముఖ్యలక్షణాలు

చిత్రలేఖనంలోనూ,సాహిత్యంలోనూ ప్రతిబింబించిన వాస్తవికతావాదానికి ముఖ్యలక్షణాలుగా వీటిని చెప్పుకోవచ్చు:

  • ఆర్థిక తరగతి: వాస్తవికతావాదం తాను  చిత్రించే మనుషుల్ని వాళ్ళ ఆర్థిక తరగతితో గుర్తుపట్టిస్తుంది. ముఖ్యంగా కార్మికుల, దిగువ మధ్యతరగతి జీవితాన్ని చిత్రిస్తుంది, వాళ్ళకీ, పై తరగతులకీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించడమే కాకుండా, వాళ్ళు సామాజిక చలనశీలత చాలా పరిమితమని కూడా చెప్తుంది.
  • సాధారణ జీవితం: వాస్తవికతావాదం  చిత్రించే ప్రపంచం సాధారణ దైనందిన జీవితానికి చెందిన ప్రపంచమై ఉంటుంది. రోజువారీ సంఘటనల్నీ, కళ్ళముందున్న జీవితాన్నీ, మామూలు మనుషుల్నీ వర్ణిస్తుంది.
  • విశ్వసనీయత: కళ్ళముందున్న వాస్తవాన్ని చిత్రించడం ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి తాను చిత్రిస్తున్నది నమ్మదగ్గట్టుగా ఉండేటట్టు చూసుకోవడం వాస్తవికతావాదానికి తప్పనిసరి. బయట ఉన్న వాస్తవానికీ, చిత్రించబడ్డ వాస్తవానికీ మధ్య ఉండే సాదృశ్యం, దీన్నే వెర్సిమిలిట్యూడ్ అంటారు, ఆ కళాకృతికి లేదా ఆ రచనకి విశ్వసనీయతని తీసుకొస్తుంది.
  • వివరాలు: విశ్వసనీయత సాధించడానికి రచయిత, కళాకారుడు సాధ్యమైనన్ని వివరాల్ని పొందుపరచవలసి ఉంటుంది. ఆ వివరాలు కూడా రెండు రకాలు: భౌతికంగా, వాస్తవంగా కనిపించే వివరాలు, వాస్తవ సన్నివేశంలో పాత్రలు లోనయ్యే మానసిక పరిస్థితుల్ని మనకు నమ్మదగ్గట్టుగా చూపించే వివరాలూ.
  • కీలక వివరాలు: వివరాలు ఇవ్వాలన్నప్పుడు, ఆ వివరాల్ని ఒక కేటలాగులాగా నమోదు చేసుకుంటూ పోవడం కళ అనిపించుకోదు కాబట్టి ఏ కీలక వివరాల్ని మనకు అందిస్తే మనం ఆ సన్నివేశాన్నీ, ఆ పాత్రల్నీ, ఆ కథాగమనాన్నీ నమ్మగలమో అట్లాంటి వివరాలు మాత్రమే చిత్రించడం. ఉదాహరణకి స్టోన్ కట్టర్స్ చిత్రంలో ఒక కార్మికుడు సుత్తితో బండలు బాదుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఇది సాధారణ వివరం. కాని పక్కనున్న కార్మికుడు బరువైన బండ పైకెత్తుతున్నట్టు కనిపిస్తున్నాడు. అతడి శరీరభంగిమలో ఆ బండబరువు ద్యోతకమవుతూ ఉంది. ఇది కీలక వివరం.
  • సర్వజ్ఞత్వం: వివరాల్ని చిత్రించడంలో పాత్రల మానసిక పరిస్థితిని కూడా చిత్రించవలసి ఉంటుంది కాబట్టి ఆ రచయిత ఒక సర్వజ్ఞుడిలాగా కథ చెప్పడానికి పూనుకుంటాడు. కాని, ఈ సర్వజ్ఞత్వానికి ఉన్న పరిమితులమీదే వాస్తవికతావాదం మీద తర్వాతి రోజుల్లో చాలా తిరుగుబాట్లు సంభవించాయి.
  • పాత్రోచిత భాష: కథని లేదా కళాకృతిని వాస్తవికంగా చిత్రించాలనుకున్నప్పుడు ఆ పాత్రలకి తగ్గ భాషలోనే సంభాషణలు రాయడం కూడా వాస్తవికతావాదపు ముఖ్యలక్షణం.
  • పాఠకవర్గం: వాస్తవప్రపంచం కష్టజీవుల, కార్మికుల, పీడిత ప్రజల ప్రపంచమనే ఎరుక వల్ల వాస్తవికావాదం తన పాఠకుల్ని కూడా స్పష్టంగా ఎంచుకుంది. పందొమ్మిదో శతాబ్దపు మధ్యకాలం నుంచి యూరోప్ అంతటా తలెత్తిన కొత్త అక్షరాస్యతావర్గం వాస్తవికతావాదపు పాఠకులు.
  • సామాజిక విమర్శ: కష్టజీవుల దైనందిన జీవితాన్ని చిత్రిస్తూ, పాత్రోచిత భాషలో వారి పరిస్థితుల్ని విశ్వసనీయంగా చెప్పడం తో మాత్రమే ఆగకుండా వాస్తవికతావాదం తనకాలం నాటి సామాజిక వైరుధ్యాల్నీ, ఆత్మవంచననీ, డొల్లతనాన్నీ విమర్శించడం కూడా తన లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల చాలాసార్లు వాస్తవికతావాదపు రచనలు తీవ్రమైన వ్యంగ్యంతోనూ, హేళనతోనూ ఉంటూ వచ్చాయి.

నికొలాయి గొగోల్: ఓవర్ కోటు

వాస్తవికతావాదం చిత్రలేఖనంలో కూడా ఇంకా పూర్తిగా స్పష్టంగా తలెత్తకముందే, రష్యాలో నికొలాయి గొగోల్ (1809-1852) సాహిత్యంలో వాస్తవికతావాదానికి తలుపులు తెరిచాడు.

‘ఆధునిక కథ గొగోల్ ఓవర్ కోటు నుంచి పుట్టిందయ్యా’ అన్నారొకసారి భమిడిపాటి జగన్నాథరావుగారు, 1980 ప్రాంతంలో. నేనూ, మా అక్కా అప్పుడే కథలు రాయడం మొదలుపెట్టాం. ఆ మాటలు విన్నాక ఆ కథ వెంటనే చదవాలనిపించింది గాని, తెలుగు అనువాదం అంత తొందరగా దొరకలేదు. నార్ల వెంకటేశ్వర రావు అనువాదం అనుకుంటాను, నా చేతుల్లోకి వచ్చేటప్పటికి, నేను రాజమండ్రిలో టెలిఫోన్ రెవెన్యూ ఆఫీసులో బిల్లింగు గుమాస్తాగా పనిచేస్తున్నాను. ఆ కథతోనూ, ఆ కథలో గుమస్తాతోనూ, ఆ వాతావరణంతోనూ నేను వెంటనే నన్ను ఐడెంటిఫై చేసుకున్నాను. ఆ ప్రభావంతో, అప్పట్లో ‘సొంత ప్రపంచం-పరాయి ప్రపంచం ‘అనే కథ కూడా రాసాను. కాని, గొగోల్ కథ నా లోపలకీ ఇంకిపోయిందని నాకు చాలా కాలం తర్వాత తెలిసొచ్చింది. నేను మళ్ళా 2000 లో ‘మొదటి పనిగంటవేళ ‘అనే ఒక కథ రాసినప్పుడు, అది ఓవర్ కోటులోంచే బయటికొచ్చిందని అర్థమయింది.

గొగోల్ ఉక్రెయిన్ ప్రాంతం నుంచి వచ్చిన రచయిత. అక్కడి గ్రామీణ ప్రాంతం నుంచి సెంట్ పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టినప్పటి అతడి మన:స్థితికీ, చుట్టూ కొండలూ, అడవులూ పరుచుకుని  ఉండే మా ఊరినించి రాజమండ్రిలో అడుగుపెట్టినప్పటి నా మన:స్థితికీ మధ్య చాలానే పోలిక ఉంది. గొగోల్ లానే నేను కూడా నా పందొమ్మిదో ఏట ఉపాధి వెతుక్కుంటూ రాజమండ్రి వెళ్ళాను. సెంట్ పీటర్స్ బర్గ్ బాల్టిక్ సముద్రం అంచున ఉండే ఒక రష్యన్ పట్టణం. 1712 నుంచి 1918 దాకా రష్యాకి రాజధానిగా ఉండింది. ఆ పట్టణంలో అడుగుపెట్టగానే గొగోల్ కి తాను సామాజికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లుగా, తన వ్యక్తిత్వాన్నీ, విశిష్టతనీ ఎవరో మాయం చేస్తున్నట్లుగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అందుకని 1831 లో ఝుకోవస్కీ కి రాసిన ఉత్తరంలో  సెంట్ పీటర్స్ బర్గ్ నగరం ఏదన్నా బిలంలోంచి భూమిలోకి జారిపోతే బాగుణ్ణని రాసుకున్నాడు. మరొక మిత్రుడికి అసలెప్పటికీ పీటర్స్ బర్గ్ లో అడుగుపెట్టకపోతే మంచిదని సలహా ఇచ్చాడు. తనకు  చెప్పుకోదగ్గ నైపుణ్యంగానీ, ఉద్యోగం గాని లేకుండా ఆ నగరంలో సంచరించవలసివచ్చినప్పుడు, సాహిత్యం ద్వారా తనకొక సామాజికమైన గుర్తింపు దొరుకుతుందేమోనని ఆశపడ్డాడు. రాజమండ్రిలో ఉన్నప్పటి నా మనఃస్థితి కూడా అచ్చం అట్లానే ఉండేది.

తన కన్నా భీకరమైన, గంభీరమైన నిర్మాణాల ఎదటనో, శిథిలాల ఎదటనో, ప్రాకృతిక ప్రదేశాల ఎదటనో మనుషులు లోనయ్యే ఒక గంభీర భావనని సబ్లైమ్ అంటారనీ, రొమాంటిసిస్టులు దాన్ని అనుభూతి చెంది చిత్రిస్తూ వచ్చారని మనకు తెలుసు. ఆ భావన తమని విహ్వలత్వానికి గురిచేస్తున్నట్టుగా అనుభవంలోకి రావడం డార్క్ రొమాంటిసిస్టు ధోరణికి దారితీసిందని కూడా మనం చెప్పుకున్నాం. సముద్రం, తుపాను, నౌకాభంగం,మృత్యువుల ఎదట ఆ భావన ఎటువంటి అంధకారభరితమైన మన:స్థితిలోకి నెడుతుందో ఎడ్గార్ అలన్ పో రాసిన ‘సీసాలో రాత ప్రతి ‘కథలో చూసాం. సెంట్ పీటర్స్ బర్గ్ వీథుల్లో గొగోల్ కూడా అటువంటి విహ్వలత్వాన్నే అనుభవించాడు. అందులో కూడా భీతి, మృత్యువు, అభౌతిక భావనలు ఉన్నాయి. డార్క్ రొమాంటిసిజంగా కాకుండా రియలిజానికి దారితీసింది.

కారణాలు మనం స్పష్టంగా చెప్పగలం. తర్వాత రోజుల్లో ఫ్రెంచి చిత్రకారులు రియలిజాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు చిత్రించిన ముఖ్య లక్షణాలన్నీ గొగోల్ ముందే పసిగట్టినట్టుగా ఈ కథ మనకు సాక్ష్యమిస్తున్నది. సాధారణ దైనందిన జీవితాన్ని ప్రతిబింబించడం, బీద,పేద ఆర్థిక తరగతికి చెందిన వ్యక్తుల గురించి చిత్రించడం ఈ కథని రొమాంటిసిస్టు ఇతివృత్తాలనుంచి బయట పడేసాయి. ఈ కథలో రచయిత ‘స్కాజ్ ‘అనే రష్యన్ మౌఖిక కథాశైలిని వాడాడు. అది రొమాంటిసిస్టుల ఆలంకారిక, కావ్యశైలికి విరుద్ధమైంది. ఇక, ఒక కథనాన్ని విశ్వసనీయంగా చూపించగల సాధనాలు, వివరాల్ని చిత్రించడం,కీలక వివరాల్ని పట్టుకోవడం,సామాజిక పరిస్థితుల్నీ, పరిసరాల్నీ చిత్రించడంలో వెర్సిమిలిట్యూడ్ ని సాధించడం ఈ కథలో కొట్టొచ్చినట్టు కనబడే అంశాలు.ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కథద్వారా రచయిత తన కాలంనాటి సామాజిక పరిస్థితులమీదా, సాంఘిక వైరుధ్యాలమీదా, ద్వంద్వ విలువలమీదా నిశితమైన వ్యంగ్య ధోరణిలో విమర్శని ఎక్కుపెట్టడంతో ఈ కథ వాస్తవికతావాద ప్రయోజనాన్ని పూర్తిగా సాధించిందని చెప్పవచ్చు.

మనుషులకి ఊపిరాడనివ్వని సామాజిక చట్రాన్నీ, దానిలో చిక్కుకున్న మనిషి మానసిక పరిస్థితినీ చిత్రించడంలో తదనంతర కథకులకీ, నవలాకారులకీ ఈ కథ ఒక నమూనా గా నిలబడినందువల్లనే ‘మేమంతా గొగోల్ ఓవర్ కోటు నుంచే వచ్చాం ‘ అని డాస్టొవస్కీ అన్నాడు. (ఇటీవలి పరిశోధకుల ప్రకారం ఈ మాటన్నది డాస్టవస్కీకాదు, మెల్కోయిర్ డి వోగ్ అనే ఫ్రెంచి విమర్శకుడట).

‘ఓవర్ కోటు ‘ చదివిన అ తర్వాత మన కళ్ళు ‘గొగోలైజ్ ‘అవుతాయనీ మనం కూడా గొగోల్ చూసిన ప్రపంచాన్ని చూడటం మొదలుపెడతామనీ,కానీ, ఊహించని తావుల్లోననీ వ్లదిమీర్ నబకోవ్ అన్నాడు.

‘ఓవర్ కోటు ‘మీద చేసిన ప్రసంగంలో అతడింకా ఇట్లా రాసాడు:

‘ఈ కథాగమనం గురించి చివరి మాటలు చెప్పాలంటే: సణుగుడు, గొణుగుడు, సణుగుడు, ఒక కవితాతరంగం, మళ్ళా సణుగుడు, కవితా తరంగం, గొణుగుడు, కవితాతరంగం,సణుగుడు, పతాకస్థాయిలో అభూతకల్పన, శానుగుడు,గొణుగుడు, చివరికి ఏ అస్తవ్యస్తతలో మొదలైందో చివరికి అక్కడికే చేరడం. ఈ స్థాయికి చేరుకున్నక, సాహిత్యం అధోజగత్సహోదరుడిపట్ల జాలిచూపుతోందా లేదా కులీన మానవసమూహాన్ని కసితీరా శపిస్తోందా అన్నది మనకు పట్టదు.  పేరులేని నౌకలేవో చప్పుడు చెయ్యకుండా సాగిపోయినట్టు మన ఆత్మలోతుల్లోని అగాధాల్లో మరే ప్రపంచాల నీడలో పరుచుకుంటున్నట్టుగా మనకి తెలియవస్తుంది.’

ఓవర్ కోటు: మాజికల్ రియలిస్టు కథ?

సరిగ్గా ఈ వాక్యాన్ని పట్టుకునే,  గొగోల్ కథలకి తన ఇంగ్లీషు అనువాదానికి  రాసుకున్న ముందుమాట (1998) లో రిచర్డ్ పెవియర్ అనే ఒక అనువాదకుడు ‘కళాకారుడి  కర్తవ్యం  గురించీ, ప్రలోభం గురించీ గొగోల్ కి ఒక ప్రత్యేకమైన అవగాహన ఉన్నది ‘ అన్నాడు. ‘విడ్డూరమైందీ, రాక్షమైందీ గొగోల్ ప్రపంచంలో మొదటినుంచీ కూడా ఒక ముఖ్యభాగంగా ఉంటూనే ఉంది ‘ అని కూడా అన్నాడు. కథని గొగోల్ అద్భుతంగానూ, అవాస్తవికంగానూ ముగించిన తీరుని బట్టి, అతణ్ణి పూర్తి వాస్తవికవాద రచయితగా ముద్రవేయలేమని కూడా ఇటీవలి విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఈ కారణం వల్లనే ‘మాజికల్ రియలిస్టు ఫిక్షన్: యాన్ ఆంథాలజి ‘(1984) అనే తమ సంకలనాన్ని దేవిడ్ యంగ్, కీత్ హొల్లామాన్ అనే సంపాదకులు గొగోల్ కథతో మొదలుపెట్టడమే కాక, రియలిస్టు కథ గొగోల్ ఓవర్ కోట్ లోంచి ప్రభవిస్తే, మాజికల్ రియలిస్టు కథ గొగోల్ ‘ముక్కు ‘లోంచి ప్రభవించిందని రాసారు.

రచయితగా గొగోల్ లోని ఆకర్షణ అతడు ఏదో ఒక నిర్ధిష్ట పార్శ్వానికి కట్టుబడకపోవడంలో ఉందని చెప్పాలి. అందుకనే నబకోవ్ తన ప్రసంగంలో ఇట్లా అన్నాడు:

‘మన దృష్టిగతిని ఒక్క కుదుపు కుదిపేలాగా ఒక రహస్యార్థాన్ని దేన్నో చెప్తూ, అదే సమయంలో తమ వాక్యాన్ని అస్పష్టం చేసే లాంటి ఒక నిర్హేతుక అంతర్దృష్టి ని మనం,  కథనంలో స్థిరంగా ఉండే పుష్కిన్ లోనూ, ఉన్నదున్నట్టుగా చెప్పుకొచ్చే టాల్ స్టాయి లోనూ , గొప్ప సంయమనంతో కథలు చెప్పే చెహోవ్ లోనూ కూడా చూడకపోము. కాని గొగోల్ విషయం అలాకాదు. అసలు అలా చెప్పడమే అతడి కథనకళ. అందుకనే హేతుబద్ధంగా సాహిత్యసంప్రదాయంలో కథలు చెప్పాలనుకున్నప్పుడల్లా అతడి ప్రతిభ వెలవెలపోయింది. అదే అతడి ఓవర్ కోటు కథ లో చూడండి, తన వైయక్తిక అగాధాల అంచులమీద దిలాసాగా నడుచుకుపోతాడు కాబట్టే, ఇంతదాకా రష్యాలో ప్రభవించిన కళాకరులందరిలోనూ అతడే అత్యంత మహనీయుడిగా నిలబడిపోయాడు.’

‘ఓవర్ కోటు’ కథ ని ఎన్ని ఎన్ని విధాలుగానైనా చదవవచ్చు, ఎన్ని రకాలుగానైనా వ్యాఖ్యానించవచ్చు. డార్క్ రొమాంటిసిజం మొదలుకుని మాజికల్ రియలిజందాకా ప్రతి కళా ఉద్యమానికీ దాన్ని ఉదాహరిస్తూ పోవచ్చు.

ఆ మాటకొస్తే, అసలు దాన్ని వాస్తవికతావాదం పైన విమర్శ గా కూడా చూడవచ్చు. (అతడు ఆ కథ రాసేనాటికి ‘రియలిజం’ అనే పదమే పుట్టకపోయినప్పటికీ.) ఉదాహరణకి, రియలిజానికి ప్రాతిపదిక ఏమిటి? తన కాలం నాటి సమాజాన్ని ప్రతిబింబించడం. ఒక ప్రతికృతి తయారుచేయడం. అంటే నకలు రాయడమే కదా. కాని, ఈ కథలో నకలు రాసేమనిషి కథానాయకుడైనప్పటికీ మనకి జాలిగొల్పుతూనే ఉంటాడు. నకలు రాయడమే అతని అస్తిత్వంగా మారిపోయి కనిపిస్తాడు. నకలు రాయడాన్ని దాటిన పరిస్థితి అతడు ఊహించలేడు సరికదా, అటువంటి అవకాశం వస్తే అతడికి ఊపిరాడకుండాపోతుంది.

రియలిస్టు చిత్రకారులు తొలిరోజుల్లో (1840 నుంచి 75 దాకా కూడా) క్రైస్తవాన్న్నీ, సోషలిజాన్నీ సమన్వయించుకోవాలని చూసారు. కాని వాళ్ళు అటువంటి ప్రయత్నం ఇంకా మొదలుపెట్టకముందే ఈ కథ మతపరమైన జీవితకథనాన్ని ఎద్దేవా చేసినట్టు కూడా మనం చూడవచ్చు. మధ్యయుగాల్లో మతాచార్యుల ప్రధానవ్యాపకం పవిత్రగ్రంథాల నకళ్ళు రాయడం. అటువంటి మతాచార్యుల జీవితకథనాల్ని వ్యంగ్యంగా ఎత్తిచూపినట్టు కూడా ఈ కథని చదివేవాళ్ళున్నారు.

కోటు ఒక కనీస అవసరం, కాబట్టి ఈ కథని భౌతికవాదాన్ని ప్రోత్సహించే వాస్తవికవాద రచనగా చూడటం, చెప్పుకోవడం మామూలుగా జరిగేదే. కాని, ఈ కథని ఫ్రాయిడియన్ మనోవిశ్లేషణకి గురిచేసి కూడా చదివిన  వ్యాఖ్యానాలున్నాయి. ఉదాహరణకి, కథలో నకళ్ళు రాయడం తప్ప మరో విషయమేమీ పట్టని గుమస్తా, కొత్త కోటు తొడుక్కోగానే ఒక స్త్రీ వెంటపడటం, దుకాణంలో స్త్రీ చిత్రాన్ని మురిసిపోవడం అతడిలో రహస్యంగా ఉన్న కామేచ్ఛ బయటికి రావడానికి చిహ్నాలుగా చూడవచ్చు. అంటే, కోటు లేనందువల్ల అనామకంగా ఉన్న గుమాస్తా కొత్త కోటు తొడుక్కోగానే మానవుడిగా మారే క్రమంలో కాముకుడిగా కూడా మారుతున్నాడా?

ఓవర్ కోటు పోయిన తర్వాత ఆ గుమస్తా మరి బతకలేకపోయాడు. కాని, వెంటనే కాదే. తన కోటు పోయిన తర్వాత అతడు పోలీసుల్నీ, అధికారుల్నీ కలిసి మొరపెట్టుకున్నాక, వాళ్ళవల్ల న్యాయం జరగని తర్వాతనే మరణించాడని కూడా మనం అనుకోవచ్చు. అందుకనే, అతడి భూతం, అతణ్ణి నిరాదరించిన ‘చాలాముఖ్యమైన వ్యక్తి’ మీదనే విరుచుకుపడింది. అంటే, ఓవర్ కోటు అనే ఒక భౌతికవస్తువు ఇచ్చే రక్షణ కన్నా, ఒక వ్యవస్థ ఇచ్చే రక్షణ మరింత ముఖ్యమైందని కథకుడు చెప్తున్నాడా? అందుకనే ఆ భూతం ఆ ‘చాలాముఖ్యమైన వ్యక్తి’ ఓవర్ కోటు లాక్కున్న తర్వాత ఇక కనబడకుండా పోయిందా? ఇంతకీ కథలో నాయకుడు గుమాస్తానా లేక ఆ చాలా ముఖ్యమైన వ్యక్తినా? ఆ సంఘటన తర్వాత ఆ ‘చాలాముఖ్యమైన వ్యక్తి’లో మార్పు వచ్చిందని చెప్తున్నందువల్ల ఈ కథ అన్నిటికన్నా ముందు ఒక సాంప్రదాయికమైన నీతికథనా? తనకి చిన్నప్పుడు చదువు చెప్పిన, డిసెంబరిస్టు విప్లవకారుల విప్లవపర్యవసానాన్ని కళ్ళారా చూసి, జీవితంలో అన్నిటికన్నా నైతికత ముఖ్యమని తనకి బోధించిన తన గురువు బెలుసొవ్ ప్రభావం ఈ కథ మీద ఉందా? ఈ అర్థంలో చూసినప్పుడు, గోగోల్ ఓవర్ కోటు కి డాస్టవిస్కీ కన్నా టాల్ స్టాయి ఎక్కువ ఋణపడి ఉండాలా?

ఈ కథలో ఓవర్ కోటు నిస్సందేహంగా ఒక సంకేతం. కాని దేనికి? ఈ ప్రశ్న ఎన్ని సార్లు వేసుకుంటే అన్నిరకాల సమాధానాల్ని ఈ కథ మనముందుకు నెడుతూనే ఉంటుంది.

నికొలాయ్గొగొల్

ఓవర్‌ కోటు (1842)

ప్రభుత్వ శాఖ… కాని ఆ శాఖ పేరేమిటో చెప్పకపోవడమే మంచిది. ఈ ప్రపంచంలో ఒక సైనికదళమో లేదా ప్రభుత్వ కార్యాలయమో, ఆ మాటకొస్తే ఎటువంటి ఆధికారిక సంస్థ అయినా ఇలాంటి విషయాలు ప్రస్తావించడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా మొత్తం సమాజమంతా తనని అవమానిస్తుందనే అనుకుంటున్నాడు. ఈ మధ్యనే ఏదో పట్టణంలో, ఆ పట్టణం పేరు నాకు గుర్తులేదు, అక్కడ ఒక పోలీసు ఇనస్పెక్టరు ఒక ఫిర్యాదు చేశాడని నాకీమధ్యనే ఆలస్యంగా తెలిసింది. ఆ ఫిర్యాదులో అతడు ప్రభుత్వ సంస్థలు ప్రమాదంలో పడ్డాయనీ, తన పవిత్రమైన పేరుకి  కూడా విలువ లేకుండా పోయిందనీ చాలా స్పష్టంగా పేర్కొన్నాడు. తన ఫిర్యాదుకు మద్దతుగా అతడు చాలా సుదీర్ఘమైన కాల్పనిక సాహిత్యప్రతినొకటి జతపరిచాడు. ఆ రచనలో దాదాపుగా ప్రతి పది పేజీలకి ఒకసారి ఒక పోలీసు ఇనస్పెక్టరు తాగి మత్తెక్కి కనబడుతూ ఉంటాడని అతడు వాపోయాడు. కాబట్టి ఎవరినీ ఇలా నొప్పించకుండా ఉండాలంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ప్రభుత్వశాఖను ‘ఫలానా ప్రభుత్వశాఖ’ అని పిలవడమే మంచిది.

ఆ రకంగా ఫలానా ప్రభుత్వ శాఖలో ఫలానా గుమస్తా ఉన్నాడు. ఆ గుమస్తా గురించి ప్రత్యేకంగా చెప్పుకోగలిగిందేమీ లేదు. అతడు కొద్దిగా పొట్టిగా, ముఖంమీద అక్కడక్కడా మశూచిమచ్చలతో, రాగిరంగు జుట్టుతో కనబడుతుంటాడు. అతడి కళ్లు పేలగానూ, నిద్రపోతున్నట్టుగానూ ఉంటాయి. అతడి నుదుటిమీద ఇప్పటికే బట్టతల ఏర్పడుతున్నట్టు కనబడుతోంది. చెంపలు రెండువైపులా ముడతపడుతూ ముఖం పాలిపోయి కనబడుతూ ఉంది… దాని గురించి మనం చేయగలిందేమీ లేదు. పీటర్స్ బర్గ్‌ వాతావరణస్వభావమే అది. ప్రభుత్వ సర్వీసులో అతడి స్థాయి విషయానికొస్తే (అన్నిటికన్నా ముందు మనకి ఒక మనిషి ఉద్యోగస్థాయి ఏమిటో తెలుసుకుంటే తప్ప మనకితృప్తి కలగదు) అతనో సాధారణప్రభుత్వోద్యోగి. సాధారణంగా మన రచయితలంతా అటువంటి తరగతి ఉద్యోగులమీద తనివితీరా విరుచుకుపడుతుంటారు. ఈ గుమస్తా ఇంటిపేరు బష్‌మష్కిన్‌. ఆ పేరు వినగానే అది బూటు (బష్మక్‌) అనే పదంనుంచి పుట్టిందని మనకి తేటతెల్లమవుతూనే ఉంది. అయితే ఏ పరిస్థితుల్లో ఆ పేరు బూటు అనే పదం నుంచి పుట్టుకొచ్చిందో చెప్పడం అసాధ్యం. అతడు, అతని తండ్రి, అతడి తాత, అతని బావమరిది, మొత్తం బష్ మష్కిన్‌లందరూ ఒక్కరుకూడా మినహాయింపులేకుండా బూట్లు తొడుగుతూనే ఉన్నారు. వాటికి ఏడాదికి రెండుమూడుసార్లు అతుకులు వేయిస్తూ కూడావచ్చారు. అతడిపేరు అకకి అకకివిచ్‌. ఈ పేరు వినగానే పాఠకులకి ఇదేదో కొత్తగానూ, కల్పించినపేరులానూ అనిపించవచ్చు. కాని ఈ పేరు కల్పితంకాదని నేను హామీఇస్తున్నాను. పరిస్థితులు ఎటువంటివంటే మనం అతడి పేరు మరేదీ ఇవ్వలేం. నా జ్ఞాపకం సరైనదే అయితే, అతడు మార్చి 23 వ తేదీ చీకటి పడుతూండగా పుట్టాడని చెప్పాలి. అతడి తల్లి, ఆమె కూడా ఒక ప్రభుత్వగుమస్తా భార్య, చాలామంచి మనిషి. పిల్లవాడు పుట్టగానే అతడికి నామకరణానికి ఏర్పాట్లు చేసింది. ఆమె  పురిటిశయ్యమీద పడుకొని తలుపువైపు చూస్తూ ఉంది. ఆమె కుడిపక్క నామకరణం కోసం వచ్చినటువంటి పెద్దమనిషి ఉన్నాడు. అతడి పేరు ఇవాన్‌ ఇవనొవిచ్‌ ఎరోష్కిన్‌. అతడు సెనేట్‌లో  హెడ్‌గుమస్తా. నామకరణం కోసం వచ్చిన గాడ్‌మదర్‌ ఒక పోలీసుఆఫీసుభార్య. విశిష్ట గుణగణాలున్న స్త్రీ. ఆమె పేరు అరిన సెమియొ నోవ్న బెలొబ్రియుష్కొవా. వాళ్లు పిల్లవాడికి పెట్టడానికి తల్లికి మూడుపేర్లు సూచించారు. మొక్కి, సొస్సి, లేదా అమరవీరుడు కోజ్‌దజత్‌ పేరు. కాని ఆ పేరుల్లో ఒక్కటి కూడా ఆ తల్లికి నచ్చలేదు. ‘అట్లాంటి పేర్లవి’ అనుకుంది. ఆమెను తృప్తిపరచడం కోసం వాళ్లు పంచాంగంలో ఏదో ఒక పేజి తెరిచిచూశారు. అక్కడ కనబడ్డపేర్లు ట్రిఫిలి, దుల, వరకషి. ‘ఏం ఖర్మ’ అనుకుంది తల్లి. ‘ఎటువంటి పేర్లవన్నీ, నేనెప్పుడూ అటువంటి పేర్లు వినలేదు. వరదత్‌, లేదా వరూక్‌ అంటేనే వినడానికి చిరాగ్గా ఉంది. ఇక ట్రిఫిలి, వరకషి ఏమిటీ!’ వాళ్లు మరొక పేజీ తెరిచి చూశారు: అక్కడ ఉన్న పేర్లు పవ్శికకి, వకిషి. ‘సరే’, అంది తల్లి. ‘పిల్లవాడి ప్రారబ్ధమెట్లాంటిదో తెలుస్తూనే ఉంది. ఒక పనిచేద్దాం. పిల్లవాడికి కూడా తండ్రిపేరే పెడదాం. వాళ్ల నాన్న పేరు అకకి. కాబట్టి కొడుకు కూడా అకకి నే’ అందామె. ఆ రకంగా అతడు అకకి అకకివిచ్‌గా ప్రసిద్ధిచెందాడు. పిల్లవాడికి నామకరణం జరిగింది. ఆ సమయంలో పిల్లవాడు ఏడ్చాడు. తను భవిష్యత్తులో ప్రభుత్వగుమస్తా కాబోతున్నాడని తెలుసుకున్నాడో ఏమో బిక్కమొహం కూడా వేశాడు. ఇదంతా ఇక్కడెందుకు చెప్తున్నామంటే జరిగిందంతా అనివార్యంగా జరిగిందనీ, అతడికి మరొక పేరేదీ పెట్టడం సాధ్యంకాదనీ పాఠకులకి తెలియడం కోసమే.

అతడు ఆ ప్రభుత్వశాఖలో ప్రవేశించి ఎంతకాలమైందో, లేదా ఆ ఉద్యోగం అతడికి ఎవరిచ్చారో, ఎవరికీ గుర్తు లేదు. ఎంతమంది డైరక్టర్లూ, రకరకాల ఉన్నతాధికారులు ఆ శాఖలోకి వచ్చి వెళ్లారు అన్నదాంతో నిమిత్తం లేకుండా అతడు ఎప్పటికీ అదే చోట అదే స్థాయిలో అదే ఉద్యోగం చేస్తూనే ఉండిపోయాడు. నకళ్లు రాసే అదే గుమస్తా ఉద్యోగమే చేస్తూండిపోయాడు. కాబట్టి అతడు పుట్టడమే నకళ్లు రాసే గుమస్తాగానే పుట్టాడనీ, అదే బట్టతల, అవే దుస్తులు, పుట్టడమే అలా పుట్టాడననీ అంతా నిర్ణయించేశారు. అతడికి ప్రభుత్వ శాఖలో ఎటువంటి గౌరవం దక్కేది కాదు. అతడు వచ్చేటప్పుడు అక్కడుండే కూలివాళ్లు లేచి నిలబడేవారు కాదుసరికదా, వారి దృష్టిలో అక్కడ ఎగురుతున్న ఒక ఈగకు ఎంతవిలువో, అతడికీ అంతే విలువ. అతడి పై ఉద్యోగులు అతన్ని అసలు పట్టించుకొనేవారే కాదు. హెడ్‌గుమస్తా సహాయకుడైతే ‘ఇదిగో వీటి నకళ్లు తియ్యి’ అనిగానీ, లేదా ‘చూడు. ఈ విషయం కొద్దిగా ఆసక్తికరంగా ఉందిక్కడ’ అనిగానీ, ఏదో చిన్నపాటి మాట, కొద్దిగా అంగీకారయోగ్యంగా ఉండే మాట లేకుండా, మామూలుగా చక్కటి కార్యాలయాల్లో కనవచ్చే సంస్కారం కూడా చూపకుండానే, కాగితాలు అతడి మీదకు విసిరిపడేస్తూండేవాడు. అతడు కూడా ఆ కాగితాలు తన వైపుకు గిరవాటు పెట్టిందెవరో చూడకుండానే, అసలు అలా చూసేహక్కు తనకుందో లేదో తెలుసుకోడానికి ఇష్టపడకుండానే, కేవలం ఆ కాగితాలవైపే చూస్తూ, వాటిని ఏరుకుంటూ తక్షణమే వాటికి నకలురాయడం మొదలుపెట్టేవాడు. అతడి తోటి  యువగుమస్తాలు అతడివైపు వేళాకోళంగా చూస్తూ, తమ శక్తికొలది అతడిమీద జోకులు వేసుకుంటూ అతడిగురించి తాము కల్పించుకున్న రకరకాల కథలన్నీ అతడి ముఖంమీదనే మాట్లాడుకుంటుండేవారు. అతడి ఇంటియజమానురాలు 70 ఏళ్ల ముసలామె అతన్ని చావబాదేదనో, లేదా అతడి పెళ్లెప్పుడవుతుందనో హాస్యోక్తులు ఆడుకుంటూ అతడి ముఖంమీద చిత్తుకాగితాలు పడేస్తూ, ‘చూడు మంచుపడుతూందనేవారు’. కానీ అకకి విచ్‌ ఎప్పుడూ ఒక్కమాట కూడా బదులు మాట్లాడేవాడు కాదు. అసలు అక్కడ ఎవరూ లేరన్నట్టే ప్రవర్తించేవాడు. అదతడి పనిమీద ఎటువంటి ప్రభావం చూపించేది కాదు. అంత అపహాస్యం మధ్య కూడా అతడెప్పుడూ నకళ్లు రాయటంలో చిన్నపొరపాటు కూడా చెయ్యలేదు. ఆ హాస్యం మరీ వికటించినప్పుడో, లేదా వాళ్లతడి చేయి పట్టుకుని అతడు పనిచేసుకోకుండా చేసినప్పుడు మాత్రమో, ‘నన్నొదిలేయండి, ఎందుకిట్లా వేధిస్తారు’ అనేవాడు. ఆ మాటల్లోనూ ఆ మాటల్ని పలికే అతడి కంఠస్వరంలోనూ హృదయాన్ని కదిలించేదేదో ఉండేది. ఎదుటివాళ్లల్లో సానుభూతిని రేకెత్తించే జీర ఏదో ఆ మాటల్లో వినబడేది. అందుకనే ఓసారి తక్కిన యువగుమస్తాల్లానే కార్యాలయానికి కొత్తగా వచ్చిన మరో యువకుడు కూడా అతన్ని ఆటపట్టించబోయి ఆ మాటలు వినగానే తన హృదయాన్ని ఎవరో కోస్తున్నట్లుగా ఆగిపోయాడు. అప్పణ్ణుంచీ అతడికి ప్రతిఒక్కటీ కొత్తగా కనిపించడం మొదలుపెట్టింది. అంతవరకూ తన సహోద్యోగులు సంస్కారవంతులనీ, ఉన్నతవంశీకులనీ తనతో పరిచయం పెంచుకున్నవాళ్లు కాస్తా ఇప్పుడు తనను చూస్తేనే ఏవగించుకోవడం మొదలుపెట్టారు. ఏదో ఒక అదృశ్యశక్తి తన మీద వాళ్ళకు అట్లాంటి ఏహ్యత పుట్టిస్తుందనుకున్నాడు. ఆ తరువాత చాలాకాలం పాటు అతడు సంతోషభరిత క్షణాల్లో బట్టతలతో అనబడే ఈ అల్పగుమస్తా ఆకృతి తన ఎదుట నిల్చొని ‘నన్నొదిలిపెట్టండి, ఎందుకిలా వేధిస్తారు’ అని హృదయవిదారకంగా అడుగుతున్నట్లు అనిపించేది. ఈ తీక్ష్ణమైన పదాల్లోనే ‘నేను నీ తమ్ముడిలాంటివాణ్ణి’ అనేటటువంటి మాటలు ప్రతిధ్వనించేవి. ఆ యువకుడు చేతులతో కళ్లుమూసేసుకునేవాడు. అలా ఎన్నోసార్లు తన తక్కిన జీవితమంతా కూడా ఆ విషయం గుర్తొస్తేనే మనిషిలో ఎంత అమానుషముందో చూసి వణికిపోయేవాడు. పైకి సున్నితంగా, సంస్కారవంతంగా కనిపించే మనుషుల్లో – భగవంతుడా! – గౌరవనీయులు, సంస్కార వంతులని పిలవబడే మనుషుల్లో కూడా ఎంత మొరటుదనం, అనాగరికత దాగిఉన్నాయో తలుచుకొని వణికిపోయేవాడు.

తన విధుల కోసమే జీవితాన్ని పరిపూర్ణంగా అంకితం చేసిన అటువంటి మరొక మనిషిని చూడగలగడం అసాధ్యం. అతడు దీక్షతో పనిచేశాడు అని చెప్పడం చిన్నమాట. అతడు ప్రేమతో పనిచేశాడని చెప్పవలసి ఉంటుంది. కాగితాలకు నకళ్లు రాయటంలో అతడెంతో వైవిధ్యభరితమైన సానుకూలమైన ప్రపంచాన్ని దర్శించాడు. అప్పుడతడి ముఖంమీద ఆనందం తాండవిస్తూండేది. కొన్నిరకాల ఉత్తరాల్ని అతడు మరీ ఇష్టపడుతుండేవాడు. వాటికి నకళ్లు రాయవలసి వచ్చినప్పుడు అతడు మామూలుగా కనిపించేవాడు. అప్పుడతడు మనసారా చిరునవ్వు నవ్వేవాడు. కనురెప్పలు వాల్చి తేరిపార చూసేవాడు. పెదాలు ముడిచి తెరిచేవాడు. అప్పుడు ప్రతిఒక్క అక్షరం అతడి ముఖంలో ద్యోతకమయ్యేది. అతడి కాలం దాన్ని అనుసరించేది. అతడి దీక్షకు తగ్గట్టుగా అతడి జీతమే ఉండిఉంటే, అతడు ఒక రాష్ట్రస్థాయి సలహాదారు అయిపోయి తననుతాను చూసుకుని ఆశ్చర్యపడేవాడు. కాని అతడికి లభించిన ప్రతిఫలమల్లా అతడి సహోద్యోగులు అవహేళన చేసేటట్టుగా అతడి కోటు బొత్తాల్లో ఒక బొత్తామూ, కూర్చుని కూర్చుని నడుమునొప్పీను.

అలాగని అతడిపట్ల ఎవరూ ఎటువంటి ధ్యాస కనపరచలేదనడం కూడా సరికాదు. అతడి కార్యాలయాధికారి ఒకాయన దయార్ద్రహృదయుడు, అతడి దీర్ఘకాల సేవకు గుర్తింపుగా ఏదయినా ప్రతిఫలమివ్వాలనుకున్నాడు. కేవలం నకళ్లు రాసే ఉద్యోగం కన్నా మరింత ముఖ్యమైన పనేదైనా ఇవ్వాలని ఉత్తరువులు జారీచేశాడు. దాంతో ఒకరోజు అప్పటికే పరిష్కారమైన ఒక కేసుమీద నివేదిక తయారుచేసి మరొక కోర్టుకి పంపాల్సిందిగా అతన్ని ఆదేశించడం జరిగింది. ఆ పనిలో ఉన్నదల్లా ఆ కాగితంలో శీర్షికమార్చడం, ఉత్తమ పురుషనుంచి ప్రథమపురుషకు అక్కడక్కడా కొన్ని పదాలుమార్చడం. కానీ ఈ పని అతన్ని ఎంత కలవరపర్చిందంటే, అతడు చెమటతో తడిసిముద్దయిపోయాడు. పదేపదే తన నుదురు తుడుచుకున్నాడు. చివరికి ‘అయ్యా, నాకేదన్నా నకళ్లు రాసే పనిప్పించండి చాలు’ అని వేడుకున్నాడు.

ఆ తరువాత ఇక అతడికి కేవలం నకళ్లు రాసే పని మాత్రమే మిగిలింది. అతడికి నకళ్లు రాసే పని తప్ప మరేదీ లేనట్టుగానే అనిపించేది. అతడికి తన దుస్తులమీద కూడా ధ్యాస ఉండేదికాదు. అతడు రోజూ వేసుకునే దుస్తులుకూడా ఆకుపచ్చ రంగు కాక, అదో తరహా ముతక ఎరుపురంగులో ఉండేది. ఆ చొక్కాకాలరు మరీ సన్నగా, మరీ పొట్టిగా ఉండేవి. దాంతో అతడి మెడ మరీ పొడుగైంది కాకపోయినా, ఆ కాలరులోంచి మరీ పైకి పొడుచుకు వచ్చినట్టుగా కనిపించింది. సాధారణంగా విదేశీయులు రష్యాలోకి తీసుకొచ్చి అమ్మే బొమ్మల్లోలాగా కనిపిస్తుందది.  ఎప్పుడూ ఏదోఒకటి గడ్డిపోచలో, లేదా ఏదో చెత్తాచెదారమో అతడి దుస్తులకు అంటుకునికనబడేది. అదీకాక అతడికో ప్రత్యేకమైన ప్రతిభ ఉంది. అదేమంటే, వీథుల్లోంచి నడిచేటప్పుడు సరిగ్గా ఇళ్లల్లోకి చెత్త బయటకు గిరవాటు వేసేటప్పుడు అతడు ఆ కిటికీలపక్కనుంచే నడుస్తూంటాడు. అతడి టోపీ అంచులనుంచి ఎప్పుడూ ఏవొ కూరగాయముక్కలో, లేదా  వ్యర్థపదార్థాలో వేలాడుతుండేవి. వీథుల్లో ఏం జరుగుతుందో అతడెప్పుడూ పట్టించుకొనేవాడు కాడు. సాధారణంగా చాలామంది గుమస్తాలు వీథుల్లో నడిచేటప్పుడు ఆ వీథిచివర ఏం జరుగుతుందో కూడా కనిపెట్టి జాగ్రత్తపడుతూంటారు. కాని అకకి అకకియెవిచ్ మాత్రం ఏదన్నా చూశాడా అంటే, అతడికి పరిశుభ్రమైన, కుదురుగా రాసిన తన చేతి దస్తూరీ తప్ప మరేదీ కనబడేది కాదు. ఎప్పుడో ఏదైనా ఓ గుర్రం అతడి భుజం మీద తల ఆన్చి తన శ్వాసరంధ్రాలగుండా వేడి ఊపిరి అతడి మెడమీదుగా వదిలినప్పుడు మాత్రమే అతడికి తాను నకళ్లు రాస్తున్న పనిమధ్యలో కాక, వీథిమధ్యలో ఉన్నానని గుర్తొచ్చేది.

ఇంటికి చేరగానే అతడు వెంటనే ఆలస్యంచేయకుండా భోజనం బల్లదగ్గర కూర్చొని ఒక్క గుక్కలో క్యాబేజీ సూపు తాగేసి, ఉల్లిపాయముక్కలతో మాంసంకూర ఒక్కముద్దలో మింగేసేవాడు. వాటి రుచి ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా అతడు పట్టించుకోలేదు. ఆ తినేదానిమీద వాలిన ఈగలతోసహా భగవంతుడు అందులో ఏం కూరిస్తే అదంతా కూడా మింగేసేవాడు. కడుపు నిండుతున్నట్లుగా అనిపించడం మొదలుపెట్టగానే బల్ల దగ్గరనుంచి లేచేవాడు. అప్పుడు  సిరాబుడ్డి తీసుకుని ఇంటికి తెచ్చుకున్న కాగితాలు నకళ్లు రాయటం మొదలుపెట్టేవాడు. ఒకవేళ పూర్తిచేయవలసిన పనంటూ ఏమీ లేకపోతే తీసిన నకళ్లకే తన సంతోషం కోసం మళ్లీ నకళ్లు రాసేవాడు. ముఖ్యంగా తను నకలు రాస్తున్న మూలరచన శైలి ఎటువంటిదైనా కానీ, ఆ ఉత్తరం ఎవరైనా కొత్తవ్యక్తికి, లేదా ముఖ్యమైన వ్యక్తికి రాసిందైతే అతడు మరింత సంతోషంగా దానికి నకలు రాసేవాడు.

సాధారణంగా బూడిదరంగులో ఉండే పీటర్స్‌ బర్గ్‌ ఆకాశం పూర్తిగా నలుపెక్కే వేళ కూడా, మొత్తం గుమస్తాల సముదాయమంతా వాళ్ల జీతభత్యాలు అనుమతించిన మేరకి, వాళ్ల అభిరుచులు అందివచ్చినంతమేరకి, వాళ్ళు యథాశక్తి రాత్రిభోజనం చేసి, పొద్దుటినుంచి నిర్విరామంగా పనిచేసిన తమ కలాలకు విశ్రాంతినిచ్చి తమ సంతోషంకోసం తమ సాయంకాలాల్ని వినియోగించేవేళ – వాళ్లల్లో మరీ ఉత్సాహవంతులు నాటశాలకో లేదా కొంతమంది వీథుల్లో మహిళల్నీ, వాళ్లటోపీల్నీ  చూసి సంతోషించడానికో, లేదా ఏ అందమైన అమ్మాయి మీదనో ప్రశంసలు కురిపించడానికో, లేదా ఒక చిన్న గుమస్తాల గుంపు – సాధారణంగా ఇదే అందరివిషయంలో జరిగేది – తన సహోద్యోగులతో కలిసి మూడో అంతస్తులోనో, నాలుగో అంతస్తులోనో ఒక రెండుగదుల్లో లేదా ఇంటినడవాలోనో లేదా వంటగదిలోనో కొత్తధోరణులకు గుర్తుగా ఒక చిన్న దీపమో లేదా మరేదో వస్తువునో అలంకరించి నలుగురికీ చూపించుకునేవేళ, ఆ వస్తువు ఎన్నో రాత్రి భోజనాలో లేదా సెలవు దినాలో త్యాగంచేస్తే కొనుక్కోగలిగిందే అయ్యుంటుండీ, సాధారణంగా ఆ వేళల్లో గుమస్తాలు తమ స్నేహితుల ఇరుకుగదుల్లో లోకాభిరామాయణం మాట్లాడడానికి చేరుతూంటారు. ఒక కోపెక్కు విలువ చేసే చక్కెర కలుపుకుని తేనీరు రుచి చూస్తూనో లేదా పొగ పీలుస్తూనో ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలం వెళ్లబుచ్చుతారు. ఏ రష్యన్‌ మహాశయుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ అటువంటి కాలక్షేపాన్ని వదులుకోవడానికి ఇష్టపడడు. మరేమీ మాట్లాడుకోవడానికి లేకపోతే గణతవహించిన పీటర్‌ చక్రవర్తి విగ్రహంలో గుర్రం తోకను ఎవడో కత్తిరించాడని ఎవరో సైనికాధికారి చెప్పాడనే పాత కథనైనా మళ్లా మళ్లా చెప్పుకుంటూఉంటారు. అలా ప్రతిఒక్కరూ తమనుతాము సంతోషపరుచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించేవేళ కూడా అకకి అకకియెవిచ్ను అటువంటి సరదాలేవీ బాధించవు. అతడెప్పుడూ ఏ సాయంకాలపు గోష్ఠికీ హాజరవడం చూశామని ఎవరూ చెప్పలేరు. తన హృదయం పూర్తిగా తృప్తి చెందేట్టుగా నకళ్లు రాసిన తరువాత అతడు రాబోయే రోజును తలుచుకుంటూ మర్నాడు ఉదయం భగవంతుడు తనకు నకళ్లు రాయటానికి ఏ కాగితాలు పంపించనున్నాడో అని ఊహించుకుంటూ నిద్రకుపక్రమిస్తాడు. 400ల రూబుళ్ల జీతంతో తన నుదుటిరాతతో తనేవిధంగా సమాధానపడాలో గ్రహించుకున్న మానవుడి శాంతిమయజీవితం ఆ విధంగా సాగిపోయేది. కాని సాధారణ లేదా అత్యున్నత లేదా కోర్టు లేదా ఇతరత్రా కౌన్సిలర్ల – వాళ్లు తమకోసం కానీ, ఇతరులకోసం కానీ ఎప్పుడూ ఎటువంటి సలహా ఇచ్చినపాపాన పోకపోయినప్పటికీ, వారి జీవితపథం మీద అల్లుకున్న వివిధ రకాల దురదృష్టాలు అతడికి అడ్డుపడకపోయిఉంటే, బహుశా అతడి వృద్ధాప్యం దాకా కూడా ఆ జీవితమట్లానే కొనసాగిఉండేది.

ఏడాదికి 400 ల రూబుళ్లకు అటూఇటూగా జీతం తెచ్చుకొని బతికేవాళ్లందరికీ పీటర్స్‌ బర్గ్‌ లో బలమైన శత్రువు ఒకటుంది. అది ఉత్తరందిక్కు మీంచి వీచే చలిగాలి తప్ప మరేదీకాదు. కావటానికి ఆ చలిగాలి మన ఆరోగ్యానికి మంచిదనే అందరూ అంటారు. సరిగ్గా పొద్దున్న తమతమ కార్యాలయాలకు వెళ్లే మనుషులతో వీథులు నిండిపోయే ఆ సమయంలోనే ఆ గాలి బలంగా శరీరాన్ని చీల్చేస్తూ వీయడం మొదలవుతుంది. అందరిమీదా నిష్పాక్షికంగా  వీచే ఆ గాలి తమను తాకినప్పుడు తామేం చేయాలో బీదగుమస్తాలకు నిజంగా అర్థం కాదు. ఉన్నతస్థానాలను అలంకరించినవాళ్ల వదనాలు కూడా ఆ గాలి తగలగానే కందిపోయి కళ్లల్లో అశ్రువులు పొంగుకొస్తుంటే సాధారణ గుమస్తాలకు చాలాసార్లు తప్పించుకొనే అవకాశమే ఉండదు. అటువంటి సమయాల్లో వాళ్లకున్న గత్యంతరమల్లా వాళ్ల పల్చని చిన్నిచిన్ని ఓవర్‌కోట్లలో వీలైనంత వేగంగా పెద్దపెద్ద అంగలు వేస్తూ నడుచుకుంటూ పోవడమే.  తమ కార్యాలయాల్లో కింద సేవకుల గదిలో తమ చేతులు వెచ్చబెట్టుకోవడం, తాము నడిచివచ్చిన దారిపొడవునా గడ్డకట్టుకుపోయిన తమ యోగ్యతల్నీ, అర్హతల్నీ తిరిగి మేల్కొలుపుకొని తమ విధులకు తాము హాజరవడం మటుకే వాళ్ళు చెయ్యగలిగేది.

రోజూ తను నడిచిరావలసిన దూరాన్ని వీలైనంత వేగంగా నడిచిరావటానికి ప్రయత్నించినప్పటికీ తన భుజాలు, వీపు బాగా నొప్పి పెడుతున్నట్టు అకకి అకకియెవిచ్ కి అనిపించింది. దీనికి కారణం తన ఓవర్‌కోటు కాదుకదా అని అతను సందేహించాడు. ఒకరాత్రి దాన్ని ఇంటి దగ్గర మరింత పట్టుపట్టి చూసాడు. అది భుజాలదగ్గర, వీపుదగ్గర రెండుచోట్ల దోమతెరలాగా మరీ పలచగా చివికి పోయిందని గుర్తుపట్టాడు. దానిగుండా చూడగలిగేటంత పారదర్శకంగా అది పలచబడిపోయింది. ఆ లైనింగ్‌ పూర్తిగా చిరిగిపోయింది. అకకి అకకియెవిచ్ ఓవర్‌కోటు చాలాకాలంగా తోటి ఉద్యోగుల అవహేళకు గురవుతూ వస్తూఉన్నదని కూడా మీరు తెలుసుకోవాలి. దాన్ని వాళ్లు ఓవర్‌కోటు అనే మర్యాదాపూర్వకమైన పేరు వదలిపెట్టేసి హౌసుకోటు అని పిలవడం మొదలుపెట్టారు. ఆ ఓవర్‌కోటు ఒక అద్వితీయవస్తువు. దాని కాలరు ఏ ఏడాదికాఏడాది పొట్టిదైపోతూ వస్తోంది. చిరుగులుపడ్డప్పుడల్లా అతుకులు పెట్టడానికి కూడా అదే ఆధారం మరి. ఆ అతుకులు కూడా దర్జీవాడి గొప్పనైపుణ్యాన్ని  మనకు చూపించకపోగా వికృతంగానూ, అందవికారంగానూ కనిపిస్తున్నాయి.

తన ఓవర్‌కోటు పరిస్థితిని చూసి అకకి అకకియెవిచ్ దాన్ని దర్జీవాడు పెట్రోవిచ్‌ దగ్గరకు తీసుకువెళ్లక తప్పదని నిశ్చయించుకున్నాడు. ఆ దర్జీవాడు ఎక్కడో నాలుగో అంతస్తులో ఉంటాడు. అక్కడికి వెళ్లాలంటే చీకట్లో మెట్లు ఎక్కి వెళ్లాలి. అతడికి ఉన్నదొక్కటే కన్ను అయినా, ముఖంనిండా మశూచిమచ్చలు పోసిఉన్నా, నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాడు. అతడి బుర్రలో మరే దారుణమైన ఆలోచనా నడుస్తూ ఉండకపోతే అతడు చేసేది ఎక్కువభాగం గుమస్తాలవీ, తక్కినవాళ్లవీ ప్యాంట్లూ, కోట్లు అతుకుపెడుతూండడమే. ఈ దర్జీవాడి గురించి ఎక్కువ చెప్పవలసిన అవసరమేమీ లేదు. కానీ ఈ రోజుల్లో ఏ కథలోనైనా,  ప్రతిపాత్రనీ స్పష్టంగానూ, దాని  వ్యక్తిత్వంతో సహా చిత్రించాలని కోరుకుంటున్నారు కాబట్టి అతన్ని కూడా వర్ణించకతప్పట్లేదు. ఇదుగో ఇక్కడ దర్జీవాడు పెట్రోవిజ్‌ ఉన్నాడు. మొదట్లో అతన్ని గ్రిగొరి అనేవారు. అతడెవరో కులీనుడిదగ్గర పనివాడుగా ఉండేవాడు. అతడికి వెట్టిచాకిరీనుండి విముక్తి దొరికాక, తననుతాను పెట్రోవిచ్‌ అని పిలుచుకోవడం మొదలుపెట్టాడు. మొదట్లో అతడు మరీ ముఖ్యమైన రోజుల్లోనే తాగుతూండేవాడు. ఆ తరువాత కేలండరులో ఏ రోజు దేవుడిపండగ కనిపించినా ఆ రోజులంతటా అడ్డూఅదుపూ లేకుండా తాగుతూండేవాడు.  నెమ్మదిగా అన్ని సెలవురోజుల్లోనూ కూడా తాగడం మొదలుపెట్టాడు. ఆ విధంగా అతడు తన సాంస్కృతిక వారసత్వానికి విధేయుడిగా మారిపోయాడు. తన భార్యతో తగవుపడ్డప్పుడల్లా ఆమెని కులంతక్కువదానా అనో లేదా జర్మన్‌దానా అనో తిట్టేవాడు. మనం అతడి భార్యవిషయం కూడా ప్రస్తావించుకుంటున్నాం  కాబట్టి ఆమె గురించికూడా ఒకటిరెండు మాటలు చెప్పుకోవలసి ఉంటుంది. కాని ఆమె గురించి దురదృష్టవశాత్తూ మనకి తెలిసింది చాలా స్వల్పం. అది కూడా పెట్రోవిచ్‌కి ఒక భార్య ఉందనీ, ఆమె తలకొక గుడ్డ బదులు టోపీ ధరిస్తుందనీ మటుకే. ఆమె అందంగా ఉంటుందని మాత్రం చెప్పలేం. ఆమెను వీథిలో చూసినప్పుడు కేవలం రక్షకభటులు మాత్రమే ఆమెను పరికించి చూస్తారనీ, తీరా ఆమెని చూసాక వాళ్లు తమ మీసాలు మెలిపెట్టుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు గొణుక్కుంటూ  పక్కకు తొలగిపోతారని మటుకు చెప్పగలం.

పెట్రోవిచ్‌ పైకి వెళ్లడానికి మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. ఆ మెట్లంతా అంట్లనీళ్లతో, చెత్తతో నానిపోయి ఉన్నాయి. అమోనియావాసన ఘాటుగా తగులుతూ కళ్లు మంటలు పుట్టించేటట్టుగా ఉంది. అట్లా కళ్లు మంటలు పుట్టించడమనేది పీటర్స్‌బర్గ్‌లోని అన్ని చీకటి మెట్ల దారుల ప్రధానధర్మాల్లో ఒకటి. మెట్లు ఎక్కుతూ తన కోటు అతుకు పెట్టడానికి పెట్రోవిచ్‌ ఎంత వేతనం

అడుగుతాడా అని అకకి అకకియెవిచ్ ఆలోచించాడు. అతడు ఎంత అడిగినా సరే రెండు రూబుళ్లకంటే ఎక్కువ ఇవ్వకూడదని గట్టిగా అనుకున్నాడు. అతడి ఇంటి తలుపు తెరిచే ఉంది. లోపల పెట్రోవిచ్‌ భార్య చేపలు వేయిస్తున్నట్లుంది. దాంతో బొద్దింకలు కూడా కనబడనంత దట్టంగా వంటగదినిండా పొగ పట్టేసింది. ఆ వంటగదిలో ఉన్న ఆడమనిషికంట పడకుండానే అకకి అకకియెవిచ్ ఆ వంటగది గుండా ముందుకు నడిచి మరోగదికి చేరుకున్నాడు. అక్కడ ఒక తురుష్క సుల్తానులాగా కాలుమీద కాలు వేసుకుని  పెద్దబల్లమీద పెట్రోవిచ్‌ కూర్చుని ఉండడం చూశాడు. అతడి పాదాలు సాధారణంగా దర్జీవాళ్లు పనిచేసేటప్పట్లానే ఎటువంటి ఆచ్ఛాదన లేకుండానే ఉన్నాయి. ఇప్పుడు అతడి దృష్టినాకర్షించిన మొట్టమొదటి అంశం ఆ దర్జీవాడి కాలి బొటనవేలు. దాన్ని అకకి అకకియెవిచ్ ఇంతకుముందు కూడా చూశాడు. ఆ బొటనవేలి గోరు వంకరతేలి చాలా గట్టిగా  తాబేటిచిప్పలాగా బలంగా ఉంది. పెట్రోవిచ్‌ మెడన ఒక పట్టుదారం వేలాడుతూఉంది. అతడి మోకాళ్లమీద  చిరిగిన వస్త్రం వేలాడుతూ ఉంది. అతడు తన చేతిలో ఉన్న సూదిలో ఆ దారాన్ని ఎక్కించడానికి కనీసం మూడు నిమిషాలపాటు విఫలప్రయత్నం చేశాడు. తన చుట్టూ ఉన్న చీకటిపట్లా, చివరికి ఆ దారంపట్లా, సూదిపట్లా కూడా అతనికి కోపం ముంచుకొచ్చింది. ‘నువ్వు లోపలికి పోవే! నువ్వు నన్ను పొడుస్తావా? దొంగముండా, పంది’ అని హీనస్వరంతో గొణుక్కుంటున్నాడు. పెట్రోవిచ్‌ కోపతాపాలకు లోనవుతున్న ఆ క్షణంలోనే వచ్చినందుకు అకకి అకకియెవిచ్ డీలాపడిపోయాడు. పెట్రోవిచ్‌ ఎటువంటి కోపానికీ లోనుకాకుండా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే అతడి నుంచి ఏదన్నా పని రాబట్టుకోవాలని అతడనుకున్నాడు. లేదా అతడి భార్యల్లో చెప్పాలంటే, ‘ఆ వంటికన్నురాక్షసుడు ఓడ్కాతాగి చప్పుడు చేయకుండా పడిఉండే క్షణం’లో. పెట్రోవిచ్‌ తను చెప్పే ధరలు తగ్గించడానికి అటువంటి సమయంలో తొందరగానే ఒప్పుకుంటాడు. బేరం కూడా తొందరగానే తేల్చేస్తాడు. పైగా వంగి సలాంచేస్తాడు, ధన్యవాదాలు కూడా చెప్తాడు. ఆ తరువాత ఎలానూ అతడి భార్య అక్కడికి రావడం, వాళ్లాయన తాగి పడున్నాడననీ, అందుకనే మరీ తక్కువ ధరకు ఒప్పుకున్నాడని ఫిర్యాదుచేయడం మామూలే. కానీ ఏదయినా పది కోపెక్కులతో మొత్తం వ్యవహారమంతా పూర్తయిపోతుంది. కానీ ఇప్పుడు పెట్రోవిచ్‌ మరీ గంభీరంగా ఉన్నాడు కాబట్టి, దానివల్ల మరీ ముభావంగా, మొరటుగా, కటువుగా ఉంటాడుకాబట్టి ఇప్పుడెంత డబ్బులడుగుతాడో ఆ దెయ్యానికే తెలియాలి. ఈ పరిస్థితి ముందే కనిపెట్టాడు కాబట్టి ఆకకి అకకియెవిచ్ వచ్చినదారినే సంతోషంగా పలాయనం చిత్తగించి ఉండేవాడు కానీ, అనుకోకుండా ఇరుక్కుపోయాడు. పెట్రోవిచ్‌ తన ఒంటికంటితో తనకేసి మరీ పరీక్షగా చూసేటప్పటికి అకకి అకకియెవిచ్ అసంకల్పితంగానే ‘బావున్నావా పెట్రోవిచ్‌’ అని పలకరించకుండా ఉండలేకపోయాడు.

ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే అకకి అకకియెవిచ్ సాధారణంగా ఏం చెప్పాలనుకున్నా, క్షమాపణలతోనూ, మాటలు ముక్కలుముక్కలుగానూ,  ఒకదానికొకటి పొసగని అర్థంలేని పదప్రయోగాలతోనూ చెప్తూ ఉంటాడు. ఒకవేళ అతను చెప్పదలచుకున్న విషయం మరీ సంక్లిష్టమైనదైతే అతడికి పూర్తిగా మతిపోతుంది.  అటువంటప్పుడు అతడు తరచూ తను చెప్పాలనుకున్నది, ‘ఇది నిజానికి, నిజానికి…’ అని మొదలుపెడతాడు కానీ, ఆ తరువాత ఏమీ ఉండనే ఉండదు. తను ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పలేకపోయాడని కూడా అతనికి తెలియదు. ‘ఏమిటిది?’ అని అడిగాడు పెట్రోవిచ్‌. ఆ మొత్తం వస్త్రాన్ని ఒంటికంటితోటే నిశితంగా పరీక్షిస్తూ. కాలర్‌ మొదలుకొని ముంజేతులదాకా, ఆ తరువాత వెనుకవైపూ, బొత్తాలు పెట్టుకునే కాజాల్నీనూ. అవన్నీ అతడికి బాగా  తెలిసినవే. దాన్ని తయారుచేసిందే అతడు. అట్లా దుస్తులను సాకల్యంగా పరీక్షించడం దర్జీలకు మామూలే. వాళ్లు ఎవరినైనా కలిసినప్పుడు మొదటచేసే పనే అది.

‘కానీ ఇదిగో పెట్రోవిజ్‌… నా ఓవర్‌కోట్‌, ఈ గుడ్డ… ఇదిగో ఇక్కడ చూడు, మొత్తమంతా, చాలాచోట్ల, అది బాగానే ఉంది, కొద్దిగా మాసిపోయుండవచ్చు, పాతదాని లాగా కనపడవచ్చు, కానీ అది కొత్తదే, ఇదిగో ఇక్కడ ఒక్కచోట అది కూడా కొద్దిగా… ఈ వెనకవైపు ఇదిగో ఇక్కడ ఒక భుజం మీద, కొద్దిగా నలిగిపోయింది. అవును ఇక్కడ ఈ భుజంమీద, అదీ కూడా కొద్దిగానే… చూస్తున్నావు కదా! అంతే. మరీ పెద్ద పనేమీ కాదు…’ పెట్రోవిచ్‌ ఆ ఓవర్‌కోట్‌ తీసుకుని దాన్ని బల్లమీద విప్పిపరిచాడు. చాలాసేపు దాన్నే తదేకంగా చూశాడు, తల అడ్డంగా ఊపాడు. అప్పుడు కిటికీ గూటిలో ఉన్న నశ్యం డబ్బా కోసం చెయ్యి చాపాడు. ఆ డబ్బా మూతమీద ఎవరిదో సైనికాధికారి ముఖచిత్రం ఉంది. అయితే ఆ సైనికాధికారి ఎవరో ఇతమిత్థంగా చెప్పలేం. ఎందుకంటే, సరిగ్గా ఆ ముఖం ఉండే చోటనే ఆ మూతకి కన్నం పడింది. దానిమీద ఒక చిన్న కాగితం అంటించి ఉంది. డబ్బాలోంచి ఇంతపిసరు నశ్యం తీసుకుని పెట్రోవిచ్ ఓవర్‌కోటు మళ్లా పైకి తీసి వెలుతురుకి అడ్డంగా పెట్టి చూశాడు. అప్పుడు మళ్లా తల అడ్డంగా ఊపాడు.  మళ్లా ఆ కోటుని తలకిందులుగా తిప్పి చూసి మరొక్కసారి తల అడ్డంగా ఊపాడు. అప్పుడు నశ్యం డబ్బామీద సైనికాధికారి ముఖచిత్రం ఉండే మూతను మరోసారి తొలగించి ముక్కుపుటాలు నిండేంతగా నశ్యం పీల్చి, మూత బిగించి ఆ నశ్యం డబ్బాను యథాస్థానంలో పెట్టి, ఏమయితేనేం చివరికి, ‘సాధ్యం కాదు. దీన్ని బాగుచేయడం అయ్యేపని కాదు. ఇది పూర్తిగా చిరిగిపోయింది’ అన్నాడు.

ఈ మాటలు వినగానే అకకి అకకియెవిచ్ హృదయం కుంగిపోయింది. ‘ఎందుకు చేయలేనంటున్నావు పెట్రోవిచ్‌’’ అని దాదాపుగా పిల్లవాడిలాగా జాలిగొలిపేటట్టు అడిగాడు. ‘ఆ భుజం మీద కొద్దిగానే చిరిగిపోయింది కదా. నువ్వు దానికి అతుకువెయ్యగలవుకదా!’ అన్నాడు.

‘అవును. నేను అతుకు పెట్టగలను. అది సులువే’ అన్నాడు పెట్రోవిచ్‌. ‘కాని ఆ అతుకుని కుట్టడమెలా? అదంతా పూర్తిగా చివికిపోయింది. సూది తగిలిందా అది పీలికలైపోతుంది.’

‘అది… మరీ అంత పలచగా ఉంటే పెద్ద అతుకువేస్తే సరిపోతుంది కదా!’

‘కాని ఆ అతుకు దేనికి అతకాలి? ఏదన్నా అతుకు వేసేమంటే, దాన్ని మనం ఏదో ఒకదానికి కలిపి కుట్టాలి. అసలు అక్కడ గుడ్డ అంటూ ఏముంది కనుక? దాన్ని బాగు చేయటానికి ఏ మార్గమూ లేదు.’

‘సరే, అది… నిజమే, కానీ కొద్దిగా అతికితే…’

‘వల్లకాదు’ అన్నాడు పెట్రోవిచ్‌ నిర్ద్వంద్వంగా.

‘నేను చేయగలిగిందేమీ లేదు. అసలంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మరీ చలిగాలి ఎక్కువ వీస్తే, నువ్వు ఆ కోటును చింపి సాక్సులాగా వాడుకో. అలాగని సాక్సు వాటికవే వెచ్చగా ఉంటాయని కాదు. అసలిదంతా ఏదో ఒకరకంగా డబ్బు సంపాదించుకోవడం కోసం జర్మన్‌లు కనిపెట్టిన బాపతు.’ (వీలైనప్పుడల్లా జర్మల్ని ఎద్దేవా చేయడం పెట్రోవిచ్‌కు చాలా ఇష్టం) ‘దీనికి కొత్త ఓవర్‌కోట్‌ కొనుక్కోవడమొక్కటే పరిష్కారం.’

కొత్త అనే పదం వినగానే అకకి అకకియెవిచ్ కళ్లముందంతా అంధకారం వ్యాపించింది. కళ్ళముందు గది తిరగడం మొదలుపెట్టింది. అతడు స్పష్టంగా చూస్తున్నదల్లా పెట్రోవిచ్‌ నశ్యండబ్బా మూతమీద కాగితం చీటీ అంటించిన సైనికాధికారిబొమ్మ మాత్రమే. ‘కొత్తది కొనుక్కోవడమెట్లా?’ నిద్రలో మాట్లాడుతున్నట్టుగా మూలిగాడు. ‘నా దగ్గర అంత డబ్బు లేదే!’

‘తప్పదు. కొత్తకోటు కొనాల్సిందే’ అన్నాడు పెట్రోవిచ్‌ క్రూరంగా, ప్రశాంతంగా.

‘బాగుంది. అది… కొత్తకోటు తప్పదంటే, ఎలా? అది…’

‘నువ్వనేది దానికి ఎంత ఖర్చవుతుందనేనా?’

‘అవును’

‘కనీసం 150 రూబుళ్లు లేదా ఇంకొంచెం ఎక్కువ’ అన్నాడు పెట్రోవిచ్‌. అతడి పెదాలు ముడుచుకుంటూ. అట్లాంటి గంభీరముద్ర ఇవ్వడం అతడికి చాలా ఇష్టం. తన ఎదుటవుండే అల్పమానవుణ్ణి పూర్తిగా నిశ్చేష్టుణ్ణి చేసి అప్పుడు అతడెట్లా ప్రతిస్పందిస్తున్నాడో ఓరకంట గమనించడం అతడికి అలవాటు.

‘ఒక్క ఓవర్‌కోట్‌కి 150 రూబుళ్లా!’ గట్టిగా అరిచాడు అభాగ్యుడు అకకి అకకియెవిచ్, అవును. ఆ అరవడమే అతని జీవితంలో  మొదటి అరుపయిఉంటుంది. అంతదాకా అతడి కంఠస్వరానికి తెలిసింది మెత్తదనం మాత్రమే.

‘అవును సర్‌’ అన్నాడు పెట్రోవిచ్‌. ‘కొద్దిగా చక్కటి ఓవర్‌కోట్‌ కావాలంటే తప్పదు మరి. ఇంకా చక్కటిమేలురకం బొచ్చుతోటో, లేదా పట్టు అంచుతోటో కాలరు ఉండాలంటే 200 రూబుళ్ళు కూడా అవుతుంది.’

‘చాలు పెట్రోవిచ్‌’ అన్నాడు అకకి అకకియెవిచ్ బలహీన స్వరంతో. ఆ దర్జీ ఏం చెప్తున్నాడో వినకుండా, వినడానికికూడా ప్రయత్నించకుండా. ‘అది… దాన్ని కొద్దిగా అతుకులేస్తే చాలు. ఇంకో నాలుగు రోజులు వేసుకోవచ్చది.’

‘లేదు లేదు దానివల్ల డబ్బు నష్టం, పని దండగా’ అన్నాడు పెట్రోవిచ్‌. అకకి అకకియెవిచ్ పూర్తిగా కుప్పకూలిపోయాడు. కానీ అతడు వెళ్లిపోయిన తరువాత కూడా పెట్రోవిచ్‌ అక్కడే నిలబడ్డాడు. తన పెదాలు అట్లానే బిగబట్టి చూస్తూండిపోయాడు. వెంటనే తన పని కూడా మొదలుపెట్టలేదు. అకకి అకకియెవిచ్ తనని వదిలేసుకోడనీ, తొందరలోనే మళ్లా తన దగ్గరికి రాకపోడనీ గట్టిగా అనుకున్నాడు.

అకకి అకకియెవిచ్ కలలో నడుస్తున్న వాడిలాగా వీథిలోకి వచ్చిపడ్డాడు. ‘ఏమి ఉపద్రవం వచ్చి పడిందీ’ అనుకున్నాడతడు. ‘విషయం మరీ ఇంతదూరం పోతుందనుకోలేదు నేను…’ అనుకున్నాడు ఒక్కక్షణం ఆగి, ‘సరే. విషయం ఇంతదూరం ఎలానూ వచ్చింది. కానీ నాకేం తోచడం లేదు. మరేమో…’ అప్పుడు కొంతసేపు దీర్ఘనిశ్శబ్దం. ఆ తరువాత తనకుతనే మళ్లా ‘సరే. కానివ్వు. అదేమిటో చూద్దాం… నేనది ముందే ఊహించి ఉండాల్సింది… కానీ అది మరీ అంత కాదేమో… ఏమి విధి వైపరీత్యం’ తనలో తనే గొణుక్కుంటూ ఇంటికిపోయే బదులు అతడు సరిగ్గా దానికి వ్యతిరేకదిశలోనే నడుచుకుంటూ పోయాడు. కనీసం ఆ విషయం కూడా గమనించలేదతడు. దారిలో పోతూండగా వీథులు ఊడ్చేవాడి చీపురు అతనికి రాసుకుని ఓ వైపంతా దుమ్ము అంటుకుపోయింది. పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవంతి మీంచి టోపీ పట్టేటంత చెత్త అతనిమీద వర్షించింది. కానీ అతడేమీ గమనించలేదు. అట్లా కొద్దిసేపు గడిచాక, అక్కడ పహరా కాస్తూన్నవాడొకడి మీద తను తూలి పడ్డప్పుడుకానీ అతడీ  లోకంలోకి వచ్చి పడలేదు. ఆ పహరాకాస్తూన్నవాడు తన చేతికర్ర పక్కనే పెట్టి తన నశ్యండబ్బాలోంచి కొద్దిగా నశ్యం తీసుకుని విదిలిస్తుండగా తను వాడిమీద పడ్డాడు. అప్పుడు ఆ పహరాకాస్తున్నవాడు ‘ఏం కళ్లు మూసుకుపోయాయా? రోడ్డుమీద నడవడానికి చోటులేదా?’ అని అడిగితే తప్ప, అతడికి తెలివిరాలేదు. దాంతో అతడి చుట్టూ కలియజూసి అప్పుడు మళ్ళా ఇంటిదారి పట్టాడు.  మళ్లా తన ఆలోచనలన్నీ కూడదీసుకుని తన పరిస్థితి ఏమిటో మరొక్కసారి బేరీజువేసుకోవడం మొదలుపెట్టాడు. హడావిడిగా కాకుండా నింపాదిగా, సూటిగా, జాగ్రత్తగా తనతోతను తర్కించుకోవడం మొదలుపెట్టాడు. మనం ఎవరైనా సన్నిహిత మిత్రుడితో  సున్నితమైన విషయాలు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతుంటామే అలా. ‘లేదు’ అన్నాడు అకకి అకకియెవిచ్. పెట్రోవిచ్‌తో ఇప్పుడు వాదించి లాభంలేదు. అతడంతే… బహుశా వాళ్లావిడ మళ్లా అతన్ని చావగొడుతుండొచ్చు. ఆదివారం పొద్దున్న అతన్ని మళ్లీ కలిస్తే బాగుంటుందేమో! శనివారం రాత్రి గడిచాక అతడు కొద్దిగా మెత్తబడి ఉంటాడు. అతడప్పుడు తాగాలనుకుంటాడు కానీ, వాళ్ళావిడ అతడికేమీ డబ్బులివ్వదు… నేనో పది కోపెక్కులు అతనికి తగిలించానంటే, అతడు కొద్దిగా మెత్తబడి మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆ ఓవర్‌కోటు సంగతి చూడొచ్చు…’

ఆ రకంగా అకకి అకకియెవిచ్ తనతోతను చర్చించుకున్నాడు. ధైర్యం కూడగట్టు కున్నాడు. మళ్లా ఆదివారం దాకా ఎదురుచూశాడు.  పెట్రోవిచ్‌ భార్య ఇంటినుంచి బయటికెళ్లడం వీథిచివరినుంచి చూసి మెట్లు ఎక్కాడు. పెట్రోవిచ్‌ ఒంటికన్ను దిగాలుపడి ఉంది. ఆ శనివారం రాత్రి గడిచిపోయినా అతడింకా నిద్రమత్తులోనే ఉన్నాడు. అయినాకూడా అకకి అకకియెవిచ్ మాట్లాడుతున్నది వినగానే అతడి స్మృతిరాక్షసి ఒక్కసారిగా మేల్కొంది. ‘అసాధ్యం’ అన్నాడతడు. ‘కొత్తది కొనుక్కోవడమొక్కటే మార్గం’. అకకి అకకియెవిచ్  పది కోపెక్కులు అతడి చేతిలో పెట్టాడు. ‘సంతోషం సర్‌. మీరు చక్కగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను’ అన్నాడు పెట్రోవిచ్‌. ‘కాని ఓవర్‌ కోట్‌ సంగతంటారా! ఆ పాత దాని గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోకండి. అదింకేవిధంగానూ పనికిరాదు. నేను మీకో చక్కటి కొత్తకోటు తయారుచేస్తాను. నన్ను నమ్మండి.’

అకకి అకకియెవిచ్ ఎలాగైనా ఆ కోటుకి అతుకులు పెట్టడం గురించి ఆలోచిస్తున్నాడు. కానీ పెట్రోవిచ్‌ అతడి మాటలు వినడానికి ఇష్టపడలేదు. ‘నేను మీకో కొత్తకోటు తయారుచేస్తానంటున్నాను కదా, నన్ను నమ్మండి. చక్కటి కోటు తయారుచేస్తాను. ఇప్పటి పోకడ ప్రకారం ఉండేటట్టే కుట్టిస్తాను. కాలరుకు వెండి హుక్కులు బిగిస్తాను’ అన్నాడు.

కాని సరిగ్గా ఆ క్షణాన్నే అకకి అకకియెవిచ్కి కొత్త ఓవర్‌కోట్‌ కుట్టించుకోవడం అసాధ్యంగా తోచింది. అతడి ఉత్సాహం పూర్తిగా నీరుగారిపోయింది. కొత్త ఓవర్‌కోట్‌ ఎట్లా వస్తుంది? అంత డబ్బు ఎక్కడనుండి ఎక్కడనుండి తీసుకురాగలడు? క్రిస్టమస్‌కు వచ్చే బోనస్‌నుంచి కొంత వాడుకుందామా అంటే ఆ డబ్బు ఇప్పటికే దేనిదేనికి ఖర్చుపెట్టాలో ముందే ఎన్నో లెక్కలు వేసేసుకున్నాడు. అతడికి కొత్త పంట్లాం కావాలి. తన పాత బూట్లకు మరమ్మత్తులు చేసినందుకు బూట్లు కుట్టేవాడికి చాలాకాలంగా బాకీ పడి ఉన్నాడు, అది తీర్చాలి. మూడు చొక్కాలు, ఇక్కడ రాయటం సముచితంగా ఉండని కొన్ని లోపలి గుడ్డలు ఉతికి ఇస్త్రీ చేయటం కోసం ఇవ్వవలసి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, రాబోయే డబ్బుకు మొత్తం లెక్క ముందే  సిద్ధంగా ఉంది. అతని డైరక్టరు మరీ ఉదారంగా ఉండి ఒకవేళ నలభై రూబుళ్లకు బదులు నలభైఐదో, ఏభయ్యో ఇచ్చినా కూడా ఏమంత ప్రయోజనం ఉండేటట్టు లేదు. ఓవర్‌కోటు కుట్టించడానికి అవసరం కాగల డబ్బుతో పోలిస్తే అది సముద్రంలో కాకిరెట్ట లాంటిది. ఇప్పటిదాకా పెట్రోవిచ్‌ ఆ కోటు కుట్టించడానికి ఎంతవుతుందో మనసులో మాట బయట పెట్టనేలేదు. కాని అది చాలా ఎక్కువే అవుతుందనడంలో సందేహం లేదు. ఆ ధర వింటే అందరికన్నా ముందు అతడి భార్యే అరుస్తుంది కూడా. ‘మూర్ఖుడా! నీకేమైనా మతిపోయిందా? సగం సమయం నువ్వు అస్సలు ఏ పనీ చేయవు. తీరా పని చేతికొచ్చేటప్పటికి తలకుమించిన లెక్కలు వేస్తావు’ అని విరుచుకుపడుతుంది కూడా.

అయితే పెట్రోవిచ్‌ని నెమ్మదిగా ఒప్పిస్తే అతడు చెప్పే ధర ఎనభై రూబుళ్ల దాకా తగ్గించవచ్చని నమ్మకం ఉందికానీ అంత డబ్బు మాత్రం ఎక్కడనుంచి తేగలడు.  అతి కష్టం మీద సగం దాకా  తేగలడేమో! సగం డబ్బు వరకూ సమస్య లేదు. కానీ తక్కిన సగం ఎక్కడనుంచి వస్తుంది?

ఆ సగం డబ్బు కూడా ఎక్కడినుంచి రాగలదో ఈ సందర్భంలో పాఠకుడు తెలుసుకోవలసి ఉంటుంది. అకకి అకకియెవిచ్కి ఒక అలవాటుంది. అతడు ఖర్చు పెట్టే ప్రతి రూబుళ్లకీ రెండు కోపెక్కులు చొప్పున చిన్న డిబ్బీలో వేస్తూ వచ్చాడు. ఆ డిబ్బీకెప్పుడూ పైన నాణాలు వేసేటంత సందుమాత్రం ఉంటుంది. ప్రతి ఆరు నెలలకొకసారి అతడు పోగుచేసిన రాగినాణాలన్నీ లెక్కపెట్టి వాటిని చిన్నచిన్న వెండి నాణాలకు మార్చుకునేవాడు. ఇలా అతడు ఎంతో కాలంగా చేస్తూ ఉన్నందువల్ల ఏళ్లమీదట దాదాపు నలభై రూబుళ్లకు పైగా పోగుచేయగలిగాడు. కాబట్టి సగం డబ్బు అతడి చేతిలో ఉన్నట్టే. కానీ మిగిలిన సగం ఎక్కడనుంచి రానుంది? మరొక నలభై రూబుళ్లు ఎక్కడినుంచి తేవడం? ఇదే విషయం గురించి అకకి అకకియెవిచ్ పదేపదే ఆలోచించి చివరికి కనీసం ఒక ఏడాది పాటైనా తన దినవారీ ఖర్చులు తగ్గించుకోకతప్పదని నిర్ణయానికొచ్చాడు. సాయంకాలం పూట టీ మానేయడం, రాత్రిపూట కొవ్వొత్తులు వెలిగించకుండా ఆదాచేయడం, ఇంటికొచ్చాక కూడా నకళ్లు రాయవలసి ఉంటే, ఇంటియజమానురాలి వాటాలోకి పోయి అక్కడి వెలుతురులోనే నకళ్లు రాయడం, బయటికి వెళ్లినప్పుడు సాధ్యమైనంత నెమ్మదిగా జాగ్రత్తగా నడిచి తద్వారా చెప్పులు మరీ తొందరగా అరిగిపోకుండా చూసుకోవడం, చాకలికి వేయవలసిన గుడ్డలు వీలైనంత తగ్గించడం, దుస్తులు కూడా ఎక్కువ రోజులు మన్నిక వచ్చేటట్టు చూసుకోవడం, అందుకుగాను ఇంటికి వెళ్లిన వెంటనే వాటిని విప్పేసి కేవలం ఒక అంగవస్త్రం మాత్రమే కట్టుకొని గడపడం, అది కూడా తనెంతో కాలంగా భద్రంగా దాచుకున్న అంగవస్త్రం మాత్రమే కావడం వగైరా…

నిజం చెప్పాలంటే ఇటువంటి లేమికి అతడు అలవాటు పడ్డం మొదట్లో కొద్దిగా కష్టంగా అనిపించినా, తొందరలోనే అతడు దానికి ఎంతగా అలవాటుపడిపోయాడంటే, అదంతా చాలా సజావుగానే, ఇంకా చెప్పాలంటే కొత్త తరహాలాగా కూడా అనిపించేదతడికి. సాయంకాలం అయ్యేటప్పటికి ఆకలిగా అనిపించడానికి అతడు అలవాటు పడిపోయాడు. కాని ఆ ఆకలిని తన ఊహాల్తో చల్లార్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. తన సుదూరస్వప్నమైన ఓవర్‌కోటునే సదా ధ్యానిస్తూ ఉండేవాడు. అప్పటినుంచి అతని జీవితం కూడా ఎన్నో విధాలుగా పరిపూర్ణంగా కనిపించడం మొదలుపెట్టింది. అతడికి వివాహం అయినట్లు, లేదా అతనితో మరెవరో మనిషి జీవితం మొదలుపెట్టినట్లు అనిపించేది. అతడు ఇంకెంతమాత్రం ఒంటరివాడు కాదని, ఎవరో ఆకర్షణీయమైన సహచరి అతని జీవితపథం పొడుగుతా అతడితో కలిసి నడవటానికి ముందుకొచ్చిందనీ అనిపించేది. ఆ స్నేహితురాలు మరెవరో కాదు, ఓవర్‌కోటు. దట్టంగా అల్లిన గుడ్డల్తో, బలమైన అంచుల్తో ఎన్నటికీ చిరిగిపోని ఓవర్‌కోటు. దాన్ని తలుచుకొనే కొద్దీ అతడు మరింత సజీవంగా మారాడు. అతడి సౌశీల్యం మరింత బలపడింది. ఏదో ఒక లక్ష్యానికి జీవితాన్ని అంకితం చేసుకుని దాన్ని సాధించడానికి దృఢనిశ్చయం చేసుకున్న మనిషిలాగా మారాడతడు. అతడి ముఖం నుంచీ, శరీరభంగిమనించీ పూర్వం కనవచ్చే సంకోచాలు, సందేహాలు, ఊగిసలాటలు, తటపటాయింపులు నేడు పూర్తిగా వాటంతట అవే అదృశ్యమైపోయాయి. ఇప్పుడతడి కళ్లల్లో ఒక జ్వాలారేఖ తళుకుమంఅటున్నది. అత్యంత ధైర్యంతో కూడుకున్న సాహసిక భావాలెన్నో అతడి మనసులో కదలాడుతున్నాయి. ఆ మాటకొస్తే ఆ కోటు కాలరుకు చక్కటి ఉన్ని ఎందుకు వాడకూడదు? ఇట్లాంటి ఆలోచన ఆలోచనమాత్రంగా వచ్చినా కూడా అతడి హృదయం లయ తప్పేది. ఒకసారి ఒక ఉత్తరానికి నకలు రాస్తూ, అతడు దాదాపుగా పొరపాటు చేయబోయి ఒక్కసారి తననుతాను తమాయించుకుని తనకుతానే క్షమాపణ కోరుకున్నాడు. నెలకొకసారైనా అతడు తన కోటు విషయమై పెట్రోవిచ్‌తో సమావేశమవుతూండేవాడు. గుడ్డ ఎక్కడ కొనాలి, ఏ రంగు, ఎంత ధర? మొదలైనవన్నీ చర్చించి సంతృప్తహృదయంతో ఇంటికి తిరిగి వచ్చేవాడు. అట్లా తిరిగి వస్తున్నప్పుడు హృదయంలో ఎక్కడో కొద్దిపాటి కలవరం కూడా ఉండేది. కాని ఏదో ఒక నాటికి కావలసిన సామగ్రి అంతా సమకూర్చుకోగలగుతాడని, ఓవర్‌కోటు తయారుకాక తప్పదనీ అనుకుంటుండేవాడు. అతను అనుకున్నదానికన్నా కూడా తొందరగానే పనులు సమకూరాయి. అతడు ఊహించినదానికన్నా కూడా ఎక్కువగా అతడి డైరక్టరు అతడికి క్రిస్‌మస్‌ బోనసు మంజూరు చేశాడు. నలభయ్యో, నలభైఐదో రూబుళ్లు కాదు, ఏకంగా అరవై. అకకి అకకియెవిచ్కి ఒక ఓవర్‌కోటు అవసరమని అతడు ఊహించాడా, లేదా అదంతా యాదృచ్ఛికమేనా? ఏమైతేనేం, అదనంగా ఇరవై రూబుళ్లు చేతికందాయి. అనుకోకుండా వచ్చిన ఈ లాభం వల్ల పనుల్లో పురోగతి సాధ్యపడింది. ఆకలితో మరొక రెండు మూడు నెలలు గడపగానే అకకి అకకియెవిచ్ మొత్తం ఎనభై రూబుళ్లు పోగుచేయగలిగాడు. సాధారణంగా ప్రశాంతంగా ఉండే అతడి హృదయం ఇప్పుడు వేగంగా కొట్టుకోవడం మొదలయింది.

ఇక ఆలస్యం చేయకుండా అతడూ, పెట్రోవిచ్‌ ఎక్కడలేని దుకాణాలూ తిరగడం మొదలుపెట్టారు. ముందు వాళ్లు చక్కటి గుడ్డ చాలా సరసమైన ధరకే కొనగలిగారు. దాదాపు ఆరునెలల పాటు వాళ్లు గుడ్డ గురించే మల్లగుల్లాలు పడుతూ వచ్చారు. ఆ ఆరునెలల కాలంలోనూ వాళ్లు దుకాణాలన్నీ తిరుగుతూ ధరవరలు ఎట్లా ఉన్నాయో విచారిస్తూ ఉండేవారు. ఇప్పుడు దొరికినదానికన్నా మించిన గుడ్డ మరి దొరకదని పెట్రోవిచ్‌ స్వయంగా అన్నాడు. ఇక లైనింగ్‌ కోసం వాళ్ళొక నూలుగుడ్డ ఎంపిక చేశారు. అది ఎంత దట్టంగా, దృఢంగా ఉందంటే, అది పట్టువస్త్రాన్ని మించిపోయిందని పెట్రోవిచ్‌ ప్రకటించాడు కూడా. అది పట్టుకన్నా అందంగా నిగనిగలాడుతూ ఉంది.  మరీ ధర ఎక్కువ కావడంతో వాళ్ళు మార్టెన్‌ ఫర్‌ కొనలేదు కానీ, చాలా చక్కటి ధరకి కేట్‌స్కిన్‌ కొన్నారు. అది దూరంనుంచి చూస్తే అచ్చు మార్టెన్‌ లానే ఉంటుంది. పెట్రోవిచ్‌ దాదాపు రెండు వారాల పాటు ఆ ఓవర్‌ కోటు కుడుతూనే ఉన్నాడు. ముఖ్యంగా దాని లోపల బొంత కుట్టడానికే చాలా కాలం పట్టింది. లేకపోతే ఇంకా తొందరగానే పూర్తయి ఉండేది. ఈ మొత్తం పనికిగాను అతడు పన్నెండు రూబుళ్లు తీసుకున్నాడు. అంతకన్నా తగ్గించడం సాధ్యం కాదన్నాడు. ఆ మొత్తం కోటు అంతా రెండు అంచుల్లో పట్టుతో కుట్టాడు. మొత్తం కుట్టిం తర్వాత పెట్రోవిచ్‌ ప్రతి అంచునీ ఒకసారి పళ్లతో కొరికిచూశాడు. రెండుచేతులతోనూ అక్కడక్కడా గట్టిగా లాగిచూశాడు.

మొత్తానికి ఒక రోజున – అది ఏ రోజో స్పష్టంగా చెప్పలేంకానీ, అకకి అకకియెవిచ్ జీవితంలో ఒక అత్యంత వైభవోపేతమైన రోజున  – పెట్రోవిచ్‌ ఆ ఓవర్‌కోటును అతడికి అందజేశాడు. ఒకరోజు పొద్దున్నే అకకి అకకియెవిచ్ తన ఉద్యోగానికి ఎప్పట్లానే బయలుదేరే సమయంకన్నా కొద్దిగా పెందలాడే అతడు ఆ కోటు తీసుకువచ్చాడు. బహుశా అంత సమయోచితంగా ఎప్పుడూ ఎవరికీ ఓవర్‌కోటు అమరి ఉండదు. ఎందుకంటే అప్పుడే భయంకరమైన శీతాకాలపు చలి మొదలయింది. అది మరింత దుర్భరంగా మారనుంది కూడా. గొప్ప నిపుణుడు తను చేసినదాన్ని తన చేతుల్తో స్వయంగా అందిస్తున్నట్టుగా పెట్రోవిచ్‌ ఆ కోటును తనే స్వయంగా తీసుకువచ్చి చేతికందించాడు. అలా అందిస్తున్న సమయంలో అతడి వదనంలో కనిపించిన సాఫల్యవ్యక్తీకరణ అకకి అకకియెవిచ్ అంతకుముందెన్నడూ చూసి ఉండలేదు. అతడు పూర్తిచేసింది చిన్నపాటి పని కాదని అతడు గుర్తించాడు. మామూలుగా గుడ్డలకి అతుకులు పెడుతూ, అంచులు మాత్రమే కుట్టే దర్జీవాళ్లకీ, నూతన వస్త్రాలు రూపొందించేవాళ్లకీ మధ్య పెద్ద అగాథమొకటి అకస్మాత్తుగా విస్తరించినట్లు అతడికి అనిపించింది. ఆ ఓవర్‌కోటును ఒక పెద్ద చేతిగుడ్డలో మడిచి తీసుకువచ్చాడు. ఆ చేతిగుడ్డ కూడా చలువచేసి ఉంది. ఆ కోటు అందించాక ఆ చేతిగుడ్డని అతడు జాగ్రత్తగా మడిచి తరువాత వాడుకోవడం కోసం జేబులో పెట్టుకున్నాడు. ఆ ఓవర్‌కోటును రెండు చేతుల్తో పైకెత్తి దానికేసి సగర్వంగా చూశాడు. అప్పుడు ఎంతో కౌశల్యంతో కప్పుతున్నట్లుగా దాన్ని అకకి అకకియెవిచ్ భుజాలమీదుగా దింపాడు.  దాన్ని కిందకు లాగి వెనకపక్కన తన చేతితో మెత్తగా సవరించాడు. ఆ మీదట దాన్ని అకకి అకకియెవిచ్ దేహం చుట్టూతా కిందకి లాగాడు. కాని బొత్తాలు పెట్టలేదు. అకకి అకకియెవిచ్ ఆ కోటు చేతుల్లో తన చేతులు పెట్టబోయాడు.  అతడి చేతులు కోటుచేతుల్లో పెట్టగానే ఆ చేతులు కూడా చాలా చక్కగా అమరాయనిపించింది. ఒక్కముక్కలో చెప్పాలంటే ఓవర్‌కోటు ఎంతో పరిపూర్ణంగా, ఎంతో ఫలప్రదంగా తయారైందిగా కనిపించింది. అదే సమయంలో వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకుండా, పెట్రోవిచ్‌ ఈ మాటలు కూడా చెప్పకుండా ఉండలేకపోయాడు. అదేమంటే అతని దుకాణం ఒక సందులో ఉన్నందు వల్లా, దానికేమీ బోర్డు లేనందువల్లా అకకి అకకియెవిచ్ అతడికి చాలాకాలంగా తెలిసినందువల్లా మాత్రమే ఆ కోటు అంత చౌకగా దొరికిందనీ, అదే అతడి దుకాణంగాని ఒకవేళ నెవ్‌స్కి బజారులో ఉండి ఉంటే ఆ కోటు కుట్టడానికే డభైఐదు రూబుళ్లు వసూలు చేసి ఉండేవాడిననీ అన్నాడు. మామూలుగా పెట్రోవిచ్‌కి పెద్దపెద్ద మొత్తాల్లో అంకెలు చెప్పడం సరదా. అటువంటి పెద్దపెద్ద అంకెలు విన్నప్పుడల్లా అకకి అకకియెవిచ్కి నిస్సత్తువ ఆవహిస్తూ ఉంటుంది. అందుకని అతడు ఆ సమయంలో పెట్రోవిచ్‌తో వాదించాలనుకోలేదు.  పెట్రోవిచ్‌కి చెల్లించవలసిన రుసుము చెల్లించి అతడికి కృతజ్ఞతలు చెప్పి తక్షణమే తన కొత్త ఓవర్‌కోటులో ఆఫీసుకు బయలుదేరాడు. పెట్రోవిచ్‌ కూడా అతణ్ణి కొంతదూరం అనుసరించాడు. అప్పుడు వీథిలో ఒకచోట ఆగి తన ముందు నడిచి వెళ్తున్న ఓవర్‌కోటును అట్లా దీర్ఘకాలం పాటు తదేకంగా చూస్తూండిపోయాడు. ఇక అప్పుడు మళ్లా ఒక సందుకు అడ్డంపడి వీథికి మరోవైపు తేలి అక్కడినుంచి మరొక కోణంలోంచి, అంటే ముఖాముఖి, ఆ ఓవర్‌కోటును మరొకసారి తదేకంగా చూసుకున్నాడు.

ఈ లోపు అకకి అకకియెవిచ్ చాలా ఉల్లాసభరితమైన మనఃస్థితిలో ఏదో సెలవు రోజులో లాగా నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు తన భుజాలమీద ఒక కొత్త ఓవరుకోటు ఉందన్న పరిపూర్ణజ్ఞానంతో అతడు అలరారుతున్నాడు. ఆ జ్ఞానం కలిగిస్తున్న రహస్య సంతోషంతో అతడు పదేపదే తనలోతనే మందహాసం చేసుకుంటూ ఉన్నాడు. నిజానికి ఆ ఓవర్‌కోటుకి రెండు ఘనతలున్నాయి. ఒకటి, అది నిజంగానే వెచ్చగా ఉంది. రెండవది, అది అందంగా కూడా ఉంది. దాంతో తనెక్కడికి పోతున్నదీ పట్టించుకోకుండానే అతడు నడుచుకుంటూ పోతూ ఆగి చూసేటప్పటికి సరిగ్గా తన కార్యాలయం గుమ్మంముందుకే చేరాడు. కింద విశ్రాంతి గదిలో తన ఓవర్‌కోటు విప్పి దాన్ని జాగ్రత్తగా చూసుకుని  అక్కడున్న పనివాళ్లకి అప్పగించాడు. అతడి శాఖలో పనిచేస్తున్న ప్రతిఒకళ్లకీ అకకి అకకియెవిచ్ కొత్త ఓవర్‌ కోటు కొనుక్కొన్నాడనీ, పాత చిరిగిన ఓవర్‌కోటు ఇంక లేదనీ అంత త్వరగా ఎలా తెలిసిందో చెప్పడం అసాధ్యం. కాని ప్రతి ఒక్కళ్లూ అకకి అకకియెవిచ్ ఓవర్‌కోటు చూడడం కోసం తక్షణమే విశ్రాంతిగదికి ఉరికివచ్చారు. వాళ్లు అతణ్ణి అభినందించడం మొదలుపెట్టారు. మంచిమాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. వచ్చినవాళ్లు చాలామంది కావడంతో ముందతడు చిరునవ్వుతో స్వాగతించినా ఆపై సిగ్గు పడిపోయాడు. వాళ్లంతా అతణ్ణి చుట్టిముట్టి కొత్త ఓవర్‌కోటు వచ్చిన సందర్భంగా వేడుక చేసుకోవాలనీ, ఆ సాయంకాలం మొత్తం సరదా కోసం కేటాయించాలనీ అడగడంతో అకకి అకకియెవిచ్కు పూర్తిగా మతిపోయింది. అతడు ఎక్కడున్నాడో ఏం సమాధానం చెప్పాలో, దాన్నుంచి ఎలా బయటపడాలో అతడికి అర్థం కాలేదు. మొహమాటపడుతూ కొన్నిక్షణాలు ఏం మాట్లాడాలో తెలియక నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు. అసలు అది కొత్త ఓవర్‌కోటు కానేకాదనీ, మరేదోననీ, నిజంగానే కొత్తదికాదనీ వాళ్లతో చెప్పాలనుకున్నాడు. చివరికి కార్యాలయంలో పనిచేస్తున్న సహాయ ముఖ్యగుమస్తా తక్కినవాళ్ల అందరి ఎదురుగుండా తన సంస్కారాన్ని చాటుకుంటున్నాడా అన్నట్టుగా, తన కింది ఉద్యోగులతో స్నేహంగా మెలిగే అవకాశం దొరికినట్టుగా ‘సరే. కానివ్వండి. అకకి అకకియెవిచ్కి బదులుగా ఈ రోజు నేను వేడుక జరుపుతాను. మీ అందరినీ ఈ రాత్రికి మా ఇంటికి టీకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. పైగా ఈ రోజు నా పుట్టినరోజు కూడా’ అన్నాడు. సహజంగానే తక్కిన గుమస్తాలంతా సహాయముఖ్యగుమస్తాను అభినందనలతో ముంచెత్తి అతడి ఆహ్వానాన్ని సంతోషంగా అంగీకరించారు. అకకి అకకియెవిచ్ ఆ ఆహ్వానాన్ని నిరాకరించి ఉండేవాడే కానీ, అట్లా చేయడం అమర్యాదగా ఉంటుందనీ, అవమానకరమనీ అనిపించడంతో అందుకు నిరాకరించలేకపోయాడు. అదీకాక, ఈ ఆలోచన కూడా నెమ్మదిగా అతడికి అంగీకారయోగ్యంగా కనిపించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆ నెపంమీద  సాయంకాలం కూడా కొత్త ఓవర్‌కోటు తొడుక్కోవచ్చని తట్టిందతడకి.

ఆ మొత్తం రోజంతా కూడా అకకి అకకియెవిచ్కి నిజంగానే ఎంతో విజయంతోనూ, వేడుకతోనూ గడిచిన రోజు. అతడు సంతోషభరిత మనస్కుడై ఇంటికి తిరిగివచ్చాడు. తన ఓవర్‌కోటు విప్పి దాన్ని జాగ్రత్తగా గోడకు తగిలించాడు. మరొక్కసారి ఆ గుడ్డనాణ్యతనూ, అంచుల్నీ ఆరాధనాపూర్వకంగా పరికించాడు. అప్పుడు తన పాత చిరుగుల కోటును తీసి పోల్చి చూశాడు. వాటి మధ్య తేడా ఎంత హాస్యాస్పదంగా అనిపించిందంటే, అతడు దాన్ని చూసి నవ్వకుండా ఉండలేకపోయాడు. సాయంకాలం మళ్లా భోజన సమయంలో కూడా అతడికి ఆ చిరుగులకోటు దుః స్థితి గుర్తుకురాగానే మరలా మరొక్కసారి నవ్వుకున్నాడు. సంతోషంగా భోజనం చేశాడు. భోజనానంతరం ఒక్క కాగితం కూడా నకలు రాయలేదు. చీకటి పడేదాకా కొంతసేపు  విశ్రాంతి తీసుకున్నాడు.  మళ్లా దుస్తులు తొడుక్కున్నాడు. ఓవర్‌ కోటు ధరించాడు. అప్పుడు వీథిలో అడుగుపెట్టాడు. దురదృష్టవశాత్తూ ఆ రోజు అతన్ని ఆహ్వానించిన గృహస్థు ఉండేదెక్కడో మేం గుర్తు చేసుకోలేకపోతున్నాం. మాకది జ్ఞాపకం రావడం లేదు. పీటర్స్ బర్గ్‌ లో ప్రతిఒక్కటీ ఇల్లు, వీథులు అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఎంతలా అతుక్కుపోయాయంటే, వాటి వివరాలు గుర్తు తెచ్చుకోవడం నిజంగానే చాలా కష్టమైన పని. ఒకటి మాత్రం స్పష్టం. సహాయముఖ్యగుమస్తా నగరంలో కొద్దిగా శ్రేష్ఠమైన తావునే నివసిస్తూ ఉండేవాడనీ, కాబట్టి అది  అకకి అకకియెవిచ్ పరిసరాలకు ఏమాత్రమూ దగ్గర్లో లేదనిమాత్రం చెప్పవచ్చు. అందువల్ల అతడు నిర్మానుష్యమైన అంతగా వెలుతురు లేని వీథుల్లో మొదట చాలా దూరమే నడవవలసి వచ్చింది. సహాయముఖ్యగుమస్తా నగరంలో ఉంటున్న ప్రాంతాన్ని అతడు సమీపిస్తున్నకొద్దీ వీథులు మరింత సజీవంగా, మరింత జనసమర్థంతో, మరింత దేదీప్యమానంగా కనిపించడం మొదలుపెట్టాయి. వీథుల్లో పాదచారులు కనబడటం మొదలయ్యింది. నవనాగరీకంగా దుస్తులు ధరించిన స్త్రీలు అతణ్ణి దాటి ముందుకు పోతున్నారు. కొందరు పురుషులు పెద్ద కాలర్లచొక్కాలు ధరించి కనబడ్డారు. పెద్ద పెద్ద చెక్కబళ్లు నడిపే మొరటుబండివాళ్లు కనిపించకుండా పోతూ వారి స్థానంలో ఎర్రని ముఖమల్‌ టోపీలు, లక్క నగిషీ చేసిన పెట్టెబళ్లు నడిపే చోదకులు కనబడటం మొదలయింది. వివిధ రంగుల్లో చిత్రితమైన పెట్టెల్తో ఉన్న శకటాలు వీథుల్లో మృదువుగా దూసుకుపోతున్నాయి. మంచు మీద వాటి రథచక్రాలు సాగుతున్న చప్పుడు వినవస్తున్నది.

ఈ నవజీవన సంపదను  అకకి అకకియెవిచ్ కన్నార్పకుండా చూశాడు. ఈ వీథుల్లో ఒక సాయంకాలంపూట అడుగుపెట్టి అతడికి ఎన్నో ఏళ్లయ్యింది. ఒక దుకాణంలో కాంతివంతంగా ఉన్న గవాక్షం ముందు నిలబడి అతడు కుతూహలంగా లోపలికి చూశాడు. అక్కడ ఒక చిత్రం కనిపించింది. అది ఒక అందమైన స్త్రీ తన పాదానికున్న బూట్లు తొలగిస్తున్న దృశ్యం. ఆమె చక్కని పాదం కనిపిస్తూ ఉంది. ఆమె వెనక గుమ్మం దగ్గర నిలబడి అందమైన చెంపలు, మీసాలు ఉన్న ఒక పురుషుడు ఆమెనే పరికిస్తున్నాడు. ఆ చిత్రం చూసి  అకకి అకకియెవిచ్ తలాడించి తనలోతానే నవ్వుకుంటూ మళ్లా తన దారిన ముందుకుపోయాడు. అతడు ఎందుకు నవ్వుకున్నాడు? తనకు బొత్తిగా అపరిచితమైన దాన్ని దేన్నో చూసినందువల్లనా? అంటే అటువంటిది చూసినప్పుడు ప్రతి మనిషీ సహజంగానే ప్రతిస్పందించినట్టే అతడు కూడా ప్రతిస్పందించాడా?  లేదా సాధారణంగా గుమస్తాలనుకున్నట్టే అతడు కూడా ఆ సమయంలో ‘చూడండి. ఆ ఫ్రెంచివాళ్ల బడాయి. ఏముంది అందులో చూడ్డానికీ? ఒకవేళ వాళ్లకు నిజంగా అదే ఇష్టమైతే, నిజానికి, అది..’. కాని బహుశా అతడదేమీ అలా ఆలోచించి ఉండిఉండడు. ఆ మాటకొస్తే, ఒక మనిషి మనస్సు చదివి, ఆ సమయంలో అతడు ఆలోచిస్తున్న ప్రతిఒక్కటీ ఎవరు మాత్రం తెలుసుకోగలరు? ఏమైతేనేం చివరికి అతడు ఆ సహాయముఖ్యగుమస్తా నివసిస్తున్న ఇంటికి చేరుకున్నాడు. ఆ ముఖ్య గుమస్తా చాలా చక్కటి పద్ధతిలో జీవిస్తున్నాడు. రెండవ అంతస్తులో ఉన్న అతడి ఇంటికి వెళ్లే మెట్ల దారిలో దీపం వెలుగుతూ ఉంది. ఆ ఇంటికి దారి తీసే వసారాలో అడుగుపెట్టగానే అక్కడ ఒక వరుసలో బూట్లన్నీ జాగ్రత్తగా అమర్చి ఉండడం అకకి అకకియెవిచ్ చూశాడు. హాలు మధ్యలో సమోవర్‌ ఉంది. ఆవిరిపొగలు చిమ్ముతూ చప్పుడు చేస్తూ ఉంది. గోడలమీద అన్నిరకాల ఓవర్‌కోట్లు, వస్త్రాలు వేలాడుతున్నాయి. వాటి మధ్యలో కొన్ని ఉన్నికోట్లు, ముఖమల్‌ కోట్లు కూడా కన్పిస్తున్నాయి. ఖాళీ గ్లాసులు, చక్కెర నింపిన గిన్నెలు, పానీయ కలశాలు తీసుకుని ఒక సేవకుడు హాలు అవతలివైపు తలుపు తెరుచుకుని వస్తూండగానే పక్కగదిలో వినిపిస్తున్న సంభాషణలధ్వని ఒక్కసారిగా స్పష్టంగా వినవచ్చింది. అంటే గుమస్తాలు అక్కడకు చేరి చాలాసేపే అయిందనీ, వాళ్లప్పటికే మొదటవిడత తేనీరు సేవించడం పూర్తయ్యిందనీ బోధ పడుతోంది. అకకి అకకియెవిచ్ తన ఓవర్‌కోటును తగిలించి గదిలో ప్రవేశించగానే అతడి ఎదుట ఒక్కసారిగా దీపాలు, గుమస్తాలు, పైపులు, పేకాట బల్లలు గోచరించాయి. అన్ని బల్లలదగ్గరా ఉధృతంగా జరుగుతున్న సంభాషణ, కుర్చీలు అటూఇటూ జరుపుతున్న చప్పుడు అతణ్ణి నివ్వెరపరిచాయి. గది మధ్యలో అతడు చాలా అప్రమత్తంగా ఆగిపోయాడు. తరువాత ఏం చేయాలా అన్న ఆలోచనలో పడ్డాడు. కానీ అప్పటికే వాళ్లతడ్ని చూసి సంతోషంగా స్వాగతం పలికారు. మళ్లా ఒకసారి వాళ్లంతా అతడి ఓవర్‌కోటు చూడ్డం కోసం తక్షణమే పక్కగదిలోకి వెళ్లారు. ఇదంతా చూసి అకకి అకకియెవిచ్ కొంత తొట్రుపాటుకు గురైనప్పటికీ సరళంగానే సహజస్వభావి కావడంవల్ల అతడి ఓవర్‌కోటుకు లభిస్తున్న ప్రశంసను చూసి తను కూడా సంతోషపడకుండా ఉండలేకపోయాడు. ఇక అప్పుడందరూ మామూలుగానే అతణ్ణీ, అతడి ఓవర్‌కోటునూ వదలిపెట్టి తిరిగిమళ్లా తమ పేకాటబల్లల దగ్గరకు వెళ్లిపోయారు. ఈ చప్పుడు, ఈ మాటలు, ఈ తొడతొక్కిడి ఇదంతా కూడా అకకి అకకియెవిచ్కి చాలా ఆశ్చర్యకారకంగా ఉంది. అతడికి ఎక్కడ నిలబడాలో, తన చేతులు, పాదాలు, తన తక్కిన శరీరమంతా కూడా ఎక్కడ సర్దుకోవాలో తేల్చుకోలేకపోయాడు. చివరికి అతడు పేకాటరాయుళ్ల పక్కన కూర్చున్నాడు. వాళ్ల చేతుల్లో పేకవైపూ, ఆ ఆటగాళ్ల ముఖాల వైపూ చూస్తుండిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆవులించాడు. అదంతా అతనికి కొద్దిగా విసుగెత్తిస్తున్నదని గుర్తించాడు. సాధారణంగా అతడు నిద్రకుపక్రమించే సమయం దాటిపోయి మరీ పొద్దుపోవడంతో అతడికి విసుగ్గా అనిపించింది. అతడు తనకు సెలవిప్పించమని ఆ గృహస్థును కోరుకున్నాడుకానీ, ఆ గృహస్థు అతణ్ణి వదల్లేదు. అతడి కొత్త ఓవర్‌కోటు గౌరవార్థం అతడు కూడా తమతోపాటు ఒక గ్లాసు షాంపేను తీసుకోకతప్పదని పట్టుపట్టాడు. ఆ తరువాత ఒక గంటకు విందు వడ్డించారు. పచ్చి కూరగాయముక్కలు, బేకరీనుంచి తెచ్చిన కేకులు, జున్ను, మాంసం, షాంపేను. అకకి అకకియెవిచ్తో వాళ్లు రెండుగ్లాసులు షాంపేను తాగించారు. ఆ తరువాత అతడికి ఆ విందు మరింత ఉల్లాసభరితంగా తోచింది. అయితే అప్పటికే అర్ధరాత్రి అయిందనీ, అతడు అప్పటికి చాలాసేపటి కిందటనే ఇంటికి చేరి ఉండవలసిందనీ కూడా మర్చిపోలేక పోయాడు.

తన విందు యజమాని తనను ఇంకా మరింతసేపు అట్టేపెట్టడానికి సాకులు వెతుక్కోకుండా అతడు నెమ్మదిగా ఎవరికంటా పడకుండా ఆ గదిలోంచి జారుకున్నాడు. తన ఓవర్‌కోటు తీసుకున్నాడు. శోచనీయమేమిటంటే, అది ఆ హాల్లో నేలమీద పడి ఉంది. దాన్ని తీసుకుని చేతుల్తో సాఫు చేశాడు. దానిమీద ఉన్న ప్రతిఒక్క దుమ్ముకణాన్ని జాగ్రత్తగా ఏరిపారేశాడు. అప్పుడు దాన్ని ధరించి మెట్లు దిగి వీథిలో అడుగుపెట్టాడు. వీథిలో దీపాలన్నీ ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. సాధారణంగా పనివాళ్లు ఇతరత్రా జనాలు కాలక్షేపం చేస్తుండే చిన్నచిన్న హోటళ్లు ఇంకా తెరిచిఉన్నాయి. మరికొన్ని మూసి ఉన్నప్పటికీ వాటి తలుపుల సందుల్లోంచి కాంతిరేఖలు కనబడుతూనే ఉన్నాయి. అంటే వాటి వెనక ఇంకా మనుషులు మేల్కొనే ఉన్నారన్నమాట. బహుశా ఆ దుకాణాల్లోపల వాళ్ల యజమానులకు తెలియకుండా ఇంకా పనివాళ్లు కథలూ, కబుర్లూ చెప్పుకుంటుండాలి. అకకి అకకియెవిచ్ సంతోషభరిత మనస్కుడై నడుస్తూఉన్నాడు. అతడు తన నడకవేగం పెంచబోతూండగా అతడి ముందు నడుస్తున్న ఒక స్త్రీ చాలా వేగంగా మెరుపులాగా దూసుకుపోయింది. అతడు తమాయించుకుని మళ్లా మునుపట్లానే నెమ్మదిగా నడకసాగిస్తూ, ఆమెను వెన్నాడాలన్నంత కోరిక తనలో ఎందుకు కలిగిందా అని ఆలోచనలో పడ్డాడు. ఇక నెమ్మదిగా అతడి ముందు నిర్జనవీథులు పరుచుకుని కనిపించాయి. అవి పగటిపూటనే వెలవెలపోయేవికాగా, ఇక రాత్రిపూట చెప్పేదేముంది. ఇప్పుడు అవి మరింత ఏకాంతంగా, మరింత శోభావిహీనంగా కనిపించాయి. వీథిదీపాలు కూడా మరింత కాంతిరహితాలయ్యాయి. వాటిలో చమురు అయిపోతోందని తెలుస్తూనే ఉంది. ఇక అప్పుడు పూరిళ్లు, కొయ్యకంచెలు ప్రత్యక్షమయ్యాయి. ఎక్కడా ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు. వీథుల్లో పడి ఉన్న మంచు మాత్రం మెరుస్తోంది. మూసేసిన తలుపులతో మరీ కిందకి వాలి ఉన్న ఇళ్ల కప్పులమీద సంతాపభరితంగా మంచుదుప్పటి కప్పి ఉంది. ఆ వీథి అట్లా ముందుకుపోయి పెద్ద కూడలిలో కలిసిపోయే చోటుకు అతడు చేరుకున్నాడు. అక్కడినుంచి ఇళ్లు చాలాదూరంలో ఉన్నందువల్ల ఆ కూడలి  పెద్ద ఎడారిలాగా కనిపిస్తూ ఉంది.

ఎంత దూరం నుంచో తెలియదుకానీ, బహుశా ప్రపంచపు ఆవలికొసన ఉన్నదా అనిపిస్తున్న ఒక పహరాస్థానం నుంచి పేలవెలుతురు వ్యాపిస్తూఉంది. అంతదాకా సంతోషభరితంగా ఉన్న అకకి అకకియెవిచ్ మనఃస్థితి ఒకింత కుంగిపోవడం మొదలయ్యింది. అతడు ఆ కూడలిలో అడుగుపెట్టాడే కానీ, లోపల ఏదో ఆరాటం కలుగుతూనే ఉంది. ఏదో దురదృష్టం అక్కడ పొంచి ఉందని అతడి హృదయం అతన్ని హెచ్చరిస్తోందా అన్నట్టు ఉంది. తన చుట్టూ ఆవరించిన ఓ సముద్రాన్ని చూస్తున్నట్టుగా అతడు తన పక్కకీ, వెనక్కీ తేరిపార చూశాడు. ‘వద్దు. అలా చూడటం మంచిదికాదు’ అనుకున్నాడతడు. అట్లా కళ్లు మూసుకునే ముందుకుసాగి కొంతదూరం పోయాడోలేదో అతడు కళ్లు తెరిచేటప్పటికి కూడలికి మరీ ఒక పక్కగా ఉన్నట్టు గుర్తించాడు. అతడి ఎదురుగా కొందరు గడ్డాలవాళ్ళు నిల్చున్నట్టు అనిపించింది. వాళ్లెవరో, ఏం చేస్తుంటారో అతడికి అర్థం కాలేదు. అతని కళ్లముందు ప్రతిఒక్కటీ అంధకారభరితంగా మారిపోయింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది. ‘ఈ ఓవర్‌ కోటు నాది’ అన్నాడొకడు ఆ కోటు కాలర్‌ చేజిక్కించుకుని పెద్ద గొంతుతో. పహరా కాస్తున్నవాణ్ణి సాయంకోసం పిలుద్దామని అకకి అకకియెవిచ్ నోరు తెరిచి అరిచేలోపల్నే, రెండవవాడు దాదాపుగా తన తలంత పరిణామంలో లావుగా ఉన్న పిడికిలి బిగించి అతడి ముఖంమీద గుద్దుతూ ‘ఏదీ, అరు చూద్దాం’ అని గుసగుసలాడాడు. వాళ్లు తనని వీపులో ఓ గుద్దు గుద్ది తన ఓవర్‌కోటు లాక్కొని పోతున్నట్టుగా మాత్రమే అకకి అకకియెవిచ్కి అర్థమయింది. అతడు ఆ మంచులో బొక్కబోర్లా పడిపోయాడు.

కొద్దిసేపటికి అతడికి తెలివివచ్చింది. లేచి నిల్చున్నాడు. ఎక్కడా ఎవరూ కన్పించలేదు. ఓవర్‌కోటు లేకపోవడంతో చలికి ఒక్కసారిగా వణుకుపోయాడు. గట్టిగా అరవడం మొదలుపెట్టాడు కానీ, అతడి బలహీన కంఠస్వరం ఆ కూడలి దాటి ముందుకుపోలేదు. నిస్పృహతో అట్లా అరుస్తూనే అతడు కూడలికి అడ్డం పడి ఆ పహరా స్థానం వైపు పరుగెత్తడం మొదలెట్టాడు. అక్కడ పహరా కాసేవాడు తన చేతికర్రకు ఆనుకుని దూరంనుంచి అరుచుకుంటూ తన వైపు పరిగెత్తుకువస్తున్న ఈ దెయ్యం ఎవరా అని చూడ్డానికి మెడ ముందుకు రిక్కించాడు. అకకి అకకియెవిచ్ అతడి దగ్గరకు వచ్చి ఒక మనిషి కళ్లెదుటే దోచుకోబోతుంటే ఆ పహరావాడు పట్టించుకోకుండా నిద్రపోతున్నాడనీ ఫిర్యాదు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ పహరావాడు తానేమీ చూడలేదనీ, అతణ్ణి ఎవరో ఇద్దరు మనుషులు కూడలి మధ్యలో ఆపడం కనిపించిందనీ, బహుశా వాళ్లతడి స్నేహితులే అయి ఉండొచ్చనీ తాననుకున్నానని చెప్పాడు. తనను అనవసరంగా ఈ రాత్రి తూలనాడేబదులు  పొద్దున్నే తన పై అధికారిని కలిసి ఫిర్యాదుచేస్తే అతడు ఆ అంశాన్ని పరిశోధించగలడనీ, అతని ఓవర్‌కోటు ఎవరు దొంగిలించారో వెతికి పట్టుకోగలరనీ చెప్పాడు. అకకి అకకియెవిచ్ ఏదో పెద్ద అఘాతానికి గురయినవాడిలా  తన ఇంటికి పోయే దారి పొడుగునా  కాళ్లీడ్చుకుంటూ పోయాడు. అతడి చెంపలమీద, తలవెనగ్గా ఎత్తుగా పెరిగిన జుత్తు పూర్తిగా చెదిరిపోయింది. అతడి గుండె, పక్కలు, పాంటూ మంచుకు తడిసిపోయాయి. అతడి ఇంటి యజమానురాలు ముసలామె. ఎవరో తన ఇంటితలుపు అదే పనిగా బాదుతున్న చప్పుడు విని ఒక్క ఉదుటన పక్కమీంచి లేచి ఒక్క కాలునే  ఒక్క చెప్పు వేలాడుతుండగా తన రాత్రిగౌనుతో తన వక్షస్థలాన్ని జాగ్రత్తగా కప్పుకొని తలుపు తెరిచింది. కానీ తలుపు తెరుస్తూనే తన ఎదుట అటువంటి స్థితిలో కనిపించిన అకకి అకకియెవిచ్ని చూసి నిర్ఘాంతపోయి, ఒక్కడుగు వెనక్కు వేసింది. అతడు ఏం జరిగిందో ఆమెకు చెప్పేటప్పటికి ఆమె తన చేతులు పిసుక్కుంటూ అతణ్ణి వెంటనే జిల్లా సూపర్నెంటు దగ్గరికి పొమ్మని చెప్పింది. పహరాదళపతి ఏమీ చేయలేడనీ, ఫిర్యాదు చేసినా వెంటనే మర్చిపోతాడనీ కాబట్టి వెంటనే సూపర్నెంటును కలవడం మంచిదనీ చెప్పింది. ఒకప్పుడు తన దగ్గర వంటమనిషిగా పనిచేసిన ఫిన్నిష్‌ మహిళ అన్నా ఇప్పుడు జిల్లా సూపర్నెంటు ఇంట్లో పనిచేస్తోందనీ, అందువల్ల సూపర్నెంటుతో కూడా తనకి పరిచయం ఉందనీ, అతడు తన ఇంటిమీదుగా పోతున్నప్పుడు చాలాసార్లు  అతణ్ణి చూసిందనీ, అతడు ప్రతి ఆదివారం చర్చిలో ప్రార్థనలు చేస్తుంటాడనీ, అందరిపట్లా చాలా ఉదారంగా ఉంటాడనీ, తాను గ్రహించినదాన్నిబట్టి అతడు మంచిమనిషే అయి ఉండొచ్చనీ కూడా అంది. ఆమె ఇస్తున్న సలహాను దుఃఖపూరితంగా స్వీకరించి అకకి అకకియెవిచ్ నెమ్మదిగా మెట్లు ఎక్కి తన గదిలో ప్రవేశించాడు – ఇక ఆ రాత్రి అతను ఎలా గడిపి ఉంటాడన్నది మరొకరిలోకి పరకాయ ప్రవేశం చేసి తెలుసుకోగలిగినవాళ్లు మాత్రమే ఊహించగలరు.

తెల్లవారగానే అతడు చేసిన మొదటి పని జిల్లా సూపర్నెంటును చూడ్డానికి పోవడం. కాని అక్కడి గుమస్తాలు అతడింకా నిద్రపోతున్నాడని చెప్పారు. దాంతో అతడు మళ్లా పదింటికి వెళ్లాడు. అప్పటికి కూడా అతడింకా నిద్రపోతున్నాడనే చెప్పారు. పదకొండు గంటలకి వెళ్లాడు. అప్పుడు వాళ్లు ‘సూపర్నెంటుగారు ఇంట్లో లేరు’ అని చెప్పారు. మధ్యాహ్న భోజన సమయంలో గుమస్తాలు అతణ్ణి లోపలికిపోనీయకుండా అతడు అక్కడ ఎందుకు ఉన్నాడు, ఏ పని మీద వచ్చాడు? అదంతా ఎలా జరిగిందీ, మొదలైందంతా చెప్పాలని గట్టిగా అడిగారు. దాంతో జీవితంలో కనీసం ఒక్కసారి కొంత దృఢనిశ్చయంతో అకకి అకకియెవిచ్ జిల్లా సూపర్నెంటును తను వ్యక్తిగతంగా కలుసుకోవాలనీ,  వాళ్లు అతణ్ణి ఆపడం సరైంది కాదనీ, అతడు న్యాయశాఖనుండి వచ్చాడనీ, ఇప్పుడు అతణ్ణి ఆపితే రేపతడు ఆ సంగతి పైవాళ్ళకి చెప్తే ఆపినవాళ్లు ఇబ్బంది పడవలసిఉంటుందనీ చెప్పాడు. దాంతో గుమాస్తాలు అతడి ఆగ్రహానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. వాళ్లల్లో ఒకతను జిల్లా సూపర్నెంటును పిలవడానికి వెళ్లాడు. కోటు ఎట్లా దొంగిలించబడిందో ఆ అసాధారణమైన విచిత్రకథను జిల్లా సూపర్నెంటు విన్నాడు. ఆ వ్యవహారంలో ముఖ్యమైన విషయాలు విచారించడానికి బదులు అతడు అకకి అకకియెవిచ్నే ప్రశ్నించడం మొదలుపెట్టాడు: ‘అసలు అతడు ఇంటికి అంత ఆలస్యంగా ఎందుకు వచ్చాడు? అతడేదన్నా మద్యశాలకో, జూదశాలకో పోతున్నాడా? లేక తిరిగివస్తున్నాడా?’ – ఆ ప్రశ్నలకి అకకి అకకియెవిచ్ పూర్తిగా అయోమయానికి లోనై తన ఓవర్‌ కోటు సంగతి వాళ్లు పట్టించుకుంటున్నారో, లేదో తెలుసుకోకుండానే అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ రోజంతా కూడా అతడు తన కార్యాలయం సమీపానికి కూడా పోలేదు (అటువంటిది అతని జీవితంలో మొదటిసారి). మరుసటిరోజు అతడు బొత్తిగా కళావిహీనంగా తన పాత చిరుగుల కోటుతోనే ప్రత్యక్షమయ్యాడు. ఈ లోగా అది మరింత అసహ్యంగా తయారయింది. అతడి ఓవర్‌ కోటు దొంగిలించబడిందన్న వార్త చాలా మంది గుమస్తాల హృదయాల్ని కదిలించివేసింది. అప్పటికి ఈ సందర్భంలో కూడా అకకి అకకియెవిచ్నే ఏడిపించే అవకాశం వదులుకోడానికి సిద్ధంగాలేనివాళ్లు కొందరు లేకపోలేదు. కానీ వాళ్లంతా అతడి కోసం వెంటనే చందాలు పోగుచేయాలనుకున్నారు. కానీ పోగైంది చాలా కొద్దిమొత్తం మాత్రమే. ఎందుకంటే అప్పటికే గుమస్తాలు డైరక్ట్‌గారికి క్రిస్‌మస్‌ కానుకలు నిమిత్తం చాలా పెద్ద మొత్తమే పోగుచేశారు. ఆ సలహా ఇచ్చింది కూడా ఈ రచయిత మిత్రుడూ, డివిజన్‌కు అధిపతి. అతని సలహా మేరకు ఓ చక్కని చిత్రలేఖనం, పుస్తకం కొన్నారు. దాంతో ఇప్పుడు కొద్దిపాటి మొత్తం మాత్రమే పోగుచేయగలిగారు. వాళ్లల్లో ఒకతడు అతడి పట్ల కలిగిన జాలితో అతడికి ఎంతోకొంత సహాయపడాలని కనీసం చక్కని సలహా అయినా ఇవ్వాలని అనుకున్నాడు. దాంతో అతణ్ణి తిరిగి సిపాయిల దళపతి దగ్గరికి వెళ్లవద్దని మాత్రం చెప్పాడు. ఆ దళపతి తన ఉన్నతాధికారులను మెప్పించే ప్రయత్నంలో ఏదోఒక రకంగా ఓవర్‌కోటును కనుగొన్నా కూడా అది అతడిదేనని నిరూపించలేనంతకాలం దాన్ని పోలీసు కస్టడీలోనే ఉంచేసేప్రమాదం లేకపోలేదని చెప్పాడు. అందుకని అతడు ఫలానా మనిషిని, ఆ మనిషి చాలాముఖ్యమైన వ్యక్తి అనీ, కలవడం మంచిదనీ, ఆ చాలాముఖ్యమైన వ్యక్తి సరైన వాళ్లతో సరైన రీతిలో వ్యవహరించి విషయాన్ని తొందరగా పరిష్కరించగలుగుతాడనీ చెప్పారు.  వేరే గత్యంతరం లేక అకకి అకకియెవిచ్ ఆ ఫలానా ముఖ్యమైన వ్యక్తిని పోయి కలవాలనుకున్నాడు. ఈ చాలాముఖ్యమైన వ్యక్తి ఆధికారిక హోదా ఏమిటో ఒక చిదంబర రహస్యం. ఈ చాలాముఖ్యమైన వ్యక్తి ఈ మధ్యనే చాలా ముఖ్యమైన వ్యక్తి అయ్యాడనీ, అతడంతకు ముందు చాలాముఖ్యమైన వ్యక్తి కానేకాడనీ పాఠకుడు తెలుసుకొనితీరాలి. అంతేకాక, అతడికంటే మరింత ముఖ్యమైన వ్యక్తులతో పోలిస్తే అతడి ప్రస్తుత తాహతుకూడా మరీ అంత ముఖ్యమైందేమీ కాదు. అయితే తక్కిన వాళ్ల దృష్టిలో మరీముఖ్యంగా కనిపించంది తమవరకూ తమకు ముఖ్యంగా కనిపించే మనుషులు లేకపోలేదు. అతడు తన ప్రాముఖ్యతను పెంచుకోవడం కోసం చాలా రకాలుగా కష్టపడిన మాట నిజమే. అతడు కార్యాలయంలో అడుగుపెడుతున్నప్పుడు గుమస్తాలు అతడిని మెట్లమీద మాత్రమే కలుసుకోవాలంటాడు. అతడిని ఎవరూ నేరుగా పోయి కలుసుకునే అవకాశం లేదు. ఆ విషయంలో కచ్చితమైన పద్ధతులు పాటిస్తూంటాడు. అత్యంత ఉన్నత కార్యదర్శి ఏదైనా అతడికి చెప్పవలసి ఉంటే, ముందు ప్రభుత్వకార్యదర్శికి చెప్తాడు. ప్రభుత్వకార్యదర్శి విభాగాధిపతికి చెప్తాడు. ఆ విభాగాధిపతి తన వరుసలో తన తరువాతి మనిషి ఎవరో అతడికి చెప్తాడు. అన్ని వ్యవహారాల సమాచారమూ అతడికి ఈ పద్ధతిలోనే చేరుతుంది. పవిత్ర రష్యాలో ప్రతి ఒక్కటీ అనుకరణశాపగ్రస్తమే. ప్రతి మనిషి తన ఉన్నతాధికారికి అడుగులకు మడుగులొత్తుతూ అతడి ప్రతి హావభావాన్నీ తను కూడా అనుకరిస్తూ ఉంటాడు. ఒక విభాగాధిపతికి సంబంధించిన కథ ఒకటి ఈ విషయంమీద ప్రచారంలో ఉంది. అతణ్ణి చిన్న ప్రత్యేక కార్యాలయానికి అధిపతిని చేయగానే అతడు చేసిన మొదటిపని తన కార్యాలయగదిని రెండు భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని అతిథులు వేచి ఉండే గదిగా మార్చేశాడు. ఆ గుమ్మం దగ్గర ఒక బిళ్లబంట్రోతును పెట్టాడు. అక్కడ  రాసుకునే బల్ల తప్ప మరేదీ ఉండకపోయినా, ఆ బిళ్లబంట్రోతు తన అధికారికోసం ఎవరు వచ్చినా వాళ్లని ఆ అతిథుల గదిలోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టేవాడు. ఈ చాలా ముఖ్యమైనవ్యక్తి యొక్క అలవాట్లు, పద్ధతులు చాలా అట్టహాసంగా కొట్టొచ్చినట్టుగా డాంబికంగా ఉండేవి. అతడు పాటించే పద్ధతిలో అత్యంత కీలకాంశం జాగ్రత్త. ‘జాగ్రత్త, జాగ్రత్త, మరింత జాగ్రత్త!’ అనేవాడతడు తరచూ. ఆ చివరి మాట అంటున్నప్పుడు అతను తనెవరితో మాట్లాడుతున్నాడో అతని కళ్లల్లోకి గుచ్చిగుచ్చి చూసేవాడు. నిజానికి అట్లా చూడవలసిన అవసరమే లేదు. అతడి మొత్తం కార్యాలయం సిబ్బంది పది పన్నెండుమందికి మించి ఉండరు. వాళ్లు అతణ్ణి చూసి ఎంత వణికిపోయేవారంటే అతడు వస్తున్నట్లు కనిపించగానే ఎక్కడివాళ్లక్కడ తమ పని వదలిపెట్టి లేచి నుంచొని అతడు ఆ గదినుంచి వెళ్లేదాకా అట్లానే నిలబడిపోయేవారు. అతడు తన కింది ఉద్యోగులతో మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా ఆ మాటలు కాఠిన్యంతో ప్రతిధ్వనించేవి. వాటిలో ఎప్పుడూ సాధారణంగా మూడు ప్రశ్నలే ఉండేవి. ‘నీకెంత ధైర్యం?’, ‘నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా?’, ‘నేనెవరో అర్థమవుతోందా నీకు?’ అని. కాని మామూలుగా అతడు చాలా దయార్ద్రహృదయుడు. సానుకూలమైన మనిషి. తన స్నేహితుల అవసరాలు తీర్చడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండేవాడు. కాని అతడు పదోన్నతి పొందగానే పూర్తిగా పాడైపోయాడు. తన నియామక ఉత్తర్వులు అందుకోగానే అతడు పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. తను ఎలా ప్రవర్తించాలో అర్థం కాలేదతడికి. తనతో  సమానులైన ఉద్యోగులతో ఉన్నప్పుడు అతడు నిజంగానే చాలా మంచిమనిషిగా ఉండేవాడు. చాలా విషయాల్లో చాలా చక్కగా ప్రవర్తించేవాడు. మూర్ఖత్వముండేదికాదు. కానీ అదే తన కన్నా ఒక్క హోదా తక్కువైన మనుషులతో కలవవలసి వచ్చినప్పుడు మాత్రం ఎలా ప్రవర్తించాలో అతనికెంతమాత్రం తెలిసేదికాదు. దాంతో ముందు మౌనం వహించేవాడు. ఒక్కొక్కప్పుడు అతని ప్రవర్తన జాలి గొలిపేదిగా కూడా ఉండేది. తను చక్కబెట్టవలసిన చాలా ముఖ్యమైన వ్యవహారాలు మరెన్నో ఉన్నాయి అనుకుంటున్నందువల్ల అతడెవరిపట్లా ఆసక్తి చూపేవాడు కాదు. ఒక్కొక్కప్పుడు ఏదైనా ఆసక్తికరమైన సంభాషణలో పాలుపంచుకోవాలనో, లేదా ఏదన్నా బృందంలో కలవాలనే కోరిక అతని కళ్లల్లో మెరిసేది. కానీ అది తనస్థాయిని మరీ దిగజార్చుకున్నట్టు అవుతుందనో లేదా తన కింది ఉద్యోగులు తనతో మరీ చనువు చూపిస్తారనో భయపడి వెనక్కి తగ్గేవాడు. ఇలాంటి ఆలోచన వల్ల అతడు నిశ్శబ్దంగా, ఒంటరిగా కూర్చొండిపోయేవాడు. ఎప్పుడైనా ఒకటీఅరా ముక్తసరిగా మాటలు మాట్లాడినా మొత్తంమీద భరించలేని మనిషిగానే పేరు పొందాడు.

ఈ చాలాముఖ్యమైన వ్యక్తినే అకకి అకకియెవిచ్ వెళ్లి కలిశాడు. తన మొత్తం సమస్యనంతా వివరించాడు. కాని అది అతడికి అత్యంత అననుకూలమైన సమయం. చాలా దురదృష్టకరమైన సమయం. కానీ ఆ చాలా ముఖ్యమైన వ్యక్తి జీవితంలో అది అతడికి ఉల్లాసభరితమైన సమయం కూడా. ఎందుకంటే అప్పుడు ఆ చాలా ముఖ్యమైన వ్యక్తి తన అధ్యయన మందిరంలో కూర్చొని తన చిన్ననాటి మిత్రుడొకడితో సంతోషంగా కబుర్లు చెబుతున్నాడు. ఆ చిన్ననాటి మిత్రుణ్ణి అతడు ఎన్నో ఏళ్లుగా చూడనేలేదు. అతడు ఇటీవలే కనిపించాడు. ఈ సంభాషణ మధ్యలో ఎవరో బస్మష్కిన్‌ అనే అతడు అతణ్ణి చూరగోరుతున్నాడని వచ్చి చెప్పాడు. అతడు తన సంభాషణ మధ్యలో ఆపి ‘ఎవరతను?’ అని అడిగాడు. ‘ఎవరో గుమస్తా’ అన్నారువాళ్లు. ‘మంచిది. కొద్దిసేపు ఆగమనండి. ఇది గుమస్తాలను చూసే సమయం కాదు’ అన్నాడు ఆ చాలాముఖ్యమైన వ్యక్తి. ఈ సందర్భంలో గమనించ వలసిందేమిటంటే, ఆ చాలాముఖ్యమైన వ్యక్తి నిజానికి అబద్ధమాడుతున్నాడు. అతడు తన పాతస్నేహితుడితో చెప్పుకోవలసిన కొత్తవార్తలన్నీ ఇప్పటికే పూర్తిగా చెప్పేసుకున్నాడు. ఇక వాళ్ల సంభాషణలో గత కొంత సేపటిగా సుదీర్ఘ నిశ్శబ్ధాలు మాత్రమే కొనసాగుతున్నాయి. అట్లాంటి నిశ్శబ్ధాల్లో వాళ్లు ఒకరినొకరు తట్టుకుంటూ, ‘అయితే ఏమంటావు? ఇవాన్‌ అబ్రమోవిచ్‌’ అంటే మరొకరు ‘అంతే అనుకుంటాను, స్టెఫాన్‌ వర్లమోవిచ్‌’ అని అనుకుంటున్నారు. అయినా కూడా అతడు ఆ గుమస్తా తన కోసం వేచి ఉండవలసిందే అనే ఆజ్ఞాపించాడు. అతని స్నేహితుడు ప్రభుత్వసర్వీసునుండి పదవీ విరమణ చేసి గత కొంతకాలంగా ఎక్కడో గ్రామసీమల్లో నివసిస్తున్నాడు. అతడికి తాను గుమస్తాలను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నట్లుగా చూపించడం కోసం చాలా ముఖ్యమైన వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించాడు. మొత్తానికి మాట్లాడుకోవలసినదంతా మాట్లాడుకున్నాక, ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేకపోయాక ఎవరి మేరకు వారు పూర్తిగా మౌనం అనుభవించాక హాయిగా వెనక్కి వాలి సౌకర్యవంతమైన పడకకుర్చీలో పూర్తిగా చుట్ట కాల్చుకున్నాక, అప్పుడతడికి ఆ గుమస్తా హఠాత్తుగా గుర్తుకొచ్చాడు. తలుపుదగ్గర కాగితాలబొత్తితో వేచిఉన్న తన సహాయకుడితో ‘అక్కడ ఎవరో గుమస్తా నిలుచున్నట్లుంది. అతణ్ణి లోపలకి రమ్మను’ అన్నాడు. అకకి అకకియెవిచ్ దీనరూపాన్నీ, మురికిదుస్తుల్నీ ఎగాదిగా చూశాక అతడు అతడిపట్ల కటువుగా చూస్తూ, ‘ఏం కావాలి నీకు?’ అని అడిగాడు. అలా అడిగినప్పుడు అతడి కంఠంలో ధ్వనించిన కాఠిన్యం మామూలుగా వచ్చింది కాదు.  ప్రస్తుతఉద్యోగంలో చేరడానికి వారంరోజుల ముందు అతడు ఒంటరిగా తన గదిలో అద్దం ముందు నిలబడి అలా మాట్లాడ్డం అలవాటు చేసుకున్నాడు. అప్పటికే భయంతో వణుకుతున్న అకకి అకకియెవిచ్ పూర్తిగా అయోమయానికి గురయ్యాడు. దాంతో అతడు అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని వివరించగలిగినంత వివరించాడు. తన ఓవరుకోటు సరికొత్తదనీ, దాన్ని అత్యంత అమానుషంగా దోచుకున్నారనీ కాబట్టి జిల్లా సూపర్నెంటుతోగానీ, మరెవరితోనైనా చెప్పి తన ఓవర్‌కోటు తనకు వెదికిపెట్టడం కోసం అతడి సహాయం కోరవచ్చాననీ విన్నవించుకున్నాడు. అలా చెప్పడంలో ‘అది’, ‘ఇది’ లాంటి నిరర్థకశబ్దాలు మామూలుకన్నా ఎక్కువగా ఉపయోగించకపోలేదు. ఏ కారణం చేతనో అతడు అట్లా నెంగిరిగా మాట్లాడుతున్న పద్ధతి ఆ చాలాముఖ్యమైన వ్యక్తికి చాలా పరిచితంగా తోచింది. ‘ఏమిటిసార్‌ ఇదంతా’ అన్నాడతడు కఠినంగా. ‘నీకు పద్ధతి తెలియదా? ఎక్కడనుంచి వచ్చావునువ్వు? ఇలాంటి విషయాల్లో ఏం చేయాలో తెలియదా? దీనిగురించి ముందు నువ్వు కోర్టులో ఒక ఫిర్యాదు దాఖలు చేయాలి. అప్పుడది ఆ గుమస్తానుంచి శాఖాధిపతికి వెళ్తుంది. అక్కడనుంచి విభాగాధిపతికి వెళ్తుంది. అక్కడనుంచి కార్యదర్శికి. ఆ కార్యదర్శి అప్పుడది నా దృష్టికి తీసుకువస్తాడు…’

‘కానీ మహాప్రభూ!’ అన్నాడు అకకి అకకియెవిచ్. అప్పటికే అతని ఒళ్లంతా చెమటపట్టింది. నెమ్మదిగా మాటలు కూడదీసుకున్నాడు. ‘నేను, మారాజా! అది… మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుందేమోననీ, ఎందుకంటే కార్యదర్శులు… అది… వాళ్లనంతగా నమ్మలేం…’

‘ఏమిటి? ఏమిటి? ఏమిటి?’ అని అరిచాడు చా.ము.వ్య (చాలాముఖ్యమైన వ్యక్తి). ‘ఎక్కడనుంచి వచ్చిందీ ఆలోచన నీకు? ఇలాంటి మాటలు మాట్లాడే అధికారమెక్కడిది? మీలాంటి యువకులు మీ ఉన్నతాధికారుల పట్ల ఇలాంటి అమర్యాద చూపించవచ్చా?’. అకకి అకకియెవిచ్ అప్పటికే తన ఏభయ్యో పడిలో ప్రవేశించాడని ఆ చా.ము.వ్య బహుశా గమనించకపోయి ఉండవచ్చు. అయినా అతణ్ణి అతడు యువకుడు అంటున్నాడంటే, అది మరెవరో డబ్బై ఏళ్ల వాళ్లతో పోల్చి అంటున్నమాటే అనుకోవాలి. ‘నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నేనెవరినో అర్థమవుతోందా? గ్రహిస్తున్నావా? నువ్వది గ్రహిస్తున్నావా? తెలుస్తోందా నీకు?  నిన్నే! అడుగుతున్నాను చెప్పు?’ అన్నాడతడు. తన పాదాన్ని గట్టిగా నేలమీద చరిచాడు. గొంతు ఎంత పెద్దది చేశాడంటే, అకకి అకకియెవిచ్ కన్నా ధైర్యవంతుడు అయిన మనిషి కూడా ఆ అరుపులకు తప్పక బెదరిపోయుండేవాడు. అకకి అకకియెవిచ్కి పూర్తిగా మతిపోయింది. అతడి శరీరమంతా వణికిపోయింది. నిలబడలేకపోయాడు. తూలి పోయాడు. అక్కడి పనివాళ్లు అతణ్ణి పట్టుకోకపోయి ఉండిఉంటే, అక్కడే నేలమీద కుప్పకూలి ఉండేవాడు. అతడట్లా దాదాపుగా స్పృహతప్పి పరిస్థితులో ఉండగా వాళ్లు అతణ్ణి బయటకి తీసుకుపోయారు. కానీ ఆ చా.ము.వ్య తను ఊహించినదానికన్నా తన ప్రభావం అంత బాగా పనిచేసినందుకు చాలా సంతోషపడ్డాడు. కేవలం తన కంఠస్వరమే ఒక మనిషిని స్పృహ తప్పేట్టుగా చేయగలిగిందన్న ఆలోచన అతణ్ణి మత్తెక్కించింది. దాంతో తన స్నేహితుడు అదంతా ఎట్లా గ్రహిస్తున్నాడో చూడడానికా అన్నట్టు అతణ్ణి ఓరకంట గమనించాడు. అయితే అతడి పాతమిత్రుడు అప్పటికే కొంత ఇబ్బంది పడుతూ కొంత వణుకుతున్నట్లు కూడా అనిపించడంతో మరింత సంతోషం అనుభవించకుండా ఉండలేకపోయాడు.

తను ఆ మెట్లు ఎలా దిగిందీ, వీథిలోకి ఎలా అడుగుపెట్టిందీ అకకి అకకియెవిచ్కి గుర్తులేదు. అతడి చేతులూ, కాళ్లూ తిమ్మిరెక్కిపోయినట్టనిపించింది. అతడి జీవితంలో ఒక ఉన్నతాధికారి దగ్గర అది కూడా, తన శాఖకిచెందని మరో శాఖాధికారి దగ్గర, అంతగా చీవాట్లు తిన్నదెప్పుడూ లేదు. వీథుల్లో రొద పెడుతున్న మంచుతుపానుమధ్య అతడు నోరు తెరుచుకుని అటూఇటూ జారిపోతూ అట్లా వీథులకడ్డం పడి నడుచుకుంటూ పోయాడు. సాధారణంగా పీటర్స్‌ బర్గ్‌ లో వీచే తరహాలోనే గాలి అన్నిదిక్కులా ప్రతి దిక్కునుండీ రొద పెడుతూ అతణ్ణి నాలుగువైపులా నెట్టుకుంటూ పోతూఉంది. కొద్దిక్షణాల్లోనే అది అతడి గొంతులో రాచుకుంటూ చొరబడింది. దాంతో అతడు ఇంటికి చేరేటప్పటికి ఒక్క మాట కూడా పలకలేకపోయాడు. ముఖం, గొంతు ఎర్రగా ఉబ్బిపోయి చివరికతడు ఎట్లానో పక్కమీద వాలాడు. ఆ చా.ము.వ్య అతణ్ణి  గద్దించిన దాని ప్రభావం అతనిమీద అంత బలంగా  పనిచేసింది!

ఆ మరుసటి రోజు అతడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. మన పీటర్స్‌బర్గ్‌ వాతావారణం మరింత ఉదారంగా సాయపడిందేమో అతడి అనారోగ్యం ఎవరూ ఊహించనంతగా పెరిగింది. చివరికి డాక్టర్‌ వచ్చి  నాడి చూసేటప్పటికి తడిగుడ్డ వత్తడం తప్ప మరేమీ చేయగలిగిందేమీ లేదని తేల్చేశాడు. అది కూడా ఎందుకంటే, ఆ రోగికి సరైన వైద్యం దక్కలేదని ఎవరూ అనకుండా ఉండడానికి మాత్రమే. రోగి మరొక 36 గంటలకు కన్నా ఎక్కువ బతకడం అసాధ్యమని కూడా అతడు తేల్చేశాడు. ఇక అప్పుడు ఇంటి యజమానురాలు వైపు తిరిగి, ‘చూడమ్మా, ఆట్టే సమయం వృథా చేయకుండా తొందరగా ఒక  శవపేటిక తయారుచేయించండి. ఓక్‌చెట్టు చెక్కయితే మరీ ఎక్కువ ఖరీదు చెయ్యదు’ అన్నాడు. విధి అనుల్లంఘ్యంగా ఇస్తున్న ఈ తుదితీర్పును అకకి అకకియెవిచ్ విన్నాడా? ఒకవేళ అతడికి అది అర్థమయితే అది అతడిమీద ప్రగాఢప్రభావం చూపించిందా? జీవితవిషాదాన్ని తలచుకుని అతడు విలపించాడా? మనమేమీ చెప్పలేం. అతడు తన దారుణమైన జ్వరంతో అట్లానే అల్లాడాడు. అతడి కళ్లముందు ఏవేవో భ్రమాన్విత దృశ్యాలు కదలాడడం మొదలెట్టాయి. ప్రతిఒక్క దృశ్యమూ గడచిన దృశ్యంకన్నా మరింత కొత్తగా విచిత్రంగా ఉండేది. మొదటిదృశ్యంలో అతడు పెట్రోవిచ్‌ని చూశాడు. అతణ్ణి ఒక ఓవర్‌కోటు తయారుచేయమని అడిగాడు. తన మంచంకింద దాక్కున్న దొంగల్ని పట్టుకోవడానికి వీలుగా ఆ కోటుకు బొందులు కుట్టమని అడిగాడు. తరువాత, తను కొత్త ఓవర్‌కోటు కొనుక్కొన్నాక కూడా ఆ పాత చిరుగుల కోటు గోడని ఎందుకు వేలాడుతుందని అడిగాడు. అప్పుడతడు ఆ చా.ము.వ్య నిల్చున్నట్టు,  తనని దారుణంగా దూషిస్తున్నట్టు,  అప్పుడతడు, ‘నన్ను క్షమించండి మారాజా’ అని ప్రార్థిస్తున్నట్టు కలగన్నాడు. చివరికి అతడు కూడా శపించడం మొదలుపెట్టాడు. ఎటువంటి భయానక పదజాలం వాడాడంటే అతడి ఇంటి యజమానురాలు, ఆ వృద్ధురాలు పదేపదే లెంపలు వేసుకుంటూ తన జీవితంలో తనెన్నడూ అతడినుంచి అట్లాంటి పదాలు వినలేదని మొత్తుకుంటూ ఉంది. ఇంకా దారుణమేమిటంటే, అతడు ప్రతిసారీ మారాజా! అంటున్నప్పుడల్లా ఆ మాట వెనకే భరించలేని ఆ శాపాలు కూడా కుమ్మరిస్తుండడం. ఆ తరువాత ఏమాత్రం అర్థంలేని ప్రేలాపన మొదలుపెట్టాడు. కాని ఒకటిమాత్రం స్పష్టంగా ఉంది. అతడి అన్నిరకాల అసంబద్ధ పదాలు, ఆలోచనలు అన్నివేళలా తిరిగి తిరిగి అతడి ఓవర్‌కోటు దగ్గరికే వచ్చి చేరుతుండడం. ఏమైతేనేం చివరికి నిర్భాగ్యుడైన అకకి అకకియెవిచ్ తన తుదిశ్వాస విడిచాడు. అతడు మరణించిన తరువాత అతడికి వారసులెవరూ లేకపోవడం చేత, అసలు వారసత్వంగా ఎవరికీ ఏదీ అందించడానికి కూడా ఏమీ లేకపోవడంచేత అతడి గదిని ఎవరూ ఆధికారికంగా వశపరుచుకోలేదు. అక్కడ ఉన్నదల్లా ఒక గుప్పెడు బాతుయీకలు, ఒక రీము తెల్లకాగితం, మూడు జతల సాక్సు, అతడి పంట్లాంనుండి ఊడిపోయిన రెండు మూడు బొత్తాలు, ఇక పాఠకుడికి బాగా పరిచితమైన ఆ పాత చిరుగులకోటు, ఇంతే. ఈ ఐశ్వర్యం ఎవరి వశం కాగలదో దేవుడికే తెలియాలి. అసలు ఈ కథ చెప్పడానికి పూనుకున్న మనిషికి కూడా ఈ విషయంలో ఏ మాత్రం ఆసక్తిలేదని కూడా ఒప్పుకోవాలి. అకకి అకకియెవిచ్ని తీసుకుపోయి పాతిపెట్టారు. అతడు లేకుండానే పీటర్స్‌బర్గ్‌ యథావిథిగా కొనసాగుతూనే ఉంది. అసలు అటువంటి మనిషి ఎప్పుడూ జీవించి ఉండనట్టే తనపని తాను చేసుకుపోతూ ఉంది. ఈ లోకంలోకి ఒక మనిషి ప్రవేశించి నిష్క్రమించాడు. అతడి జీవితకాలంలో అతడెవరి సంరక్షణకూ నోచుకోలేదు. ఎవరి రక్షణా దొరకలేదు. అసలు అతడు ఎవరికీ అక్కరలేదు. ఒక శాస్త్రజ్ఞుడు గాలిలో ఎగిరే ఈగనొకదాన్ని సూదికి గుచ్చి తన మైక్రోస్కోపుకింద పరీక్షిస్తాడు చూడండి, ఆ పాటి ధ్యాసకూడా అతడి పట్ల ఎవరూ చూపించలేదు. క్లుప్తంగా చెప్పాలంటే తన మొత్తం శాఖ అవహేళనంతటినీ నోరెత్తకుండా సహిస్తూవచ్చిన ఒక మానవుడు చెప్పుకోదగ్గ ఘనకార్యమేమీ సాధించకుండానే వల్లకాటికి వెళ్లిపోయాడు. అయితే అతడి జీవితాంతంలో అతడికి ఓవర్‌కోటు రూపంలో ఒక దివ్యసాక్షాత్కారం లభించిందని చెప్పకపోవచ్చు. కొద్దిసేపే అయినప్పటికీ అది అతడి దీనజీవితాన్ని ఉల్లాసభరితం చేసింది. కానీ ఇంతలోనే క్రూరవిధి అతడి నెత్తిన విరుచుకుపడింది. అటువంటి విధి ఈ ప్రపంచంలో అత్యంత బలవంతుల నెత్తిన కూడా విరుచుకుపడేదే.

అతడు మరణించిన కొన్ని రోజుల తరువాత, అతడి ప్రభుత్వ శాఖ నుండి అతణ్ణి తక్షణమే కార్యాలయానికి హాజరు కమ్మంటూ శాఖాధిపతి ఉత్తర్వులు తీసుకుని ఒక పనివాడు అతడి గదికి వెళ్లాడు. కానీ ఆ పనివాడు ఒట్టిచేతులతోనే తిరిగి వెనక్కు వెళ్లి అతడు రాలేడని చెప్పాడు. ‘ఎందుకని?’ అడిగిన ప్రశ్నకు ‘ఏముందీ, అతడు చచ్చిపోయాడు కాబట్టి, అతణ్ణి మూడురోజుల కిందటే పాతిపెట్టారు కాబట్టి’ అని చెప్పాడు. అకకి అకకియెవిచ్ మరణవార్త అతడి కార్యాలయానికి అలా తెలిసింది. ఆ మరుసటిరోజు కొద్దిగా పొడుగ్గా ఉండే ఒక కొత్త గుమస్తా అతడి కుర్చీలో కూర్చున్నాడు. అయితే అతడు తన ముందు నకళ్లు రాయవలసిన ఉత్తరాలు మరీ నిటారుగా కాకుండా కొద్దిగా అడ్డదిడ్డంగా తన ముందు పెట్టుకుని కూర్చున్నాడు.

అయితే ఇదే అకకి అకకియెవిచ్ జీవితచరమాంతం కాదనీ, అతడు జీవితకాలంపాటు అప్రదానంగా జీవించవలసి వచ్చినందుకు ప్రతీకారమా అన్నట్లుగా తన మరణానంతరం పెద్ద అలజడి లేవనెత్తనున్నాడని ఎవరన్నా ఊహించగలరా? కానీ జరిగిందదే. మన ఈ దురదృష్టకరమైన కథ అటువంటి ఒక అసాధారణ విశేషంతో ముగియనుంది.

హటాత్తుగా పీటర్స్‌బర్గ్‌ అంతటా ఒక పుకారు వ్యాపించింది. కలింకిన్‌ వంతెన మీద కొంత దూరం పోయిన తరువాత రాత్రిళ్లు ఒక మృతజీవి కనిపిస్తూ ఉన్నాడనీ, అతడు ఒక గుమస్తా ఆకారంలో కనిపిస్తూ తన దొంగిలించబడ్డ ఓవర్‌కోటు కోసం వెతుక్కుంటున్నాడని ఆ దారమ్మట ఎవరు పోతున్నా, వాళ్ల స్థాయి ఉద్యోగం ఎటువంటిదన్నా కానివ్వు, వాళ్ల వంటిమీద ఉన్నితో, చర్మంతో తయారుచేసిన ఓవర్‌కోటు ఉన్నాకూడా దాన్ని ‘అది నాది, నాది’ అంటూ లాక్కుంటున్నాడని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. కార్యాలయం ఉద్యోగి ఒకడు ఆ మృతజీవిని తన కళ్లతో స్వయంగా చూసి అతణ్ణి అకకి అకకియెవిచ్గా గుర్తుపెట్టాడు. ఆ దృశ్యం అతణ్ణి ఎంత భయపెట్టేసిందంటే అతడు అక్కడిఒక్క క్షణం కూడా ఉండలేక పరుగుతీసాడు. ఆ ఆకారాన్ని అతడు సరిగ్గా చూడలేకపోయాడు. కానీ ఆ ఆకారం  అతణ్ణి దూరం నుంచి వేలెత్తి చూపిస్తూ హెచ్చరిస్తున్నట్టు మాత్రం కనిపించింది.

నగరంలో పనిచేస్తున్న ఆఫీసు గుమస్తాలే కాదు, కోర్టు గుమస్తాలు కూడా వాళ్ల ఓవర్‌కోట్లు ఎవరో లాగేస్తుండడంతో చలిబారి పడకుండా కాపాడుకోలేకపోతున్నారని నలుమూలలనుంచీ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆ మృతజీవిని సజీవంగాగానీ, నిర్జీవంగాగానీ ఎలాగైనా సరే పట్టుకు తీరాలనీ, తీవ్రంగా శిక్షించి నలుగురికీ చూపించాలనీ పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. ఈ పనిలో వాళ్లు దాదాపుగా సఫలమైనట్లే కనబడ్డారు. ఒకరోజు కిరుష్కున్‌ వీథిలో పహరా కాస్తున్న సిపాయి ఒకడు సరిగ్గా ఆ నేరస్థలంలోనే ఆ మృతజీవి కాలరు చేజిక్కించుకున్నాడు. కానీ యథార్థానికి అతడు పట్టుకున్నది ఒకప్పుడు ఒక సంగీతబృందంలో వేణువు వాయిస్తుండే ఒక ముసలిసంగీతకారుడి గడ్డకట్టిన ఓవర్‌కోటును మాత్రమే. అతడు ఆ కాలరు అట్లా పట్టుకుని తన తోటిఉద్యోగుల కోసం కేకలుపెట్టాడు. వాళ్ళొచ్చేలోపు తన బూట్లోంచి నశ్యం డబ్బా తీసుకుని కొద్దిగా నశ్యం పీల్చడం కోసం ఆ కాలరును అట్లానే పట్టుకుని ఉండమని తన తోటి ఉద్యోగులనడిగాడు. ఆ నశ్యం అప్పటికే చలికి ఆరుసార్లు గడ్డకట్టింది. ఆ నశ్యం ఎంత దుర్భరంగా ఉందంటే, చివరికి మరణించిన మనిషి కూడా ఆ వాసనకి తట్టుకోలేకపోయాడు. ఆ పోలీసువాడు తన ఒక వేలితో కుడిముక్కురంధ్రాన్ని మూసుకుని ఎడంవైపు కొద్దిపాటి నశ్యం తగిలించాడో లేదో ఆ వాసనకి మరణించిన మనిషి తుమ్మకుండా ఉండలేకపోయాడు. ఆ ముగ్గురు పోలీసుల కళ్లల్లోనూ నశ్యం పడేటంత తీవ్రంగా తుమ్మాడు. వాళ్లు తమ కళ్లు నలుపుకుంటుండగానే ఆ మరణించిన మనిషి అక్కడినుండి పూర్తిగా అదృశ్యమైపోయాడు. తాము నిజంగానే అతణ్ణి తమ చేతుల్తో పట్టుకున్నామని ఆ తరువాత వాళ్లు గట్టిగా చెప్పలేకపోయారు. ఈ సంఘటన తరువాత పహరాపోలీసులు చనిపోయిన వాళ్లను చూసి ఎంతగా భయపడటం మొదలెట్టారంటే, చివరికి వాళ్లు బతికున్నవాళ్లను పట్టుకోవడం పట్ల కూడా ఆసక్తి చూపించడం మానేశారు. ఎవరన్నా మనిషి కనిపిస్తే దూరంనుంచే ‘ఏయ్‌. నువ్వే, ఉండక్కడే’ అని అరవడం మొదలుపెట్టారు. ఈ లోపు ఆ మరణించిన గుమస్తా కలింకిన్ వంతెన అవతలివైపున కూడా కనపడటం మొదలుపెట్టాడు. అన్నిరకాల పిరికివాళ్లనీ భయపెట్టడం మొదలెట్టాడు.

కానీ ఈ యథార్థగాథలో ఈ అసాధారణమైన సంఘటనలు జరగడానికి నిజమైన కారణం అని చెప్పవలసిన చా.ము.వ్య సంఘటన మనంపూర్తిగా మర్చిపోయాం. అన్నిటికన్నా ముందు ఆ రోజు ఆ విధంగా తన చేతుల్లో చావుదెబ్బ తిన్న అకకి అకకియెవిచ్ తన దగ్గరనుంచి వెళ్లిపోయాక అతడికొక రకమైన పశ్చాత్తాపం కలిగింది. వేదన అంటే ఒకరకంగా అతడికి అయిష్టం. తన యథార్థ ఆంతరంగిక వ్యక్తిత్వం బయటపడకుండా తన ఉద్యోగస్థాయి తరచూ తనకి అడ్డుపడుతున్నప్పటికీ అతడి హృదయంలో ఎన్నో దయాన్వితసంవేదనలు లేకపోలేదు. ఆరోజు తన పాత మిత్రుడు అక్కడినుంచి వెళ్లిపోయిన తరువాత అతడు అభాగ్యుడైన అకకి అకకియెవిచ్ గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ క్షణం నుంచీ దాదాపు ప్రతిరోజు ఆ అభాగ్యుడు, తన అధికారదర్పానికి ఎదురు నిలవలేకపోయిన ఆ హతభాగ్యుడే అతడికి గుర్తొస్తుండేవాడు. ఆ మనిషి ఆలోచన వస్తేనే అతడెంతో ఇబ్బంది పడిపోయేవాడు. దాంతో ఓ వారంరోజులు పోయాక నిజంగానే అతడికి తనేదైనా సహాయం చేయగలడేమో తెలుసుకోమని తన గుమస్తాలను పంపించాడు. కానీ అకకి అకకియెవిచ్ హటాత్తుగా జ్వరంవచ్చి మరణించాడని వినగానే అతడు నిశ్చేష్టుడైపోయాడు. తన అంతరాత్మ మాట వినబడింది. ఆ రోజంతా అతడు మామూలు మనిషి కాలేకపోయాడు. ఏదో ఒకరకంగా ఆ ఆలోచనలు తప్పించుకుని, ఆ నిస్పృహనుంచి బయటపడటం కోసం ఆ సాయంకాలం అతడు తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అక్కడ చాలా పెద్ద అతిథిబృందమే పోగై ఉన్నారు. అక్కడ హాజరైన అతిథులంతా కూడా దాదాపుగా అతడి స్థాయికి చెందేవాళ్లే కావడంతో అతడు తనను తాను మర్చిపోగలిగాడు. అది అతడి మనసుమీద అద్భుతప్రభావం చూపించింది. ఆ రోజు సంభాషణలో అతడు ఎంతో ఉల్లాసంగా, సానుకూలంగా, ఉదారంగా కనిపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంగా కాలక్షేపం చేశాడు. రాత్రి భోజనం అయ్యాక అతడొక రెండుమూడు గ్లాసుల షాంపేను స్వీకరించాడు. ఉల్లాసహృదయాలకు అది చెరుపుచేసేది కాదని అందరికీ తెలిసిందేకదా! ఆ తరువాత బయటికి వచ్చాక అతణ్ణి షాంపేను మరింత ఉద్రేకించింది. దాంతో అతడు ఇంటికిపోయే బదులు కరోలినా ఇవనోవ్నా అనే ఆమెను చూడాలనుకున్నాడు. ఆమె ఒక జర్మన్‌సంతతి మహిళ. ఆమె సాహచర్యం అతడికి చాలా సంతోషం కలిగించే విషయం. ఆ చా.ము.వ్య యువకుడేమీ కాదని గమనించాలి. అతడు చక్కటి భర్త, ఇద్దరు పిల్లలకు గౌరవనీయుడైన తండ్రి. వాళ్లల్లో ఒకరిప్పటికే ప్రభుత్వసర్వీసులో ఉన్నారు. మరొకరు చక్కని పదహారేళ్ల బాలిక. ఆమె రోజూ పొద్దున్నే అతడి చేతినందుకుని ప్రేమగా ముద్దుపెట్టుకుని  పలకరిస్తుంది. అతడి భార్య కూడా ఇంకా అందం కోల్పోని మహిళ. ఆమె కూడా రోజూ అతణ్ణి ప్రేమగా పలకరిస్తుంది. తన చక్కని గృహజీవితం పట్ల పరిపూర్ణంగా సంతృప్తిచెందినప్పటికీ, నగరంలో మరొకచోట తనకంటూ మరో మిత్రురాలు ఉండడం కూడా ఒక ఉన్నతస్థాయి అభిరుచి అని ఆ చా.ము.వ్య భావించాడు. ఆ స్నేహితురాలు అతడి భార్యకన్నా చిన్నదీకాదు, అందమైందీ కాదు. కానీ ఈ ప్రపంచమంతా ఇటువంటి అర్థంకాని విషయాలు కనిపిస్తుంటాయి. వాటిని పరిష్కరించడం మన పనికాదు. ఆ విధంగా ఆ చా.ము.వ్య మెట్లుదిగి తన పెట్టెబండిలోకి ఎక్కి, బండివాడితో కరోలినా ఇవనోవ్నా ఇంటికి పోనిమ్మన్నాడు. తన వెచ్చని ఉన్నికోటులో విలాసవంతంగా సర్దుకుని సంతోషభరిత మనస్కుడిగా కూర్చున్నాడు. అటువంటి మనస్థితిని ఒదులుకోడానికి నిజమైన రష్యన్‌ ఎవడూ ఒప్పుకోడు. అదొక ఆహ్లాదకరమైన మనస్థితి. అప్పుడు నువ్వు దేన్నిగురించీ ఆలోచిస్తుండవు. ఆలోచనలు వాటంతట అవే ఏవేవో వస్తూంటాయి. వచ్చే ప్రతి ఆలోచనా కూడా ముందు వచ్చిన ఆలోచన కన్నా మరింత సానుకూలంగా కనిపిస్తుంటుంది. కానీ ఏ ఆలోచనా కూడా పాత ఆలోచనను పక్కకు తోసేయడంకానీ, కొత్త ఆలోచనకోసం ఎదురుచూడాలని కానీ మనస్సుమీద ఒత్తిడి చేయదు. అటువంటి పరిపూర్ణ సంతృప్తితో అతడు ఆ సాయంకాలం ఉల్లాసభరితంగా గడిచిన క్షణాలన్నిటినీ గుర్తుచేసుకుంటూ ఉన్నాడు. ఆ చిన్నిబృందాన్ని నవ్వించిన తన మాటలన్నీ తలుచుకుంటూ, తిరిగి వాటిలో చాలామాటలు మళ్లా మంద్రస్వరంతో పునరుచ్చరించుకుంటూ ఉన్నాడు. అవి అప్పుడు వాళ్లకు నవ్వు తెప్పించినట్టే ఇప్పుడు కూడా అతణ్ణి నవ్విస్తూ ఉన్నాయి. దాంతో అతడు మళ్లా మళ్ళా వాటిని తలుచుకుని హృదయపూర్వకంగా నవ్వుకున్నాడంటే ఆశ్చర్యంలేదు. కానీ మధ్య మధ్యలో వీస్తున్న గాలి వల్ల అతడి మనసు కొద్దిగా చెదిరిపోతూ ఉంది. ఆ గాలి ఎక్కడినుంచి వస్తుందో దేవుడికే తెలియాలి. అది అతడి ముఖాన్ని మంచుతునకలతో గుచ్చుతూంది. ఓవర్‌కోటు కాలరు మీద మంచు రాలుతూఉంది.  ఉన్నట్టుండి ఒక్కసారిగా అసాధారణమైన బలంతో అతడి ముఖాన్ని ఈడ్చికొడుతూ, దాన్నుంచి బయటపడ్డానికి అతన్ని పెనుగులాడేట్టు చేస్తోంది. ఇంతలో హటాత్తుగా ఎవరో తన కాలరును బలంగా పట్టుకుని లాగుతున్నట్టుగా ఆ చా.ము.వ్య కి తోచింది. పక్కకు తిరిగిచూస్తే అతడికొక పొట్టిమనిషి కనిపించాడు. అతడు చిరిగిపోయిన పాతయూనిఫాంలో కనబడగానే, అతడు అకకి అకకియెవిచ్ అని తెలియగానే అతడు భయానికి లోనయ్యాడు. ఆ గుమస్తా ముఖం మంచులాగా పాలిపోయి ఉంది. నిజంగానే మరణించిన ముఖంలానే ఉంది. ఆ మరణించిన మానవుడు నోరు తెరిచి సమాధివాసన కొడుతూ అతడితో, ‘ఇక్కడున్నావా చివరికి! నిన్ను నీ కాలరు పట్టుకుని లాగుతాను చూడు. నాకు నీ ఓవర్‌కోటు కావాలి. నువ్వు నా కోటు వెతికి పెట్టలేదు సరికదా, నా మీద నోరుపెట్టుకు అరిచావు. ఇప్పుడు నీ కోటు నాకివ్వు’ అని అంటుంటే ఆ చా.ము.వ్య లో భయం కట్టలు తెంచుకుంది. తట్టుకోలేని భయంతో అతడికి అక్కడిక్కడే చచ్చిపోయినంత పనైంది. ఆఫీసులో తన కింద ఉద్యోగుల మీద అతడు ఎంత ధైర్యంతో విరుచుకుపడేవాడైనప్పటికీ, అతడి ఠీవి చూసి ప్రతిఒక్కరూ ‘ఓ, చాలా గొప్ప మనిషి’ అని అనుకునేవాడే అయినప్పటికీ, ధైర్యం కోల్పోయినప్పుడు మనుషులు ప్రవర్తించేటట్టే, అతడు కూడా ఈ సంక్షుభితక్షణంలో తన గుండె కొట్టుకోవడం మానేసిందనే అనుకున్నాడు.  వెంటనే తన భుజాలమీంచి ఓవర్‌కోటును ఒక్క ఉదుటున లాగేసి బయటికి గిరవాటు పెట్టి ‘పద, తొందరగా ఇంటికి’ అని బండివాడి మీద విచిత్రస్వరంతో అరిచాడు. అటువంటి కంఠస్వరం అత్యంత సంక్షోభక్షణాల్లో మాత్రమే వినవచ్చేటటువంటిదని గుర్తుపెట్టిన బండివాడు ఈసారి ఆ సంక్షోభం మరీ స్పష్టంగా గోచరించడంతో తల పక్కకు కదపకుండా గుర్రాలమీద కొరడా ఝళిపించి బాణంలాగా దూసుకుపోయాడు. ఆరునిమిషాల్లో ఆ చా.ము.వ్య తన ఇంటిగుమ్మం దగ్గర ఉన్నాడు. పూర్తిగా భయకంపితుడై పాలిపోయిన వదనంతో ఓవర్‌కోటు లేకుండా  ఎలాగైతేనేం తన పడకగదిలోకి వచ్చిపడ్డాడు. కరోలినా ఇవనోవ్నా దగ్గరకు వెళ్లాలనుకున్న విషయమే మర్చిపోయాడు. ఆ రాత్రంతా అతడెంత విపరీతమైన భయంతో గడిపాడంటే, పొద్దున్నే టీ తాగేటప్పుడు అతడి కూతురు ‘ఏం నాన్నా! నీ ముఖం మరీ పాలిపోయి ఉంది’ అంది. కానీ ఆ నాన్న మౌనంగా ఉండిపోయాడు. అతడికి ఏం జరిగిందో, అతడు ఎక్కడికి వెళ్లాడో,  ఎక్కడికి వెళ్లాలనుకున్నాడో ఒక్కమాట కూడా ఎవరికీ చెప్పనేలేదు. ఆ సంఘటన అతడిమీద బలమైన ముద్రవేసింది. ఆ తరువాత అతడు తన గుమస్తాలతో ‘నీకెంత ధైర్యం. నేనెవరో తెలుస్తోందా నీకు’ లాంటిమాటలు మాట్లాడటం బాగా తగ్గించేశాడు. ఒకవేళ అతడు ఎప్పుడైనా అటువంటి మాటలు మాట్లాడవలసి వచ్చినా, అది విషయం సాకల్యంగా అన్నివైపులా విన్నాకనే మాట్లాడేవాడు.

కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే, ఇక ఆ తరువాత నుంచి ఆ మృతగుమస్తా భూతం నలుగురికీ కనిపించడం మానేసింది. బహుశా ఆ చా.ము.వ్య ఓవర్‌కోటు ఆ భూతానికి సరిగ్గా సరిపోయి ఉంటుంది. ఏమైనప్పటికీ, దారినపోయే భుజాలమీంచి ఓవర్‌కోట్లు ఊడబెరుక్కుంటున్న వార్తలు వినరావటం ఆగిపోయింది. అయితే బలహీనమనస్కులకీ, పిరికివాళ్లకీ మాత్రం ఇంకా ధైర్యం చిక్కనేలేదు. వాళ్లు తమకిప్పటికీ నగరంలో ఏదోఒక మూల ఆ మృతగుమస్తా కనబడుతూ ఉన్నాడని చెప్తూనే ఉన్నారు. నిజానికి కొలొమ్నా దగ్గర ఒక పహరా సిపాయి ఆ భూతం ఒక వెనక ఇంటినుంచి రావడం తన కళ్లెదురుగా చూశానని చెప్పాడు. ఆ సిపాయి కొద్దిగా దుర్బలుడు. ఎంత దుర్బలుడంటే ఒకసారి గుమ్మానికి అడ్డంగా పరిగెడుతున్న బాగా బలిసిన పంది ఒకటి అతణ్ణి దాదాపుగా కిందకు నెట్టేసిపోయింది. అది చూసి ఇద్దరు బండివాళ్లు పకపకా నవ్వినందుకుగాను అతడు వాళ్లకి రెండేసి కొపెక్కులు జరిమానా విధించాడు. ఆ జరిమానాతో తనకు నశ్యం కొనుక్కున్నాడు కూడా. కాబట్టి తను దుర్బలుడైనందువల్ల అతడు ఆ భూతాన్ని అరెస్టు చేయడానికి సాహసించలేదు. అందుకు బదులు ఆ చీకటివీథుల్లో దానట్లా వెంబడిస్తూ పోయాడు. చివరికి ఒకచోట ఆ భూతం ఆగి చుట్టూ చూసి ‘ఏం కావాలి నీకు?’ అని పిడికిలి బిగించి తనవైపు చూపించిందనీ, బతికివున్నవాడెవడికీ అంతపెద్ద పిడికిలి ఉండడం తాను చూడలేదనీ, దాంతో ‘ఏం లేదు’ అంటూ అతడు వెనక్కి వచ్చేశాడనీ చెప్పుకున్నాడు. కానీ ఆ భూతం చాలా పొడుగ్గా ఉంది. దానిమీసంకూడా చాలా పెద్దదిగా ఉంది. అప్పుడది వెనక్కి తిరిగి ఒబుకోవ్‌ వంతెన దిక్కుగా తిరిగి నెమ్మదిగా అడుగులేసుకుంటూ ఆ రాత్రిచీకట్లోకి కనుమరుగైంది.

28-7-2017

Leave a Reply

%d