కథా ఉద్యమాలు-1

ఆధునిక కథ: ఉద్యమాలు, ఉదాహరణలు

నం కథ, చిన్నకథ, కథానిక అనే పేర్లతో పిలుచుకుంటున్న అధునిక కథ ప్రధానంగా పందొమ్మిదో శతాబ్ది సృష్టి. ఈ ప్రక్రియ కి ఎడ్గార్ అలన్ పో ఆద్యుడని చెప్తారు. అప్పణ్ణుంచి ఇప్పటిదాకా,అధునిక కథ నిర్మాణంలో, శిల్పంలో, తాను సాధించాలనుకుంటున్న ప్రయోజనాల్లో చాలా మార్పులకి లోనైంది. ఈ మార్పుల వెనక ప్రధానంగా పాశ్చాత్య ప్రపంచంలో సంభవించిన కళా ఉద్యమాల ప్రభావం ఉంది. ముందు సంగీతంలో,ఆ తర్వాత చిత్రలేఖనంలో తలెత్తిన వివిధ కళా ఉద్యమాలు రానురాను సాహిత్యాన్నీ, తత్త్వశాస్త్రాన్నీ కూడా ప్రభావితం చేస్తూ వచ్చాయి. గత రెండున్నర దశాబ్దాలుగా పాశ్చాత్యప్రపంచంలో ప్రభవించి, ఆ తర్వాత ప్రపంచమంతా విస్తరించిన కళా ఉద్యమాలు మొదట్లో కళాకారుల అస్పష్టమానసిక భావోద్వేగాల్లోంచి తలెత్తాయి. వాటి రూపురేఖలు తత్కాలీన సమాజానికీ, సాహిత్యవిమర్శకులకీ అర్థం కావడానికి కొంతకాలం పట్టింది. ఆ భావోద్వేగాల్ని నడిపిస్తున్న కోరికలూ, భయాలూ ఏమిటో స్పష్టం కావడం మొదలుపెట్టాక, అవి విస్పష్టమైన దృక్పథాలుగా రూపొందుతూ వచ్చాయి. ఒకసారి వాటి దృక్పథమేమిటో స్పష్టమయ్యాక, వాటి ఆకాంక్షల స్వరూపాలు స్థిరపడగానే, తరువాతి తరాలవారికి అవి మళ్ళా ఇరుకుగా తోచడమూ, వాళ్ళు మళ్ళా ఆ దృక్పథాలనుంచి బయటపడటానికి ప్రయత్నించడమూ, అవి మళ్ళా కొత్త ఉద్యమాలుగా రూపుదిద్దుకోవడమూ కూడా సహజమే. ఆ నేపథ్యంలో, సంగీతంలానే, చిత్రకళలానే కథ కూడా తన స్వరూపస్వభావాల్ని మార్చుకుంటూ వచ్చింది.

అటువంటి కళా ఉద్యమాల్లో ఆధునిక కథ రూపుదిద్దుకోవడం వెనక రొమాంటిసిజం ప్రభావం ఉంది.

ప్రాచీన మధ్యయుగాల్లో కథ

ప్రాచీన కథ ప్రపంచమంతా ఆదిమజాతులవాళ్ళు చెప్పుకునే  పురాగాథలు, జానపదకథల రూపంలో ప్రభవించిందని మనకు తెలుసు. మానవచరిత్రలో కాంస్యయుగం మొదలవగానే, జాతుల్ని సంఘటితపరిచే క్రమంలో, పురాగాథలూ, జానపదకథలూ కలిసి పురాణగాథలుగా రూపొందేయని కూడా మనకు తెలుసు. కాలం గడిచే కొద్దీ, ఆ జాతుల చరిత్రలో మార్పువచ్చినప్పుడల్లా ఆ పురాణగాథలు మారకుండా ఉండటానికి వాటికొక పవిత్రతని ఆపాదించడం మొదలయ్యాక, పురాణగాథల్ని ప్రశ్నిస్తూ, ప్రాచీన యుగాల్లో పారబుల్, ఫేబుల్, ఏనిక్డోట్ వంటి రూపాలు తలెత్తాయి. మధ్యయుగాలు మొదలైన తర్వాత, పురాణగాథలకి ప్రత్యామ్నాయంగా లౌకిక గాథల్ని చెప్పుకోవడం మొదలయ్యింది. భారతదేశ వాయవ్య సరిహద్దుల్లో ప్రభవించిన ‘బృహత్కథ’తో కథాప్రయాణం కొత్త మలుపు తీసుకుంది. బృహత్కథని అనుసరించిన పంచతంత్రం, కథాసరిత్సాగరం, వాసుదేవ హిండి, కాదంబరి, దశకుమార చరిత్ర వంటి రచనలు పురాణగాథల నమూనాలో వికసించిన పూర్తి ఐహిక ప్రపంచపు కథలు. మధ్యయుగాల్లో పంచతంత్రం, కథాసరిత్సాగరం పర్షియా, అరేబియాలమీదుగా యూరోప్ లో అడుగుపెట్టేటప్పటికి, అంతదాకా పూర్తిగా చర్చి వాజ్మయంలో ఇరుక్కుపోయిన ప్రజానీకానికి లౌకికవాజ్మయానికి తలుపులు తెరుచుకున్నాయి. మరొకవైపు స్పెయిన్ ని పరిపాలించిన ముస్లిం పాలనద్వారా పాచీన గ్రీకు సాహిత్యం, తత్త్వశాస్త్రం ఆరబిక్ ద్వారా యూరోప్ కి పున: పరిచయం కావడంతో రినైజాన్స్ మొదలయ్యింది. బొకాషియో, డాంటే, చాసర్, షేక్ స్పియర్ ల ద్వారా యూరోప్ లో మొదలైన నవ్యసాహిత్యం వెనక, గ్రీకు సంస్కృతి ప్రభావం కన్నా కూడా తూర్పుదేశాల లౌకిక వాజ్మయం ప్రభావం మరింత ఎక్కువనేది ఇప్పుడు మనకి తెలుస్తున్నది.

ఆధునిక యుగం: ఏజ్ ఆఫ్ ఎన్ లైటన్ మెంట్

ఈ నేపథ్యంలో యూరోప్ లో ఆధునిక యుగం మొదలయ్యింది. ఇటువంటి యుగాలు మొదలయినప్పుడు, ఎక్కడో ఒక కొండగుర్తు పెట్టుకుంటాం. దేకార్తే (1596-1650) అనే ఒక తాత్త్వికుడి ‘మెడిటేషన్స్ ఆన్ ఫస్ట్ ఫిలాసఫీ ‘(1641) అనే పుస్తకంతో అప్పటిదాకా యూరోప్ లో రాజ్యం చేస్తున్న మతవిశ్వాసాల స్థానంలో మొదటిసారిగా ఆలోచన (రీజన్)ముందుకొచ్చింది. ప్రపంచాన్ని హేతుబద్ధంగా నిర్వచించాలి, వ్యాఖ్యానించాలనుకునే ఆ ధోరణి తత్త్వశాస్త్రంలో రేషనలిజం కి దారితీసింది. ఆ పునాదులమీద పదిహేడవ శతాబ్ది మధ్యభాగంనుంచి పద్ధెనిమిదవ శతాబ్ది మధ్యభాగందాకా, అంటే ఫ్రెంచి విప్లవం (1789) కాలం దాకా యూరోప్ లో ఒక వికాసయుగం వర్థిల్లింది. ఈ కాలాన్ని ‘ఏజ్ ఆఫ్ ఎన్లైటన్ మెంట్ ‘ అనీ, ‘ఏజ్ ఆఫ్ రీజన్ ‘ అనీ కూడా పిలుస్తారు.

ఈ యుగం మనిషి మీద అపారమైన గౌరవం, అతడి తెలివితేటలమీదా, వివేకం మీదా, బాధ్యతమీదా, సామర్థ్యాల మీదా ఎంతో నమ్మకం పెట్టుకుంది. మానవుడే అన్నిటికీ కొలబద్ద అని భావించింది. అర్థంలేకుండా కనిపిస్తున్న ఈ ప్రపంచానికొక ధ్యేయం ఉందనీ, చరిత్ర ఒక క్రమపద్ధతిలో ముందుకు సాగుతున్నదనీ, చారిత్రిక పరిణామమిట్లానే కొనసాగితే, మనిషి భూమిని స్వర్గంగా మార్చుకోగలడనీ నమ్మింది. మతపరంగా మూఢవిశ్వాసాలూ, రాజకీయంగా నియంతృత్వం, తాత్వికంగా పిడివాదం మానవాళికి శత్రువులనీ, వాటితో పోరాడి వాటినుంచి మనిషిని విముక్తపరచాలనీ వికాసవాద తాత్త్వికులు కోరుకున్నారు.

ఆ ఆకాంక్షలు ప్రధానంగా అయిదు రకాల ఆలోచనాధోరణులుగా రూపుదిద్దుకున్నాయి. మొదటిది, రేషనలిజం. అంటే, ఈ ప్రపంచం గురించి మనమేర్పర్చుకునే జ్ఞానానికి కార్యకారణసంబంధం మాత్రమే ప్రాతిపదికగా ఉండాలనేది. రెండవది, మెటీరియలిజం. అంతే, భౌతికప్రపంచానికి భౌతిక పదార్థమే ప్రాతిపదిక అనీ, అది మాత్రమే మన మానసిక సంకల్పాల్ని నియంత్రిస్తుందనేది. మూడవది, ఎంపిరిసిజం. అంటే, కార్యకారణసంబధం ద్వారా మనం తెలుసుకుంటున్న జ్ఞానాన్ని ప్రయోగాలద్వారా, పరిశీలనలద్వారా పరీక్షించి చూడవచ్చుననేది. నాలుగవది, డిటర్మినిజం. అంటే, మనిషి పూర్తిగా స్వేచ్ఛాపరుడుకాడనీ, ఈ విశ్వాన్ని నియంత్రించే భౌతిక శక్తులు ఉన్నాయనీ చెప్పేది. ఇక, అయిదవది, యుటిలిటేరియనిజం. అంటే, మనిషి చేపట్టే కార్యకాలాపానికి, ముఖ్యంగా ఆర్థిక-రాజకీయ కార్యక్రమాలకి అధికసంఖ్యాకుల సంతోషమే ముఖ్యప్రయోజనంగా ఉండాలనేది. కేవలం 17, 18 శతాబ్దాలను మాత్రమే కాదు, ఇప్పటికీ కూడా ఆ ఆదర్శాలు ఏదో ఒక రూపంలో యూరోప్ నీ,తద్వారా మానవాళినీ ప్రభావితం చేస్తూనే వున్నాయి.

రొమాంటిసిజం ఆరంభవికాసాలు

యూరోప్ చరిత్రలో 1650-1750 కాలాన్ని ఏజ్ ఆఫ్ ఎన్లైటన్ మెంట్ గా చెప్పుకుంటే, 1750-1850 కాలాన్ని రొమాంటిసిజం చెప్పుకోవచ్చు. నిజానికి, చాలా సార్లు ఎన్లైటెన్ మెంటు యుగలక్షణాలూ,రొమాంసిస్టు యుగ లక్షణాలూ కలగలిసిపోయి కనిపిస్తాయి. కాని, రొమాంటిసిజం ప్రధానంగా ఎన్లైటెన్ మెంటు యుగాదర్శాలమీద తిరుగుబాటు, కాని మరొక రూపంలో అది ఎన్లైటెన్ మెంట్ యుగం ఆకాంక్షల్ని ఏదో ఒకరూపంలో కొనసాగించడానికే ప్రయత్నించింది కూడా. అందుకని, మానవుడి భవిష్యత్తు పట్లా, ఆదర్శమానవసమాజం పట్లా రెండు ధోరణులకీ ఒక్కలాంటి విశ్వాసమే ఉన్నప్పటికీ, ఎన్లైటెన్ మెంటు రచయితలు, తత్త్వవేత్తలు, కళాకారులు హేతువునీ, క్రమపద్ధతినీ, సువ్యవస్థనీ విశ్వసిస్తే, రొమాంటిసిస్టు కవులూ, కళాకారులూ భావనకీ, ఉద్వేగాలకీ, భావావేశాలకీ పెద్దపీట వేసారని చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే, ఆలోచనకీ, తర్కానికీ,క్రమబద్ధతకీ ఎన్లైటెన్ మెంట్ యుగం మరీ ఎక్కువ ప్రాముఖ్యత నిస్తోందనిచెప్పి దానిమీద విమర్శగానూ, ఆ అతిశయాన్ని సరిదిద్దే ధోరణిగానూ రొమాంటిసిజం తలెత్తిందని చెప్పాలి.

రొమాంటిసిజం అనే పదం ‘రొమాంజ్ ‘ అనే పూర్వకాలపు ఫ్రెంచిపదం నుంచి పుట్టింది. ఆ పదం రోమ్ కి చెందిన లాటిన్ భాషలైన ఇట్లాలియన్,ఫ్రెంచి, స్పానిష్, పోర్చుగీసు, కాటలాన్, ప్రోవెన్కల్ లను సూచిస్తుంది. మధ్యయుగాల్లో ఆ భాషాసాహిత్యాల్లో తలెత్తిన సాహసగాథల్ని రొమాన్సులనిపిలవడం పరిపాటి. ఆ అర్థంలో, రొమాంటిసిజం అంటే సాహసోపేతమైన ఒక అన్వేషణ, పిపాస, భావానాధోరణి అని 18 వశతాబ్దానికి వాడుకలోకి వచ్చింది.

1755 లో శామ్యూల్ జాన్సన్ ఇంగ్లీషు డిక్షనరీ రూపొందిస్తూ మొదటిసారిగా ‘రొమాంటిక్ ‘అనే పదాన్ని ఇంగ్లీషులో ప్రయోగిస్తూ, ‘రొమాన్సు కథల్ని తలపించేది, అదుపులేనిది, అసంభవమైనది, అసత్యమైనది, అర్థంలేనిది ‘ అంటో వివరించేడు. కాని 1798 లో ష్లీగెల్ అనే ఒక జర్మన్ తత్త్వవేత్త  కళారంగంలో తలెత్తుతున్న నూతనధోరణిని వివరించడానికి ఒక కొత్త పదం అవసరమని చెప్తూ, ‘రొమాంటిష్’అనే పదాన్ని ప్రయోగించాడు. భావనకీ, స్ఫురణలకీ సంబంధించిన స్వేచ్ఛాభివ్యక్తిని ఆ పదం సూచిస్తోదన్నాడు.

1755 నుంచి 1798 నాటికి రొమాంటిసిజం ప్రతిష్టలో అంత అనూహ్యమైన మార్పు రావడానికి కారణం, 1776 లో జరిగిన అమెరికన్ విప్లవం, 1789 లో జరిగిన ఫ్రెంచి విప్లవమూను. ఆ రెండు విప్లవాలూ ఎన్లైటెన్ మెంట్ యుగాదర్శాల్ని సాధించేక్రమంలో పాతవ్యవస్థమీద తిరుగుబాటుగా వచ్చినవే అయినప్పటికీ, వాటిలో అంతకు పూర్వం రాజకీయ సంఘటనల్లోలేని సరికొత్త భావోద్వేగం,భావనాశక్తి సరికొత్తగా ప్రత్యక్షమయ్యాయి. ముఖ్యంగా ఫ్రెంచి విప్లవం వెనక రూసో భావజాలం చాలాబలంగా ఉంది. అతడు మనిషి  స్వేచ్ఛగా పుట్టాడనీ, మనిషిని తిరిగికి ప్రకృతికి చేరువగా తీసుకుపోవడంద్వారానే అతడిలోని మానవత్వాని కాపాడగలుగుతామనీ వాదించాడు.

బాస్టిల్లి జైలు గోడలు బద్దలుగొట్టడం ద్వారా ఫ్రెంచి విప్లవం ఎన్లైటెన్ మెంటు యుగాదర్శాల్ని నిజం చేస్తున్నట్లే అనిపించిందిగానీ, అంతలోనే రిపబ్లికన్ల చేతుల్లోంచి జాకొబిన్ల చేతుల్లోకి మారిన అధికారం అనూహ్యమైన హింసకి దారితీసింది. ఒక ఆదర్శాన్ని వెన్నంటి అనూహ్యమైన హింస ఉంటుందనేది ఫ్రెంచి విప్లవం నేర్పిన పాఠం. ఆ మెలకువ, ఆ గాయం రొమాంటిసిజంలో చివరిదాకా అంతర్భాగంగా కొనసాగుతూనే ఉంది. అందుకనే ఒక చరిత్రకారుడు ‘ఎన్లైటెన్ మెంటు ఫ్రెంచి విప్లవం ద్వారా రొమాంటిసిజంగా మారింది ‘అన్నాడు. ఇక 1848 లో కమ్యూనిస్టు మానిఫెస్టో వెలువడటంతో రొమాంటిసిస్టు యుగం ముగిసిపోయింది.

కాని, 1789 నుంచి 1848 దాకా సుమారు అరవై ఏళ్ళపాటు రొమాంటిసిజం యూరోప్ రాజకీయ-ఆర్థిక వ్యవస్థల్నీ, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యాల్నీ తద్వారా సామాజికజీవనవైఖరుల్నీ గాఢాతిగాఢంగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత కూడా ప్రపంచవ్యాప్తంగా తాత్త్వికధోరణుల్నీ, సృజనరూపాల్నీ పరోక్షంగా ఇప్పటికీ ప్రభావితం చేస్తూనే ఉంది.

ఈ ధోరణి ఇంత ప్రభావశీలంగా ఉండటానికి కారణాలు కొంత తాత్త్వికమైనవీ,కొంత చారిత్రికమైనవీ. కావడానికి ఫ్రెంచి విప్లవంతోటే రొమాంటిసిజం ఒక భావోద్వేగంగా ప్రభవించినప్పటికీ, అది మొదట జర్మనీలో వికసించింది. ముఖ్యంగా నెపోలియన్ ఆక్రమణకు గురైనతర్వాత, జర్మనీలో అది జర్మన్ సంస్కృతిమూలాల్ని అన్వేషించడానికీ, జర్మన్ జాతీయతావాదానికీ, స్థానిక, గ్రామీణ, మధ్యయుగాల కళారూపాల్నీ,సాహిత్యాన్ని ముందుకు తీసుకురావడానికీ తోడ్పడింది. తాత్వికంగా ఇమ్మాన్యువల్ కాంట్ (1724-1804)రొమాంటిసిస్టు డైలమాకి తెరతీసాడు. ఆయన కావడానికి  ఎన్లైటెన్ మెంట్ యుగానికి చెందినవాడైనప్పటికీ, హేతువునీ, ఇంద్రియజ్ఞానాన్నీ సమన్వయపరచేక్రమంలో, సత్యం అంతస్సత్యం (నామినా) రూపంలో మనకెప్పుడూ అవగతం కాదనీ, మనం చూసే బాహ్యసత్యం (ఫెనామినాన్) మాత్రమే మనం అర్థం చేసుకోగలమనీ చెప్పడంతో, రొమాంటిసిజానికి ప్రాణం పోసినట్టయింది. 1775 లో తలెత్తిన ‘స్టార్మ్ అండ్ స్ట్రెస్ ‘(తుపాను-తొక్కిడి)ఉద్యమం నుంచి స్ఫూర్తిపొంది గొథే (1749-1832), షిల్లర్ (1759-1805) లు జర్మన్ రొమాంటిసిజానికి, తద్వారా యూరొపియన్ రొమాంటిసిజానికీ తలుపులు తీసారు.

జర్మనీనుంచి రొమాంటిక్ ఉద్వేగాల్ని నేరుగా ఇంగ్లాండ్ అందిపుచ్చుకుంది. ఇంగ్లీషు రొమాంటిసిజం రెండు తరంగాలుగా వికసించింది. మొదటి తరంగం, ఫ్రెంచి విప్లవం మీద ఆశపెట్టుకుని దాన్ని రెండుచేతులా స్వాగతించిన కాలరిడ్జి (1772-1834), వర్డ్స్ వర్త్ ల (1770-1850) ద్వారా వికసించిన నవ్యోత్సాహం. వారిద్దరూ వెలువరించిన ‘లిరికల్ బాలడ్స్ ‘(1798) ఇంగ్లాండులోనే కాక, ఇంగ్లీషువలసపాలనలో ఉన్న దేశాల్లో కూడా రొమాంటిక్ స్ఫూర్తిని రగిలించింది. కాని, ఫ్రెంచి విప్లవం కలిగిచిన ఆశాభంగం  ఇంగ్లాండులో ఆర్థికశాస్త్రంలో రొమాంటిసిజానికి దారితీసింది. ఆడం స్మిత్ (1723-90), రికార్డో (1772-1823),బెంథాం (1748-1832) లు రాజకీయంగా సాధించలేనిదాన్ని ఆర్థికశక్తులద్వారా సాధించే మార్గాలు అన్వేషించారు. వారి రచనలవల్ల ప్రభావితుడైన  రాబర్ట్ ఓవెన్ (1771-1858) ఆదర్శవాద సామ్యవాదానికి ఊపిరిపోసాడు. కాని ఇంగ్లాండులో సంభవిస్తున్న రాజకీయ-ఆర్థిక పరిణామాల నేపథ్యంలో రెండవ తరం రొమాంటిసిస్టులు మరొకసారి సరికొత్త రొమాంటిక్ స్వప్నాలతో ముందుకొచ్చారు. షెల్లీ (1792-1822),కీట్స్ (1795-1821),బైరన్ (1788-1824) లు రొమాంటిసిజానికి నిజమైన చిహ్నాలుగా ప్రపంచస్మృతిలో మిగిలిపోయారు. బ్రిటిష్ లాండ్ స్కేప్ చిత్రకారులు, నీటిరంగుల చిత్రకారులు కాన్ స్టేబుల్ (1776-1837), టర్నర్ (1775-1851) లు తర్వాత రోజుల్లో యూరపియన్ చిత్రకళమీద గాఢమైన ముద్ర వదిలివెళ్ళారు.

రొమాంటిసిజం ఊహ తొడిగింది ఫ్రాన్సులోనే అయినప్పటికీ,సాహిత్యంలో ప్రతిఫలించడానికి విక్టర్ హ్యూగో (1802-85) దాకా ఆగవలసివచ్చింది. అదే దారిలో స్టెంధాల్ (1783-1842), బాల్జా (1799-1850)లు సాహిత్యంలో రొమాంటిక్ ధోరణిని ప్రతిబింబించే రచనలు చేసారు. వాళ్ళల్లో మళ్ళా బాల్జా రొమాంటిసిజానికీ,రియలిజానికీ మధ్య వారధిలాంటివాడు. కాని ఫ్రెంచి జీవితంలో నిజమైన రొమాంటిసిస్టులు చిత్రకారులు. ఫ్రాన్సులో రొమాంటిసిజం ఆలస్యంగా రావడానికి కారణం ఎన్ లైటెన్ మెంటు యుగంలో మొదలై, ఫ్రెంచి విప్లవం అనంతరం కూడా కొనసాగిన నియోక్లాసిసిజం. నియోక్లాసిస్టులు క్రమపద్ధతినీ, నియమనిబంధనలనీ, సువ్యవస్థనీ కోరుకున్నారు. వాళ్ళల్లో చివరి మహాచిత్రకారుడైన ఇంగ్రె (1780-1867) మీద తిరుగుబాటుగా డెలాక్రె (1798-1863), గెరికాల్ట్ (1791-1824) చిత్రకళ స్వరూప స్వభావాల్ని మార్చేసారు.

రష్యాలో కూడా రొమాంటిసిజం ఆలస్యంగా ప్రవేశించింది. పుష్కిన్ (1799-1837) కవిత్వంతో మొదలైన రొమాంటిక్ ధోరణి లెర్మెంటోవ్ (1814-41) తో వికసించింది. ఇటలీలో రొమాంటిసిజం జర్మనీలోలానే జాతీయతావాదాన్ని ప్రోత్సహించింది.

కాని అన్ని దేశాల్లోనూ,సరిహద్దులకి అతీతంగా యూరోప్ అంతటా రొమాంటిక్ స్ఫూర్తిని సంగీతం ప్రతిఫలించినట్టుగా మరే కళారూపమూ ప్రతిబింబించలేదని చెప్పాలి. అంతవరకూ చర్చికి మాత్రమే పరిమితమైన సంగీతం ఒపేరాల రూపంలో ప్రజామధ్యంలోకి ప్రవేశించింది. నికోలో పగానిని (1782-1840), ఫ్రాంజ్ లిస్ట్ (181-86), చోపిన్ (1810-49), వెర్డి (1813-1901) సంగీతాన్ని ఊహించని ఎత్తులకి తీసుకుపోయారు. రొమాంటిక్ యుగానికి సంబంధించి సంగీతంలో బితోవెన్ (1770-1827) కృషి మరింత ప్రత్యేకమైంది. అతడు ఐరోపీయ సంగీతాన్ని సంప్రదాయశకం నుంచి రొమాంటిక్ యుగానికి తీసుకువచ్చాడు. షూబర్ట్ జర్మన్ కవుల గీతాలకి స్వరాలు కూర్చి వాటిని ప్రజాబాహుళ్యానికి పరిచయం చేసాడు. అతడి బాటలోనే  మెండెల్ సన్ షేక్స్పియర్ నాటకాల్ని సంగీతపరిచాడు. ఇక  వాగ్నర్ (1813-83)సంగీతాన్నీ, రంగస్థలాన్ని, పురాణగాథల్నీ  మేళవించి బృహత్తర సంగీతప్రదర్శనలకి దారితీసాడు.

రొమాంటిసిస్టు యుగంలో సైన్సు న్యూటన్ అనంతరకాలానికి చెందిన సైన్సు. భౌతికప్రపంచాన్ని న్యూటన్ వివరించినందువల్ల దృశ్యప్రపంచపు పరిమితులు కాక, దాని అపరిమితత్వం తెలియవచ్చిన కాలం.  ఆ అదృశ్య శక్తుల అన్వేషణలో రొమాంటిక్ యుగ మానవుడు విద్యుత్ శక్తి నీ, విద్యుదయస్కాంత వలయాన్ని కనుగొన్నాడు.

ఫ్రెంచి విప్లవం అనంతరం సంభవించిన పరిణామాల్లో ముఖ్యమైంది నెపోలియన్ అధికారంలోకి రావడం, మొత్తం యూరోప్ ని తన ఆధీనంలోకి తీసుకురావడానికి ప్రయత్నించడం. ఆ క్రమంలో అతడు జర్మనీ, ఇటలీ వంటి దేశాల్లో జాతీయతావాదానికి కారకుడయ్యాడు. అతణ్ణి నిరోధించడంద్వారా రష్యాని, ఓడించడంద్వారా ఇంగ్లాండునీ బలోపేతం చేసాడు. ఆ రాజకీయపరిణామాలు పాత యూరోప్ ను అతలాకుతలం చేసాయి. వివిధదేశాల్లో ప్రతిఘటనలు మొదలయ్యాయి. వాటిని అణచడం కోసం ఆస్ట్రియా, ఫ్రాన్సు, ఇంగ్లాండు పాలకులు వియన్నాలో సమావేశమై ఒక ఒప్పందం చేసుకున్నారు (1814-15). ఎన్లైటెన్ మెంట్ ఏ స్వేచ్ఛనీ,స్వాతంత్ర్యాన్నీ, సౌభ్రాతృత్వాన్నీ కోరుకుందో, ఏ ఆశయాలకోసం ఫ్రెంచి విప్లవం సంభవించిందో, చివరికి ఇరవయ్యేళ్ళు కూడా తిరక్కుండానే నియంతృత్వం, అణచివేత, ఆర్థికపీడనలతో కూడుకున్న యూరోప్ ప్రత్యక్షమైంది. ఈ యూరోప్ ను ధిక్కరిస్తూ సోషలిస్టు ప్రయోగాలూ, ఉద్యమాలూ తలెత్తడం మొదలయ్యింది. ఇంగ్లాండులో 1811-13 లో లుడ్డైట్లు, 1820 లో స్పెయిన్, నేపిల్స్, గ్రీసులో, 1825 లో రష్యాలో డిసెంబరిస్టులు, 1830ల్లో బెల్జియం, పోలాండ్, ఫ్రాన్సుల్లో, 1848 లో దాదాపుగా యూరోప్ అంతటా ప్రజలు ప్రతిఘటనలకు దిగారు. ‘యూరోప్ ని ఒక భూతం ఆవహించింది, కమ్యూనిజం అనే భూతం ‘అనే చారిత్రాత్మక వాక్యంతో మార్క్స్ ఎంగెల్సులు 1848 లో కమ్యునిస్టు మానిఫెస్టో ప్రకటించడంతో, యూరోప్ లో కొత్త శకం మొదలయ్యింది.

రొమాంటిసిజం ప్రధానంగా ఏమి కోరుకుంది? ఆ యుగలక్షణమేమిటి అనే ప్రశ్నకి ఒక్కమాటలో జవాబివ్వడం సాధ్యం కాదు. రొమాంటిసిజం వికాసం,ఆ స్ఫూర్తి యూరోపు అంతటా చేసిన ప్రయాణాన్ని బట్టి చూస్తే, అందులో మూడు దశలున్నాయని అర్థమవుతుంది. మొదటిదశ పద్ధెనిమిదో శతాబ్దపు మధ్యకాలంలో మొదలై, ఫ్రెంచి విప్లవంతో పతాకస్థాయికి చేరుకుని, 1793-94 లో జరిగిన హింసాకాండతో ముగిసిపోయింది.

ఆ దశలో రొమాంటిసిజం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు ఆదర్శాలుగా నడిచిన గొప్ప ఉద్వేగభరితమయిన కాలం. అయితే, ఆ కాలంలో మనిషి పొందగల సంతోషం ప్రకృతి ఒడిలోనో లేదా మధ్యయుగాల గోతిక్ కట్టడాల సన్నిధిలోనో, లేదా, ప్రాచీన గ్రీకు స్వర్ణయుగంలోనో సాధ్యమవుతుందని భావించినదశ. ఆ దశలో ‘బ్యూటిఫుల్ ‘ ని కాక, వాళ్ళు ‘సబ్లైమ్ ‘ని ఆరాధించారు. బ్యూటిఫుల్ నాగరీకమైన, సున్నితమైన సౌందర్యపార్శ్వం. అది సభ్యసమాజం రూపొందించుకున్న ఒక కల్పన. కాని సబ్లైమ్ ప్రాకృతికం, వినీలాకాశంలాగా, నురగలు కక్కే మహాసాగరంలాగా, ఆల్ప్స్ హిమాలయ శిఖరంలాగా గంభీరం, అగాధం, అచింత్యం. అటువంటి సబ్లైమ్ ఎదట మనిషికి తన అల్పత్వం, లఘుత్వం తెలిసివస్తాయి. అతడు దానిలో తాను ఆహుతైపోతాడేమో అనుకుంటాడు. అందుకని దాన్ని ఒకింత దూరంనుంచే చూడాలనుకుంటాడు. ఆ సౌందర్యం అతణ్ణి సమ్మోహితుణ్ణి చేస్తుంది. కాని దానికీ, తనకీ మధ్య అతడొకింత ఎడం కోరుకుంటాడు. తాను కోరుకుంటున్న సంతోషం తనకి వర్తమానంలో దొరికేది కాదు, అది ఒక అతీతకాలంలోనో, లేదా సుదూరలోకంలోనో మాత్రమే లభిస్తుందనుకుంటాడు. అదొక అన్వేషణ. ఎడతెగని పిపాస. ఈ దశలో రొమాంటిసిజం ఒక రాజకీయ భావావేశాన్ని సంతరించుకోలేదు. అది కేవలం ఒక స్వేచ్ఛా ధోరణి, ఒక సౌందర్యాభిలాష మటుకే.

రొమాంటిసిజంలో రెండవదశ నెపోలియన్ 1799 లో అధికారం చేజిక్కించుకోవడంతో మొదలై, 1804 లో అతడు తనని తాను చక్రవర్తిగా ప్రకటించుకోవడంతో మలుపు తిరిగింది. అక్కడితో మొదటితరం రొమాంటిసిస్టులు నిరాశలోకి జారిపోగా, రెండవతరం రొమాంటిసిస్టులు తలెత్తారు. ఉదాహరణకి, నెపోలియన్ ఆక్రమణకి వ్యతిరేకంగా ఫిక్టే జర్మన్ జాతీయతావాదాన్ని రగిలిస్తే, హెగెల్ కి నెపోలియన్ లో యూరోప్ ని ఏకం చెయ్యగల రాజకీయ శక్తి కనిపించింది. రొమాంటిక్ కవిత్వంతో నిరాశచెంది గొథే తిరిగిమళ్ళా క్లాసిసిజం వైపు మళ్ళిపోగా, వర్డ్స్ వర్త్, కాలరిడ్జిలు నిరుత్సాహానికి లోనుకాగా, షెల్లీ,కీట్స్ వంటి కవులు కొత్త రాజకీయ చైతన్యంతో కవిత్వం చెప్పారు. రెండవదశ రొమాంటిసిస్టులకి తాము కలగంటున్న దాన్ని కేవలం స్వప్నాలుగానే కాక, రాజకీయ చైతన్యంతో ప్రకటించడం కూడా  ముఖ్యం. ఈ స్ఫూర్తి కమ్యూనిస్టు మానిఫెస్టో దాకా కొనసాగింది. అందుకనే, మార్క్స్ ని చివరి రొమాంటిక్ అనడంలో అతిశయోక్తి లేదు.

డార్క్ రొమాంటిసిజం

ఇక మూడవదశ రొమాంటిసిజం 1820 ల్లో మొదలైన దశ. రొమాంటిసిజం అనగానే మనకు గుర్తొచ్చే భావజాలమంతా ఈ దశకు చెందిందే. దీన్నే డార్క్ రొమాంటిసిజం అని కూడా అంటారు. అనేక భావోద్వేగాలు కలగలిసిపోయిన సంక్లిష్ట మనః స్థితి ఇది. ఇందులో మొదటిదశకి చెందిన ఉత్తేజం, సద్యః స్పందన, శక్తివిజృంభణ ఉన్నాయి. కాని మొదటిదశలో  పర్వతాల్నీ, అరణ్యాల్నీ, సముద్రాల్నీ వాటి గాఢతకోసం ప్రేమిస్తే, ఈ దశలో వాటి భీకరత్వం కోసం ప్రేమించారు. మొదటిదశలో గోతిక్ వాస్తుని ఆ కట్టడాల గాంభీర్యం కోసం ఆరాధిస్తే, ఈ దశలో వాటి నిర్జనత్వం కోసం, వాటిని అల్లుకున్న చీకటినీడలకోసం, ఆ కట్టడాలు తమలో రేకెత్తించే భీతావహ సంవేదనల కోసం ప్రేమించారు. మొదటిదశలో ప్రాచీన గ్రీకుకాలాన్ని స్వప్నిస్తే, ఈ దశలో తూర్పుదేశాల్ని ప్రేమించారు. తూర్పుదేశాలంటే, పర్షియా, భారతదేశం, దూరప్రాచ్యదేశాలు-కాని అవి యథార్థం ఎలా ఉన్నాయో, అలా కాదు, వాటిగురించి తాము ఎట్లాంటి కల్పనలు రూపొందించుకున్నారో అట్లా అన్నమాట. వాళ్ళ దృష్టిలో ఓరియెంట్  గొప్ప సుఖలాలసలతో కూడుకున్న కామకేళీభూమి. రంగులు, సంపదలు, తనివితీరేదాకా అనుభవించగల అందాలు, ఆనందాతో కూడుకున్న ఒక స్పప్నభూమి. అయితే, ఆ సంతోషంలో కూడా చెప్పలేని ఒక హింసాపార్శ్వం. తాము ఏది కోరుకుంటున్నారో, ఏది పొందుతున్నారో, ఏది పొందలేకపోతున్నారో తమకే తెలియని ఒక అనుతాపసీమ. జర్మన్ చిత్రకారుడు ఫ్రెడెరిక్ గీసిన చిత్రాల్లో రొమాంటిక్ మానవుడు చాలా ఎత్తులో గంభీరమైన ప్రకృతిని ఒక్కడే ధీరోదాత్తుడిగా పరికిస్తున్న దృశ్యముంటుంది. అది మొదటిదశ రొమాంటిసిస్టు భావోద్వేగాన్ని రెండవదశలో పట్టుకోడానికి ప్రయత్నించిన చిత్రలేఖనం. కాని  డెలాక్రా చిత్రించిన ‘డెత్ ఆఫ్ సార్డనాపాలుస్’ (1827) మూడవదశ రొమాంటిసిజానికి పూర్తి ప్రతిబింబం. అతృప్త గాఢవాంచలు హింసగా పరిణమించే ఒక మహామానవవిషాదం.

ఈ దశలో రొమాంటిక్ మానవుడికొక చెప్పలేని వేదన. రొమాంటిక్ ఎగొని. సమాజం నుంచి దూరంగా, ఏకాంతంగా బతకాలనే కోరిక. తాము కలలుగంటున్న జీవితానికీ, తమ కట్టెదుట ఉన్న వాస్తవానికీ పోంతనలేని తనం పట్ల నిస్పృహ, నిరసన. అన్ని రకాల సామాజికనీతిసూత్రాలమీదా తిరుగుబాటు. జీవితానికీ, రచనకీ మధ్య సరిహద్దులు చెరిపేసే మనోధర్మం. సభ్యసమాజం వేటిని ఆదర్శాలుగా భావిస్తుందో, వాటిని ధిక్కరించి సమాజం నిరాకరించేవాటికి పెద్దపీట వెయ్యడం. విరూపంలో సౌందర్యాన్ని చూడటం. కురూపిని నాయకుణ్ణి చెయ్యడం. అసలు రొమాంటిసిస్టు సాహిత్య ప్రధాన అలంకారం విరోధాభాస (పారడాక్స్), వక్రోక్తి (ఐరని). తాము చెప్పాలనుకున్నది సూటిగా కాకుండా వ్యంగ్యంగా చెప్పడమనేది రొమాంటిక్ ఐరని గా స్థిరపడింది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది మృత్యుప్రేమ. రొమాంటిక్ కవులు, కళాకారులు చాలామంది నలభై ఏళ్ళలోపే ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించారంటే, రొమాంటిసిస్టుల మృత్యు ఆరాధన ఎంత తీవ్రమైందో అర్థమవుతుంది.

మొత్తం మానవాళికంతటికీ విశ్వవ్యాప్తంగా వర్తించే ఉదాత్తభావాలతో ఎన్లైటన్ మెంటు యుగం మొదలయ్యింది. ఆ ఆదశాల వ్యాప్తిలో భాగంగా మొదటిదశ రొమాంటిసిజం జాతీయతావాదాన్ని ప్రోత్సహించింది. రెండవదశలో, సామాన్యమానవుడి పట్ల కొత్త ఆదరణ, జాగృతి తలెత్తాయి. నిజానికి, ఇది కూడా ఫ్రెంచి విప్లవపరిణామమే. ఫ్రెంచి విప్లవానంతరం రిపబ్లినలనుంచి అధికారాన్ని కైవసం చేసుకున్న జాకొబిన్లు హింసాత్మకంగా ప్రవర్తించినప్పటికీ,  సామాన్యమానవుల ఆకాంక్షలకి చేరువకావాలన్న తపన ఆ హింస కి ప్రధానకారణమని మనం గుర్తుపెట్టుకోవాలి. తొలితరం బ్రిటిష్ రొమాంటిసిస్టులు రాజకీయంగా కాకపోయినా కనీసం సాహిత్యంలోనైనా సామాన్యమానవుడికి పట్టాభిషేకం చెయ్యాలని ప్రయత్నించారు. కాని, రెండవదశ రొమాంటిసిజం ఎదుర్కొ న్న రాజకీయ పరిణామాల వల్ల, పర్యవసానాలవల్ల మూడవదశ రొమాంటిసిస్టులు పూర్తిగా వ్యక్తులుగా, తమ ఏకాంత భావనాప్రపంచానికి బందీలైపోయారు.

సంప్రదాయ సమాజం మీదా, తమని అణచిపెట్టే వ్యవస్థలమీదా ఒక తిరుగుబాటుగా మొదలైన రొమాంటిసిజం, యుద్ధం,ఆకలి, పీడనలు లేని లోకాన్ని కలగన్న రొమాంటిసిజం మొదట్లో ఒక కలగా మొదలై, ఆ తరువాత రాజకీయ ఆగ్రహంగా వ్యక్తమై, చివరికి తన ఆకాంక్షలకు తానే ఆహుతై పోయిన చీకటి సంవేదనగా మారిపోయింది.

ఫ్రెంచి విప్లవానికి పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన శక్తుల్లో అమెరికన్ విప్లవం కూడా ఉన్నప్పటికీ,అమెరికాలో రొమాంటిసిజం యూరోప్ కన్నా ఆలస్యంగానూ,వేరుధోరణిలోనూ వికసించింది. జర్మన్, బ్రిటిష్ రొమాంటిసిస్టుల ప్రభావం,తూర్పుదేశాలు ముఖ్యంగా పర్షియా, భారతదేశం, చైనాల ప్రాచీన మధ్యయుగాల సాహిత్యం, కాల్వినిస్టు తరహా ప్యూరిటనిజం నేపథ్యంగా రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ (1803-82) ట్రాన్సెండటలిజం అనే ఒక కొత్త తాత్త్వికధోరణికి దారితీసాడు. ఆ ధోరణికి పూర్తిగా చెందకపోయినప్పటికీ, థోరో (1817-62) వ్యక్తి స్వేచ్ఛ, ప్రకృతిప్రేమ, భౌతికవాదనిరాసాలతో కూడిన రచనలను చేసాడు. ఎమర్సన్ ఆదర్శాలతో ప్రభావితుడైన వాల్ట్ విట్మన్ (1819-92)  ప్రజాస్వామిక ఆదర్శాలతో, అపారమైన గాంభీర్యంతో, ఉదాత్తతా,కరుణా నిండిన కవిత్వాన్ని వెలువరించాడు.

ట్రాన్స్డెంటలిస్టు ఆదర్శాలు మరీ వాస్తవదూరాలుగా ఉన్నాయనీ, మనిషి వాటిని ధిక్కరిస్తూ వచ్చిన సాహిత్యాన్ని డార్క్ రొమాంటిసిస్టు సాహిత్యంగా పరిగణిస్తున్నారు. నథానియల్ హథార్న్ (1804-64), ఎడ్గార్ అలన్ పో (1809-49), హెర్మన్ మెల్విల్లీ (1819-91) ఈ ధోరణికి ప్రతినిధి రచయితలు. అమెరికన్ డార్క్ రొమాంటిసిస్టు సాహిత్యం ప్రధానంగా ఎత్తిచూపిన అంశాలు: మానవుడు స్వభావసిద్ధంగా పరిపూర్ణుడనే అంచనా తప్పు, మనిషి స్వతహాగా దుర్బలుడు, పాపంచెయ్యడానికీ, ఆత్మవిధ్వంసానికీ వెనకాడడు, మనిషిలో దివ్యత్వం ఉంటుదనేది నిజమవునోకాదోగాని,అతడిలో సైతాను మాత్రం స్పష్టంగా ఉన్నాడు, ప్రాకృతిక ప్రపంచం స్వతహాగా అంధకారబంధురం, క్షయించేదీ, నశించేదీ అనే సత్యం అవగాహనకు వచ్చినప్పుడు అది మనిషికి నరకం చూపిస్తుంది, ఇక చివరగా, మనిషి మార్పునీ, మెరుగైన జీవితాన్నీ కోరుకుని చేసే ప్రతి ప్రయత్నంలోనూ దారుణంగా విఫలమవుతూనే ఉంటాడు.

ఇటువంటి నిష్టురమైన మెలకువతో కూడిన డార్క్ రొమాంటిసిస్టు యుగంలో ఆధునిక కథ ప్రభవించింది.

ఎడ్గార్ అలన్ పో: ఆధునిక కథ

రొమాంటిసిస్టు యుగం తలెత్తినప్పణ్ణుంచీ కథా ప్రక్రియ కూడా పరిణామానికి లోనవుతూనే ఉంది. మొదటిదశ రొమాంటిసిజంలో భాగంగా,జర్మనీలో జాతీయతావాదం తలెత్తినప్పుడు, ప్రాచీన కళారూపాల్ని అన్వేషించే క్రమంలో, గ్రామీణ జానపద కథల మీద మక్కువ పెరిగింది. గ్రిమ్ సోదరులు జర్మనీ అంతా తిరిగి తాము సేకరించిన జానపదకథల్ని 1812-1815 మధ్యకాలంలో రెండు సంపుటాలుగా ప్రకటించారు. వెయ్యిన్నొక్క అరేబియా రాత్రుల కథలు మొదటిసారిగా 1707-17 మధ్యకాలంలో ఫ్రెంచిలోకి అనువాదమయ్యాయి. వాటి ప్రభావం తదనంతరకాలమంతా యూరోప్ మీద ప్రసరిస్తూనే ఉంది. ఇంకొక వైపు, జర్మన్ లో, వాన్ క్లీస్ట్, ఇంగ్లీషులో డికెన్స్, ఫ్రెంచిలో బాల్జా, రష్యన్ లో పుష్కిన్, అమెరికాలో వాషింగ్టన్ ఇర్వింగ్, నథానియల్ హాథార్న్ కూడా కథలు రాయడం మొదలుపెట్టారు. కాని సంగీతంలోనూ, చిత్రలేఖనంలోనూ, కవిత్వంలోనూ ప్రస్ఫుటమైనట్టుగా, రొమాంటిక్ యుగలక్షణం ఆ కథల్లో వ్యక్తం కాలేదు. ఆ అవకాశం ఎడ్గార్ ఎలన్ పో కి లభించింది.

ఇక్కడ రెండు ప్రశ్నలు: పో కి ముందు కూడా కథకులు ఉన్నప్పటికీ, కథారచన చేస్తూన్నప్పటికీ ఆధునిక కథ పో తోనే మొదలైందని ఎందుకు చెప్పుకుంటున్నాం? రెండవది, ఉజ్జ్వల రొమాంటిసిస్టు దశకి చెందిన రచయితలు కూడా కథలు రాసినప్పటికీ, ఆధునిక కథ డార్క్ రొమాంటిసిజంలోనే ఎందుకు ప్రభవించింది?

రొమాంటిసిజం తొలిదశలో జర్మన్ సాహిత్యవేత్తలు స్థానిక, ప్రాచీన కథారూపాల మీద దృష్టిపెట్టినందువల్ల, గ్రిమ్ సోదరులు జర్మన్ జానపద కథల్ని సేకరించి ప్రచురించారని ఇంతకుముందే చెప్పుకున్నాం. గమనించవలసిందేమంటే, Peter Klaus the goatherd అనే ఒక జర్మన్ జానపదకథని ఆధారంగా తీసుకుని వాషింగ్టన్ ఇర్వింగ్ ‘రిప్ వాన్ వింకిల్ ‘(1819) అనే కథ రాసాడు. ఇర్వింగ్ నుంచి నథానియల్ హథార్న్ వరకూ కూడా కథ అంటే tale మాత్రమే. Tale నిర్మాణరీత్యా ఒక సమగ్రకథనం. దానికి ఆద్యంతాలూ, విస్పష్టమైన నైతిక ప్రయోజనం ఉంటాయి. కాని, 1833 లో బాల్టిమోర్ సాటర్ డే విజిటర్ అనే పత్రిక నిర్వహించిన కథల పోటీలో పో రాసిన  MS found in a bottle అనే కథని మనం ఇప్పుడు short story అని వ్యవహరిస్తున్నాం. అంటే, అంతదాకా, tale గా కొనసాగిన కథ పో చేతుల్లో short story గా మారిందన్నమాట. ఆ మార్పు ఏమిటి? ఎందుకు?

అడృష్టవశాత్తూ, తన దృష్టిలో చిన్నకథ అంటే ఏమిటో పో నే స్పష్టంగా నిర్వచించిపెట్టాడు. నథానియల్ హథార్న్ రాసిన  Twice-Told Tales అనే పుస్తకాన్ని సమీక్షిస్తూ రాసిన వ్యాసం (1842) లో, చిన్నకథ (brief prose tale) నవలలాగా కాకుండా ఒక్క పట్టున చదివించేటట్టు ఉండాలనీ,అందుకని ఆ కథ పాఠకుడి మనసుమీద certain single most effect చూపించేదిగా ఉండాలనీ అన్నాడు. పో ప్రధానంగా తనని తాను కథకుడికన్నా కూడా కవిగానే ఎక్కువ భావించుకున్నాడు. అందుకని ఒక కవిత రాయడం ఎలా అన్న అంశం మీద రాసిన The Philosophy of Composition (1846) వ్యాసంలో కూడా దాదాపుగా ఇవే భావాలు ప్రకటిస్తాడు.

ఒక కవిత నిర్మించడం పట్ల పో కి ఉన్న అభిప్రాయాలు రొమాంటిసిస్టులు,ముఖ్యంగా కాలరిడ్జి ప్రకటించిన అభిప్రాయాలే. రొమాంటిసిస్టులు దీర్ఘకావ్యం,మహాకావ్యాల నిర్మాణ మీదకన్నా కూడా ఖండకావ్యాల రచనమీదనే ఎక్కువమొగ్గు చూపారు. దాన్ని romantic fragment అన్నారు. జీవితయథార్థం పూర్తిగా, సమగ్రంగా మనచేతికి ఎన్నటికీ చిక్కదుకాబట్టి,మనం జీవితవాస్తవంలోని ఒక పార్శ్వాన్నో, లేదా ఒక చిన్న అంశాన్నో మాత్రమే వ్యక్తం చెయ్యగలమనేది రొమాంటిసిస్టుల భావన. పో ని గాఢంగా ప్రభావితం చేసిన కాలరిడ్జి కవితలు కథాకావ్యాలు మాత్రమే కాక,కుబ్లాఖాన్ లాంటివి అసంపూర్ణకావ్యాలు కూడా. జీవితాన్ని మనం సమగ్రంగా దర్శించలేం, కాని, దర్శించినదాన్ని చిత్రించేటప్పుడు, ఆ రచన పాఠకుడిమీద విడిచిపెట్టే ముద్రమాత్రం సమగ్రంగా ఉండాలని పో భావించాడు. ఆ ముద్ర లేదా ఆ effect వల్ల మాత్రమే పాఠకుడికి ఆ రచన సుందరంగా కనిపిస్తుందంటాడు. అటువంటి ప్రభావశీలమైన రచన కావాలంటే, తొలినుంచి తుదిదాకా ఎంతో నేర్పుగా కూర్చవలసి ఉందంటాడు. కొన్నిసార్లు ఎంతజాగ్రత్త పడ్డా రచనలోని కళాత్మకకి భంగం వాటిల్లే సందర్భాలు లేకపోవని చెప్తూ, రచనలో కొంత సంక్లిష్టత సాధించడం,కొంత ధ్వనిప్రాయంగా చెప్పడం రచనని గట్టెక్కిస్తాయంటాడు.

ఒక్కమాటలో చెప్పాలంటే,రొమాంటిసిస్టు కవులు కవిత్వం విషయంలో ప్రతిపాదించిన romantic fragment ని పో, కథకి అనువర్తింపచేసాడు.  అంతేకాదు, తొలితరం బ్రిటిష్ రొమాంటిక్ కవులు, ముఖ్యంగా, వర్డ్స్ వర్త్ కవిత్వాన్ని నియమనిబంధనలనుంచి బయటపడవెయ్యడానికి చూస్తే, పో, కవిత్వానికీ, కథకీ కూడా శిల్పసంయోజనం అవసరమని ప్రతిపాదిస్తున్నాడు. కాని, ఇందులో కూడా అతడికి కాలరిడ్జినే ఆదర్శం. కవిత్వం spontaneous overflow of words అని వర్డ్స్ వర్త్ అంటూండగా, the best words in the best order is poetry  అని కాలరిడ్జి హెచ్చరిస్తున్నాడు. నియోక్లాసికల్ బంధాలనుంచి కళనీ,కవిత్వాన్నీ విడుదల చెయ్యాలని రొమాంటిసిస్టులు భావించినమాట నిజమే కాని, సాహిత్యకృతులకి ఒక అంతర్గత శిల్పముంటుందనీ, దాన్నుంచి తప్పించుంటే, అది సాహిత్యమే కాకుండా పోతుందని, కాలరిడ్జి చూచాయగా చెప్పినదాన్ని పో ఒక నవీన అలంకార శాస్త్రంగా మార్చేసాడు. వ్యవస్థ మీద ధిక్కారంగా మొదలైన రొమాంటిసిజం బయటి ప్రపంచంలో వ్యవస్థల్ని మార్చాలనుకుని,మార్చలేక, చివరికి సాహిత్యంలో నూతననిర్మాణానికి పూనుకుందన్నమాట.

ఇక రెండవ ప్రశ్న, ఆధునిక కథ డార్క్ రొమాంటిసిస్టు దశలోనే ఎందుకు ప్రభవించిందని? కారణం సుస్పష్టమే. కవిత్వం ఆదర్శాలు ప్రకటిస్తుంది. ఆ ఆదర్శాలు ఎక్కడ విఫలమవుతాయో,అక్కడ కథ పుట్టుకొస్తుంది. జీవితపు వైశాల్యాన్ని చిత్రించేది కవిత్వం, పగుళ్ళని పట్టుకునేది కథ. మనిషిలో అంతర్గతంగా ఉన్న వైరుధ్యాల్నీ, చీకటికోణాల్నీ, రహస్య ప్రదేశాల్నీ ఎత్తి చూపించి తద్వారా సత్యానికి మరింత సన్నిహితంగా ప్రయాణించాలని చూసిన డార్క్ రొమాంటిసిస్టుల చేతుల్లో చిన్నకథ రూపుదిద్దుకోవడంలో ఆశ్చర్యమేముంది?

సీసాలో దొరికిన రాతప్రతి

బాల్టిమోర్ పత్రిక ప్రకటించిన కథలపోటీకి పో ఆరు కథలు పంపించాడు. కాని వాటిలో ‘సీసాలో దొరికిన రాతప్రతి ‘కథలో ‘విస్తృఅతమైన భావానశక్తి ఉందనీ, కథకుడి పాండిత్యాన్ని కూడా ప్రతిబింబిస్తున్నదనీ సంపాదకులు ఆ కథకి బహుమతి ప్రకటించారు. అట్లాంటివే మరికొన్ని కథలు రాయమని కూడా ఆ రచయితకి సూచించారు. ఆ సలహా మేరకు పో Tales of the Grotesque and Arabesque అనె సంపుటిని 1840 లో ప్రకటించాడు. గ్రొటెస్క్ అంటే, వికృతమైంది అని అర్థం. మృతజీవులు మళ్ళా ప్రాణం పోసుకుని వచ్చినట్టు చిత్రిస్తే మనలో రేకెత్తే భయాన్ని కూడా గ్రోటెస్క్ అంటారు. ఇక ఆరబెస్క్ అంటే, అరేబియాకీ, ఇస్లామిక్ సంస్కృతికీ సంబంధించింది అని అర్థం.

ఈ కథ రాసినప్పుడు పో జీవితం ఇంతకన్నా బీభత్సంగానూ, భయానకంగానూ ఉంది. అప్పటికే అతణ్ణి సైన్యం నుంచి డిస్మిస్ చేసేసారు. డబ్బు కోసం పెంపుడు తండ్రికి ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. కాని ఫలితం శూన్యం. అతడు మళ్ళా బాల్టిమోర్ కి తిరిగివచ్చాడు. అతడి మేనత్త క్లెమ్, అత్త కూతురు విర్జీనియా అతడికి స్వాగతం పలికారు. తమ్ముడు ఆ ఏడాదే మరణించాడు. అమ్మమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. విర్జీనియా సోదరుడు హెన్రీ తాగుబోతుగా మారాడు. అంతదాకా పో వెతుక్కుంటున్న అనురాగం అతడికి ఈ కొత్త కుటుంబంలో దొరికిందిగానీ, భరించలేనంత దారిద్ర్యం.  ఆ కుటుంబాన్ని పోషించడంకోసం క్లెమ్ ఒక బుట్ట పట్టుకుని ఇంటింటికీ తిరిగి రొట్టె తునకలకోసం యాచిస్తూ ఉన్న దృశ్యమే పో కళ్ళముందు. ఆ పరిస్థినుంచి ఎట్లాగైనా సరే బయటపడాలని చూస్తున్న పో కి కథలపోటీ సంగతి తెలిసింది.

ఈ కథలో రొమాంటిసిజం డార్క్ రొమాంటిసిజంగా మారిపోయిన సామగ్రి అంతా ఉంది. సాహసయాత్ర, తూర్పుదేశాలవైపు యాత్ర, సముద్రం,తుపాను, మరణం, దక్షిణదిక్కుగా తెలియని ఏ అఖాతం వైపో ప్రయాణం, వివరించలేని ఒక సుడిగుండం, గుర్తుపట్టలేని పెద్ద ఓడ, ఆ ఓడ మరొక ఓడను ముంచెయ్యడం-అసలు నౌకాభంగమే ఒక అనాది ఇతివృత్తం. క్రీస్తుపూర్వం 2000 కాలం నాటి ఒక ఈజిప్షియన్ కథలో నౌక విరిగిన నావికుడి అనుభవం నుంచి, సింద్ బాద్, దేనియల్ డీఫో దాకా ఆ ఇతివృత్తం సాహిత్యప్రపంచాన్ని వెన్నాడుతూనే ఉంది. తక్కినకథల్లో నావికుడు బతుకుతాడు, ఈ కథలో నావికుడి కథ మాత్రమే బతుకుతుంది. అసలు ఇలా ఒక సీసాలో రాతప్రతి దొరకినట్టు చెప్పడంలోనే ఒక హర్రర్ ఉంది.

తరువాతి  రోజుల్లో విమర్శకులు ఈ కథని మొదటి సైంటిఫిక్ ఫిక్షన్ కథ గా కూడా చూస్తున్నారు. పో ని మొదటి డిటెక్టివ్ కథా రచయితగా బోర్హెస్ ప్రస్తుతించాడని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ఈ కథ రాయడానికి పదేళ్ళ కిందటే, అంటార్కిటికా ఖండం గురించి ప్రపంచానికి తెలిసింది. ఇందులో దక్షిణధ్రువం గురించిన చిత్రణలో, అది మానవుడి జ్ఞానానికీ, హేతువుకీ మించిన ప్రమాదస్థలమనే ఊహల్లో ఒక అభూతకల్పన ఉన్నప్పటికీ, ఆ రచయిత ఒక నవీన జిజ్ఞాసని మనలో మేల్కొల్పుతున్నాడు. మానవుడు ఇంతదాకా తెలుసుకున్న దానికన్నా మరింత విస్తృత ప్రపంచముందనే నమ్మకం రొమాంటిసిస్టు విశ్వాసానికి అనుగుణంగానే ఉంది. కథ మొదలుకావడం వాస్తవప్రపంచం గురించిన ప్రీతి తోనే మొదలైనా (భౌతికజీవితంపట్లనే ఎక్కువ మక్కువ చూపించడం నా మనోవృత్తిగా మారిపోయింది), కథ చివరివచ్చేటప్పటికి, ఆ భౌతికప్రపంచజ్ఞానం కూడా ఆ సుడిగుండంలో మునిగిపోయింది.

ఎడ్గార్ అలన్ పో

సీసాలో దొరికిన రాతప్రతి

బతకటానికి ఒక్కక్షణం మాత్రమే మిగిలినవాడికి

దాచుకోవలసిందేమీ ఉండదు

క్వినాల్డ్ – అటిస్

నా దేశం గురించీ, నా కుటుంబం గురించీ చెప్పుకోవడానికేమీ లేదు. నిరాదరణ వల్లా, కాలగతివల్లా నేను నా దేశానికీ నా కుటుంబానికీ పరాయివాణ్ణయిపోయాను. వారసత్వంగా వచ్చిన ఆస్తివల్ల నాకు చదువు చెప్పుకోదగ్గ స్థాయిలోనే దొరికింది. నా బుద్ధికుశలత్వం వల్ల చిన్నప్పుడు బాగా చదువుకున్న చదువుని వంటబట్టించుకోగలిగాను కూడా – వీటన్నిటినీ మించి జర్మన్ నీతిశాస్త్రవేత్తల్ని చదవడం నాకు అపారమైన సంతోషం కలిగించేది. అందుక్కారణం వాళ్ల ఉన్మాదభరితమైన వాచాలత్వంపట్ల అణచుకోలేని ఆరాధన కలగడం కాదు. అంతకంటే కూడా వాళ్ల ఆలోచనల్లో ఉండే అపసవ్యతను నా బుద్ధినైశిత్యం వల్ల సునాయాసంగా కనుక్కోవడం వల్లనని చెప్పాలి. నాది శుష్క జ్ఞానమని తరచూ అందరూ ఈసడించేవారు. ఊహాశాలిత్వం లేకపోవడం దాదాపుగా నేరమన్నట్టే మాట్లాడేవారు. నా అభిప్రాయాల్లో కరడుగట్టుకున్ననైరాశ్యవాదం వల్ల నేను ఎక్కువగా అపఖ్యాతినే మూటకట్టుకున్నాను. భౌతికజీవితంపట్లనే ఎక్కువ మక్కువ చూపించడం నా మనోవృత్తిగా మారిపోయింది. అందువల్ల ఎటువంటి సంఘటనలు జరిగినా వాటన్నిటినీ కూడా ఆ సంశయవాదదృక్కోణంలోనే చూడటం అలవాటయిపోయింది. ఒకరకంగా  దీన్ని ఈ యుగదోషంగానే చెప్పొచ్చు. సత్యసామీప్యంనుంచి మూఢవిశ్వాసపు జాడ వెతుక్కుంటూ పోవడానికి సిద్ధపడేవాళ్లల్లో బహుశా నా తరువాతే ఎవరన్నా అనుకుంటాను. నేను చెప్పబోయే కథకి ఈ ప్రాతిపదిక చాలనుకుంటాను, లేకపోతే నేను చెప్పబోయేదంతా ఏదో అసంబద్ధప్రేళాపనలాగా అనిపించవచ్చు. కానీ ఎటువంటి పగటికలలకూ తావివ్వని కఠినమనస్కుడికి నిజంగానే జీవితంలో సంభవించిన అనుభవం నేను చెప్పబోయేదంతా.

చాలాకాలం పాటు విదేశప్రయాణాల్లో గడిపిన తరువాత నేను మళ్ళా 18- లో మరొక ప్రయాణం చేపట్టాను. ఈ సారి సుసంపన్నమైన జనసమ్మర్థంతో కూడిన జావాద్వీపంలోని బటేవయ రేవులోని సుంగా ద్వీపసముదాయానికి నౌకాప్రయాణం చేపట్టాం. ఆ ప్రయాణంలో కొత్త యాత్రీకుణ్ణి నేను మాత్రమే. ఏదో చెప్పలేని అశాంతి నన్నొకదెయ్యంలాగా పట్టుకున్నందువల్ల మాత్రమే నేనా ప్రయాణానికి పూనుకున్నాను.

మా నౌక చాలా అందమైంది. దాదాపు నాలుగువందల టన్నుల బరువుంటుంది. రాగి అంచులు. దాన్ని మలబారు టేకుతో బొంబాయిలో రూపొందించారు. లక్షదీవుల్లో దాన్నిండా పత్తిబేళ్లు, నూనెడబ్బాలు ఎక్కించారు. అంతేకాక పీచు, బెల్లం, నెయ్యి పోకలు, కొన్నిపెట్టెలు నల్లమందు కూడా సరుకు ఎక్కించారు. ఆ సామానంతా మరీఅడ్డదిడ్డంగా కూరెయ్యడంతో నౌక దాదాపుగా వంగిపోయింది.

చిన్నగాలి వాటుకే మా నౌక సముద్రంలోకి ప్రవేశించింది. కొన్నిరోజుల పాటు మేము జావా ద్వీపపు తూర్పుతీరంవైపునే ప్రయాణిస్తూ ఉన్నాం. అప్పుడప్పుడూ ద్వీపసముదాయపు తీరాలకు తాకుతుండడం మినహా మా ప్రయాణపు విసుగును చేధించే ఆసక్తికరమైన సంఘటనేదీ మాకు తారసపడలేదు,

ఇక సాయంకాలం నౌకనెనక అంచు వైపున్న బద్దీలుని ఆనుకుని నించున్నప్పుడు నాకు దూరంగా వాయవ్య దిక్కున ఒక ఒంటరిమేఘమొకటి కనిపించింది. దాని రంగు చూస్తే అది చాలా ప్రత్యేకంగా అనిపించింది. మేం బటేవియా వదలిపెట్టిన తరువాత అట్లాంటి మేఘం కనిపించడం అదే మొదలు. దాదాపుగా సూర్యాస్తమయ సమయం దాకా నేను దాన్నే తదేకంగా చూస్తూ ఉన్నాను. అది తూర్పువైపునుంచి పడమటివైపు దాకా దిగంతం మీద పరచిన సన్నని ఆవిరిపట్టీ లాగా, సుదీర్ఘసముద్రరేఖ లాగా కనిపించింది. ఆ తరువాత నెమ్మదిగా చంద్రుడు ధూళిధూసరితంగా కొద్దిపాటి ఎరుపువన్నెలో కనిపించడం నా ధృష్టినాకర్షించింది. సముద్రం కూడా ఏదో విలక్షణంగా త్రోచింది. చూడబోతే సముద్రమేదో తీవ్రమైనమార్పుకు లోనవుతున్నట్టుగా కనిపించింది.నీళ్లుకూడా అసాధారణంగా పారదర్శకంగా కనిపించసాగాయి. నీళ్ల లోపలికి చూస్తే మా నౌక దాదాపు తొంభై అడుగుల లోతులో సాగుతున్నట్లనిపించింది. చుట్టూ గాలి వేడెక్కి దుర్భరంగా వీస్తోంది. సుళ్లు తిరుగుతున్న వేడిగాలి ఏదో ఇనుము కరిగిస్తున్నట్టుగా పైకి లేస్తోంది. రాత్రి కావటంతోటే మొత్తం గాలి అంతా అదృశ్యమైపోయింది. మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. దాన్నిమించిన నిశ్శబ్దాన్ని ఊహించడం అసాధ్యం. ఓడ అంచుమీద వెలిగించిన కొవ్వొత్తి ఎటువంటి కదలికా లేకుండా నిశ్చలంగా వెలుగుతోంది. రెండువేళ్లమధ్య పొడవాటి వెంట్రుక కూడా ఎటువంటి ప్రకంపనాలేకుండా పరమనిశ్చలంగా ఉండగలదన్నమాట. కానీ ఎటువంటి ప్రమాదాన్నీ శంకించనక్కర్లేదని మా కెప్టెన్ చెప్పాడు. అంతేకాకుండా మేము నెమ్మదిగా తీరంవైపుగా పోతున్నందున అతడు తెరచాపలు మడిచి లంగరు వెయ్యమన్నాడు. ప్రత్యేకించి ఎటువంటి కాపలా అవసరం లేదని కూడా అనుకున్నాం. నౌకాసిబ్బంది ప్రధానంగా మలయావాసులు. వాళ్లంతా హాయిగా డెక్ మీద నడుమువాల్చారు. నేను కూడా క్రిందకి వెళ్లానుకానీ, నా మనసులో ఏదో అపశకునభావన లేకపోలేదు. ఆ మాటకొస్తే ప్రతిఒక్క దృశ్యమూ కూడా ఏదో ఒక భయంకరమైన ఎడారితుఫాను మమ్మల్ని చుట్టముట్టబోతున్నదనే భయాన్ని కలిగిస్తూనే వచ్చింది. నేను నా భయాలు మా కెప్టెన్ ముందు వెళ్లబోసుకున్నానుకానీ అతడు అవేమీ పట్టించుకునేలేదు. పైగా నాకేమీ జవాబివ్వకుండానే వెళ్లిపోయాడు. నా మనసులో చెలరేగుతున్న ఆతృతవల్ల నేను నిద్రపోలేకపోయాను. దాంతో మళ్లా  అర్ధరాత్రివేళకు నేను మళ్లీ ఓడపైకి ఎక్కాను. ఓడ నిచ్చెన పై మెట్టుమీద పాదం మోపానోలేదో నాకో పెద్దధ్వని వినబడింది. పెద్దపెద్ద మిల్లుచక్రాలు వేగంగా తిరిగేటపుడు పుట్టే గుణగుణ చప్పుడది. అదేమిటో నేనర్థం చేసుకునేలోపే మా ఓడ ఊగడం మొదలుపెట్టింది. మరుక్షణంలోనే భయంకరమైన నురుగు మామీద విరుచుకుపడి మమ్మల్ని అటూ ఇటూ చెదరగొడుతూ మొత్తం ఓడ పై భాగాన్ని ఈ అంచునుంచి ఆ అంచుకి ఊడ్చి పారేసింది.

అయితే అట్లా మామీద విరుచుకుపడ్డ ఆ ఉధృతి ఒకరకంగా ఓడను కూడా బయటపడేసింది. మొత్తమంతా నీళ్లతో నిండిపోయినప్పటికీ ఓడ ఒక నిముషం తరువాత బరువుగా సముద్రంలోకి పైకి లేచి తనను బలంగా క్రిందకు నొక్కుతున్న తుపాను పట్టు విదిలించుకుని ఎట్టకేలకు లేచి తననుతాను నిలదొక్కుకుంది.

ఏ అద్భుతంవల్ల నేను వినాశనం నుంచి తప్పించుకున్నానో చెప్పడం నిజంగా కష్టం. నామీద విరుచుకుపడ్డ నీటి ఉప్పెన కలిగించిన నివ్వెరపాటునుంచి తేరుకుని చూసుకునేటప్పటికి నేను ఓడ అంచుకీ, చుక్కానికీ మధ్య ఇరుకుని ఉన్నాను. అతికష్టం మీద నా కాళ్ళు  కూడదీసుకుని తత్తరపాటుతో చుట్టూ చూసేటప్పటికి మేం తీవ్రాతితీవ్రమైన కెరటాల హోరు మధ్య ఇరుక్కున్నామని తెలియవచ్చింది. మా ఊహకు కూడా అందనంత తీవ్రంగా మా చుట్టూ పర్వతంలాగా నురగలు కక్కుతున్న సముద్రం సుడిగుండంలాగా మమ్మల్ని చుట్టుముట్టేసింది. కొద్దిసేపటికి ఒక ముసలివాడి కంఠస్వరం వినబడింది. అతడు స్వీడ్ దేశీయుడు. మేము రేవు దాటుతున్నపుడు అతడు కూడా మా ఓడ ఎక్కాడు. నేను నాశక్తి అంతా కూడదీసుకుని అతణ్ణి ఎలుగెత్తి పిలిచాను. అతడు కూడా కష్టం మీద ఎదురీదుకుంటూ నా వైపుకు రాగలిగాడు. క్రొద్దిసేపటిలోనే మాకర్థమయ్యిందేమంటే, ఆ దారుణప్రమాదంనుంచి బతికిబట్టకట్టింది మేమిద్దరమేనని. డెక్ మీద ఉన్నవాళ్లంతా మేమిద్దరం తప్ప మొత్తం కొట్టుకుపోయారు – ఇక కెప్టెన్ని, అతడి సహచరుల్నీ సముద్రం నిద్రలోనే కబళించివేసింది. మొత్తం ఓడ గదులన్నిటినీ నీళ్లు ముంచెత్తాయి. ఎట్లాంటి సహాయం లేకపోవడంతో మేం ఆ ఓడను రక్షించుకోవడానికి చేయగలిగిందేమీ లేదని కూడా మాకర్థమైంది. అంతేకాక ఏ క్షణమైనా ఓడ మునిగిపోవచ్చనే ఊహ వల్ల మా కాళ్ళూ, చేతులూ ఆడలేదు. సముద్రపు తుఫాను తొలితాకిడికే మా ఓడ కేబుల్ విచ్చిపోయింది. లేకపోయుంటే మేం కూడా తక్షణమే మునిగిపోయి ఉండేవాళ్లం, సముద్రం తన భీకరవేగంతో మమ్మల్ని కవ్వంలాగా చిలికేసింది. సముద్రజలాలు మా మీద ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఓడ అంచులు బాగా దెబ్బ తిన్నాయి. ఏ రకంగా చూసినా మేం చాలా పెద్ద ప్రమాదానికే లోనయ్యాము. అయితే ఓడ పంపులు దెబ్బతినకపోవడంతో మా సంతోషానికి అవధి లేదు. అందువల్ల మేము ఓడను పెద్దగా మరమ్మత్తు చేయవలసిన అవసరం లేకపోయింది. సముద్రపు తుఫానుఉద్వేగం దాదాపుగా ఆగిపోయింది. ఇక తీవ్రంగావీస్తున్న గాలినుండి మాకేమంత ప్రమాదం కనిపించలేదు కానీ, అది ఎంత తొందరగా అణగిపోతుందా అని మాత్రమే కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయాం. కాని అప్పుడు మేమున్న పరిస్థితుల్లో మళ్లా మరొక్క ఉప్పెన విరుచుకుపడేటట్లయితే మేం కూడా అంతరించిపోకతప్పదని మాకు తెలుస్తూనే ఉంది.

కానీ మా భయం అంత తొందరగా నిజమయ్యే పరిస్థితి కనిపించలేదు. మొత్తం ఐదు పగళ్లూ, రాత్రుళ్లూ ఓడ లెక్కకుమించినంత వేగంతో ప్రయాణిస్తూనే ఉంది. ఆ రోజులంతా మాకు బతకడానికున్న ఏకైక ఆధారం కొద్దిపాటి బెల్లం మాత్రమే. అది కూడా అతికష్టంమీద సంగ్రహించుకోగలిగాం, గాలులు ఒకదానివెనుక ఒకటి తీవ్రంగా వీస్తూనే ఉన్నాయి. మామీద విరుచుకుపడ్డ సముద్రపు తుపానులాగా మరీహింసాత్మకంగా ఉండకపోయినప్పటికీ ఆ తుపాను నా జీవితంలో అంతదాకా చూసిన తుపానులన్నిటికన్నా తీవ్రమైందనే చెప్పాలి. మొదటి నాలుగురోజులు అటూఇటూ కొద్దిగా ఊగిసలాడుతున్నా ఓడ మొత్తానికి దక్షిణంగానూ, నైరుతిగానూ ప్రయాణిస్తూ ఉండేది. మేము బహుశా కొత్త హాలాండు తీరం వైపు ప్రయాణిస్తూ ఉండిఉంటాం. ఐదవరోజుకల్లా చలి మరీ అధికమైంది. అప్పటికి గాలులు కూడా ఉత్తరందిక్కుగా వీస్తూ ఉన్నాయి. సూర్యుడు చాలా బలహీనమైన పసుపువన్నె కాంతితో ఉదయించాడు. దిగంతరేఖమీద కొద్దిమేరకు మాత్రమే చేరుకున్నాడు. సూర్యకాంతి చాలా అస్పష్టంగా ఉంది. ఆకాశంలో మేఘాలేవీ కనిపించకపోయినప్పటికీ గాలిమాత్రం మరింత ఆధికమవుతూ మరింత తీవ్రంగానూ, ఉద్దృతంగానూ వీస్తూ ఉంది. మధ్యాహ్నంకల్లా సూర్యుడు మరి౦త స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టాడు. కానీ ప్రకాశహీనంగా, పేలగా, బలహీనంగా పరావర్తన రహితంగా ఉన్నాడు. చూడబోతే సూర్యకిరణాలన్నీ సూర్యుడిలోనే కేంద్రీకృతమైపోయినట్లుగా అనిపించింది. ఉద్ధృతంగా తంగా విరుచుకుపడుతున్న సముద్రంలో పూర్తిగా మునిగిపోయేముందు ఏదో అదృశ్యశక్తి ఒక్కసారి మంటని ఆర్చేసినట్టు సూర్యుడిలోని వెలుగంతా ఒక్కసారిగా చల్లారిపోయింది. అగాధమైన సముద్రంపైన కాంతిహీనమైన వెండి అంచు పరుచుకుంది.

ఆరవరోజు ఉదయించడం కోసం మేము నిరీక్షించాం కానీ ఫలితం లేకపోయింది. ఆ రోజు నాకూ ఉదయించలేదు, నాతోపాటే ఉన్న స్వీడిష్ మానవుడికి కూడా ఎప్పటికీ ఉదయించలేదు. అప్పటికి మేము మా చుట్టూ గాఢమైన అంధకారంలోచిక్కుకుపోయాం. ఆ చీకటి ఎంత దట్టంగా ఉన్నదంటే ఓడకి ఇరవై అడుగుల దూరంమీంచి మేమేమీ చూడలేకపోయాం. అనంతచరమరాత్రి నెమ్మదిగా మమ్మల్ని చుట్టుముట్టడం మొదలుపెట్టింది.

భూమధ్యరేఖకుదగ్గరలో సముద్రాలమీద కనిపించే భాస్వరకాంతిలాంటిది చుట్టూ కనిపించడం మొదలుపెట్టింది. తుపాను ఇంకా చల్లారని ఉద్ధృతితోటే చెలరేగుతున్నప్పటికీ, అప్పటిదాకా మామీద విరుచుకుపడుతున్న నురుగు కనిపించకుండా పోయింది. ఎటుచూసినా భయానకమైన విషాదం తప్ప మరేమీ కనిపించలేదు. మేమేదో నల్లని ఎడారిలో ఉక్కలో చిక్కుకుపోయినట్టనిపించింది.  ఆ ముసలి స్వీడిష్ మానవుడి నరనరానా భయం నెమ్మదిగా ఆవహించడం మొదలుపెట్టింది. నామటుకు నేను కూడా నిశ్చేష్టితుణ్ణి కావడం మొదలుపెట్టాను. మొత్తం ఓడసంగతి వదలిపెట్టి వీలయినంతగా మమ్మల్ని మేము రక్షించుకోవాలని తాపత్రయపడ్డాం. ఆ ప్రయత్నం ఎంత నిష్ప్రయోజనకరమైనప్పటికీ తెరచాప కొయ్యలను గట్టిగా పట్టుకుని మహాసాగర ప్రపపంచంలోకి శూన్యదృక్కులతో చూస్తుండిపోయాం. కాలం ఎంత గడుస్తుందో తెలుసుకోవడానికి మాకేదారీ లేకపోయింది. అసలు మేమెటువంటి పరిస్థితిలో ఉన్నామో మా ఊహకందలేదు. ఒకటిమాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అంతదాకా మాముందు ఏ నావికాసమూహమూ ప్రయాణించనంత దక్షిణంవైపుగా మేం చొచ్చుకుపోతున్నామని తెలుస్తోంది. కానీ ఆ దారిలో మాకు మంచు అడ్డం కాకపోవడమే చాలా ఆశ్చర్యమనిపించింది. అంతసేపూ ప్రతినిముషమూ అదే చివరినిముషమున్నట్టుగా భయపెడుతూ వచ్చింది. పర్వతంలాగా ఎగిసిపడుతున్న ప్రతిఒక్క కెరటమూ మమ్మల్ని ముంచెత్తడానికే విరుచుకుపడుతూ ఉండింది. అటువంటి ఎగిసిపాటు నేనప్పటిదాకా కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఉద్ధృతిలో పడి మేం కొట్టుకుపోలేదంటే, అది నిజ౦గా అద్భుతమనే అనాలి. మేం ప్రయాణిస్తూన్న ఓడ మరీ బరువుగా లేదనీ, అది నిజంగానే చెప్పుకోదగ్గ నిర్మాణమననీ నా సహచరుడు నాకు చెప్తూనే ఉన్నాడుకానీ ఇక అప్పటికి నాకు ఏ కొద్దిపాటి ఆశ కూడా మిగలలేదు. మరణాన్ని బహుశా ఒక గంటకన్నా ఎక్కువ వాయిదా వేయలేమని నాకు నేనే దుఃఖపూరితంగా చెప్పుకున్నాను. ఓడ ముందుకు సాగుతున్న ప్రతి అడుగులోనూ మా ముందు నల్లని సముద్రతరంగాలు మరింత భీకరంగా నోరు తెరుచుకుని మమ్మల్ని మింగజూస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు మేము సముద్రపక్షులకన్నా ఎత్తులో ఎగిరిపడుతున్నాం. మరొకప్పుడు ఏదో జలనరకంలోకి ఒక్క పట్టున జారిపోతున్నాం. ఆ నరకంలో గాలి గడ్డకట్టిపోయింది. అక్కడ నిద్రిస్తున్న సముద్రరాక్షసుణ్ణి ఏ చప్పుడూ మేలుకొల్పేటట్టు లేదు.

మేము అట్లాంటి ఒక అఖాతపు లోతుల్లో ఉన్న సమయంలో ఆ రాత్రి నా సహచరుడు ‘చూడు చూడు ‘అంటూ గట్టిగా పెట్టాడు. ఆ అరుపు నా చెవుల్ని చీల్చేసింది.. ‘భగవంతుడా చూడు, చూడు’ అని అతనంటూ ఉండగా పాలిపోయిన ఎర్రటికాంతి మాకు నాలుగుదిక్కుల నుండీ ప్రవహిస్తూ వచ్చి డెక్ మీద దుర్భరమైన వెలుగుని ప్రసరింపచేసింది. నేను పైకి చూసేటప్పటికి నాకు కనిపించిన దృశ్యం నా రక్తప్రసారాన్ని గడ్డ కట్టించింది. సరిగ్గా మానెత్తిమీదనే మేం ఊహించలేనంత ఎత్తున మామీద నిటారుగా విరుచుకుపడేటట్టుగా ఒక మహానౌక సుమారు నాలుగువేల టన్నుల బరువుతో మా మీదకు ఒరుగుతున్నది. తన ఎత్తుకన్నా దాదాపు వందరెట్లు ఎత్తున ఒక తరంగం మీద ఊగిసలాడుతున్న ఆ ఓడ పరిమాణంలో మాకు అంతదాకా తెలిసిన ఏ తూర్పుఇండియా నౌక కూడా దానికి సాటిరాదు. ఆ ఓడ ఆకృతి నల్లగా ఉంది. మామూలుగా ఓడలుమీద కనవచ్చే నగిషీలేవీ దానికి లేవు. ఇత్తడి శతఘ్ని ఒకటి ముందుకు చొచ్చుకు కనిపిస్తోంది. అసంఖ్యాకమైన యుద్ధ దీపాల వెలుగులు దానిచుట్టూ విరజిమ్ముతున్నాయి. ఓడ కదలికలకు అనుగుణంగా ముందుకీ వెనక్కి ఊగుతున్నాయి. అటువంటి భయానమైన సముద్రతుపానులో ఊహించడానికి అలవికాని ఆ సాగరశయ్యమీద ఆ నౌక అంతస్థిరంగా ముందుకు కదులుతుండడం చూసి మాలో భయం కట్టలుతెంచుకుంది. నేను దాన్ని మొదట చూసినపుడు దాని ముందుభాగం మాత్రమే కనబడింది. కానీ అది నెమ్మదిగా మాముందు ప్రత్యక్షం కాగానే దానివెనక నీళ్లల్లో పరుచుకున్న అగాథమైన అఖాతం కూడా కనబడుతోంది. ఒక క్షణం పాటు అది తన మహిమకు తనే అచ్చెరువొందుతున్నట్లుగా ఆ తరంగశిఖరం పైన భయం గొల్పుతూ ఆగి, అప్పుడు తీవ్రంగా సంచలిస్తూ, ప్రకంపిస్తూ ముందుకొచ్చింది.

ఆ క్షణంలో నాలో ఏ ఆత్మజాగృతి నన్నావహించిందో నాకే తెలియదు. వీలైనంతదూరం వెనక్కిజరుగుతూ మమ్మల్మి ముంచెత్తబోతున్న ఆ మహావినాశనానికి నేను నిర్భయంగా ఎదురునిలిచాను. అప్పటికే మా ఓడ తన నలుగులాటలనుంచి తప్పించుకుని నేరుగా సముద్రగర్భంలోకి మునిగిపోవడానికి సమాయత్తమవుతూ ఉంది. అదే సమయంలో తన మీదకు విరుచుకుపడబోతున్న పెనుభారం కూడా అప్పటికే నీళ్లల్లోకి చొచ్చుకుపోతున్న దాని శరీరం మీద మరింత దుర్భరభారాన్ని మోపింది. దాంతో ఆ ఉదుటికి అది నన్ను చుట్టచుట్టి ఆ క్రొత్తనౌకమీదకి విసిరిపారేసింది. నేను పడుతుండగానే ఆ నౌక భారంగా పైకీ క్రిందకి ఊగిసలాడుతూ ముందుకుసాగిపోయింది. ఆ సమయంలో ఓడ సిబ్బంది అంతా ఏం జరుగుతోందో తెలియని అయోమయంలో ఉండడంతో నేను వాళ్లకెవరికంటా కనబడలేదు. నన్నెవరూ గమనించకుండానే నేను ఓడ ప్రధానద్వారం దగ్గరకు చేరుకున్నాను. అది ఓరగా తెరిచి ఉండడంతో నెమ్మదిగా లోపలికి ప్రవేశించాను. నేనెందుకట్లా చేశానో చెప్పడం కష్టం. బహుశా ఆ ఓడ నావికా సముదాయం నాకంట పడగానే నేను భయానికి లోనైనందువల్ల అట్లా రహస్యంగా చొరబడి ఉండవచ్చు. వాళ్లంతా మొదటి చూపులోనే కొత్తగా అనుమానించదగ్గ వాళ్లలాగా భయం గొల్పుతూ కనబడ్డారు. అందుకని నేను ఆ ఓడమాళిగలో ఒక రహస్యస్థలం వెతుకుని దాక్కున్నాను. ఓడలోని పెద్దపెద్ద చెక్కలమధ్య కొద్దిపాటి జాగా చేసుకుని అక్కడే రహస్యంగా ఒదిగాను.

నేనా మాళిగలో కుదురుకున్నానో లేదో అప్పుడే ఒక మనిషి అడుగు అటువైపు పడింది. ఆ మనిషి అటూఇటూ అస్థిరంగా కదులుతూ ఉన్నాడు. నేనతడి ముఖాన్ని చూడలేకపోయినప్పటికీ అతడెట్లా కనబడుతున్నాడో పోల్చుకోగలిగాను. అతడు బాగా వయస్సు మీదపడ్డవాడుగానూ, బలహీనుడుగానూ కనిపించాడు. వార్ధక్యం వల్ల అతడి మోకాళ్లు మూలుగుతున్నట్లుగా, అతడి మొత్తం దేహమంతా వణుకుతున్నట్లుగా అనిపించింది. బలహీన కంఠస్వరంలో నాకర్థంకానిదేదోభాషలో అతడేదో గొణుక్కున్నాడు. అక్కడ శిథిలమవుతున్ననావికాపటాలు, ఏవేవో పరికరాల మధ్య చేతులుచాపి దేనికోసమో వెతుకుతున్నాడు. అతడి తీరు చూస్తే వృద్ధాప్యపు అశక్తతతో పాటూ, దైవసమానమైన గాంభీర్యంకూడా కనిపించింది. మొత్తానికి అతడు తిరిగి డెక్ మీదకు వెళ్లిపోయాడు. ఇక అతడు నాకంటపడలేదు.

అప్పుడు నా ఆత్మనొక భావన ఆవహించింది. దానికి నేనేపేరూ పెట్టలేను. ఆ సంవేదనను ఫలానా అని వివరించలేను కూడా, అందుకు నా పూర్వజీవిత అనుభవాలు సరిపోవు. నా భవిష్యత్తు కూడా అందుకు నాకే అవకాశమూ ఇవ్వదనే అనుకుంటున్నాను. ఆ మాటకొస్తే భవిష్యత్తు గురించి ఆలోచించడం నా మనస్సుకు అపశకునంగా కూడా తోస్తోంది. నా భావాలు నన్నెప్పటికీ తృప్తి పరచవని నాకు తెలుసు. అలాగని ఈ భావాలు స్పష్టంగా లేకపోవడం కూడా నాకేమంత ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే ఈ భావాలు కలగడానికి ఏది మూలకారణమో అది నాకు చాలా కొత్తగా అనిపిస్తోంది. అందుకని నా ఆత్మకే ఒక నూతన స్వభావం చేకూరుతుందని అనిపించింది.

నేను ఈ మహా నౌక మీద అడుగుపెట్టి చాలా సేపే అయింది. నెమ్మదిగా నా భవితవ్యం ఒక ఆకృతి సంతరించుకోవడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న మనుషులు బొత్తిగా అర్థంకాకుండా ఉన్నారు! నేనెంతమాత్రం ఊహించలేని ఆలోచనల్లో కూరుకుపోయి వాళ్లు నన్ను గమనించకుండానే నన్ను దాటిపోతున్నారు. ఆ మాటకొస్తే నేను దాగిఉన్నానని అనడం కూడా సరైంది కాదు. ఎందుకంటే అసలు మనుషులకి నేను కనబడనే కనబడను కనుక ఇప్పుడు నేను వాళ్ల కళ్లముందునుంచే ఓడకెప్టెన్ తాలూకు సొంతగదిలోకి ప్రవేశించాను. నేను రాస్తున్న ఈ అనుభవాలకు అవసరమైన సరంజామా అక్కడనుంచే తెచ్చుకున్నాను. ఇంతదాకా రాసిందికూడా వాటితోటే ఇక ఎప్పటికప్పుడు ఈ అనుభవాలను రాస్తూ పోతాను. ఈ రాసిందాన్ని ప్రపంచానికి అందజేసే అవకాశం దొరకడం కష్టమే కానీ, అటువంటి ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండలేను. మొత్తం రాసేసినతరువాత ఈ రాతప్రతిని ఓ సీసాలో పెట్టి దాన్ని సముద్రంలోకి విసిరేస్తాను.

ఇప్పుడు మళ్లా నాలో క్రొత్త ఆలోచనలు రేకెత్తించే సంఘటనొకటి జరిగింది. అటువంటి సంఘటనలు దైవికమా? నేను డెక్ మీద ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా తిరుగుతూ అక్కడ ఓడ అడుగుభాగంలో ఓ పక్కన పడివున్న తెరచాపదొంతరలమీదా, ఓడ తాళ్లచుట్టలమీదా పడ్డాను. విధివశాత్తు నాకు సంభవించిన పరిస్థితులగురించి ఆలోచిస్తూ నేను అసంకల్పితంగానే అక్కడుండే ఒక తారుకుంచె చేతుల్లోకి తీసుకున్నాను. నా పక్కనే ఒక పీపామీద ఒక పెద్దతెరచాప చక్కగా మడిచి ఉంది. నేను దానిమీద ఆ కుంచె తో రాయటం మొదలుపెట్టాను. నేను అసంకల్పితంగా రాసిన అక్షరాలు చివరికి డిస్కవరీ అనే పదంగా రూపుదిద్దుకున్నాయి.***

ఇక ఆ పైన నేను ఆ ఓడ నిర్మాణం గురించి రకరకాలుగా పరిశీలించాను. ఆ పడవలో చాలా ఆయుధసంపత్తి ఉన్నప్పటికీ అది యుద్ధనౌకలాగా అనిపించలేదు. దాని నిర్మాణం, అందులోఉన్న సరంజామా దాని కట్టబడి మొదలైనవన్నీ చూస్తే అలా అనిపించటం లేదు. అది ఎటువంటి ఓడ కాదో నాకు అర్థమవుతూనే ఉంది – కానీ అది ఎటువంటి ఓడ అన్నది చెప్పడం దుస్సాధ్యమనే అనిపిస్తోంది. అదెలాంటిదో నాకు తెలియటం లేదు. కాని దాని విచిత్రమైన నమూనా, దాని పెద్దనిర్మాణం, తెరచాప కొయ్యలు, గుడ్డలు, చాలా సరళంగా కనిపిస్తున్న ముందుభాగం, బాగా పాతబడ్డ వెనుకభాగం ఇవన్నీ చూస్తూంటే నాలో ఉండీ ఉండి ఏవో చిరపరిచిత భావనలు కదలాడుతున్నాయి. నా మనస్సులో ఏవో స్మృతులతాలూకు అస్పష్టఛాయలూ, ప్రాచీన విదేశీ కథనాల గతించిపోయిన పూర్వయుగాల అస్పష్ట జ్ఞాపకాలు కలగలసిపోతున్నాయి.

నేను ఆ ఓడ నిర్మాణానికి వాడిన చెక్కల్ని కూడా పరిశీలనగా చూశాను. ఆ సామగ్రి నాకు అపరిచితంగా అనిపించింది. ఆ ఓడ నిర్మాణానికి వాడిన చెక్క అసలు అటువంటి నిర్మాణాలకు ఎంతమాత్రం అనువైంది కాదని అనిపించింది. ముఖ్యంగా ఆ కొయ్య మరీ గుల్లగా అనిపించింది. ఆ ఓడ సముద్రాలమీద సుదీర్ఘకాలం ప్రయాణిస్తూ వచ్చినందువల్ల పాతబడిపోయినమాట నిజమే, అలాగే ఏళ్లతరబడి ప్రయాణిస్తూన్నందువల్ల దాన్ని చెదలు తినేసినమాట కూడా నిజమే. కానీ ఆ చెక్క సరిగా లేదనిపించడానికి అవి కారణాలుకావు. బహుశా నేను మరీ అతిగా చెప్తున్నట్టు ఉంటుంది కానీ ఆ చెక్క లక్షణాలన్నిటినీబట్టి చూస్తే స్పానిష్ ఓక్ లాగా అనిపించింది. అసహజంగా ఉబ్బిపోయిన స్పానిష్ చెక్కలాగా అనిపించింది.

పై వాక్యం నాకొక డచ్ నావికుడి మాటలు గుర్తుచేస్తున్నాయి. అతడు సముద్రంమీదనే జీవితమంతా గడిపేసినవాడు. ఎప్పుడైనా అతడు మాట్లాడిన మాటల్ని ఎవరేనా నమ్మకపోతే అతననేవాడుకదా, ‘సముద్రమున్నంతకాలం ఓడ కూడా నావికుడి శరీరంలాగా పెరుగుతూనే ఉంటుంది ‘ అని. ఇప్పుడు ఆ మాటలే గుర్తొస్తున్నాయి.***

ఓ గంట క్రిందట నేను ఓ నావికులగుంపు మధ్య చొరబడాలని చూశాను. వాళ్లు నన్నేమీ పట్టించుకోలేదు. *

వాళ్లందరిమధ్యనే నిల్చున్నప్పటికీ అసలు వాళ్లకి నేనున్నానని స్పృహ ఉన్నట్టే అనిపించలేదు. నేను ఓడమాళిగలో దాక్కున్నపుడు చూసిన మొదటి నావికుడిలానే వీరందరూ కూడా వృద్ధాప్యచిహ్నాలతో కనబడుతూ ఉన్నారు. వార్ధక్యంవల్ల వాళ్ల మోకాళ్లు తడబడుతున్నాయి. దుర్బలత్వంవల్ల వాళ్ల భుజాలు వాలిపోయాయి. వాళ్ల చర్మం ముడతలుపడి గాలికి రాసుకుంటోంది. కంఠస్వరాలు బలహీనంగా కంపిస్తూ అస్పష్టంగా వినవస్తున్నాయి. వాళ్ల నేత్రాలు పుసికలు కట్టిఉన్నాయి. నెరిసిపోయినజుత్తు ఆ తుపానులో నిక్కబొడుచుకుని కనిపిస్తోంది. డెక్ మీద ఎటుచూసినా కొలబద్దలూ, నావికసామగ్రీ, దిక్సూచులూ మొదలైనవన్నీ పాతకాలపు వింతనిర్మాణాలతో కనిపిస్తున్నాయి.***

నేనిందాక అక్కడొక తెరచాప మడిచిఉంది అని చెప్పాను కదా. అప్పట్నుంచీ దాసితి ఏటవాలుగా కొట్టుకుపోతున్న నౌక దక్షిణంవైపు నెట్టుకుంటూ తీవ్రంగా ముందుకుపోతోంది. దానిమీద ఎటుచూసినా ముతకగుడ్డలు కుక్కి ఉన్నాయి. తనమీద ఉన్న పెద్దపెద్ద సరుకుల డబ్బాలతోపాటు, అడుగున మడిచిఉన్న తెరచాపలదాకా అన్నిటితో సహా ఆ ఓడ తన మీద విరుచుకుపడుతున్న నీటి ఉద్ధృతిని చీల్చుకుంటూ ఎలా ముందుకుపోతున్నదీ ఊహించిచూడవలసిందే. నాకు డెక్ మీద కాళ్లు ఆనడం అసాధ్యమనిపించింది. అందుకని డెక్ వదిలిపెట్టేశాను. కానీ దానిమీద ఉన్న సిబ్బంది మాత్రం ఎటువంటి ఇబ్బందీ పడటంలేదు. ఆ పెద్ద ఓడని సముద్రం ఒక్కపెట్టున మింగేయకపోవడం నాకు నిజంగానే అద్భుతాల్లోకెల్లా అద్భుతమనిపించింది. మేము మాముందు నోరు తెరుచుకున్న అఖాతంలోకి జూరిపోకుండా ఏదో అనంతకాలపు అంచుమీద అట్లానే ఎన్నటికీ సాగిపోక తప్పదనిపించింది. ఒక బాణంలాగా దూసుకుపోయే సముద్రపక్షిలాగా మేమా కెరటాలమీద, నాకంతదాకా తెలిసినదానికన్నావెయ్యిరెట్ల శక్తితో, ముందుకు సాగుతూనే ఉన్నాం. సముద్రజలాలు మహాపరిమాణంతో మాముందు ఏదో సాగరగర్భంలోని రాక్షసమూకలాగా తలెత్తుతూనే ఉన్నాయికానీ మమ్మల్ని నశింపచేయటానికి శక్తిచాలనట్టుగా, ఒట్టి బెదిరింపులు మాత్రమే బెదిరిస్తున్నట్టున్నాయి. మేమిట్లా అడుగడుగునా ప్రమాదంనుంచి తప్పించుకోవడమనేది నిజంగా ఏ కారణంవల్లనో నేను చెప్పలేకపోతున్నాను – బహుశా మా ఓడ మరేదో మహాప్రవాహప్రభావంలోనైనా ఉండిఉండాలి లేదంటే సాగరగర్భంలో మరేదో మహాప్రవాహం మమ్మల్ని రెండుచేతుల్తోణూఊ భద్రంగా తేలుస్తూండాలి.***

నేను ఓడ కెప్టెన్ ని అతడి గదిలోనే ముఖాముఖి చూశానుగానీ నేనూహించినట్టే అతడు నన్ను పట్టించుకోలేదు. మామూలుగా చూస్తే అతడి వదనంలో గానీ, శరీరాకృతిలో చెప్పుకోదగ్గదేమీ కనిపించడు – కానీ నాకెందుకో అతన్ని చూడగానే గొప్ప ఆశ్చర్యంతో కూడిన భయం, అణచుకోలేనంత గౌరవం ఒక్కసారే కలిగాయి. కావటానికి అతడు కూడా దాదాపుగా నా అంత ఎత్తే ఉన్నాడు. అంటే ఐదడుగుల ఎనిమిదంగుళాలు, శరీరం పొందిగ్గా ఉంది. అయితే మరీ ధృఢంగాకానీ,  లేదా మరీ చెప్పుకోదగ్గట్టుగా మాత్రం లేదు. కానీ అతడి ముఖం మీద కనవచ్చే విలక్షణ భావప్రకటన – అదే నా మనస్సులో చెప్పలేనంత ఉద్వేగాన్నీ చెరపలేని సంవేదననీ రేకెత్తిస్తున్నది. సాధారణంగా మనుషుల్లో జీవితానుభవంవల్ల ఒనగూడే అద్భుతమైన, ఉత్తేజపూరితమైన అభివ్యక్తి అది. అది చాలా నిశితంగానూ, స్పష్టంగా కనబడుతోంది. కొద్దిగా ముడతలు పడ్డప్పటికీ అతడి నుదుటిమీద ఎన్నోఏళ్ల జీవితముద్రలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అతడి నెరిసిన జుత్తు జీవించిన గతానికి సాక్ష్యంగానూ, అతడి నేత్రాలు భవిష్యత్తును సూచించే శిశువుల్లానూ ఉన్నాయి. ఆ కేబిన్ నేలమీద  ఇనుప కొక్కాలతో  కుట్టిన పెద్దపెద్ద విచిత్రమైన జంబుఖానాలు పరచి ఉన్నాయి. రకరకాల సైన్సుపరికరాలు ఒకపక్కన పడి శిథిలమవుతూ ఉన్నాయి. దాదాపుగా వాడడం మానేసిన విస్మృతపాతకాలపు పటాలు పోగుపడిఉన్నాయి. అతడు తన తల వంచి తన చేతుల్లోఉన్న ఏదో కాగితాన్ని స్థిరంగా, తదేకంగా చూస్తూన్నాడు. అది ఏదో అజ్ఞాపత్రంలాగా ఉంది. దానిమీద ఒక చక్రవర్తి సంతకం కనిపిస్తోంది. నేను ఓడమాళిగలో దాక్కుని చూసిన మొదటినావికుడిలానే ఇతడు కూడా తనలోతాను ఏదో గొణుక్కుంటున్నాడు. ఆ శబ్దాలుఏవో విదేశీభాషకు సంబంధించినవి.అవి చిరాకుపుట్టించేవిగా ఉన్నాయి. అతడు నాకు పక్కనే ఉన్నప్పటికీ అతడి కంఠస్వరం మాత్రం ఎక్కడో మైలుదూరంనుంచి వినిపిస్తున్నట్టుంది.***

ఆ ఓడా, దానిలో ఉన్న సమస్తం కూడా ఏదో పురాతనకాలపు వాసన కొడుతున్నాయి. అందులో ఉన్న సిబ్బంది అంతా కూడా గతించిపోయిన శతాబ్దాలకు చెందిన ప్రేతాత్మల్లా అటూఇటూ తిరుగుతున్నారు. వాళ్ల చూపుల్లో ఏదో అసహజభావప్రకటన కనిపిస్తోంది. ఇప్పడే కొంతసేపటికిందనే,నా స్వీయజీవితం శిథిలమైపోయిన దాకా కూడా నేను జీవితమంతా కూడా పురాతనవస్తువుల్ని కొనుగోలు చేస్తూ సేకరిస్తూ గడిపినవాణ్ణే. బాల్బెక్, తడ్మొర్, పెర్సిపోలిస్ ల దగ్గర పడిపోయిన శిథిలాల నీడల్ని కూడగట్టుకున్నవాణ్ణే. అటువంటిది ఆ నౌకమీద యుద్ధదీపాల వెలుతుర్లో వాళ్ల వేళ్ల నీడలు నా దారికడ్డంగా పరుచుకున్నపుడు నాకేదో ఊహించలేని అనుభూతి కలిగింది.***

నేను చుట్టూ  చూడగానే నా మునుపటిభయాల్ని చూసి నాకే సిగ్గేసింది. ఇంతదాకా నేను నడుస్తూ వచ్చిన ఓడపైనే నా కాళ్లు వణికాయంటే ఇప్పుడు సముద్రం, గాలులు సంఘర్షిస్తున్నవేళ నేను నిజంగానే చెల్లాచెదురుకాకుండా ఉంటానా? ఆ సంఘర్షణ ఎలా ఉందంటే సముద్రపు తుపాను, ఉప్పెన లాంటి పదాలు కూడా ఆ తీవ్రతముందు చిన్నపదాలుగా కనిపిస్తున్నాయి. వెలవెలబోతున్నాయి. నౌక సమీపంలో ఎటు చూసినా గాఢాధకారపురాత్రి మాత్రమే కనిపిస్తోంది. నురగలు చిమ్మని అపారమైన జలరాశి అస్తవ్యస్తంగా పడి ఉంది. నౌకనుంచి ఒక యోజనదూరంలో ఎటుచూసినా అస్పష్టంగా ఆగి ఆగి మంచుకొండలు కనిపిస్తున్నాయి. అవి శూన్య ఆకాశంలోకి చొచ్చుకుపోతూ ఈ మహావిశ్వానికి కట్టిన గోడల్లాగా కనిపిస్తున్నాయి.***

నేనూహించినదాన్ని బట్టిఆ నౌక ఒక కెరటంమీద సాగుతోంది. ఆ కెరటం ఒక మహాజలపాతంలాగా అనూహ్యవేగంతో దక్షిణదిక్కుగా ఉరుముతూ, గర్జిస్తూ తెల్లటిమంచుకు తగిలి రాచుకుంటూ ముందుకు దూకుతోంది. నాకు చూడబోతే ఆ కెరటమే ఒకసముద్రప్రవాహంలాగా అనిపిస్తోంది. ***

ఆ సమయంలో నాలో చెలరేగుతున్న భయానుభూతిని గుర్తించడం అసాధ్యం. అయినప్పటికీ మనోప్రపంచంలోని ఆ అంధకారప్రాంతాల్లోని రహస్యాల్లోకి చొరబడాలనే కుతూహలం వల్ల నేను అత్యంత నికృష్టమైన మృత్యుముఖంతో సమాధానపడక తప్పలేదు. మమ్మల్ని ఉర్రూతలూగించే ఏదో సరికొత్తజ్ఞానంవైపు మేము దూసుకుపోతున్నామని బోధపడుతూనే ఉంది. మేం గ్రహించబోయే ఈ రహస్యం మేమెవరికీ చెప్పగలిగేది కాదనీ, ఆ రహస్యంతెలియడమంటేనే మేం సమూలంగా వినాశనం చెందడమనీ కూడా అర్థమవుతోంది. బహుశా ఈ సముద్రప్రవాహం మమ్మల్ని నేరుగా దక్షిణధ్రువానికే తీసుకుపోతుందేమో. ఊహించడానికే కష్టంగా ఉన్నప్పటికీ ఈ ఆలోచన నిజం కాబోతున్నదనే ఒప్పుకొని తీరాలి.***

ఓడలోని సిబ్బంది అంతా అశాంతితో, కంపిస్తున్న అడుగులతో సంచరిస్తున్నారు. కానీ వాళ్ల ముఖాల్లోగానీ, అభివ్యక్తిలోగానీ నిరాశనిస్పృహలకన్నా ఏదో ఆశ కలిగిస్తున్న తొందరేఎక్కువ కనిపిస్తోంది.

కానీ ఈ మధ్యలో గాలి మా ఓడలోనే గూడుకట్టుకుందా అనిపించింది. అందువల్ల ఒక్కొక్కప్పుడు ఓడ దాదాపుగా సముద్రంమీంచి గాల్లో పైకెగురుతూ ఉండింది – ఓహ్! ఎటువంటి దృశ్యమది! భయానకమంటే భయానకం. ఆ మంచు ఒక్కొక్కప్పుడు కుడివైపు చీలుతుంది. మరొకప్పుడు మధ్యలో చీలుతుంది. మేము ఆ మధ్యలో అనంతంగా వలయాలు వలయాలుగా సుళ్లు తిరుగుతున్న సుడిగుండంలో మతిపోయి చక్కర్లు కొడుతూ ఉన్నాము. ఒక మహావలయాకార రంగస్థలంఅంచులచుట్టూ పదేపదే ప్రదక్షిణం చేస్తూన్నట్టున్నాం. దాని గోడలు ఎంతో ఎత్తున, ఎంతో దూరంలో ఏ అంధకారంలోనో కనిపించకుండా ఉన్నాయి.అయితే నాకు నా భవితవ్యం గురించి చింతించడానికి మరింక సమయం మిగలలేదు – ఆ జలవలయాలు మరింత వేగంగా చిన్నవిగాజజొచ్చాయి – నోరు తెరిచిన ఆ సుడిగుండంలో మేము మతిపోగొట్టుకుని కూలిపోతున్నాం – భీకరంగా ఘర్జిస్తూ, బుసలుకొడుతూ ఉరుముతున్న మహాసముద్రం మధ్య ప్రచండమైన తుపానుమధ్య, ఓడ వణికిపోతూ, ఓ భగవంతుడా – మునిగిపోతోంది.

8-7-2017

Leave a Reply

%d bloggers like this: